[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘పాడమా తీయగా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
రెప్పల మాటున..
ఘనీభవించిన కటిక అమావాస్య.
పున్నమి వెన్నెల..
పలకరిస్తుందనే ఆశా ఏ కోశానా లేదు!
విధి నిర్దయకై..
నిందాస్తుతి చేయవు ఆ పెదవులు.
బ్రతుకు పాట్లలో పడి..
పాటెత్తుకుంటాయి ఆ గొంతులు
రణగొణ ధ్వనుల నడిబొడ్డున నిలబడి
కాలుష్యావరణంలో అమృతం జల్లుతూ!
శృతి, లయల సంగతుల లోతులు
ఔపోసన పట్టలేదు.. అయినా
గతి తప్పదు మరి ఆ గాన లహరి.
తా పలికించిన ఘోర అపశృతికి..
విధాత చెల్లించిన నష్ట పరిహారమేమో
ఆ గాన కౌశలం!?
వేదికనెక్కిన ఏ కళకైనా కానీ..
కరతాళ ధ్వనులేగా ఉత్సాహాన్నిచ్చేది
ప్రేక్షకుల ఉద్వేగాలే కదా స్పూర్తి.
లోకాన్ని చూడలేనీ ఆ పాటకి
కాసుల సవ్వడే తగు ప్రోత్సాహం!
చప్పట్లు కొట్టి అభినందించేవారెవరు?
చూడలేని కళ అదని చూసి చూడనట్టు
జారుకునే జనం, ఆకలి పాటను పలకరిస్తారా?
ఏమో! కనీసం కొందరైనా స్పందిస్తే..!!!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు, 100 కవితలు రాశాను.
