Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఊహ, నిజాల మధ్య..

[వి. ఎస్. నైపాల్ రాసిన నవల ‘మిస్టర్ స్టోన్ అండ్ ది నైట్స్ కంపానియన్స్’ నవల గురించి ఈ రచనలో వివరిస్తున్నారు డా. జె. రవీంద్రనాథ్.]

భారతీయ మూలాలున్న ఆంగ్ల రచయిత వి. ఎస్. నైపాల్ (1932-2018) సాహిత్య రంగంలో అత్యున్నతమైన నోబెల్ బహుమతిని 2001 లో పొందారు. ట్రినిడాడ్ లో జన్మించిన ఆయన నవలలు, కథలు, వ్యాసాలు, యాత్రా రచనల ద్వారా ప్రపంచ సాహితీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన శైలి, వాస్తవికత యొక్క నిష్పాక్షిక చిత్రణ, భారత్ పైన సదా రాజీలేని విమర్శ, సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేయటం అందరికీ తెలిసిందే. తన పాత్రల అంతర అలజడిని తగు సానుభూతి, అవసరమైనంత దూరంతో చిత్రిస్తాడు.

నైపాల్ తండ్రి సీపర్‌సాద్ యవ్వనం లోని తన కొడుకుకు రాసిన ఒక లేఖలో మనుష్యుల్ని నిష్పక్షపాతంగా చూడాలని ,గ్రహింపు అనేది అరుదు, తెలివి అంత విస్తృతంగా లేదని, అవి అసాధారణంగా ఉన్నవారు సింక్లైయర్లు లూయిస్ లాగా తీవ్రంగా బాధపడతారని, కానీ అటువంటి వారి వల్లనే ప్రపంచం గొప్పదనం తెలుస్తుందని రాశాడు. తన నోబెల్ ఉపన్యాసంలో తాను సహజాతం వల్ల సదా కదిలిపోయానని తనకు ఏ సాహితీ రాజకీయ వ్యవస్థ లేదా మార్గదర్శక రాజకీయభావం లేదని నైపాల్ చెప్పారు.

నైపాల్ రచనలలో ‘ఇన్ ఏ ఫ్రీ స్టేట్’, ‘ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’, ‘ఏ బెండ్ ఇన్ ద రివర్’, ‘ఇండియా: ది వూన్డెడ్ సివిలైజేషన్’, ‘ఎన్ ఏరియా ఆఫ్ డార్క్‌నెస్’, ‘ఇండియా: ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’, ‘మ్యాజిక్ సీడ్స్’, ‘ది సఫ్రేజ్ ఆఫ్ ఎల్వైరా’, ‘ది లాస్ ఆఫ్ ఎల్దొరడో’, ‘బియాండ్ బిలీఫ్’ తదితర రచనలున్నాయి.

నైపాల్ రాసిన నవల ‘మిస్టర్ స్టోన్ అండ్ ది నైట్స్ కంపానియన్స్’ (1963) మానవ జీవితంలో రోజువారి జీవితం, అనూహ్య పరిణామాల మధ్య వైరుధ్యాన్ని చూపిస్తుంది. మనిషి సహజంగా ముసలిగా మారే నియమాన్ని, ఏ భ్రాంతి లేకుండా ప్రపంచంతో రాజీ పడాల్సిన పరిస్థితిని రచయిత అద్భుతంగా చిత్రించాడు. వ్యక్తుల బాహ్యరూపం, అంతర్గత వాస్తవికతల మధ్య తేడాలను, ప్రకృతి వర్ణనను, ఏదో విధంగా దాని నియమాలను భగ్నం చేసేందుకు మనిషి చేసే అర్థం లేని పనుల్ని ఖచ్చితమైన సులభమైన శైలిలో రచించారు.

మిస్టర్ రిచర్డ్ స్టోన్‌కు 62 సంవత్సరాలు. లండన్‌లో ఒక కార్పొరేషన్ లైబ్రరీలో లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. అతడికి రొటీన్ జీవితం బాగా అలవాటై, అలజడి అంటే భయం. కానీ ఏదో కొత్తదనం కోసం ఎదురు చూస్తుంటాడు. తన ఊహలో తను వీరుడు. ఒకరోజు తన ఇంట్లో ఒక పిల్లి హఠాత్తుగా అతని మీదకు దూకి భయపడుతుంది. అతడి పనిమనిషి మిస్ మిలింగ్టన్ అతని ఇంటిని నివాసయోగ్యంగా ఉంచుతుంది.

