Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లె పిలిచింది-1

[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]

1.

కృష్ణా నదీ తీరంలో అదొక అగ్రహారం. మహా వుంటే ఒక యాభై గడపలు ఉంటాయేమో! చుట్టూ పచ్చటి పొలాలు. ఆ ఊరికి పడమటగా జమీందారు గారి పళ్ళ తోటలు, నదీ తీరాన ఒక చక్కటి రాములవారి గుడి, గుడికి ఒక వైపు మెట్లు నదిలోకి కట్టబడి వున్నాయి. గుడికి ఇంకో వైపు గోశాల, మరోవైపు వేదపాఠశాల వున్నాయి. ఆ గుడి, ఆ వేదపాఠశాల దశరథ రామయ్య పూర్వీకులు కట్టించినవే, ఆ దేవాలయమాన్యాలు కూడా వారి పెద్దలు బహూకరించినవే, ప్రస్తుతం దశరథ రామయ్య ఆ గుడిని ఈ బడిని కూడ నడుపుతున్నాడు.

దశరథ రామయ్య పడక్కుర్చీలో చేరగిలబడ్డాడు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు.

“ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే బాగుంటుంది నాన్నా. చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం వుండదు. ఎందుకు చెప్తున్నామో కొంచెం ఆలోచించండి” అభ్యర్థిస్తూ అన్నది పెద్ద కూతురు అన్నపూర్ణ.

చిన్న కూతురు లక్ష్మి వచ్చి ఆయన పక్కనే చిన్నబల్లమీద కూర్చుని, “ఎంతకాలం ఈ పంతాలు పట్టింపులు నాన్నా? ఇప్పటికైనా మీరు సరే అనక తప్పదు” అన్నది.

మూడో కూతురు శారద, “నాన్నా! అందుకోసం మీరు ఒక్క మెట్టు కూడా దిగాల్సిన అవసరం లేదు. ‘ఊ’ అంటే చాలు. పెద్దక్క అన్నీ చూసుకుంటుంది. అమ్మను గురించి కూడా కొంచెం ఆలోచించండి నాన్నా! మీలా అమ్మ ఎలా మర్చిపోగలదు చెప్పండి?” అన్నది కొంచెం నిలదీసినట్లు. దశరథ రామయ్య ఆలోచిస్తున్నాడు. ఆరోజు ఇంకా ఇప్పుడు జరిగినట్లు ఆయన కళ్ళ ముందు కదలాడసాగింది.

***

“ఒరేయ్ రావుడూ! కిష్టికి నెప్పులు మొదలైనాయి వెళ్లి మంత్రసాని యాదమ్మకి కబురెట్టు, లేదా వెళ్లి వెంటనే తీసుకురా, ఇక ఆట్టే సమయం లేనట్టుంది. ఇహనో, ఇప్పుడో పురుడు వచ్చేస్తుంది. ఊ, పో తొందరగా!” అని దశరథ రామయ్య తల్లి కావమ్మగారు తరిమింది ఆయన్ను. వెంటనే పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరాడాయన.

ముగ్గురు ఆడపిల్లల తర్వాత కానుపు. ‘ఈసారైనా ఒక్క మగపిల్లాడు పుడితే బాగుణ్ణు’ అనుకున్నాడాయన. అదాయన ఒక్కడి కోరికే కాదు ఇంటిల్లిపాదీ కోరుకునేదే! వరసగా ముగ్గురూ ఆడపిల్లలే ఆయనకు. అమ్మవారి ప్రసాదం అనుకుని ముగ్గురికీ ముగురమ్మల పేర్లూ పెట్టుకున్నాడు. ఆడపిల్లలని చులకన భావం లేదాయనకి. ముగ్గుర్నీ కూడా అపురూపంగానే చూసుకున్నాడు. కానీ, ఒకే ఒక్క వంశోద్ధారకుడు కావాలని మనసు కొట్టుకులాడిపోతోంది.

యాదమ్మ రాగానే కావమ్మగారు వేడినీళ్లతో సిద్ధంగా వున్నారు. ఆవిడ ముఖంలోనూ ఆశల దివిటీలు వెలుగుతున్నాయి.

