[డా. కొండపల్లి నీహారిణి గారి రెండు కథలు, ‘ఒంటరి మేఘం’, ‘కొత్త చూపు’ల విశ్లేషణని అందిస్తున్నారు డా. సి. వసుంధర.]
సాహిత్యం, మానవ భావ ప్రకటనకు ముఖ్య సాధనం. సాహిత్యంలో కథ, కవిత, నవల, వ్యాసం, కథానిక మొదలైన ప్రక్రియ భేదాలు అనాది నుండి ప్రపంచ ప్రజల జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
ప్రపంచ కథలకు మూలం జీవితం. విస్తృతమైన జీవన విషయాలను కథల్లో చూపడం సులభం.
కవితకు క్లుప్తత అవసరం. వచన ప్రక్రియలలో రచయితకు తన రచనను క్లుప్తం చేయడం అంత సులభం కాదు. అందుకే “గద్యం కవీనామ్ నికషం వదంతి” అన్నారు పెద్దలు.
కథ రాసేటప్పుడు దాని నిడివి పెరగడానికి కారణం అందులోనే పాత్రలు ఎక్కువగా ఉండడం, చెప్పవలసిన విషయం, సంభాషణ రూపంలోఉండడం, మొదలైన కారణాలతో కథ నిడివి పెరగడానికి అవకాశముంది.
శ్రీమతి నీహారిణి కథలు పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు మనకు గోచరిస్తాయి.
- నీహారిణి కి కేవలం కథ రాయడమే కాదు అందులో తన భావాలు సంపూర్ణంగా వ్యక్తం చేయాలి అనే తపన కనపడి సఫలత చెందడం మంచి విషయం. భావవ్యక్తీకరణ సరి అయిన భాష లోకి రావడం అంత సులభం కాదు. ఈ రచయిత్రి దాన్ని సాధించారు.
- చెప్పదలుచుకున్న విషయం పదిమందికి అర్థమై అందేటట్లుగా చెప్పడానికి ప్రయత్నించి కథను రాయడం.
- వర్ణనలు,భాష, స్థలాదుల వివరణలు చెప్పడం వల్ల కథలో ఉన్న సందేశంతో పాటు సమాజపరమైన వివరాలు ఇవ్వడంలో ఈ రచయిత్రిది అందవేసిన చేయి. ఇది రచయితలకు ఉండవలసిన ముఖ్య గుణం. దానివల్ల సాహిత్యపరమైన సమాజపరమైన రచనగా అది నిలుస్తుంది.
కొండపల్లి నీహారిణి రచించిన అనేక చక్కటి కథలలో రెండు కథలను మాత్రం విశ్లేషణ చేస్తాను.
~
1వ కథ పేరు ‘ఒంటరి మేఘం’, ‘ఘర్షణ’ కథా సంపుటి పుస్తకంలో 76 పేజి నుండి 88 వ పేజీ వరకు కథ కొనసాగింది.
కథాంశం, కుల వృత్తుల వ్యవస్థ కూలిపోయి ప్రపంచీకరణవల్ల సమాజంలో కుటుంబాలలో వచ్చిన పెను మార్పులు, చేతివృత్తుల వారి అవస్థలు ముఖ్యాంశాలు.
ఇందులో రచయిత్రి తాను చెప్పదలచుకున్న విషయాన్ని అటు ముందుతరానికి ఇటు ఈ తరానికి చెందిన సంపత్ అనే కుర్రాడి పాత్ర ద్వారా చెప్పడం జరిగింది.
సంపత్ నాన్న కొలిమి పని చేసేవాడు. సంపత్ ఇప్పటి గ్రామాల్లో కులవిద్య వదిలి స్కూల్ చదువు నుంచి కళాశాల చదువుకు వచ్చిన కుర్రాడి పాత్ర.
ఆ రెండింటి కి మధ్య అతనిలో కలిగే సంఘర్షణ ఈ కథ.
ఈ పాత్రద్వా రా నీహారిణిగారు తనలోని తపనను, వ్యక్తీకరించారు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, కొన్నేళ్ళుగా అమెరికాలోనే ఎక్కువగా ఉంటున్న నీహారిణి, ఈ కథలో ఉపయోగించిన కొలిమి పనికి సంబంధించిన వస్తువుల పేర్లు, వాటి వివరాలు ఇవ్వడం ఆశ్చర్య కరమైన విషయం.