స్టోన్‌కు ఫలితాల కన్నా పనుల పైన మక్కువ ఎక్కువ. అతని ఊహలో వస్తువులు, జనాలు, ట్రాఫిక్, గందరగోళం మీద ఎగురుతూ ఉండటం తరచుగా జరుగుతుంది. ఒక పార్టీలో మిస్సెస్ స్ప్రింగర్‌ను కలిసి తన పిల్లి కథ చెప్తాడు. దానికి ఆమె కొంత చేర్చి ఇతరులకు చెప్తుంది. ఇద్దరికీ పరస్పరం సదభిప్రాయం ఏర్పడుతుంది.

ఇక స్టోన్‌కు తన జీవితం, జీతం, స్నేహం, తల్లి మరణం కూడా ఎప్పటికీ దాచుకోవలసిన జ్ఞాపకాలు. అతని రొటీన్లో పేపర్ చదవటం, తన ఆవరణలో చెట్టు గురించిన ఆలోచన, పొరుగువారి రొటీన్ భయాలను పద్ధతిగా పరిశీలిస్తుంటాడు. అతడు ప్రకృతిలో మార్పు, తన వయసులో వచ్చే మార్పులు గమనించడు. తన సోదరి ఆలివ్, తనంటే నచ్చని ఆమె కూతురు గ్వెన్‌తో సంబంధం మాత్రమే తన రొటీన్ జీవితాన్ని భరించేటట్లు చేసేవి.

మార్గరెట్‌తో లేటు వివాహం అతని రొటీన్‌ని మార్చింది. తాను సంపాదించే ఏడాదికి వెయ్యి పౌండ్లు అంటే ఆమె చులకననే అనుమానం. అతని ఏకాంతం పోయి ఆఫీసులో తనను అందరూ పూర్వం కన్నా వేరేగా చూస్తున్నారని గమనిస్తాడు. లైబ్రరీలో గార్డు, టైపిస్టులు చేసే చీకటి పని చూసి అతనికి జిగుప్స కలుగుతుంది. తన ఇంటి పునరుద్ధరణ కూడా నచ్చదు. తన సృజనాత్మక సంవత్సరాలు వ్యర్థమయ్యాయి అని ఆందోళన చెందుతుంటాడు. రచయిత చిన్న సంఘటనలను కూడా చిత్రించి రిటైర్మెంట్ అంచుల్లో ఉన్న వారి జీవితాన్ని, తమను తాము గొప్పగా భావించుకుని ప్రశాంతతను కోల్పోవడం, అకారణంగా ద్వేషించడాన్నీ వర్ణిస్తాడు.

మిస్టర్ స్టోన్ మార్గరెట్‌తో తన వివాహం తర్వాత లండన్ పారిస్‌లో హనీమూన్‌కి వెళ్ళినప్పుడు ఆతడి ఆందోళన మరింత పెరుగుతుంది. కార్న్వాల్‌లో ఒక వ్యక్తిని భార్యాభర్తలు గుడ్డిగా అనుసరించి వెళ్ళి కాలుతున్న పొలంలో పొగలో చిక్కుకుపోయి చివరి క్షణంలో వెనక్కి వెళ్తారు. అది ఒక శూన్యం, మరణానంతర అనుభూతిలా ఉంది అని రచయిత వర్ణిస్తాడు. స్టోన్ యొక్క ఊహ, వాస్తవికతల మధ్య తేడా ప్రేమ బంధాలు లేక, మామూలు అందాలు లుప్తమై, శూన్యమైన డోలాయమాన పరిస్థితిని వర్ణిస్తాడు నాయిపాల్.

వివాహం తర్వాత స్టోన్ జీవితంపై భార్య మార్గరెట్, పనిమనిషి మిల్లింగ్టన్‌ల ప్రభావం పెరుగుతుంది. మిస్టర్ స్టోన్ రిటైర్ అయిన తరువాత గడియారం బహుమతిగా ఇస్తానని భార్య మార్గరెట్ అంటుంది. హనీమూన్ చివర వారు వెళ్లిన టీ షాప్‌లో జనాన్ని చూసినా, స్త్రీలన్నా చిరాకు వస్తుంది. కానీ తాను భార్య పట్ల, పెళ్లి పట్ల న్యాయంగా ఆలోచించటం లేదని అతనికి తెలుసు .

