[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[కృష్ణానదీతీరంలోని యాభై గడపల అగ్రహారం అది. దశరథరామయ్య ఆ ఊళ్ళో రాములవారి గుడిని, వేద పాఠశాలని నిర్వహిస్తున్నాడు. ఆయన పడక్కుర్చీలో చేరగిలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఆయన ముగ్గురు కూతుళ్ళు అన్నపూర్ణ, లక్ష్మి, శారద – ఆయన చుట్టూ చేరి తమ్ముడికి కబురుపెట్టమని ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు కూతుళ్ళ తర్వాత ఆయనకి కొడుకు పుడతాడు. కులదైవం వేంకటేశ్వర స్వామి పేరిట వెంకట రమణ అని పేరుపెట్టుకుంటాడు కొడుకుకి. తర్వాత ఆయన ప్రమేయం లేకుండా ఎన్నో జరిగిపోయాయి. అమెరికాలోని డల్లాస్‌లో భార్య గీత, కొడుకు రామకృష్ణ, కూతురు జానకితో ఉంటున్న వెంకటరమణకు ఇంటికి రమ్మని కబురు అందుతుంది. భార్యాపిల్లలతో ఇండియా బయల్దేరుతాడు. రమణ గీతలది కులాంతర, రాష్ట్రాంతర వివాహం. హైదరాబాద్ ఆఫీసులో పరిచయం వాళ్ళిద్దరికీ. ప్రేమించుకుంటారు. గీతకి తల్లిదండ్రులు లేరు. మేనమామ పెంచి పెద్ద చేస్తాడు. ఆయన పెళ్ళికి ఒప్పుకున్నా, రమణ తల్లిదండ్రులు అంగీకరించరు. దాంతో గీత మేనమామ ఆధ్వర్యంలో పెళ్ళి చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆఫీసునుంచి వచ్చేసరికి గుమ్మంలో పెద్దక్క ఉంటుంది. తలుపులు తీసి, లోపలికి రాగానే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక ప్యాకెట్ గీత చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. విమానంలో కూర్చున్న రమణకి తన ఊరు, బాల్యం గుర్తొస్తాయి. నానమ్మ, నాన్న, అమ్మ గుర్తొసారు. నాన్న నేర్పిన శ్లోకాలు జ్ఞప్తికి వస్తాయి. చిన్ననాటి నేస్తాలను, అప్పటి సంఘటనలను తలచుకుంటాడు. ఏడేళ్ళలు వడుగు చేస్తారు. వేసవి సెలవుల తర్వాత వేదం నేర్చుకోనని, మామూలు బడికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు రమణ. ఊరు వెళ్ళి తండ్రి పెద్దక్క పెళ్ళి ఖాయం చేసుకుని వస్తాడు. శ్రావణం మాసం నుంచి పెళ్ళి పనులు మొదలవుతాయి. ఇల్లంతా ఒకటే సందడిగా ఉంటుంది. ఇక చదవండి.]
3.
అయిదురోజుల పెళ్లి ఎంతో సంబరంగా జరిగిపోయింది. కాశీయాత్ర పెళ్ళిలో ఒక ఘట్టం అని తెలుసుకున్నాడు తను. అక్క పెళ్లే తన జీవితానికి పెద్ద మలుపు అని తానెప్పుడూ ఊహించలేదు.
