Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఊసుల హుండీలు పోస్ట్ బాక్స్‌లు

[డా. గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన ‘ఊసుల హుండీలు పోస్ట్ బాక్స్‌లు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఉండేవొకప్పుడు
ఊసుల హుండీలు
ఊరూరా
వీధుల చివరా..
… .. ..
జాబులు కార్డులు కవర్లు
శబ్దం చేయని మన(సు) కబుర్లు

మన గుండెల నుండి
ఇంటి నుండి
ఊరి నుండి
ఊసులతీస్కుని
మోస్కుని
ప్రియమైన
ప్రియాతి ప్రియమైన
పిలుపుల పలకరింపుల
ముందేస్కుని సందర్భాల
పెనవేస్కుని ఊసుల
ఒడుపుగా దాస్కుని
ముద్దులభావాల
కలబోస్కుని
ముద్దులను దీవెనలను
మూటకట్టుకుని

చెల్లెలు
కూతుళ్ళ బంధాల ముడులేస్కుని
ఇంపుగా సొంపుగా తంపుగా
నింపుకుంటూ మురిసిపోతూ..

ఎరుపు రంగున్న ఇనుప కవచాలేస్కుని
ఉండేవి వీధుల చివర ఊరూరా
ఊసుల హుండీలు హుందాగా

ఎదురుచూస్తూ
నిండిన ఊసుల సంపదల్ని
తపాలా రైల్బండి హుండీ వాలాకి
అప్పగించే పెద్దల్లాగా

మిగిలాయి ఇప్పుడూ..
అక్కడక్కడా శిధిలమౌతున్న
ప్రాచీన స్మారకాల్లాగా

Exit mobile version