Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాలమూరు సాహితి అవార్డు ప్రదానోత్సవం – ‘హరితస్వప్నం’ పుస్తకావిష్కరణ సభ – వార్త

[పాలమూరు సాహితి అవార్డు ప్రదానోత్సవం – ‘హరితస్వప్నం’ పుస్తకావిష్కరణ సభ – వార్త అందిస్తున్నారు శ్రీ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.]

మాజాన్ని కదిలించేదే అసలైన కవిత్వమని, అలాంటి కవిత్వమే ఎప్పటికీ నిలుస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు అన్నారు. 29 సెప్టెంబర్ 2024న  పాలమూరు సాహితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోని కాళోజీ హాల్ లో జరిగిన పాలమూరు సాహితి అవార్డు-23 ప్రదానోత్సవం, ‘హరితస్వప్నం’ పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా, పుస్తకావిష్కర్తగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా కవులకు నిలయమని, ఇక్కడి కవులు తెలుగు సాహిత్యరంగంలో విశేష కృషి చేశారన్నారు. అంతేకాదు ఆనాటి నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. కవి తనలో తాను సంఘర్షణ పడితేనే చక్కటి, చిక్కటి కవిత్వం ఆవిష్కరించబడుతుందన్నారు. లోకంలోని అనేక సంఘర్షణలను కవి అనుభవం లోకి తీసుకుని కవిత్వం రాస్తాడన్నారు. కవి ఎప్పుడూ సమాజంలో నిలిచే కవిత్వం రాయాలన్నారు. గత పధ్నాలుగు సంవత్సరాలుగా పాలమూరు సాహితి కవితాసంపుటాలకు పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు. 2023 సంవత్సరానికి ప్రముఖ కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు రచించిన ‘రాత్రి సింఫని’ కవితాసంపుటికి అవార్డు రావడం దక్కడం కవికి దక్కిన గౌరవమన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది వల్లపురెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో నిరంతరం సాహిత్య సేవ జేస్తున్న పాలమూరు సాహితి సంస్థను కొనియాడారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు సాహితి ప్రతి సంవత్సరం కవితాసంపుటాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించి అవార్డులను ఇవ్వడం అభినందనీయమన్నారు.

అనంతరం పాలమూరు సాహితి అవార్డు పొందిన ‘రాత్రి సింఫని’ కవితాసంపుటిపై బోల యాదయ్య చక్కటి సమీక్ష చేశారు.

కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కోట్ల వేంకటేశ్వర రెడ్డి రచించిన ‘హరితస్వప్నం’ పుస్తకాన్ని ప్రముఖ కవి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సమీక్షించారు.

అనంతరం పాలమూరు సాహితి అవార్డును ”రాత్రి సింఫని” కవి డా. బాణాల శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ పురస్కారం కింద శాలువా, మెమెంటోలతో పాటు ఐదువేల నూటపదహార్ల నగదు బహుమతిని అందజేశారు.

అలాగే ‘హరితస్వప్నం’ పుస్తకాన్ని ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డికి కోట్ల వేంకటేశ్వర రెడ్డి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఎస్. డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కె.కృష్ణమూర్తి, పాలమూరు సాహితి అధ్యక్షులు, అవార్డు వ్యవస్థాపకులు డా. భీంపల్లి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.

Exit mobile version