Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదిల కదంబం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శ్రీ రుద్ర గారి ‘పదిల కదంబం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రెండు రోజులనుంచీ హారిక ఫోన్ కాల్ రాకపోయేసరికి వెలితిగా, తోచకుండా ఉంది. మధ్యాహ్న భోజనం తరువాత నేను వెంటనే కునుకు తీయకుండా, కేంబ్రిడ్జిలో ఉంటున్న మా అమ్మాయి, ఒక అరగంట నాతో కబుర్లు చెప్పే సమయమిది.

సరే, ఇక నేనే ఫోన్ చేస్తాను అనుకుంటుండగా, అమ్మాయే ఫోన్ చేసింది. “ఏంటమ్మా ఎందుకు ఫోన్ చెయ్యలేదు” అని అడిగే లోపే, హారిక వాక్ప్రవాహం మొదలైంది.

“నాన్నా! అనుకోకుండా మొన్న మేము, మాకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న మిల్టన్ కంట్రీ పార్క్ వెళ్ళాము. ఈ పార్కులో చక్కటి డ్రైవిన్ కార్ సదుపాయం ఉంది. పొద్దున్నే మేము ఎనిమిదింటికే బయలుదేరి, పిక్నిక్ కోసం భోజనం, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాము.

ఈ పార్క్ చాలా బాగుంది. అత్తయ్య గారు, మావయ్య గారికి కూడా చాలా నచ్చింది. ఇక తన్మయ్ కూడా క్రిష్ణని, ‘నాన్నా ఇది చూడు, అది చూడు’ అంటూ పార్కులో ఒక చోట నిలువనీయలేదు. వాడు చూసే వీడియోలలో లాగా ఫిషింగ్ రాడ్ పట్టుకుని, తన్మయ్ వెంటనే చేపలు పట్టేద్దామనుకున్నాడు.

విశేషమేమిటంటే, ఈ పార్కులో చిన్న పిల్లల కోసం ‘పాండ్ డిప్పింగ్ సెషన్స్’ అని నిర్వహిస్తారు. దీనితో చిన్న పిల్లలకు అనుభవపూర్వకంగా చెరువు విశేషాలు, దాని లోపల ఉండే జీవజాలం గురించి చక్కగా తెలుస్తుంది. తన్మయ్ ఈ సెషన్‌లో చేరి చాలా తెలుసుకున్నాడు.

తన్మయ్‌కి చెరువు లోపల కనిపించిన ష్రిమ్ప్ అనబడే చిన్న రొయ్యలు చాలా ఆసక్తి కలిగించాయి. వాటి మీద ఉండే చుక్క లాంటి కళ్ళు, ఐదు జతల కాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ‘అమ్మా! వీటిని మన అక్వేరియంలో పెంచుకుందాము, వీటిని పట్టి తీసుకెళదాము’ అని తన్మయ్ సంబరపడ్డాడు.

ఇది విని, వీడి సెషన్ గైడ్ ‘హైక్! ష్రిమ్ప్స్ మిగతా చేపలతో పెంచలేము. ఎందుకంటే, మిగతా చేపలు వాటిని తినేస్తాయి’ అని చెప్పాడు. తన్మయ్‌కి దిగులేసింది ‘మరైతే ఎలా?’ అని గైడ్‌ని అడిగాడు. ఈ ష్రిమ్ప్స్‌కి మాత్రమే వేరే అక్వేరియం పెట్టుకోవాలన్నాడు గైడ్.

ఇక తన్మయ్ వాళ్ళ నాన్నని వదలడని, నేను వాడితో ‘ఒరేయ్! నేను రేపు సిద్దు తాతని అడిగి, ఎలా చెయ్యాలో చెబుతా’ అని సర్ది చెబితే అప్పటికి ఊరుకున్నాడు. పార్కులో ఉన్న మిగతా విశేషాలు చూసి, సరదాగా సాయంత్రం దాకా అక్కడే గడిపాము.

ఇక ఇవాళ పొద్దున వాడు స్కూల్‌కు వెళ్తూ, ‘అమ్మా! సిద్దూ తాతకి ఫోన్ చేసి నా ష్రిమ్ప్ అక్వేరియం గురించి అడుగు’ అని గుర్తు చేసాడు.

నాన్నా! నాకు గుర్తొచ్చింది నువ్వు కూడా ముంబైలో అసెటిస్ అనే ష్రిమ్ప్ మీద రీసెర్చ్ చేసావు కదా. నీ రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి నా చిన్నప్పుడు చెప్పడానికి నీకు తీరిక లేదు. బహుశా అప్పుడు చెప్పినా నాకు అర్థం అయ్యేది కాదేమో. రిటైర్ అయ్యాక ఇప్పుడు నీకు తీరిక ఉంది, అలాగే ఇప్పుడు నాకూ సమయం చిక్కింది. నీ పరిశోధన విచిత్రాలు, అలాగే అప్పటి నీ సెకండ్ హోమ్ బాంబే జీవితానుభవాలు, అనుభూతులు తెలుసుకోవాలని ఉంది. వీటన్నిటినీ కూర్చి ఒక కథ వ్రాయవూ ప్లీజ్” అని అడిగింది.

“హారికా! నా జీవిత కదంబం దేవుడెలా కూర్చాడో నాకు అర్థమవ్వట్లేదు. ఐనా, నా కథ ఏం చేసుకుంటావు! వీలైనప్పుడు చెప్తాలే” అన్నాను.

“నాన్నా! ఫీల్ సాఫీ కథ వ్రాయమంటే ఫిలాసఫీలోకి వెళ్తున్నావు. నీ కథ నా పిల్లలకు కూడా తెలియాలి కదా” అన్నది హారిక.

“ఏంటీ మిశ్ర చాట్ అమ్ము? కొంకర వేళ్ళ, కంకర పలుకుల రోకలి రాయుడు పాట విన్నావా ఏంటీ? ఐనా, నీ పిల్లలు పెద్దయ్యాక ఎలాగో తెలుగు మాట్లాడరు, చదువరుగా” అన్నాను నవ్వుతూ.

“ఓహ్ అదా! ఇప్పుడంతా ఫ్యూజన్ కాలం కదా నాన్నా. ఒక విషయం చెప్పనా! ఇదే మంచి తరుణం నాన్నా, నువ్వు కథలు వ్రాయటానికి. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలతో ఇక భాష సంబంధిత సమస్యలుండవు. మేము ఇండియాకి వచ్చినప్పుడు నీ గొంతు రికార్డు చేసి భద్రపరుస్తాము. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ టూల్స్ వాడి, నువ్వు నీ కథని తెలుగేంటి మరే భాషలో వ్రాసినా, దాన్ని తర్జుమా చేసి నీ స్వరంలో వింటాము. నీ రచనలు, అచ్చము నీ స్వరములో తరతరాలకు వినిపిస్తాము. సరేనా! ఇక వెంటనే మీ అమ్మాయికి నీ అమూల్య కతలు వ్రాసి పంపించు” అని గల గలా నవ్వుతూ ముగించింది హారిక .

“ఇదేదో బాగుందే! త్వరలోనే నా లాగా ఒక రోబో కూడా తయారు చేయించి పెట్టుకో. అందులో ఈ టెక్నాలజీ వాడితే, నీ ముందు బోల్డన్ని కథలు వాడే చెప్పేస్తాడు” అన్నాను.

“ఆ.. దటీస్ ఆసమ్! నువ్వు కూడా టెక్ సావీ అయిపోతున్నావు. ఇది కూడా త్వరలోనే సాధ్యపడేదే. ఇక ఆలస్యం చేయకుండా పని ప్రారంభించు నాన్నా” అని నవ్వింది హారిక.

“హారికా! గడిచిన శతాబ్ద కాలంలో, మా తరం వారి అనుభవాలు ప్రత్యేకం. మేము చూసిన టెక్నాలజీ, ఆహార, ఆహార్య, సాంప్రదాయ, వాతావరణ, జీవన శైలి మార్పులు ఖచ్చితంగా ఇంకే తరం అనుభవించి ఉండదు. నలభై సంవత్సరాల క్రితం నేను చదువుకునే కాలంలో ఇప్పటి టెక్నాలజీ గాడ్జెట్స్ ఏవీ లేవు. సెల్ ఫోన్ లేదు, డిజిటల్ కెమెరా లేదు. అప్పుడే బ్లాక్ అండ్ వైట్ టీవీ అనుభవం దేశంలో కొంచెం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాటి గురించి ప్రస్తావించబోను.

ఇరవై ఏళ్ళ వయస్సులో బాంబే వచ్చి నా గమ్యం నిర్ణయించుకోవడం, దానికి బాట ఏర్పరచుకోవడం, ముఖ్యంగా ఆ వయస్సులో ఎదురయ్యే ఆకర్షణలు, ప్రలోభాలు, సంఘర్షణలు, తెలుసుకోవలసిన సామాజిక ఆవశ్యకతలు, వ్యక్తిగతంగా ఇంకా కుటుంబపరంగా పాటించాల్సిన నైతిక బాధ్యతలు గురించినవెన్నో నీతో పంచుకోవచ్చును.

బాంబే నగరం ఉన్నతికి ఎన్ని అవకాశాలు కల్పించగలదో, అలాగే పతనానికి కూడా అంతే పరిస్థితులు అనుభవానికి తేగలదు. అందుకే ఈ మజిలీలో వీటన్నిటినీ దాటుకుంటూ నా పని సవ్యంగా పూర్తి చేసుకోగలగటం ఆ తరువాత నా ఉద్యోగ అవకాశాలకు, ఇంకా మనుష్యులను అర్థం చేసుకోవటానికి చాలా ఉపయోగపడింది.

సరే! ప్రస్తుతానికి నేను బాంబేలో గడిపిన మొదటి రెండు సంవత్సరాల గురించి వివరిస్తాను. తరువాయి సంవత్సరం గ్రాంట్ మెడికల్ కాలేజీలో నా డాక్టరేట్ పరిశోధన సమయ విశేషాలు గురించి మరింకెప్పుడైనా వ్రాస్తాను. అందరినీ అడిగానని చెప్పు. బై, టేక్ కేర్!” అని ఫోన్ సంభాషణ ముగించాను.

***

అది 1981వ సంవత్సరం. నా మిత్రుడు దాశరథి అయ్యంగార్ (దాష్) చొరవతో, నాన్న అంతులేని ప్రోత్సాహంతో, నేను బాంబేలో చదువుకోవడానికి వచ్చాను. నాన్న ఆరోగ్య రీత్యా, ఇంకా సికింద్రాబాద్ నుండి బాంబేకి వెళ్లి చదువుకోవడానికయ్యే వ్యయం గురించి నేను సంకోచిస్తున్న వేళ, నాన్న అస్సలు వెనకడుగు వెయ్యకుండా, నా భవిష్యత్తుకు మంచి బాట ఏర్పరిచారు.

“శ్రీధర్, బయటకి వెళ్లి జీవితం చూడాలి, రక రకాల మనుష్యుల గురించి తెలుసుకోవాలి. సికింద్రాబాద్ చెరువు నుంచి బాంబే సాగరానికి చేరి, అవకాశాలు పెంచుకుని అభివృద్ధి చెందాలి” అని నాన్న చెప్పిన మాటలు నా జీవితంలో పూర్తిగా సార్థకమయ్యాయి.

నలభై ఏళ్ళ క్రితం బాంబే ఒక ప్రత్యేకమైన నగరం. అలాగే, లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆశ్రయం. అప్పట్లో బాంబే యూనివర్సిటీ కూడా ఎన్నో కోర్సులు సౌకర్యంగా నిర్వహించేది. ఉదాహరణకి, నా హాస్టల్ రూమ్ మేట్ నిలోయ్ దాస్ ఉద్యోగం చేసుకుంటూ, మూడేళ్ళ న్యాయవాద పార్ట్ టైం డిగ్రీ చదివేవాడు.

నా ష్రిమ్ప్ పరిశోధన కథా కమామిషు వివరాలు చెప్పాలంటే, 1981వ సంవత్సరంలో నేను బాంబే యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ ప్రాజెక్ట్ కోసం, అంధేరిలో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (సి.ఐ.ఎఫ్.ఇ)లో, రీసెర్చ్ గైడ్ డాక్టర్ రామానంద రావు గారి పర్యవేక్షణలో పరిశోధనకి చేరాను. అప్పుడు నాతో పాటు దాష్, సత్యమూర్తి ఇంకా కౌసల్య కూడా డాక్టర్ రావు గారి బయోకెమిస్ట్రీ టీమ్‌లో ఉన్నారు.

సి.ఐ.ఎఫ్.ఇ. ఫిషరీస్ సంబంధించి సమగ్రంగా శిక్షణనిచ్చే ప్రభుత్వ కేంద్ర పరిశోధన సంస్థ. ఈ సంస్థ నిర్వహించే రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిషరీస్ డిప్లొమా కోసం, ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఫిషరీస్ డిపార్టుమెంట్ల నుంచి ఆఫీసర్స్ తో పాటు, దేశ వ్యాప్తంగా కొంత మంది విద్యార్థులు కూడా చేరతారు. అలాగే, కొంత మంది అంతర్జాతీయ విద్యార్ధులకి కూడా ఇందులో ప్రవేశముంది. వీరందరి కోసం మంచి హాస్టల్ వసతి కూడా ఇన్‌స్టిట్యూట్ లోనే ఉంది.

మా బయోకెమిస్ట్రీ టీమ్ వాళ్ళం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో బయట నుంచి పరిశోధన చేయడానికి వచ్చాము కాబట్టి, మాకు సి.ఐ.ఎఫ్.ఇ. హాస్టల్లో ఉండడానికి అనుమతి లేదు. సత్యమూర్తి, కౌసల్య బాంబేలో ఉంటున్న వారే. నేను, దాష్ మాత్రం హాస్టల్ కోసం బయట వెతుక్కోవాల్సి వచ్చింది.

బాంబేకి వచ్చిన మొదటి నెల రోజులు, దాష్ వాళ్ళ అత్తయ్య పుణ్యమాని, డోంబివిల్లి ప్రాంతంలో వారి ఇంట్లో నేనూ, దాష్ ఉన్నాము. ఈ విషయంలో దాష్ వాళ్ళ అత్తయ్య, మావయ్యగారి ఋణం తీర్చుకోలేనిది. వాళ్ళుంటున్న చిన్న ఫ్లాట్ లోనే మాకు ఆదరంగా ఆతిథ్యమిచ్చారు. చిన్న ఫ్లాట్ ఐనా, బాంబేలో కుటుంబాలు ఎలా ముచ్చటగా సర్దుకుని ఉంటారో చూసాను. వాళ్ళింట్లో ఒక పెద్ద కర్ర కున్న కొంకితో, లాఘవంగా ఇంట్లోనే బట్టలు ఎలా ఆర వేస్తారో నేను కూడా నేర్చుకున్నాను.