అక్క, బావ కలిసి విజయవాడ వెడతారట. అక్కడ బావ గవర్మెంటు ఆఫీసులో పని చేస్తాడట. పెళ్ళిలో బావెంత ఠీవిగా ఉన్నాడో, మంచి బట్టలు వేసుకుని, చక్కటి క్రాఫుతో తల దువ్వుకుని, చూడటానికి ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడనీ,
నిజానికి చిన్నత్తయ్య పిల్లలు కూడా ముగ్గురూ మొగపిల్లలే, వాళ్ళూ చక్కగా ఉన్నారు ఎవ్వరూ పిలక పెట్టించుకోలేదు. చక్కగా పెద్ద చదువులు చదువుకుంటూ పట్నాల్లో ఉన్నారు. మామయ్యలూ పెట్టించుకోలేదు. మిగతా చుట్టాల్లోకూడా ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే ఎవ్వరూ ఇలా లేరు. మరి నాన్నెందుకు ఇలా పిలక పెట్టించుకుని వేదం చదువుతాడు? తనకీ అలాగే చేశాడు. వేదపాఠశాలకు వెళ్ళమంటాడు కానీ, మామూలు స్కూలుకు పంపించడు. తనకూ బావకుమల్లె మంచి చదువు చదవాలని, పెద్ద ఉద్యోగం చెయ్యాలని ఉంది. నాన్నకేలాగయినా చెప్పి మాష్టారుగారి స్కూల్లో చేరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
అక్క పెళ్లి హడావుడి అయిపోయింది. చుట్టాలందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్క లేని లోటు తెలిసొస్తోంది. చాలా బెంగగా ఉంది తనకు. అప్పగింతల రోజు అందరితో పాటు తనూ ఏడ్చాడు. అస్సలు అక్కతో పాటు తనూ వెళ్తానంటే అమ్మ, నాయనమ్మ వద్దన్నారు. మారాం చేస్తే నాయనమ్మ తనకు కబుర్లు కాకరకాయలు చెప్తూ, తాయిలం పెడతానని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయింది.
వారం తర్వాత మళ్లీ వేదపాఠశాలకు నాన్న తీసుకెడతానని అంటే ససేమిరా రానని చెప్పాడు. నాన్న కేకలేస్తే, ఏడవనన్నా ఏడ్చాడు కానీ అక్కడికి మాత్రం వెళ్ళలేదు. నాన్న గట్టిగా కేకలేస్తే, నానమ్మ వత్తాసు పలికి వెనకేసుకొచ్చేది. “ఇలా అయితే ఎలాగమ్మా, చదువు సంధ్యా లేకుండా పోతాడు” అని నాన్న అంటే, అదే అదనుగా తను, “నేను వేదం చదువుకోను. అందరిలా స్కూల్లో చదువుకుంటాను. అందరిలా నేనూ జుట్టు పెంచుకుని క్రాఫు పెట్టించుకుంటాను. మంచి బట్టలు వేసుకుంటాను” అని చెప్పేశాడు.
అవ్వాళ్ళ నాన్నకు వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. “ఎవడ్రా నీకు ఇవన్నీ ఎక్కించింది? చక్కగా రోజూ సంధ్య వార్చుకుని, వేదం చదివే వాడివి ఇలాంటి బుద్ధులు ఎవరు పుట్టించారు? రాను రానూ కాకరకాయ కీకరకాయవుతోంది. నువ్వు అందరిలా ఎలా ఉంటావురా? నేనందరిలా ఉన్నానా? మనం, మన పద్ధతులు వేరు. నువ్వు వేదం చదువుకుని ఇక్కడే ఉండి మన ఆస్తులు, దేవాలయం, వేదపాఠశాల చూసుకుంటే చాలు. ఆ చదువులూ, పోకడలూ మనకొద్దు” గట్టిగా కేకలేసాడు నాన్న.
“ఉహూ, నాకీ పిలకా, ఈ చదువూ వద్దు. నేను కూడా బావల్లా పెద్ద చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తాను. చక్కగా బావకు మల్లె కోటు వేసుకుని ఠీవిగా ఉంటాను” అంతకంటే గట్టిగా చెప్పాడు తను.
ఎప్పుడూ లేనిది నాన్న కోపం నషాళానికి అంటింది. గట్టిగా వీపుమీద నాలుగు అంటించాడు. బ్యారుమన్నాడు తను. వెంటనే నాన్నమ్మ వచ్చి గబుక్కున తనని వేరే గదిలోకి తీసుకెళ్ళింది. తను ఇలా ఎదురు సమాధానం చెప్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు.
నాన్నమ్మ తనకు వీపు నిమురుతూ, “నాన్నకెదురు చెప్పొచ్చా, తప్పు కాదూ!” అంది. “నాకు ఇష్టం లేదు నాన్నమ్మా” వెక్కుతూనే చెప్పాడు తను. అలా ఎంత సేపు ఏడ్చాడో, నాన్న వచ్చి బుజ్జగిస్తాడని అనుకుంటే రాలేదు. అమాంతంగా పెద్దక్క గుర్తుకొచ్చి మళ్ళీ ఏడుపు వచ్చింది. అక్కే ఉంటే తనని కాపాడేది. నాన్నతో పోట్లాడైనా సరే ఒప్పించేది. ఏడ్చేడ్చి ఏమీ తినకుండా పడుకున్నాడు. నాన్నమ్మ, అమ్మ వచ్చి బ్రతిమిలాడినా తను తిననంటే తిననని భీష్మించుక్కూర్చున్నాడు.
