Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాదగయ – కుక్కుటేశ్వర స్వామి ఆలయ సందర్శనం

[ఇటీవల పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]

తీర్థయాత్రలంటూ ప్రక్క రాష్ట్రాలకు వెళ్తాం. గాని, మన రాష్ట్రంలో, మన చుట్టూ ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన, పురాణాలలో కూడా చెప్పబడిన, ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. అటువంటి వాటిలో పిఠాపురంలో ఉన్న- కుక్కుటేశ్వర స్వామి ఆలయం, ఆ ప్రాంగణంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో పదవదైన పురుహూతిక శక్తిపీఠం, దత్తాత్రేయుని మొదటి అవతారంగా చెప్పబడిన శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయం, పితృదేవతలకు పిండ ప్రదానం చేసుకునే పాదగయ ఉన్నాయి – భక్తులు తప్పక దర్శించి తీరవలసిన పుణ్యక్షేత్రం.

ఇది కాకినాడ జిల్లాలోని పిఠాపురం గ్రామంలో (విశాఖపట్నంకు 138 కిమీ, కాకినాడకు 16 కిమీ, రాజమండ్రికి 65 కిమీ, సామర్లకోట రైల్వేస్టేషనుకు 10 కిమీ దూరం) ఉంది. ఈ పిఠాపురాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు.

ఈ ఆలయం ఎవరిచే, ఏ కాలంలో నిర్మించిబడినదో స్పష్టంగా ఎక్కడా చెప్పబడి ఉండలేదు. గాని, సముద్రగుప్తుని ప్రయాగ రాతి స్తంభ శాసనం (350 CE) లో  ప్రస్తావించబడినదంటే, ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు.  స్కాంద పురాణంలోనూ, శ్రీనాథుని భీమేశ్వర పురాణంలోనూ, ఈ ఆలయం గురించి ప్రస్తావించబడినది. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరునిగా (కుక్కుటమంటే కోడి) పూజలందుకుంటారు. ఇక్కడి శివలింగం స్వయంభువు. ఇది స్పటిక లింగం. స్వామికి ఎడమచేతి వైపు అమ్మవారి విగ్రహముంటుంది. 20 రూపాయల టికెట్ తీసుకుని, గర్భగుడి ప్రవేశద్వారం దగ్గరికి వెళ్ళిన వాళ్లకు మాత్రమే అమ్మవారు కనిపిస్తారు. అందుకని సర్వదర్శనం చేసుకునే వాళ్లకు కూడా కనిపించడానికి, స్వామికి కుడిచేతి వైపు ఒక అద్దం పెట్టి, అందులో అమ్మవారి ప్రతిబింబం స్పష్టంగా కనిపించే ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

స్వామికి ఎదురుగా పెద్ద ఏకశిలానంది ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో లేపాక్షి బసవన్న తర్వాత ఇదే రెండవ పెద్దనందిగా పిలవబడుతుంది. దాని ముందు ఎత్తైన ధ్వజస్తంభముంటుంది.

స్వామిని దర్శించుకొని ముందుకొస్తే,  రాజరాజేశ్వరి అమ్మవారు, సర్వాలంకార శోభితురాలై మనకు దర్శనమిస్తారు. ఆమెను దర్శించుకుని బయటకు వస్తే, అక్కడ చండీశ్వరస్వామి ఉంటారు.  శివ కుటుంబంలో ఐదవ సభ్యునిగా వీరిని కొలుస్తారు. శివునికి నైవేద్యం సమర్పించిన తర్వాత, వీరికి సమర్పించి, ఆ తర్వాతే మనం నైవేద్యం స్వీకరించాలట. చిటికెలు వేసి ఆయనను దర్శించాలని అక్కడున్నవారు చెప్పారు. అందుకే ఇతనిని చిటికెల చండీశ్వరుడని అంటారట.

