Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద్యనాటకరంగానికి పునాది ‘మేలట్టూరు’-2

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘పద్యనాటకరంగానికి పునాది ‘మేలట్టూరు’’అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగం.]

మా మేలట్టూరు సందర్శనం

మండలి బుద్ధప్రసాద్ గారు 2013లో అధికార భాష సంఘం చైర్మన్ గా ఉన్న కాలంలో తమిళనాట తెలుగువారి స్థితిగతుల్ని పరిశీలించేందుకు కొందరు విలేకరుల్ని, రచయితలని వెంటబెట్టుకుని తంజావూరు, మధుర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. అలాఆయనతో రెండుసార్లు మేలట్టూరు సందర్శించే అవకాశం కలిగింది. 2013 నవంబరు 5, 6 తేదీలలో తంజావూరులో తెలుగు స్థితిగతులను పరిశీలించటానికి శ్రీ మండలి బుద్ధప్రసాదు గారితో కలిసి ఒక పరిశీలనా బృందం తంజావూరును చేరి, అక్కడి నుండి మేలట్టూరును సందర్శించింది.

ఆనాటి రాష్ట్ర ప్రాచ్యలిఖిత భాండాగారం సంచాలకులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం, సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్, మద్రాసు ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల నిర్వాహకుడు శ్రీనాగసూరి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయులు శ్రీ జి ఎల్ ఎన్ మూర్తి, శ్రీ ఆర్ రవిశర్మ, శ్రీ కిలారు ముద్దుకృష్ణ, డా జి వి పూర్ణచందు, తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధకులు డా. సుధారాణి, తమిళ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు విభాగానికి చెందిన డా చిప్పాడ సావిత్రి, ఇంకా మద్రాసు నుండి వివిధ తెలుగు పత్రికలు, చానళ్ల ప్రతినిధులూ దాదాపు 20 మంది ఈ బృందంలో ఉన్నారు.

మేలట్టూరు వరదరాజస్వామి దేవాలయం

మేలట్టూరులో ఈ నాట్యకళకు అంకితమై పనిచేస్తున్న రెండు సంస్థలను మేము సందర్శించాము. శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి భాగవతమేళా నాట్య నాటక సంఘం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. మేలట్టూరు నటరాజన్ గ్రూపుగా ఈ సంస్థని పిలుస్తారు. నటరాజన్, ఆయన సోదరులు కుమార్ ఈ సంస్థకు వ్యాప్తిని తెచ్చారు.

నటరాజన్ గారు ఇంజనీరుగా దుబాయిలో పనిచేస్తూ, ప్రతీ ఏడాది వచ్చి ప్రహ్లాద చరిత్రం కొన్ని ప్రదర్శన లిచ్చి వెళ్తుండేవారు. 2013లో మేము మేలట్టూరు వెళ్లినప్పుడు నటరాజన్ గారు దుబాయిలో ఉన్నారని చెప్పారు. వారి తమ్ముడు శ్రీ కుమార్ దగ్గరుండి వారింట నిర్మించిన మేలట్టూరు కళాచిత్రాల ఫోటో ప్రదర్శనను చూపిస్తూ వివరించారు. మూడేళ్ళక్రితం శ్రీ నటరాజన్ మరణించారని తెలిసింది. శ్రీ కుమారే ఇప్పుడు బాధ్యతలు చూస్తున్నారు.

శ్రీ కుమార్ తమ నాట్య గురుపరంపరను చూపుతున్న దృశ్యం

మేలట్టూరు యక్షగాన పునరుజ్జీవనం

శ్రీ యస్ నటరాజన్

ఇది శ్రీ యన్ నటరాజన్ “Melattur, a seat of Bhagavata Mela – an overview” వ్యాసంలో మేలట్టూరు యక్షగాన నాటక ప్రదర్శన కళ పడిలేచిన కెరటంలా కుంటుపడి పునరుజ్జీవనం చెందిన వైనాన్ని కళ్లకు కట్టించారు.

“1932లో నటేసయ్యర్ అనారోగ్యంతో మేళత్తూరు విడిచిన తరువాత, ఆయన శిష్యుల మధ్య విభేధాలు, యువతలో ఆసక్తి కొరత, నేతృత్వ లోపం వంటివి ఈ కళాసంప్రదాయాన్ని దెబ్బతీశాయి. రెండేళ్లకే యక్షగాన ప్రదర్శనలు కేవల ఆచారంగా మిగిలిపోయాయి.1935లో నటేశమయ్యర్ మరణించగా, ఆ కళ ప్రకాశం కోల్పోయింది.

