[శ్రీ కోవెల సుప్రసన్నాచార్య రచించిన ఈ కథ తొలుత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 17 మార్చ్ 1982 నాటి సంచికలో ప్రచురితమైంది. సుప్రసన్నాచార్య గారి నవతి ఉత్సవాల సందర్భంగా ఈ కథని పాఠకులకు అందిస్తున్నాము. సుప్రసన్నాచార్యగారు రచించిన ఏకైక కథ ఇది. – సంపాదకులు.]
“నాయనా! నీవేనా లక్కసానమ్మ కొడుకువు? గుర్తు పట్టనే లేదు. చిన్నప్పుడు చూచిన” అంటూ నెత్తిన ఉన్న పాలకుండను దించి కూర్చున్నది ఆ వృద్ధురాలు. ఆమె వయసు సుమారు అరవయ్యేళ్ళు ఉంటుంది. ముఖాన ఎర్ర కుంకుమ – ఒంటి నిండా గొల్లవాళ్ళు ధరించే సర్వాభరణాలు. శరీరం పసిమి తగ్గలేదు. ముఖం నిండా కళ. త్రయోదశి వెన్నెల ఆమె ముక్కుపోగు మీద ప్రతిఫలించి నుదుటను చంద్రకళను తీర్చి దిద్దుతున్నది.
మూడు రోజులలో రాబోయే చంద్రగ్రహణానికి ధర్మపురి క్షేత్రంలో గోదావరి గంగ స్నానం చేయడానికి బంధుమిత్రులతో ప్రయాణం చేస్తూ ఆ రాత్రి యెలిగందుల దగ్గర చెరువు దగ్గర ఆగిన బమ్మెర పోతరాజుకు ఆమెను చూడగానే ఎవరో చిరపరిచితురాలిని చూచినట్లనిపించింది. ‘ఎవరో ఈ గోపాలసుందరి’ అని మనస్సులో అనిపించినా, తనను వాత్సల్యంతో పెంచిన అవ్వ గుర్తుకు వచ్చింది ఆయనకు.
“ఈ పాలు మా కోసం తెచ్చావా, తల్లీ” అన్నాడు పోతరాజు.
“అవును, నాయనా! ఒరంగల్లు మించి ఎవరో కయీస్వరుడు వస్తున్నడని విన్న. ఇక్కడకు రాగానే తెలిసింది నీవు బమ్మెర అక్కసానమ్మ బిడ్డవని. ఆమె నీ చిన్నతనంలో ఈ యెలిగందుల మటానికి వచ్చింది. ఇక్కడ సాధువుల దర్శనం చేసి వెళ్ళింది. ఆనాడు చూసిన నిన్ను. ఈనాడు నీవు బలరాముని వలె ఉన్నవు. ఈ పాలు నీవూ, మీ వాళ్ళూ తాగండి. నాకు తృప్తిగా ఉంటుంది.”
అప్పుడే పితికి తెచ్చిన ఆ పాలు చంద్రమండలంలో నుండి జారిన వెన్నెల ధారలలాగా కన్పించినాయి.
“అవ్వా! నీవు మా అమ్మవంటి దానివి. ఆ అమ్మ నాకు తెలిసిన దైవం. ఆమె పెదవుల కదలికలో నుంచే నేను శివ పంచాక్షరి ఉపదేశం పొందినవాణ్ణి. మా నాన్న కేసన్న నాకు రామమంత్రోపదేశం చేశారు. మంత్రాలు వాళ్ళు ఎన్ని కోట్లు చేశారో! ఆ పుణ్యలేశం వల్లనే నేను ఇలా ఉన్నాను!”
“తండ్రీ! పోయి వస్త. మనుమరాలేదీ?”
