[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘పద్మవ్యూహం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
స్వేచ్ఛకి
విశృంఖలత్వానికి మధ్య
నున్న సన్నని రేఖని చూడక తప్పదు!
పొగొట్టుకున్నదేదో
పొందుదామని
ప్రయత్నిస్తే
పడగ నీడ నుండి పడగ నీడకు
పయనమని అర్థమవుతుంది!
పాఠాలు నేర్చుకోని
జీవితంలో
వ్యక్తులను అంచనా వేసే
వేళల్లో
వంచనా వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం
అనివార్య విషాదం!
సహజీవనం
సతతహరిత జీవనమని
స్వప్నాలని స్రవించినా
ఉండిలేని బంధమే ఊగిసలాడుతుంటుంది!
తీర్పులు ఇచ్చే పెద్దలు
నేర్పుగా జీవితాన్ని చక్కబెట్టే
సుద్దులు చెప్పరు!
ఫేస్ బుక్ మిధ్యాశ్రువులు
నీ కళ్ళను తుడిచి ఓదార్చలేవు.
మగవాడు పగవాడు కాదు కాని
తెలిసి పద్మవ్యూహం లోకి
చొరబడే నారికి
చెరనుండి
విముక్తి
మృత్యువు పరిష్వంగమే!!!