అలాగే మధ్యమధ్య శ్రీశ్రీ కవిత్వాన్ని, చక్కటి గ్రాంథిక భాషనూ ఉపయోగిస్తూ అంతా చదువుకుంటున్న ఆ సంపత్ నోటే మధ్యమధ్య పల్లెటూరి భాషనూ పలికించారు. ఈనాటికి నాకు తెలిసి చదువుకున్న పల్లెటూరు వాళ్ళు నిత్య వ్యవహారంలో పల్లెటూరి భాషని మాట్లాడటం నేను గమనించాను. ఆ విషయాన్ని నీహారిణి తన రచనలో ఇమడ్చటం వల్ల చాలా సహజంగా ఉన్నది.
పల్లెటూరి భాషను వృత్తి సంబంధమైన వస్తువులను, వాటిని పలికే పదాలను సేకరించటం వల్ల ఇది ఒక పరిశోధనాంశమైన కథగా రూపుదిద్దుకుంది.
ఆ వివరణ ఆమె మాటల్లోనే చదివితే బాగుంటుంది. ఇందులోని పాత్ర సంపత్ తన స్నేహితునికి కులవృత్తులను గురించి చెప్పే సందర్భంగా నీహారిణి వివరణ – “మా వృత్తి కమ్మరి వృత్తి. వీరిని అయోశిల్పిఅంటారు. విశ్వకర్మీయుల పంచ వృత్తుల్లోమొదటిది అంటారు. కొయ్య పని చేసే వడ్రంగి వాళ్లను సూత్రకారులని, రాగి, ఇత్తడి, కంచు పనులు చేసేవాళ్ళని కాంస్యకారులని, కంచరని, తామ్రకారుడని, రాతి పని చేసే శిల్పకారుని స్థపతి అని, బంగారు పని చేసే వారిని స్వర్ణకారుడని అంటారు” అని సుదీర్ఘ వివరణిచ్చి ఆ చేతివృత్తులను భగవంతునితో సమానమని వారు కొలుస్తారని, వాటిని మొత్తంగా పంచముఖ బ్రహ్మ అని సంబోధిస్తారని సందర్భోచితంగా, ప్రస్తావిస్తూ వివరించడం నీహారిణికి ఉన్న విషయ సేకరణాభిరుచికి దర్పణం.
అలాగే పనిముట్ల పేర్లు ఊరు వోరుగల్లు, తటిక, తిత్తి, ఢాకలి అంటూ చెప్పి వాటి ఉపయోగం కూడా వివరించారు. దీనివల్ల మన సమాజంలో ఉన్న విషయాలను భావితరం వాళ్ళకు అందించిన వారి మవుతాము.
వర్తమానంలో చదివేవారికి కొంత జ్ఞానం కలిగించడం కూడా ముఖ్య విషయం.
ప్రపంచీకరణ మీద వివరణ రాస్తూ, “ప్రపంచీకరణ పాము పడగ విషపు కుమ్మరింతలను పట్టించుకోనంతవరకు ఇంటి దగ్గరే చదువు బాగా సాగుతూనే ఉంది” అని సంపత్ నోట వచ్చిన మాట ఈనాటి యువకులు ముఖ్యంగా చేతి వృత్తులవారు, క్రింది తరగతి యువత ఎలా నలిగిపోతున్నారో ఆ వాక్యం తెలుపుతున్నది.
కుల వృత్తులను మానేయడం వల్ల, అటు కొత్తగా చదువు ప్రారంభించి అందులో సఫలంకాలేక రెంటికి చెడ్డ రేవడు అన్న సామెతగా ఉన్నది. చాలామంది చేతివృత్తులవారి పిల్లలు తల్లిదండ్రులకు భారంగా జీవితం గడుపుతున్నారని నీహారిణి ఈ పాత్రతో చెప్పించడం బాగుంది. ఇది అక్షర సత్యం కూడా!