బమ్మెర పోతరాజు దూరాన ఉన్న తన భార్య బాలరుక్మిణిని పిలిచి ఆమెకు చూపించాడు. ఆ వృద్ధురాలి కళ్ళలోని దయా మధురరేఖలు ఆమెకు అభిషేకం చేశాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా, పోతరాజు చెరువులో స్పానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేస్తున్న పోతరాజుకు రుక్మిణి ముఖం నిండా కళ్ళతో అరుణ వర్ణంతో బాలా త్రిపుర సుందరిలా కానవచ్చింది. తన వూహకు తానే నవ్వుకున్నాడు పోతరాజు.
పోతరాజు ముందటి రోజు ఉదయం ఒరంగల్లు నుంచి బయుదేరాడు. ఎందుకో కొన్ని రోజులుగా మనస్సులో ఏదో తపన. ఏకాంతంలో ఒక సన్నని కరుణ భావం సాక్షాత్కరించేది. ఈ ముప్పయ్యేళ్ళ వయస్సులోనే ఒరంగల్లు ఎన్నోసార్లు యుద్ధాలకు ఆలవాలమై ఎన్నోసార్లు మూలమట్టం చేయబడ్డది. అయినా ప్రజలకున్న చేవ వల్ల ఎప్పటికప్పుడు కోలుకుంటున్నారు. అయినా ఒక నిస్పృహ తాండవిస్తున్నది. ఎవరికి వారే భయంతో కుంచించుకు పోతున్నారు. సమాజం ఈ గిరి గీతల్లో చిన్నాభిన్నం అయ్యేట్లు ఉన్నది. ఈ సమాజంలో ఉన్న దుఃఖం అంతా తనలోనే ఫలిస్తున్నది. అందరి దుఃఖం తనది. రాజాస్థానాలతో కవులవలె ఏవో కొన్ని రచనలు చేయటమా? లేక సమాజంలో ఒక విశ్వాసం కలిగించే రచన చేయటమా? తాను నిశ్చయించుకోలేకపోతున్నాడు. భాగవతంలో గజేంద్రుని స్థితి తనది.
ఈ స్థితిలోనే భాగవతం మొత్తం తెలుగులో చెప్పవలెనని తోచింది. శ్రీకృష్ణుని సుదర్శనచక్రం ఒకవైపు వేణుగానం రెండోవైపు స్వప్నాలలో సాక్షాత్కరించేవి కొన్ని నెలలుగా. పోతరాజు మనస్సులో భాగవతం తెలుగు చేద్దామని కలిగిన సంకల్పం విన్న గురువులు, బంధువులు ‘బాగుంది – నీ ప్రయత్నం కొనసాగించ’మన్నారు. తండ్రి కేసన్న ‘ఈ మహా ప్రయత్నం చేసే ముందు మన ‘ఇలవేలుపు’ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసి, అటునుంచి వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి దర్శించుకొని రమ్మ’న్నాడు. పోతరాజు నాలుగు రోజుల ప్రయాణం పెట్టుకుని బయలుదేరాడు.
పోతరాజు స్నానం చేసి వచ్చి, సంధ్య వార్చి జపం ముందు కూర్చున్నాడు. మిగతావాళ్ళ భోజనాలు పూర్తయ్యేసరికి ఆయన జపం పూర్తిచేసి కాసిన్ని పాలు తాగాడు. ఆ వృద్ధురాలు పోతరాజును దీవించి వెళ్ళిపోయింది, చల్లంగ బతకమని.
మళ్ళీ రాత్రి పది గడియల తరవాత బండ్లు సాగిపోతున్నవి. బాలరుక్మిణి “బావగారు, అక్కయ్య కూడా మనతో వస్తే బావుండేది” అన్నది.
