Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బంధాలలోని జవాబుదారీతనం గురించి ప్రశ్నించే పాట ‘వన్ బై వన్’

[కిట్టీ వెల్స్, రెడ్ ఫోలీ పాడిన ‘వన్ బై వన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

కిట్టీ వెల్స్ నిజానికి సోలో గాయని. కాని అడపా తడపా కొన్ని డ్యూయెట్లను కూడా గానం చేసారు. భర్త జానీ రైట్‌తో కలిసి ఆమె పాడిన గాస్పెల్ పాటలు ఆ రోజుల్లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెడ్ ఫోలీ, వెబ్ పియర్స్ వంటీ సమకాలీన కంట్రీ గాయకులతో కలిసి ఆమె కొన్ని డ్యూయెట్లను రికార్డ్ చేసారు. అందులో రెడ్ ఫోలీతో కలిసి ఆమె పాడిన ‘వన్ బై వన్’ పాటకు ఎందరో అభిమానులున్నారు.

క్లైడ్ జూలియన్ ‘రెడ్’ ఫోలీ (జూన్ 17, 1910 – సెప్టెంబర్ 19, 1968) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కంట్రీ సంగీత అభివృద్ధికి గణనీయంగా దోహదపడ్డాడు. రెండు దశాబ్దాలకు పైగా ఈ శైలిలో అతిపెద్ద తారలలో ఒకరిగా నిలిచాడు ఫోలీ. ఈయనవి 25 మిలియన్లకు పైగా రికార్డులు అమ్ముడయ్యాయి. 1951 నాటి హిట్, ‘పీస్ ఇన్ ది వ్యాలీ’, మిలియన్ కాపీలు అమ్ముడైన తొలి గోస్పెల్ రికార్డులలో ఒకటి. 1955 నుండి 1960 వరకు నెట్‌వర్క్ టెలివిజన్‌లో మొట్టమొదటి ప్రజాదరణ పొందిన కంట్రీ మ్యూజిక్ సిరీస్ అయిన ఓజార్క్ జూబ్లీకి కూడా ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈయన కంట్రీ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యుడు కూడా.

కిట్టి వెల్స్, రెడ్ ఫోలీతో కలిసి పాడిన ‘వన్ బై వన్’ డ్యూయెట్, 1954లో డెక్కా లేబుల్ (క్యాటలాగ్ నం. 29065-B) ద్వారా విడుదలైంది. దీనిని జానీ రైట్, జాక్ ఆంగ్లిన్, జిమ్ ఆంగ్లిన్ రచించారు. 1954 మేలో, ఈ పాట ‘బిల్బోర్డ్ కంట్రీ అండ్ వెస్ట్రన్’ చార్ట్‌లో మొదటి స్థానాన్ని (నం. 1) చేరుకుంది. 1954 సంవత్సరానికి సంబంధించిన ‘బిల్బోర్డ్ కంట్రీ అండ్ వెస్ట్రన్’ రిటైల్, జ్యూక్‌బాక్స్ చార్ట్‌లలో ఇది రెండవ స్థానంలో నిలిచింది.

ఈ పాట అవిశ్వాసం, అసత్యాలతో నిండిన ఒక బంధం విచ్ఛిన్నం కావడాన్ని ప్రధానంగా తెలియజేస్తుంది. ఏదో ఒక నిర్దిష్ట సంఘటనను వివరించే కథనంలా కాకుండా, ఈ పాటలోని సాహిత్యం ఒక గంభీరమైన హెచ్చరికగా, బంధాలలోని జవాబుదారీతనం గురించి ప్రశ్న లేవనెత్తుతుంది. ఈ బంధంలో ఉన్న ఒకరు పదేపదే అబద్ధాలు చెప్పి, చేసిన వాగ్దానాలను భగ్నం చేస్తే అతని ద్రోహానికి మరొకరు పర్యవసానాలను అనుభవించారు. పరస్పరం మోసం చేసుకుంటూ సాగే బంధాల మనుగడ ఎక్కువ రోజులు సాగదని, అబద్ధాల పునాదులపై నిర్మించుకున్న జీవితాలు కూలిపోతాయనే సందేశాన్ని ఈ పాట ఇస్తుంది. ఆధ్యాత్మిక కోణంలో ఈ అబద్ధాల జీవితాలను చర్చిస్తూ ఆ ఇద్దరు వ్యక్తులు చివరికి ఆ పైవాని ముందు తలవంచవలసిందే అని, అతని దగ్గర చేసిన తప్పులకు శిక్ష వహించవలసిందే అని ఈ పాట నొక్కి చెబుతుంది.