రామయ్యకు గదిలో భార్య నొప్పులతో మూలగడం వినబడుతూనే వుంది. చేతులు ముడుచుకుని ఆకాశం వైపు చూస్తూ “ఈశ్వరా!” అంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ భార్యకు సుఖప్రసవం అయ్యేలా చూడమని బ్రతిమలాడుకుంటున్నాడు.

ఇంతలో బిడ్డ ఏడుపు వినబడింది.

“అయ్యోరో! ఈ పాలి తవరు నాకు పట్టుసీరెట్టాలి మరి. మీకు బంగారంలాంటి గుంటడుట్టాడు” అని చాటంత ముఖంతో గలగలా నవ్వుతూ బయటకు వచ్చి శుభవార్త చెప్పింది యాదమ్మ.

కావమ్మ గారు వెంటనే అందుకుని, “దానికేం తక్కువే పిచ్చిదానా, దేవుడు కరుణించాడు. ఇంటికి వంశోద్ధారకుడు పుట్టాడు” అన్నది దేవుడికి దణ్ణం పెడుతూ..

యాదమ్మ తర్వాతి పన్లు చక చకా చేస్తోంది.

ముగ్గురు ఆడపిల్లలు సంతోషంగా తమ్ముడు పుట్టాడని గంతులు వేశారు.

రామయ్య గబగబా పంచాంగం తీసి, పిల్లాడి జాతకచక్రం వ్రాయడానికి లెక్కలు వేస్తున్నాడు. ఆయన కల నెరవేరింది. సాక్షాత్తూ వారి కులదైవం వేంకటేశ్వరస్వామి పుట్టాడనుకుని, ఆయన పేరే పెట్టుకుందానని నిశ్చయించుకున్నాడు.

కానీ తర్వాత్తరవాత తన ప్రమేయం లేకుండా చాలానే విషయాలు జరిగిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆడపిల్లలు చెప్పినదానికి తల ఒగ్గాల్సివస్తోంది.

***

అమెరికా దేశం.. డల్లాస్ నగరం. సుమారు ఓ ఎనభై అంతస్తులు వున్న గృహసముదాయ కట్టడం. అందులో పదిహేనవ అంతస్థులో వుంటున్నారు, రమణ, గీతా వారి ఆరేళ్ల కొడుకు రామకృష్ణ, కూతురు జానకి. ఒకరోజు..

“గీతా! నాన్న దగ్గర్నుంచి మనకు పిలుపు వచ్చింది. మొత్తానికి ఇన్నేళ్ళకి మన్ని క్షమించి మళ్ళీ ఇంటికి ఆహ్వానించారు. పదపద బట్టలు సద్దు నేనెళ్లి టిక్కెట్లు బుక్ చేస్తాను. దొరికిన ఫస్ట్ ఫ్లైట్‌కే వెళ్ళిపోదాం” ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు రమణ.

“నిజంగానా!” అన్నది గీత మంచినీళ్ల గ్లాస్ చేతికిస్తూ..

“నిజంగా గీతా! నాన్నే పిలిపించి ఉంటారు లేకపోతే పెద్దక్కయ్య ఇంటికి రమ్మనమని మెసేజ్ చెయ్యదు. నాన్నకి నేనంటే ప్రాణం తెలుసా, అందుకే రమ్మనమని చెప్పుంటారు” అన్నాడు కళ్ళల్లో నీళ్ళు నింపుకుంటూ.

“అది కాదండీ, ఇన్నాళ్ళనుంచీ ఎప్పుడూ మాట్లాడనివారు ఇప్పుడు కబురు పెట్టారంటే నా మనసేదో కీడు శంకిస్తోంది. అందరూ కులాసాయేనా?” అని అన్నది గీత. ఆమాటతో రమణ సంతోషపు పొంగు చప్పగా చల్లారిపోయింది.

