Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’

[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

1

New York Herald Tribune అంతర్జాతీయ కథల పోటీ 1951-52 లో పాలగుమ్మి పద్మరాజు కథ గాలివాన ద్వితీయ బహుమతి పొందింది. పద్మరాజు తన కథను ఆంగ్లంలో రాసుకుని తానే చేసిన తెలుగు సేతను పోటీకి పంపారు.

కడపజిల్లా ప్రొద్దుటూరులో పుట్టిన అవధానం సీతా రామన్ [A.S. Raman] The Statesman, The Times of India, Swarajya పత్రికలలో పనిచేసిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఇప్పుడు మూతపడిన The Illustrated Weekly of India తొలి భారతీయ సంపాదకుడు. పాలగుమ్మి పద్మారాజు కథా సంపుటికి ఆంగ్లంలో పీఠిక రాస్తూ ఆయనను ‘గాలివాన’ పద్మరాజు అని పిలవాల్సింది అన్నాడు. పద్మరాజు రాసిన అన్ని రచనలలోకి ఈ కథ తలమానికం అని ఆయన అభిప్రాయం. రామన్ ఢిల్లీలో 1952 లో పనిచేస్తున్నపుడు ఆయనకు తెలిసిన హిందీ రచయితలు బహుమతి సరైన రచయితకు వచ్చింది అన్నారట.

భారతి – నందన చైత్రము సంచికలో ‘ప్రపంచకథా బహూకృతి..’ అన్న వ్యాసంలో ‘శాస్త్రి’ తన ఆనందాన్ని దాచేసుకోకుండా ఇలా పంచాడు: ‘ఠాగూర్ మహాకవి నోబెల్ బహుమతి అందుకున్నతరువాత మనదేశంలో వాజ్మయంలో ఎవరికీ ఇంతటి బహూకృతీ, గౌరవం లభించలేదు. బహుముఖాలుగా నిరుత్సాహంగా ఉన్న వర్తమనాంధ్రదేశ చరిత్రలో ఈ బహూకృతి ఆంధ్రులందరు గర్వించదగిన విషయం.’

ఆ పోటీ జరిగి డెబ్భై ఏళ్లకు పైగా అయింది. ఆసక్తికరమైన ఆ పోటీ వివరాలు అతి తక్కువమంది కన్నా నేడు గుర్తుండి ఉన్నాయో లేవో.

1951 సంవత్సరంతానికి ఆ పోటీకి న్యూ యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ [New York Herald Tribune] ఆ ప్రపంచవ్యాప్త కథల పోటీ నిర్వహించింది. దేశస్థాయిలో హిందూస్తాన్ టైమ్స్ [Hindustan Times] పోటీ నిర్వహించింది. ఆంధ్ర దేశానికి గాను పోటీని చేపట్టిన ఆంధ్రపత్రిక సంపాదకులు నాలుగు కథలను ఎంపిక చేసి హిందూస్తాన్ టైమ్స్‌కు పంపడమే గాక నలుగురు రచయితలకు వందరూపాయల చొప్పున బహుమతి ఇచ్చారు. దేశ మిగతా రాష్ట్రాలలోను ఇలాంటి ఎంపికలు జరిగాయి. హిందుస్థాన్ టైమ్స్ ‘కళ్ళు’ అన్న మరో భారతీయ కథకు మొదటి బహుమతి, ‘గాలివానకు’ రెండవ బహుమతి ప్రకటించడమేగాక ఒక్కొక్క దానికి వెయ్యి రూపాయల నగదు బహుమతి ఇచ్చింది. చివరకు 28 దేశాల నుంచి ఎంపిక కాబడిన 59 కథలు వివిధ దేశాలనుంచీ న్యూ యార్క్ టైమ్స్ హెరాల్డ్ ట్రిబ్యూన్‌కు చేరాయి. తమ తమ పోటీలు నిర్వహించిన దేశాలు ఇతర దేశాలకు చెందని రెండు కథలకు ఒక్కొక ఓటు వేశాయి. నాలుగు కథలకు రెండు ఓట్ల చొప్పున, మిగతా కథలకు ఒక్కొకటి మాత్రమే పడటం వలన, ఏ ఒక్క కథ మొదటి బహుమతి పొందలేదు. కానీ మొదటి బహుమతి పేరు పెట్టకుండా రెండేసి ఓట్లు వచ్చిన నాలుగు కథలకు ప్రథమ బహుమతి గౌరవం ఇస్తూ ఉత్తమకథకు ఇవ్వవలసిన ఐదు వేలడాలర్లను 1050 చొప్పున పంచారు. మిగిలిన 14 కథల కన్నా గాలివాన ఉత్తమమైనదిగా భావించి రెండవ బహుమతిగా దానికి మిగిలిన 800 డాలర్లు ఇచ్చారు. రెండు ఫ్రెంచి కథలు, ఒక ఫిన్నిష్ కథ, ఒక నార్వీజియన్ కథ, ఒక తెలుగు కథ [మొత్తం ఐదు] ఆ పోటీలో చివరిదాకా నిలిచాయి. అపుడు పద్మరాజు వయసు 36.

ఆంధ్రపత్రిక పోటీకి ముందు ప్రచురించిన గాలివానను పోటీలో నెగ్గిన తరువాత 19.3.1952 సంచికలో పునరుద్ధరించింది. ముందు ఆ కథను రచయిత ఆంగ్లంలో రాసి హడావుడిగా తెలుగులోకి మార్చి పంపారు. ‘సవ్యసాచి’ ఆ సంచికలో ‘మదరాసు డైరీ’ అన్న శీర్షికలో ప్రస్తుతించారు: ‘ప్రస్తుతం తెలుగు కథకు లభించిన ప్రపంచ గౌరవం మన సాహిత్యకారులు అంతర్జాతీయ రంగంలోకి దూకాలనే ఆసక్తి కలిగిస్తుందని ఆశించ వచ్చును.’

అంతకుముందు చాలా కాలంనాడు వచ్చిన రెండు ఇతర భాషల కథలకు గాలివానకు సారూప్యాలున్నాయి. మరోలా అనాలంటే గాలివానకు స్ఫూర్తి లేక ప్రేరణ గోర్కీ రష్యన్ కథ ‘ఒక శరదృతువు రాత్రి’ [An Autumn Night]; సోమర్సెట్ మామ్ ఆంగ్ల కథ ‘వర్షం’ [Rain]. మిగతా రెండు కథలను సాధ్యమయినంత సంక్షిప్తంగాను, గాలివానను కాస్త వివరంగాను, సమీక్షించి పైన పేర్కొన్న సంబంధాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఈ వ్యాసం. అది బాదరాయణ సంబంధమా, దగ్గిరదా అన్నది ఎవరికి వాళ్ళు తేల్చుకోవచ్చును.

2

రష్యా లోని వోల్గా నది పక్కనున్న నిజ్ని నోవ్ గోరోడ్ [Nizhny Novgorod] నగరానికి చెందిన అలెక్సి పేష్కోవ్ [Alexei Peshkov] బతకడానికి బాల్యం నుంచీ శారీరక కష్టం మీద ఆధారపడక తప్పలేదు. జీవితపు పాఠశాలలో పడరాని పాట్లు పడ్డాడు. నావల రేవు కార్మికుడిగా, బార్జ్ [సరుకును ఒకచోటి నుంచీ మరో చోటికి తీసుకెళ్లే పడవ] ను లాగే పనివాడిగా, పొలం కూలీగా పనిచేశాడు. తన పందొమ్మిదో ఏట చెరసాలకన్నా కనాకష్టమైన, గాలీ వెలుతురూ కరవైన నేలమాళిగలోని బేకారిలో పనిచేశాడు. తోటి పనివాళ్లకు సామాజిక క్రమం గురించీ బోధిస్తుండేవాడు. దానిని మార్చవలసిన అవసరం మీద వచ్చిన అనేక పుస్తకాలు చదివాడు. లెనిన్ పాల్గొన్న ఒక విద్యార్థుల అలజడి సమయంలో తోటి కార్మికులు వాళ్ళపై దాడి చెయ్యాలనుకున్నపుడు అది భరించలేక పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోబోయి బతికాడు. మొదటి పుస్తకం అతని కలం పేరు మాక్సిం గోర్కీగా [Maxim Gorky] అతని ఇరవై నాలుగో ఏట వెలువడింది. ఇప్పటి కథ 1891-92 లో రష్య ఎదుర్కొన్న క్షామకాల జ్ఞాపకం నుంచీ పుట్టిన అతని ఒక తొలినాళ్ళది [1894]. స్వీయ అనుభవంగా భావించవచ్చు. క్షామ కాలంలో జనం తండోపతండాలుగా ఒక ఊరి నుంచే మరొక ఊరు వలసలు పోతుండేవారు. అలా అతను కొత్త వూరు చేరి, పడిన అగచాటు ప్రాతిపదికన ప్రథమపురుషలో కథగా మలిచాడు.