నేను గమనించింది ఏంటంటే, బాంబేలో సామాన్య దిగువ మధ్య కుటుంబంలోని పిల్లలు కూడా చక్కటి వస్త్రధారణతో, స్టైలిష్ గా, చురుకుగా ఉంటారని. చాలా మటుకు వీరికి సమయం విలువ తెలుసనిపించింది. బాంబే ఒక మినీ ఇండియా. ఎంతో మంది దేశం నలుమూలలనుంచి వచ్చి, ఇక్కడ బతుకు తెరువు సంపాదించుకుంటారు.

బాంబే వచ్చి చూస్తుండగానే పదిహేను రోజులు గడిచాయి. ఇన్‌స్టిట్యూట్‌లో మా ప్రాజెక్ట్ పని భారం, వేగం పెరిగాయి. డోంబివిల్లి నుంచి అంధేరిలోని మా ఇన్‌స్టిట్యూట్‌కి, రెండు లోకల్ ట్రైన్స్ మారి, తరువాత బస్సులో రావలసి వచ్చేది. దీనికి దాదాపు రెండు గంటల సమయం పట్టేది. సమయం కంటే, కిక్కిరిసిన జనం మధ్య, గాలి ఆడని ప్రయాణమే లోకల్ ట్రైన్లో పెద్ద ఇబ్బందిగా ఉండేది.

బాంబే లోకల్ ట్రైన్లో ప్రయాణ అనుభవమే వేరు. ట్రైన్ ఎక్కేటప్పుడు పెద్ద గోతాములో మనుష్యులను నింపినట్లు, దిగేటప్పుడు ఒక్క దులుపుతో బయటకి విసిరేసినట్లు ఉండేది. పొద్దున స్నానం చేసి చక్కగా తయారైనా, ఇన్‌స్టిట్యూట్ చేరేటప్పటికి నలిగిన బట్టలతో, చెమట కంపుతో దర్శనమిచ్చే వాళ్ళము. ఇక సాయంత్రం తిరుగు ప్రయాణంలో కూడా విపరీతమైన ఒత్తిడి ఉండేది. ఇలా పరుగులు తీస్తూ, వెస్ట్రన్ రైల్వే లోకల్ ట్రైన్లో అంధేరి నుంచి దాదర్ స్టేషన్‌కి, మళ్ళీ అక్కడి నుంచి సెంట్రల్ రైల్వే ఫాస్ట్ లోకల్ ట్రైన్లో, డోంబివిల్లికి చేరేసరికి, ఒక్కోసారి రాత్రి తొమ్మిదయ్యేది. ఇక చదువుకోవడానికి ఓపిక ఉండేది కాదు.

ఇలా లాభం లేదని, డాక్టర్ రావు గారి దగ్గర అనుమతి తీసుకుని, సాయంత్రం గంటన్నర ముందే బయలుదేరి, రోజూ పట్టుదలగా వెతకగా, మాకు సి.ఐ.ఎఫ్.ఇ.కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవన్స్ కాలేజీ క్యాంపస్ హాస్టల్‌లో వసతి ఉన్నట్లు తెలిసింది. అక్కడ, భవన్స్ కాలేజీ స్పోర్ట్స్ ఇంచార్జి శర్మ గారు హాస్టల్ వార్డెన్ గా బాధ్యత నిర్వహించేవారు. ఆయనకి మా కష్టం వివరించి ప్రాధేయపడ్డాము. మా అదృష్టం కొద్దీ ఆయన దయతో హాస్టల్లో ప్రవేశం కల్పించారు.

ఈ భవన్స్ హాస్టల్, పెద్ద బారాక్స్ లాంటి విశాలమైన గదులతో, ఆశ్రమం లాంటి వాతావరణముతో నాకు బాగా నచ్చింది. బొంబాయి లాంటి ఇరుకైన మహా నగరంలో ఇలాంటి వసతి దొరకడం ఆశ్చర్యమే. నాకైతే ముఖ్యంగా, బి.ఇ.ఎస్.టి. బస్సులో, లోకల్ ట్రైన్ కష్టాలు లేకుండా, పదిహేను నిమిషాలలో మా ఇన్‌స్టిట్యూట్ వెళ్లి రాగలగడం ఎంతో సౌకర్యంగా ఉంది.

నేను బాంబే వచ్చిన నెల రోజుల తరువాత, ఒక రోజు పది గంటలకు, మా సి.ఐ.ఎఫ్.ఇ. రిసెప్షనిస్ట్ మిసెస్ మెహతా మొదటి అంతస్తులో ఉన్న మా ల్యాబ్‌కి ఫోన్ చేసి కిందకి రమ్మంది. వచ్చి చూసి, నేను ఆశ్చర్యపోయాను. అక్కడ నాన్న ఉన్నారు! నాన్న వస్తున్నారని నాకు తెలియదు. ఒక్కడినే బాంబే వచ్చాక నేనెలా ఉన్నానో తెలుసుకోవటానికి, అమ్మ గొడవ చేసి పంపించందని నాన్న చెప్పారు. నాన్నని చూసి సంతోషమేసింది. మునుపు ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిన నాన్న ఆరోగ్యం గురించి నాకు దిగులుగా ఉండేది.

నాన్నని డాక్టర్ రావు గారికి పరిచయం చేసి, నా ల్యాబ్ చూపించాను. అలాగే డాక్టర్ రావు గారి పర్మిషన్ తీసుకుని, భవన్స్ హాస్టల్లో నా రూమ్ కూడా చూపించాను. ఇక్కడంతా సవ్యంగా ఉందని, నాన్న కూడా స్వయంగా చూసి కుదుటపడ్డారు. మేమిద్దరం హోటల్లో భోజనం చేసాక, నాన్న నన్ను సి.ఐ.ఎఫ్.ఇ.కి తిరిగి వెళ్లమన్నారు. తను ఎవరో మిత్రుడిని దాదర్ లో కలిసిన తరువాత, ఆ రోజు రాత్రికే తిరిగి సికింద్రాబాద్ ట్రైన్లో వెళ్తానన్నారు. నేను కూడా ఉంటానంటే, ఫర్వాలేదని నన్ను పంపించేశారు.

ఆ తరువాత నాన్న మళ్ళీ బాంబేకి రాలేదు. నేను మాత్రం నా కోసం ఇన్‌స్టిట్యూట్‌కి ఎప్పడు ఎస్.టీ.డీ. ఫోన్ కాల్ వచ్చినా, నాన్న ఆరోగ్యం గురించేనా అని కంగారు పడేవాణ్ని. దేవుడి దయ వల్ల నేను బాంబేలో ఉన్నన్నాళ్లూ నాన్న ఆరోగ్యం సవ్యంగానే వుండింది.

డాక్టర్ రావు నాకు, ‘అసెటిస్’ అనే శాస్త్రీయ నామం కలిగిన చిన్న రొయ్యలలో (ష్రింప్), ఫుడ్ ప్రాసెసింగ్ మరియు న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ అంశాలకు సంబంధించిన పరిశోధన అప్పగించారు. ఈ అసెటిస్‌ని మరాఠీలో ‘జవ్లా’ అని, హిందీలో ‘జింగా’ అని అంటారు. తెలుగులో దీన్ని ‘కుని రొయ్య’ అంటారేమో.

ఇంతకుముందు నేనెప్పుడూ ఈ జవ్లా గురించి వినలేదు, చూడలేదు. డాక్టర్ రావు నా ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసిన తరువాత ఒక ప్లాస్టిక్ పౌచ్‌లో ఎండిన జవ్లా చూపించారు. చాలా పెద్ద అటుకుల లాగా, ఇవి కొన్ని బంగారు రంగులో, కొన్ని లేత ఎరుపు రంగులో ఉన్నాయి. వాటిని దగ్గరగా తీసుకుని చూస్తుంటే, గుప్పుమని నాకు అలవాటు లేని రొయ్యల వాసన వచ్చింది.

నా స్పందన చూసి డాక్టర్ రావు నవ్వుతూ “నువ్వెప్పుడూ రొయ్యలు తినలేదా” అని అడిగారు. “నేను నాన్ వెజ్ తినను సర్” అన్నాను.

డాక్టర్ రావు “మా కొంకణ్ ప్రాంతంలో అందరం చేపలు, రొయ్యలు తింటాము. నువ్వు మరైతే ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తావు” అన్నారు.

“ఏమీ సమస్య లేదు సర్. నా పరిశోధన రొయ్యల ప్రాసెసింగ్, పౌష్టికత మరియు బయోకెమికల్ అంశాల మీద కాబట్టి, ఇబ్బంది లేదు సర్” అని నేను దృఢంగా చెప్పాను. “దట్ ఈజ్ ఫైన్. ఓకే!” అన్నారు డాక్టర్ రావు.

సి.ఐ.ఎఫ్.ఇ. లైబ్రరీలో జవ్లా ఇంకా వేరే రొయ్యల మీద రీసెర్చ్ ఆర్టికల్స్ చదివి, నా ప్రాజెక్ట్ పరిశోధన గురించి అవగాహన పెంచుకున్న తరువాత, ఇక జవ్లా మీద స్వయంగా ప్రాక్టికల్స్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది.

ఈ రోజు పొద్దునే ఐదింటికల్లా లేచాను. నిన్న రాత్రంతా నాకు సరిగా నిద్ర పట్టకపోయినా, ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. నా హడావిడికి, దాష్ లేచి “ఏంటి శ్రీధర్ అప్పుడే లేచావు” అన్నాడు.

“ఔను దాష్! వెర్సోవా మచిలీమార్‌కి వెళ్లి, త్వరగా మళ్ళీ తొమ్మిదింటికల్లా ఇన్‌స్టిట్యూట్ చేరాలి కదా” అన్నాను. “సరే, నేను తర్వాత లేస్తాను” అని తిరిగి దాష్ ముసుగు తన్నాడు.

గబగబా కాలకృత్యాలు తీర్చుకుని, మా హాస్టల్‌కి దగ్గరలోనే ఉన్న బస్సు స్టాప్‌కి చేరుకున్నాను. ఇవాళ మా బస్సు స్టాప్‌లో నేను, నా తరువాత మరో ఇద్దరు నిల్చుని ఉన్నారు. కొద్ది క్షణాలలోనే వెర్సోవాకి వెళ్లే డబల్ డెక్కర్ బస్సు వచ్చింది. వెర్సోవాకి వెళ్లే బస్సు పొద్దునే అయినా నిండుగా వచ్చింది. బస్సు కండక్టర్ “ఏకచ్” అంటుండగా, నాతోబాటు నా వెనుకతను బలవంతంగా దూరబోయాడు. కండక్టర్ అతన్ని దిగిపొమ్మన్నాడు. కానీ, అతను మొరటుగా “నేను అర్జెంటుగా వెళ్ళాలి, దిగను” అన్నాడు. వెంటనే కండక్టర్ బస్సులో తాడు లాగి బెల్ మోగించాడు. వెంటనే డ్రైవర్ బస్సు ఆపేసాడు. కానీ నా వెనుక వచ్చినతను మాత్రం దిగకుండా కండక్టర్‌తో, అలాగే వారిస్తున్న ప్రయాణికులతో గొడవ పెట్టుకున్నాడు. అంతే! నేనూహించని భలే విచిత్రం జరిగింది. కండక్టర్‌కి మద్దతుగా ప్రయాణీకులు మొండికేసిన వ్యక్తిని కిందకి దింపేసారు. ఆ వెంటనే బస్సు మళ్ళీ బయలుదేరిపోయింది.

ఒకళ్ళో ఇద్దరో క్రమశిక్షణ తప్పిన వ్యక్తుల వల్ల, బాంబే ప్రయాణికులు తమ సమయం వృథా కానివ్వరని తెలిసి అబ్బురమేసింది. చెట్టు కొమ్మలకు అంగుళం దూరం కూడా లేకుండా వేలాడే గబ్బిలాల లాగా, మా సికింద్రాబాద్ యువకులు బస్సులకి వేలాడడం గుర్తొచ్చి నవ్వొచ్చింది. బాంబేలో బస్సు ప్రయాణంలో అన్ని చోట్లా క్రమశిక్షణ పాటించడం నన్ను చాలా ఆకట్టుకుంది.

పదిహేను నిమిషాలలో మా బస్సు వెర్సోవా టెర్మినస్ కి చేరుకుంది. ఇక్కడకి రావడం నేను ఇదే మొదటిసారి. రోజూ ఐతే వెర్సోవాకి ఒక కిలోమీటర్ ముందే సాథ్ బంగ్లా దగ్గర దిగి, కొద్ది దూరంలోనే ఉన్న మా సి.ఐ.ఎఫ్.ఇ. వెళ్తాను. బస్సు దిగి వెర్సోవా బీచ్ లో మచిలీమార్ వైపు దారి అడిగి తెలుసుకున్నాను.

మచిలీమార్ చేరాలంటే, వెర్సోవా ఊళ్ళో, బస్తీ గుండా ఒక పావు కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. దారిలో పాత కాలపు పెంకుటిళ్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా పల్లె వాసనలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి, అలాగే కొద్ది దూరంలో నగరంగా మారిన నివాసాలకు, చాలా తేడా ఉంది.

అప్పుడు సమయం పొద్దున ఆరు గంటలౌతోంది. నడుస్తుండగా నేను, చాలా ఇళ్లల్లో నుంచి ఇక్కడ కోలీ అని పిలవబడే బెస్తవారి మహిళలు, చేతిలో పెద్ద వెదురు బుట్టలతో బయటకి వచ్చి వెర్సోవా తీరం వైపు బయలుదేరటం చూసాను. వారిని నేను దగ్గరగా చూసాను. జీవితంలో అదొక మరువలేనిది అద్భుత దృశ్యం.

ఈ కోలీ మహిళలు పొద్దునే స్నానం చేసి, ఒంటికి పసుపు పూతతో, అందమైన సాంప్రదాయ గోచీ చీరకట్టుతో, తల కొప్పున నిండుగా పూలతో, ఆ పక్కన ఒక పెద్ద మందారంతో, నుదుట పెద్ద గుండ్రటి కుంకుమతో, దాని చుట్టూ బొట్ల అలంకరణతో, మెడలో రకరకాల పూసల దండలతో, చేతి నిండా గాజులతో, కాళ్ళకి పెద్ద వెండి కంకణాలు, మట్టెలతో, మహాలక్ష్ముల వలె గలగలా నవ్వుతూ నడిచి వెళ్తున్నారు.