మళ్ళీ తనే తమాయించుకుని, “చాల్లే గీతా, నీకన్నీ అనుమానాలే, అలాంటిదేమీ లేదు. ముందు నువ్వు బట్టలు సద్దు. నేను టికెట్స్ చూస్తున్నాను. నేను విలాస్‌కి చెప్తాను, ఆఫీస్ పనులు తను చూసుకుంటాడు. పద పద లే!” అని తొందర చేశాడు రమణ.

రమణ చెప్తున్నా గీతకెందుకో అనుమానం. ‘ఒకవేళ పెద్దవాళ్ళకెవరికైనా అనారోగ్యమా, లేక వేరే ఏమైనా కీడు జరిగిందా?’ అని. కానీ రమణ చూపే ఉత్సాహాన్ని అడ్డుకోవడం ఎందుకని మౌనంగా ఉండిపోయింది.

రమణ ఊరు తనెప్పుడూ వెళ్లనూ లేదు, చూడనూ లేదు. గీత ఒక పదిహేను రోజులకు బట్టలు సద్దుతూ గతాన్ని నెమరేసుకుంది.

***

రమణ గీతది కులాంతర, రాష్ట్రాంతర వివాహం. రమణ ఉద్యోగార్థం హైదరాబాద్ వెళ్ళినప్పుడు, గీత అదే ఆఫీస్‌లో పరిచయం అయ్యింది.. గీతావాళ్ళది మహారాష్ట్రలోని షోలాపూర్ గ్రామం. గీత చిన్నప్పుడే ఆమె తల్లి తండ్రులు పోతే, హైదరాబాద్‌లో మేనమావ దగ్గర పెరిగింది. అక్కడే చదువుకుని, మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది.

రమణ, గీతా ఒకే ప్రాజెక్ట్‌లో పని చేసేవాళ్ళు. ఎప్పుడైనా పని వల్లనో, మీటింగుల వల్లనో ఆలస్యమయితే, రమణ ఆ దారిలోనే తన రూం ఉండడంతో గీతని ఇంటిదగ్గర దింపేవాడు. ఎప్పుడూ అవసరానికి మించి మాట్లాడడు, అతి చనువు తీసుకోడు. చదువుకుని పనిచేసే ఆడపిల్లలంటే అమితమైన గౌరవం. చాలా మంచి మనిషి.

మెల్లిగా ఆ స్నేహమే ఎప్పుడు ప్రేమగా మారిందో ఇద్దరికీ తెలియనే లేదు.

ఒకరోజు గీత, తన మేనమామ తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని చెప్పేసరికి, రమణకు కూడా గీతను పోగొట్టుకోలేనని అనిపించింది. అప్పుడే తన మనస్సులో మాట బయటపెట్టాడు. గీత కూడా తన సమ్మతిని తెలియజేసింది. కానీ, తనను పెంచి చదివించిన మేనమామ అంగీకరించాలని చెప్పింది.

ఒకనాడు వెళ్లి గీత మేనమామను కలుసుకున్నాడు. తనకు గీతంటే ఇష్టమని చెప్పి తన పుట్టు పూర్వోత్తరాలు, విద్యార్హతలు, ఉద్యోగాల గురించి చెప్పాడు. తర్వాత గీతను వాళ్ళంగీకరిస్తే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు.

గీత మేనమామ తనకు అభ్యంతరం లేదని చెప్తూ రమణతో వారి తల్లితండ్రుల ఒప్పిక కూడా అవసరమని చెప్పాడు.

రమణ సరేనని, తన తల్లిదండ్రులను ఒప్పించి, వారితో తమ ఇంటికి పెళ్లి ప్రస్తావనకు వస్తామని చెప్పాడు.

వారం పది రోజులైనా రమణ దగ్గర్నుంచి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి, చేసేది లేక అతనిమీద ఆశలు వదులుకుంది గీత. ఇంకో వారం తర్వాత ఆఫీస్‌కి వచ్చాడు రమణ. ఆ సాయంత్రమే గీతను కలిసి తమ ఇంట్లో ఈ పెళ్లికి ఎవ్వరూ అంగీకరించడం లేదని, అయినా తప్పకుండా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

అన్నట్లే మంచి ముహూర్తాన గీత మేనమామ ఆధ్వర్యాన గీత మెళ్లో మూడు ముళ్లు వేశాడు రమణ. తన తరఫున ఎవ్వరూ పెళ్లికి రాలేదు. గీతా రమణలు హైదరాబాద్ లోనే ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.