ఒక ఊరి నుంచీ మరో ఊరు చేరి తాను కట్టుకోడానికి ఉంచుకున్న బట్టలని ఒక్కొక్కటీ అమ్ముకుని వచ్చినదానితో తిండి కొనుక్కుని బతకాలని చూస్తున్న పద్దెనిమిదేళ్ల కథకుడు, పడుపు వృత్తిలో జీవిస్తున్న అతని వయసు యువతీ పాత్రలు. ఎడతెరిపి లేకుండా కురిసే మంచు, వర్షంలో ఊరి చివర గర్జిస్తూ ఉరకలు వేస్తున్న నదివొడ్డు నున్న పడవల రేవు చేరారు వేరువేరుగా తిండివేటలో. ఒకరికొకరు అపరిచితులు. అది శరదృతువులో ఒక సాయంకాలం. ఒక్క మనిషీ, పిట్టా చుట్టుపట్ల లేరు. అక్కడ మంచులో కూరుకుపోయిన ఒక క్రేటర్ అడుగుకు చేతులు పోనిచ్చి తవ్వి దానిని తెరిచే ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయి నటాషా కనిపించింది. ఒకరికొకరు సాయం చేసుకుని దాని తాళం పగలకొట్టి రొట్టెలను చేజిక్కించుకుని తిన్నారు. తిరగబడిపోయిన ఒక పడవలో దూరి తలదాల్చుకున్నారు. దాని కన్నం లోనుంచి నీటి చుక్కలు పడుతున్నాయి, తేమగా వుంది, ఇరుకుగానూ వుంది. క్రూరమైన చలి. ‘జీవితం యెంత శాపగ్రస్తమైనది!’ అనింది ఫిర్యాదులా కాక; గట్టి నమ్మకంతో. అతను మాట్లాడలేదు. ‘మనం చస్తే నేమి?’ ఆమె మాటలు, మాట్లాడే తీరువల్ల తాను సమాధానంగా మాట్లాడకపోతే తనకు ఏడుపొచ్చి ఆ స్త్రీ ముందు ఏడవాలిసొస్తుందేమోనని ‘నిన్ను ఎవరు హింసించారు?’ అన్నాడు. ఆమె రెండు కళ్ళ దిగువన, ముక్కు దూలం ఎగువన మూడు నీలం గాయాలు సమరూపతతో [symmetrical] వున్నాయి ఒక కళాకారుడు నైపుణ్యంతో గాయపరచినట్టు. పాష్కా అనే ఆమె ప్రియుడు చేశాడని, తాగికివున్నపుడల్లా తనను కొడతాడని అంది. ఆమెకు అప్పిస్తుంటాడు; అది వసూలు చేసుకోడానికి ఆమె తాను తన స్నేహితుల నుంచి సంపాయించుకున్న డబ్బును లాక్కుపోయి దానితో తాగి ఆమెను బాదుతుంటాడు; ఆమె కళ్ళముందే ఇతర స్త్రీలతో గడుపుతుంటాడు. ఇతర స్త్రీలతో తన కళ్ళముందు అతడు గడపటం ఆమెకు అవమానకరంగా కూడా ఉంటుంది, తాను వాళ్లకు తీసిపోయానా అని. మొన్న తన యజమానురాలు నుంచీ అనుమతి తీసుకుని అతని వద్దకు వెళితే అతనితో పాటుతాగి ‘డింకా’ అతని పక్కన కూర్చున్నపుడు తాను చూడటం తటస్థించి ‘scoundrel’ అని తిడితే కొట్టాడు, జుట్టు పట్టుకుని కిందికీడ్చి కాలితోతన్నాడు. వాటన్నింటికన్నా ఆమెను బాధించిన విషయం మొన్న ఆమె కొత్తగా కొనుక్కుని వేసుకున్న దుస్తులు, కోటూ, పాడు చేసి చేతురుమల చింపేయడం. అలాంటి స్థితిలో తన ‘యజమానురాలు చుస్తే ఏమనుకుంటుందో?’ అని ఏడుస్తుంది. అప్పుడు గాలి కూసి, మరింత గందరగోళం సృష్టించి చలిని ఎక్కువ చేసింది. ప్రకృతీ క్రూరత్వంలో మనిషికి తీసిపోవడం లేదు అని రచయిత సూచించాడేమో. చలికి సహచరుడు పళ్ళు కొరుక్కోడం గమనించి ఆమె కళ్ళలోని మెరుపు అతను చూడగలిగేంతగా మరింత చేరువగా జరిగింది. ‘మీ మగవాళ్ళు యెంత దరిద్రులు! పొయ్యిలో వేసి మిమ్మలనందరిని కలుస్తా; మిమ్మల్ని నరికి ముక్కలుచేస్తా. మీలో ఎవరన్నా చస్తుంటే జాలి చూపకుండా మీ నోటిలో ఉమ్ముతా. నీచులు. స్త్రీల ఎదుట బతిమిలాడతారు, కుక్కలలా తోకలు ఆడిస్తుంటారు, మేము లొంగిపోగానే మీ కాళ్లతో తొక్కుతారు.’ ఆ పలుకులలో ద్వేషం, పగా లేవు. చలికి మూలుగుతున్నాడు. ‘నీకు ఏమవుతోంది?.. చలిగా వుందికదా? ఎలాంటి వాడివిరా, మౌనంగా కూర్చునున్నావు గుడ్లగూబ పిల్లలా! ఇంతకు ముందే చెప్పాలిసింది చలికి తట్టుకోలేకుండా ఉన్నావని.’ అతన్ని పడుకోమని అతని చేతులతో తనను గట్టిగా చుట్టమనింది. అతనికి సుఖాన్నిచ్చింది, ఓదార్చింది. కౌగిలిని ఆమె బిగిస్తునే వుంది, దయగా, ఓదార్పుగా మాట్లాడుతూనే వుంది – కేవలం స్త్రీకి మాత్రమే అది చేతనైనట్టు. ఆమె ఊపిరి అతనికి విసురుతున్నట్టు తగులుతోంది. బైటి ప్రకృతి క్రూరత్వం మాత్రం కొనసాగుతోంది. చలికి బాధపడే అతనిలో ఆమె మాటలు నిప్పును రాజేశాయి. హృదయంలో ఏదో ఆ వేడికి కరుగుతోంది మంచులా. అతని కళ్ళవెంట వడగళ్ల వాన కురుస్తోంది. అతని మనసు, శరీరాలలోని మలినం ప్రక్షాళనం అవుతోంది. ఆమె ముద్దులు కురిపిస్తోంది, కాల్చే ముద్దులు – ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేనివి. ‘దిగులుపడకు. రేపు నీకు తలదాచుకోడానికి చోటు దొరక్కపోతే నేను ఆ విషయం చూసుకుంటా,’ అతని కలలోలా అనింది. తెల్లవారుజాముదాకా అలా గడిపారు. తెల్లవారి వెళ్లిపోయారు. ఆరు నెలలు ఆమె గురించీ వెదికినా కనబడలేదు. ఆమె పతనం స్పృహ ఆమె ఆత్మలోకి ప్రవేశించగూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.

శరదృతువును ఆకు పతన కాలం [Fall] గా కూడా విదేశీయులు భావిస్తారు. ఆమె పతనాన్ని ప్రకృతి సహజమైన ఆకు పతనము ద్వారా సూచించాడు రచయిత ఈ కవితాత్మక కథలో. సమాజం నైతికతగా భావించేదానికన్నా బ్రతుకుతెరువుకు, మానవతావాదానికి పెద్దపీట వేసింది కథ. ప్రకృతిశక్తులు యెంత క్రూరంగా వుంటాయో మనిషి జీవితము అంతే క్రూరంగా ఉంటుందని తెలియజేశాడు రచయిత. ఇందులో ఒక ఆగంతుకురాలు నుంచీ అతను సుఖం, వెచ్చదనం, అనిర్వచనీయమైన ప్రేమను పొందాడు.

