[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఒక్క క్షణం..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
వేగంగా వస్తున్న కారు సడన్ గా నడిరోడ్డు మీద ఆగిపోయింది. కారులో కూర్చున్న అన్విత అసహనంగా డ్రైవర్ వైపు చూసి “ఏమైంది?” అంది కోపంగా.
“చూస్తాను మేడం” అని డ్రైవర్ కారు దిగి, పక్కకు తీసి, ఏమైందో చూస్తున్నాడు.
అన్విత ఫోన్ శబ్దం చేసింది. నంబర్ చూసి “హలో!” అంది.
“దయచేసి ఇంటికి రా! అన్వితా! ఏదైనా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం.” అవతలి వైపు నుండి భర్త గొంతు విన్న అన్విత మొహంలో కోపం.
“…… ……”
“రా! అన్వితా! ప్లీజ్..”
“ఇంత జరిగాక, నేను రాను.. రాను.. రాను”
“ప్లీజ్.. అర్థం చేసుకో అన్వితా! ”
“రానని చెప్పానుగా! ఇంకోసారి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా” అని ఫోన్ పక్కన పడేసింది.
అంతలో డ్రైవర్ అన్విత కూర్చున్న వెనకవైపు విండో గ్లాస్ మీద నాక్ చేశాడు. చిరాగ్గా విండో గ్లాస్ దించింది.
“సారీ! మేడం. ప్రాబ్లం ఏంటో అర్థం కావటం లేదు. మెకానిక్‌కి ఫోన్ చేశాను. పది నిమిషాల్లో వస్తానని చెప్పాడు.”
“కారు కండిషన్లో ఉందో లేదో ముందు చెక్ చేయవా!” అంది కోపంగా.
“ప్రతివారం చెక్ చేస్తూనే ఉంటా మేడం!”
“హూ.. చెక్ చేయబట్టే ఇప్పుడు బ్రేక్ డౌన్ అయింది. నడిరోడ్డులో కారాగిపోతే.. సారీ చెప్పడానికా డ్రైవర్‌ని పెట్టుకుంది?”
“అది కాదు మేడం! ఇలా ఎప్పుడూ జరగలేదు” అన్నాడు సంజాయిషీగా.
“ఏది కాదు.. ఆఁ.. రిపేర్ చేయించి తీసుకురా! నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను” అని ఫోన్ చేస్తుంటే..
“మేడం ప్లీజ్! పది నిమిషాల్లో సరై పోతుంది. ఏదో చిన్న ప్రాబ్లం అయుంటుంది. పక్కనే కెఫే ఉంది మేడం. మీరు అక్కడ పది నిమిషాలు వెయిట్ చేయండి. కారు రెడీ అవ్వగానే నేనే వచ్చి పిలుస్తాను మేడం” అన్నాడు రిక్వెస్ట్‌గా.
డ్రైవర్ వైపు తీవ్రంగా చూసి.. కారు దిగి కెఫెలోకి వచ్చి కూర్చుంది.
మళ్లీ ఫోన్ మోగింది. ఫోన్ వైపు విరక్తిగా చూసి, స్విచ్ ఆఫ్ చేసి, కళ్ళు మూసుకుంది.
“మేడం ఆర్డర్ ప్లీజ్!” గొంతు విని తలపైకెత్తి చూసి..
“సంజయ్!” అందతని వైపు చూసి.
ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు.
“అన్వీ!!!!” అని ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
“నువ్వేంటిక్కడ?!” అన్నాడు
“?!?!?!?!”
“అది కాదు.. మనం చూసుకొని చాలా రోజులైంది కదా! అందుకే అడిగాను” నసిగాడు.
“మనకి బ్రేకప్ అయిన వెంటనే, అదే తలచుకుంటూ నీకులా ఒకే చోట ఆగిపోతాననుకున్నావా?” అంది కొంచెం గర్వంగా.
సంజయ్ నిసహాయంగా ఆమె వైపు చూశాడు.