ఫోలీ తన మృదువైన, భావయుక్తమైన బారిటోన్ స్వరంతో, వెల్స్ తన గానంతో విషాదం చిలికిస్తుండగా గాఢమైన, పరస్పర విచారంతో ఒక హృదయ విదారకమైన ఇతివృత్తాన్ని శ్రోతలకు కలిసి అందించారు. ప్రతి చరణాన్నిఇద్దరూ గానం చేసిన విధానం చాలా బావుంటుంది. ఒకరినొకరు విమర్శించుకునే విధంగా కాకుండా ఒకరికొకరు చేసుకున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ తమ బాంధవ్యంలోని లోపాలని పునఃవిమర్శించుకునే పరిపక్వతకు చేరిన జంటగా వారి మధ్య ఈ సంభాషణ జరుగుతుంది.

One by one, we’ve broke each vow we made
It was you who lied, it was me who paid
As sure as there’s a Heaven beyond the sun
We’ll pay for our lies one by one

(ఒక్కొకటిగా మనం చేసుకున్న ప్రమాణాలను ఉల్లంఘించాం. అబద్ధాలు చెప్పింది నువ్వు, మూల్యం నేను చెల్లించాను. సూర్యునికి ఆవల ఓ స్వర్గం ఉన్నదెంత ఖచ్చితమో, మన అబద్ధాలకు మనం మూల్యం చేల్లించేదీ అంతే నిజం)

ఆ ఇద్దరి నడుమ దూరం పెరిగింది. తమ పెళ్లి నాటి ప్రమాణాలను ఇద్దరూ మరచిపోయారు. ఒక్కొకటిగా వాటిని ఉల్లంఘిస్తూనే వెళ్లారు. అతను చెప్పిన అబద్దాలకు ఆమె జీవితాంతం మూల్యం చెల్లించింది. ఈ పాపం ఇక్కడితో ఆగదు. దీని ఫలితం వారు అనుభవించవలసిందే అన్నది ముమ్మాటికీ నిజం. ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలలో మతం, ధర్మంపట్ల ఆలోచన ఎక్కువగా ఉండేది. హిందూ మతంలోని కర్మ సిద్దాంతాన్నిప్రపంచం అంతా వారి వారి పంథాలో నమ్మేవారు. తప్పు చేస్తే ఫలితం అనుభవించాలన్నది అన్ని మతాలు భోధించిన సిద్దంతమే. దాన్ని గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ అబద్దాలు ఆడుతూ ఇన్నాళ్లు వాళ్లు చేసుకున్న మోసానికి ఫలితం అనుభవించక తప్పదని పశ్చాత్తాపంతో వారి జీవితాలను నెమరు వేసుకుంటూ జరిపే పరస్పర సంభాషణే ఈ పాట.

My plans and hopes have tumbled down
My castle of dreams plunged to the ground
How can you face me after what you’ve done?
You’ve shattered my dreams one by one

(నా ప్రణాళికలు, ఆశలు అన్నీ కుప్పకూలిపోయాయి, నా కలల సౌధం నేలమట్టమైంది. అంత పని చేసి నువ్వు నా ముందుకు వచ్చి ముఖం ఎలా చూపించగలుగుతున్నావు? నా కలలన్నింటినీ నువ్వు ఒక్కొక్కటిగా ఛిన్నాభిన్నం చేశావు)

జరిగిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ జీవిత ప్రారంభంలో అనుకున్నవేవీ జరగకపోవడం, అతను చేసిన మోసం, ఆమె వల్ల అతని హృదయానికి అయిన గాయం, ఇవన్నీ వరుసగా గుర్తుచేసుకుంటూ కూలిపోయిన తమ కలల ప్రపంచాన్నిఆ ఇద్దరూ మరోసారి తిరిగి చూసుకుంటున్నారు. మనుషుల జీవిత కాలంలోనే వారి ఆశలు, ఆలోచనలు మరణించడం, జీవం లేకుండా రోజులు నెట్టవలసి రావడాన్నిమించిన నరకం మరొకటి ఉండదు. ఇంతటి దైన్య స్థితికి వారి జీవితాలు రావడానికి కారణం మోసం, అబద్దాల పునాది మీద బంధాన్నినిర్మించుకోవడం. వివాహాన్నిఅగౌరవపరిచిన ఫలితం వాళ్లు ఇక అనుభవించక తప్పదు.

One by one, we’ve broke each vow we made
It was you who lied, it was me who paid
As sure as there’s a Heaven beyond the sun
We’ll pay for our lies one by one

(ఒక్కొకటిగా మనం చేసుకున్న ప్రమాణాలను ఉల్లంఘించాం. అబద్ధాలు చెప్పింది నువ్వు, మూల్యం నేను చెల్లించాను. సూర్యునికి ఆవల ఓ స్వర్గం ఉన్నదెంత ఖచ్చితమో, మన అబద్ధాలకు మనం మూల్యం చేల్లించేదీ అంతే నిజం)

ప్రస్తుత సమాజంలో ఈ అబద్ధాల జీవితం రివాజయిపోయింది. కాని ఒకప్పుడు వివాహ వ్యవస్థపై గౌరవం ఉన్న రోజుల్లో దాన్నిభంగపరిచిన వాళ్లలో ఒక అభద్రతా భావం ఉండేది. తాము తప్పు చేసామనే ఆలోచన అంతర్లీనంగా వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేది. భాగస్వామిని మోసం చేసి ప్రశాంతంగా జీవించడం చాలా మందికి కష్టంగా ఉండేది. ఆ నాటి సమాజంలో వివాహ వ్యవస్థ కున్న ప్రాముఖ్యత, మతంపై ఉన్న గౌరవం, సాంప్రదాయాలను విధిగా ఆచరించాలన్న నియమాలకు కట్టుబడిన సమాజంలో, ఏ కారణం చేతనయినా తప్పు జరిగినా వారిలో అంతర్మథనం ఎక్కువగా ఉండేది. ఆనాటి వ్యవస్థలో ఓ జంట అనుభవిస్తున్న అపరాధ భావాన్నిఈ పాట వివరిస్తుంది.

How can you go to sleep at night?
Don’t old memories make you long for daylight?
You’ll pay the price after having your fun
You’ll regret each mistake one by one

(నీకు రాత్రి నిద్ర ఎలా పడుతుంది? పాత జ్ఞాపకాలు పగటి వెలుగు కోసం ఎదురుచూసేలా చేయవా? పొందిన ఆనందానికి నువ్వు తర్వాత మూల్యం చెల్లించక తప్పదు. చేసిన ఒక్కొక్క తప్పుకు పశ్చాత్తాపపడతావు)