పదేళ్లకు తల్లిదండ్రులను కోల్పోయి అనాథయిన విలియం సోమర్సెట్ మామ్ [William Somerset Maugham] పారిస్‌లో పుట్టి పదేళ్లు అక్కడే పెరిగాడు. వైద్యం చదివినా రచయితగా స్థిరపడ్డాడు. మొపాసా ప్రభావం అతని మీద రచయితగా వుంది. మామ్ ప్రభావం తెలుగు రచయిత బుచ్చిబాబు మీద వున్న విషయం తెలిసినదే. ఆఫ్ హ్యూమన్ బోండిజ్[Of Human Bondage] లో తన గురించీ రాసుకున్నాడు. కేక్ అండ్ ఎల్ [Cake and Ale] అన్న నవల ఇద్దరు నవలాకారులు హు సిమౌర్ వాల్పోల్ [Hugh Seymour], థోమా హార్డీ [Thomas Hardy] లను దృష్టిలో ఉంచుకుని రాశాడు. భారతదేశం 1938 లో వచ్చినపుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఆయనతో చాలాసేపు గడిపాడు. ఆ అనుభవాన్ని1944 లో రాసిన రేజర్’స్ ఎజ్ [Razor’s Edge] లో వాడుకున్నాడు. మనిషి తెలివితేటల మీద , మంచితనం మీద అతనికి అంతంతమాత్ర నమ్మకం. స్త్రీల మీద సదాభిప్రాయం లేదు. అందుకేనేమో ద్విలింగ సంపర్కుడు [bisexual]; మూడొంతులు స్వలింగ సంపర్కుడు [homosexual]! శారీరక సుఖం మీదే గాని నైతికత మీద నమ్మకం లేకపోవడం ‘వర్షం’ కథలో కూడా గమనించవచ్చు. విచిత్రమైన విషయం: అన్ని అర్హతలున్నా, స్విస్ అకాడమీ సభ్యులకు అతనంటే సానుకూలాభిప్రాయమే వున్నా- అతని రచనా విజయం, సంపాయించుకున్న పేరు నోబెల్ బహుమతి ఇవ్వడానికి వాళ్లకు అడ్డొచ్చాయి. వర్షం కథ [1921] అతనికి ఆ రోజులలో పది లక్షల డాలర్లు తెచ్చిపెట్టింది. వర్షం సాడీ జోన్స్టన్ [Sadie Johnston] అన్న వేశ్య మీద రాసి తొలుత ఆమె పేరే దానికి ఉంచాడు. కథా సంపుటిలో చేర్చేటప్పుడు అది వర్షం అయింది.

కథలో కురిసిన వర్షం 1916ది. ఒక నావ మీది ప్రయాణీకులు హొనొలొలు నుంచీ యాపిస్ వెళుతుండగా నావపై అంటువ్యాధి సోకి రెండు వారాల పాటు పగో పగో ద్వీపం పడవల రేవులో [అమెరికన్ సామోఆ] మజిలీ చేస్తారు. నావలో రెవరెండ్ డేవిడ్సన్, దంపతులు, డాక్టర్ మసెఫాల్ దంపతులు, ఒక వేశ్య సాడీ జోన్స్టన్ కూడా వుంటారు. డేవిడ్సన్ ఒక ఛాందస మిషనరీ అవటం వలన ఆ వేశ్య గురించీ ఎక్కువగా పట్టించుకుని మజిలీ వేళా ఆమెను ‘సన్మార్గానికి’ తెచ్చే పనిలో ఉంటాడు. గవర్నర్‌తో మాట్లాడి ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా కారాగారం లాంటి సాన్ ఫ్రాన్సిస్కో పరివర్తనాశాలకు పంపించే ప్రయత్నంలో ఉంటాడు. ఒకసారి మూడు రోజుల పాటు ఆమెతో ప్రార్థన చేయిస్తూ, తానూ చేస్తూ, మతబోధ చేస్తూ గడుపుతాడు. ఒక రోజు పొద్దున్న సముద్రపు ఒడ్డున ఒక చెవి నుంచీ మరొక చెవి దాకా రేజర్‌తో గొంతు కోసుకుని చచ్చి పడుంటాడు. డాక్టర్ మసెఫాల్ అది చూస్తాడు. అక్కడి నుంచీ జోన్స్టన్ గదికి అతను వెడితే ‘మీ మొగాళ్ళు.. మీరు రోతైనా, మురికి పందులు! మీరంతా ఒకలాంటివాళ్లే ‘ అంటూ కేకలేస్తుంది. అసలు విషయం వైద్యుడికి అర్థమవుతుంది. డేవిడ్సన్ ఏ వేశ్యతో పరివర్తన తేవడానికి ప్రయత్నించాడో ఆమెతోనే లైంగికంగా కలిసి ఆ అపరాధభావాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. డేవిడ్సను భార్య డాక్టర్‌తో ఒకసారి అనింది తన భర్త మార్గమధ్యంలో చూసిన రెండు పర్వతాలను కలగన్నాడని. అవి రెండు వక్షోజాలను పోలినవని వైద్యుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. బహుశా ఆమె మీద కన్నుపడినప్పటి నుంచీ డేవిడ్సన్ మనసు శృంగార తలంపుతో చెదిరుంటుంది. గోర్కీ కథలోలాగే ఈ కథలోనూ వర్షం ప్రతీకగానే కాక, కథకు ఒక ప్రధాన అవసరమైంది. వర్షం మిషనరీ చేస్తున్న నిరంతర ప్రయత్నానికే గాక, అణిచిపెట్టి వుంచలేని మనిషి లైంగిక స్వభావానికీ, డేవిడ్సన్ అంతర్గత సంక్షోభానికి కూడా అద్భుతమైన ప్రతీక. ఒక చోట వర్షాన్ని ఇలా వర్ణిస్తాడు కథకుడు: ‘ఈ వర్షం చుక్కలుగా నేలమీద పడే మన సున్నితమయిన ఆంగ్ల వర్షం కాదు. ఇది నిర్దయది, భయం గొలిపేది. మొండి రోగగ్రస్తందయి చావుకు దారితీసే ప్రాకృత ఆదిమ శక్తి. అది కురవడంలేదు, ప్రవహిస్తోంది. ఆకాశం నుంచి దూకుతున్న వరద. పైన కప్పుగా ఉన్న ఇనుప రేకులను బాదుతోంది అవిరామంగా, అవిరళంగా – పిచ్చెత్తించేట్లు. దానిదంటూ దాని ఆగ్రహావేశం వుంది దుమకడంలో. కొన్నిసార్లు వెర్రి కేక వేయాలనిపిస్తుంది అది ఆగకపోతే. అప్పుడు ఉన్నట్టుండి మెత్తబడిపోతావు; విచారగ్రస్తుడవుతావు, శక్తిహీనుడవుతావు.’

3

పాలగుమ్మి పద్మరాజు పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలం, తిరుపతిపురం లో 24 జూన్ 1915న పుట్టాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి రసాయనశాస్త్రంలో డిగ్రీ పొంది కాకినాడ ప్రభుత్వ కళాశాలలో కొంతకాలం [1939-1952] అధ్యాపకుడిగా పనిచేశాడు. అయన 23వ ఏట సుబ్బి అన్న తన తొలి కథ వచ్చింది. ఆరంభంలో రాసిన కవితలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి మెప్పు పొందాయి. ఆయన తాకని సాహితీ ప్రక్రియలేదు. 1954 లో సినిమా రంగ ప్రవేశం చేసి బంగారు పాపకు, ఆ తరువాత చాలా సినిమాలకు వివిధ రకాలుగాను, అజ్ఞాత రచయితగా కూడాను పనిచేశారు. ఎం.యెన్. రాయ్ రాడికల్ హ్యూమనిజం వైపు మొగ్గుచూపారు. ఆయన తర్జుమా చేసిన తమిళ ‘రక్తకన్నీరు’ చుండి నాగభూషణం ఇంటి పేరు రక్తకన్నీరు అయ్యేలా ఆంధ్రదేశమంతా వందలాది ప్రదర్శనలకు నోచుకుంది. నాగభూషణం నిర్మించిన బికారిరాముడు సినిమాకు పద్మరాజు దర్శకత్వం వహించారు. అశోకుడి మూడునాళ్ళ పాలన, రామరాజ్యం, నల్లరేగడి, వగైరా 8 నవలలు 59-60 కథలు, 30 కవితలు, ఎన్నో నాటికలు వ్రాసారు. ఆయనకు కాలం కొరవడిందేగాని రచనకు వస్తువు కాదు. గాలివాన అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ, నల్లరేగడి నవలకు ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతులు ఇచ్చాయి. 17 ఫిబ్రవరి 1083న మరణించారు. ఇద్దరు సంతానం. గాలివాన లోని రావుగారిలా ఆంక్షలు విధించకుండా పెంచి వాళ్ళు తమకు నచ్చినవాళ్లను వివాహమాడే స్వేచ్ఛ కూడా ఇచ్చిన ఆదర్శవాది. దొంగతనంలోనూ కళా నైపుణ్యం చూడగలిగిన కళా దృష్టి కలవాడు. ఉదారవాదం, మానవతావాదం తప్ప ఏ వాదానికి పుస్తె కట్టకుండా రచనలు చేయడంవల్ల వాటిలో ఎంతో వైవిధ్యం చూడగలం. 1973-74 లో విశాఖపట్నం వచ్చినపుడు ఆయన సాహితీ ఉపన్యాసం విన్నాను. మేధా సంపత్తిగల సౌమ్యుడు.