ఓరాత్రి వేళ బాగా ఆకలేసింది. వంటింట్లోకి వెళ్లి చూసాడు. అక్కడ ఒక డబ్బాలో పెళ్ళికని చేయించిన తినుబండారాల్లో కొద్దిగా మిగిలిన జంతికలు, లడ్డూలు ఉన్నాయి. అందులోంచి రెండు లడ్డూలు తీసుకునొస్తుంటే, తండ్రి గదిలోంచి మాటలు వినబడ్డాయి.
“పోనీ చిన్న వెధవ, వాడు అడిగిందే చదివించొచ్చు కదండీ, ఎందుకొచ్చిన గోల, పాపం తిండి తిప్పలు లేకుండా పడుకున్నాడు వెర్రి నాగన్న” అంటోంది అమ్మ. “లేదే, వాడికి పట్నపు పోకడలు ఎక్కువైనాయి. ఆ ఆకర్షణలో పడి వాడికేం తెలియడం లేదు. వాడి మాట వింటే మనం తరతరాలుగా వస్తున్న ఆచారవ్యవహారాలకు నీళ్ళొదులుకోవాల్సిందే. నా తర్వాత ఈ ఆస్తిపాస్తులు, గుడి ధర్మకర్త్రుత్వం, వేదపాఠశాల నడపడం ఎవరు చూస్తారు? మనకేమైనా పదిమంది కొడుకులున్నారా? వీడు కాకపోతే ఇంకోడనుకోవడానికి. వాడిది ఆడింది ఆట పాడింది పాటానా? అర్థం లేదూ” అన్నాడు తండ్రి. “నిజమే కానీ, వాడు గ్రహించందే! మన చుట్టాల్ని చూసి వాడూ అలాగే ఉండాలనుకుంటున్నాడల్లే ఉంది.. ఏం చేస్తాం చెప్పండి?” అన్నది తల్లి. “ఎదుటివాడు తొడ కోసుకుంటే, మనం మెడ కోసుకుంటామా? వాళ్ళని, వీళ్ళని చూసి ఏదో అనుకుని పొరబడుతున్నాడు. రేపు చెప్తాను. వింటాడులే, బాధపడకు. పడుకో” అంటున్నాడు తండ్రి. తను మాత్రం ససేమిరా ఒప్పుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
మర్నాడు, “ఏరా, బడికి బయలుదేరలేదేంరా” అన్నాడు నాన్న. తను, “నేను రాను నాన్నా, నాకిష్టం లేదు. నన్ను మాష్టారు స్కూలికి పంపించు” అన్నాడు దృఢంగా. మళ్ళీ నాన్నకు కోపం వచ్చింది. గట్టిగా కేకలేసాడు. ఊహూ, అయినా తను లొంగలేదు. మధ్యలో నాన్నమ్మ కల్పించుకుని, “ఒరేయ్ రావుడూ, వాడు ఒక్కగానొక్క నలుసు. వాడు చదువుకుంటాననేగా అంటున్నాడు. చదువు సంధ్యా లేకుండా, జులాయి తిరుగుళ్ళు తిరిగి, పాడైపోతే బాధపడాలి కానీ బంగారంలా చదువుకుంటానంటే బాధెందుకు? ఏ చదువైతేనేంటట? చేర్పించి చూడు, అది సరిగ్గా సాగాలి కదా, చూద్దాం. దిగితే కానీ లోతు తెలీదంటారు. కానీ, చేర్పించడం చేర్పిస్తే, దాన్లో కష్టం వాడికే తెలిసొస్తుంది. వాడి వల్ల కాకపోతే వాడే దారికొస్తాడు. అందుకోసం వాడ్ని ఏడిపించడం దేనికి? పాపం నిన్న కూడా కుర్రాడు ఏం తినకుండా పడుకున్నాడు” అన్నది.
