[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వడలి రాధాకృష్ణ గారు రాసిన ‘పాలవన్నె’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ వర్షానికి అంతు అనేది లేకుండా ఉంది! కుండపోత అని దీనికి ఎవరు పేరు పెట్టారో గాని కుండకు మించి ‘గుండిగపోత’ అయిపోతోంది.
“మరో మూడు రోజులు తెరుపు ఈయదు. ఇంతే బావా! టీవీలు మోత ఎక్కించేస్తున్నాయి చూడు!” నటరాజు మాటల్ని ఆలకిస్తూనే ఉన్నాడు సుగుణ రావు.
అలా వంటింట్లోకి తొంగి చూశాడు. ఉదయం ఆరున్నర గంటలు అయిపోయింది. అంటే అరగంట సమయం దాటి పోయిందన్న మాట. ఆరు గంటలకు ఠంచనుగా కడుపులో కాఫీ పడకపోతే తన మనసు పడకేసి పారేస్తాదీ! అంతే బుర్ర పని చేయదు!!
కాస్త అటు ఇటుగా నటరాజయ్య స్థితి కూడ అంతేను. రోజూ పావు తక్కువ ఆరుకి ఊరి కోడి కూసెయ్యగానే ఠకాలున సుగుణ రావు ఇంటికి తరలి వచ్చేస్తుంటాడు.
సుగుణ రావు భార్య మండోదరి కాఫీకి కాదనదు. నటరాజు అన్నయ్యకు కూడ కాఫీ గ్లాసును సిద్ధం చేసేస్తుంది.
నటరాజు భార్య నళిని భర్త మీద అలిగి పుట్టింటికి పోతూండటం రివాజుగా వస్తూ ఉంది. పాపం! ఇప్పుడు మొన్ననే భర్త మీద అలిగి పెట్టేబేడా సర్దుకొని పుట్టిన ఊరు, పులకింతల పల్లికి చక్కాపోయింది. అలా చేయడం ఏ పదో సారో ఇప్పటికి.
ఆమె ప్రధానమైన షరతు ఈ దిక్కుమాలిన పల్లెపాలెం పల్లెటూరులో ఉండటం కుదరదు. ఏ చిన్న ఉద్యోగమయినా సరే చూసుకొని పట్నానికి పోదామంటుంది.
పెళ్ళాం మాటలకు పెనిమిటి గారు తలను ఒక్కోసారి నిలువుగానూ, మరోమారు అడ్డంగాను త్రిప్పుతూనే ఉన్నాడు. కానీ అది మటుకు అస్సలు కుదరని పని అవుతూ ఉంది.
“ఇది కుండపోత వర్షం కాదు! చూస్తుంటే తుఫానుగా మారేటట్లు ఉంది.” మండోదరి మూడు కాఫీ గ్లాసులని స్టీలు పళ్ళెంలో సర్ది తీసుకొస్తూ పలికింది. భర్త సుగుణ రావుకి, నటరాజుకి కాఫీ గ్లాసులనందించి, మూడవది తాను తీసుకొంది.
బయట వర్షం వర్షంలాగ లేదు. బీభత్సంగా ఉంది. అసలు ఊరిలో అన్నీ మట్టి రోడ్లు. ఇంట్లో అలా పైకి చూశాడు. చాల అదృష్టం. పదిహేను రోజుల క్రితమే తన తాటాకు పూర్తి కొంప మీది తాటి ఆకుల్ని తీసేసి కొత్త ఆకులు కొనుగోలు చేసి కప్పించాడు. లేకపోతే బయట కురుస్తున్న వర్షంలో సగభాగం తన ఇంట్లోనే ఉండేది.
సుగుణ రావుకి వర్షం వింతగా ఉంది. ఆకాశంలో ఉండుండి మెరుస్తున్న మెరుపులు వింతగా అన్పిస్తున్నాయి. ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా మారిపోవడం చాలా ఇబ్బందికరంగా అన్పిస్తోంది.
“మనం పెట్టే బేడా సర్దుకొని సన్నద్ధంగా ఉండాలి బావా! సర్కారోళ్ళు వ్యాను పంపించినారంటే మనమంతా ఎక్కిపోవాల్సిందేను” నటరాజు ముందస్తు ప్రమాద హెచ్చరికల్ని జారీచేస్తూ ఉన్నాడు.
“ఊరిలోని పద్మనాభం తమ్ముణ్ణి, జగ్గడు మామ కుటుంబాల్ని కూడ చెప్పి ఉంచు. క్రితంసారి లాగానే ఇప్పుడూ మనందరిది ఒకే వ్యాను! అక్కడ కూడాను ఒకటే చోటు!” సుగుణ రావు చెప్పుకుపోతూ ఉన్నాడు.