గాలివాన రావు సుఖజీవి. రాజీలేని క్రమశిక్షణతో జీవిస్తున్నాడు. యాభై ఏళ్ళ వయసున్నవాడిలా కనబడడు. భార్య ఎక్కువ వయసున్నట్టుంటుంది. నలుగురు పిల్లలు. సంపాయించినది చాలు అని చేస్తున్న న్యాయవాద వృత్తిని కొడుకుకు అప్పగించి ఖాళీగా ఉంటున్నాడు. మేధావి, వక్త. అతని జీవితం సాఫీగా సాగుతోంది. పిల్లలు అతని అభిరుచికి అనుగుణంగానే నడుచుకునేట్టు సంసారాన్ని దిద్దుకున్నాడు. అతనిదంటూ అతని జీవిత సిద్ధాంతమొకటి వుందనుకుంటాడు. ఒక సంస్థ ఆహ్వానించగా ‘సామ్యవాదమూ సామ్యరాసామోదము’ అన్న విషయం మీద ప్రసంగించడానికి రైలు ప్రయాణం పెట్టుకున్నాడు. బయటి ప్రపంచంలోలాగే రైలు పెట్టెలోని అనేక అంశాలు, మనుషుల నడవడి అతనికి నచ్చవు. పులి మీద పుట్రలా ముప్పై ఏళ్ళ బిచ్చగత్తె ప్రవేశించి తన పని ఆరంభించింది. అందరు తమ దాతృత్వం చాటుకున్నారు కానీ రావు ‘ఫో’ అన్నాడు. ఆమె కళ్ళలో ఒక ‘తమాషా మెరుపును’ చూశాడు. విరోధభావం కలిగింది. వర్షం ఉధృతమైంది. హోరున కురిసే వానలో తాను దిగవలసిన స్టేషన్ లో దిగాడు. ఆ స్త్రీని రైలు వాళ్లు దింపేయడం వలన తాను దిగి అతని సామాను స్టేషన్ లోకి చేరవేసింది. అతనిని కలవవలసిన వాళ్ళు గాలివాన ఉధృతి వల్ల రాలేదు. ఆ వూరు స్టేషన్‌కు దూరం. వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు లేవు. స్టేషన్ మాస్టర్ కూడా నేను ఇక్కడుండి చేసేదేముంది అని వెళ్ళిపోయాడు. వెయిటింగ్ రూములోకి దూరాడు రావు. వానకు అదీ కూలిపోయేట్లుంది [అతని నమ్మకాలలా]. చీకటిగా వుంది. టార్చ్ లైట్ తీశాడు. మఫలర్, స్వెట్టర్ వేసుకున్నాడు. తడిసి వణుకుతున్న బిచ్చగత్తె కనిపించింది. పంచె ఇచ్చి కట్టుకోమన్నాడు. తన దగ్గిరున్న బిస్కత్తులు ఇచ్చాడు. తానున్న చోటునుంచీ అతనికి దగ్గిరగా చేరింది. ఆమె తన దీనమైన గాథ వినిపించింది. ఉంచుకున్నవాడికి పిల్లలు కనింది. తాగుబోతు. తానే అడుక్కుని సంసారాన్నిఈదాలి. చలికి ఒణుకుతున్నాడు రావు. ఉన్నంతలో సుఖంగా ఉండాలి బాబు గారు అని బోధించింది. ఆమె వేదాంతికాదు. ఆమె మాట్లాడుతుంటే మనసు స్థిమిత పడింది. కానీ ఆమె భౌతిక శరీరాన్ని అసహ్యించుకున్నాడు. ఇరువురి మనుషుల, వాళ్ళ మనసుల మధ్య ఎంతో అంతరం. ఆమె తోడుగా వున్నందుకు కృతజ్ఞతా భావం కలిగింది. అతని వొణుకును గమనించి తన చుట్టూ చేతులు వేసుకోమంది. తాను ఆ పనిచేసి ఇంకా ముందుకెళ్లి అతనికి సుఖాన్నిచ్చింది. నిద్రపోయాడు ఆకలి తీరిన పిల్లవాడిలా – ఒకపక్క వెలుపల వర్షం తనపని అది చేసుకుంటుంటే. తెల్లవారి చుస్తే టిక్కెట్లు ఇచ్చేచోట ఆమె నిర్జీవంగా పడుంది. ఒక చేతిలో అతని పర్సు, రెండో చేతిలో కౌంటర్‌లో నుంచీ ఆమె దొంగిలించిన నోట్లు వున్నాయి. డబ్బులు డ్రాయర్లో తోసేసాడు ఆమె దొంగ అని ఎవరు అనుకోరాదని. తన గుర్తుగా ఆమె శరీరం మీద తన డబ్బులు వదిలేశాడు పర్సులోని తన పేరున్న కార్డును తొలగించి.

ఒక గాలివాన వ్యక్తిగత అనుభవం రచయితకు 1948లో వుంది. అప్పుడు ఆయన పేద ఇల్లు కూలిపోయి భార్య లోపల మూడు గంటలపాటు చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. ఆ అనుభవం వేరు, రావుగారి అనుభవం వేరు. ఏ గాలివానైనా ఒకేలా ఉంటుంది, ఒకేలాంటి భీభత్సం సృష్టిస్తుంది. కాకపొతే ఉధృతిలో, నాశనం చేయగల శక్తిలో, చోటులో తేడా ఉంటుంది.

కొన్ని వాక్య నిర్మాణాలు, వాటి సముదాయాలు నాలాంటి సాధారణ చదువరిని తికమక పెడతాయి.

‘వాళ్ళను [సంతానాన్ని] చూస్తే ఆయనకు గర్వం.’ అలాంటి పిల్లలను కనిన భార్యంటే, పోనీ ఆమెంటే గర్వం కాకపోతే మరో భావనన్నా, ద్వేషమన్నా, అసంతృప్తన్న ఉందో లేదో రచయిత చెప్పలేదు.

‘వేదాంతం జీవితంతోటి జీవన విధానంతోటి మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటి అనుబంధించి ఉంటుంది; వేదాంతానికి జీవితానికి నిశితమైన మానవ అనుభవాలకు కూడా అతీతమైన విషయంలో ఏమీ సంబంధం లేదు,’ అనుకుంటాడు రావు. మరి ఆయన వేదాంతం వలన ఒనగూడే ప్రయోజనం ఏమిటో తెలీదు.

‘వాటిని [నియమాలను] ఏర్పరచుకున్నా అతిక్రమించకుండా ఉండగల సాహసం ఆయనకు వుంది. నీతి, నియమాలను గురించి ఆయనకు పిచ్చి పట్టుదల లేదు.’ తానే ఏర్పరచుకునే నియమాలను అతిక్రమించడానికి సాహసం అక్కరలేదు. పాటించదలచు కోనప్పుడు నీతి వృథా.

‘అనేక విషయాల గురించి ఆయనకు తీవ్రమయిన అభిప్రాయాలున్నాయి. అసలు ఆయన వేదాంతి.’ తీవ్రమయిన, అంత తీవ్రమైనవి కానీ అభిప్రాయాలు లేని మనిషి ఉండడు. ‘అసలు’ వేదాంతి ముందు ఎలా పొసుగుతుందో.

‘అసంతృప్తివల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమయిన వుత్సాహంతోటి పవిత్రమైన వుద్రేకంతోటీ మాట్లాడగలరు.’ పవిత్ర, అపవిత్ర ఉద్రేకాలుండవు. ఉద్రేకము ఉద్రేకమే; అదుపులో లేనిది. పడకూడనిచోట ఉద్రేకపడితే అది అపవిత్ర ఉద్రేకంగా భావించాలి.

రావు గారిలో అసంతృప్తుంది. వడ్డించిన విస్తరిలాంటి జీవితంలో ఏ ఆధరువు కొరవడిందని అసంతృప్తి? లైంగికమయినదేమో! చదువరికి చెప్పాలనిపించలేదు రచయితకు.

‘రావుగారు యువదంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగావుంది.’ ఇక్కడ బరువు అదోలా అనిపిస్తుంది.

‘రైలు, గాలికి కారణభూతమయిన మానవ మేధ ఆ గాలివానలా నిరుపయోగంగాను అత్యల్పంగానూ అనిపించాయి.’ రైలు మానవ మేధకు కారణభూతమే. గాలివానకు మేధకు సంబంధంలేదు. మేధ అత్యల్పంగా అనిపిస్తే తప్పులేదు, మేధకన్నా ప్రకృతి బలమైనది కాబట్టి, మేధ ప్రకృతిని కొంతమేరకు మాత్రమే కట్టడి చేయగలదు కాబట్టి. గాలివాన నిరుపయోగం అని తీర్పు ఇవ్వడం బాగుండదు. నీరు అవసరం మనిషికివుంది. అంత గాలి అక్కరలేదు; కావలిస్తే వాన కురవచ్చు అనడం అసమంజసం. అప్పుడు ప్రకృతి మనిషి నిరుపయోగం అని తేల్చిచెబుతుంది. రచయిత భావన ఏదో ఆ వాక్యాలు స్పష్టంగా చెప్పలేకపోయినట్టనిపిస్తోంది.