కొన్ని వందల ఏళ్ల క్రితం బొంబాయి ఒక నగరంగా మారక మునుపు, ఈ ప్రాంతం ప్రధానంగా మత్స్యకారుల వాడ. కోలీవాడ యని ప్రతీతి చెందిన ఈ ప్రాంతములో ఆదిమ నివాసులుగా వీరిది ఒక విశిష్ట చరిత్ర. సముద్రాన్ని, సముద్ర జీవజాలాన్ని దేవతలుగా కొలిచే సంప్రదాయము వీరిది. వారి మనుగడకి సరిపోయేంత, సాగరంలో కొంత దూరం వరకే చేపల వేట సాగించి, సాగర గర్భాన్ని పవిత్రంగా భావించే సనాతన జాతి ఇది.

చేపల వేట సాగించే కాలంలో, కొన్ని రోజుల కఠిన పరిశ్రమ తరువాత, కోలీ మగవారు పొద్దునే తెచ్చే మత్స్య సంపదని, కోలీ మహిళలు తీరానికి ఎదురెళ్లి పూజతో ఆహ్వానిస్తారు. కోలీ మహిళల నియమ నిష్ఠ, భక్తి శ్రద్ధలు చూసి, వారి మీద నాకు చాలా గౌరవం కలిగింది.

కోలీ మహిళలు ఇంత శుభ్రంగా, సంప్రదాయంగా వుంటే, వారి మగవారు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నారు. కోలీ మగవారు సాగర కష్టాలతో మొరటు దేలి, చింపిరి జుట్లతో, తాగుడు వ్యసనంతో బాన పొట్టలు పెంచి, పెద్ద లాగులు ధరించి కనబడ్డారు. కోలీ మహిళలు వీరినెట్లా భరిస్తారో బాబోయ్ అనిపించింది నాకు.

ఈ దారంతా ఎత్తైన వెదురు తడకల మీద, మెత్తటి ‘బొంబిల్’ చేపలు ఎండడానికి వేలాడిదీసి ఉన్నాయి. వీటినే ‘బాంబే డక్’ అని కూడా అంటారు. ఈ పశ్చిమ తీర ప్రాంతాన ఈ బొంబిల్ చేపలు విరివిగా లభిస్తాయి. చుట్టూ చూస్తూ, సన్నటి సందుల గుండా ఐదు నిమిషాల నడక తరువాత, తీర ప్రాంతాన చేపలవేట పడవలు నిలిపే ప్రదేశానికి చేరుకున్నాను. ఇప్పుడు నాకు కావలిసిన జవ్లా గురించి వెతకడం మొదలు పెట్టాను. ఈ జవ్లా కూడా ఎక్కువగా భారతాన, పశ్చిమ తీరంలో లభిస్తాయి.

జవ్లా చాలా చిన్న రొయ్యలు కాబట్టి, మామూలు చేపల వలలో ఇవి నిలువవు, జారి పోతాయి. ఇవి పట్టాలంటే వీటి కోసం సన్నటి వలలు వాడాల్సి ఉంటుంది. జవ్లా తక్కువ బరువు రీత్యా, ఇంకా త్వరగా పాడైపోవటం వలన, ఆర్ధికంగా కోలీ వారికి వీటి వేట వలన లాభముండదు. అందుకే జవ్లాని కొద్ది మంది జాలరులు మాత్రమే పట్టుకుంటారు. పర్యవసానంగా, చవకగా లభించే, ఎంతో విలువైన ప్రోటీన్, పౌష్టికత ఇంకా విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న జవ్లా ఆహార సంపదని మన దేశం కోల్పోతోంది.

జవ్లా కోసం చూస్తూ ఉండగా, నేల మీద కొన్ని చోట్ల ఇవి అశుభ్రంగా ఆరబెట్టి కనిపించాయి. తీరానికి దగ్గరగా వెళ్లిన తరువాత నేను రెండు చోట్ల పడవుల నుంచి జవ్లా బుట్టలు దింపడం చూసాను. దగ్గరకెళ్ళి చూస్తే జవ్లా భలేగా ఉన్నాయి. పొద్దునే పట్టిన జవ్లా రొయ్యలు తెల్లగా పారిజాతాల్లా మెరుస్తున్నాయి. తాజా జవ్లా రొయ్యలు వాసన లేవు. కానీ, జవ్లాలో ఎక్కువ నీటి శాతం వలన, వెంటనే సరిగ్గా ఎండ పెట్టకపోతే, త్వరగా కుళ్ళి, రంగు మారి కంపు వాసన వస్తాయి.

జవ్లా బుట్టతో ఉన్న ఒక కోలీ మహిళని హిందీలో “నాకు జవ్లా కావాలి” అని అడిగాను. ఆమె “ఎండిన జవ్లా ముందర రోడ్ మీద దొరుకుతాయి. పచ్చివి ఎందుకు? ఎంత కావాలి? అని మరాఠీ భాషలో అడిగింది.

నేను ఆమెతో “మలా మరాఠీ ఏత్ నాహి” అని, హిందీలో “నాకు ఇవాళే పట్టిన తాజా జవ్లా ఒక కిలో కావాలి, రీసెర్చ్ అంటే చదువు కోసం” అన్నాను.

అందుకు ఆమె “ఎక్కడ చదువుతున్నావ్? వీటిని ఏం చేస్తావు” అని హిందీలో మాట్లాడడం మొదలు పెట్టింది. నేను చెప్పాను దగ్గరలోనే సాథ్ బంగ్లా దగ్గర కాలేజీలో, జవ్లా పాడవ్వకుండా ఎలా ఎండబెట్టాలి, ఇంకా దానిలో బలం తగ్గకుండా జవ్లా నాణ్యత ఎలా కాపాడాలి అని రీసెర్చ్ చేయబోతున్నానని.

ఆమెకి సి.ఐ.ఎఫ్.ఇ. గురించి తెలుసనుకుంటా. “ఓహ్ అక్కడ చదువుతున్నావా! కానీ, నేను ఇప్పుడు బరువు తూచలేను” అని, ఆమె నేను తీసుకెళ్లిన ప్లాస్టిక్ సంచిలో గుప్పెళ్ళతో జవ్లా నింపేసింది.

నేను “డబ్బులు ఎంత ఇవ్వాలి” అని అడిగితే, ఆమె నవ్వుతూ “ఏమీ అవసరం లేదు” అని జవాబిచ్చింది. నేను “అలా కాదు, మీరు డబ్బులు తీసుకోపోతే ఎలా? నేను ఇక నుంచి వస్తూనే ఉంటాను తాజా జవ్లా కోసం. ఇప్పుడంటే మొదటిసారి కాబట్టి తక్కువ తీసుకుంటున్నాను. రాన్రాను నాకు మొత్తం బుట్ట కావాల్సి ఉంటుంది” అని చెప్పాను. ఐనా, ఆమె ససేమిరా డబ్బులు వద్దని, “మీరు మా కోసం పరిశోధన చేస్తున్నారు. చదువు కోసం వీటిని మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను మీకు ఇవి అమ్మను” అన్నది.

ఆవిడ సంస్కారము, ఔన్నత్యము నేను జీవితాంతము మరువలేను. చదువు రాని ఆవిడ నాకు పెద్ద గురువు లాగా కనిపించింది. ఆవిడకి నేను థాంక్స్ చెప్పి నమస్కరించాను. ఆవిడ పేరు అడిగితే “వందన తాండేల్” అని చెప్పింది. పేరుకి తగ్గ మహిళే ఆవిడ.

కొన్ని సార్లు ఇలాగే రెండు కిలోలకి కూడా, వందన నా దగ్గర జవ్లాకి డబ్బులు తీసుకునేది కాదు. నేను నిండు జవ్లా బుట్ట తీసుకున్నప్పుడల్లా, నాకు మా కాలేజీ వాళ్ళు దీనికి డబ్బులిస్తారని గట్టిగా చెప్పి, ఆవిడకి డబ్బులిచ్చేసే వాణ్ని.

ఇక భవన్స్ హాస్టల్లో ప్రవేశం దొరికింది, ప్రయాణ భారం తప్పిందనుకుంటే, ఇక్కడ మాకు కొత్త అనుభవాలు, ఇబ్బందులూ మొదలయ్యాయి. వార్డెన్ శర్మగారు మమ్మల్ని చేర్చిన రూమ్‌లో అప్పటికే ముగ్గురున్నారు. వాళ్ళు ఏ మాత్రం విద్యార్థుల్లా లేరు. ఏదో కోర్స్ చదువుతున్నట్లు చూపించి, ఇక్కడ హాస్టల్లో ఉంటున్న ఈ ముగ్గురూ, సినిమా రంగంలో పని వెతుక్కోవడానికి వచ్చిన వాళ్ళు.

వీళ్ళలో అందంగా ఉన్న సజ్జాద్ ఖాన్ కాశ్మీర్ నుండి వచ్చాడు, హీరో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాడు. వినోద్ జుట్షి కూడా కాశ్మీర్ నుంచి వచ్చి శక్తి సామంత అనే సినీ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, విలన్ వేషాలకు ప్రసిద్ధి చెందిన డాన్నీ డెంగ్జోన్గ్పా‌ని అనుకరిస్తున్న లాల్ సింగ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి స్టంట్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాడు.

మొదటిసారి ఇంటినుండి బయట బ్రతకడానికి వచ్చిన నాకు, వీళ్ళతో సహవాసం జీవితంలో మర్చిపోలేని ఒక విచిత్ర అనుభవం. వీళ్ళ వల్ల రాత్రి ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చాక చదువుకోవడం సాగేది కాదు.

వినోద్ జుట్షి మమ్మల్ని తన ఎదురుగా కూర్చోమని, ఆ రోజు తను షూటింగ్ సెట్లో చూసినవన్నీ చెప్పేవాడు. వాడికి అమితాబ్ బచ్చన్‌ని దగ్గరగా చూడటం, ఇంకా ఆ సమయంలో అమితాబ్ నటిస్తున్న యారానా అనే కొత్త సినిమా విశేషాలు ముందే మాకు చెప్పగలగడం చాలా గర్వంగా ఉండేది. ఇంతటితో ఆగకుండా, వాడు టేబుల్ మీద దరువేస్తూ, ఇంకా విడుదల కాని ఆ సినిమాలో అమితాబ్ కొత్త పాట ‘సారా జమానా’ పాడి వినిపించేవాడు. ఈ సమయంలో నేను వినకుండా వేరే వైపు చూస్తే పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఇదెక్కడి గోలరా బాబూ అని నాకు చిరాకేసేది.

లాల్ సింగ్ హిప్పీ స్టైల్ తో చూడటానికి గమ్మత్తుగా ఉన్నా, పొద్దునే ఐదింటికి లేచి స్నానం చేసి, శ్రద్ధగా సంస్కృత శ్లోకాలు చదివేవాడు. వాడితో నాకు ఇబ్బంది ఏంటంటే, తరచూ నన్ను డబ్బులు అప్పు అడగడం. నేనే జాగ్రత్తగా నా పరిమిత నెలసరి రూకలతో నెట్టుకొస్తుంటే, వీడు నన్ను అడగటం!

ఇక వినోద్, లాల్ సింగ్ కంటే ప్రమాదకరంగా సజ్జాద్ వ్యవహారం మారింది. వీడు సినిమాలలో వేషాలిప్పిస్తాడని, సాయంత్రం తరువాత వీడిని కలవడానికి అమ్మాయిలు వచ్చేవాళ్ళు. వీళ్ళలో కొంతమంది బరి తెగించిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. మా హాస్టల్ రూమ్ పెద్దగానే ఉండటంతో, సజ్జాద్ ఖాన్ వాడి మంచం చుట్టూ దోమ తెర కట్టి, వీళ్ళతో రొమాన్స్ సాగించేవాడు. ఇది మాకు చాలా ఇబ్బందిగా, భరించలేకుండా మారడంతో మేము చాలాసార్లు వార్డెన్ శర్మ గారితో, మమ్మల్ని ఈ రూమ్ దగ్గరలోనే ఉన్న బర్రాక్స్ లాంటి పెద్ద వసతికి మార్చమని మొర పెట్టుకున్నాము.

వార్డెన్ శర్మ గారికి కూడా చాలా కాలంగా సజ్జాద్ ఖాన్ ప్రవర్తనతో చాలా కోపంగా ఉంది. కానీ, తనని నియంత్రించడానికి శర్మ గారికి మాఫియా వ్యక్తుల నుంచి బెదిరింపులున్నాయి. భవన్స్ సంస్థ ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి కూడా ఆయనకి పూర్తి సహకారం లేదు. బాంబేలో అప్పటి పరిస్థితులకు ఇది అద్దం పడ్తుంది.

ఐనా, ఎంతో రిస్క్ తీసుకుని సజ్జాద్ ఖాన్‌ని హాస్టల్ ఖాళీ చేయమని చెప్పారు వార్డెన్. అంతే! సజ్జాద్ ఖాన్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. హాస్టల్ వార్డెన్‌ని బూతులు తిడుతూ, తానొక కాశ్మీరీ అని, తనతో పెట్టుకోవద్దని, హాస్టల్ తగలపెట్టేస్తాను అని బహిరంగంగా సవాలు చేస్తూ రెచ్చిపోయాడు.

సజ్జాద్ ఖాన్ ప్రతిచర్య నన్ను భయంతో పాటు ఎంతో ఆగ్రహానికి గురి చేసింది. ఒక్క కాశ్మీరీ యువకుడు ఎంతో దూరంలో ఉన్న బాంబేకి వచ్చి దౌర్జన్యం చేయటం, ఇంకా భవన్స్ లాంటి ఒక పెద్ద విద్యా సంస్థని నాశనం చేస్తానని బెదిరించడం ఎలా సాధ్యమయ్యింది? వీడికి ఇంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచింప చేసింది. ఈ సంఘటనే కాకుండా మరికొన్ని నేను చూసిన, అనుభవించిన సంఘటనలతో అప్పటి బాంబే నగరపు ఆందోళనకర పార్శ్వాన్ని కూడా నా కథలో తెలియ చేస్తాను.

ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే, శర్మ గారు మమ్మల్ని భవన్స్ క్యాంపస్‌లో బర్రాక్స్ లాంటి వేరే చోటుకి మార్చారు. ఇక్కడ మా కొత్త హాస్టల్ గది పెద్దగా, నాలుగు మంచాలతో సౌకర్యంగా ఉంది.

