[వేలూరి శారద గారు రచించిన ‘పాపం.. మాధురి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
సిటీలో ప్రసిద్ధి చెందిన ‘పద్మజ మ్యారేజ్ బ్యూరో’ ముందు కాదు ఆగింది.
కారుతోంచి గిరిజ, శ్రీనివాస్ దిగారు. నల్లటి బోర్డు మీద బంగారపు రంగు అక్షరాలతో నేమ్ బోర్డు మెరిసిపోతోంది.
“బోర్డు బానే ఉంది ఎటువంటి సంబంధం తీసుకువస్తారో” స్వగతంగా అనుకుంది గిరిజ.
“వీళ్ళు తీసుకువచ్చిన సంబంధాలు అన్ని సక్సెస్ అయ్యాయిట, నా ఫ్రెండు వేణు చెప్పాడు. వాడు చెప్పబట్టే ఇక్కడికి వచ్చాను. వాళ్ళ చుట్టాలు అందరూ ఈ మ్యారేజ్ బ్యూరోకే వస్తారుట, మంచి మంచి సంబంధాలు తీసుకొస్తారుట” అన్నాడు శ్రీనివాస్ భార్య గిరిజతో.
శ్రీనివాస్ ఏజీ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. గిరిజ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది.
వాళ్లకి ఒక్కతే కూతురు శృతి. శృతి బీటెక్ పాసై ఒక ఎం.ఎన్.సి. లో పనిచేస్తోంది.
శృతికి ఉద్యోగం వచ్చిన వెంటనే గిరిజ పెళ్లి చేద్దామనుకుంది. కానీ శృతి ఒప్పుకోలేదు. చూస్తుండగానే 29 ఏళ్లు వచ్చేసాయి. ఇప్పటికైనా పెళ్లి చేయకపోతే మరీ గొంతెమ్మ కోరికలు ఎక్కువ అవుతాయని గిరిజా శ్రీనివాస్ ఇద్దరూ ఆలోచించుకుని శ్రీనివాస్ ఫ్రెండ్ సలహా మేరకు ఇక్కడికి వచ్చారు.
శృతి ముందే చెప్పింది, “తనకి 20 లక్షల ప్యాకేజీ వస్తుందని. 20 లక్షల పైన వచ్చే సంబంధమే చూడమని”.
“ఎందుకే ఇద్దరూ టాక్స్‌లు కట్టుకోవడానికి కాకపోతే. మంచి సంబంధం అయి, మనకి అన్ని విధాలా సరిపోతే రెండు లక్షలు తక్కువ అయితే తప్పా!” అని మందలించింది గిరిజ.
“లేదు మమ్మీ! నా ఫ్రెండ్స్ ముందు నాకు చిన్నతనంగా ఉంటుంది” అంది శృతి.
శృతి మరీ అందగత్తె కాదు. సన్నగా తెల్లగా ఉంటుంది కానీ, పొట్టి. దాంతో కొన్ని సంబంధాలు కుదరట్లేదు.
పూర్వకాలం పెళ్లి అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవారు. ఇప్పుడు ప్యాకేజీ ఎంత? అత్తమామలు వద్దు, విడిగా ఉండాలి. వంట వచ్చిన మగాడై ఉండాలి. ఇవి కోరికలు.
శృతి కూడా దీనికి మినహాయింపు కాదు. కానీ గిరిజే ఎప్పటికప్పుడు శృతికి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది.
***
ఆలోచనల నుంచి తెప్పరిల్లి లోపలికి అడుగు పెట్టారు ఇద్దరు. రెడ్ కలర్ తివాచీ పరిచి పెద్ద హాలు, దాంట్లో వరుసగా కుర్చీలు, హాలును అనుకుని లోపల ఒక రూమ్, దాంట్లో పెద్ద టేబుల్, టేబుల్ మీద లాప్టాప్, ఓ పక్కగా ఫైళ్ళు, టేబుల్‌కి ఎదురుగుండా రెండు నీల్కమల్ కుర్చీలు. టేబుల్‌కి ఒక వైపున ఆఫీసు ఛైర్. దాంట్లో మాధురి కూర్చుని తనే ఈ బ్యూరో అంతా చూసుకుంటుంది. తెల్లగా, అందంగా పాలరాతి శిల్పంలా ఉంది.