పోతన్న మనస్సుల ఇటీవల అన్నయ్య క్రమంగా దైవనిష్ఠలో ఎక్కువగా చేరిపోవడం, శివేతర దైవతారాధనకు అంతగా ఇష్టపడక పోవడం స్ఫురించింది. అద్వైతనిష్ఠ గల తన కుటుంబంలో ఈ ఉపాసనా విషయకమైన పరిమితులు రావడం విచిత్ర ఘటనగా తోచింది. లింగధారణ చేయలేదు, కాని అన్నయ్య దాదాపు జంగముల వలెనే ప్రవర్తిస్తున్నాడు. తాను మాత్రం చిన్నతనంలో పాల్కురికి సోమన బసవపురాణం ఎంతో ఇష్టంగా పాడుకోలేదా? ఈనాటికీ ఆ రచన వింటే ఎంతగా పారవశ్యం పొందుతాడు! చిన్ననాడు బమ్మెర్లో ఉన్నప్పడు చెరువు కట్టదాటి పాల్కురికి కొండమీద సోమేశ్వరస్వామిని, లక్ష్మీ నరసింహ స్వామిని ఎంతగా పూజించేవాడు! తిప్పన్నలో ఈ మార్పు రావడం, తమ కుటుంబం అంతా ఒరంగల్లు వచ్చినా ఆయన బమ్మెరలోనే ఉండటం ఆయన కళ్ళముందు కదలాడింది.
బాలరుక్మిణి ప్రశ్నకు పోతరాజు సమాధానం చెప్పనేలేదు. క్రమంగా ఆమె నిద్రలోకి జారుకున్నది. అన్ని బళ్ళలోనూ అందరూ నిద్రపోతున్నారు, బండి తోలేవాళ్ళు, పోతరాజు తప్ప.
భాగవతం వ్రాసే ముందు వ్యాసుని మనస్సు లోని వ్యథ గుర్తు వచ్చింది. ఆకాశంలో చందమామ ఒక్కడే కానవస్తున్నాడు. నిర్మేఘమైన ఆకాశంల చంద్రకిరణాలు మహతీ తంత్రులవలె కానవస్తున్నవి. దూరాన ఎక్కడో ఒక తుమ్మెద ఝంకారం చేస్తున్న ధ్వని వినవస్తున్నది. చంద్ర బింబం తనకు నారదునివలె స్ఫురించింది.
ఆ స్ఫురణతోనే పోతరాజు ఒక వ్యక్తావ్యక్తి స్థితి లోకి వెళ్ళిపోయాడు. అతని చుట్టూ శబ్దమయమైన ఒక నూతన ప్రపంచం మేల్కొన్నది. తాము బృందావనంతో ఉన్నట్లు, ఎవరి కోసమో వెదుకుతున్నట్లు పశువులను, పక్షులను, పాములను, పుట్టలను, చెట్లును, చేమలను అడుగుతున్నాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడువాడు మవుళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు – అతని కోసం అన్వేషణ, సర్వప్రకృతి ఈశ్వరి చైతన్యంతో వూగి పోతున్నది. సర్వ జగత్తు ఈశ్వర విరహంతో వేగి పోతున్నది.
తామ ప్రకృతికి, ఎంతో దూరాన ఉన్న నీలాకాశానికి అనుబంధం కల్పించబోతున్నాడు. తాను అగ్నిద్యోతనుడు – తాను రుక్మి, తాను బలి, తానే హిరణ్యకశిపుడు – ఎక్కడో ఈ తామస ప్రవృత్తిలో కూడా అట్టడుగున దివ్య చైతన్యం మేల్కొంటూ ఉన్నది. భగవంతుని తాను నిరసిస్తూ ఉన్నా తన మాట తెలియకుండానే ఈశ్వరభక్తి వ్యక్తమవుతున్నది.
తాను భీష్ముడు, తానే కుంతి, తానే గజేంద్రుడు, తానే ప్రహ్లాదుడు.
పోతన మనస్సులో భాగవత కథా చక్రమంతా పరిభ్రవిస్తున్నది. అన్ని దృశ్యాలలోనూ, అన్ని పాత్రలతోనూ తానే కాననస్తున్నాడు. తానే వెదుక్కుంటున్నాడు. మాటలు పెగలడం లేదు. తాను వెదికే వస్తువేమిటో తనకు తెలుసు. అయినా మాటల్లో రూపు కట్టించలేకున్నాడు. ఈ వూహా పరంపర సాగుతూ ఉండగానే తెల్లవారింది.