కంట్రీ గీతాలలో ఆనాటి జన జీవనం రికార్డు చేయబడి ఉంది. అమెరికా దేశంలోని ప్రజల జీవితాన్నేఈ పాటలు ప్రస్తావిస్తున్నా, అక్కది మనుష్యుల భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేవే. ప్రాంతాలు,దేశాలు వేరైనా మనుష్యుల భావోద్వేగ అవసరాలు ప్రపంచం అంతా ఒకటే. మానవ జాతి ఎంతగా తమను విభజించుకున్నా, ఆ జాతి లక్షణాలు, జీవన అవసరాలు ఒకటే. అందుకే అమెరికా జన జీవనం నుండి తీసుకున్న ఈ పాటలలోని భావేద్వేగాలతోనూ ఇంగ్లిష్ భాష తెలిసిన వారంతా కనెక్ట్ అవుతారు. నేటి ఆధునిక యువత అభివృద్దిచెందిన దేశాలలో జంటలు విడిపోవడం సులువుగా జరుగుతుందని, అక్కడి వాతావరణం ఈ విడిపోవటాలు, కొత్త జీవితాలను పునఃనిర్మించుకోవడాలకు అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. కాని ఏ బంధం అయినా విచ్చిన్నం అవుతున్నప్పుడు ఆ జంట అనుభవించే వేదన ఒకేలా ఉంటుంది. బాధకు దుఃఖానికి దేశ, ప్రాంత భేదాలుండవు. అందుకే ఈ పాటలో గాయకులు పలికించే విషాదం మనల్ని కదిలిస్తుంది. విడిపోవడంలోని బాధను శ్రోతలూ అనుభవిస్తారు.

The love I treasured, you sold for gold
For worldly goods, you left me cold
You’re happy now but the time will come
You’re false loves will leave you one by one

(నేను అపురూపంగా భావించిన ప్రేమను నువ్వు ఖరీదు కట్టి అమ్మేసావు. ప్రాపంచిక వస్తువుల కోసం, నన్ను శిలగా మార్చి వదిలేశావు. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కానీ సమయం వస్తుంది నీ అసత్య ప్రేమలు ఒక్కొక్కటిగా నిన్ను వీడి పోతాయి)

ఈ పాటలో గొప్పతనం ఏంటంటే, అది ఇద్దరి తప్పులను సమపాళ్లలో చూపిస్తుంది. పురుష పక్షమో స్త్రీ పక్షమో వహించదు. ఒకరినొకరు నొప్పించుకుంటూ ఇద్దరూ ఆ బంధాన్ని నాశనం చేసుకున్నారు. అతను ఆమెను మోసం చేస్తే, ఆమె అతని ప్రేమ కన్నా ప్రాపంచిక సుఖాల వైపు మొగ్గు చూపి తన బాధ్యతలను మరచిపోయింది. ఆ బంధం విచ్ఛిన్నం అవడంలో ఇద్దరి పాత్రా ఉంది. ఎక్కువ తక్కువలుండవచ్చు.కాని ఇప్పుడు కలిసి బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. బాధ్యత మరచి ప్రవర్తించిన తర్వాత దాని పర్యవసానం ఇద్దరూ అనుభవించవలసిందే.

One by one, you’ve broke each vow we made
It was you who lied, it was me who paid
As sure as there’s a Heaven beyond the sun
We’ll pay for our lies one by one

(ఒక్కొకటిగా మనం చేసుకున్న ప్రమాణాలను ఉల్లంఘించాం. అబద్ధాలు చెప్పింది నువ్వు, మూల్యం నేను చెల్లించాను. సూర్యునికి ఆవల ఓ స్వర్గం ఉన్నదెంత ఖచ్చితమో, మన అబద్ధాలకు మనం మూల్యం చేల్లించేదీ అంతే నిజం)

జీవితంలో ఓ స్థితికి చేరాక, తమ గతాన్నితలచుకుంటూ చేసినతప్పులను గుర్తు చేసుకుంటూ తాము పాడుచేసుకున్న ఆనందాలను, తుడిచేసుకున్న అనుభవాలను, దిద్దుకోలేని తప్పులను నెమరు వేసుకుంటున్న ఆ జంట గొంతులో విషాదం, జీవితం చేజారిపోయిందన్న బాధ ధ్వనిస్తుంది. దీన్ని ఆ ఇద్దరూ గాయకులూ గొప్పగా గానం చేసారు. ఆ నాటి కంట్రీపాటలలోని జన జీవితాన్నిఅర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడగల గీతం.

ఈ పాటను క్రింద ఇచ్చిన యూ ట్యూబ్ లింక్ లో వినవచ్చు..
https://www.youtube.com/watch?v=RXiImWJDdwA

Exit mobile version