‘ఏదో నయానో భయానో చెప్తే వింటాడనుకుంటే, తొండ ముదిరి ఊసరవెల్లయ్యేట్టుంది’ అనుకున్నాడు తండ్రి.
“అది కాదమ్మా, దీనికేం లోపం వచ్చింది? తరతరాలనుంచి అందరం ఇవి చదువుకుని పెరిగిన వాళ్ళమే కదా, మాకేమైనా లోపం జరిగిందా? మేమేమైనా పనికిరాకుండా పోయామా? అక్కడ వేదం చదువుకునే పిల్లలందరూ పనికిరారంటావా? ఎక్కడెక్కడినుంచో పిల్లలొచ్చి ఇక్కడుండి చదువుకుంటున్నారు. వీడిక్కడ దగ్గర్లో హాయిగా చదువుకోవడానికి నీలుగుతున్నాడు” అన్నాడు తండ్రి.
“పోనీలేరా, చిన్న వెధవ, వాడికి నచ్చలేదు. బలవంతంగా ఎన్నాళ్ళు చదివిస్తావు? ఇష్టం లేనిది నువ్వు బలవంతం చేస్తే మాత్రం అబ్బుతుందా? మీరోజుల్లో ఇలా బయట ఆకర్షణలు లేవు. బుద్ధిగా తండ్రి చెప్పినట్టు చదివారు. కానీ, వీడికెందుకో నచ్చడం లేదు. పైగా మొండికేస్తున్నాడు. పోనీ, ఆ చదువులన్నా సరిగ్గా చదువుకుని, బంగారు తండ్రల్లే వృద్ధిలోకి వస్తే అంతే చాలు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఎల్లారా నాయనా, వెంటనే వాడ్ని ఆ బడిలో చేర్పించు. చిన్న వెధవతో నీకు పట్టుదలట్రా?” అని నచ్చజెప్పింది. అప్పుడు నాన్నమ్మ అచ్చం తనని కాపాడడానికి వచ్చిన అమ్మవారులా అనిపించింది.
ఏం చెయ్యడానికి పాలుపోవడంలేదు తండ్రికి. తనకు వేరేమార్గం కనబడడం లేదు. పైగా తల్లి మాట కాదనలేకపోతున్నాడు. రోజంతా ఆలోచించి మర్నాడు మాష్టారుకి కబురు పెట్టాడు.
“మాష్టారూ! ఎవరేం ఎక్కించారో తెలీదు. మా వాడు మీ బడిలోనే చదువుకుంటానని మంకుపట్టు పట్టాడు. చూడండి మరి, మీ బళ్ళో ఏమైనా చేర్పించుకోవడానికి కుదురుతుందేమో” అన్నాడు తండ్రి.
“అయ్యో, అదేం మాట రామయ్యగారూ, అబ్బాయి రత్నంలాంటివాడు. నా మాట నమ్మండి. పిల్లాడు చదువుకుంటే వాడి భవిష్యత్తు బంగారు బాటే, మరో మాట లేదు. రేపే పంపించండి” అన్నారాయన.
తండ్రి సరేనన్నాడు. ఎలాగైనా తన స్నేహితులతో కలిసి చదువుకునే అవకాశం దొరికింది. ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉంది తనకి. మంచిరోజు చూసి ఆ బళ్ళో చేర్పించాడు నాన్న. ఇలా తన జీవితంలో మొదటి మలుపు మొదలైంది. ఆ మలుపే చాలు ఇహ తన జీవితం తననుకున్నట్టు సాఫీగా నడిచిపోతుంది అనుకున్నాడు కానీ అప్పుడు తెలీదు తనకు ప్రతి అడుక్కి సంఘర్షణ అవసరమని.
4.
స్కూల్లో చేరడానికి ఒప్పుకున్న నాన్న, ఒక్క షరతు మాత్రం పెట్టాడు. ప్రతి ఆదివారం తను సంస్కృతం, వేద పఠనం కొనసాగించాలని, ఇంకా సంధ్యావందనం మానకూడదని. వాటిమీద శ్రద్ద లేకపోయినా ఒప్పుకున్నాడు తను.
