[బాలబాలికల కోసం ‘పాము కాళ్లు పాముకే ఎరుక!’ అనే కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]
అనగా అనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఒకరోజు సాయంత్రం వేళ ఆ ఊరి రచ్చబండ దగ్గర మురళి, అతని మనవడు జున్నుబాబు, స్నేహితుడు వెంకన్న కూర్చున్నారు. వెంకన్న క్రితం రోజు ఊరిలో జరిగిన దొంగతనం గురించి, పోలీసులు పాత నేరస్థుల సాయంతో అసలు దొంగను ఎంత చాకచక్యంగా పట్టుకున్నారో వివరిస్తున్నాడు. మురళి, జున్నుబాబు ఆ మాటలను చాలా ఆసక్తిగా వింటున్నారు.
వెంకన్న మాటలు ముగిశాక మురళి ఇలా అన్నాడు.. “చూడు వెంకన్నా! దొంగతనం జరిగిన తీరును బట్టి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ణయానికి వస్తారు. ఆపై దొంగలను పట్టుకోవడానికి పాత నేరస్థుల సాయం తీసుకుంటారు. ఎందుకంటే, వక్ర మార్గంలో వెళ్లేవారి ఎత్తుగడలు అదే బాటలో నడిచేవారికి బాగా తెలుస్తాయి. ‘పాము కాళ్లు పాముకే ఎరుక’ అన్న సామెత పుట్టింది అందుకే!”
తాతయ్య మాట వినగానే జున్నుబాబుకు ఒక సందేహం వచ్చింది. “తాతయ్యా! పాముకు కాళ్లు ఉండవు కదా.. మరి పాము కాళ్లు పాముకే తెలుస్తాయని ఎందుకు అంటారు?” అని అమాయకంగా అడిగాడు.
తాతయ్య జున్ను తల నిమిరి, “నీ సందేహం బాగుంది జున్నూ! నిజానికి పాముకు కాళ్లు ఉండవు. కానీ అది వెళ్లే దారిలో ఏర్పడే గుర్తులను (నడకను) మరో పాము మాత్రమే పసిగట్టగలదు. అలాగే ఒక రంగంలో ఉన్నవారి రహస్యాలు లేదా మెళకువలు అదే రంగంలో ఉండేవారికి త్వరగా అర్థమవుతాయి. దీని వెనుక రామాయణ, భారత గాథలు కూడా ఉన్నాయి” అంటూ వివరించసాగాడు.
“రామాయణంలో హనుమంతుడు అశోకవనంలో సీతమ్మను కలిసి వెళ్లాక, రాక్షస స్త్రీలు ఆమెను చుట్టుముట్టారు. ‘ఆ వానరుడు ఎవరో నీకు తెలుసు, నిజం చెప్పు!’ అని ఆమెను వేధించారు. అప్పుడు సీతమ్మ.. ‘నాకేం తెలుసు? రకరకాల రూపాల్లో తిరగడం మీకే అలవాటు. ఆ మాయలు మీకే తెలియాలి’ అని బదులిచ్చింది. అంటే, మాయావుల రహస్యాలు మాయావులకే తెలుస్తాయని ఆమె పరోక్షంగా హెచ్చరించింది.”
“అలాగే మహాభారతంలో.. పాండవులను ‘లక్క ఇంట్లో’ దహనం చేయాలని ధృతరాష్ట్రుడు ఒక కుట్ర పన్నాడు. ఆ వక్రబుద్ధి ఇతరులెవరికీ అర్థం కాలేదు. కానీ, మహా మేధావి అయిన విదురుడు ఆ కుట్రను ముందే పసిగట్టాడు. పాము నడకను పామే గుర్తుపట్టినట్లు, ధృతరాష్ట్రుడి దుర్బుద్ధిని విదురుడు కనిపెట్టి పాండవులను రక్షించాడు.” అని ముగించారు తాతయ్య.
“అర్థమైంది తాతయ్యా! చెడ్డవారి ఆలోచనా విధానం చెడ్డవారికే తెలుస్తుంది. అలాగే ఒక విద్యలోని లోతుపాతులు ఆ విద్య తెలిసిన వారికే అర్థమవుతాయని దీని భావం అన్నమాట!” అని జున్నుబాబు ఉత్సాహంగా అన్నాడు. మనవడి తెలివికి, గ్రహింపు శక్తికి తాతయ్య ఎంతో మురిసిపోయాడు.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