తను చూసిన ఏ సంబంధాల వాళ్లు ఇంతవరకు గొడవలు పడలేదు. అందరూ ఎంతో అన్యోన్యంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఈ బ్యూరో ఓనర్ శ్రీకాంత్.
శ్రీకాంత్‌కి ఎన్నో బిజినెస్‌లు ఉన్నాయి. అవన్నీ తనే చూసుకుంటాడు. ఈ మ్యారేజ్ బ్యూరో మాత్రం మాధురి చూసుకుంటుంది. తను చూసి ఫిక్స్ చేసిన సంబంధాలన్నీ సక్సెస్ అవడంతో శ్రీకాంత్ పూర్తిగా మాధురి మీద వదిలేశాడు. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్తాడు.
గదిలోకి అడుగు పెట్టారు గిరిజ, శ్రీనివాస్. మాధురి వారిని సాదరంగా ఆహ్వానించి, “రండి మేడం! అబ్బాయికా! అమ్మాయికా! ఎవరికి సంబంధం కావాలి?” అంటూ మంచి కలుపుగోలుగా మాట్లాడింది.
“మా అమ్మాయికేనమ్మా! దానికే సంబంధం కావాలి. ఇదిగో వివరాలన్నీ తీసుకొచ్చాను.” అంటూ, “ఏవండీ! అమ్మాయి ఫోటో, డిటెయిల్స్ చూపించండి”అంది గిరిజ శ్రీనివాస్‌తో.
వివరాలన్నీ చూసిన మాధురి ఒక అప్లికేషన్ ఫారం ఇచ్చి పూర్తి చేయమంది. అన్ని పూర్తి చేసిన తర్వాత మాధురితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ – “పెళ్లి అంటే ఓర్పు, సహనం, క్షమాగుణం, నమ్మకం సర్దుకుపోయే తత్వం.. ఇద్దరిలోనూ ఉండాలి. అన్నీ ఉంటేనే ఆ పెళ్లి నూరేళ్లు ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కాపురం నిత్యం గొడవలతోటే ఉంటుంది.
మా కాలంలో పెళ్లిళ్లు అయినా, ఏ పొరపచ్చాలు ఉంటే పెద్దవాళ్లు నచ్చ చెబితే వినేవారు. ఇప్పుడు అది లేదు. కాపురం నిలబెట్టుకోవాలని ఎవరూ అనుకోవట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. మా అమ్మాయికి మాత్రం నేను ముందే చెప్పాను, తెగేదాకా లాగకూడదు, ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గాలి. అవతలి వాళ్ళ కోపం పోయిన తర్వాత విధానంగా మాట్లాడుకోవాలి అని” అంది గిరిజ.
“శభాష్ మేడం! మీలాంటి తల్లులు ఉంటే పెళ్లిళ్లు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు పేరెంట్సే మా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది, ఎందుకు తగ్గాలి అనుకుంటున్నారు..” అని, “సరే మేడం మీ అమ్మాయికి మంచి మ్యాచ్ చూసి మీకు ఫోన్ చేస్తాను” అంది మాధురి.
***
సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్‌కి వచ్చి, “మాధురికి మనం సెట్ చేసి, కుదిర్చిన రావు గారి అమ్మాయి పెళ్లి పెటాకులయ్యేలా ఉంది, ఇప్పుడు రావు గారు కంప్లయింట్ చేశాడు. ‘మీరు అన్ని విధాల మంచిది అంటేనే పెళ్లికి ఒప్పుకున్నాం, పైగా జాతకాలు కూడా కుదిరాయి. కానీ మా అమ్మాయికి అల్లుడికి పడట్లేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పుడేం చేయమంటారు?’ అంటున్నాడు” అన్నాడు శ్రీకాంత్.