ఒకరోజు సాయంత్రం పూట తాము ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటిముందు ఒకావిడ పడిగాపులు కాస్తూ కూర్చుంది. వెంటనే రమణ, “పెద్దక్కా! ఎప్పుడొచ్చావు?” అన్నాడు. అప్పుడే తెలిసింది గీతకు ఆవిడ రమణ అక్కయ్యని. ఆవిడ మౌనంగా లోపలికి వచ్చింది.

కళ్ళనీళ్ళు పెట్టుకుని, “చెప్పకుండా ఎంతపని చేసావురా, ఇంట్లో వాళ్ళ గురించి, అమ్మా నాన్న గురించి ఒక్కసారి గూడా ఆలోచంచలేదు నువ్వు” అని, గీత వైపు తిరిగి, “నువ్వేమీ అనుకోకమ్మా, నిన్ను తప్పు పట్టడం లేదు” అని చెప్పి, తన చేతిలో ఉన్న ప్యాకెట్ గీత చేతిలో పెట్టి, “వస్తానమ్మా” అని వెళ్ళిపోయింది.

రమణ ఏమీ మాట్లాడలేదు. తానూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు అందరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని పెద్దక్కే అప్పుడప్పుడు అతనికి ఫోన్ చేసి యోగక్షమాలు కనుక్కుంటూ వుండేది. అతను అంతవరకే తృప్తి పడేవాడు.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆవిడే ఫోన్ చేసి రమ్మనమని చెప్పిందీ అంటే గీతకెందుకో అనుమానంగా ఉంది. ఎవరికేమైందో తెలీడం లేదు. మొత్తానికి తన సంసారానికి ఎసరు పెట్టకుండా ఉంటే చాలని దేవుళ్ళకు మొక్కుకుంటోంది.

సామానంతా సద్ది ప్యాక్ చేసింది. మర్నాటి ఉదయానికి టికెట్లు దొరికాయి.. సాయంత్రం అందరూ కలిసి రమణ ఇంట్లోవాళ్ళందరి కోసం షాపింగ్ చేసుకొచ్చారు. మర్నాడు ఉదయం అందరూ బయలుదేరారు.

2

డల్లాస్ లోని ఫోర్ట్‌వర్త్ ఎయిర్పోర్ట్‌లో సామాన్లన్నీ చెకిన్ చేసి, భార్యా, కొడుకు కూతురులతో ఫ్లైట్ ఎక్కాడు రమణ.

మాతృభూమిపై ఇన్నేళ్ల తర్వాత కాలుమోపుతున్నందుకు సంతోషంతో పొంగిపోతున్నాడతను. గీత పెళ్లయ్యాక అతనిని ఇంత ఆనందంగా చూడడం ఇదే మొదటిసారి. పిల్లల పురుళ్ళకి, ఎప్పుడైనా మేనమావని చూడ్డానికి తనే వెళ్ళిరావడం గాని అతనెప్పుడూ స్వదేశానికి బయలుదేరలేదు. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు బయలుదేరాడు.

ఇంతలో పిల్లాడు “నాన్నా అక్కడ నేను ఆడుకోవడానికి టాయ్స్ ఉంటాయా?” అనడిగాడు ఇంగ్లీషులో. “టాయిస్ ఏం ఖర్మ, నీకు ఆడుకోవడానికి బోలెడు ఉంటాయి అక్కడ. నీళ్ళల్లో ఈతలు కొట్టొచ్చు, కోతికొమ్మచ్చి ఆడుకోవచ్చు, బొంగరాలు, గాలిపటాలు, గోళీలు. అబ్బో, ఎన్నుంటాయో” అన్నాడు రమణ. “ఆ, వాట్స్ ఆల్ దోజ్?” అన్నాడు పిల్లాడు ముఖం ఎలానో పెట్టి అమెరికన్ యాక్సెంట్లో. గీతా రమణ ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. రమణ కొడుకుని పట్టుకుని ముద్దు పెట్టుకుని, “నువ్వే చూద్దువు గానీ” అన్నాడు.

ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే, ఇంకో రోజుకి కానీ ఇది చేరదనిపించింది. కానీ, తన మనస్సు మాత్రం అప్పుడే రెక్కలు కట్టుకుని ఆ గ్రామంలో చేరిపోయినట్లుంది.

తన ఆలోచనలన్నీ తన చిన్ననాటి జ్ఞాపకాలవైపు పరుగులు పెడుతున్నాయి. ఆ జ్ఞాపకాల నీడలలో సేదతీరుతున్నాడు తాను. ‘ఆ మండువా ఇల్లు, ఆ పచ్చటి పొలాలు, కామధేనువుల్లాంటి పాడి ఆవులు, ఆ రాములవారి గుడి, ఆ కృష్ణాతీరం’. ఆహా, ఎంత బాగుండేవో, తలచుకుంటేనే మనస్సు తన్మయం చెందుతోంది. మచిలీపట్నం నుంచి పెద్దత్తయ్యగారి పిల్లలు, విజయవాడనుంచి చిన్నత్తయ్యగారి పిల్లలూ సెలవులకు వస్తే, అందరూ పక్కపక్కనే కూర్చుని భోజనాలు చేసేవారు. మరీ చిన్న పిల్లలకు నాన్నమ్మే కలిపి పెట్టేది. అందరికీ అమ్మ పక్కలు వసారాలోనే వేసేది. నాన్నమ్మ కథలు చెప్తుంటే అందరం అక్కడే పడుకునే వాళ్ళం. అందరికంటే చిన్నవాడు తానే అవడం వల్ల నాన్నమ్మ తనని పొట్టమీద పడుకోబెట్టుకొని కథలు చెప్పేది. తనకు నిద్ర పట్టాక కానీ పక్కకు దించి పడుకోబెట్టేది కాదు. తనకు ఎప్పుడైనా జ్వరం వస్తే ఇంట్లో నాన్న, నాన్నమ్మ ఎంత హడావిడి చేసేవాళ్ళో, కిందకు దింపే వాళ్లే కాదు జ్వరం తగ్గేదాకా.

నాన్నైతే ఎప్పుడూ తన వెంట తిప్పుకుంటూ వుండేవారు. పొద్దున్నే కృష్ణకు తీసుకెళ్ళి, మెత్తటి ఒండ్రు మట్టితో ఒళ్లంతా రుద్ది స్నానం చేయించి, ఒళ్ళు తుడుస్తూ, బట్టలు వేస్తూ ప్రార్థనా శ్లోకాలన్నీ చెప్పించేవాడు నాన్న. తను పెట్టుకుంటూ విభూతి తనకూ పెట్టేవాడు. అయిదేళ్లకే భగవద్గీతలో ద్వాదశాధ్యాయం, భక్తి యోగంలోని శ్లోకాలు చాలా మటుకు నేర్చుకున్నాడు. ఇంటికి రాగానే అమ్మ చద్దన్నంలో మాగాయి పచ్చడి వేసి అందులోకి అప్పుడే తీసిన వెన్న వేసి పెట్టేది. ఆ రుచే వేరు. అమృతాన్ని మరపించేది ఆ రుచి. అది ఆ పచ్చడన్నంలో వుందో, లేక అమ్మ చేతిలోనే వుందో తెలీదు కానీ స్వర్గాన్ని చూపించేది. అక్కయ్యలు అందరూ తనకంటే పెద్దవాళ్ళు అన్నపూర్ణ అక్కయ్య తనకంటే పదిహేనేళ్లు పెద్ద. నాన్నమ్మ తర్వాత అక్కయ్యే ఎక్కువ ఎత్తుకునేది తనని. అన్నం తినిపించేది. అన్నిటికంటే ఎక్కువ, తనని నాన్నకి తెలీకుండా ఆడుకోవడానికి పంపేది.