ముందుగానే తుపాను, చలి తీవ్రంగా వుంటాయని కలగన్నట్టున్నారు. ఒక ప్రయాణికురాలు [అతి జాగ్రత్త మనిషేమో] చెఖోవ్ పాత్రను గుర్తుకు తెస్తూ ఒక రగ్గు తెచ్చుకోడమే కాక దగ్గిరగా కప్పుకుంది.

అడుక్కునేవాళ్ళంటే రావుకు ఎలాంటి సదాభిప్రాయం లేదు. ఈ కథకు నాయిక అవబోతున్నామెను ‘ఫో’ అని గసిరాడు. ఆమె బిచ్చమెత్తటం ఆయన నియమాలకు వ్యతిరేకమే. ఊరికే ఇవ్వాలంటే ఎవరికన్నా కష్టమే; ఊరికే తీసుకోవాలంటే ఎవరికైనా ఇష్టమే. అది ఇలా ఉండుంటుంది అని పాఠకుడు వూహించుకోలేని ‘తమాషాగా మెరిసే ఒక తళుకును రావు ఆమె కళ్ళలో చూసాడు.’ పోనీ దాని మొరటు అర్థం ‘ఆమె మీద ఆయన కన్ను పడింది’ అని అనుకుందామంటే రావుకు ఆ తళుకు విరోధభావం కలిగించింది. అవి ఎలాంటివైనా, తళుకులు, మెరుపులు బిచ్చగాళ్ళకళ్ళల్లో కనబడగూడదేమో రావు గారు అనే snob వద్ద ఉన్నకొలబద్దతో కొలిచినపుడు. లేదంటే రచయిత అలా రాయడాన్ని తప్పుగా అనుకోవాలి. అనేక అస్పష్టతలలో ఇదీ ఒకటి.

‘రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు.’ ‘ముహూర్తం’ అచ్చు తప్పయుండాలి.

రైలు స్టేషనులో ఆగింది. ఆగి ముందుకు వెళ్ళుండాలి. రోడ్డు మీద అంగుళం అంగుళానికి చెట్లు పడివున్నాయి, టెలీఫోను తీగలు తెగిపోయాయి స్టేషనులో ‘రాత్రికి రైలు ఆగిపోతుంది అన్నాడు’ స్టేషన్ మాస్టారు. స్టేషన్ మాస్టర్‌తో పనిలేకుండానే రైళ్లు ఆగిపోవడమో, వెళ్ళిపోవడమో ఎలా జరుగుతుందో – మాస్టర్ స్టేషన్ ఒదిలేసి పోతున్నానన్నాడు. స్టేషన్ ఆయన సొంత దుకాణమేమో! ఒక వేళ రావుగారి రైలు వెళ్ళిపోయి మరో రైలు ఏదన్నా ఆ స్టేషనులో వచ్చి ఆగిపోయినా దాంట్లోకి దూరి తల దాచుకోవచ్చు రావుగారు, బిచ్చగత్తె. దానిలోని ప్రయాణీకులు తోడుగా వుంటారు. మరో రైలు వచ్చినా, రావు వచ్చిన రైలు ముందుకు వెళ్లకుండా స్టేషన్‌లో ఆగిపొయినా కథ కంచికి ప్రయాణం కట్టేది చెప్పదలచుకున్నది చెప్పకుండా. అసలు, వర్ణించిన బీభత్సానికి రైలుపట్టాలు తట్టుకుని నిలబడటం సాధ్యమా రావుగారి రైలైన, రాబోయే రైళ్లయినా?

లోపలి వచ్చి పొడిబట్టలు కట్టుకుని స్వెట్టర్ తొడుక్కుని, మఫ్లర్ చుట్టుకున్నాడు. ‘క్రూర శక్తులు విజృంభించి మానవుడు సృష్టించినవి, దేవుడు సృష్టించినవి కూడా భూమి మీద లేకుండా మాయమవడానికి పూనుకున్నట్లు వుంది’ అని రచయితో, రావో అంటారు. గాలివాన కూడా దేవుడు సృష్టించినదే కాబట్టి ఆయన సృష్టించినదానిని [మనుషులతో సహా] ఆయన సృష్టించిన వాటిని తుడిచిపెడుతున్నట్లే కదా లెక్క. ‘ఈ గందరగోళంలో మన స్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావుకు తోచలేదు.’ వేదాంతం లోని లోపమో, రావుగారి లోపమో.

 ఈ కథలో ఏది రావు అభిప్రాయం, ఏది రచయిత అభిప్రాయం అని ఒక్కోసారి తేల్చుకోడం కష్టమవుతుంది.

ఆమె ముఖం మీద, శరీరం మీద ఆ విషయం రాసున్నట్టు రావు ఆమె గురించీ నిస్సిగ్గుగా, అభ్యంతరకరంగా వేసిన మనసస్తత్వ అంచనాలలో ‘తాను ఎన్నడూ ఎరుగని మగవాడిక్కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో ఆమె సుఖించగలదు’ అన్నది కూడా ఒకటి. ప్రతి బిచ్చగత్తె శరీరాన్ని సరుకులా అమ్ముకోగలదు అని ఢంక భజాయించి చెప్పలేము, మేధావి రావుతో సహా – ప్రతి బిచ్చగత్తె కులటే అన్న నిశ్చితాభిప్రాయం ఉంటే తప్ప. రావు లేక రచయిత దానిని ప్రశంసగా అనుంటే గొడవే లేదు.

‘మావోడికి రోజుకో పావలా ఇత్థానండి తాగుడికి. ఆడికి నన్ను సుత్తే అడలు బాబుగారు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి. అందుకే తాగుతాడు.’ ఆమె వెయిటింగ్ రూములో రావుతో అన్న ఆ మాటల అసంగతం నగ్నంగా కనిపిస్తుంది. ఆమె అంటే భయం కాబట్టి వాడు తాగుతాడు; ఆ విషయం ఆమెకు తెలుసు; అందుకని పావలా ఇస్తుంది వాడు తాగి ధైర్యం తెచ్చుకోడానికి. వాడు భయపడకుండా ప్రవర్తించడం ఆమెకు సాధ్యం కాదన్నమాట.

ఏదో పెద్ద చప్పుడు అవగానే శక్తి కొలది మూలకు గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించుకున్నాడు. ఒక మూల అతన్ని కూర్చోపెట్టి ఆయనను తన చేతులతో చుట్టింది. ‘ఆయన మనసులో ప్రళయమంత మథన జరుగుతోంది.’ అంటే మదనుడు స్వాధీనంలోకి తీసుకుంటున్నాడు.

ఆమె తన ఇల్లు కూలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తే ఈయన ‘పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా దగ్గరగా అదుముకున్నాడు.’ అసమంజసం. గాలి చేసే అంతులేని గోల మనసు పొలిమేర్లలోకి వెళ్ళిపోయింది.’ లైంగిక కోర్కె అతనిని ఆధీనంలోకి తీసుకున్నది అని పాఠకుడు అర్థంచేసుకునే ప్రయత్నం చెయ్యాలి.

‘క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీతమయిన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితం.’ అదే ఈ కథ ఆయువుపట్టే కాక, రావు బిచ్చగత్తెతో కలిసి చెయ్యబోయేదాన్ని సమర్ధించే ప్రయత్నం కూడా! అని రావుకు జీవితంలో మొదటిసారి అనుభవవంలోకి వచ్చిందట. ఇది వేదాంతంలో భాగం కాదా? అవును అనుకుంటే అవుతుంది, కాదనుకుంటే కాదు. యాభై ఏళ్ళు మీదబడే దాకా రావుకు తుపాన్లు, భూకంపాలు మానవాతీత శక్తులని తెలియలేదని ఎలా అనుకోవాలి? మానవాతీత శక్తులను బూచిగా చూపించి కానిపని చేయడం సమర్థనీయం కాదు; అసమంజసం కూడా. ఒంటికి గౌరవానికి మంచిది కాదు. రావు ఇంతలా తల్లడిల్లుతున్నాడుగాని జీవితంలో మొదటిసారి ఇంత బీభత్సాన్ని చూస్తున్నా ఆమె ప్రశాంతంగా అతనితో మాట్లాడుతోంది. ఆమెలో మానసికమైన కల్లోలం ఆ క్రూరమైన ప్రకృతి శక్తులు కలుగజెయ్యలేదు; పైగా ఆమె రావుకన్నా ఇరవై ఏళ్ళు చిన్నది. ఇక్కడ ఒక విషయం వెల్లడవుతోంది ప్రకృతి క్రూర శక్తులు అందరి మీదా ఒకేలా ప్రభావం చూపించాలని లేదు; ఆయనలోని కోర్కె ప్రకోపము అతని శరీరాన్ని ఆమెతో పెనవేసేట్టు చేసింది అంటే సత్యం చెప్పినట్టుంటుంది.