అన్విత కెఫే అంతా పరికించి చూసి..
“అవునూ.. ఈ కెఫేలో ఎప్పుడు జాయినయ్యావు? బ్రేకప్ అయిన వెంటనేనా? లేదా దేవదాస్ అవతారం ఎత్తిన తర్వాత చేరావా?”
“ఇప్పుడు గతం గురించి ఎందుకులే! అన్వీ వదిలేయ్”
అంతలో బేరర్ వచ్చి.. “సార్!” అన్నాడు ఆర్డర్ కోసం.
“నాకేం వద్దు. మేడంని అడుగు “
“మేడం”
“ఒక హాట్ చాక్లెట్”
“టెన్ మినిట్స్ మేడం!”
“ఈ వన్ మినిట్.. టెన్ మినిట్స్‌లో.. ఏమేం జరుగుతాయో! ప్రతి వాళ్ళకి ఇది ఊతపదం అయిపోయింది. ప్రతిచోట టెన్ మినిట్సే” అంది అసహనంగా.
“ఏమైనా జరగొచ్చు అన్వీ!”
“ఏమన్నావ్?”
“వన్ మినిట్‌లో ఏమైనా జరగొచ్చు” అన్నాడు మళ్ళీ.
అంతలో అన్విత ఫోన్ మోగింది. చిరాగ్గా చూసి కట్ చేసింది.
“పెళ్లయిందా?”
“ఊ.. సంవత్సరన్నర క్రితమే అబ్రాడ్‌లో ఉండగా అయింది. ఈ మధ్య పాప పుట్టాక ఇండియా వచ్చి సెటిల్ అయ్యాం”
“పాప పేరు?”
“నిశ్చల”
సంజయ్ సైలెంట్ అయ్యాడు.
“అవును నీకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?” అంది మొహం లోకి చూసి.
ఆమె వైపు చూడలేక దృష్టి మరల్చాడు.
“కెఫే వెయిటర్ కి ఎవరైనా పిల్లని ఇస్తారా?” అంది వెటకారంగా.
ఆమె ఎగతాళిని మౌనంగానే భరించి తలెత్తి ఆమె వైపు చూసి “ఒక బాబు” అన్నాడు.
“ఓఁ.. పేరేంటి?”
ఆమె కళ్ళలోకి చూసి.. “ఆది.. ఆదిత్య” అన్నాడు.
అంతే! అన్విత కళ్ళకి కన్నీటి తెర అడ్డుపడేసరికి.. కళ్ళు ఎరుపెక్కాయి.
ఇద్దరి మధ్య మౌనం.
సంజయ్‌కి ఒకప్పటి అన్విత మాటలు చెవుల్లో మారుమోగ సాగాయి.
“సంజూ! ఒక్క కండిషన్”
“ఏంటి?”
“మనకి పాప పుడితే నువ్వు చెప్పిన పేరు పెడదాం. బాబు పుడితే నేను చెప్పిన పేరు పెడదాం. ఓ.కే.నా!? “
“నాకు ఓ.కే. పాప పుడితే పేరు ‘భవ్య’ అని పెడదాం. మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి.”
“బాబు పుడితే ‘ఆది’.. ఆదిత్య. మా తాతయ్య పేరు ఆదినారాయణ. ఓ.కే.నా!?”
“డబుల్ ఓ.కే.”
అప్పటి మాటలు ఆగిపోయాయి.
ఇద్దరి మొహాల్లో ఏదో తిరిగిన దిగులు, బాధ, వేదన, నిశ్శబ్దం.
రెండు నిమిషాల తర్వాత
“అసలు మనిద్దరి మధ్య ఏం జరిగిందని బ్రేకప్ అయ్యింది?” అంది
“గతించిన గతాన్ని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అన్వీ!”
“మాట్లాడుకోవాలి.. చెప్పు. ఇప్పుడైనా చెప్పు ఏం జరిగిందో”
సంజయ్ గంభీరంగా మారాడు. మళ్లీ ఇద్దరి మధ్య మౌనం.
