[24 ఏప్రిల్ సచిన్ టెండూల్కర్ జన్మదినం సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు.]
అది జనవరి,1999. చెన్నైలో పాకిస్తాన్‌తో మొదటి టెస్ట్ జరుగుతోంది..
పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ పోటీ అంటే.. అందునా పది సంవత్సరాలు తర్వాత పాక్‌తో టెస్ట్ మ్యాచ్ అంటే వాతావరణం ఎలా ఉంటుందో.. తెలుసుగా.. అలాగే ఉంది.. టెస్ట్ మ్యాచ్ గెలవడానికి ఇండియా 271 పరుగు చేయాలి ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పుడు నాలుగో బ్యాట్సమన్‌గా క్రీజ్ లోకి వచ్చిన టెండూల్కర్ 271 పరుగుల కోసం ప్రయత్నిస్తూ 136 పరుగులు చేసి 254 దగ్గర ఏడవ ఏడవ వికెట్టుగా వెనక్కి తిరిగాడు. ఇంకొంచెం సేపు జాగ్రత్తగా ఆడి వుంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమే.. కాని సచిన్ అవుటయ్యడు. ఇంకా 17 పరుగులు చేయాల్సి ఉండగా మరి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఇండియా ఓడిపోయింది.
~
అది నవంబర్ 2009. హైదరాబాదులో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.
ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 350 పరుగులు చేసింది. ఇండియా గెలవటానికి 351 పరుగులు చేయాలి. ఓపెన్ చేసి ఇన్నింగ్స్ ప్రారంభించిన టెండూల్కర్ 175 పరుగులు చేసి 332 పరుగుల వద్ద 7వ వికెట్టుగా వెనక్కి తిరిగాడు మరి 15 పరుగులు మాత్రమే చేసి ఇండియా మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆ మేచ్ లోనూ టెండూల్కర్ రికార్డుల కోసం మరొక సెంచరీ చేశాడు.. ఇంకొంచెం సేపు వుంటే గెలిచే వాళ్ళమే.. శతకాల సంఖ్య పెంచుకొన్నాడు. రికార్డుల రారాజు మరి.
అంతే. టెండూల్కర్ మీద వినబడే వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి.. అవును అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు ఇంకెలా ఉంటాయి..
ఆ పై రెండు మ్యాచులని మరొకసారి సమీక్షిద్దాం..
1999 లో చెన్నై టెస్టులో గెలవడానికి 271 పరుగులు చేయడానికి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు ఆరు పరుగులకే రమేష్, లక్ష్మణ్ వికెట్లని కోల్పోయింది. క్రీజ్ లోకి వచ్చిన టెండూల్కర్‌ని, పడిన రెండు వికెట్లు తీసిన ఉత్సాహంతో వకార్ యూనిస్ బౌన్సర్లతో యార్కర్లతో స్వాగతం పలికాడు. “బాలు కనిపిస్తోందా?” అని అని ఎద్దేవా చేశాడు కూడా.. మౌనంగా యూనిస్ కేసి ఓ చూపు చూసి బాట్‌కి పని చెప్పాడు టెండూల్కర్. పరుగుల వరద మొదలైంది. అక్రమ్, యూనిస్, సక్లేన్ ముస్తాక్, ఆఫ్రిది.. ఎవరైనా సరే; తోక ముడవాల్సిందే. సచిన్‌ని ఏమీ చెయ్యలేక పాక్ వ్యూహన్ని మార్చి వరుసగా ద్రావిడ్, అజరుద్దీన్, గంగూలీలను అవుట్ చేసి సచిన్‌కి తోడ్పాటు లేకుండా చేయసాగింది. ఇంతలో సచిన్‌కి నడుం పట్టేసింది. నొప్పి నివారణకు స్ప్రే లు వాడారు. 82 రన్స్‌కి అయిదు వికెట్లు పోయాయి. ఇంకా 189 పరుగులు చేయాలి. వికెట్ కీపర్ నయన్ మోంగియా సచిన్‌తో జత కలిసాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా, నడుము నొప్పి ఇబ్బంది పెడుతున్నా, మోంగియాని కాపాడుకొంటూ ఒంటరిగా పోరాటం చేయసాగాడు సచిన్. 218 దగ్గర మోంగియా అవుట్ అయిపోయాడు.. పాకిస్తాన్ ఆశలు చిగురించి మరింత భీకరంగా బంతులు వేయసాగారు. 254 దగ్గర షాట్ కొట్టబోయాడు సచిన్. సరిగ్గా తగలక గాలిలోకి లేచి బంతి అక్రమ్ చేతిలో పడింది. టెండూల్కర్ అవుట్. పాక్ సంబరాలు మిన్నుముట్టాయి. చిదంబరం స్టేడియం చిన్నబోయింది. మరి 17 పరుగులు చేస్తే చాలు.. ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి కానీ ఆ మూడు వికెట్లు మరి నాలుగు నాలుగు పరుగులు మాత్రమే చేసాయి. ఇండియా 258 దగ్గర ఆల్ అవుట్ అయిపోయి 12 పరుగులు తేడాతో ఓటమి పాలయింది.