చేతివృత్తులు కూడా ఈ యంత్ర యుగంలో మూలపడ్డాయి. అంతేకాదు చదువు ప్రాముఖ్యతను కూడా కథా కథనం లో చెప్పడమూ బాగుంది.
ఎంతో నైపుణ్యం గల చేతివృత్తుల వారిని గురించి నీహారిణి రాసిన ఈ కథలో ప్రతి అక్షరం చేతివృత్తుల వారి జీవితాలకు అద్దం పడుతున్నది.
***
అలాగే నమ్మకాలను గురించి కూడా ప్రస్తావించింది రచయిత్రి.
కానీ ఈ విషయంలో నమ్మకాలు శకునాలు మొదలైనవి కాలానుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనిపిస్తుంది.
ఉదాహరణకు మా కాలంలో ఊరికి కదలాలంటే మంచి రోజు రాహుకాలం అన్ని చూచేవారు కానీ నేడు ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్ దొరికిన రోజు అదే మంచి రోజు అనిపిస్తుంది. అందువల్లే అటువంటి వాటిని మనం పూర్తిగా సమర్థించటం కుదరదు. కొన్ని మూఢనమ్మకాలు అవస్థలకు దారితీస్తాయి. వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటే మంచిది.
“సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు” అంటూ శ్రీశ్రీని ఈ సందర్భంగా రచయిత్రి స్మరించడం ఆమె సాహిత్య పరిజ్ఞానానికి నిదర్శనం. పాఠకులకు శ్రీశ్రీని జ్ఞాపకం చేయాలి అన్న ఉద్దేశం కూడా అందులో ఉంది. వేయి రకాలైన వృత్తులు వాటి చిహ్నాలు శ్రీ శ్రీ ప్రస్తావించడంలో మన దేశం హస్త కళలకు ఎంత ప్రసిద్ధి చెందిందో కథాంతర్గంగా చెప్పడమే నీహారిణి ఉద్దేశం.
ఈ విధంగా కథ ముగించి చివర సంపత్ ఒక్కడే ఇదంతా ఆలోచించుకుంటూ ఉండడం అనేది ఈ కథ యొక్క నడక. అందువల్లే కథకు ‘ఒంటరి మేఘం’ అని పేరు పెట్టింది
అంటే బహుశా మేఘాలు దండిగా ఉంటే వాన కురుస్తుంది. ఓకే మేఘం ఎంత మటుకు వర్షాన్ని ఇవ్వగలదు? అన్న ఒక భావనతో ఆ పేరును పెట్టడం జరిగిందేమో అనిపిస్తుంది. అంటే సంపత్ తను ఒక్కడే ఆలోచించుకుంటున్నాడు. తనతో పాటు, సమాజం, పెద్దలు ఆలోచిస్తే ఈ కథలో ఉన్న సమస్యలు కష్టాలు తీరిపోతాయేమో! ప్రస్తుతానికి సంపత్ ఒక ఒంటరి మేఘం.
***
ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాలి అవసరమైన కథకూ, రచనకు సమీక్ష రాయాలి. అనిపించి వెంటనే ఆ కథను నేను సమీక్ష కోసం ఎన్నుకున్నాను. ఈ కథ పేరు ‘కొత్త చూపు’.
పేరులోనే ఉన్నది పెన్నిధి అంటారు కొందరు. శీర్షిక అంటే పేరు. మనిషికి శిరస్సు ఎంత ముఖ్యమో రచనకు శీర్షిక కూడా అంతే ముఖ్యం.
కొన్ని సమస్యలు మనుషుల దృష్టికి రావు కానీ అవి ఆ వ్యక్తులను ఎంతో బాధిస్తుంటాయి.
ఈ సూత్రాన్ని కనిపెట్టిన నీహారిణి ఈ కథలో స్త్రీల విషయంలో ఒక ముఖ్యమైన అవసరాన్ని, చెప్పుకోలేని బాధను వస్తువుగా తీసుకున్నారు. అదే ప్రతి స్త్రీని నెలలో మూడు రోజులు తికమక పెట్టే మెన్సెస్, ముట్టు అనే ఒక సందర్భం. ఆ సందర్భమే కథా వస్తువుగా తీసుకొని అందులోని మంచి చెడ్డలను చర్చించింది కథా రచయిత్రి.