***
ఇద్దరి మనసులు మళ్లీ సముద్రం ఒడ్డుకు చేరాయి. సముద్రపు అలల్ని డామినేట్ చేస్తోంది హోరుగాలి..
“సో! ఇది చెప్పటానికే నన్ను రమ్మన్నావా?” అంది ఉక్రోషంగా.
మౌనంగా ఆమె వైపు చూసాడు.
“ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి నీ మనసెలా ఒప్పుకుంది సంజయ్. ఇందుకేనా నువ్వు నన్ను ప్రేమించింది? నిన్నే గాఢంగా ప్రేమించిన నాకు చివరకు నువ్వు ఇచ్చే ముగింపు ఇదేనా? నా మీద పెంచుకున్న ప్రేమంతా బూటకమేనా?” అంది ఏడుపు గొంతుతో.
“అన్వీ! ఒక్క క్షణం.. నేను చెప్పేది ప్రశాంతంగా విను.. ప్లీజ్”
“ఇంకా ఏం వినాలి సంజయ్? నన్ను కన్విన్స్ చేయడానికి నువ్వు వంద కారణాలు చెప్పొచ్చు. కానీ నిజం అనేది ఒకటి ఉంటుందిగా! ఆ నిజాన్ని నీ నిజరూపం ద్వారా ఇప్పుడు బయట పెట్టావు ఇప్పుడు”
“అది కాదు అన్వీ!” అన్నాడు గాద్గదికంగా.
“చాలు.. చాలు.. నువ్వేం చెప్పొద్దు. నేనే వినొద్దు.” చేతులు జోడించింది.
సంజయ్ మోహం వివర్ణమైంది.
“అన్వీ! ఒకే ఒక్క క్షణం ప్లీజ్..”
“నువ్వేం చెప్పొద్దు నేనేం వినొద్దు. ఈ సముద్రం సాక్షిగా లెటజ్ ఎండ్ అవర్ డర్టీ లవ్ హియర్” అని కన్నీళ్లు తుడుచుకుని వెళ్లిపోతుంటే.. వేగంగా ముందుకు కదిలి ఆమె చేయి పట్టుకుని ఆపాడు.
“అన్వీ! డోంట్ సే డర్టీ లవ్. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది విను ”
“వినను గాక వినను.”
“అన్వీ! ప్లీజ్ నాకోసం కొంచెం ఓపిగ్గా విను.”
ఏమీ మాట్లాడకుండా ఆమె వేలికి సంజయ్ తొడిగిన ఉంగరం తీస్తుంటే..
“వద్దు.. ప్లీజ్ తియ్యకు” అన్నాడు.
అన్విత వేగంగా రింగ్ తీసి అతని మొహం మీదే విసిరేసి.. “ఇంకెప్పుడూ నాకు కనిపించకు.” అని వేగంగా వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిన వైపే నిస్సహాయంగా చూస్తూ.. ధారాపాతంగా కారుతున్న కళ్ళు తుడుచుకోకుండా ఇసుకలో కూలబడ్డాడు సంజయ్.
***
గతం నుండి బయటకు వచ్చారిద్దరు.
అన్విత మొహం సీరియస్‌గా మారింది.
“ఆ రోజే నువ్వు నన్ను కాదునుకున్నావ్ కదా!” అంది కోపంగా.
సంజయ్ మాట్లాడలేదు.
అన్విత ఫోన్ మళ్ళీ మోగింది. విరక్తిగా చూసి కట్ చేసింది.
‘నా జీవితంలోకి వచ్చిన మగాళ్ళేంటి? ఇంత స్వార్థంతో ఉన్నారు?’ అనుకుంది.
“ఏంటి అన్వీ! ఏమైంది? మీ హస్బెండ్ ఏదైనా ప్రాబ్లమా! ”
“నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు”
“అంటే.. ఆ రోజు నేను చేసింది ఇప్పటికీ తప్పే అనుకుంటున్నావు కదా! మనం విడిపోవడానికి కారణం నేనొక్కడినే కదా! నీ దృష్టిలో”
“ముమ్మాటికీ! అందులో సందేహమేముంది?”