హైదరాబాద్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద 351 పరుగుల కోసం పోరాడుతూ 332 దగ్గర 175 పరుగులు చేసి అవుట్ అయితే మరి 19 పరుగులు చేయలేక 15 పరుగులు మాత్రమే చేసి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.
పై రెండు మ్యాచ్‌లను గెలిపించడానికి అద్భుతమైన ఒంటరి పోరాటం చేసిన టెండూల్కర్ జట్టుని విజయానికి అతి దగ్గరగా తీసుకు వచ్చినా మిగిలిన ఆటగాళ్లు తలో చెయ్యి వేయకుండా అవుట్ అయిపోయి ఓటమికి కారణమైయితే టెండూల్కర్ తన కోసం తన రికార్డుల కోసం శతకాలు చేసాడు అనడం అత్యంత హేయమైన వ్యాఖ్యలనే చెప్పాలి. అవగాహనా రాహిత్యంతో చేసినవి.
***
నిజం చెప్పాలంటే గతంలో అంటే మూడు నాలుగు దశాబ్దాల క్రితం టెస్ట్ మ్యాచ్‌లను మ్యాచ్ డ్రా చేయడానికి లేదా మ్యాచ్ గెలిచే అవకాశం లేకపోయినా పరుగుల అంతరాన్ని తగ్గించడానికి తదుపరి టెస్టులో కొనసాగడానికి తన సగటు పరుగుల సంఖ్య పెంచుకోవడానికి కొంతమంది శతకాలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాలక్రమంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది.. ఇప్పుడయితే అంటే గత దశాబ్ద కాలంగా 20-20 మ్యాచ్‌ల ప్రాధాన్యత, ప్రజాదరణ పెరుగుతూ ఉండడంతో జిడ్డు బ్యాటింగ్‌కి ఆస్కారమే లేదు. టెస్ట్ మ్యాచ్‌లు కూడా మూడు నాలుగు రోజులలో ముగిసిపోయి ఫలితాలని ఇచ్చేస్తున్నాయి. డ్రా ల కోసం నిలబడే వాళ్ళే లేరు.
***
***
మన దేశంలో క్రికెట్‌కి ఇంత ఆదరణ లభించటంలో టెండూల్కర్ పాత్ర అమోఘం. ఆ ఆదరణ క్రికెట్ బోర్డుకి కాసుల వర్షం కురిపించటం మొదలు పెట్టింది. కానీ అది అతనికి పెను భారమైనదని కూడా చెప్పవచ్చు. టెండూల్కర్ మోసినన్ని ప్రేక్షకుల అంచనాలు, ఆకాంక్షలు మరి ఏ ఇతర క్రికెటర్ మోయలేదంటే అతిశయోక్తి కాదు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఎక్కువ సందర్భాలలో అతడు ఆడటం జరిగింది.. కానీ అవి అతని మీద ఎంతో ఒత్తిడి తెచ్చేవి. టెండూల్కర్ మీద ప్రేక్షకుల అంచనాల ఒత్తిడి మరి ఏ ఇతర ఆటగాడి కన్నా చాలా ఎక్కువగా ఉండేది. ప్రత్యర్థి బౌలర్ల ప్రతాపం అంతా టెండూల్కర్ మీదే చూపించేవాళ్ళు. ఎటువంటి బంతినైనా కొట్టగలిగే టెండూల్కర్‌కి తేలిక బంతులు వెయ్యరు. అన్ని కఠినమైనవివే పడతాయి, ఒత్తిడి పెంచుతాయి. ఈ రెండు రకాల ఒత్తిళ్లు మధ్య ఇండియాని గెలిపించడం కోసం ఎన్నెన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికి ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మేచ్ అవార్డ్స్ గెలిచిన ఆటగాడు టెండూల్కర్ మాత్రమే. మొత్తం 76. సచిన్ రిటైర్ అయి 12 ఏళ్లు దాటినా ఇంకా ఆ రికార్డ్‌ను ఎవరు అందుకోలేదు. తర్వాత స్థానంలో 68 మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు (విరాట్‌కి మాత్రమే టెండూల్కర్ రికార్డ్స్ దాటగల సత్తా, అవకాశం వుంది. చూద్దాం ఏం చేస్తాడో).