అతను మేలుకునేసరికి ఆమె లేదు, అతని జేబులో పర్సులేదు. టిక్కెట్ల గది కూలిపోయి ఆమె మరణించింది. ‘తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందము శాశ్వతంగా పోయినట్టు’ అనిపించింది. కౌమారం లోని ప్రేమ మైమరపు అలానే అనిపిస్తుంది. రావుది కౌమారం కాదు. ఆమె బతికుంటే ఆ ఆనందం గురించీ ఆమె వెంట వెళ్ళిపోనప్పుడు ఒక్క ఆనందము దూరమైందన్నా చింత అనవసరం. ఆమె సాంగత్యానికి ముందు జీవితంలో ఆ మాత్రం ఆనందంకూడా లేకుండా బతికాడా? తన ప్రియుడిని తాత్కాలికంగా విస్మరించి ఆమె కూడా రావు పై అనురాగం ఏర్పరచుకున్నదన్న రావు గారి భావనవలననేమో. అనురాగంలో పరస్పరతకు చోటు ఉండక్కరలేదనేమో.

దొరికితే దోచుకుందామన్న భావనవల్ల ఒక పేద వ్యక్తి తన శరీరాన్ని అతని దానితో పెనవేసింది; ‘ఔన్నత్యంతో’ అనడానికి కథలో దాఖలాలేదు. రావులోలా లైంగిక, ప్రేమ సంబంధ అసంతృప్తి వుండి ఆమెవల్ల రావుకు కలిగిన అనుభూతి ఆమెకు రావువల్ల ప్రాప్తించింది అనుకూడానికీ లేదు. అతని భార్య ఏనాడు ఇవ్వని లైంగిక సుఖం ఈమె ఇచ్చిందనుకోవాలి. ఇవ్వకుండా ఏ అంశం భార్యను ఆపినట్టు? ఆమె ఇవ్వకపోతే తీసుకునే ప్రయత్నం రావు అన్నా చేసుండదానికి అతని బిడియం, హుందాతనం అడ్డొచ్చాయా? బిచ్చగత్తె దగ్గర అవి అతనికి అడ్డురాలేదు. అపరిచితురాలిచ్చిన లైంగిక సుఖం, ప్రేమ లాంటివి ఏనాడు పొందకపోయినా నలుగురు పిల్లలను ఆమె, అతను కలసి కన్నారు. బిచ్చగత్తె ఇచ్చిన సుఖం లాంటిది మరో స్త్రీ ఇవ్వలేదు, అందరు స్త్రీలవీ ఒకేలాంటి అంగాలు కావు అని అనుకోడం కష్టం. పిల్లలను కనడానికి, లైంగిక సుఖాన్ని అపరిమితంగా పొందటానికి సంబంధంలేదు అని ఎవరైనా వాదించవచ్చు. గాలివానలాంటి ఉధృతమైన లైంగిక కోర్కె పశువులోను దాగి ఉంటుంది; అవకాశం దొరికినపుడు ‘విధ్వంసకర’ శక్తితో బైటికి వస్తుందని రావు విషయంలో కథ చెప్పినట్టు. విధ్వంసం అంటే సామాజిక నీతి, నడవడి నియమాలను తోసిరాజు అనడం. ఇంతకూ రావు ఆమె కౌగిలిలో పొందినది తుపాను బీభత్సం నుంచీ కొంత భద్రతా, లైంగిక సుఖమా, ప్రేమా – రెండా మూడా? ఇచ్చిన ఆమెకు మాత్రం తెలియదు.

పిల్లలు, భార్య ఆమె వచ్చినంతగా దగ్గిరకు రాలేదట. ఏమిటి ఆ దగ్గిరతనం – ఒకసారి కౌగలించుకుని, వెచ్చదనం ఇచ్చి, పొంది, లైంగిక సుఖం ఇవ్వడం. అప్పుడు ఆమెలో ప్రతిఫలాన్ని ఆశించని మనస్తత్వం లేదని అనుకోడానికి దాఖలాలేదు. భార్యయేమోగాని పిల్లలను తన ఆంక్షలతో, గంభీర వైఖరితో దూరాన ఉంచుకున్నాడు. ఆ జ్ఞానం ఈ మేధావికి గాలివాన అనంతరమన్నా కలిగింది అని రచయత రాయలేదు, పాత్ర చేత పలికించలేదు కూడా.

ఆమెతో కలువబోయేముందు, కలిసిన తరువాత, ఆమె మరణానంతరం అతని వేదాంతం, సిద్ధాంతం మౌలిక మానవతావాదం [radical humanism] అయ్యుండాలి.

ఈమె ‘ఆఖరు తత్వాన్ని’ ఒక రాత్రిలో తెలుసుకున్న రావు అన్నేళ్లు కాపురంచేసిన భార్య ఆఖరు తత్వం ఎందుకు తెలుసుకోలేకపోయాడు. ఇలాంటి గాలివానలా ఏ అడివిలోనో రైలుస్టేషనులోనో భార్యతో చిక్కుకుపోక పోవడంవలననేమో. ప్రతి స్త్రీ లోను అనురాగం, అర్పితత్వం ఒకేలాంటి ‘ఆఖరుతత్వం’ గా ఉంటుంది, మినహాయింపులతో పద్మరాజుగారి రంగిలో కూడా ఉన్నట్టు. పురుషుడిలో కూడా ఆఖరుతత్వం ఉంటుంది. అదే విశృంఖల పశుత్వం రావు నమూనా ఐతే. అదే కదా రావు నుంచీ ఒకవిధంగా వెల్లడయింది. ఆ పేదరాలి ఆఖరు తత్వం గురించీ అచ్చెరువొందిన రావు తన ఆఖరుతత్వం గురించీ, అది ఇలా బయటపడటం గురించీ ఆలోచించలేదు, విచారించలేదు. అంత అభిమానంతో యాభై ఏళ్ళు జీవించిన ‘పెద్దమనిషి’కి తాను పాటించిన విలువలు హూష్ కాకి కాగా తన ‘నిజస్వరూపం’ ఏమిటో జ్ఞానోదయం అవగా విచారం లేకపోయింది. అతని ఆఖరుతత్వం ఒక బిచ్చగత్తెతో అవకాశం దొరకగానే లైంగిక సుఖం పొందటం. అది ఆమె కౌగిలి వేదికగా వెల్లడయింది. ఆమెకు జీవితంలో ఏ ‘విలువలు’ లేవు. పశువులా ప్రాణంతో బతికుండటం తప్ప, వేధించే జీవితాన్ని భరించడం తప్ప, ఉంచుకున్నవాడిని గుడ్డిగా ప్రేమించడం తప్ప. మనిషి లైంగిక పశువు. అంటే; అవకాశం దొరికితే ఏ విలువా పాటించక్కరలేదు, తన శారీరక సుఖానికి లొంగిపోవచ్చు అన్న తత్త్వం కూడా వెల్లడయింది. విలువలు, నీతి డొల్లవి అని తేల్చిన కథ మనిషిని మనిషిగా గర్వపడేట్టు చేయలేదు. మనిషి ఒక ఛేదించలేని రహస్యం [mystery]; వాడి పరిశీలనలో నా జీవితమంతా నేను గడిపేసినా అది సార్థకతే అన్నాడు దోస్తోవిస్కీ. దానర్థం మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకోడం అసాధ్యం అని. ‘నేనెవరు?’ అని ప్రశ్నవేసుకుని సమాధానం వెదుక్కో అని తత్త్వవేత్తలు సెలవిచ్చారు కదా? అది ఆధ్యాత్మిక కోణం నుంచీ వేసుకోవలసిన ప్రశ్న మాత్రమే కాదు. గొప్ప మనస్తత్వ పరిశీలకుడు కాదు పద్మరాజు గారు. కనీసం ఫ్రాయిడ్ కన్నాకాదు. ఫ్రాయిడ్ అన్నవాటిని యూన్గ్ లాంటి శిష్యులే తప్పుపట్టారు. వాళ్ళనూ తప్పుపట్టవచ్చు. మనిషి సహజంగా అవకాశవాది. ఆ అవకాశవాదం ఆ స్త్రీ, పురుష పాత్రలలో రచయిత వెల్లడి చేయదలచుకోక పోయినా వెల్లడయింది. దానికి గాలివాన వాకిట గొప్ప పేర్లు ‘మానవతావాదం’, ‘ప్రవర్తనావాదం’ వగైరాలు పెట్టుకోవచ్చు, మానవచ్చు.

రచయిత అసంకల్పిత పక్షపాతం వలన ఈ కథలో రావు నీడలో బిచ్చగత్తె కనబడవలసినంతగా కనబడకుండా పోయింది. రావుపట్ల భార్యకూడా చూపని ప్రేమను చూపి, లైంగికంగా ఆదరించి చాలినంత మానవుడిగా నిద్రలేపింది. ఉంచుకున్నవాడికి [నిజానికి ఈమె వాడిని ఉంచుకుంది] ఇద్దరినీ పిల్లలను కనడమే కాక తాగడానికి రోజుకు పావలా ఇస్తుంది వాడికి బాకీ ఉన్నట్టు. క్షమా గుణం కూడా వుంది. ‘రైల్లో రావు ఒక్క పైసా ఇవ్వకపోయినా పగపెట్టుకోలేదు.’ ఔన్నత్యాలుగల ఈ అనామికలో దానగుణం కూడా వుంది.