“ఎందుకు గొడవ అయిందిట? కారణం ఏమిటో చెప్పారా? అయినా ఇద్దరు ముందు మాట్లాడుకున్నారు కదా!” అడిగింది మాధురి.
“పెళ్ళికాని క్రితం ప్రేమికులు, కళ్ళు ప్రేమతో మూసుకుపోతాయి. భార్యాభర్తల అయిన తర్వాత కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే కళ్ళు క్లియర్ అయినట్టుగా తప్పులన్నీ బయటపడతాయి. అసలు విషయం ఏంటంటే ఈ అబ్బాయి పెళ్ళికి ముందు ఓ ‘ఎన్జిఓ’లో పనిచేసేవాడుట.
జాలి, దయ ఎక్కువ. ఒకసారి వీళ్ళు సినిమా ప్రోగ్రాం పెట్టుకుంటే రోడ్డుమీద ఎవరికో యాక్సిడెంట్ అయిందని.. వాళ్లని హాస్పటల్‌కి తీసుకువెళ్లి జాయిన్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి సినిమా టైమ్ దాటిపోయిందిట, ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ అమ్మాయికి ఏమో తను, తన భర్త ఇదే ప్రపంచంగా ఉండాలనుకుంటోంది. అతనేమో ఈ విశాల ప్రపంచంలోని జనాలు అందరూ తన బంధువులే అనుకుంటున్నాడు. అక్కడే వచ్చింది. ఇద్దరికీ గొడవ.” అన్నాడు శ్రీకాంత్.
మాధురి సాలోచనగా చూసి, “సార్ ఒక ఐడియా! ఇంత క్రితం ఒక మేడం వాళ్ళ అమ్మాయి కోసం అని సంబంధానికి వచ్చారు. ఆవిడ మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నారు. పెళ్లిళ్ల గురించి ఎంతో బాగా మాట్లాడారు. ఆవిడ మాటలు వింటే ఎవరికీ భవిష్యత్తులో విడిపోవాలి, విడాకులు తీసుకోవాలని అనిపించదు. అందుకని ఆవిడని పిలిపిద్దాం! మీరు ముందు రావు గారితో చెప్పి వాళ్ళ అమ్మాయిని, అల్లుడిని తీసుకుని రమ్మనండి. నేను గిరిజ గారికి ఫోన్ చేసి ఆవిడని రమ్మంటాను. ఆవిడ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు కొంతైనా మారవచ్చు కదా!” అంది మాధురి.
“ఈ ఐడియా బానే ఉంది కానీ, వాళ్ళు ఏమైనా అనుకుంటారంటావా!” అన్నాడు సంశయంగా.
“అబ్బే అదేం లేదు. మీరు ముందు వాళ్ళని పిలవండి, నేను గిరిజ మేడంని పిలుస్తాను. ఎవరైనా భార్యాభర్తలు కలిపి ఉండాలనే అనుకుంటారు కదా!” అంటూ మాధురి గిరిజకి ఫోన్ చేసి విషయం చెప్పింది..
గిరిజ నవ్వి, “నేను చెప్తే వింటారంటావా! అయినా వాళ్లు మీరెవరు మాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అంటారేమో!” అంది గిరిజ.
“లేదు మేడం! నేను వాళ్లకి చెప్తాను, మీరు మా మ్యారేజ్ బ్యూరో కౌన్సిలర్ అని, మీరు రేవు రండి” అంది మాధురి.
మర్నాడు రావు గారి అమ్మాయి, అల్లుడు బ్యూరోకి వచ్చారు. అప్పటికే గిరిజ వచ్చింది. విషయం అంతా తెలుసుకుంది.