మ్యాచ్‌లో బాగా ఆడి గెలుపుకు దోహదపడిన ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మేచ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది.. టెండూల్కర్‍కి మొత్తం 76లో అలా గెలుపులలో 61 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించాయి. ఓడిపోయిన జట్టు లోని ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఓడిపోయిన జట్టులోని ఆటగాడికి అవార్డు ఇవ్వడం – అదీ ఏదో ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 12 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు టెండూల్కర్‌కి దక్కాయి.. మూడు సార్లు మ్యాచ్‌ని కాపాడి నందుకు గెలుచు కొన్నాడు. ఇది అత్యంత అరుదైన విషయం.. మరెవరికి దక్కని గౌరవం.. అంటే ఎన్ని సార్లు టెండూల్కర్ ఒంటరి పోరాటాలు చేసాడో అర్థమవుతుంది. ప్రపంచంలో మరి ఏ ఆటగాడు ఓడిపోయిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులని ఇన్ని సార్లు గెలుచుకోలేదు. ఇది అర్థమయితే టెండూల్కర్ గొప్పతనం, అతడి విమర్శకుల డొల్లతనం విశదమవుతాయి.
టెండూల్కర్ విషయంలో మరొక దురదృష్టకర అంశం ఏమిటంటే అప్పట్లో డెసిషన్ రివ్యూ సిస్టం లేకపోవడం. అందువలన అంపైర్ తప్పుడు నిర్ణయాలు బలి తీసుకొన్న ఆటగాళ్లలో టెండుల్కరే ముందు వరుసలో ఉన్నాడు.. ముఖ్యంగా వెస్ట్ వెస్టిండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్ అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు గమనించవచ్చు. అలా కాకుండా ఉండుంటే టెండూల్కర్ మరిన్ని మ్యాచ్‌లు గెలిపించేవాడు, మరిన్ని శతకాలు చేసేవాడు. ప్రతికూల పరిస్థితులలో ఆడుతూ జట్టుని గెలిపించటం గొప్ప విషయమే.. కాని గెలవనంత మాత్రాన చేసిన ఒంటరి పోరాటాలను మరువకూడదు.. మరువలేరు.. కాబట్టే జట్టు ఓడిపోయినా మ్యాన్ ఆఫ్ ది మేచ్ అవార్డు – ఓడిన జట్టు ఆటగాడికే వెళ్ళటం ఓ అసలు సిసలైన అవార్డు. ఈ విధంగా ఎన్నో అవరోధాల మధ్య ఎన్నో తెలివితక్కువ విమర్శలను వింటూ భరిస్తూ ఆడుతూ క్రికెట్‌లో భారత్ స్థాయిని పెంచిన టెండూల్కర్ నిజంగా ఓ భారతరత్నమే. ఎంతో మంది గొప్ప ఆటగాళ్ళు కూడా విమర్శలకు సహనం కోల్పోయి బ్యాట్‌తో కాకుండా నోటితో సమాధానం చెబితే టెండూల్కర్ మాత్రం ఎప్పుడూ బ్యాట్‌తో మాత్రమే సమాధానం చెప్పేవాడు.
24-04-2026 న 53వ పుట్టిన రోజు జరుపుకొంటున్న ఆ ‘ఒక్కడు’ మాత్రమే..
- అంతర్జాతీయ స్థాయిలో అత్యధికమైన పరుగులు (34357)
- అత్యధికంగా ఆడిన టెస్టులు (200)
- అత్యధిక శతకాలు (100)
- అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ (76)
- ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అత్యధిక అత్యధిక పరుగులు పరుగులు (2278) చేసాడు..
ఇంకా వన్డే మ్యాచ్లులో ద్విశతకం చేసిన మొదటి ఆటగాడు టెండూల్కర్. అది కూడా 37 ఏళ్ల వయసులో అంటే చరమాంకంలో చేశాడు..
భారతదేశపు అత్యున్నత గౌరవ పురస్కారమైన ‘భారతరత్న’ను దక్కించుకొన్న ఏకైక క్రీడాకారుడు టెండూల్కరే.
మరి ఆ ‘ఒక్కడు’.. ‘క్రికెట్ దేవుడే’ అవ్వాలిగా.
Images Courtesy: Internet
పొన్నాడ సత్య ప్రకాశ రావు కథకులు, కవి. వీరివి ఇప్పటి వరకు 1 నవల, 4 ధారావాహికలు, 78 కథలు, 150 కి పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వీరి నవల ‘ఊరు పొమ్మటోoది’ 2002 సంవత్సరం స్వాతి మాస పత్రిక అనిల్ అవార్డును,. మరి పది కథలు వివిధ పోటీలలో బహుమతులు ను గెలుచుకొన్నవి. వీరి నవలను సాహితీ ప్రచురణల వారు విజయవాడ, కథల సంపుటాన్ని చినుకు ప్రచురణల వారు విడుదల చేసారు .వీరికి విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్, ఎలకుర్రు వారు 2023 సంవత్సరానికి ‘విశ్వదాత’ దేశోద్దారక నాగేశ్వర రావు పురస్కారాన్ని అందచేశారు.
