[శ్రీమతి గుడిపాటి వల్లి కృష్ణప్రసాద్ గారి ‘ఒక తెల్ల కాగితం’ అనే రచనని అందిస్తున్నాము.]
నిలకడ లేని ఆటలు
నిలువు చెట్టు నెక్కే కోతి కొమ్మచ్చిలు
అలుపెరగని అమ్మ చివాట్లు
నిత్యం యిలానే వుండాలనిపించే..
పసి వయస్సు ‘ఆరాటం’
~
నిలువుటద్దం ముందు నిట్టూర్పులు
నిదుర వచ్చినా వాల్చని కను రెప్పలు
నీలి కన్నుల్లోకి తొంగి చూసే తియ్యని కలలు
నిరంతరం యిలానే వుండాలనిపించే..
యవ్వనపు ‘కోరిక’
~
నలుపు లేని తెలుపు ఆనందాలు
కష్ట నిష్ఠూరాలు లేని పండుగలు
కరగకుండా పెరగాలనే కటాక్షాలు
కలకాలం యిలానే వుండాలనిపించే..
నడి వయస్సు ‘ఆశ’
~
నలిగిన వయస్సుకి నలగని మనసే తోడుగా
నమ్మి కొలిచే దేవుని నామంతో
అనుభవాల కాగితాలను నలుగురికీ పంచుతూ
కాలమనే పై దారిలోకి త్వరగా నడిచి
నమ్మిన స్వామిని చేరాలనే..
వృద్దాప్యపు ‘చింతన’
~
ఇదే తిరిగే జీవుని వృత్తాతం..
అందుకే జీవితం అనేది ఒక ప్రయాణము.
అది వివిధ అనుభవాలను, సవాళ్లను, అవకాశాలను కలిగి ఉంటుంది, ఆశ – నిరాశలతో నిండి ఉంటుంది.
ఆ ప్రయాణంలో అనేక మార్పులు, వింత అనుభవాలను చవి చూస్తూ.. వాటి వలన కొత్త
విషయాలను తెలుసుకుంటూ.. కొత్త వ్యక్తులను కలుస్తూ.. వారి నుంచి మంచి – చెడులను అంచనా వేసుకుంటూ, తన గమనాన్ని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అనుభవాలను కూడపెట్టుకుంటుంది.
అప్పుడే ఈ వివిధ రకాల అనుభవాలతో – సంతోషం – దుఃఖం – విజయం – విఫలం – ప్రేమ – ద్వేషం – ఆనందం – నిరాశ – అంకిత భావం వంటివి కోణాలుగా తిరుగుతూ కుటుంబం – బంధువులు – స్నేహితులు – కొత్త వ్యక్తులతో సత్సంబంధాలు రూపొందించుకుంటూ జీవితం ముందుకు సాగుతుంది.
అందుకే మనిషి జీవితం లో తెలిసి తెలియని వయసు నుంచే మంచి – చెడులు
అనేవి పరిచయం అవుతూ ఉంటాయి. అందులో మొదటి పరిచయమే పసి వయస్సు..
ఏమీ తెలియనిది, అమాయకంగా మట్టిని కూడా తినేసే వయసు నుంచి చుట్టూ ప్రపంచం పచ్చగా కనిపిస్తూ.. తన చుట్టూ మనుషులు తనని నవ్విస్తూ, పలకరిస్తూ ఉంటే తాను చేసే అల్లరి పనులకు అమ్మ పెట్టే చివాట్లకు కొంచం సేపు ఏడ్చినా, మళ్ళీ అమ్మ దగ్గరకు తీసుకోగానే అంతా మరిచిపోయే అందమైన ప్రశాంతతో కూడిన ‘పసి వయస్సు’. ఏం జరిగినా ఆడుకోవాలని ‘ఆరాటం’ గా ఉండే వయస్సు ఇది.
ఆ తరువాత యవ్వనపు గోలలు. మనసు చెప్పే మాటలకే కట్టుబడి వుంటుంది ప్రవర్తన, మంచి – చెడుల తారతమ్యానికి చెడు అనే తాత్కాలిక ఆనందాల తక్కెడ దిగజారుతుంది. ఆ ఆనందం ఎక్కువ కాలం వుండదనేది తెలిసే సరికి సమయం దాటి అనర్థాలు అనెడి జ్వరం పట్టుకోగానే అప్పుడు జరిగిన తప్పులకి ప్రతిఫలంగా మంచి అనే మందు వేసుకొని జరిగిన జీవితాన్ని తిరిగి రాయలేక కుంటి నడకని అమ్మ – నాన్న ప్రేమ సాయంతో సరి చేసుకొని, వారు చూపే దారిలో నడిచే వయసు తన మనసుని సరి చేసుకుంటుంది. తన చుట్టూ తిరిగే ‘కోరిక’ లను అర్ధవంతమైన కోరికలుగా మార్చుకొని పెద్దవారి సహాయంతో నెరవేర్చుకుంటుంది.