ఉదయిస్తున్న సూర్యబింబం పోతనకు భగవంతునికి పట్టిన ఛత్రంలాగా, ఆయన శిరోమణిలాగా, కర్ణాభరణంలాగా, మెడలో రత్నం లాగా అనిపించింది.
ఆ రోజు ప్రయాణం సాగింది జాము పొద్దెక్కే దాకా. ఎండ ఎక్కువైంది. తమ బృందం ధర్మపురి చేరడానికి ఇంకా మూడామడ ఉంది. ఆ మధ్యాహ్నం దారిలో ఒక గ్రామంలో విడిది చేసిన పోతన్న అక్కడ ఒక యతిని చూశాడు. ఆ యతి చెల్లని జడంతో, గడ్డంతో ఉన్నాడు. ఆజానుబాహువు – ఆయన ఉత్తరదేశం నుంచి వస్తూ ఉన్నాడు. మవున వ్రతములో ఉన్నాడు. పోతరాజును చూడగానే ఆయన వాత్సల్యంతో తల నిమిరి, వీపుమీద చేయి వేసి ఆశీర్వదించాడు. ఆయన స్వర్శతో తనలో ఏదో నూతనమైన సంచలనం కలిగినట్లు తోచింది.
పోతన్న ఆ యతి దగ్గర సెలవు తీసుకున్నాడు. తన శరీరంలో కణకణమూ ఒక అపూర్వమైన సంచలనం పొందుతున్నది, మనస్సు తీవ్రావేశానికి లోనవుతున్నది. మధ్యాహ్నం విశ్రమించి సాయంకాలం మళ్ళీ బయలుదేరారు. బండిలో కూర్చున్న పోతన్న వివశుడై ఉన్నాడు. అవయవాలన్నీ తన స్వాధీనంలో లేవు. బాల రుక్మిణి ఆయన స్థితిని చూచి ఆందోళన పడ్డది. ‘తల్లీ, లలితా! నీవే రక్షించాలి’ అనుకున్నది. పోతన్న నిద్రపోతున్నాడు.
ఆ నిద్ర ఎంత గాఢమైంది అంటే ధర్మపురికి చేరిన పూర్ణిమనాటి ఉషః కాలంలోనే ఆయన మామూలుగా మేల్కొన్నాడు.
రాత్రంతా బాల రుక్మిణి భర్త పక్కనే మేల్కొని ఉన్నది. సహజంగా పోతరాజు పది గడియలకు మించి నిద్రపోడు. ఆ రోజు ఆయన స్థితి అసాధారణమైంది. అటు ఉషస్సు ఉదయించడం, ఇటు పోతన్న మేల్కొనడం ఆమెకు ఒక తపస్సిద్ధి లాగా అయింది. ఉదయం అందరూ గోదావరిలో స్నానం చేశారు. పోతరాజు పన్నెండు గడియల వరకూ జపం పూర్తి చేసి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరాడు. ఆయనకు స్వామి హిరణ్యకశిపుని సభలో స్తంభం నుండి అప్పుడే ప్రత్యక్షమైనట్లు తోచింది.
ఆర్తత్రాణ పరాయణుడైన స్వామిని చూడగానే పోతరాజు కంఠంలో నుంచి పద్యాలు పరంపరగా వెలువడుతూ ఉన్నవి. ఇంత కాలం తన పద్యంలో తనకు స్ఫురించని ఏదో వినూతనమైన లక్షణం కొత్తగా చేరినట్లు అనిపించింది. తన పద్యభావంలో తానే తాదాత్మ్యం పొందటం అది.