“ఇళ్ళు తాళాలు వేసుకుపోవాల! వర్షం తగ్గేనాటికి ఇంట్లోకి కప్పలు, మండ్ర కప్పలు వచ్చి చేరిపోతాయి ప్రతి సారీను. ఇది వాటికి రివాజు. చెప్పాలంటే మనకే కాదు ఈ పల్లిపాలెంలో నివసిస్తున్న ప్రతి పూరి గుడిసెకు ఇది రివాజు అయిపోయింది.”
“ప్రతి పూరి గుడిసె అంటే ఈ పల్లెటూరులో ఎన్ని పక్కా బిల్డింగులు ఉన్నాయి కనుక. చిన్న చినుకు పడిందంటే అంతా చిందరవందరేను.”
“భోజనానికి కూడ వచ్చేయి అన్నయ్యా! ఇంత వర్షంలో నువ్వేమి చేయి కాల్చుకుంటావు చెప్పు! మాతో బాటు నువ్వును” నటరాజు కాదనలేదు. భార్య ఉత్తిపుణ్యాన తన మీద అలిగి పుట్టింటి బాట పట్టిన ప్రతిసారీ ఈమె మరో డొక్కా సీతమ్మలాగ అవతారం ఎత్తుతూనే ఉంది. అదే మండోదరి కాస్తా అన్నంపెట్టే అన్నపూర్ణగా మారుతూనే ఉంది.
సుగుణ రావు అలాగ ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రపంచం అంతా ఎంతో ఎదిగిపోతున్నా ఏ మాత్రం ఎదుగు బొదుగు లేకుండా పాత కాలాల తాలూకు జీవన ప్రమాణాలను గుర్తుకు తెస్తూనే ఉంది. ఈ పల్లెపాలేనికి సరి అయిన రోడ్లు లేవు. అన్నీ మట్టి రోడ్లు, కరెంటు వసతి అంతంత మాత్రంగా ఉంది. ఊరిలో హాస్పటల్ సౌకర్యం లేదు.
ఎవరికయినా అనారోగ్యం చేసిందంటే కాలువలు దాటి పట్నానికి హాస్పటల్‍కి పోవాల్సి ఉంది. లోతట్టు ప్రాంతం. చుట్టూరా పారుతూన్న కాలువలు పొంగినాయంటే కొన్ని గంటల్లో ఊరు మునిగిపోతుంది. పోనీ ఉన్నతాధికారులు ఉన్నారా అంటే, ఎవరూ ఇటు వైపు చూసిన పాపాన పోవడం లేదు.
పల్లెపాలెంకు ఆనుకొని ఉన్న రాజుల చావిడి, చవట వీధి, జంగిలి పేట గ్రామాల పరిస్థితి కూడ ఇలాగే ఉంటుంది. అతివృష్టి, అనావృష్టిలు ఇక్కడ రివాజుగా వస్తోంది. సన్నకారు రైతులకు తీవ్రమైన అసౌకర్యాన్ని అలజడిని నింపుతూన్న పరిస్థితులు ఇక్కడ నెలకొని తిన్నాయి. దానితో ఊరిలో ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు ఎక్కువవుతూ ఉన్నాయి.
సుగుణ రావు ఊరిలో సన్నకారు రైతు, కష్టపడ్డాడు. సెంటు భూమి లేని వాడు చెమటోడ్చి రెండు ఎకరాల మాగాణికి ఈనాడు ఆసామి అయ్యాడు.
“ఈ పూరి పాకను పీకి పారేసి పక్కా డాబా వేసేయవయ్యా!”
“నేను ఐదెకరాల భూమికి ఆసామి నవ్వాల! అప్పటిదాకా ఈ మట్టి కొంప నీకు తప్పదు!!” ఆ మాటను ఐదు సంవత్సరాల నుండి అంటూనే ఉన్నాడు. కానీ అంగుళం ముందుకు కదలడం లేదు సరికదా ఐదు అంగుళాల మేర వెనక్కి జరిగిపోతూ ఉంది. ప్రతి యేటా ఈ ప్రాంతం తాలూకు అతి అనావృష్టి పోకడ ఇక్కడ సమాజపు జీవన ప్రమాణాలను విచ్ఛిన్నం చేస్తూనే ఉంది.
కానీ దారుణం ఏమిటంటే రోడ్లు లేవు. అటు ఇటు కాలువల మీద వంతెనలు కట్టలేదు. పిల్లలు చదువుల కోసం ప్రక్క ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా బల్లకట్టును దాటి పోవాల్సిన దుస్థితి నెలకొని ఉంది అక్కడ.
ఎందరో రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చిపోతున్నారు. ఎన్నో పార్టీల వారు ఎన్నికలప్పుడు ఊరికి అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఎన్నో హామీలను గుప్పించిపోతున్నారు. తరువాత కాలంలో మూలపడి పోయినా, ఎన్నో ఏళ్ళుగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని ఊర్లను అలాగే వదిలి పారేస్తు ఉన్నారు.