ఆమె అతనికి భద్రతా వలయమయింది. రావుకు భార్యనుంచి కొరవడ్డాయేమో అనిపించేంతగా ప్రేమను, సుఖాన్ని రావుకు ఆ బిచ్చగత్తె దానం చేసింది. ప్రేమ, సుఖం ఇచ్చి, గాలివానకు మరణించి రావు గారిని పునరుద్ధానం చేసింది నామమాత్రంగానైనా. బుద్ధుడిలా జ్ణానోదయం కలిగిందో లేదో తెలీదుగానీ న్యాయవిద్య చదివిన రావు గారికి ఇంగితజ్ఞానం వచ్చిందని అనుకోదలచినవాళ్లు అనుకోవచ్చు. మానవుడిగా కన్నీరు మాత్రం కార్చాడు.

కథంతా కాకతాళీయాలతో నింపబడింది. అన్ని కాకతాళీయాలు కాకతాళీయం అవదు. ఏదో పని మీద రైలు ప్రయాణం; అప్పుడే ఆకాశం భూమీ ఏకమయ్యేట్టు గాలివాన; అందులో అడుక్కుతినే ఆమె ఉండటం; ఆమెను కూడా రావు దిగవలసిన స్టేషనులో రావు గురించే అన్నట్లు ఎవరో దింపెయ్యడం; ఒక పురుగు కూడా వాళ్ళిద్దరిమధ్య పానకంలో పుడకలా మిగలకపోవడం; రైల్వే సిబ్బంది కూడా స్టేషనును అనాథగా వదిలెయ్యవచ్చు అని తోచి దాని మానానికి దాన్ని వదిలేసి పారిపోవడం; రావుకు భరించలేనంత [ఊలు స్వెట్టరు వేసుకున్నా, మఫ్లర్ చెవులమీది నుంచీ తలకు చుట్టినా] చలినుంచీ రక్షణకు మరో మానవ శరీరం అవసరమవ్వడం; అది పురుషుడిది కాక స్త్రీది కావడం; ఆమె ముసలిది కాక ముప్పై ఏళ్ళ పడుచు కావటం.. కథా రచనంటే పూర్తిగా వాస్తవం కానక్కరలేదు; కల్పన ఉంటుంది. కానీ అభూత కల్పన చోటుచేసుకోకూడదు చెప్పదలచుకున్న ఒక తత్వం గురించీ.

రావుగారు ఏ లోపం లేని ఆదర్శ మానవుడు అని అనుకోవచ్చు, కనీసం విలన్‌లా గాలివాన చుట్టుముట్టనంతవరకు. చెడ్డవాడుగా పరిగణించాలంటే దానికి అనేక కాకతాళీయాలు దోహదం చెయ్యగా గాలివాన కారణం. మానవుడి ఆధీనంలోలేని సహజ శారీరక, మానసిక బలహీనతలు తమవంతు పాత్రను బ్రూటస్‌లా పోషించాయి. కట్టే, కొట్టే, తెచ్చే అన్నంత క్లుప్తంగా చెప్పాలంటే అదీ కథ. రావుగారు ద్వంద్వనీతిజ్ఞుడు అని పద్మరాజుగారు కూడా ఆ పాత్రను చిత్రించే ప్రయత్నం చేయలేదుకదా, ఆయనకు రావు పట్ల సానుభూతి ఉన్నది తాదాత్మ్యం చెందినంతగా.

రావు జీవితంలో ఒక ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో అతను ఏర్పరచుకున్న విలువలకు తిలోదకాలు ఇచ్చుకున్నా ఇక వాటి జోలికి వెళ్లకుండా జీవిస్తాడా? లైంగిక కోర్కెను తీర్చుకునే ఇలాంటి అవకాశం వస్తే మరో వైపు చూస్తూ వెళ్ళిపోతాడా? అతని భార్యకు ఇలాంటి అనుభవమయితే క్షమించి కాపురం యథావిధిగా కొనసాగిస్తాడా? అనేక అంశాలున్నాయి పద్మరాజు గాలివాన కథకు కొనసాగింపుగా రాయాలనుకుంటే.

చెప్పేది సులువుగా అర్థమయ్యేట్లుగానూ, ముక్కు సూటిగానూ చెప్పలేక పోవడం కథలో అడుగు అడుగునా గమనించవచ్చు – గమనించదలచుకుంటే. పరస్పర వైరుధ్యాలున్నాయి. ఆయన ఈ కథను ముందుగా ఆంగ్లంలో రాసుకుని హడావుడిగా పోటీ గురించీ తెలుగులోకి అనువాదం చేసుకోడం తికమకలకు తనవంతుగా దోహదం చేసింది. ఆంగ్లంలో ఆయనకు పాండిత్యం ఉందని రామన్ చెప్పారు.

‘వర్షం’ కథలోని రెవరెండ్ డేవిడ్సన్ రావు గారి పాత్రకు ప్రేరణ. వర్షం ఆ కథలో లాగే పురాతన శక్తులకు ప్రతీక. మనసులో అంతర్భూతంగా ఉండే ఆలోచనలు, అసంతృప్తి, కోర్కెలు భయంకరమైనవి. అదుపు చెయ్యడం కష్టతరమైనవి. వాటికీ కళ్ళేలు వేసివుంచడం సామాజిక జీవనానికి అవసరం. కళ్లెం వేసే ప్రయత్నం చేయని రావు గారు ఒక ఒంటరి బిచ్చగత్తెను వాడుకున్నారు, డేవిడ్సన్ సాడీ జోన్స్టన్‌తో సుఖించినా తప్పుపట్టకూడదని అనుకోడానికి లేదు. కళ్లెం వేయని డేవిడ్సన్ దానికి శిక్షగా మరణించగా, కళ్లెం వేయని రావు తనను తాను శిక్షించుకోకుండా యథావిధిగా జీవించాడు. అది వ్యక్తిత్వ భేదం. మామ్ తన నాయకుడి లైంగిక చర్యను తప్పుపట్టి ఒదిలేశాడా అన్న విహాయం పరిశీలించాలి. మామ్ ఆ పెద్దమనిషిని ఆత్మహత్య చేసుకోనిచ్చేవాడు కాదు. సుఖం కన్నా, నీతి, నడవడి, తాను నమ్మిన మత ధర్మం విలువైనవని డేవిడ్సన్ భావించాడు. తన ఆత్మహత్య ద్వారా అది రుజువు చేశాడు. రావు పాత్ర తన పెద్దరికాన్ని, సామాజిక స్థాయిని, మంచిచెడులను తాకట్టుపెట్టి సుఖానికి పట్టం కట్టి దానికి గాలివానను ఒక మిషగా చూపించుకుంది. పద్మరాజు మామ్‌కు రుణపడివున్నారు డేవిడ్సన్ పాత్రను రావు గారి పాత్రకు నమూనాగా తీసుకోడంలో. రెండు మగపాత్రలకు ‘పనికిమాలిన’ పెళ్లాలున్నారు. ఇద్దరు stiff-upper-lip ముసుగులో జీవించారు. సంబంధంలేని స్త్రీలతో ఆ ఇరువురు ఏకమయ్యారు. ఇద్దరు వేదాంతులే, ఒకేలా కాకపోయినా. చివరిలో లైంగిక సుఖానికి ఎంచుకున్న స్త్రీల స్థాయి ఒకటే. ఇద్దరు సామాజిక అంతారాల స్పృహతో [snobbish గా] వున్నవారే. కానీ ఓకే విషయంలో ఇరుపాత్రలమధ్య హస్తిమశకాంతర తేడా వుంది – పతాక సన్నివేశంలో పశ్చాత్తాపంతో డేవిడ్సన్ దగ్ధమయ్యాడు; రావు గారు పశ్చాత్తాపం జోలికి వెళ్లకుండా జీవితం కొనసాగించాడు. రెండింటిలో వర్షం పాత్ర అమోఘం.