గిరిజ ఆ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకుని, విషయం అంతా రాబట్టింది. ఆ అమ్మాయి చేతిని చాలా చేతిలోకి తీసుకుని, “చూడు లయా! పెళ్లి అంటే రెండు కుటుంబాలకి సంబంధించింది. మీ అమ్మానాన్న గార్లు నువ్వు సంతోషంగా ఉంటావని పెళ్లి చేశారు. ఆ అబ్బాయికి కూడా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మానవత్వం ఉన్న మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మీ అయిన కూడా ప్రవర్తించాడు. నువ్వు ఒకసారి ఊహించు, అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తి స్థానంలో మీవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఎవ్వరూ పట్టించుకోకుండా రక్తస్రావం జరిగి, అపస్మారక స్థితికి వెళ్లారు అనుకో.. నువ్వు ఊహించుకోగలవా! ఊహూ.. మన ఊహకి కూడా వద్దు.”
“ఇప్పుడు మీ ఆయన రవి దగ్గరికి వద్దాం యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయబట్టే కదా, ఒక నిండు ప్రాణం కాపాడగలిగాడు. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉంది. ఆ ఇల్లాలు రోజు దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఆ ఇంటి దీపాన్ని కాపాడిన మీ ఆయన్ని కూడా తలుచుకుని దేవుడా! కుటుంబంతో పాటు ఆయన్ని కూడా చల్లగా చూడు అనుకుంటుంది, అటువంటి వాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ రక్షగా ఉంటాయి..
ఇక బయటికి వెళ్లే ప్రోగ్రాం అంటావా ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వెళ్తావ్. ఈ రోజుల్లో మీ ఆయనలా ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరిని చూసినా ఫోన్లో వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టడం తప్ప సహాయానికి ఎవ్వరూ ముందుకు రారు. అంత మంచి వ్యక్తిని భర్తగా దొరికినందుకు సంతోషించు తల్లి” అంటూ ముగించింది గిరిజ.
తర్వాత రవిని పిలిచి, “రవి ముందుగా కంగ్రాట్యులేషన్స్! ఎందుకంటే ఈ రోజుల్లో కూడా నీలా పరోపకారం చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కడ చూసినా నేను, నా ప్రపంచం అనుకునేవాళ్లే. ఇక పాయింట్లోకి వస్తాను. నువ్వు అనుకున్న టైమ్‌కి ఇంటికి చేరలేకపోతే ఆ కారణం ఫోన్ చేసి నీ భార్యకి చెప్పు, రెండోది నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు. వాళ్లు కృతజ్ఞతగా ఇప్పటికి నీకు ఫోన్లు చేస్తున్నారు కదా! వాళ్ళ ఇళ్ళకి నీ భార్యని తీసుకువెళ్ళు, వాళ్లు ఆ సంతోషాన్ని నీ భార్యతో పంచుకుంటే, నీ గొప్పతనం, నువ్వు చేసిన మంచి పని ఏమిటో ఆమెకు అర్థం అవుతుంది. అప్పటికి ఆమె మారుతుంది. అప్పుడు తనకి కూడా ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథం ఏర్పడుతుంది. ఆల్ ద బెస్ట్” అంటూ ముగించింది గిరిజ.
కొద్ది క్షణాల తర్వాత లయ, రవి చెయ్యి పట్టుకుని బయటకు వచ్చారు. లయ కృతజ్ఞత నిండిన కళ్ళతో గిరిజకేసి చూసి కాళ్ళకి దండం పెట్టింది. “ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉండండి” అంటూ ఆశీర్వదించి పంపించింది గిరిజ.
“మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే మీ ప్రతిభ తెలిసింది. థాంక్యూ మేడం! మాకు ఎప్పుడైనా అవసరం అయినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను ఏమీ అనుకోరుగా!” అంది మాధురి,
“దానికి ఏం భాగ్యం అలాగే వస్తాను! నా చేతనైనా సహాయం చేస్తాను. నా వలన ఒక దంపతులు కలిసి ఉంటారు అంటే అంతకంటే కావాల్సిందేముంది? ఇంతకీ మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావా లేదా?” అంది గిరిజ నవ్వుతూ.