నేను ఎక్కడికెళ్లినా ఒక మినీ ఇండియా కనిపిస్తోంది. ఈ గదిలో జైపూర్ నుంచి మాలూ, కలకత్తా నుంచి నిలోయ్, గుజరాత్లోని నవ్సారి నుంచి నరేందర్ అనే సిక్కు యువకుడు ఉన్నారు. వీళ్ళందరూ బాంబేలో ఏదో ఒక డిగ్రీనో లేక పాలిటెక్నిక్ కోర్సునో చేస్తున్నారు. వీళ్ళని చూసాక కొంచెం స్థిమితం కలిగింది. మేము ఒక పద్ధతిగా ఉండవచ్చనిపించింది.

కాలం గడుస్తోంది. అమ్మా నాన్నల నుంచి ఉత్తరాలు ప్రతి వారం వస్తున్నాయి. ఎప్పుడూ ఉత్తరం వ్రాయని అమ్మ, చక్కటి దస్తూరితో ఇంట్లో వాళ్ళందరి క్షేమం గురించి, అలాగే నేనెలా ఉన్నానని కనుక్కుంటూ, సగం పైగా ఇన్లాండ్ లెటర్ వ్రాయటం నాకు భలే ఆనందంగా ఉండేది. నాన్న కొన్ని సార్లు ఇంగ్లీషులో, కొన్ని సార్లు తెలుగులో ఎంతో ఆప్యాయంగా, ముచ్చటగా వ్రాసేవారు.

నేను మాత్రం బాంబేలో నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఏవీ తెలియచేసేవాణ్ని కాదు. నాన్న, నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఒంటరిగా బాంబే పంపించడం, నేను భావి జీవితపు ఆటుపోట్లు తట్టుకునేందుకు కూడా ఎంతో ఉపయోగపడింది.

అత్యవసరమైతే ఎస్టీడీ కాల్ మా ఇన్‌స్టిట్యూట్ కి చేయటం తప్ప, ఉత్తర ప్రత్యుత్తరాలే ఆ కాలంలో మా మధ్య పెద్ద ఆసరా. స్నేహితులు కూడా తరచు వాళ్ళ ఉత్తరాలతో, వాళ్ళ ఎడబాటు తెలియకుండా చేసేవాళ్ళు. ఆ కాలంలో అమ్మా నాన్న, అక్కా చెల్లీ ఇంకా నా ఆప్తమిత్రులు వ్రాసిన ప్రతి ఉత్తరం, నలభై ఏళ్ల తరువాత కూడా ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయంటే, నేను వాటిని ఎంత అమూల్యంగా భావిస్తానో అర్థం చేసుకోవచ్చు.

ఎటు చూసినా కాంక్రీట్ కట్టడాలు, ఫ్లాట్ సముదాయాలతో ఉన్న బాంబేలో, పచ్చటి చెట్లతో విశాలమైన ఆశ్రమం లాంటి భవన్స్ హాస్టల్ దొరకడం నాకెంతో ఆహ్లాదంగా ఉంది. మా కొత్త రూమ్‍మేట్స్‌లో ఒక్కోడు ప్రత్యేకంగా ఉన్నారు.

నరేందర్ ఎంతో క్రమశిక్షణ కలిగిన సిక్కు కుర్రాడు. పొద్దున ఎప్పుడు లేచి తన పొడవాటి జుట్టుని శుభ్రం చేసుకుని, చిన్న కొప్పులాంటి తలపాగా పెట్టుకునేవాడో తెలిసేది కాదు. వీలైనప్పుడల్లా డంబెల్స్ ఎత్తుతూ, స్కిప్పింగ్ చేస్తూ, భలే చురుకుగా ఉండేవాడు. వీడు కేవలం బి.కామ్ చదవడానికి బాంబే వచ్చాడంటే ఆశ్చర్యమేసేది.

నిలోయ్ దాస్ గుప్తా ఉద్యోగం చేసుకునే వాడు, కానీ అది తెలియచేయకుండా పార్ట్ టైం న్యాయశాస్త్ర డిగ్రీ పేరున ఈ హాస్టల్ వాడుకుంటున్నాడు.

మాలూ అనే రాజస్థానీ కుర్రాడు పొడవాటి జుట్టుని పోనీ టైల్ లాగా పెట్టుకునేవాడు. సంపన్న కుటుంబం నుంచి పొలిటికల్ సైన్స్ డిగ్రీ పేరుతో బాంబేలో ఎంజాయ్ చేయటానికి వచ్చిన మాలూకి, దినంలో సమయమంతా సౌందర్య పోషణకే సరిపోయేది. వీడు వాడే షాంపూలు, పెర్ఫ్యూమ్స్ చూస్తే నాకు మతి పోయేది. మగవాళ్లకు కూడా ఇన్ని సౌందర్య సాధనాలుంటాయా అని ఆశ్చర్యమేసేది. వీడు చేతి గోళ్ళకి, కాలి గోళ్ళకి చేసే పెడిక్యూర్ అనే సంరక్షణ, రోజూ పాదాలని రక రకాల తైలాలు కలిపి వేన్నీళ్ళతో శుభ్రం చేయటం, ఇవన్నీ ఆసక్తిగా గమనిస్తున్న నాకు, వీడిలో ఇంకో విచిత్ర లక్షణం ఆవిష్కృతమైంది. ఆదివారాలు వీడు నిలోయ్ పక్కన చేరి వాడి చెవులు నాకడం, మెడ మీద ముద్దులు పెట్టడం చేస్తుండే వాడు. పొద్దున మాత్రం వీడి కోసం మా పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ నుంచి ఒక చాలా స్టైలిష్ అమ్మాయి వచ్చేది. వీళ్ళిద్దరూ హాస్టల్ కాంటీన్లో చాలా సేపు కాలక్షేపం చేసేవారు.

ఒక వారం నిలోయ్ తన ఊరుకి వెళ్ళినప్పుడు, మాలూ నా బెడ్ మీదకి వచ్చి పడుకుని నాతో సరసం మొదలు పెట్టాడు. నేను వాణ్ని వారించినా వినకపోతే, గట్టిగా ఒక్క తోపు తోసి,”క్యా రే తూ గే హై క్యా” అన్నాను. వాడు నవ్వుతూ “నై! హెటెరో హూ” అన్నాడు. నేను మాలూకి దృఢంగా చెప్పాను నాకిలాంటివి ఇష్టం లేదని, నన్నెప్పుడూ కెలకద్దని. మాలూ ప్రవర్తన నాకొక పెద్ద షాక్. నా అదృష్టమేంటంటే మాలూ చాలా తెలివైనవాడు కాబట్టి, నాతో ఎన్నడూ తరువాత అలా ప్రవర్తించలేదు.

మనుష్యుల రక రకాల విపరీత పోకడలు, లక్షణాల గురించి నాకు బాంబేలో అనుభవపూర్వకంగా శిక్షణ మొదలయ్యింది.

మాలూ లాంటి వాళ్ళ విలాస జీవన విధానమిలాగైతే, నాది సామాన్య ఆర్ధిక పరిస్థితి. ఆశ్చర్యకరమే! కేవలం మూడు వందల రూపాయలతో నెలంతా గడిపేవాణ్ని. అలాగని నా ఆహారం విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, నాకే మాత్రం లోటు జరుగలేదు. నెలకు భవన్స్ హాస్టల్ గది అద్దె అరవై రూపాయలు, సి.ఐ.ఎఫ్.ఇ. వారి సబ్సిడీ మెస్‌లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు, బస్సు ప్రయాణం దాదాపు నలభై రూపాయలు పోగా, మిగతా ఖర్చులకు యాభై రూపాయలు ఉండేవి. ఐతే, ఆదివారాలు సాయంత్రం సి.ఐ.ఎఫ్.ఇ. మెస్ ఉండదు కాబట్టి, బయట హోటల్లో తినవలసి వచ్చేది.

మా హాస్టల్ దగ్గర లోనే సన్మాన్ అని మంచి ఉడిపి హోటల్ ఉండేది. దీనిలో రెండు తందూర్ రొట్టెలకి, వెజిటబుల్ కర్రీకి కలిపి మూడు రూపాయలలో నా ఆదివారపు డిన్నర్ ముగించే వాణ్ని. ఈ హోటల్లో తెల్ల ఉల్లిపాయ (కాందా అంటారిక్కడ) ముక్కలు, నిమ్మకాయ చెక్కలు, ఇంకా క్యారెట్ లేదా చిన్న వడు మామిడి కాయల ఊరగాయ ఉచితంగా ఇచ్చేవారు. వీటిని పూర్తిగా వాడుకునేవాణ్ని.

అమ్మా, నాన్న గొడవ చేసేవారు ఇంత తక్కువ నెల ఖర్చుతో నేనెలాగ గడుపుతున్నాని, నెలకి ఐదు వందలు డబ్బు పంపుతామని. కానీ, నేను చెప్పేవాణ్ని నాకిది సరిపోతుందని. ఎంత తక్కువ డబ్బుతో వీలైతే, అంతలో చదువు పూర్తి చెయ్యాలన్న నా నిర్ణయానికి, భవన్స్ హాస్టల్, సి.ఐ.ఎఫ్.ఇ. మెస్ సబ్సిడీలు ఎంతో సహాయ పడ్డాయి.

బాంబేలో అప్పటి నా జీవన వ్యయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నలభై ఏళ్లలో జీవన వ్యయం ఎంత పెరిగిందో అవగాహన కలిగించాలని.

దాష్, నేను ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తూ ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. మా ఇద్దరి సఖ్యత చూసి మేమిద్దరం అన్నదమ్ములా అని అనుకునేవాళ్లు. ఒకసారి దాష్ వాళ్ళ అన్నయ్య భరద్వాజ్ తన ఆఫీస్ పని మీద బాంబే వచ్చాడు. మా హాస్టల్ కి వచ్చి, రాత్రి మమ్మల్ని కఫ్ పెరేడ్ లో ఒక పెద్ద స్టార్ హోటల్లో డిన్నర్ కి తీసుకెళ్లాడు. ఫోర్క్, స్పూన్ చక్కగా వాడి చూపించాడు. మొదటిసారి నేను హోటల్లో ఒక ఫైవ్ కోర్స్ మీల్ తిన్నాను. డిన్నర్ అమోఘంగా ఉంది.

ఐతే నాకు ఇక్కడొక గమ్మత్తు అనుభవమైంది. అదేంటంటే, భోజనమైన తరువాత చిన్న పళ్లెంపై, గాజు గిన్నెలో, నిమ్మకాయ ముక్కలు ఉన్న గోరువెచ్చని నీళ్లు మా అందరి ముందు పెట్టారు. వీటిని చూసి నేను ఆ నీళ్లు తాగాలా, లేక ఏం చేయాలని సంశయిస్తున్న సమయంలో, దాష్ నా కాలు మెల్లగా తొక్కి ఆపాడు. భరద్వాజ్ ఆ నీళ్లలో, తిన్న చేతిని ముంచి, నాజూకుగా కడుక్కుని, ఒక నిమ్మ డిప్ప తన పెదాలకు తాకించి శుభ్రం చేసుకున్నాడు. ఆ పైన, చక్కటి నాప్‌కిన్‌తో చేతులు, మూతి తుడుచుకుని పక్కన పెట్టాడు. అలా, మొదటిసారి నలభై ఏళ్ళ క్రితం నాకు ఈ తంతు గురించి తెలిసింది. దాష్‌ని కృతజ్ఞతగా నవ్వుతూ భుజం తట్టాను.

ఒక రోజు మా బావగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తనకి తెలిసిన ప్రకాష్ అనే కుర్రాడికి బాంద్రాలో ఉన్న కార్పొరేషన్ బ్యాంకులో ఉద్యోగం వచ్చి, అతను మాకు దగ్గరలోనే ఉన్న విల్లే పార్లేలో ఉంటున్నాడని, అతన్ని కలవమని వ్రాసారు.

నేను, దాష్ అతని ఫ్లాట్ వెతుక్కుని కలిసాము. ప్రకాష్ చాలా సరదాగా ఉన్నాడు. అతనితో పాటు అదే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అయ్యుబ్ అని మదనపల్లి నుంచి వచ్చినతను పరిచయం అయ్యాడు. చాలా మృదువుగా మాట్లాడే అయ్యుబ్ కూడా ప్రకాష్‌తో పాటు బాగా స్నేహమయ్యాడు.

ఒక నెల రోజుల తరువాత, వాళ్లిద్దరూ మా భవన్స్ హాస్టల్ కి దగ్గరలోనే ఉన్న ఫోర్ బంగ్లోస్ ఏరియాలో ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారు. అప్పటినుంచి ఇక నా సెలవు రోజుల్లో వారింటికి వెళ్లి సరదాగా కబుర్లు చెబుతూ, చెస్ ఆడుతూ కాలక్షేపం చేసేవాడిని. వాళ్లిద్దరూ రాత్రి పూట ఇంట్లోనే వంట చేసుకునేవారు. అయ్యుబ్ నాకు సాంబార్ చెయ్యటం నేర్పించాడు.

సి.ఐ.ఎఫ్.ఇ. లో చేరిన నాలుగు నెలలకే, దాష్ తనకెంతో ఇష్టమైన ఎయిర్ ఫోర్స్‌లో గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్‌గా కమిషన్ అయ్యాడు. కొంత కాలంగా ఎంతో చేరువైన దాష్ నాకు దూరమవ్వటం చాలా బాధగా ఉండేది. దాష్ ఉద్యోగరీత్యా ఎక్కడున్నా, ఎన్వలప్‌లో ఎన్నో పేజీలు తన క్షేమ సమాచారం, కొత్త ఉద్యోగం వివరాలు, చక్కటి దస్తూరితో వ్రాసి పంపించి నా దిగులు తీర్చేవాడు. అవి చదువుతుంటే, వాడు నా ముందున్నట్లే ఉండేది.

నాతో పాటు రీసెర్చ్ చేస్తున్న సత్యమూర్తి, మా హాస్టల్ గదిలో దాష్ స్థానం భర్తీ చేయడానికి, తన ఫ్రెండ్ ఐస్సాక్‌ని రికమెండ్ చేసాడు. వార్డెన్ శర్మ గారితో చెప్పి ఐస్సాక్‌కి నా పక్క బెడ్ ఇప్పించగలిగాను. కన్యాకుమారి ప్రాంతానికి చెందిన ఐస్సాక్, పార్ట్ టైం ఎం.బీ.ఏ చేస్తూ అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తన ఉద్యోగంతో ఇంటి దగ్గర కుటుంబాన్ని పోషిస్తున్న ఐస్సాక్ బాగా కష్టపడేవాడు. ఐస్సాక్ నాతో బాగానే కలిసిపోయాడు.