జమీందారు గారి అబ్బాయి మోహన్, స్కూల్ మాష్టర్ గారు అబ్బాయి రాము ఇంకా చాలామంది తమ జట్టులో ఉండేవాళ్ళు. ఎక్కువగా మోహన్ వాళ్ళింటికి వెళ్ళేవాడు తను. స్నేహితులందరూ అక్కడ చేరి వాళ్ళ తోటల్లో ఆడుకునేవాళ్లు. గోళీలు, గాలిపటాలు, బొంగారాలు ఇలా ఎన్నో ఆడేవారు. మోహన్ వాళ్ళింట్లో ఎన్నో ఆటవస్తువులు ఉండేవి. వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడల్లా మోహన్‌కి ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. వాటితో అందరూ ఆడుకునేవారు.

అలాగే తినడానికి కూడా బోలెడు మిఠాయిలు ఉండేవి. వాళ్ళమ్మ ఎప్పుడూ అనేది, “మీరు బ్రాహ్మలు, మా వంటలు మీరు తినకూడదు బాబూ” అని. ఏదో ఒక పండో, పాలో ఇచ్చేది తనకి. కానీ తన మనస్సంతా వాళ్ళు తినే కేకుల మీద, ఆ మిఠాయిల మీద ఉండేది.

ఒకరోజు అమ్మని అడిగాడు తను “అమ్మా, నేను మోహన్ వాళ్ళింట్లో తినకూడదా” అని. “కూడదురా” అంది. “ఏం?” అంటే ఏం మాట్లాడలేదు. తండ్రికి తను మోహన్ తోనూ, రాముతోనూ ఆడుకోవడం ఇష్టం ఉండేది కాదు. “ఆడుకుంటే బయట ఆడుకోండి. కానీ వాళ్ళిళ్లకు, వీళ్ళిళ్ళకు వెళ్లకు” అనే వాడు. కానీ తనే తండ్రికి తెలీకుండా వాళ్ళింటికి వెళ్ళేవాడు.

ఒకరోజు వాళ్ళింట్లోంచి బయటకు వస్తుంటే నాన్న చూసి బరబరా వెంట లాక్కొచ్చి గట్టిగా కేకలేసాడు. వద్దని చెప్పినా అందరిళ్ళకి వెడుతున్నాడని. దాదాపు కొట్టేవాడే, నాన్నమ్మ అడ్డంపడి, “పుట్టక పుట్టక పుట్టిన చిన్న నలుసు, వాడ్ని కొడతావుట్రా! వాడు ఇంకా చిన్నవాడు. వాడికేం తెలుస్తుంది ఎలా ఎవరితో మెలగాలో? ఆ వడుగు కాస్తా చేసేసి బళ్ళో వేస్తే వేదం నేర్చుకుంటాడు. అప్పుడింకెక్కడికెడతాడు? పెద్దైతే వాడికే బుద్ధి తెలుస్తుంది” అని తనని చంకనెత్తుకొని వేరే గదిలోకి వెళ్ళిపోయి, ఏడుస్తున్న తనకి ఒక సున్నుండ చేతిలో పెట్టి, “ఏడవకు నాన్నా, నాన్నేగా కేకలేసిందీ” అని దగ్గరకు తీసుకుంది.

ఏడేళ్ళకి వడుగు చేశారు. ఆ ఉత్సవం తనకెంతో నచ్చింది. బోలెడు మంది చుట్టాలు వచ్చారు. తనని వడక పెళ్ళికొడుకుని చేశారు. తనకు బోలెడు కొత్త బట్టలు, వెండి సామాను ఇంకా ఏవేవో ఇచ్చారు అందరూ, పూజలు, హోమాలు, మంత్రాలు చదవడం, ఎంతో సందడిగా ఉంది. తను ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కానీ, బోడిగుండు చేయించి పిలక పెట్టించడం నచ్చలేదు. ఆ కార్యక్రమం అయిపోయి చుట్టాలందరూ వెళ్లారు.