ఈ కథలో స్త్రీలకు కలిగే ఈ మూడు రోజులలో ఇబ్బందులను గూర్చి చర్చించే పాత్రలు నీరజ, నళిని. వీరిద్దరు మంచి స్నేహితులు. వారి సంభాషణ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం, ఒక మార్పు తేవాలనుకోవడం రచయిత్రి ముఖ్య ప్రయత్నం. అందుకే కథకు ‘కొత్త చూపు’ అన్న పేరు సార్థకంగా పెట్టారు. ఇక కథలోకి పోదాం –
రచయిత్రి కథకు ఎన్నుకున్న విషయం ప్రతి నెల ఆడవారు ఎదుర్కొనే మూడు రోజుల శరీర సంబంధమైన విషయం. దాని పేరే ముట్టు అనీ బయట చేరడం అనీ అంటారు. ఈ మూడు రోజులు బయట ఉండేవాళ్ళు నాకు తెలిసి బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. ఇంకా, కోమటి వాళ్లు కూడా ఉంటారేమో.
తక్కిన వాళ్లెవ్వరూ పల్లెల్లో గాని పట్టణాల్లో కానీ మూడు రోజులు బయట ఉండే పద్ధతి పాటించరు. ఈ పద్ధతి ఇప్పుడు బ్రాహ్మణులలో కూడా చాలా మటుకు మాయమైంది.
ఒంటరి కుటుంబాలు, పైగా అవసరాలను బట్టి తగ్గిందనే చెప్పొచ్చు.
రచయిత్రి ఉద్దేశంలో మెన్సెస్ టైం లో స్త్రీలకు విశ్రాంతి అత్యంత అవసరం. ఈ విషయం నళిని పాత్ర ద్వారా నీహారిణి వివరణాత్మకంగా చెప్పించారు.
నీరజ, నళినికి స్నేహితురాలు. సామాజిక స్పృహ, విద్య,ఒక విషయాన్ని గూర్చి కూలంకషంగా చర్చించాలన్న కోర్కె ఉన్నవాళ్లు ఒక చోట చేరితే వారి చర్చ, సమస్యల పరిష్కారం వైపు మొగ్గు చూపుతోందని, చూపాలని ఈ కథ ద్వారా రచయిత్రి నిరూపించారు. మంచి సందేశం అందించారు.
వృథా కబుర్లు కాకుండా మనకున్న జ్ఞానాన్ని సరస సంభాషణతో, సమస్యల పరిష్కారం కొరకు చర్చ సాగించాలని చెప్తూ నళిని నీరజతో, “సో మనం డిస్కషన్ పెట్టుకుందాం. బట్ ఇట్ షుడ్ బి ఇన్ హెల్తీ అట్మాస్ఫియర్” అంటుంది. ఇది చాలాముఖ్యమైన మాట. పదిమంది కూడి మాట్లాడుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, సరసంగా నిగ్రహంగా మాట్లాడుకోవాలి అన్న ఒకమంచి సందేశం నీహారిణి అందించారు.
అలా చర్చ జరిగినప్పుడే ఏ సమస్య అయినా పరిష్కరింపబడుతుందని కథ చివర నీరజ కూడా నళిని మాటను అంగీకరించటంతో తెలుస్తుంది.
మెన్సెస్ పీరియడ్‌లో నూటికి నూరు పాళ్లు స్త్రీలకు విశ్రాంతి అవసరం. అలాగే శుభ్రత కోసం కూడా వంటింటి లోకి, దేవుని దగ్గరకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం.
పూర్వం బ్రాహ్మణ ఇళ్లల్లో ముట్టు మూడు రోజులు ఇక మూల కూర్చొని అక్కడే అన్నం తిని ఎవరిని తాకకుండా ఎడంగా ఉండాలని శాసించే వాళ్ళు. ఇది చాలా ఇబ్బందికరంగా కూడా ఉండేది.