“ఆ పనిలోనే ఉన్నాను మేడం” అంది మాధురి.
***
సాయంత్రం ఆఫీసుకు వచ్చిన శ్రీకాంత్‌తో “సార్! రావు గారి అమ్మాయి మ్యాటర్ క్లియర్ అయిపోయింది సార్! వాళ్లు హాయిగా చెట్టపట్టాలేసుకొని వెళ్ళిపోయారు. మనం ఒక పని చేద్దాం! ఈసారి అప్లికేషన్లో ఒక కాలమ్ కొత్తగా యాడ్ చేద్దాం. అదేంటంటే, ‘మీరు ఇదివరకు ఎప్పుడేనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారా? ఇతరులకి అత్యవసర పరిస్థితి ఏర్పడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు వేరే పని మీద అర్జెంటుగా వెళ్ళవలసి వస్తే అప్పుడు ఎవరికెనా ఆపద ఏర్పడితే మీరు దేనికి అటెండ్ అవుతారు?’ అని పెడదాం సార్! అప్పుడు వాళ్లు ‘పరోపకారి పాపన్న’లో కాదో తెలిసిపోతుంది. అప్పుడు ఇద్దరి మనస్తత్వానికి మ్యాచ్ అయితేనే ఆ సంబంధం సెట్ చేద్దాం. ఎలా ఉంది నా ఐడియా?” అంది మాధురి.
శ్రీకాంత్ కళ్ళు మెరిసాయి.
“వెరీ గుడ్!! నీ తెలివితేటలకు నా జోహార్లు! నీ వల్లే ఈ మ్యారేజ్ బ్యూరో ఎంత మంచి పేరు తెచ్చుకుంది. ఎంత మంచి మంచి సంబంధాలు కుదురుస్తున్నావు అందరికీ, థాంక్యూ మాధురి” అంటూ సంతోషంతో మాధురి చెయ్యి పట్టుకుని ఊపేశాడు. మాధురి సిగ్గుపడింది.
***
మాధురి మనసంతా సంతోషంతో నిండిపోయింది. ‘నేను ఎంతోమందికి సంబంధాలు కుదురుస్తున్నాను, ఎన్నో పెళ్లిళ్లు చేస్తున్నాను, నాకు ఏం తక్కువ? అందం, తెలివితేటలు ఉన్నాయి. నాకు 30 ఏళ్లు వచ్చేస్తున్నాయి, ఇక నా పెళ్లి ఎప్పుడు? ఇన్ని సంబంధాలు చూడడంతో నా మనసు కూడా పెళ్లి వైపే మొగ్గు చూపుతోంది’ అనుకుని, “సార్ నాకు పెళ్లి ఎప్పుడు? నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకేం తక్కువ?” అడిగింది మాధురి శ్రీకాంత్‌ని.
“ఓహ్! మాధురి! నీకు పెళ్లా? నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు?” అంటూ పకపక నవ్వాడు.
శ్రీకాంత్ మాటలకి చిన్నబుచ్చుకుంది మాధురి.
“ఓ మాధురి! నువ్వు ఎవరో నీకు తెలియదు కదూ! నువ్వు ఒక ‘హ్యూమనాయిడ్’ రోబోవి, ఒక మర మనిషివి. నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు ‘మాధురి’, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎవరో! నువ్వు పెళ్లి సంబంధాలు కుదర్చడంతో నీ మనసు పెళ్లి వైపు మళ్ళింది.” అంటూ పకపక నవ్వాడు శ్రీకాంత్.
బిత్తరపోయి, అయోమయంలోకి వెళ్ళిపోయింది.. పాపం.. మాధురి.
