[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘పదవీ విరమణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నేటితో
పదవీ కాలం ముగిసింది
ఉద్వేగభరితమై
హృదయ భారమై
అంతటా వెలితిని నింపి
ఒంటరిగా బయలుదేరాడు
రేపటి చెలిమి కోసం
క్రొత్తగా ఆరాటం మొదలైంది
ఘనంగా
సత్కారం జరిగింది
అన్నిటా ప్రశంసనీయుడై
పెక్కు సన్మానాంకితుడై
వ్యక్తిగత దూరాన్ని పెంచి
ఏకాంతంలోకి ప్రవేశించాడు
ప్రశాంతత కోసం
ఇప్పుడు తీరిక దొరికింది
అల్లుకున్న
స్నేహ బంధం చిన్నబోయింది
చిరస్మరణీయమై
చివరి జ్ఞాపకమై
బంధాలు అశాశ్వతమని ఎంచి
ఎడబాటుతో బోధిస్తున్నాడు
పరివర్తన కోసం
ఇన్నాళ్ళకు ఓపిక కుదిరింది