ఈ సంక్షోభ సమయంలో “మేళత్తూరు వి. గణేశ అయ్యర్” అనే దూరదృష్టి గల కళాభక్తుడు, క్రమశిక్షణ గల నేత, కొత్త కళాకారుల బృందాన్ని ఏర్పరచారు. ఆయనకు “భారతం నల్లూరు నారాయణస్వామయ్యర్”, “పిచ్చు భాగవతార్”, “కె. గోపాల అయ్యర్”, “సి.వి. ముత్తుస్వామయ్యర్”, “కె. రమణి అయ్యర్”, “పిస్వాటి రామమూర్తి అయ్యర్”, “బాలు భాగవతార్” లాంటి నటేశమయ్యర్ శిష్యులు తోడయ్యారు. 1938లో వీరంతా కలిసి మేలట్టూరు“శ్రీ లక్ష్మీనరసింహ జయంతి భాగవతమేళ నాట్యనాటక సంఘం-మేలట్టూరును” స్థాపించారు. దీనిలో భాగంగా నూతన కళాకారుల శిక్షణ ప్రారంభమైంది. రెండేళ్లలోనే సుమారు 15మంది నాట్యకారులు తయారయ్యారు.

1941లో మేలట్టూరు “ప్రహ్లాద చరితం” మేలట్టూరును రంగస్థలానికి తీసుకువచ్చారు. ఈ మధ్య కాలంలో “మార్కండేయ”, “ఉషాపరిణయం”, “రుక్మాంగద” నాటకాలను కూడా మేళత్తూరు వేదికపై ప్రదర్శించారు. నల్లూరు నారాయణస్వామయ్యర్, పిచ్చు భాగవతార్ మరణానంతరం, సంస్కృత పండితుడైన పద్మశ్రీ బాలు భాగవతార్ ప్రధాన నాట్యాచార్యుడయ్యారు.

తర్వాత నూతన కళాకారులు చేరారు – ఎన్. వెంకటరామన్ (నాట్యకారుడు), పి.కె. సుబ్బయ్యర్ (గాయకుడు, అరియక్కుడి రామానుజ అయ్యంగార్ శిష్యుడు) మొదలైనవారు. కాలక్రమంలో మార్కండేయ నాటకం, హరిశ్చంద్ర నాటకం వంటి ఇతర యక్షగానాలను కూడా రంగస్థలంపైకి తెచ్చారు.

గణేశ అయ్యర్ కుమారుడు జి. స్వామినాథన్ తన నటన, నాట్య నైపుణ్యంతో ఈ ప్రదర్శనలకు కొత్త జీవం పోశాడు. ఆయన కుమారుడు ఎస్. నటరాజన్ (1954లో ప్రవేశం), తన స్త్రీ పాత్రల రూపకల్పన, అద్భుత నాట్యకౌశలం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన సోదరుని కుమారుడు ఆర్. గణేశన్ కూడా ప్రతిభావంతుడైన నటనాట్యకారుడిగా గుర్తింపు పొందాడు.

ఈ విధంగా వి. గణేశ అయ్యర్ నాయకత్వంలో, బాలు భాగవతార్ మార్గదర్శకత్వంలో, మేళత్తూరు యక్షగానం మళ్లీ పునరుజ్జీవించిది. ఇది కేవలం ఒక కళ పునరుద్ధరణ కాకుండా – భక్తి, నియమం, క్రమశిక్షణ, కుటుంబ సమర్పణతో సాగిన సజీవ సాంస్కృతిక పునర్జన్మగా నిలిచింది.”

మేలట్టూరు కళపైన పరిశోధనలు చేసేవారికి ఈ వివరాలు చాలా ముఖ్యమైనవి కూడా!

మేలట్టూరులో నటరాజన్ గారిఉ నేతృత్త్వంలో నడుస్తున్న సంస్థకు పోటీగా “మేలట్టూరు భాగవతమేళా నాట్యవిద్యా సంఘం” నడుస్తోంది. మేలట్టూరు కళను బ్రతికిస్తూ వస్తోన్న కళామూర్తి శ్రీ ఆర్ మహాలింగం ఆయన కుటుంబీకుల ఆధ్వర్యంలో  ఏర్పడి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

1954లో మేళత్తూరులోనే జన్మించిన కలైమామణి శ్రీ మహాలింగం అయ్యర్ ఎనిమిదేళ్ల వయసులోనే స్త్రీ పాత్రలు వేస్తూ ఈ కళలోకి ప్రవేశించారు. పద్మశ్రీ బాలు భాగవతార్, కలైమామణి సుబ్బయ్యర్, టి.జి. పావు పిళ్ళై, హేమాంబరనాథన్ వంటి మహనీయుల శిష్యరికంలో ఆయన మహానటుడిగా రాణించారు.

ఆధునిక మేలట్టూరు నాట్యనాటకకళకు పితామహుడిగా గౌరవించే పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం (బాలుభాగవతార్) గారు

వి. డి. స్వామిగారి వితరణ

1964లో మేళత్తూరులో పుట్టిన వ్యాపారవేత్త, కళాపోషకుడు, సంగీతనాట్యాభిమాని వి. డి. స్వామి యక్షగాన సంప్రదాయానికి ఒక కొత్త ఊపిరి పోశారు. ఆయన కుమారుడే తమిళ సినీనటుడు అరవిందస్వామి.