ఆ తరువాత స్టోన్ రిటైర్ అయిన వారి కోసం ఒక పథకాన్ని తయారుచేసి తన బాస్‌తో సమావేశానికి ఆహ్వానించబడతాడు. అతనికి ప్రమోషన్ వస్తుంది. ఆ పథకాన్ని మెరుగుపరిచే క్రమంలో తనను బాస్ తన కంటే జూనియర్ అయిన బిల్ వింపర్‌తో కలిసి కంపెనీకి ప్రచారం చేయమని అనటం స్టోన్‌లో అపోహ కలిగిస్తుంది.

స్టోన్ పథకం అమలులో నైట్స్ అనుచరులు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లాలి. ఈ క్రమంలో ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టడం, మరొకరు చనిపోయిన వారి దగ్గరికి వెళ్లానని అబద్ధమాడటం, ఇంకొకరు మత ప్రచారానికి తిరిగి, మరొకరు కూతురు చేతిలో ఒక ఇంటిలో ఖైదీగా ఉన్న వ్యక్తిని కనుగొనడం ఇలా ఎన్నో జరుగుతాయి. ఇంట్లో స్టోన్ ప్రాముఖ్యత పెరుగుతుంది. తమ ఇంటిని దంపతులు మెరుగుపరుస్తారు.

ఒకరోజు మిస్టర్ స్టోన్‌కు మిత్రుడు టామ్లిన్స్సన్ మరణం గురించి తెలుస్తుంది. ఆఫీసులో జూనియర్ వింపర్ ప్రాబల్యం పెరిగి తన గుర్తింపు బాగా తగ్గిపోతుంది. తన జీవితంలో వసంతం లేదని పలికే అతని మాటలు విని మార్గరెట్ అర్థం లేదని భావిస్తుంది. స్టోన్ సోదరి కూతురు గ్వెన్‌ను వింపర్ గర్భవతినీ చేశాడని తెలిసి నిరసిస్తాడు. తన సృజనాత్మక పధకం వల్ల పేరు కొట్టేసి జూనియర్ వింపర్ మరో కంపెనీకి పబ్లిసిటీ డైరెక్టర్‌గా మారటం అతనికి చివరి దెబ్బ.

రవాణా సమ్మె వల్ల ఆఫీస్ నుంచి ఇంటికి నడుస్తూ ఆలోచనలలో పడతాడు. “అతడు నగరంలో మన గలిగిన దాన్ని తీసేసి భౌతికం కానిది ఏది మనిషికి ముఖ్యం కాదని చూస్తాడు. మనిషికి కావలసింది సున్నితత్వం, అవినీతిపరులు కావటం.దేనితో తాను కలిసి ఉండాలని ప్రయత్నించాడో ఆ విశ్వవ్యవస్థ తన వ్యవస్థ కాదు. ఇంతకుముందు ఎంతో చూశాడు, ఇప్పుడు చూస్తున్నాడు. మనిషి తన అధికారాన్ని చూపించేది శత్రుపూరిత వ్యవస్థను ధిక్కరించేది.

సృజనాత్మకతతో కాక విధ్వంసంతో. నదికి ఆనకట్ట కట్టి, పర్వతాన్ని నాశనం చేసి, భూమి మోముపై ఎంతగానో గీతలు పడేటట్లు. అంటే ప్రకృతి పునర్వికాస యత్నం హాస్యాస్పదంగా మారింది.”

స్టోన్ తన్ను తాను విధ్వంసకుడిగా చూస్తాడు. తన స్టడీ రూమ్‌లో ఏదో పని చేస్తూ బయటికి వెళ్లిన మార్గరెట్ తిరిగి రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. మిస్టర్ స్టోన్ పాత్రకి, ఆర్థర్ మిల్లర్ రాసిన ‘ది డెత్ ఆఫ్ ఏ సేల్స్‌మ్యాన్’ లో విల్లీ లోమన్ పాత్రకి కొంత వరకు పోలికలు ఉన్నాయి. నైపాల్ నవల అనివార్యమైన పదవీ విరమణ, ఒంటరితనం, అవాస్తవిక స్వీయ గొప్పతనం భావన, అస్తిత్వ సంక్షోభం, బాహ్య ప్రపంచంతో తప్పనిసరి రాజీ గురించి చెబుతుంది.

Exit mobile version