ఆ రోజు బాలరుక్మిణి స్వామి క్షీరాభిషేకం చేయించింది. ఆమె గొంతులో శ్రీ శంకరుల కరావలంబ స్తోత్రం ప్రతిధ్వనించింది. స్వామి ముఖం మీద మంచి పాలు జారుతున్నప్పుడు ఆమెకు తాము యెలిగందులలో చూచిన అవ్వ గుర్తుకు వచ్చింది. స్వామి ఉగ్రతను వీడి ప్రసన్నుడైనట్లుగా ముఖం నిండా స్మితరోచులు ప్రకాశించినవి.
పోతరాజు మధ్యాహ్నం ఆ వూళ్ళో ఒక వృద్ధుడైన విద్వాంసుని ఇంటికి వెళ్ళాడు. ఆయన పేరు రాజన్న శాస్త్రి. దాదాపు ఎనభయ్యేళ్ళ వయస్సు ఉంటుంది. పొద్దున్న గోదావరిలో స్నానం చేసి కూర్చుంటే సాయంత్రం దాకా భాగవతం ముందు పెట్టుకుని వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. ఆయనకు శ్రోతలు ఉన్నారా లేదా అనే ఆలోచన లేదు. ఆయన లోకం ఆయనదే. సంసార విషయాలు అసలే పట్టవు. వేళకెవరో పిడికెడన్నం పెడితే చాలు.
రాజన్నశాస్త్రికి తనది ప్రత్యేకమైన లోకం. అది భాగవత లోకం. లోకం దృష్టిలో ఆయన పిచ్చివాడే. ఆయన ప్రవచనం చేస్తూ ఉంటే అనేక శాస్త్రాంశాలు, వేదాంత రహస్యాలు వెల్లడి అవుతవి.
పోతరాజుకు ఆ ఇంటి ముందరి వసారాలో కూర్చున్న రాజన్న శాస్త్రిని చూడగానే వ్యాసమహర్షి లాగా అనిపించింది. ఆ రోజు శాస్త్ర ప్రవచనం శ్రీ కృష్ణ జననం. భాగవతారంభంలో చెప్పిన “సత్యం పరం ధీమహి” అన్న సత్య రూపమైన తత్త్వానికి, సత్యస్య సత్యం, సత్యస్య యోనిక, సత్యాత్మకం అన్న శ్రీకృష్ణునికి ఆయన సమన్వయం చేసి చెబుతున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్నిటి సారమూ వ్యాఖ్యానిస్తున్నాడు. శాస్త్రి వ్యాఖ్యానిస్తుంటే పోతరాజు మనస్సులో శాస్త్రమంతా వేణునాదంలాగా మధుర మధురంగా అనుభవంలోకి వస్తున్నట్టు తోచింది. ఆ అనుభవంలో ద్వైతాద్వైత భేదాలు కరిగి పోతున్నవి. శివరామ కృష్ణాది రూపభేదాలు తొలగి పోతున్నవి. అంతా అఖండ సచ్చిదానంద సాగరం. అదే క్షీరసాగరం. అక్కడే అనంతుడు. ఆయనే సంకర్షణుడు. అక్కడే చతుర్భుజుడైన వాసుదేవుడు. ఆయనతో నుండే ప్రద్యుమ్న అనిరుద్ధులు.
ఈ వ్యూహమంతా పోతన్న కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నది. ‘నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి, ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సమస్సంకర్షణాయ చ’ అన్న భాగవత శ్లోకానుభవం ఇదేనేమో! తన్ను తాము మరిచిన పోతరాజు కళ్ళలో నుండి నిరంతరాశ్రు ధారలు వెలువడుతూ ఉన్నవి.
రాజన్నశాస్త్రి పోతరాజు వైపు చూశాడు. రోజూ తన ప్రవచన వేళలో ఎందరో వచ్చి వెళ్ళుతుంటారు. తనకు గుర్తే ఉండదు. ఈయన ఎవరో అలౌకిక వ్యక్తి లాగా ఉన్నాడు. తాను చేసే సాధన ఈయన రూపంలో సిద్ధించిందేమో అనిపించింది.