శ్రీ వి. డి. స్వామి తన ఆధ్వర్యంలో భాగవతమేళ నాట్య విద్యా సంఘం  స్థాపించి, ప్రదర్శనలు నిర్వహింపచేస్తూ, పడమటివైపున సుమారు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దాంట్లో విశాలమైన వేదిక, ఆడిటోరియం నిర్మించాలనేది ప్రయత్నం. అదే సంవత్సరం యక్షగాన ఉత్సవం ఘనంగా జరిపించారు కూడా!

కారణాంతరాలవలన తరువాతి ఏడాది 1965లో ఉత్సవం నిర్వహించకపోవడంతో, అంతకు పూర్వం ఉన్న  శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి భాగవతమేళ నాట్యనాటక సంఘం పేరుతోనే వి.డి. స్వామిగారు గుడిదగ్గర ఉత్సవాన్ని నిర్వహింపచేశారు. ఇవన్నీ కొత్త పరిణామాలకు దారి తీశాయి. గ్రామంలో విభేదాలు పుట్టాయి. వి. గణేశ అయ్యర్ వర్గం వ్యతిరేక వర్గాలుగా చీలిక ఏర్పడింది.

వ్యతిరేకవర్గం 1966లో వి.డి. స్వామి గారి భూమిలో ఉత్సవాలు నిర్వహించింది. యువకుల ప్రాబల్యం పెరిగింది. జి. స్వామినాథన్, రమణి అయ్యర్, కృష్ణమూర్తి శర్మ మార్గదర్శకత్వంలో ఎస్. నటరాజన్ ప్రధాన దర్శకుడి బాధ్యతలు స్వీకరించారు. ఎస్. వీరరాఘవన్, “తిరుక్కరుకవూర్” జి. శ్రీనివాసరాఘవన్ ఆ బృందంలో చేరారు.

నటరాజన్ యక్షగాన ప్రదర్శనల పరిధిని  విస్తరింపచేశారు. సాంప్రదాయక వెంకటరామశాస్త్రి గారి యక్షగానాలకు తోడుగా తమిళంలో రాసిన “వల్లి తిరుమణం”, రాజా షాజీ (1684–1711) రచించిన “కావేరీ కళ్యాణం” యక్షగానాలను ప్రదర్శించటం మొదలుపెట్టారు.

సాలియమంగళం పంచనాధ భాగవతార్ రచించిన “విప్రనారాయణ”, “రుక్మిణీ కళ్యాణం” నాటకాలను మేళత్తూరులో నాట్యరూపంలో మళ్లీ ప్రదర్శించారు. అంతేగాక, బాలు భాగవతార్ సవరించిన “పార్వతి పరిణయం” అనే నాటకాన్ని కూడా వేదికపైకి తీసుకువచ్చారు.

దీన్ని “పాతభక్తి సంప్రదాయానికి ఆధునిక వేదికల రూపం జతైన సమయంగా” నటరాజన్ అభివర్ణించారు. వి.డి. స్వామి ఆర్థిక, సాంస్కృతిక సహకారం; వి. గణేశ అయ్యర్ ఆత్మీయ దృఢత; బాలు భాగవతార్ శాస్త్రీయ పాండిత్యం ఇవన్నీ కలసి నటరాజన్ గారి మేళత్తూరు యక్షగానానికి కొత్త యుగాన్ని తెరిచాయి.

మహలింగం అయ్యర్ గారి కృషి

రెండో వర్గానికి చెందిన మహలింగం అయ్యర్ గారిది సాంప్రదాయకదృష్టి. ఆయన మేలట్టూరు వెంకటరామ శాస్త్రిగారి పరిధిని వీడి వెళ్ళాలని కోరుకోలేదు. ప్రాచీన విలువల్ని నిలబెట్టాలని, ఆధునీకరించాలని, అందులోని తెలుగుదనాన్ని పరిరక్షించాలనే నిబద్ధత కలిగిన వ్యక్తి.

1989 నుంచీ మహాలింగం మహానిష్ఠతో ప్రతి ఏటా నారసింహఉత్సవాన్ని కొనసాగిస్తూ, కళను నిలబెడుతూ వస్తున్నారు. అగ్నిప్రమాదం లాంటివి ఎదురైనా వారి కర్తవ్యదీక్షను ఆపలేకపోయాయి. వారి కుటుంబం స్థాపించిన మేళత్తూరు భాగవతమేళా నాట్యనాటక ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లి కుప్పస్వామి చైర్మన్‌గా నారసింహ జయంతి ఉత్సవాలు సాగుతున్నాయి. నల్లీ సిల్క్స్ వారే వి.డి. స్వామిగారి విశాలమైన  ప్రాంగణంలో ఆరుబయలు ఆడిటోరియం నిర్మించారు. పక్కనే ఒక విష్ణ్వాలయాన్ని కూడా కట్టించారు.