గోర్కీ కథలో మిగతా రెండు కథలలోలా వర్ష బీభత్సం తనకు నిర్దేశించిన భూమికను తాను పోషించింది, ప్రతీకగాను, పాత్రలను ఏకం చేయడంలోనూ. సామాజిక అంతరాలులేని యువకుడు, యువతీ పాడైపోయిన పడవలో గడిపారు గాలివాన కథలో లాగ; గాలినకు రైలుపెట్టే , శరదృతువు రాత్రికి పడవ రంగస్థలాలు. సామాజిక అసంగతి కి ప్రతీకగా కూడా గోర్కీ కథలో వర్షం నిలిచింది, లేక కురిసింది. గోర్కీ కథ పద్మరాజుకు మరో కథ రాసే అవకాశం, పాత్రను దత్తతు ఇచ్చింది. ఇరువురి స్త్రీ మూర్తులకు ప్రియుడు గాయాలు చేశారు. ఒకామెకు మొహం మీద, మరొకామెకు వీపు కాల్చి. ఆ తెలుగు కథ ‘పడవ ప్రయాణం’. ఇరువురికి ప్రియుడు శత్రువు చేసే పనులు చేసినా ఇరువురు ప్రేమించడం మానకపోవడం వగైరాల విషయంలో ఆ రెండు కథలు గాలివానకు మాతృకలు అంటే అగ్గిమీద గుగ్గిలం అవక్కరలేదు.

శరదృతువు రాత్రి అని తన కథకు పేరు పెట్టటంలో దాన్ని నటాషా పాత్రకు ముఖ్య అంశంలో ప్రతీకగా వాడుకోడం.

‘శరదృతువు రాత్రి’, ‘గాలివాన’ ఏకాంకికలా నడిస్తే, ‘వర్షం’ బహుళ పొరలతో నడిచి మామ్ మార్కు ప్రతిభను వ్యక్తం చేస్తుంది; విస్తృతమైనది.

ప్రతిఫలాన్ని ఆశించకుండా నాయకుడి మీద ముద్దుల వర్షం కురిపించడమే కాక, లైంగిక సుఖమివ్వడమే కాక తన శరీరంతో వెచ్చదనాన్నీపంచింది నటాషా కేవలం మానవతా దృష్టితో. గాలివాన స్త్రీ ప్రతిఫలాన్ని ఆశించింది, మానవతాదృష్టి ఎంతుందో తెలీదు. రావు పాత్ర ద్వారా లైంగిక బలహీనత, పిరికితనం, అవకాశవాదమే గాని నిజమైన మానవత్వం బయటపడినట్టు కాదు. పైగా శవం మీద అతను డబ్బుంచడం ఆమెను అవమానించడం కూడా; ఒక వేళ ఆమెది ఒక ప్రళయకాలంలో ఆమెకే తెలియకుండా బయటపడింది మానవత్వమే అనుకున్నా దానికి వెలకట్టాడు రావు. మామ్ కథలో వేశ్యలో ఏ మానవతా దృష్టి, ప్రతిఫల ఆకాంక్ష లేవు; పురుష జాతి అంటే లోకువ, అసహ్యం వున్నాయి. డేవిడ్సన్‌తో అయినా అనుభవం వెలుతురులో ఆమె మొగవాడిలోని హిపోక్రసీని అసహ్యించుకుని వాళ్ళను మురికి పందులతో పోల్చింది. రావు హిపోక్రీట్. అతనిలో నిద్రాణంగా ఉన్న లైంగిక అసంతృప్తిని తీర్చుకోడానికి ఆ విపత్కర నేపథ్యం ఒక మిష. కామం ఒక్క అనుభవంతో చల్లారేది కాదు. ఈ కామానుభవానికి ప్రేమానుభవం ముసుగుగా రచయిత తొడగవచ్చు. సాడీ థోమ్ప్సన్ పాత్ర చిత్రణలో ప్రవర్తనావాదంలేదు, మానవతా వాదంలేదు victimhood వుంది. నటాషా పాత్రలో ప్రతిఫలం ఆశించని పూర్తి మానవత్వం ఆ విపత్కర పరిస్థితిలో వ్యక్తమయింది. ఇతర రెండు కథలలోని ఇద్దరు స్త్రీ పాత్రలకన్నా నటాషా పాత్ర ఉన్నతమైనది, ఆదర్శవంతమైనది; ఆ కథానాయకుడినే కాదు పాఠకులను నటాషా వెన్నంటుతూనే ఉంటుంది. డేవిడ్సన్ పాత్రలో మానవ బలహీనత వ్యక్తమయింది; రావులోలాగే. మామ్ డేవిడ్సన్ కామానుభవాన్ని ఘనీకరించ [glorify] లేదు సరిగదా, ప్రేమానుభవంగా చిత్రించే వెర్రితనానికి పూనుకోలేదు; ఆ పాత్ర హిపోక్రిసినీ చూపాడు. అంతటితో చేతులు కడిగేసుకోకుండా ఆత్మహత్య ద్వారా అతని ఔన్నత్యాన్ని చూపాడు సూచనాత్మకంగా. ఆ పాత్ర పాఠకుడిని వెన్నంటుతుంది. ఆ కథ అణువణువునా నిజాయతీ తొణికిసలాడుతుంది. మిషనరీ ఆత్మహత్యలోను ఒక విషాదం, మిషనరీలోని పశ్చాత్తాపం వెల్లడయి అతను ఒక విషాదాంత నాయకుడిగా మిగిలాడు. ఒక కామానుభవంతో ఒక పాత్రగా అతను మరణించలేదు. ముందుగా చెప్పినట్టు నిందను రావుగారి విషయంలో గాలివానకు, మానవ సహజ బలహీనతకు ఆపాదించినట్టు, ఉన్నతుడైన డేవిడ్సన్ పతనాన్ని ఆ వర్షంలా వేధించిన అతని లైంగిక బలహీనతకు అతన్ని పరోక్షంగా ముగ్గులోకి దించిన Sadie Thompson ఖాతాకుకు జమకట్టవచ్చు. తన బలహీనతకు, కాలు జారడానికి డేవిడ్సన్ మరణ శిక్ష వేసుకున్నాడు రేజర్ తో; రావు గారు శిక్షజోలికి వెళ్ళలేదు. మానవుడిగా తనకు తోడుగా ఉండటమే కాక, కామసుఖం, ప్రేమసుఖం ఇచ్చిన స్త్రీ గురించి కన్నీరు మాత్రం కార్చారు – సులభమైన పని. పశ్చాత్తాపము తనకు తాను ప్రకటించుకోలేదు సరికదా చేసినపనిని కరెన్సీతో కడిగేసుకున్నాడు. దురదృష్టవశాత్హు మానవుడి కామం ఒకసారితో తీరేది కాదు; ఊటలా ఊరుతుంది, కర్రలు తోసే కొలదీ మండుతూనేవుండే మంట.

ప్రతి మనిషి మనోవాల్మీకంలో వాడికే అంతుబట్టని నిక్షిప్త కోర్కెలు, భావనలు, బుసలు కొట్టే విషనాగు లాంటి అసంతృప్తి జీవిస్తుంటాయి. అవకాశం దొరికికినపుడు పైకి పడగ విప్పుతాయి. పాత విషయమే. డొల్లతనం వున్నా- నైతిక వ్యవస్థ, నడవడి వ్యవస్థ మానవసమాజానికి అవసరమే. వాటిలో రంధ్రాలు వెదుకుతూ రచనలు అన్ని భాషల సాహిత్యంలో వచ్చాయి. స్త్రీ పరాయి పురుషుడితో పోవడం అన్నదాని మీద – అది సమర్థనీయమైనా. కాకపోయినా మంచయినా, చెడయినా; మంచీచెడు కాకపోయినా – కోల్లలుగా కథలొచ్చాయి. ‘పవిత్రంగా’ ఉన్న పురుషుడు పతనం చెందడము సాహిత్యంలో చాలినంత వుంది. పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన తొండరాడిప్పొడి ఆళ్వార్ [విప్రనారాయణ], యూ ఆర్ అనంతమూర్తి కన్నడ నవల సంస్కారలోని ప్రాణేశాచార్య ఉదాహరణలు.

ప్రిన్స్ వి.ఎఫ్. ఓడోయెవ్స్కీ [Prince V.F. Odoyevsky] అన్న రచయిత అన్నదానిని ఉల్లేఖిస్తూ తన ‘పేద మనుషులు’ అన్న నవలకు మకుటంగా పెట్టుకున్నాడు దోస్తోవిస్కీ. ‘ఓ! ఆ కథారచయితలు! వాళ్ళు కాస్త ఉపయోగపడే, సుఖాన్నిచ్చే, ఆనందాన్నిచ్చే, వినోదాన్నిచ్చే దాన్ని రాయలేరా? రాయలేరు! వాళ్ళు మురికిని తిరగతోడాలి. అందుకని వాళ్ళను ఏదీ రాయద్దని ఆదేశిస్తున్నా. వీళ్ళ వల్ల జరిగే మంచి ఏమిటి? పాఠకులు వాళ్ళు ఏది రాస్తే అది చదువుతారు. దాన్ని మననం చేసుకుంటారు. అన్ని రకాల చెత్త మనసులోకి వస్తుంది!’

ఆ పలుకులతో పూర్తిగా ఏకీభవించక్కరలేదు, తోసిపారెయ్యక్కరలేదు. ఆలోచించదగినవి, రచయితలూ ఆత్మపరిశీలన చేసుకోదగినవి.

Exit mobile version