Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాతకొత్తలకు వారధి

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘పాతకొత్తలకు వారధి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నాటి ఆలోచనలకు అందమైన రూపమివ్వటానికి
నడుం బిగించాడో నాయకుడు
ఎవరి రూపకల్పనతో ఆకారం దాల్చిందో కదా
ఎందరి కలలకు నిలయమైనదో
ఎందరికి ఊపిరులూదిందో
పాతకొత్తలకు వారధిగా మారి
రెండూళ్ళను ఒకటిగా కలిపింది

ఉపాధికి మూలమైంది
ఎందరు శ్రమించారో
ఎన్ని ఊరేగింపులకు మూలస్థానమైందో
ఎన్ని రాజకీయపుటెత్తులను
ఎదుర్కొన్నదో
ఎన్నికోట్లమంది గమనానికి సాక్ష్యంగా నిలిచిందో కదా

ఎందరికి నీడనిచ్చి ఆశ్రయమిచ్చిందో
దానిపైన అడుగిడని
వాహనం లేదు
భారంగా పైకెక్కి వేగంగా కిందికి
జారుతూ పరుగులిడే ఆ మార్గం
నేర్చుకునే వారందరికీ
సవాలుగా నిలిచేది

అయినా భయంలేక
ఉత్సాహంగా సాగిపోయేవారు
మనిషికున్నట్లే దానికీ
వృధ్ధాప్యం దశవచ్చింది కాబోలు
అరవై ఐదేళ్ళకే శతవసంతాల
పండుగ జరుపుకుంటూ
కొత్త తరానికి కొంగ్రొత్త ఊపిరులూదుతూ
కళ్ళ ముందే కనుమరుగవుతున్నది

దశాబ్దాల చరితగల
అందమైన రహదారి మార్గం
అయినా పాతతరం గుండెలలో శంకర్ విలాస్
వారధి జ్ఞాపకాలెప్పుడూ
నిత్యనూతనమే
దాని స్మృతులెప్పుడూ పదిలమే
పాతకొత్తల వారధి
శంకర్ విలాస్ బ్రిడ్జి
నాటి నాయకుల మార్గదర్శనం
నేటి నాయకుల చొరవతో
కొత్త రూపాన్ని సంతరించుకుంటూ
రాకపోకల అంతరాయాన్ని
తొలగించే కొత్తదారి రూపుదిద్దుకుంటున్నది.

(గుంటూరులో జ్ఞాపకాల బ్రిడ్జి స్థానంలో కొత్తది రూపుదిద్దుకుంటున్న సందర్భంగా ఆ జ్ఞాపకాల గుర్తులివి. అదే శంకర్ విలాస్ బ్రిడ్జి)

Exit mobile version