మర్నాటి నుంచి వేద పాఠశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకోవడం. మధ్యాహ్నం ఇంటికి రావడం. రోజూ ఇదే పని అయిపోయింది తనకి. ఎప్పుడూ నాన్న వెంట ఉండడంతో తన స్నేహితుల్ని కలవాలంటేనే కుదరడం లేదు. ఒకరోజు నాన్నమ్మ ఏదో పని చెప్తే నాన్న పెద్దత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అప్పుడు పెద్దక్కను అడిగి ఆటలకు వెళ్ళాడు తను. ఎంతో ఉత్సాహంగా స్నేహితులను కలవడానికి వెళ్లి మళ్ళీ వెంటనే ఏడుస్తూ వచ్చిన తనను పెద్దక్క దగ్గరకు తీసుకుని బుజ్జగించింది. “ఏం జరిగిందిరా, ఆడుకోలేదా మీ స్నేహితులతో?” అనడిగింది.

తను వెక్కుతూ చెప్పాడు “అక్కా, మరే, ఆ రాము, మోహన్ వాళ్ళే, నన్ను పిలక పంతులని అంటున్నారే, నేను పిలక పెట్టుకుంటే అసహ్యంగా ఉందిట. నన్ను చూసి నవ్వుతున్నారే” అని. మనస్సులో ఎంత బలంగా ఆ మాట నిలిచిపోయిందో తనకు.

“వాళ్ళ బొంద. బ్రాహ్మల పిల్లలు వడుగు చేసుకున్నాక పిలక పెట్టుకోకపోతే ఏం పెట్టుకుంటారు? వాళ్లకేం తెలీదు. ఏడవబోకు. నాన్నొచ్చాక చెప్పి వాళ్ళని చితకబాదిద్దాం. సరేనా” అన్నది పెద్దక్క.

తనకు తన స్నేహితుల మీద కోపం లేదు. వాళ్ళని చితకబాదించాలనీ లేదు. తన మీద తనకే కోపం. తను ఇలా ఎందుకుండాలి? అని. మళ్ళీ మర్నాడు వాళ్ళని కలవడానికి వెళ్ళాడు.

నిన్నటి రోజున గేలి చేసిన మోహన్ ఈరోజు ఏమీ అనలేదు. బహుశా జమీందారు గారు గానీ వాళ్ళ అమ్మగానీ వాడ్ని కేకలేసారేమో, మళ్ళీ అంతా కలిసి ఆడుకున్నారు. రాము అన్నాడు “మా నాన్న నన్ను ఈ వేసవి సెలవులయ్యాక బళ్ళో వేస్తారుట” అని.

“అంటే నువ్వు కూడా నాతో పాటు వేదం నేర్చుకుంటావా?” అన్నాడు తను. “అరే! అది కాదురా మా బడి. మా నాన్న పని చేసే చోటు. మా నాన్న అక్కడ మాష్టారు. అక్కడ వేదం అదీ చెప్పరు. మా అన్నయ్య వాళ్ళు అక్కడే చదువుకున్నారు. ఇక్కడ పది క్లాసుల దాకా ఉంటాయి. ఆ తర్వాత పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదవాలి” అన్నాడు రాము. మోహన్ కూడా అదే బళ్ళో చేరతాడట. ఇంకో ముగ్గురు స్నేహితులు కూడా అదే బళ్ళో చేరి చదువుతున్నారట. ‘మరి తను చేరక్కరలేదా అక్కడ? వాళ్లంతా అక్కడ కలిసి చదువుకుంటారు. కలిసి ఆడుకుంటారు. మరి తనో.. తను కూడా అక్కడే వాళ్ళతో పాటే చదువుకోవాలి. నాన్న రాగానే అడగాలి’ అనుకున్నాడు.

మళ్ళీ రామూనే అన్నాడు, “మానాన్న మీ నాన్నను నిన్ను అక్కడ చేర్పించమని అడిగితే, కాదన్నారుట మీ నాన్నగారు. ‘మా పిల్లాడు వేదం చదువుకుని ఇక్కడే ఉంటాడండీ, మీ పిల్లల్లా వాడేం చదివి ఉద్యోగాలు చెయ్యక్కరలేదు’ అని అన్నారుట.”