ఇక వింత అనుభవాలను దాటి, నడి వయస్సుకి రాగానే బాధ్యత అనే ఆసనం రమ్మంటుంది కూర్చోడానికి. ఇక తప్పకుండా కూర్చోవలసిన బాధ్యతాయుతమైన కుర్చీ అది. తమని కనిపెంచిన వారి బాధ్యతలు – తాము ఏడడుగులు కలిపిన వారితో కలిగిన బాధ్యతలు – తమ ప్రేమకు కలిగిన బాధ్యతలు – తమ తోబుట్టువుల బాధ్యతలు – ఇలా స్వీయ బాధ్యతలతో పాటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, గృహపరంగా యిలా ఎన్నో బాధ్యతలను సరి చేసుకోగలిగే వయస్సు ఈ నడి వయస్సు కుర్చీ.
ఈ కుర్చీలో కూర్చొని ఎన్నో పరిస్థితులు కలిగిన అనుభవాలను రుచి చూడాలి, కూరలో ఉప్పు – కారం రుచి చూసి సరి చేసినట్టు. అందుకే బాధ్యత అనే జీవిత కూరలో కూడా ఉప్పు – కారం – మసాల అనే అవసరాలు – బాధ్యతలను… ప్రేమ మరియు ఆర్థిక సూత్రాలతో సరి చేస్తేనే కూర అనే ఇల్లు ఆనందంగా మారి ముందుకు నడుస్తుంది.
ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులను చూడాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. అందులోనే సన్నిహితుల సహకారమూ వుంటుంది. అందుకే నడి వయస్సుని ‘ఆశ’ నడిపిస్తుంది.
ఏ విషయంలో అయిన అనుభవాన్ని చవిచూసిన అనుభవపు జ్ఞానము, మంచి – చెడులను తక్కెట వేసి నిద్దారణ చేసి చెప్పగల అనుభవపు ధైర్యము, భక్తి అనే పరిమళాన్ని తన చిన్న తరాలకి – తోటి వారికి రుచి చూపించే నిండైన విశ్వసనీయత కలిగి ఉండేదే ఈ వృద్దాప్యపు దశ. ఇదే ఇంగ్లీషులో ముద్దుగా పిలుచుకునే ‘సీనియర్ సిటిజన్‌షిప్’.
ప్రొద్దుతిరుగుడుపువ్వు సూర్యుని కిరణాల పరిధిలోనే ఉన్నట్టు.. ఈ వృద్దాప్యపు వయసు కూడా ఆ భగవంతుని పరిధిలోకి చేరాలని.. తాను గతంలో అనుభవించిన వయసు తాలూకు ‘ఆరాటం – కోరిక- ఆశ’ వంటి విధానాలలో తెలిసో తెలియకో జరిగిన పాపాలు – తప్పులు గురించి క్షమాపణలు కోరుతూ ఆ దేవుని పాదాల వద్ద ఒక పువ్వులా కలిసిపోవాలని నిండుతనంతో కోరుకుంటూ ఎదురు చూసేదే ఈ వృద్దాప్యపు ‘చింతన’.
అందుకే మనిషి జన్మలో మార్పు ఉండదు. మరణంలో తేడా ఉండదు. ఆత్మగా అమ్మలో చేరి కర్మానుసారం అనుభవించాల్సినవి మనిషిగా అనుభవించి, తెలిసో – తెలియకో మళ్ళీ తప్పొప్పులు చేసుకుంటూ తన పరిధి అయిపోగానే గాలిలో కలిసిపోతాడు. కాని మరో జన్మకు చేసిన కర్మ మిగిలి వుంటుంది. కాబట్టి మళ్ళీ జీవుని వృత్తాతం మొదలవుతుంది. ఇదే జీవితం.. బ్రహ్మ రాయడానికి ‘ఒక తెల్ల కాగితం..’.