బాంబే వాతావరణంకి నేను త్వరలోనే బాగానే అలవాటుపడ్డాను. నా టీం మేట్స్ సత్యమూర్తి, కౌసల్య కూడా నాకు బాగా ఆప్త మిత్రులయ్యారు. సత్యమూర్తి అంధేరికి దూరంగా మెరైన్ లైన్స్ దగ్గర తార్దేవ్‌లో ఉండేవాడు. సత్యమూర్తి ఇంటికి వెళ్తే, వాళ్ళ అమ్మగారు మంగళూరు వంటకాలు చేసి పెట్టేవారు.

కొట్టె కడుబుతో (పనస ఆకులో చిన్న సిలిండర్ ఆకారంలో ఉడకబెట్టిన ఇడ్లీలు) పాటు, ఆవిడ చేసే కొబ్బరి పాల పులుసు అమోఘంగా ఉండేది. వాళ్ళ నాన్న కారులో, సత్య నన్ను మెరైన్ డ్రైవ్, చర్చిగేట్, నారిమన్ పాయింట్ మొత్తం తిప్పడం నేను మర్చిపోలేని ఆనంద క్షణాలు. మెరైన్ డ్రైవ్ దగ్గర భేల్ పూరి తింటూ మేము భలే ఎంజాయ్ చేసే వాళ్ళం.

బాంబేలో మా ప్రాంతాన, రైల్వే ట్రాక్ ఇరువైపుల నున్న పశ్చిమానికి, తూర్పుకి చాలా వ్యత్యాసముండేది. తూర్పు వైపు ఇండస్ట్రీలు, ఎయిర్‌పోర్ట్ వుంటే, పశ్చిమాన రెసిడెన్షియల్ సముదాయాలతో చాలా బాగుండేది. కౌసల్య అంధేరికి దగ్గరలోనే శాంతాక్రూజ్ వెస్ట్‌లో ఉండేది. అప్పుడప్పుడూ కౌసల్య వాళ్ళ ఇంటికి వెళ్లేవాడిని. వాళ్ళింటి దగ్గరే ఒకసారి ప్రముఖ నటి బీనా బెనర్జీ పరిచయమయ్యారు. ఆవిడ ఎంతో స్నేహశీలిగా ఉన్నారు.

కౌసల్య ఒకసారి హిందీ, తమిళ, మరాఠీ సినిమాల ప్రఖ్యాత దర్శకుడు కే.హరిహరన్ గారిని వాళ్ళింట్లో పరిచయం చేసింది. కౌసల్యకి ఆయన బావగారు. నిరాడంబరంగా ఉన్న, ఎంతో ప్రతిభావంతుడైన ఆయనతో సంభాషణ నాకు చాలా ఆనందం కలిగించింది.

కౌసల్య వాళ్ళ ఇంటికి జుహూ బీచ్ దగ్గరగా ఉంది. కోలాహలంగా ఉండే జుహూ బీచ్ కంటే, మా ఇన్‌స్టిట్యూట్ దగ్గరలోనే ఉన్న ప్రశాంతమైన వెర్సోవా బీచ్ నాకు చాలా నచ్చేది. సెవెన్ బంగ్లోస్ లోని మా ఇన్‌స్టిట్యూట్ నుంచి కొద్ది దూరం నడుస్తే, హిందీ సినిమాలలో విలన్ గా పేరొందిన ప్రేమనాథ్ బంగళా వచ్చేది. విశాలమైన ఆయన ఇంట్లోనే ఒక పక్క నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉండేది. ఆ బంగళా పక్క సందున కొన్ని అడుగులు వేస్తే వెర్సోవా బీచ్. ఇక్కడ సందర్శకుల తాకిడి చాలా తక్కువగా ఉండేది.

ఎన్నో సాయంత్రాలు వెర్సోవా బీచ్ కి ఒంటరిగా వెళ్లి హాయిగా సేద తీరేవాణ్ని. సముద్రపు అలల ఘోష, ఇసుక చాటున చక చకా పరుగెత్తే చిన్న ఎండ్ర కాయలు, ఇసుక మీద పేరుకుపోయిన శతాబ్దాల సముద్ర జీవాల పొట్టు, గవ్వలు, నున్నటి రాళ్లతో ఉన్న వెర్సోవా బీచ్ చూస్తే నాకు వేరే ప్రపంచంలోకి వచ్చినట్లనిపించేది.

ఇక్కడ బీచ్‌లో పొద్దు గుంకుతున్న వేళ, సమీపంలో పెద్ద నారింజ గోళం సముద్రంలో మెల్లగా మునకెయ్యడం, నాకొక వర్ణించలేని, మర్చిపోలేని అనుభూతి.

సముద్రపు సౌందర్యాన్ని, హాయిని అనుభవించకుండా, ఎటుచూసినా మేత మేస్తూ, పిచ్చి గెంతులేసి, ప్లాస్టిక్ చెత్త నింపే వికృత మానవులతో బిల బిలలాడే జుహూ, చౌపాటి బీచ్ లతో పోలిస్తే ఇక్కడి బీచ్ ఎంతో బాగుండేది. ఇక్కడ బూచి వేషులు, అమ్మకపు దారుల గొడవ కూడా తక్కువగా వుండి, కాలుష్యం పెద్దగా కనిపించేది కాదు.

అలాగే, వినాయక చవితి పండుగప్పుడు, చుట్టు పక్కల జనం ఎంతో భక్తి శ్రద్ధలతో, తల మీద పూజించిన గణేశుని పెట్టుకుని, మేళ తాళాలతో, భరించగలిగిన నృత్య గానాలతో వేడుకగా వచ్చి, హారతిచ్చి, దీప కాంతులతో గణేశ ప్రతిమలని సాగరంలో నిమజ్జనం చేయటం ఒక సుందర జ్ఞాపకం నాకు.

సి.ఐ.ఎఫ్.ఇ.లో నా ప్రాజెక్ట్ పని చక్కగా సాగుతోంది. మా గైడ్ డాక్టర్ రావు గారు మాత్రం చనువివ్వకుండా, మమ్మల్ని పరిశీలిస్తుండే వారు. తన పని మాత్రమే పట్టించుకునే ఆయనకీ, మా ఉత్తరాది డైరెక్టర్‌కి కోల్డ్ వార్ నడుస్తుండేది. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అంటే, ఆయన మాటే చెల్లుతుంది. ఆయన అడుగులకి మడుగులొత్తకపోతే, ప్రతి పనికీ ఎంత ఇబ్బంది కలిగించగలరో మాకూ పరోక్షంగా అనుభవమయ్యేది.

నాకనిపిస్తుంది ఉత్తరాది వారికి, దక్షిణాది వారికి, వారి ధోరణులలో, సంచాలనంలో చాలా వ్యత్యాసం అప్పుడూ ఇంకా ఇప్పుడూ ఉన్నదని. ఉత్తరాది మనుష్యుల ఆడంబరం, అవినీతి, విషయ పరిజ్ఞానం లేకపోయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, నాకిప్పటికీ సహించలేని విషయాలు.

మా డైరెక్టర్ ఆఫీసుకి పదకొండున్నర, పన్నెండు గంటలకి రావటం, కొంచెం సేపు ఢిల్లీ కేంద్రానికి ఫోన్లు చేసి చాలా బిజీగా ఉన్నట్లు నటించడం, తరువాత అస్మదీయ సైంటిస్టులు, అధికారులతో తీరికగా ముచ్చట్లు చెప్పడం, పనివేళలు ముగిసిన తరువాత రాత్రి ఏడున్నర గంటలకి, ఆఫీస్ గుమ్మం దగ్గరో లేక వాహనం ఎక్కేటప్పుడో, తన కోసం పడిగాపులు గాచే అధికారుల ఫైళ్లు సంతకం చేయటం చూసి నాకు కంపరమేసేది.

ఆనాడే నేను ఉన్నత పదవికి చేరినప్పుడు ఇలాంటి పనులు చేయకూడదని నిశ్చయించుకున్నాను. మనం ఎలా ఉండాలో, ఉండకూడదో, పై అధికారుల ప్రవర్తన నేర్పుతుందనుకుంటాను.

ఇన్‌స్టిట్యూట్ పని వేళల తరువాత, ఇక్కడి మెస్ లో హాస్టల్ వాళ్ళతోటి టేబుల్ టెన్నిస్, వాలీ బాల్ ఆటలతో చక్కటి కాలక్షేపం అయ్యేది. ఆ తరువాత రాత్రి భోజనం తరువాత భవన్స్ హాస్టల్‌కి వెళ్లేవాడిని.

సి.ఐ.ఎఫ్.ఇ.లో శిక్షణ పొందుతున్న చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన ఆఫీసర్స్, తమిళనాడు వారు తప్ప, అందరూ హిందీలో మాట్లాడేవారు. వీరందరూ వేర్వేరు యాసలతో హిందీ, ఇంగ్లిష్ మాట్లాడుతుంటే గమ్మత్తుగా ఉండేది. రాత్రి పూట దూరదర్శన్‌లో చిత్రహార్ కార్యక్రమం వచ్చేటప్పుడు, ఒక్కటే టీవీ ఉన్న హాస్టల్ కామన్ హాల్లో అందరూ చేరి భలే ఎంజాయ్ చేసేవారు. వారి ప్రత్యేక ఆహార అలవాట్లు, రుచులు ఎలా ఉన్నా, అన్ని రాష్ట్రాల వారికి, నైజీరియా నుంచి వచ్చిన సెరిల్ ఈకోచ, సింగపూర్ నుంచి వచ్చిన శివరాజ్ సితంపరం, ఫిజీ నుంచి వచ్చిన వారికి కూడా, మెస్‌లో మాత్రం భోజనం ఒకటే విధంగా ఉండేది. నేను మొదటిసారి ఇక్కడ ఫుల్కాలు తినడం అలవాటు చేసుకున్నా. అది నేటికీ కొనసాగుతోంది.

మెస్‌లో ఆదివారం ఎక్కువగా చేపల మాంసం వండేవారు. ఐతే కొంతమంది హిల్సా, మ్రిగాల్, కట్లా చేపలు కావాలంటే, కొంత మంది సముద్రపు చేపలైన బాంబే డక్, పొంఫ్రెట్ వండాలని గొడవ చేసేవారు. వీళ్ళని చూస్తే, చేపలు తినటంలో కూడా ఒక్కో ప్రాంతానికి మన దేశంలో ఎంత వ్యత్యాసం వుందో తెలిసింది. తినక పోయినా, నాకు మాత్రం ఖరీదైన పొంఫ్రెట్ చేపలు చూస్తే బాగుండేవి, అలాగే వీటిలో వేస్ట్ తక్కువ జరిగేది.

ఒక నెల, సి.ఐ.ఎఫ్.ఇ. లో పరీక్షల సమయంలో నాకు మెస్ సెక్రటరీగా బాధ్యత అప్పగించారు. అప్పుడు నేను సమర్ధంగా మెస్ ఖర్చులు తగ్గించడమే కాక, రోజూ ఘుమ ఘుమలాడే మిరియాలతో కూడిన టొమాటో రసం, మా మరాఠీ కుక్ మహాదిక్‌తో చేయించడంతో, తమిళనాడు ఆఫీసర్స్ నన్ను భలే మెచ్చుకునే వాళ్ళు.

సి.ఐ.ఎఫ్.ఇ.లో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల్లో, హైదరాబాద్ నుంచి వచ్చిన వేణుగోపాల రావు, మంగళూరు నుంచి వచ్చిన ప్రవీణ్ పుత్ర, లక్షద్వీప్ నుంచి వచ్చిన హనీఫా కోయా, ప్రొద్దటూరు నుంచి వచ్చిన రామతీర్థం, నాగాలాండ్ నుంచి వచ్చిన డేవిడ్ షిమ్రే, పూణే నుంచి వచ్చిన కులకర్ణితో పాటు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన సుబ్రతో కోర్ నాకు బాగా సన్నిహితులయ్యారు.

రాజేష్ ఖన్నా లాగే ఉండే హనీఫా కోయా హిందీ సినిమా పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉండేవాడు. ఇక ప్రవీణైతే విలక్షణమైన వాడు. వాలీ బాల్, టేబుల్ టెన్నిస్ అద్భుతంగా ఆడటమే కాక, చక్కటి బొమ్మలు కూడా గీచే వాడు. వివిధ రంగుల చేపల బొమ్మలతో గ్రీటింగ్ కార్డ్స్ చేసి అప్పుడప్పడూ అమ్మేవాడు. ఇదే కాదు, తన రూమ్ లో స్టవ్ మీద దోశెలు వేసి సరదాగా మా దగ్గర డబ్బులు తీసుకునే వాడు. చాలా కలుపుగోలుగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ప్రవీణ్ నాకెంతో ఇష్టుడయ్యాడు. చలాకీగా, ఎప్పుడూ హుషారుగా ఉండే వేణుగోపాలరావు కూడా తరువాత నాకు సన్నిహితుడయ్యాడు.

నాతో పాటు కౌసల్య, సత్యమూర్తిల పరిశోధన కూడా వేగం పుంజుకుంది. డాక్టర్ రావు గారి దగ్గర ఎన్నో ల్యాబ్ టెక్నిక్స్ నేర్చుకున్నాము. టైట్రేషన్ చేసేటప్పుడు పిపేట్ ద్వారా అవసరమైతే ఎలా సగం కంటే తక్కువ డ్రాప్ పడేటట్లు కంట్రోల్ ఉండాలో, ఆయన చూపించేవారు. ఐతే తరువాత శీఘ్ర టెక్నాలజీ మార్పుల వల్ల, మేము నలభై ఏళ్ళ క్రింద ఎన్నో ల్యాబ్ ప్రొసీజర్స్, టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడున్న కష్టం ఇప్పుడు లేదు. ఎంతో సులభంగా ల్యాబ్లో పరిశోధన చేయటానికి ఉపకరణాలు వచ్చేసాయి. అవసరమైతే ఆటోమేటెడ్ యంత్రాలు వాడి, అప్పుడు మేము నెలల తరబడి చేసిన ప్రయోగాలు, నేడు కొన్ని రోజులలో చేసేయవచ్చు. దీని వల్ల పరిశోధన సమయం చాలా తగ్గే ప్రయోజనముంది. కానీ, కష్టపడి నేర్చుకుని ఆ తరువాత లాఘవంగా మేము వాడిన ల్యాబ్ టెక్నిక్స్ వల్ల, అప్పుడు మాకు కలిగిన ఆనందం వెల కట్టలేనిదనుకుంటాను.