మోహన్, “మనందరం అక్కడ చదువుకుంటే పిలక పంతులు వేదం చదువుకుంటాడన్న మాట” అపహాస్యంగా అన్నాడు. తనకు ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. రాము మాత్రం, “తప్పురా! మనం అలా అనకూడదని నిన్న మీ అమ్మగారు చెప్పలా? మా నాన్న కూడా కేకలేసారు. వాళ్ళ నాన్న అలా చేస్తే అందులో వాడి తప్పేం ఉంది చెప్పు. అదంతా వదిలెయ్యండి. రండి ఆడుకుందాం” అన్నాడు, రెండు భుజాల మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ.

ఎలాగైనా నాన్నతో ఆ స్కూల్లో చేరతానని చెప్పాలి అనుకుని ధృఢనిశ్చయం చేసుకుని, తిరిగి ఆటల్లో పాల్గొన్నాడు.

నాన్న పెద్దత్తయ్య ఇంటికి వెళ్ళి రెండు రోజుల తర్వాత కానీ రాలేదు. నాన్న వస్తూనే, “ఏరా రావుడూ, ఇంతాలస్యం చేసావు మొన్నననగా వెళ్ళావు. ఇంతకీ వెళ్లిన పని కాయా పండా?” అనడిగింది నాన్నమ్మ.

“పండేనమ్మా, అక్కా బావా నీ మాట కాదంటారా, కాకపోతే పిల్ల వ్యక్తురాలు కావాలనీ, పైగా తనకు ఏదో గవర్నమెంటు పని రావాలనీ మన ప్రసాదం పట్టు బట్టడంతో ఇంతాలస్యం అయ్యింది కానీ, లేకపోతే పెళ్ళి ఎప్పుడో అయ్యేను. ఇదిగో, నిన్న మంచి రోజని ప్రధానం చేసుకుందాం అంటే ఆగిపోయాను. ఏకంగా తాంబూలాలుచ్చుకునే వచ్చాను. “ అన్నాడు నాన్న స్నానానికి వెడుతూ..

పెద్దక్క సిగ్గుపడుతూ నుంచుంది. అమ్మ సంతోషంగా పెద్దక్క తల నిమిరింది.

అక్కడ వెర్రి ముఖం వేసుకుని నుంచున్న తనను, నానమ్మ ఎత్తుకుని, “అలా చూస్తావేరా వెర్రి నాగన్నా! అక్క ప్రసాదం బావని పెళ్లి చేసుకుంటుంది తెలుసా. నువ్వే కాశీయాత్రలో బావని బెల్లం ముక్క పెట్టి బ్రతిమిలాడాలి. ‘బావా, మా అక్కని పెళ్లి చేసుకో, కాశీకి వెళ్లొద్దు’ అని. తెలిసిందా” అని గలగలా నవ్వుతూ అన్నది. అక్కలూ అమ్మా కూడా నవ్వారు. తనకు ఏమీ అర్థం కాలేదు.

ఆ శ్రావణంలోనే అక్క పెళ్లి. ఆట్టే సమయం లేదని వెంటనే పనులు మొదలెట్టారు నాన్నా వాళ్ళు. నాన్న పెళ్లి పనుల్లో పడి వేదం గురించి గానీ, రోజూ తను పాఠశాలకు వెళ్ళడం గురించి కానీ పట్టించుకోలేదు.

నాన్నమ్మ, అమ్మా అప్పడాలు వడియాలు పెట్టడం, పచ్చళ్ళు పెట్టడం, పసుపు దంచి పొడి కొట్టడం, ఇలాంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. తనను పట్టించుకునే నాథుడే లేడు. దాంతో వేళకు తినడం స్నేహితులతో ఆడుకోవడం అదే పనయ్యింది తనకు. శ్రావణం రానే వచ్చింది. ఇంటికి చుట్టాలందరూ వచ్చారు. పెద్దత్తయ్యా వాళ్ళు అట్నుంచటే పెళ్ళికే వస్తారుట. ఇంట్లో పెద్ద హడావుడిగా ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version