స్కూల్లో చేరడం స్నేహితులతో కలిసి చదువుకోవడం సరదాగా ఉన్నా, చదువు ఆలస్యంగా మొదలెట్టిన కారణాన చాలా ఒత్తిడి ఉండేది. అంతకుముందు వేదం నేర్చుకోవడం వల్ల అలవడిన ఏకసంథాగ్రాహ్యత వల్లనేమో, తనకు చదవగానే గుర్తుండిపోయేది. స్కూలు జీవితం, చదువు ఎంతో సరదాగా ఉంది తనకు. కానీ ఒక్కటే ఒక్క సమస్య. అది పిలక. అంతా గేలి చేస్తుండడం, తన వెనకాల తనను చూసి నవ్వుకోవడం, తనకు ‘పిలకోడు’ లేదా ‘గుండుగాడు’ అని పేరు పెట్టడం, భరించలేకపోతున్నాడు.
అదే మాట నాన్నమ్మతో అంటే, “వాళ్ళ బొందలేరా, వాళ్లకేం తెలుసు పిలక మహత్యం, బ్రాహ్మడికి పిలకలోనే ఉంటుందట శక్తంతా. నీకు ఇంత బాగా చదువొస్తోందంటే కారణం ఆ పిలకే!” అని చెప్పింది. తనకెందుకో అది సబబుగా లేదనిపించింది. ‘కష్టపడి తను చదువుకుంటుంటే, అదంతా పిలక మహత్యం అంటుందేమిటీ నాన్నమ్మ, చాదస్తం కాకపోతే’ అనుకున్నాడు.
వారం వారం వచ్చే మంగలి సుబ్బన్నవచ్చాడు. ఈసారి ఎలాగైనా ఈ పిలక పీడ వదిలించుకోవాలని, అందరిలా క్రాఫు పెట్టించుకోవాలని, నిర్ణయించుకున్నాడు తను. గోచీ పెట్టుకుని, దొడ్డి వైపు, స్నానాలగది దగ్గర, సుబ్బన్న ముందున్న ముక్కాలిపీటమీద కూర్చున్నాడు. సుబ్బన్నకు కాస్త చెవుడు. అందుకే కొంచెం గట్టిగా, “సుబ్బన్నా! నాకు గుండు వద్దు. నేను జుట్టు పెంచుకుంటాను. అలాగే పిలక కూడా వద్దు. అది మాత్రం తీసేసేయ్” అన్నాడు తను.
“అయ్ బాబోయ్, పెద్దయ్గోరు సంపేత్తారండె. ఆయ్, ఆర్ని అడక్కుండా నానేటీ సెయ్యనండె, అయ్గోరు గుడికెళ్తా నన్నీడికంపించారండె” అన్నాడు. ‘వాడికి తండ్రంటే కొంచెం భయభక్తులెక్కువ’ అనుకున్నాడు. అలాగే వాడ్ని ఆటపట్టిద్దామనే చిలిపాలోచన వచ్చింది. వెంటనే, “సుబ్బన్నా, నిన్ను మా నాన్నమ్మ పిలుస్తోంది. వినబడటల్లా?” అన్నాడు గట్టిగా.
“అలాగాండీ! అయ్ బాబోయ్ నాకినిపించలేదండీ. ఇప్పుడే ఎల్పోయొచ్చేత్తా, కున్సేపు కదలకండా అట్టానే కూకోండయ్యగారో, నానిప్పుడే పారొచ్చేత్తా” అని ఇంటివైపు పరిగెట్టాడు సుబ్బన్న. అదే అదననుకుని, వెంటనే సుబ్బన్న పెట్టెలో ఉన్న కత్తెర తీసి, తన పిలక అద్దంలో చూసుకుంటూ కత్తిరించాడు. అది సగం ఊడొచ్చి, సగం వేళ్లాడుతోంది.
సుబ్బన్న తను అబద్ధం చెప్పాడని తెలుసుకుని వచ్చి, ఇక్కడ తను చేసిన పనికి మొత్తుకున్నాడు. కానీ ఏం చేసినా ఊడిన పిలక అతికే ప్రసక్తి లేదు. ఇంక చేసేది లేక తండ్రి వచ్చేంత వరకూ కాపలా కూర్చున్నాడు సుబ్బన్న. తండ్రికి తెలిస్తే తనకి బడితపూజ ఖాయం అని తెలిసినా ఊరుకున్నాడు తను.