ఆడుతూ పాడుతూ కౌసల్యా, సత్యా, నేను పని చేసుకునేవాళ్లం. మా ప్రాజెక్ట్స్ కూడా పూర్తిగా వేర్వేరుగా ఉండటంతో మా మధ్యలో చిక్కులు ఉండేవి కాదు. కౌసల్యకి కూడా హైదరాబాద్ మూలాలు ఉండడం వల్ల, తను హిందీ, తెలుగుతో పాటు, తమిళ, కన్నడ భాషలు చక్కగా మాట్లాడేది. మేము పని చేస్తున్నప్పుడు కౌసల్య మెల్లగా, చక్కటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం వినిపించేది. ఎప్పుడూ జీన్స్ వస్త్రాలతో ఆధునికంగా కనిపించే కౌసల్య, శాస్త్రీయ సంగీతం ఇంత చక్కగా పాడుతుందని ఊహించలేదు. కౌసల్యకి పాక్షికంగా ల్యుకోడెర్మా వుండేది. ఐనా, దాని గురించి తన బాధని దిగమింగుకుని, ఎప్పుడూ హుషారుగా ప్రవర్తించే కౌసల్య అంటే నాకు గౌరవంగా వుండేది.

హైదరాబాద్‌లో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కౌసల్య వాళ్ళ నాన్నగారు ఒకసారి వచ్చి, మమ్మల్ని ట్రాంబేలోని బి.ఏ.ఆర్.సి అని పిలువబడే భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కి తీసుకెళ్లారు. ఎంతో కీలకమైన ఈ అణు పరిశోధన సంస్థ సందర్శనకు అనుమతి దొరకడం సులభం కాదు. ఆయనకున్న పరిచయాల వల్ల, మేము బి.ఏ.ఆర్.సి.లో సైరస్, ధ్రువ ఇంకా అప్సర అనే అణు విజ్ఞాన కార్యక్రమాలకి ఉపయోగించే రియాక్టర్ ఫెసిలిటీలు చూడగలిగాము. వీటి గురించి తెలుసుకోవటం మాకెంతో అద్భుతమనిపించింది.

బి.ఏ.ఆర్.సి.లో వ్యవసాయము, ఆహారానికి కూడా సంబంధించి అణు విజ్ఞానం ఉపయోగించే పరిశోధనలు గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఇర్రేడియేషన్ ల్యాబ్ లో సైంటిస్ట్ మాకు ఇర్రేడియేషన్ ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు.

ఇర్రేడియేషన్ ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్ తాకకుండా, కేవలం రేడియేషన్ మూలంగా వచ్చిన శక్తిని మాత్రమే ఆహారాన్ని ప్రాసెస్ చేయటానికి గాని, భద్రపరచడానికి గాని ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా సురక్షితమని, దీని వల్ల ఆహారం చెడిపోకుండా, దాని పోషక విలువలు నష్టపోకుండా, దీర్ఘ కాలం నిలువ ఉంటుందని తెలిసింది. ఐనా, ఆశ్యర్యంగా ఎందుకో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ, ఇర్రేడియేషన్ ప్రక్రియని ఆహార తయారీ కోసం చాలా తక్కువ వాడుతున్నారు.

ఇక నా ప్రాజెక్ట్ విషయానికొస్తే, తాజా జవ్లాని సూర్యరశ్మిలో ఎండ పెట్టడమే కాకుండా, యాంత్రిక ట్రే డ్రైయింగ్ అంటే కృత్రిమ డీహైడ్రేషన్ ద్వారా కూడా జవ్లాని ఎలా భద్రపరచాలి అనే నా పరిశోధనలు పెరిగాయి. వీటి కోసం తరచూ నేను వెర్సోవా బీచ్ కి వెళ్లి వందన తాండేల్ దగ్గర జవ్లా కొనడం ఎక్కువైంది. వందనతో బాతాఖానీ పెరిగింది. ఆవిడ తన భర్తకి పెరిగిన తాగుడు వ్యసనం గురించి నాతో చెప్పి బాధ పడేది. నేనెప్పుడు వెళ్లినా నవ్వుతూ, నాకు పూర్తిగా సహకరించే ఆవిడ కూడా నా బాంబే మిత్రుల జాబితాలో చేరింది.

ట్రయల్ బ్యాచ్ వేసేటప్పుడు, నేను పొద్దునే, చేపలు రవాణా చేసే ఆటో తీసుకుని, వందన దగ్గర ఐస్‌తో పాటు నింపిన ముప్పై కిలోల జవ్లా తీసుకుని సి.ఐ.ఎఫ్.ఇ.కి వచ్చేసి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫిష్ ప్రాసెసింగ్ గదికి తీసుకెళ్లి, ట్రే డ్రైయింగ్ యంత్రాలలో వాటిని జాగ్రత్తగా పరచి, వేడితో ఆర పెట్టడం మొదలు పెట్టేవాణ్ని. సి.ఐ.ఎఫ్.ఇ. స్టాఫ్ అంతా తొమిదిన్నర పదింటికి ఆఫీసుకి వచ్చే సమయానికి ఇదంతా పూర్తయ్యేది.

ఇక మొదలయ్యేది అసలు తమాషా. జవ్లా వేడి చేస్తుంటే చాలా వాసన వచ్చేది. అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్ గారి గది, ప్రొఫెసర్ల గదులు, ఇంకా మా ల్యాబ్ మాత్రం పైన అంతస్థులో ఉండేవి కానీ, ఫిష్ ప్రాసెసింగ్ గది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇన్‌స్టిట్యూట్ రిసెప్షన్ కి దగ్గరగా ఉండడంతో, అక్కడ భరించలేని వాసన ఉండేది.

ఒకసారి ఈ వాసన అస్సలు తట్టుకోలేక రిసెప్షనిస్ట్ మిసెస్ మెహతా నాతో “నువ్వు నాన్ వెజ్ తినవు కానీ పనిష్మెంట్ లాగా మమ్మల్ని ఇబ్బంది పెడతావెందుకు”అని బాగా గొడవ చేసింది.

నేను “ఝూలెలాల్ మీద ఒట్టు. మీ కోసమే కదా నేను ఇంత కష్ట పడేది” అని సింధీ మెహతాతో అంటే ఆవిడ “అరే నీకు సింధీ కూడా తెలుసా” అని నవ్వింది.

నేను ఆవిడతో “మై పాకిస్తాన్ కే హైదరాబాద్ సే ఆయా హూ” అని నవ్వుతూ బదులిచ్చాను. మిసెస్ మెహతా కోపం నటిస్తూ “నువ్వుండు నేనిప్పుడే నీ బాబాకి ఫోన్ చేస్తాను నిన్ను తీసుకెళ్ళిపొమ్మని” అని డైరీలో మా నాన్న ఎమర్జెన్సీ నెంబర్ కోసం చూస్తున్నట్లు చేస్తుంటే, ఇంతలో మా లైబ్రరీ అసిస్టెంట్ సర్దార్జీ వచ్చాడు.

దుర్వాసనకి ముక్కుపుటాలెగరేస్తున్న అతనితో మిసెస్ మెహతా “దేఖ్ ఇస్కో భగావ్. ముజ్ సే నహీ హోతా అబ్” అని గట్టిగా చెప్పింది.

నేను నవ్వుతూ “ఇందులో నా తప్పేముంది. ఫిష్ ప్రాసెసింగ్ ల్యాబ్ దే తప్పు” అన్నాను.

దానికి సర్దార్జీ నా దగ్గరకి వచ్చి “హా! యే ఫిష్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఖతర్నాక్ హై. నీకు తెలుసా మూడేళ్ళ క్రితం ఈ ఫిష్ ప్రాసెసింగ్ ల్యాబ్ లోనే గుప్త్ జ్ఞాన్ సినిమా షూటింగ్ చేశారు” అని చెప్పాడు. నేను “అదేంటి అది సెక్స్ విజ్ఞానం కోసం తీసిన సినిమా. అది హాస్పిటల్లో కదా తీస్తారు” అన్నాను.

సర్దార్జీ “ఇది బాంబే బాబూ! ఈ మాయాపురిలో ఏమైనా చేస్తారు” అని నవ్వి అసలు విషయం చెప్పాడు. తెలిసిందేమిటంటే, మా సి.ఐ.ఎఫ్.ఇ.సిఫ్ ఫిష్ ప్రాసెసింగ్ ల్యాబ్ లో చక్కటి స్టీల్ టేబుల్స్ వాడుకుని, ఆ సినిమా వాళ్ళు చిన్న మార్పులతో సర్జరీ రూము లాగా చేసి, తెలివిగా షూటింగ్ చేసారట! నేను తర్వాత మా ఫ్రెండ్స్ కి ఈ విషయం చెబితే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు.

ఒక రోజు మిసెస్ మెహతా నా కోసం ఎవరో అమ్మాయి ఫోన్ చేసిందని పిలిచింది. నాకెవరు అమ్మాయి ఫోన్ చేసిందని అనుకుంటూ, ఫోన్ రిసీవ్ చేసుకుని ఎవరని అడిగాను. అటునుంచి ఒకమ్మాయి చాలా చనువుగా “ఎవరో గెస్ చెయ్యి చూద్దాం” అన్నది. నేను ఈమధ్యే పరిచయమైన ఇద్దరు భవన్స్ హాస్టల్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పి ప్రయత్నించాను. ఇంకో వైపు మిసెస్ మెహతా నన్ను గమనిస్తోందని తెలిసి, ఆ అమ్మాయితో “చూడు. నేను నా ఎక్స్పరిమెంట్ వదిలి వచ్చాను. త్వరగా చెప్పక పోతే ఫోన్ పెట్టేస్తాను” అనేసరికి “ఏయ్ వద్దొద్దు ఆగు. ఏంటి శ్రీధర్ నన్ను గుర్తు పట్టకపోవడం ఏమీ బాగోలేదు. సరే, ఒక పని చేద్దాం నేను ఇవాళ సాయంత్రం ఆరింటికి బాంద్రాలో బ్యాండ్ స్టాండ్ పాంట్రీ దగ్గర ఉంటాను. నువ్వొచ్చి గుర్తు పట్టాక, ఎక్కడ ట్రీట్ ఇస్తావు” అన్నది ఆ అమ్మాయి.

ఆమె నన్ను వెంటనే వదిలేటట్లు లేదని, నేను “సరే, తాజ్ హోటల్లో నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే! సాయంత్రం కలుద్దాం” అని ఫోన్ పెట్టేయబోతుండగా, ఫోన్ లో గొంతు మగవాడిగా మారింది. అటు వైపు నుంచి “ఏంటి శ్రీధర్ చాలా ఫాస్ట్ ఐపొయావే. ఊ! బాగుంది వ్యవహారం” అని ప్రకాష్ నవ్వుతూ ట్విస్ట్ ఇచ్చి “సరే, బిజీగా ఉన్నావు కదా, సాయంత్రం మా బ్యాంకు కొచ్చెయ్, మాట్లాడదాం” అని ఫోన్ పెట్టేసాడు.

ఇదంతా కొంచెం కొంచెం అర్ధమైన మిసెస్ మెహతా, “క్యా హువా శ్రీధర్, క్యా బాత్ హై” అంటుంటే “కుచ్ నహీ మేరా దోస్త్ కా ప్రాంక్ కాల్ హై, సారీ” అని నేను వెళ్తుంటే, ఆవిడ “హా హా! బాంబేకా హవా లగ్ గయా” అని నవ్వింది.

మర్నాడు సాయంత్రం నేను ప్రకాష్ దగ్గరకి వాళ్ళ బ్యాంకు ఆఫీస్ పని ముగిసే వేళకి వెళ్లాను. అప్పటికే ప్రకాష్, అతని కొలీగ్స్, బ్యాంకు కౌంటర్లు అన్నీ మూసేసి క్యారమ్ బోర్డు ఆడుతున్నారు.

నన్ను చూసి ప్రకాష్ నవ్వుతూ “హా చార్మింగ్ గై! ఎలా ఉన్నారు” అన్నాడు.

నేను “అయ్యా ఏమిటి మీ చిలిపి పనులు. నేనప్పుడెంతో బిజీగా ఉన్నాను తెలుసా.” అన్నాను.

ప్రకాష్ తన మిగతా కొలీగ్స్ ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకి నన్ను పరిచయం చేసి, వాళ్ళతో “దేఖో మృదుల కా బాయ్ ఫ్రెండ్ ఆయా” అన్నాడు. వాళ్లంతా “అచ్చా హమ్ కో భీ తాజ్ హోటల్ లే జావోనా” అని నవ్వారు. నేను “ఏంటి బాబూ అందరితో కలిసి నన్ను ఇరికించావా” అని ప్రకాష్ చేయి తిప్పాను.

“అబ్బా, వదులు హీరో! నీ ఫ్రెండ్ ని ఇప్పుడే పిలుస్తాను” అని ప్రకాష్ “హే మృదులా ఇదర్ ఆవో తుమ్హారా బాయ్ ఫ్రెండ్ ఆయా” అని దూరంగా నిల్చున్న ఒక అమ్మాయిని పిలిచాడు. సన్నగా, పొడుగ్గా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ లో ఉన్న ఆ అమ్మాయి, నా దగ్గరకి వచ్చి సిగ్గు పడుతూ “సారీ” అని పరుగెత్తికెళ్లి పోయింది.

నేను ప్రకాష్ తో “భలే పెద్ద ప్రాంక్ ఆడావుగా. మరేంటి హీరోయిన్ పారిపోతోంది” అన్నాను.

ప్రకాష్ “లేదు మృదులకి చాలా సిగ్గు. ముందు భయపడింది కానీ, నేను నువ్వు చాలా మంచివాడివని, సరదాగా ఆట పట్టిద్దామని చెబితే ఒప్పుకుంది. కానీ నేను చెప్పినట్లు భలే మాట్లాడింది కదూ నిన్న. గమ్మత్తేంటంటే మృదుల గోమ్స్‌కి, నీకిప్పుడే పరిచయమైన డిక్రూజ్‌తో వచ్చే నెల పెళ్లి. వాళ్లిద్దరూ గోవన్స్” అన్నాడు.

“ఓహ్ దట్స్ నైస్” అని డిక్రూజ్, మృదులకి అభినందనలు చెప్పాను నేను.