ముఖ్యంగా లోతట్టు ముంపు ప్రాంతాలు, కాలువలపై వంతనాలు నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలన్న ఆలోచనను కూడ చేయకపోవడం దారుణంగా అన్పిస్తూ ఉంది.
ఇక్కడి ప్రాంత ప్రజలు తమ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశిస్తూనే ఉన్నారు. ప్రపంచంతో సరిసమానంగా తమ ప్రాంతము విరాజిల్లాలని ఆశిస్తూ ఉన్నారు.
ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన చంగల్రాయుడు గారు చూసి బాగానే స్పందించారు. ఊరికి వంతెనలతో సహా రోడ్లు, ఇతర కనీస వసతులు అన్నింటినీ మంత్రివర్గంలో చర్చించి తగు నిర్ణయాలను తీసుకుంటామని హామీ ఇచ్చిపోయారు.
చంగల్రాయుడు గారు రాజకీయంగా చాల గొప్ప స్థాయిలో ఉన్న నాయకుడు. ఆయన ఇచ్చిన భరోసాతో ఆ ఊర్లన్నీ ఉప్పొంగిపోతూ ఉన్నాయి. తమ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్లే భావిస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ళూ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోక నీటి పాయల మధ్య ఓ చిన్న ద్వీపకల్పంగా వెలివేసి ఓ ప్రక్కకు విసిరేసినట్లుగా ఉన్న గ్రామీణ ప్రాంతానికి మంచి రోజులు వస్తున్నట్లు కలలు కంటూనే ఉన్నారు.
సుగుణ రావుకి ఇదేమీ పెద్ద వింతగా అన్పించడం లేదు! గతంలో తాము ఊరికి సంబంధించి ఎన్నో వాగ్దానాలు చూశారు. ఏది కార్యరూపం దాల్చింది లేదు. ఆ పరంపరలోనే చంగల్రాయుడు గారు విచ్చేసి గ్రామ పునరుద్ధరణకు ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోతూ ఉన్నాయి.
ఈ గ్రామాలలో ఉన్న అనేక అసౌకర్యాల కారణంగా పట్టణాల వైపు వలసలు కూడ ఎక్కువయి పోతూ ఉన్నాయి.
ప్రపంచమంతా చైతన్యమై ప్రగతి పథం వైపుకు నడకలు వేస్తుంటే పల్లెపాలెం, రాజుల చావిడి, చవట వీధి, జంగిలి పేట ఇచ్చాది లోతట్టు ప్రాంతాలు ‘విధివంచితులు’గా మారి అక్కరకు రాకుండా మిగులుతూ ఉన్నాయి.
***
కాలం ఒక్కసారిగా పోటెత్తడం అంటే ఇదేనేమో! ఆ శోకపూరిత సందర్భం ఉన్నట్టుండి ఆ లోతట్టు ప్రాంత రూపురేఖల్ని సమూలంగా మార్చి పారేస్తూ ఉంది. ప్రపంచం తాలూకు దృష్టికోణమంతా ఈ పల్లె ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమై ఉంది ఇప్పుడు.
రాష్ట్ర గౌరవ ముఖ్యవర్యులు, ప్రజానీకం పట్ల అత్యంత బాధ్యతాయుతంగా తమ పాలనా విధాలను రూపొందించిన మహనీయులు శ్రీమాన్ చంగల్రాయుడు గారు ప్రయాణిస్తూన్న హెలికాప్టర్ వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదానికి లోనయిపోయింది.
అది హఠాత్తుగా పల్లెపాలెం గ్రామ శివార్లలో కూలిపోయింది. అంతే హెలికాఫ్టర్ నడుపుతున్న పైలట్, చంగల్రాయుడు ఇతర సిబ్బంది ఒక్కరూ మిగలకుండా అందరూ దుర్మరణం పాలైపోయారు.
ఆ సంఘటన యావత్ రాష్ట్రం మాత్రమే గాక దేశాన్ని కూడ ఉలిక్కిపడేలా చేసింది. పల్లెపాలెం గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది.
ప్రజాభిమానం మెండుగా ఉన్న జననేత ఇలా హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడం ప్రజలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ‘చంగల్రాయుడు మహానేత.. ప్రజోపకరమైన ఎన్నో పథకాలను కార్యాచరణలోనికి తెచ్చిన మహనీయుడు’ అంటూ ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
క్రితం సారి పర్యటనకు వచ్చినప్పుడు చంగల్రాయుడు గారికి తమ ప్రాంతపు కనీస అవసరాలను తీర్చాలని వినతి పత్రం సమర్పించి విన్నవించుకున్నారు. కానీ అవి ఏవీ అమలు కాలేదు. కానీ ఇప్పుడు అంతటి గొప్ప నాయకుడు తమ ఊరిలోనే దుర్మరణం పాలవడంతో ఆ గ్రామీణ ప్రాంమంతా చలించిపోతూ ఉంది.