తండ్రి వచ్చీ రావడంతోనే తన ఘనకార్యం సుబ్బన్న ద్వారా ఆయనకు తెలిసిపోయింది. మంగలి పనిముట్లు ముట్టుకున్నందుకు, తర్వాత పిలక కత్తిరించుకున్నందుకు, తన వీపు మీద బెత్తం విరిగింది. ఆయన కొడుతున్నా, తన మొండితనం ముందు ఏ ఆయుధం పనిచెయ్యదని, తను అనుకున్నది సాధిస్తాడని ఆ రోజు ఋజువయ్యింది. ఆరోజు నానమ్మ మడిలో ఉండడం వల్ల, తనని కాపాడలేకపోయింది. తండ్రికి వచ్చిన పిచ్చకోపం వల్ల వీపు మీద వాతలు తేలాయి. ఇక ఆ రోజుకి సుబ్బన్నకు సెలవిచ్చి స్నానానికి పొమ్మన్నాడు తండ్రి. అలా ఎక్కెక్కి ఏడుస్తూనే స్నానం ముగించి వచ్చాడు. వెంటనే నాన్నమ్మ, అమ్మ తనని చుట్టేసి, ఏడుస్తూ, తన వీపుకి వెన్న రాచారు.
“ఎందుకొచ్చినల్లరిరా ఇది? ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తారుట్రా! ఇదేం ఖర్మమో, పిల్లాడిని చితక్కొట్టాడు. పిచ్చకోపం వాడికి. అంతా వాళ్ళ నాన్న పోలిక. ఖర్మ” అన్నది నాన్నమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకొంటూ.
“నా స్కూల్లో ఎవ్వరికీ పిలక లేదు నాకు వద్దు అంటే వినట్లేదు. అందుకే చేశా!” అన్నాడు తను వెక్కుతూనే. అటుపక్కగా తండ్రున్నట్టు తెలీదు. “అసలీ వెధవ చదువుల మూలంగానే ఇవన్నీ, చెడు స్నేహాలు చేస్తే ఇల్లాంటి దరిద్రపు ఆలోచనలే వస్తాయి. కూతు కూతంటే కుక్కపిల్లొచ్చి మూతి నాకిందట. అలావుంది ఈ వెధవ చేసేపనులు. పోనీలే అని ఊరుకుంటే మరీ మితిమీరిపోతున్నాడు” అన్నాడు తండ్రి.
“చాల్లే ఊరుకోరా! నువ్వూ నీ కోపమూనూ పిల్లాడిని చావ బాదావు. వాడి తోటివాళ్ళంతా ఒక విధంగా ఉంటే వీడికి మాత్రం ప్రత్యేకంగా ఉంటే గేలి చెయ్యరూ. ఏదైనా మాట పడ్డవాడిక్కానీ తెలీదు.” పోట్లాడింది నాన్నమ్మ. మొత్తానికి పిలకోపాఖ్యానం ఆ విధంగా ముగిసి అక్కడా అనుకున్నది సాధించాడు.
చదువు బానే సాగుతోంది ప్రతి సంవత్సరము కూడా తను పరీక్షలు తప్పితే, మళ్ళీ తీసుకెళ్ళి వేదపాఠశాలలో వేద్దామని తండ్రీ, అస్సలు తప్పడమనేదే లేకుండా, ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో, బాగా చదివి, ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణుడవుతూ తనూ, పోటీ పడుతున్నారు.
పదో క్లాస్ లోనూ, జిల్లాలోనే మొత్తానికి మొదటి రాంక్‌తో పాసయ్యాడు తను. ఇక ఆ ఊరిలో తన చదువయ్యిపోయింది.
ఆరోజు మాష్టారు వచ్చి, “రామయ్యగారూ! నేచెప్పలా, పిల్లాడు రత్నంలాంటివాడని, చూడండి జిల్లాకే మొదటి రాంకులో పాసయి మనకు, మన ఊరికేకాక, జిల్లాకే మంచి పేరు తీసుకొచ్చాడు. వాడ్ని ఇంకా పై చదువులు చదివిస్తే ఎంతో ఎదుగుతాడు. మీ ఇంటిపేరు నిలబెడతాడు” అన్నారు మాష్టారు.