అలా కాకుండా మన రచయిత్రి నీహారిణి సూచించినట్లు ఇప్పటి స్త్రీలు ఉద్యోగాలకు తప్పక వెళ్లాలి కాబట్టి ఆ బాధ్యత తప్పనిసరి. ఇకపోతే ఇంట్లో వంట పని, ఇంటి పని, దేవుని పాత్ర లు శుభ్రపరిచే పని వాటి నుండి ఆ మూడు రోజులు ఆమెకు విముక్తి కలిగిస్తే, ఆమెకు విశ్రాంతి లభిస్తుందని చెప్పడం, కూతురు, కొడుకు, భర్త ఎవ్వరూ ఇలాంటి పనులలో సహాయం చేయకపోవడాన్ని కూడా వ్యంగ్యంగా చెప్పడం బాగుంది. ఈ రోజుల్లో యువత ఇంటి పనులు చేయడానికి అస్సలే ఇష్ట పడకపోతే ఎట్లా? అనే ఆవేదన కనబడుతున్నది. అలాగే శుభ్రతపరంగా, సైన్స్ పరంగాను ఆ మూడు రోజులు స్త్రీల ఒంటిలో జరిగే మార్పులు చేర్పులు కూడా రచయిత్రి వివరించడం వల్ల పాఠకులలో కొంత ఆరోగ్యపరంగా కూడా అవగాహన కలగడం ఖాయం.
కథాపరంగా కిరణ్మయి అనే నీరజ స్నేహితురాల్ని కూడా ప్రవేశపెట్టారు రచయిత్రి. ఈమె పాత్ర నీరజ, నళినిల సంభాషణ వినే పాత్ర. ఒక సమయంలో నళిని నాన్నగారిని గురించి కిరణ్మయి అడిగిన దానికి నళిని, “మా నాన్నగారు కవి. అయినా మా అభిప్రాయాలను గౌరవిస్తారు..” అన్నప్పుడు నీరజ సహనం కోల్పోయి “..నీ మీద ఎవరి ఫోర్సు లేదా? నీవు ఈ మూఢచారాలనునిజంగా నమ్ముతున్నావా? ఎందుకే ఆత్మవంచన చేసుకుంటావు” అంటూ నీరజ తీవ్రస్థాయిలో మాట్లాడినప్పుడు కిరణ్మయి “స్నేహితుల మధ్య ఇంత వ్యత్యాసమా” అని ఆశ్చర్య పోతుంది.
సంభాషణ ప్రారంభంలో నళిని చెప్పిన దాని, గీటు దాటింది నీరజ. ఇది కూడా అత్యంత సహజమైన విషయం.
అందుకే రచయిత్రి ఈ సన్నివేశాన్ని కల్పించారు. ఆవేశం ఒక్కోసారి హద్దులు దాటుతుంది. దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు అవతలి వాళ్ళు స్థిరమైన సమాధానాలతో వారి ఆవేశాన్ని తగ్గించాలి.
ఈ చిట్కా వైద్యం తెలిసిన నీహారిణి నళినిచేత ఏది మూఢాచారమో, ఏది కాదు అన్నది సోదాహరణంగా వివరించారు. అటు నీరజకు ఇటు పాఠకులకు. ఆ వివరణ సారాంశం, ఈ క్రిందది.
~
“ముట్టయిన మూడు రోజులు బయట ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ తప్పదు కదా. ఇంట్లో మాత్రం ఆహార పదార్థాలు, భగవంతుని విషయాలు, బీరువాలో పవిత్ర దినాల్లో కట్టుకునే పట్టు గుడ్డలు ఇలాంటివి ఆ రోజుల్లో తాకకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే అవి మామూలు బట్టలలా నిరంతరం ఉతకడం సాధ్యం కాదు కాబట్టి. అని ఆ రక్తాన్ని మలినమనే భావిస్తాను నేను.” అంటూ నళిని చెప్పడం మంచి వివరణ. ఈ విషయంలో కొందరికి శుభ్రంగా ఎలా ఉండాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అలాగే కొందరికి ఎక్కువగా రక్తస్రావం అవుతుంది అటువంటప్పుడు తప్పకుండా శుభ్రతకు లోపం ఏర్పడుతుంది.