అప్పటి నుండి ఆ మహానాయకుడు చనిపోయిన ప్రాంతాన్ని చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, సామాన్య ప్రజానీకం పల్లెపాలెం వైపుకు పోటెత్తుతున్నారు.
ఎప్పుడూ లేనిది, కలలో కూడ ఊహించని విధంగా ఓ దుర్ఘటన కారణంగా కలవరపడిన కాలం ప్రజల మదిలో నిరంతరం కొలువుదీరుతూ ఉంది.
నిత్యం ప్రజలు ఈ గ్రామానికి ‘క్యూ’ కడుతున్నారు. వారి కోసమని, ప్రజల సౌకర్యం కోసమంటూ కాలువలపై గొప్ప వంతెనలు నిర్మించడానికి వెంటనే తీర్మానాలు జరిగిపోయాయి.
వెను వెంటనే పనులు ప్రారంభమయి పోతున్నాయి. మట్టి రోడ్ల స్థానంలో యుద్ధ ప్రాతిపదికన సిమెంట్ రోడ్లు వేయబడుతున్నాయి. పనికి రాని విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరింపబడటంతో ఊరు ఊరంతా వెలుగు జిలుగులతో మెరిసిపోతూంది. రాష్ట్ర నేత చెంగల్రాయుడు గారు మరణించిన చోట గొప్ప స్మృతివనం నిర్మించాలని అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది. దానితో ఒక్కసారిగా ఈ ఊరు రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, కొత్తగా నిర్మింపబడుతూ ఉన్నాయి. ‘సృతివనం’ చూడ్డానికి నిరంతరం ప్రజానీకం పల్లెపాలెంకు తరలి వస్తూనే ఉన్నారు.
లోతట్టు ప్రాంతాలను పూడ్చి తీరువుగా తయారు చేస్తున్నారు. కాలువలు పొంగిపోయి స్మృతివనాన్ని ముంచెత్తి పారేయకుండా మొత్తం ప్రాంతాన్ని ఆధునీకరిస్తూ ఉన్నారు.
పల్లెపాలెం ప్రాంతం ఇక మునిగిపోకుండా ఉండటానికి కాలువల్లో పూడికలు తీయించి, గట్టులను పటిష్టపరుస్తూ ఉన్నారు. క్రమంగా అక్కడ భూముల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చేస్తున్నాయి. చెంగల్రాయుడు గారి స్మృతివనం గొప్ప పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతూ ఉంది. ఇంతకు ముందు ప్రక్క ఊర్లను, పట్టణాలకు వలసపోయిన ప్రజానీకం తిరిగి తమ ప్రాంతాలకు చేరుకొని అక్కడ తమకు తగిన వ్యాపారాలను కొనసాగిస్తూ ఉన్నారు.
హోటళ్ళు, కాటేజీలు, రెస్టారెంట్లు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వం కూడ పల్లెపాలెం ప్రాంతం జాతీయ స్థాయిలో గొప్ప పిక్నిక్ స్పాట్‌గా విరాజిల్లగలదని ప్రకటనలు గుప్పిస్తూ ఉంది. అక్కడివారు ‘ఆశించిన కల’ విస్తృతమవుతూ ఉంది! ఆ ఊరు స్థాయిని ఆకాశానికి ఎత్తేలా చేస్తోంది!!
ఇక రాష్ట్రంలోని నలుమూలల నుండి బడా నాయకులు అక్కడ భూములు కొనుగోళ్ళుకు ముందుకు రావడంతో అభివృద్ధి ఊపందుకుంటోంది.
ఆశ్చర్యంగా ఉంది. చెంగల్రాయుడు గారి దుర్మరణం పుణ్యమా అంటూ వరద నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రాంతం పచ్చదనంతో పరిఢవిల్లుతూ ఉంది.
ఈ మార్పులన్నీ సుగుణ రావును, పల్లెపాలెంలోని అనేక సుగుణ రావులను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంది. మొత్తానికి ఒక మహనీయుని ‘చావు’ తమకు అంతులేని సంతృప్తినీ ఆనందాన్ని అంతర్లీనంగా పంచి ఇస్తూ ఉంది!
ఇన్నాళ్ళూ ఆశించిన ఊరితాలూకు వైభవం పాలవన్నెలాగ తరలి వచ్చి ప్రజానీకాన్ని మైమరచిపోయేలా చేస్తోంది!
అదే ఓ మహనీయుని జీవన క్రతువు సాక్షిగా ఇప్పుడు తదేకమైన ఊరు ఉరకలు వేస్తూనే ఉంది.