ఇప్పటికీ అక్కడ విద్యుత్ దీపాల బదులుగా అరటి బోదెలపై ఆముదం దీపాల వెలుగులో యక్షగానం సాగుతుంది – ఆ వెలుగు ఈ సంప్రదాయ ఆత్మ.

మేలట్టూరు వెంకట్రామ శాస్త్రిగారు వ్రాసిన పది యక్షగానాలను బతికించుకుంటూ వస్తోన్న కుటుంబం ఇది. వ్యక్తిగత పురస్కారాలను ఆశించకుండా కళకే అంకితంగా జీవిస్తున్న కళాకారులు ఇక్కడ ఎందరో కనిపిస్తారు.

మా పరిశీలక బృందానికి శ్రీ కుమార్, శ్రీ ఆర్ మహలింగం తమ కళారీతులను అభినయించి చూపారు. వీళ్లంతా తమ స్వంత వృత్తి వ్యాపారాలు చేసుకుంటూనే ఒకరి పైన ఆధారపడకుండా ఈ విద్యను పరిరక్షిస్తూ వస్తున్నారు. వాళ్లవి ఇచ్చే చేతులే గాని పుచ్చుకునే చేతులు కావు!

కృష్ణుని వేషాన్ని అభినయించి చూపుతున్న శ్రీ ఆర్ మహలింగం అయ్యర్, వారి కుమారుడు శ్రీ స్వామినాథన్.

తమ మూలాలు తెలుగువేగానీ, మౌలికంగా తమ మాతృభాష తమిళమే నన్నారు శ్రీ కుమార్. శతాబ్దాల కాలంలో తమిళులతో వివాహ సంబంధాలవలన మాతృభాషలు నిలకడగా ఉండవు.

కానీ, వయో వృద్ధులైన శ్రీ ఆర్. మహాలింగం ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్తు కన్పిపిస్తుంది. ఈయన తన కుమారుడు స్వామినాథన్ కు హైదరాబాద్ కు చెందిన తెలుగువారమ్మాయితో వివాహం జరిపించారు. తద్వారా తమ తరువాతి తరం మాతృభాష తెలుగే కావాలనేది ఆయన ఆకాంక్ష! తాము తెలుగులో మాట్లాడలేక పోయినప్పటికీ, తాము తెలుగు వారిమేననీ, కూచిపూడి భాగవతుల పరంపరలోని వారిమనే చెప్పారాయన!

మహలింగంగారు భద్రపరచిన వెంకటరామశాస్త్రిగారి యక్షగానాల తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తున్న శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం, శ్రీ బుద్ధప్రసాద్.

ఇప్పటివరకు ప్రహ్లాదచరితం, సీతాకళ్యాణం, మార్కండేయచరితం, ఉషాపరిణయం, కృష్ణజననం,హరిశ్చంద్ర పుస్తకరూపంలో తెచ్చారు మహలింగంగారు. నిబద్ధతకు నిలువెత్తు మూర్తిమత ఆయనది!

మేళత్తూరు భాగవతమేళ కేవలం ఒక నాట్యసంప్రదాయం కాదు; అది దక్షిణ భారత భక్తి, సంగీతం, సాహిత్యం, నాట్యం కలిసిన ఓ జీవనశక్తి. శతాబ్దాల క్రమంలో మార్పులు వచ్చినా, దీని వెలుగును ఆముదం దీపంలా నిలబెట్టిన వారు మహాలింగం అయ్యర్ వంటి నిష్ఠవంతులు. మేళత్తూరులో నరసింహుని జయంతి రాత్రి ఆముదం దీపాల కాంతిలో వినిపించే “ప్రహ్లాదచరితం” పద్యాలు – అవి కేవలం నాట్యం కాదు, అది తెలుగు సాంస్కృతిక చరిత్ర యొక్క ప్రకాశవంతమైన స్మృతి.

భక్తప్రహ్లాదలోని ఒక దృశ్యం. చదువులలోని సారమెల్లా చదివానంటున్న ప్రహ్లాదుడు

సంగీత సాహిత్యాభిమానులు జీవితంలో ఒకసారైనా నారాయణ తీర్థులు నివసించిన వరుగూరు, శ్రీత్యాగరాజస్వామి సమాధి చెందిన తిరువైయారు అలాగే నాట్య నాటక అభిమానులు మేలట్టూరు సందర్శనం చేసుకుంటే జన్మ ధన్యత నొందినట్టని భావిస్తాను.

(ఇంకా ఉంది)

Exit mobile version