అందువల్ల ఆ రోజుల్లో ఆ మూడు రోజుల్లో వీలైనంత మటుకు ఇంట్లో పని తగ్గించుకోవడం వల్ల శుభ్రతకు ఆరోగ్యానికి అలాగే నెలకు మూడు రోజులు కనీసం విశ్రాంతికి అన్నింటికీ చక్కటి పరిష్కారం ఈ కథలో నళిని పాత్ర ద్వారా రచయిత్రి ఉదాహరణలతో, చెప్పించింది. చివరకు నీరజను ఒప్పించింది కూడా.
అందుకే గృహ రాజ్యాంగంలో గృహిణికి ఇకనుండి మూడు రోజుల సెలవు ప్రకటించాలి లేకపోతే నీహారిణి దీనికోసం ఒక ఉద్యమం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లూ నళిని నోట చెప్పించారు. ఒకటి రెండు రోజులైనా విశ్రాంతి కావాల్సిందే అని నీరజ చేత ఒప్పించారు కూడా.
అంటే ఈ ఉద్యమానికి ప్రజా బలం తప్పకుండా ఉన్నదని అర్థం. నీహారిణి కథ, నా సమీక్ష చదివిన ప్రతి కుటుంబం లోని సభ్యులు ఆ కుటుంబాలలోని స్త్రీలకు సెలవు మంజూరు చేయాలి అని సవినయంగా చెప్తూ ఉద్యమాల దాకా పోనివ్వకుండా సర్దుకోవాలని మనవి.
***
కథలోని కొన్ని మౌలిక విషయాలు, కొన్ని ఘట్టాలు.
1 ‘కొత్త చూపు’ కథ మొదట్లోనే మల్లారెడ్డి మొదలైన వాళ్ళని రచయిత్రి ప్రవేశపెట్టారు. ఇది ఈ కథకు అంత సంబంధం లేని విషయం. అయినా కిరణ్మయిని పాఠకులకు పరిచయం చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అయితే దీని ద్వారా కొన్ని ఆచార వ్యవహారాలను, ఇళ్ళ విషయాన్ని చర్చించడం తెలుసుకోదగ్గ విషయం. ఇందులో ఉపయోగకరమైన డైలాగులు.
- A) “వయసులో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు పట్టాల మీద పరిగెడుతున్న రైలులాగా వేగంగానే ఉంటాయి.”
- B) “మన పూర్వీకులు చెప్పినవన్నీ కరెక్ట్. ఫెడర్ధాలు తీసుడు తప్ప మనమేమి కొత్త నీతులు బోధించగలిగామా ఏమన్నా.” ఇది పెద్దవాళ్ల మాటకు విలువనివ్వాలి ఈ తరం వాళ్లు అనే సత్యం తెలిపే వాక్యం. ఇలాంటివే సుభాషితాలు. ‘తీసుడు’ అన్నది తెలంగాణ యాస పదం. ‘తీయడం’ అన్నదది. ప్రాంతీయ భాషా అభిమానంతో నీహారిణి తెలంగాణ యాస భాష తన ప్రతి రచనలో ప్రతిఫలింప చేస్తున్నారు.
2) కొన్ని విలువైన వాక్యాలు.
“నేను ఎవరితో వాదించను”. మన వాదనకు విలువిచ్చే చోట మాత్రమే వాదించాలి అని! ఇది మంచి సూచన.
“మలినమా, కాదా అన్న దానికన్నా, బయటకి వచ్చే దానిని శుభ్రం చేసుకోవడం తన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం బాగా తెలియకపోతే ఇది నిజంగానే మలినం. ఆ చేతులతో పనిచేయటం సరికాదు”. అన్న నళిని మాటలు భావాలు ఎంతో సత్యమైనవి.
3) “కొందరు అమృతం అన్నారు ఈ ముట్టును” అన్న నీహారిణి ఎవరు ఎందుకు అన్నారో తెలుపలేదు. తెలిపి ఉంటే బాగుండేది. బహుశా మనిషిని బ్రతికించేది బ్లడ్ కాబట్టి దానిని అమృతం అని అన్నారేమో! అది కొంత బయటికి వెళ్ళిపోవడం గూర్చి ఆ రచయిత్రులు అలా ఊహించారేమో అని నాకు అనిపించింది.
