[William Butler Yeats రాసిన ‘A Crazed Girl’ కవితకి శ్రీ నాగరాజు రామస్వామి గారి స్వేచ్ఛానువాదం.]
~
ఉన్మత్త బాల! – పిచ్చెక్కిన పిల్ల.
పిచ్చెక్కిన ఆ పిచ్చి పిల్ల
తన గాయన గాయాల నడుమ
సరిగమలను సవరించుకుంటూ లొల్లాయి పాటలు పాడుతున్నది,
ఆమె అక్షరాలు తీరభూములలో నర్తిస్తున్నవి.
తన గమనం ఎటో, గమ్యం ఏమిటో తెలియని
తెరువెరుగని ఆ వెర్రిబాగుల తెంపరి
కార్గో నౌకలో
చిందరవందరగా పడి ఉన్న సామాన్ల మధ్య నక్కి
చిట్లిన మోకాళ్ళతో పడుతూ లేస్తూ పైపైకి పాకుతున్నది;
నిజానికి
ఆమె ఒక సుందర ఉదాత్త,
ఓడి గెలిచిన విజయ,
పడిలేచిన నిలువెత్తు అందం.
ఆమె
మానసిక సమతుల్యం కోల్పోయి,
నిలువెల్లా గాయాలు గాయాలై
తన నుండి తాను విడిపోయిఉంటుంది;
అయినా
కార్గో సరకులు చేస్తున్న నిరర్థకపు చప్పుళ్ళ నడుమ
తన అర్థాతీత నైరాశ్య శబ్దాల నడుమ నిలిచి
“ఓ సర్వభక్షక సముద్రమా!
ఓసీ క్షుధార్త సంద్రమా!” అంటూ
ధిక్కార జయగీతాలు పాడింది.
మూలం: డబ్ల్యూ. బి. యేట్స్
తెలుగుసేత: నాగరాజు రామస్వామి.
