[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘ఒప్పందం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కొన్ని సార్లు
కొన్ని చోట్ల ఒదిగేందుకు
మనతో మనం చేసుకునే ఒడంబడిక
బలహీనత ప్రదర్శన కాదు..
అది
మానసికంగా ఎదిగేందుకు ఏర్పర్చుకున్న
జ్ఞాన ప్రణాళిక!
గజేంద్రుడైనా, రాజేంద్రుడైనా,
దేవేంద్రుడైనా
కొన్ని పరిస్థితులతో,
కొన్ని పరాజయాలతో,
కొన్ని పరాభవాలతో
సర్దుబాటు చేసుకోక తప్పదు!
రాజీ తత్వం
కఠినత్వాన్ని కరగించి
లాలిత్యాన్ని అంకురింప జేస్తుంది!
అహంకారాన్ని గెలిపించుకొని,
మనిషితనాన్ని ఓడించి
రాబట్టుకునే ఆనందం
రాక్షసానందం!
నిలువెల్లా సుఖింపజేసే
ఆమని ఆలింగనాన్ని అందుకోవాలని
శిశిర కాలపు కష్టాలతో
తరువు రాజీ పడుతుంది!
సంతృప్తిని ప్రసాదించే
సాగర సంగమాన్ని పొందే తటిని
తన పేరును, తీరునూ మార్చుకునేందుకు
ఆనందంగా అంగీకరిస్తుంది!
రాజీకి రావడమంటే
ఆత్మ గౌరవాన్ని విడనాడి
లొంగినట్లు కాదు..
అధైర్యంతో క్రుంగినట్లు కాదు!
అది
ఆదిలోనే దుష్పరిణామాలను అడ్డుకునే
సమయోచితమైన సర్దుబాటు!
వివేచన దీపాన్ని వెలిగించే దిద్దుబాటు!
బద్ధ శత్రువులైన దేవదానవులు
అవసరార్థం రాజీ పడితేనే కదా
పాల కడలిని చిలికి
ఫలితాన్ని పొందగలిగింది!
కష్ట నష్టాలను కలిగించే
కదన జ్వాలలను రగుల్గొలపడం
సులభమే కానీ
సముద్రమంత సహనంతో
ఆ నిప్పు ముప్పును నివారించ దలచి
పగవారితో సంధికి రావడం
పెద్ద మనసు లక్షణం!
విరోధ భావాలను ఆదిలోనే అణచే
విజ్ఞతకు నిదర్శనం!
క్షేమాన్ని కోరే దూర దృష్టికి ఉదాహరణం!
అది ఓటమికి సూచన కాదు..
అది ఒక ఆదర్శ భావన!
శాంతి స్థాపక చేతన!
పెనుగాలికి తలను వంచే
గడ్డి పోచ
ప్రతికూల స్థితితో రాజీపడే
శస్తమైన శిక్షణనిస్తుంటుంది!
గగనాన సంచరించే
గరుడ పక్షైనా,
గండ భేరుండమైనా
అననుకూల వేళ
అవనిని ఆశ్రయించేదుకు
ఒప్పుకోక తప్పదు!
ఆశలు అవధులను దాటకుండా
ఒక హద్దు వద్ద ఆగేందుకు
సమ్మతిస్తేనే సంతృప్తి ప్రాప్తి!
ఎంతటి అపార పారావారమైనా
ఒక సీమ చెంత స్థిరపడేందుకు
ఒప్పుకోవడం
ఒప్పైన స్థితి!
ఒకరి ఇష్టాయిష్టాలతో
ఒకరి న్యూనాధిక్యాలతో,
ఒకరి బలహీనతతో, బలంతో
మరొకరు సర్దుకుంటేనే కదా
బంధానికి మనుగడ!
కలయికకు కాపుగడ!
ప్రయత్నాలను విరమించి
వైఫల్యంతో రాజీ పడడం మాత్రం
పతనానికి సిద్ధపడడమే!
ఏ ఏ సమయాలలో
ఏ పరమార్థం కోసం
రాజీ అస్త్రాన్ని ప్రయోగించాలో,
ఏ ఏ సందర్భాలలో
ఏ ఫలితం కోసం
రాజీ సూత్రాన్ని పాటించరాదో
తెలిసి ఉండడం యుక్త విధానం!
ఉపయుక్త విజ్ఞానం!
ప్రాణి ప్రయాణం ఒక మజిలీ వద్ద
అనివార్యంగా సమాప్తమయ్యే చర్య
జీవికీ, సృష్టికే మధ్య గల
ఒడంబడిక ప్రక్రియ!