పోతరాజు శాస్త్రికి పాదాభివందనం చేశాడు. ఆయన స్థితి తన శక్తినంతా శ్రీరాముడికి ధారపోసిన పరశురాముడిలా ఉన్నది. శాస్త్రికి పోతరాజు ధ్రువుడో, ప్రహ్లాదుడో, శ్రీ శుకుడో ఇలా రూపొందినారా ఆనిపించింది. పోతరాజు శాస్త్రి దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా మనస్సులో ‘లలిత స్కంధము కృష్ణమూలము’ అను పద్యం స్పురించింది.
రాత్రి చంద్రగ్రహణము. సాయంకాలం నుంచే జనం గోదావరి దగ్గరకు చేరుతున్నారు. జాము రాత్రికి ప్రారంభమయ్యే గ్రహణం ఏడు గడియల కాలం ఉంటుంది. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కొందరు గ్రహణకాలంలో మంత్రోపదేశం కోసం గురువులను ఆశ్రయిస్తున్నారు.
రాత్రి అయిదు గడియలు దాటించి వెన్నెలలో గోదావరి అభిషిక్తు రాలౌతున్నది. నదీగర్భంలో అక్కడక్కడా తేలుతున్న బండరాళ్ళ మీద చంద్ర కిరణాలు ప్రకాశించి వాటిని చంద్రకాంత శిలలుగా కనిపింప చేస్తున్నవి.
గ్రహణానికి ముందే ప్రజలు స్నానాలు చేస్తున్నారు. కొందరు దూరంగా కూర్చుని తమ తమ అనుష్ఠానాలు చేసుకుంటున్నారు.
ఆ రోజు పోతరాజు, బాలరుక్మిణి స్నానాలు, ముగించారు. బాలరుక్మిణి భర్త కెదురుగా కూర్చున్నది. ఆమె మనస్సులో దివ్య లోకాలు పరిక్రమిస్తున్నవి. పోతరాజు కనులు మూసి మహేశ్వర ధ్యానంలో నిమగ్నడైనాడు. క్రమంగా ఆయన మనస్సులో పంచాక్షరి మోగుతున్నది. హృదయ స్థానంలో ఏదో కదలిక. క్రమంగా నిశ్శబ్ద స్థితి. ఆ స్థితిలో ఆయనలో నారాయణాష్టాక్షరి మేల్కొన్నది. మళ్ళీ హృదయాకాశంలో కదలిక. నిశ్శబ్ద స్థితి.
ఆ నిశ్శబ్ద స్థితిలో విశ్వమంతా పరిభ్రమిస్తున్నది. సర్వ జగత్తూ, సర్వ విద్యలూ, సర్వ చైతన్యమూ నానా వర్ణాలుగా సాగి సాగి చివరకు నీలవర్ణంగా లయం పొందింది. ఆ నీల వర్ణము నెమలి మెడ కింది నీలవర్ణం లాగా ఉంది. దానిలో ఒక సువర్ణమయ రోచిస్సు ప్రకాశిస్తున్నది.
క్రమంగా మూసిన కళ్ళు కొంచెం కొంచెం విచ్చుకుంటున్నవి. ఎదురుగా పద్మాసనంలో కూర్చున్న బాలరుక్మిణి ఆయనకు కనిపించలేదు. గోదావరి కనిపించలేదు. ఆకాశం అంతా చుట్టూ ఆవరించినట్టుగా ఉంది. సుందర నీలాకాశం క్రమంగా ఎదురుగా రూపు కట్టుకుంటున్నది, ఒక మబ్బు దిగి వచ్చినట్టుగా.