బాంబేలో జరిగిన అప్పటి సంఘటన తలుచుకుంటే, ఇప్పటికీ నాకు భలే సరదాగా ఉంటుంది. అప్పటి బాంబే యువత వ్యవహారమే ప్రత్యేకమనటానికి ఇదొక ఉదాహరణ.

కొన్నాళ్ళకి, మా ఇన్‌స్టిట్యూట్ వార్షికోత్సవం జరిగింది. ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో బయట ఎత్తైన వేదిక చక్కగా అలంకరించారు. వేదిక కింద కుర్చీలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన ఒక హాస్య సన్నివేశం తలుచుకుంటే నాకిప్పటికీ నవ్వొస్తుంది. వార్షికోత్సవ వేడుక నిర్వహించటానికి బెంగాలీ ఆఫీసర్ సుబ్రతో కోర్‌ని వ్యాఖ్యాతగా తీసుకున్నారు. కార్యక్రమం మొదలుపెట్టడానికి మైక్ దగ్గరకి వచ్చిన సుబ్రతో కోర్, చాలా మంది ఆడియన్స్ కూర్చోకుండా, నిల్చుని కోలాహలంగా ఉండేసరికి, అతను గట్టిగా “హలో ఆల్ ఆఫ్ యు ప్లీజ్ షిట్ డౌన్” అన్నాడు. అంతే! అందరూ నో! అంటూ ఒక్కసారి నవ్వుతో గొల్లుమన్నారు.

చాలా మంది బెంగాలీ వాళ్ళు ‘స’ అక్షరాన్ని ‘ష’ లాగా పలుకుతారు. దానివల్ల వచ్చిన కామెడీ ఇది. ఐతే, ఇంకో తమాషా ఏంటంటే చాలా మంది ఉత్తరాది వాళ్ళు ‘ష’ అక్షరాన్ని ‘స’ లాగా పలుకుతారు. అది వేరే కామెడీ!

వేడుకలో రిజిస్ట్రార్ ప్రారంభోత్సవ ఉపన్యాసం తరువాత, వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన వాళ్ళు భలే ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మణిపురి నుంచి వచ్చిన సులోచన, మెమ్చా దేవి, టికెన్ సింగ్ వెదురు బొంగుల మధ్య ఎంతో చాకచక్యంగా తప్పించుకుని గెంతుతూ, అద్భుతంగా వాళ్ళ డాన్స్ ప్రదర్శించారు. బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కాళీమాత నృత్యం, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు దాండియా, ఇంకా నైజీరియా నుంచి వచ్చిన ఈకోచ, మలేషియా నుంచి వచ్చిన సివరాజ్ సితంపరం గిటార్ వాయించి వెస్ట్రన్ సంగీతం వినిపించారు.

ఐతే, ఈ సమయంలో బలభద్రపురం, కాకినాడలో ఉన్న సి.ఐ.ఎఫ్.ఇ. శాఖ నుంచి వచ్చిన అక్కడి హెడ్ సిన్హా గారు, మాతో “అన్ని రాష్ట్రాల వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు కానీ, మన తెలుగు వాళ్ళ ప్రదర్శనే లేదు” అని చాలా నిరుత్సాహపడ్డారు.

అందుకే నేను సి.ఐ.ఎఫ్.ఇ. విద్యార్థిని కాకపోయినా, అప్పటికప్పుడు నిర్ణయించుకుని, మొదట ఇంగ్లీష్‌లో సబ్జెక్టు వివరించి, నా చాణక్య ఏకపాత్రాభినయం తెలుగులో చేసాను. ఇందులో చాలా వరకు సంస్కృత పదాలు ఉండడం వల్ల, ఇంకా నా నటన కూడా అందరికీ నచ్చి, చాలా బాగా చేశానని మంచి ప్రశంసలు వచ్చాయి.

ఇక సిన్హా గారైతే చాలా సంతోషించి, “తెలుగు వాళ్ళ ఉనికి ఘనంగా చాటావయ్యా” అని తెగ సంబరపడ్డారు. మా ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న తెలుగు వారైన ముగ్గురు ప్రొఫెసర్స్, ఫిషరీస్ ఎకనామిక్స్ చెప్పే డాక్టర్ సుబ్బారావు గారు, అలాగే పప్పు సుబ్బారావు గారు, ఫిషరీస్ టెక్నాలజీ చెప్పే శ్రీకృష్ణ గారు కూడా చాలా అభినందించారు.

అప్పట్లో బాంబేలో లక్షల సంఖ్యలో తెలుగు వారున్నా, ఇక్కడున్న వారితో పూర్తిగా కలిసిపోవడం వలన నగరంలో వారి ఉనికి ప్రత్యేకంగా తెలిసేది కాదు. నేను బాంబే వచ్చిన కొత్తలో దాదర్ లో ఉన్న ఆంధ్ర మహాసభలో ఏమైనా వసతి దొరుకుతుందేమో అని వెళ్లాను. అక్కడ సౌకర్యంగా కూర్చుని ముచ్చట్లాడుతున్న ప్రతినిధులు నిర్లక్ష్యంగా, నిరాసక్తంగా ప్రవర్తించిన తీరు చూసి, నాకు అప్పటి ఆంధ్ర మహా సభ వీళ్ళ స్టేటస్ సింబల్ కోసమే కానీ, బయటినుంచి వచ్చిన తెలుగు వాళ్లకి సహాయం కోసం కాదని అర్థమయ్యింది.

నేను మాత్రం బాంబేలో భవన్స్ హాస్టల్ చేరాక, ఎంతో మంది నా హైదరాబాద్ మిత్రులు నా దగ్గరకి వచ్చి బాంబేలో పని చూసుకుని వెళ్లే వాళ్ళు. ఎక్కువగా ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్లే చాలా మంది మిత్రులు నా దగ్గరకి వచ్చి సహాయం తీసుకునే వాళ్ళు. అప్పట్లో బాంబే జాతీయ విమానాశ్రయం ఉన్న శాంతా క్రూజ్ నుంచి, పెద్ద లగేజీతో దూరంగా సహార్ అనే ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. దీంతో నా మిత్రులు పొద్దున ట్రైన్లో వచ్చిన వాళ్ళు, లేక విమానంలో వచ్చిన వాళ్ళు, నా దగ్గరకొచ్చి రెస్ట్ తీసుకుని తిరిగి ఆ రోజు రాత్రో లేక మరునాడో, సహార్ లో విమానం ఎక్కడానికి సహాయపడే వాణ్ని. అలా ఎన్నోసార్లు సహార్ ఎయిర్‌పోర్ట్‌లో అర్ధరాత్రులు గడపడం జరిగేది. అదిప్పుడు తలుచుకుంటే, కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు ఏమీ పట్టించుకోకుండా, ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో కదా అనిపిస్తుంది.

దీనికి విరుద్ధంగా బాంబే కుర్రాళ్ళ ప్రవర్తన ఉండేది. మొదట్లో ఇక్కడ ఒక ఫ్రెండ్ నా దగ్గరకి వచ్చి హోటల్ కి వెళదామంటే, పార్టీ ఇస్తున్నాడనుకుని వెళ్ళాను. మాకిష్టమైనవి ఆర్డర్ చేసి తినేసాక, చివర్లో వాడు తిన్న దానికి మాత్రమే లెక్కేసి టేబుల్ మీద డబ్బులు పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. దీనికి నన్ను వాడు అంత ఆదరంగా పిలవటమేమిటి? చివర్లో నా బిల్‌తో పాటు సర్వర్ టిప్ నేను ఇవ్వటమేమిటి? అని బుర్ర గోక్కున్నాను. అదే మా సికింద్రాబాద్లో ఐతే, మిత్రులం మేము హోటల్ కెళ్ళి తిన్న తరువాత, అందరం బిల్లు కట్టడానికి పోటీ పడేవాళ్ళం. ఒక్కోసారి మొహమాటానికైనా సరే!

బాంబేలో నాకు జరిగిన ఈ ఆదర సత్కారాన్ని ‘గోయింగ్ డచ్’ అంటారని తెలిసింది. నాకు వీరి తెలివి అబ్బో అనిపించింది. బాంబేలో మంచి శిక్షణ దొరికిందని సమాధాన పడ్డాను. సికింద్రాబాద్లో నా మిత్రులకి ఈ శిక్షణ గురించి చెబితే, వాళ్ళు వెంటనే ముక్కున వేలేసుకున్నారు!

ఇక బాంబేలో ఉన్న యువత తెలుగు వారిని ‘మద్రాసీ’ అంటూ, ‘అండు గుండు’ అంటూ ఆట పట్టించేవారు. అసలు బాంబేలో ఉన్న చాలా మంది యువత చూడడానికి స్టైలిష్ గా, ఆధునికంగా కనిపించినా, వారికి త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే ధ్యాసే తప్ప, జనరల్ నాలెడ్జ్ తక్కువ. వీళ్ళు నోరు తెరిస్తే అర్ధమయ్యేది, వీళ్ళకి ‘ఆయేలా, గయేలా’ తప్ప ఇంగ్లిష్ పరిజ్ఞానం కూడా భయంకరంగా హీనమని. నేను మాత్రం, వీళ్లెవరైనా నాతో పెట్టుకుంటే ఏకి పారేసేవాణ్ని.

ఇక ఈ విషయం వదిలేసి, బాంబేలో విద్యార్థిగా నాకు కలిగిన ఎన్నో మంచి అనుభవాల గురించి చెప్పాలంటే, జాతీయ స్థాయిలోనున్న అత్యున్నత ప్రతిభావంతుల, స్ఫూర్తిదాతల పరిచయ భాగ్యం కలిగి, వారితో సమయం గడిపే అదృష్టం నాకు దక్కింది.

ఒకసారి మా ఇన్‌స్టిట్యూట్ కి డాక్టర్ ఎస్ జెడ్ ఖాసిం (సయ్యద్ జహూర్ ఖాసిం) వచ్చారు. డాక్టర్ ఖాసిం ప్రసిద్ధ మెరైన్ బయోలాజిస్ట్. ఆయన ప్రాతినిధ్యంలో జరిగిన భారతీయ అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్ విజయగాథ గురించి కొన్ని వారాల ముందు, అప్పట్లో దేశమంతా ఆయన పేరు మారుమ్రోగి పోయింది.

అసలు, అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్ విజయవంతమయ్యే వరకు ఈ సాహస యాత్ర వివరాలు చాలా గోప్యంగా ఉంచారు. ఈ మొదటి యాత్ర ద్వారా, అతి కష్టతరమైన అంటార్కిటికాని చేరి, కొన్ని అగ్రరాజ్యాల సరసన మన దేశ ఉనికిని చాటుకోవడంతో పాటు, అక్కడ వివిధ పరిశోధనలు కొనసాగించాలన్నది మన ప్రభుత్వపు ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా, అంటార్కిటికాలో అపారంగా లభించే క్రిల్ అనే అధిక ప్రోటీన్లు కలిగిన ష్రిమ్ప్ (చిన్న రొయ్యలు) కూడా, ఇండియా వినియోగించుకోవాలన్న ధ్యేయం ఒకటి.

అంటార్కిటికా యాత్ర విజయాన్ని పురస్కరించుకుని డాక్టర్ ఖాసిం, మా సి.ఐ.ఎఫ్.ఇ. ఇంకా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా పర్యటించారు. ఇక ఆయనతో పాటు వచ్చిన ఆయన కుమార్తె బాంబే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదువుతోందని తెలిసింది. నవాబుల వంశీయుడైన డాక్టర్ ఖాసిం, ఇంకా ఆయన కుమార్తె, చాలా అందంగా, హుందాగా ఉన్నారు.

డాక్టర్ ఖాసిం కొన్నేళ్ల క్రిందట సైంటిస్టుగా సి.ఐ.ఎఫ్.ఇ.తో పాటు, మాకు దగ్గరలోనే ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో కూడా డైరెక్టర్ గా పని చేసారని తెలిసింది. డాక్టర్ ఖాసిం చాలా కలుపుగోలుగా, సైంటిస్టులతో ముచ్చటిస్తూ మా ల్యాబ్ కూడా వచ్చారు.

అప్పటికే న్యూస్ పేపర్లలో క్రిల్ రొయ్యల గురించి తెలుసుకున్న నేను, ఆయనతో నవ్వుతూ చెప్పాను “క్రిల్ వలెనే మన దేశపు వెస్ట్ కోస్ట్ లో పుష్కలంగా లభించే జవ్లా యొక్క ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ గురించి మేము బయోకెమికల్ రీసెర్చ్ చేస్తున్నాము” అని. ప్రాంతీయంగా దొరికే జవ్లాని విస్మరించి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమఖండంలో క్రిల్ పట్టుకుందామన్న ప్రభుత్వపు మాటలని నేను సూచిస్తున్నానని ఆయనకి అర్ధమయ్యింది. “ఫ్రెండ్ ఇట్ ఈస్ జస్ట్ వన్ అఫ్ ది సెకండరీ ఆబ్జెక్టివ్” అని డాక్టర్ ఖాసిం నవ్వారు.

ఆ తరువాత నేను ఒకసారి బాంబే లోని హఫ్కిన్ ఇన్‌స్టిట్యూట్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు, అక్కడే పరిశోధన చేస్తున్న డాక్టర్ ఖాసింగారి అమ్మాయి కనిపించి పలకరించింది.

డాక్టర్ ఖాసిం గారితో మాట్లాడడం, ఆయన సైంటిఫిక్ టెంపర్ తెలుసుకోవడం, నాకు ఒక గొప్ప అవకాశం అలాగే మధురానుభూతిగా నిలిచిపోయింది.

మరోసారి మా ఇన్‌స్టిట్యూట్ కి, ప్రసిద్ధ టీవీ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్, ‘సురభి’ ఇంకా ‘ఎవరెస్ట్ ఆరోహణ ఫిల్మింగ్’ కార్యక్రమాలతో, దేశమంతా విశేష ఆదరణ పొందిన కశ్మిరీ పండిట్ సిద్ధార్ధ కక్ గారు, వాళ్ల అమ్మాయి అంతరా కక్ ని తీసుకుని వచ్చారు.