4) 73వ పేజీలో రెండో పేరాగ్రాఫ్‌లో మెన్సెస్/ముట్టు పుట్టుపూర్వోత్తరాలను గూర్చి విపులంగా వివరించారు.
5) కథ చివరలో పనిమనిషి పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్ర ద్వారా చక్కటి సత్యాన్ని, రహస్యాన్ని బయటపెట్టారు నీహారిణి.
ఇక వీళ్ల చర్చ రసకందాయంలో పడుతున్న సమయంలో పనిమనిషి యాదమ్మ బాత్రూం కడుగుతూ నీళ్లు కారుతున్న చీపురును పట్టుకుని (ఇక్కడ వర్ణన బ్రహ్మాండం నీళ్లు కారుతున్న చీపురు అని చెప్పటంలో ఆడవారి కన్నీటిని గుర్తు చేసింది నీహారిణి) తటారున వచ్చి చెప్పిన డైలాగ్.
“నీరజమ్మ నువ్వేనయినా చెప్పు ఆడోళ్ళ కష్టాలు ఎవరు పట్టించుకోరు” అని అంటుంటే వాళ్లకు మరో ప్రపంచం ఏదో గమనిస్తున్నదని చూసి ముగ్గురు గతుక్కుమన్నారు.
ఇక్కడ నాకు తిక్కన గారి స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు, ఇంద్రుడు పంపగా తనతో వచ్చిన పని వాడిని ఏది అడిగినా అతడు నాకేది తెలియదు అని చెప్తుంటాడు. అతని చేత తిక్కన అలా చెప్పించడం అంటే పనివాళ్ళలో ఉండవలసిన గుణం అదే అని! తనకేది తెలిసినా తెలియనట్లే ఉండడం. కానీ ప్రస్తుతం పనివాళ్ళు మన ఇంటి విషయాలన్నీ ఒక చెవితో వింటూ బయటకు చేరవేస్తున్నారు.
అయితే, చీపురు కట్ట నుంచి రాలుతున్న నీళ్ళు, కష్ట జీవుల కన్నీళ్లతో పోల్చినట్టున్న విషయాన్ని ఇక్కడ నీహారిణి సూచించిన శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించేలా యువత జీవితాలలో కలగాలనేలా సరిగ్గా సరిపోతుంది అని నా అభిప్రాయం.
రెండవది వీళ్ళు మాట్లాడుకున్నదంతా ఒక స్థాయిలో ఉన్న స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది, మరి కష్టజీవులైన స్త్రీల మాటేమిటి? అనే ప్రశ్నలాగా యాదమ్మ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ముగ్గురికి సమాధానం తెలియక గతుక్కుమన్నారు అంటూ ఇచ్చిన ముగింపు సమస్త పాఠకులనూ ఆలోచన లలో పడవేస్తుంది.
నీహారిణి చాలా జాగ్రత్తగా రచించిన కథలు ఇవన్నీ.
ఊహల్లో తేలిపోతూ ఖరీదైన కార్లను, చెప్పులను, దుస్తులను వర్ణిస్తూ ఉండే కథలు కాకుండా సాటి స్త్రీలను దృష్టిలో పెట్టుకొని నీహారిణి రాసిన ప్రతి కథా విలువైనదే.
రచయిత్రి, కవయిత్రి, పత్రికా సంపాదకురాలు మొదలైనవే కాకుండా, హృదయమున్న మనిషిగా, తన భావాలను చక్కగా భాషా రూపంలో వెలువరించే విద్య తెలిసిన వ్యక్తి నీహారిణి. పాఠకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారనడంలో సందేహం లేదు.
మునుముందు కూడా మన సాంప్రదాయానికి చేయూతనిస్తూ సాగే రచనలను. నీహారిణి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు నా అభినందనలు, ఆశీస్సులు. సమాజ సమస్యలు, స్త్రీల సమస్యలు ఇతివృత్తాలుగా కథలు రచించే నీహారిణి సమాజంపట్ల బాధ్యతగల రచయిత్రిగా పాఠకుల మనసులలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని చెప్పడానికి ఎట్టి సందేహంలేదు. నీహారిణికి నా అభినందనలు.