నీలవర్ణంలోని బంగారు మెరపు పక్కనే ఇంకో రూపం కట్టుకుంటున్నది. ఆ రెండు మూర్తులూ శివనారాయణ మంత్రమూర్తుల కలయికగా గోచరించాయి. ముఖాన చిరునవ్వు, మూపున విల్లు, శిరసున కిరీటము, పక్కన జగన్మాత. ఆ దృశ్యం ఇంతకు ముందు తనకు స్వప్పాలలో కాన వచ్చిన మూర్తులలో ఏదీ కాదు. చిరునవ్వు చంద్రకళ లాగా, విల్లు సర్పం లాగా, కిరీటం జటాజూటం లాగా కానవచ్చాయి. ఎవరైనా మహా పురుషుడో, మహారాజు, సాధువో గ్రహణ స్నానానికి వచ్చిన వాడా? పోతరాజుకు ధ్యాన భంగం అయింది. చకితుడై తేరిపార జూస్తున్నాడు. ఈ రాజశేఖరుడు ఎవ్వరా అని అనుకుంటున్నాడు.
ఎదురుగా నిలిచి ఉన్న మహాపురుషుడు మాట్లాడినట్లు అనిపించింది. ‘నేను రామభద్రుండ మన్నామాంకితంబుగా భాగవతంబు తెలుంగు సేయుము, నీకు భవబంధంబులు తెగు’ అని వినిపించింది.
స్వామి శ్రీరామచంద్రుడా? పక్కన ఉన్న తల్లి జానకీదేవియా? ఇలా అనుకుంటూ ఉండగానే క్రమంగా మూర్తి దృశ్యం చెదిరిపోయి నీలవర్ణమే వ్యాపించి ఉంది. నీల వర్ణం క్రమంగా చెదిరింది. ఎదురుగా బాలరుక్మిణి, పక్కన గోదావరి, తాను కూర్చున్న ఇసుక తిన్నె, ఎదురుగా లక్ష్మీ నృసింహస్వామి ఆలయ గోపురమూ..
పోతరాజు లేచి చూస్తే గ్రహణం పూర్తిగా విచ్చింది. కొందరు అప్పుడే స్నానాలు చేస్తున్నారు. పోతరాజును చూచి బాలరుక్మిణి లేచింది. పోతరాజు ఆమెతో ‘‘స్వామి అనుజ్ఞ అయింది భాగవత రచనకు” అన్నాడు.
ఆమె నవ్వుతూ “నేనే కదా మీ ఎదురుగా ఉన్నది? స్వామి ఎప్పుడు వచ్చాడు?” అన్నది.
“శివుడో, రాముడో ఆయన తల్లితో పాటు దర్శనమిచ్చి భాగవతం తెలుగు చేయి. నీకు మోక్షం కలుగుతుంది అన్నాడు.”
“నాకేమో మీ కనుమల నడుమ ఒక జ్యోతి ప్రకాశించినట్లు అనిపించింది.”
“మనం అదృష్టవంతులమే. కాని స్వామి కార్యమంటే సామాన్యమా! ఏదో కార్య కలాపం కాదు కదా! నా పాండిత్యమెంత! నా శక్తి ఎంత! ‘భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన!’”
“ఈ కర్తృత్వ భారం మీకెందుకు! స్వామి ఒకానొక కార్యానికి ఉపకరణంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు సర్వ సమర్పణ చేస్తే ఆయనే చూచుకుంటాడు. భాగవతాన్ని ఆయనే పలికిస్తాడు!”
“అంతే, బాల రుక్మిణీ!” అన్నాడు పోతన. యువకవి అర్ధనిమీలిత నేత్రుడైనాడు. ఆయన నోటి వెంట పద్య ధార మొదలైంది.
‘పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట…’
బాలరుక్మిణి శరీరం పులకించింది. ఆ పులకరింత నుంచి చిరునవ్వు విరిసింది.
ఆ చిరునవ్వులో తెలుగు కావ్యలోకం లోకి రసదేవత అవతరించినట్లు భాసించింది.
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.