“నిజంగానే అంటున్నావా?”
“అబద్ధం చెప్పటం నాకు చేతకాదు”
“అసలు నువ్వు అనుకుంటున్నదే కరెక్టని ఇప్పటికీ అనుకుంటున్నావు కదా!”
“100%. ఎందుకంటే.. మా డాడీ దగ్గర మన లవ్ గురించి చెప్పి ఒప్పించాను. ఆ రోజు ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడమన్నారు. కానీ ఆ రోజే నువ్వేమన్నావో గుర్తుందా! ‘నేనిప్పుడు వచ్చే పరిస్థితిలో లేను. అర్జెంటుగా ఊరెళ్ళాల’ని వెళ్లిపోయావు. చెప్పిన టైం కు రాని నిన్ను మా డాడీ అంగీకరించలేదు. ఆ తర్వాత జరిగిందో నీకు తెలిసిందే.”
సంజయ్ మాట్లాడలేదు.
“ఆ రోజు నువ్వు చేసింది తప్పు కాబట్టే.. నువ్వు దానిని గురించి ఇప్పుటి వరకు మాట్లాడటం లేదు. పైగా గతం గురించి మాట్లాడొద్దని ఇప్పుడు కూడా టాపిక్ డైవర్ట్ చేయిస్తున్నావు. నీకు నామీద ఉన్నది లవ్ కాదు సంజయ్! ఆరోజు నన్ను వదిలి ఊరెళ్ళటానికి కారణం ఏంటో ఇప్పుడైనా నిజాయితీగా చెప్పు.”
దీర్ఘ శ్వాస తీసుకుని.. “ఆ రోజు మా అమ్మ భాగ్యలక్ష్మి చచ్చిపోయింది. ఇదిగో చూడు” అని మనీ పర్స్‌లో నుండి వాళ్ళ అమ్మ కర్మకాండల వివరాలు ప్రింట్ చేయించిన కార్డు తీసి అన్విత చేతికిచ్చాడు ఎర్రబడ్డ కళ్ళతో.
దానిని చూసి అవాక్కైన అన్విత, “మీ అమ్మ చనిపోయారా! ఐ యాం సారీ!” అంది ఆశ్చర్యంగా.
“ఆ రోజే.. చివరిగా నన్ను చూడాలని అమ్మ అంటూందని అర్జెంటుగా రమ్మని మా అక్క ఫోన్ చేసింది. నేను వెళ్లేసరికి నన్ను చివరి చూపు చూసుకోకుండానే వెళ్లిపోయింది. ఆ సిట్యుయేషన్‌లో నన్నేం చేయమంటావో చెప్పు. నీ దృష్టిలో నేను ఇప్పటికి కూడా పెద్ద చీట్ కదా!.. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ తోనే అప్పటివరకు ఉన్న నా మంచితనం, ప్రేమ అంతా చెడ్డవైపోయాయా? అయినా నువ్వు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవు. నీ వరకు నువ్వు అనుకునేదే కరెక్ట్ అనుకుంటావు. ఎదుటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని ఒక్క క్షణం ఎప్పుడైనా ఆలోచించావా?” అన్నాడు సంజయ్ ఆవేదనగా.
సరిగ్గా అప్పుడే అన్విత ఫోన్ రింగ్ అయింది. చూసి ఊరుకుంది.
“నాకు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో తెలియకపోవచ్చు. కానీ నీ గురించి మాత్రం బాగా తెలుసు”
అన్విత చివ్మాల్న తలెత్తి చూసింది.
“ఇప్పుడు కూడా మీ హస్బెండ్ ఏ పరిస్థితుల్లో ఉన్నారో కొంచెం కూడా ఆలోచించవు. నువ్వే ఏదో అనుకుని, ఊహించుకొని బయలుదేరి వచ్చుంటావు.”