“వాడు ఇంతవరకూ చేసిన ఘనకార్యం చాలు. మా ఇంటిపేరు వాడేం నిలబెట్టక్కరలేదు కానీ, ఇప్పటికైనా వాడు నాదారికొస్తే అంతే చాలు.” అన్నాడు తండ్రి. అదే అదనుగా తను కూడా వెళ్లి తండ్రితో, “నాన్నా! నేను కూడా పట్నంలో పైచదువులు చదువుకుంటాను” అన్నాడు.
“పళ్ళు రాలగొడతా వెధవా! ఏదో పిల్ల వెధవవని నిన్ను బాధ పెట్టడం దేనికని చూస్తే, మొండితనం బాగా ఎక్కువైంది. పెద్దవాళ్ళు చెప్పడం వినడం లేదా? నీ ఇష్టారాజ్యం అనుకుంటున్నావా? ఏదో దేవుడు దయవల్ల, మాకు కలక్క కలక్క కలిగావని, ఆ వేంకటేశ్వర స్వామి ప్రసాదమని, అనుకుని ‘వెంకట రమణ’ అని పేరెట్టుకుని, పిలుచుకుంటూ, ముద్దు చేస్తుంటే, మరీ మొద్దువౌతున్నావు. ఇహ చదివింది చాలు. ఇకపై ఇక్కడే వుండి చెప్పినట్టు చెయ్యి” ఆర్డర్ వేసినట్టే చెప్పాడు తండ్రి. అలా వదిలేస్తే తను సాధించదలచుకున్నది ఎలా సాధిస్తాడు?
“లేదు నాన్నా, నాకు ఈ వేదం చదువుకోవాలని లేదు. నేనూ అందరికీ మల్లె బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరును కావాలి. అదే నా లక్ష్యం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తప్పకుండా పట్నంలో చదువుతాను” ధైర్యంగా అనుకున్నది అనుకున్నట్లు తండ్రి ముందు ఉంచేసాడు. మొండివాడు రాజుకంటే బలవంతుడట. అలా ఉంది పరిస్థితి. మొండిగా తయారవుతున్న తనను ఎన్ని సార్లు కొడతాడు తండ్రి, ఒక్కగానొక్క కొడుకుని తిట్టడం కొట్టడం ఆయనకు సరదా కాదుకదా! అయినా తను దారికి రావాలని ఆయన మాట వినాలనీ తండ్రి పడే తాపత్రయం ఎవ్వరికి అర్ధం అవుతుంది? నయాన కాకపోతే భయానైనా వింటాడేమోనని ఆశ పాపం ఆ తండ్రికి.
తనన్న మాటలకు తండ్రికి కోపం వచ్చి మళ్లీ బెత్తం తీయబోయాడు. కొట్టడానికేవన్నా చిన్నపిల్లాడా? పదహారేళ్ళ ప్రాయం. వెంటనే నాయనమ్మ, తల్లే కాకుండా మాష్టారు కూడా అడ్డం వచ్చారు. “పెరిగిన పిల్లాడ్ని కొడతారుట్రా ఎవరైనా? ఏమిటీ కోపం రావుడూ! వాడు చదువుకుంటానంటుంటే ఏవిట్రా నీ పట్టుదలా?” గద్దించింది నాన్నమ్మ.
“చూడండి రామయ్యగారూ! పిల్లాడు తెలివైనవాడు. బుద్ధిమంతుడు. ఈమాత్రం చదువు చదవడానికి అందరూ నానాతిప్పలూ పడుతూ ఉంటారు. అలాంటిది పిల్లాడు అవలీలగా సాధించాడు. పిల్లాడికి సరస్వతీ కటాక్షం ఉంది. ఇంజనీరింగ్ చేయడమంటే మాటలనుకున్నారా? లక్షల మంది ప్రవేశ పరీక్ష రాస్తే, అందులో కొంతమందికి మాత్రమే మంచి రాంకులూ, వాటిద్వారా చదివే అవకాశాలూ వస్తాయి. పిల్లాడు కష్టపడి చదువుతానంటే, మీరు చదివించడానికి ఇబ్బంది పడతారేమిటండీ? నా మాట విని వాడ్ని చదువుకోనీయండి. వాడి వల్ల కాకపోతే, మీ దారి మీకు ఉండనే ఉంది. ముందర కనీసం వాడ్ని ప్రయత్నమైనా చెయ్యనీయండి. నా మాట కాదనకండి” అని బ్రతిమాలారు మాష్టారు.
