Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యువభారతి వారి ‘పాల్కురికి కవితా వైభవం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

పాల్కురికి కవితా వైభవం

తెలుగు సాహితీ ప్రపంచంలో ఛందో భాషా వస్తువులను దేశీయతా లక్షణాలతో తొలిసారిగా సమలంకరించిన గౌరవం పాల్కురికి సోమనాథునికే దక్కుతుంది. మహావేశంతో సాహితీరంగంలో ప్రవేశించి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. తిక్కన భారతంలో కనిపించే తెలుగుదనం పాల్కురికి ఉద్యమ ప్రభావమే. వస్తువు దేశీయమైంది కాబట్టి సోమనాథుని రచనల్లో అంతకు పూర్వం వెలసిన తెలుగుకవుల కావ్యాల్లో లేని తెలుగులా జీవిత వృత్తం తొణికిసలాడింది. తెలుగుసీమ అందాలకు సోమనాథుని కావ్యాలు నిలువుటద్దాలుగా రూపుదిద్దుకున్నవి. అచ్చమైన తెలుగులో చిన్న చిన్న మాటల్లో గొప్ప గొప్ప భావాలను తియ్య తియ్యగా చెప్పవచ్చనీ, గానయోగ్యంగా రచిస్తే ప్రజల నాలుకలే నాళికలుగా కవిత్వాన్ని పారించవచ్చనీ నిరూపించాడు. ఆనాడు అదొక కొత్తదారి. ఒక విలక్షమైన కవితా వైఖరి. శతకం ఒక ఉదాహరణం. తెలుగు ఛందస్సులలో మహాకావ్య నిర్మాణం వంటి క్రొత్త సాహిత్య ప్రక్రియలకు సోమనాథుడు నారు బోసినవాడు. అన్ని విద్యలలోనూ, అన్ని శాస్త్రాల్లోనూ, అనేక భాషల్లోనూ ఆరితేరినవాడు. సోమనాథాది శివకవులు తెలుగు భాషా వికాసానికి ఎనలేని దోహదం కల్పించిన మనీషులు.

సోమనాథుడు మతోద్ధరణ కోసం తన కవితా శక్తిని వినియోగించిన కవిశేఖరుడు. ఆయన ఎంత భక్తుడో, అంత కవి. వీర శైవ మతోద్ధరణ కోసం అతని బసవభక్తి ఎంత సహకరించిందో, అతని పాండిత్యం అంత అవసరమైంది. క్రీ శ 12 వ శతాబ్దంలో తెలుగు దేశంలో వీరశైవం వేళ్ళూని విస్తరించడానికి సోమనాథుని కవితాశక్తియే కారణం. ఆయన భక్తికవితతో ప్రజల్ని పరవశింప జేయగలదు; పాండితీ మండితాలైన రచనలతో పండితుల చిత్తాలను రంజింపచేయగలడు. మెత్తగా చెప్పవలసివచ్చినపుడు నాల్కను వత్తిగా చేసి మతమార్గాన తేటమాటల వెలుగులు నింపగలడు; పరమతాలను ఒత్తవలసి వచ్చినపుడు ఆ నాల్కనే కత్తిగా చేసి పరమత సిద్ధాంత ఖండనం చేయగలడు. ఆ కాలంలో ఆ మతం బ్రతకటానికి ఆయన కావలసి వచ్చాడు. అందుకే ఆయన ఆ మతం కోసమే తన కాలాన్నీ, కలాన్నీ అంకితం చేశాడు.

పాల్కురికి సోమనాథుని రచనల్లో కొన్నింటిని ఏరుకొని వానిలోని కవితా పారమ్యాన్ని వివరించి ఈ పుస్తక రూపంలో అందించిన వారు – డా. ముదిగొండ శివప్రసాదు గారు. ఈయన తెలుగు సాహిత్యంపై ఉద్యమాల ప్రభావంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పొందినవారు. తెలుగు పాఠకలోకానికి కవితలను, కథలను నవలలను, నాటకాలను, వ్యాసాలను అనేకం అందించినవారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://ia601805.us.archive.org/3/items/YuvaBharathi/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82.pdf

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version