అన్విత కళ్ళు ఎర్రబడ్డాయి. తలంచుకునేసరికి కన్నీళ్లు జలజలా రాలాయి.
“కళ్ళు తుడుచుకో అన్వీ! ప్లీజ్..”
అన్విత కళ్ళు తుడుచుకుని
“మీ అమ్మగారు పోయిన విషయం ఆ రోజే నువ్వు నాకు చెప్పు ఉండాల్సింది.”
“నువ్వు నాకు చెప్పే అవకాశం ఇచ్చావా? రిలేషన్షిప్‌లో ఎఫర్ట్ షుడ్ బి బోత్ సైడ్స్ ఉండాలి అంటారు. కానీ నిజంగా లవర్స్ మధ్య అలా జరుగుతోందా? నిజాయితీగా ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. అవతలి వైపు నుండి ప్రేమించినా, ప్రేమించకపోయినా ఎంతో సహనంగా ఉంటారు. ఎన్నింటినో భరిస్తారు. జస్ట్ తను సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి కోసం మాత్రమే.”
“అంతా నా వల్లనే.. నువ్వు చెప్పింది కరెక్ట్ సంజయ్! నేను ఆ రోజు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒక్క క్షణం నువ్వు చెప్పేది వినుంటే!?.. ఈవెన్ ఇప్పుడు కూడా..”
“నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే అన్నీ! నన్ను నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్లేదు. కానీ నా గురించి మాత్రం ఎవరి దగ్గర తప్పుగా చెప్పలేదు. ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావు. నేను అడిగినా నీ భర్త గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.”
అంతలో కార్ డ్రైవర్ వచ్చి, “మేడం కార్ రెడీ అయింది.. వెళ్దామా!” అన్నాడు.
సరిగ్గా అప్పుడే అన్విత ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ తీయలేదు.
సంజయ్ అన్విత వైపు చూసి
“సో! జరిగిందాన్నే తలుచుకుంటూ ఉండిపోవడమా! లేక తర్వాత జరగబోయే దానిని మార్చబోతున్నామా! అనే పాయింట్ దగ్గర మనల్ని నిలబెడుతుంది జీవితం. అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే! నిదానంగా ఆలోచించి, హస్బెండ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకో! ఆల్ ద బెస్ట్” అని లేచి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి..
“తగవులాడుకోవడానికి వేయి కారణాలు ఉండొచ్చు. కానీ సమాధానపడటానికి ఆ వ్యక్తి మీదున్న ప్రేమ మాత్రం చాలు. ఎన్ని అవాంతరాలనైనా సంతోషంగా అధిగమించవచ్చు. ఇది ఒకప్పుడు నువ్వు చెప్పిన సంయమన సూత్రం ఇదే. ఇప్పుడు అమలు చెయ్యి” అని నవ్వి గుబురు గడ్డం తడుముకుంటూ వెళ్లిపోయాడు సంజయ్.
అప్పుడు అన్విత ఆర్డర్ చేసిన హాట్ చాక్లెట్ వచ్చింది.
“బిల్ తీసుకురా!”
“అవసరం లేదు మేడం”
“ఏం?”
“ఈ కెఫే ఓనర్ ఫ్రెండ్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదని సంజయ్ సార్ చెప్పారు.”
అన్విత నవ్వుతూ లేచి కారు వైపు వెళ్ళింది. డ్రైవర్‌తో ఇంటికి పోనివ్వమని చెప్పింది. ఇంటిని సమీపిస్తుండగా మళ్లీ ఫోన్ మోగింది.
“హలో!”
“అన్వితా! ఎక్కడున్నావు? తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోకు. ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను.”
“ఐ యాం సారీ!”
“ఏయ్! ఏమైంది? ఆర్ యు ఓ.కే.?”
“అదేం లేదు. ఐ యాం ఫైన్. ఇంటికి దగ్గరలో ఉన్నాను. ఒక్క క్షణంలో వస్తున్నాను” అంది నవ్వుతూ.
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.