అప్పుడు అంతరాకి తొమ్మిదేళ్లు వుంటాయేమో. మా ఇన్‌స్టిట్యూట్ అంతా సందర్శించిన తరువాత, లంచ్ సమయానికి మా మెస్‌కి వచ్చారాయన. డైరెక్టర్ గారితో గెస్ట్ హౌస్‌లో కాకుండా, మేము తినే సాధారణ భోజనమే తింటామని వచ్చారాయన. అలాగే, ఆ సమయంలో వాళ్ళ అమ్మాయి ఫుడ్ వేస్ట్ చేయకుండా తినాలని, జాగ్రత్తలు తీసుకోవటం చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆడంబరం లేకుండా, హాయిగా నవ్వుతూ, ఎన్నో ఫిలిం మేకింగ్ విషయాలు ఆయన మాకు చెప్పారు. సిద్ధార్ధ కక్ గారితో గడిపిన అపూర్వ క్షణాలు నాకిప్పటికీ స్మరణీయం.

చూస్తూ చూస్తూ ఏడాదిన్నర గడిచిపోయింది. నా జవ్లా పరిశోధన కూడా మంచి ఫలితాలనిస్తోంది. ఇక ఒక ఆఖరి బ్యాచ్ ట్రయల్ మిగిలింది. దీనికోసం నేను ఒక రోజు పొద్దునే వెర్సోవా మచిలీమార్ కి వెళ్లాను.

ఈసారి చివరిగా పెద్ద బ్యాచ్ ట్రయల్ కాబట్టి, డాక్టర్ రావు గారు నన్ను మా ఇన్‌స్టిట్యూట్ డ్రైవర్ ని తీసుకుని జీప్‌లో వెళ్ళమన్నారు. అందుకే నాతో సావంత్ అనే డ్రైవర్ కూడా వెర్సోవా ఊరి చివరి వరకు వచ్చాడు. అక్కడ నుంచి తీరానికి జీప్‌లో వెళ్ళటానికి ఇరుకు సందుల్లో కుదరదు కాబట్టి నేను అతన్ని అక్కడే వేచి ఉండమన్నాను.

నేను లోపలికి నడిచి వెళ్లి తాండేల్ పడవ నిలిపే చోటుకి వెళ్లాను. అప్పటికింకా తాండేల్ రాలేదు కానీ వందన నిల్చుని ఉంది. నేను “ఏంటి వందనా ఆరున్నరవుతోంది, మీ ఆయన పడవ ఇంకా రాలేదా” అని అడిగాను. “లేదు బాబూ. ఈ పాటికి వచ్చేయాలి ఎందుకో లేట్ అయ్యింది” అని వందన తీరం వైపు చూసింది.

ఇంతలో నేను వెళ్లి రెండు పెద్ద ఖాళీ బుట్టల్లో ఐస్ ముక్కలు నింపించుకుని వచ్చాను. ఐదు నిమిషాల తరువాత వాళ్ళ పడవ రావటం కనిపించింది. పడవ దగ్గరకి రాగానే తాండేల్ హడావిడిగా దిగి వందనతో, అతని అసిస్టెంట్స్‌తో చేపలు దింపించుకోమని చెప్పి, పరుగున ఎటో వెళ్ళాడు.

వందన “క్యా హువా ఇస్కో” అని కోపంగా వెళ్లి చేపలతో పాటు రెండు పెద్ద బుట్టల్లో ఉన్న జవ్లా దింపించుకుని, అక్కడే జవ్లా తూకం వేయించి నా బుట్టల్లోకి మార్పించింది.

నేను ఆమెకి డబ్బులు చెల్లించి, “ఇది నా ఆఖరి బ్యాచ్. నీకు చాలా థాంక్స్. నీ మేలు మర్చిపోలేను, మళ్ళీ తరువాత తీరికగా కలుస్తాను” అని చెప్పి, అక్కడే ఉన్న పనివాళ్ళతో జవ్లా బుట్టలతో రోడ్ దాకా మోయాలని మాట్లాడుకుని, బయలుదేరబోతుండగా, ముగ్గురు బలంగా ఉన్న వాళ్ళు నా దగ్గర కొచ్చారు. వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసులని తెలిసింది. వాళ్ళు మరాఠీలో “ఏమున్నాయి ఆ బుట్టల్లో” అన్నారు. నేను నా రీసెర్చ్ కోసమని జవ్లా కొనుక్కుని తీసుకెళ్తున్నానని హిందీలో చెప్పాను.

పోలీస్ వాళ్ళు పని వాళ్ళతో ఆ బుట్టలని తీసుకుని దూరంగా ఉన్న పోలీస్ జీప్ దగ్గరకి రమ్మన్నారు. నేను ఆ పోలీసులకి నేను అర్జెంటుగా ఈ జవ్లా తీసుకుని వెళ్లాలని, లేకపోతే నా స్టడీ ప్రాజెక్ట్ పాడవుతుంది అని చెప్పి, “ఎందుకు సర్ ఈ జవ్లా బుట్టలు తనిఖీ చేస్తామంటున్నారు” అని అడిగాను.

ఇంతలో ఈ గలాటా తెలిసి వందన మా దగ్గరకి వచ్చి, పోలీసులతో “ఈ కుర్రాడు నా దగ్గర జవ్లా కొంటూ ఉంటాడు అతని చదువు కోసం” అని చెబుతుంటే, ఒక మొరటు పోలీస్ వాడు ఆమెని “తూ గప్ బస్” అని గద్దించి నాతో “యే షానే నాటక్ కరేలా క్యా? తాండేల్ క్యా దియా తుమ్హారేకో” అని గట్టిగా మాట్లాడాడు.

నేను “సర్! నేను సాథ్ బంగ్లాలో సి.ఐ.ఎఫ్.ఇ.లో రీసెర్చ్ చేస్తున్నాను. కావాలంటే మీరు తొమ్మిదిన్నరకి ఆఫీస్‌కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఈ బుట్టల్లో కేవలం జవ్లా ఉన్నాయి. ప్లీజ్ కావాలంటే, ఇక్కడే దింపించి బుట్టలు చెక్ చేసుకోండి” అన్నాను.

ఆ పోలీస్ వాడు నన్ను నా ఐడెంటిటీ కార్డు అడిగాడు. నేను “లేదండి ఇవాళ తీసుకు రాలేదు. నా హాస్టల్ గదిలో ఉంది. ప్లీజ్ నన్ను పోనివ్వండి. లేకపోతే ఆలస్యమైతే, నా పెద్ద ప్రాజెక్ట్ ట్రయల్ వృథా అవుతుంది” అని బతిమాలాను.

నా మాటలు వింటున్న ఇంకో పోలీస్ అతను “నీకు మరాఠీ ఎందుకు రాదు” అన్నాడు.

నేను “హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థిని. కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నా. కావాలంటే నాతో పాటు దయ చేసి సి.ఐ.ఎఫ్.ఇ.కి వస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో నా గురించి కనుక్కోవచ్చు. నేనిప్పుడు మా ఇన్‌స్టిట్యూట్ డ్రైవర్ సావంత్‌తో జీప్‌లో వచ్చాను. అతను రోడ్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నాడు “ అని చెప్పాను.

ఆ పోలీస్ అతని పేరు భీం రావ్ అని వాళ్ళ మాటల్లో తెలిసింది. భీం రావ్ ఇంకో పోలీస్‌తో మా డ్రైవర్ సావంత్ ని పిలుచుకుని రమ్మన్నాడు. సావంత్ వచ్చాక, భీం రావ్ పక్కనే ఉన్న పోలీస్ తో ఆ బుట్టలు అక్కడే దింపించి క్షుణ్ణంగా తనిఖీ చేయమన్నాడు. తనిఖీ తరువాత, బుట్టలలో జవ్లా తప్ప అందులో ఏమీ లేదని వాళ్ళు నిర్ధారించుకున్నారు.

భీం రావ్ నాతో తెలుగులో “ఎప్పుడైనా బయటకి వచ్చినప్పుడు ఐడీ కార్డు ఉంచుకోవాలి కదా” అని హెచ్చరించాడు. భీం రావ్ తెలుగులో మాట్లాడితే నేను చాలా ఆశ్చర్య పోయాను. ఆయనకి చాలా సార్లు థాంక్స్ చెప్పాను.

తెలంగాణ నుంచి వచ్చి బాంబేలో సెటిల్ ఐన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన భీం రావ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనటం విన్నారు కాబట్టి, దేవుడి దయ వల్ల నా మాటలు నమ్మబట్టి, పోలీస్ వాళ్ళు ఆ రోజు త్వరగానే నన్ను వదిలేశారు.

పని వాళ్ళ సహాయంతో నేను, సావంత్ గబ గబా మా జీప్ లోకి జవ్లా బుట్టలు ఎక్కించేసి సి.ఐ.ఎఫ్.ఇ.కి బయలుదేరాము. దారిలో సావంత్ “బాబూ మీరు చాలా అదృష్టవంతులు. బాంబే పోలీసులకి చిక్కితే అంత ఈజీగా బయటపడలేరు. అందులోనూ ఇది స్మగ్లింగ్ కేసు” అన్నాడు.

“స్మగ్లింగ్ ఏంటి సావంత్?” అని అడిగాను నేను.

“బాబూ నేను మిగతా పోలీసులను అడిగితే చెప్పారు. బాంబేలో కస్కర్ అని పెద్ద స్మగ్లర్ ఉన్నాడు. వాడి గ్యాంగ్ వాళ్ళిచ్చే డబ్బులు కోసం తాండేల్ కాంట్రాబ్యాండ్ వస్తువులు సముద్రంలో వాళ్ళ దగ్గర తీసుకుని, ఇక్కడ తీరానికి వచ్చే ముందే, వేరే చోట డంప్ చేసాడట. ఈ సమాచారం తెలుసుకుని వాడిని పోలీసులు పట్టుకోవడానికి వచ్చేలోపే వాడు తప్పించుకున్నాడు. ఇక ఆ పోలీసులు వాడి పడవని చెక్ చేయటానికి వస్తే, మీరు ఆ పెద్ద బుట్టలతో కనబడ్డారు. అనుమానంతో మిమ్మల్ని కూడా విచారించారు. ఇప్పుడు తాండేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు” అని సావంత్ అసలు విషయం చెప్పాడు.

“నయమైంది సావంత్ నువ్వు ఇవాళ నాతో రాకుంటే నా పరిస్థితి ఏమయ్యేదో. నీకు కూడా చాలా థాంక్స్” అన్నాను నేను.

ఇన్‌స్టిట్యూట్ కి వెళ్లి నా ఆఖరి బ్యాచ్ ట్రయల్ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలిగాను. దీనితో నా ప్రాజెక్ట్ ప్రాక్టికల్ వర్క్ సఫలమవ్వడంతో, నేను మళ్ళీ వెర్సోవా బీచ్‌కి వెళ్లే అవసరం లేకుండా పోయింది. ఇక థీసిస్ వర్క్ మీద శ్రద్ధ పెట్టి, మూడు నెలల్లో ప్రాజెక్ట్ పని పూర్తిగా ముగించి, విజయవంతంగా బాంబే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ థీసిస్ సబ్మిట్ చేయగలిగాను.

కొన్నాళ్ల తరువాత ఒకసారి నేను తిరిగి వెర్సోవా బీచ్ కి వెళ్లి వందన తాండేల్ కోసం చూసాను కానీ ఆమె కనబడలేదు. ఇక ప్రాజెక్ట్ పనుల్లో చాలా బిజీగా ఉండి నేను మళ్ళీ ఆమెని కలవలేకపోయాను. ఐతే, చాలా రోజులు పాపం ఆ వందన మహాతల్లి తన కష్టం నుంచి బయటపడిందా లేదా అని మథనపడ్డాను. ఆమె సహాయం నేనెప్పుడూ మరువలేనిది. నా జీవిత కదంబంలో ఆమె ఎప్పటికీ వాడని కుసుమం.

నా ప్రాజెక్ట్ ముగిసిన తరువాత, ప్రాకృతికంగా మంచి ఎండలో ఆరబెట్టిన జవ్లా, అలాగే యంత్రాలతో కృత్రిమంగా ఆరబెట్టి, ఫుడ్ కెమికల్స్‌తో శుభ్రత, నాణ్యత, నిలువ సమయం పెంచిన జవ్లాని పారదర్శక ప్లాస్టిక్ సంచుల్లో నింపి, మిసెస్ మెహతాకి ఇచ్చాను.

“మెహతాజీ! చూడండి మీ చక్కటి సహకారంతో, ఇప్పుడు ఆకర్షణీయమైన రంగుతో, మంచి విటమిన్ ‘ఏ’ విలువలతో, బలమైన ప్రోటీన్ తో, ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్స్ తో నిండిన పౌష్టిక జవ్లా తయారయ్యింది” అన్నాను.

మిసెస్ మెహతా చాలా ఆనందించి “కంగ్రాట్స్ ఛోటే మియా! నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. విష్ యు ఆల్ ది బెస్ట్ సైంటిస్ట్” అని ఆశీర్వదించింది.

ఇక బాంబేలో నా కథ ఆపాల్సిన సమయం వచ్చింది. తరువాత ఎప్పుడైనా బాంబేలో నా మిగతా విశేషాల గురించి చెప్పదలిచి ఇప్పటికిక స్వస్తి అనుకున్నాను. ఇన్నాళ్లూ వ్రాస్తున్న నా కథని ముగించేసాను.

***

ఇవాళ హరికకి ఫోన్ చేసి “అమ్ము! ఒక నవ యువకుడిగా బాంబేలో నేను గడిపిన ఆనందకర సమయంతో పాటు, చవి చూసిన కష్టాలు, స్ఫూర్తిదాయక పరిచయాలు, గమ్మత్తయిన అనుభావాలు నాలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. నీ బామ్మా, తాత గారితో సహా వేరేవ్వెరూ ఇన్నాళ్లూ కూర్పుగా చూడని పదిల కదంబాన్ని నీకు కానుకగా ఇస్తున్నాను. ఐతే, ఈ నలభై ఏళ్లలో ప్రపంచమంతా ఎన్నో మార్పులు జరిగాయి. క్షణాల్లో ప్రపంచంలోని ఏ మూలనున్న వ్యక్తితోనైనా మాట్లాడగలిగే, చూడగలిగే అద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, మా తరం వారి అనుభవాలు, అనుభూతులు మీకు, తరువాయి తరాలకు ఎంత వరకు అర్థమౌతాయో, పనికొస్తాయో నాకైతే తెలియదు. అంతా మన మంచికే. కాలం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా, మానవత్వం మరిచిపోకుండా ముందుకు సాగడమే మన జీవన పరమార్థం కావాలి. ఈ కథపై నీ స్పందన కోసం ఎదురు చూస్తాను. సరే మరి! త్వరగా మిమ్మల్ని అందరినీ మన ఇంట్లో చూడాలనుకుంటున్నాను” అని సెలవు తీసుకున్నాను.

Exit mobile version