పురుహూతిక శక్తిపీఠం:

ఇది పదవ శక్తిపీఠం. సతీదేవి పిరుదులిక్కడ పడ్డాయని పురాణ కథనం. అమ్మవారు, సర్వాలంకార భూషితురాలై, భక్తుల కోర్కెలు తీర్చడానికా అన్నట్టు, ప్రసన్న వదనంతో దర్శనమిచ్చి మనలను అనుగ్రహిస్తారు. ఇక్కడ అమ్మవారి పీఠం కింద, శ్రీ చక్రాన్ని స్థాపించారని పూజారిగారు చెప్పారు. శ్రీ చక్రమున్న ప్రదేశం, చిన్న గూడులా ఉంది. కుంకుమ పూజలు శ్రీ చక్రానికే చేస్తారు. ఈ గూడుపైన అమ్మవారి మూర్తి ఉంది. అమ్మవారి మూర్తి మనలను చూస్తున్నట్టు కాకుండా, కాస్త పక్కకు తిరిగినట్టుగా ఉన్నారు. అమ్మవారి శక్తిని మనం తట్టుకోలేమని అలా ఉంటారని చెప్పారు.

అమ్మవారి పీఠభాగం ఇక్కడ పడడంతో, ఒకప్పుడిది పీఠికాపురంగా పిలవబడేదట.

పాదగయ:

మహావిష్ణు భక్తుడైన గయాసురుని తల, నాభి, పాదము వేరువేరు ప్రాంతాలలో పడగా, ఈ పిఠాపురంలో పాదము పడబట్టి, ఇది పాదగయగా ప్రసిద్ధి చెంది, ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలసి ఉన్నందున పితృ కార్యాలు చేసుకునే దివ్యధామంగా వర్ధిల్లుతుంది ఈ పిఠాపురం.

నాలుగు వైపులా మెట్లతో కూడుకొని ఉన్న చతురస్రాకారపు, విశాలమైన పుష్కరిణి పితృ కార్యాలకు అనువుగా ఉంటుంది. ఈ పుష్కరిణిలో పెద్ద గయాసురుని విగ్రహం ఉంది. తలభాగం బీహార్‌లో శిరోగయగా, విష్ణుమూర్తి కొలువై ఉండగా, పార్వతి దేవి మాంగల్యగౌరిగా శక్తిపీఠంగా పూజలందుకుంటే, ఒరిస్సాలోని జాజ్పూరులో నాభిభాగముండి అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉండగా, పార్వతిదేవి గిరిజాదేవిగా శక్తిపీఠంగా పూజలందుకొంటుంది.

శ్రీపాద శ్రీ వల్లభ స్వామి:

దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభస్వామి వారి జన్మస్థలం ఈ పిఠాపురమే. శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయంలో విగ్రహం చుట్టూ కొబ్బరికాయలను చేతికి కట్టుకునే దారపు కంకణాలతో వేలాడదీశారు. విగ్రహం చేతిలో గద ఉంది. ఆలయం ప్రక్కనే శ్రీదత్త కోటినామ స్తూపం, ప్రక్కనే స్వామివారి చరణాలున్నాయి.

అవి దాటి ముందుకెళ్తే దత్త బృందావనం ఉంది. దత్తాత్రేయ ప్రభు (దత్తాత్రేయస్వామి త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభువుగా ఇక్కడ వెలిశారని శాసనాలు చెప్తున్నాయి), శ్రీ స్వామి సమర్థ స్వామి, శ్రీపాద శ్రీ వల్లభస్వామి, శిరిడి సాయి, నృసింహ సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభు స్వామి విగ్రహాలతో కూడుకున్నదై భక్తులను అలరిస్తుంది ఈ మందిరం.

ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణమ్మ, ఆది శంకరాచార్యులు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలు వరుసగా ఉన్నాయి. వాటి తర్వాత కాస్త ముందుకెళ్తే, మొదటి అంతస్తులో జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉన్నారు. కింద అంతస్తులో వేద పాఠశాల ఉంది.

మేము రాత్రి వెళ్ళాం, కాబట్టి భక్తుల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంది. చక్కని దర్శనాలయ్యాయి. ద్వాదశ పుణ్యక్షేత్రాలలో ఒకటైన, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన, పాదగయగా ప్రసిద్ధి చెందిన ఈ పిఠాపురాన్ని దర్శించుకుని, మనసు నిండా శివపార్వతులను నిలుపుకొని, రాజమండ్రికి తిరుగు ప్రయాణమయ్యాం.

దర్శన వేళలు:

ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం భోగం పెట్టే వేళలో ఒక రెండు గంటలు దర్శనం ఉండదని చెప్పారు. ప్రత్యేక దర్శనానికి 20 రూపాయల టికెట్ తీసుకుంటే, గర్భగుడి ముఖద్వారం వరకు వెళ్ళవచ్చు. పులిహోర, రవ్వలడ్డు ప్రసాదంగా అమ్ముతారు.

Exit mobile version