అందరి వత్తాసు కలిగిన తనని కాదని చేసేదేం లేదని, రుసరుసలాడుతూ ఒప్పుకున్నారు నాన్న. ఆ మాత్రానికే పొంగిపోయాడు తను. ఆ రకంగా విజయవాడలో పెద్దక్క దగ్గర ఉండి చదువుకోవడానికి అవకాశం దొరికింది. ఆ సంవత్సరం విజయవాడ సత్యన్నారాయణపురంలో గవర్నమెంటు జూనియర్ కాలేజీలో ఇంటర్ చదవడానికి సీటు దొరికింది.
జీవితం ఇంతవరకూ ఒకెత్తయితే, ఇప్పట్నుంచీ ఇంకో ఎత్తులా ఉంది. ఇంతవరకూ బావిలో కప్పలా ఉన్న తనకు, ఏకంగా సముద్రంలో పడ్డట్టుంది. ఇక్కడి పట్నపు వాతావరణం తట్టుకుని, సద్దుకుని, అక్కడి మూసలో అతుక్కోవడానికి చాలా కాలం పట్టింది. కాకపోతే ఎప్పటిలా తను చదువులో దిట్ట కావడం వల్ల అక్కడి లెక్చరర్లతోనూ, ఇటు తోటి విద్యార్థులలోనూ మంచి పేరు తెచ్చుకోవడానికి ఆట్టే కాలం పట్టలా, క్లాసులో పెట్టిన మొట్టమొదటి పరీక్షా ఫలితాల్లోనే, తన పాండిత్యం అందరికీ తెలిసిపోయి, అందరి మన్ననలు పొందాడు.
రెండేళ్లు ఇంటర్ చదివాక, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యాడు. అందరూ ఎంతో ఖర్చు, కష్టం పెట్టి వ్రాసే పరీక్ష అలవోకగా వ్రాసి, వందలోపు ర్యాంక్, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో, కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో, కంప్యూటర్ సైన్సులో సీటూ తెచ్చుకున్నాడు. మొన్నటిదాకా విజయవాడలో పెద్దక్క ఉండబట్టి, అక్కడుండి చదువుకున్నాడు. కానీ హైదరాబాద్‌లో ఉండి చదవడానికి తండ్రిని ఒప్పించడం మళ్ళీ సమస్య అయ్యింది.
(ఇంకా ఉంది)
శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుత నివాసం బెంగళూరు. వీరు 2019 నుంచి కథలు వ్రాస్తున్నారు. మొదటి కథ ‘నకిలీ మనిషి’. 2020లో వ్రాసిన మొదటి ధారావాహిక 45 భాగాల ‘విధి’ చాలా మందిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి కథలు, ధారావాహికలు వ్రాస్తున్నారు. 2023లో ‘ఆనందమయి’, 2025లో ‘అందం’ అనే ధారావాహికలు రచించారు. 2021లో భావుక సమూహం నిర్వహించిన ఆరు వారాల కథల పోటీలో వీరు రాసిన ‘దత్తత’ అనే ధారావాహికకు బహుమతి లభించింది. 2025లో అదే సమూహం నిర్వహించిన గొలుసు నవలా ప్రక్రియలో పాలు పంచుకుని, 25 మంది రచయితలతో కలిసి వీరూ ఒక భాగం వ్రాశారు.
ఇప్పటివరకు 15 దాకా కథలు, 7 ధారావాహికలు వ్రాశారు. వీరి కథలు రవళి అంతర్జాల మాసపత్రిలోనూ, తెలుగుతల్లి కెనడా అంతర్జాల పత్రికలోనూ, లీడర్ పత్రికలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. వీరు వ్రాసిన కొన్ని కథలు, ధారావాహికలు వివిధ చానల్స్ ద్వారా ఆడియో కథలుగా వచ్చాయి. ప్రమదాక్షరి, శ్రీమతి మంథా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన మినీ నవల పోటీలో తన మినీ నవల ‘పల్లె పిలిచింది’కి ప్రోత్సాహక బహుమతి లభించడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నారు.
