Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లె పిలిచింది-3

[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]

[విమానంలో ఇండియాకి వస్తూ తన గతం తల్చుకుంటూంటాడు రమణ. పెద్దక్క పెళ్ళి ఘనంగా అవుతుంది. తనకిష్టం లేని వేదవిద్య వద్దని, మామూలు చదువులు చదువుకుంటాననీ పెద్దక్క, బావగార్ల, నానమ్మ ద్వారా తండ్రిని ఒప్పిస్తాడు. అయితే, ప్రతి ఆదివారం సంస్కృతం, వేద పఠనం కొనసాగించాలని, ఇంకా సంధ్యావందనం మానకూడదని షరతు పెడతాడు తండ్రి. రమణ అంగీకరిస్తాడు తర్వాత మామూలు పాఠశాల చదువులు చదివి, విజయవాడలో పెద్దక్క దగ్గర ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి, మంచి ర్యాంక్ తెచ్చుకుంటాడు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో, కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో, కంప్యూటర్ సైన్సులో సీటొస్తుంది. తండ్రిని ఒప్పించి హైదరాబాద్‌లో ఉండి చదవడం ఓ సమస్య అవుతుంది. ఇక చదవండి.]

5.

జీవితంలో ప్రతి మలుపు సంఘర్షణలతోనే మొదలవడం చికాకుగా ఉంది రమణకు. ఇప్పటి సమస్యే సవాల్ తనకు. నిజంగా చూస్తే తాను స్కూల్లో చేరిన దగ్గరనుంచి తన కుటుంబంలో చాలానే మార్పులు వచ్చాయి. పెద్దక్క పెళ్లి తర్వాత మూడేళ్ల తేడాతో మిగతా ఇద్దరక్కల పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్దక్కను స్వంత బావకే ఇచ్చి చేసినా, మిగతా అక్కలకు బయట సంబంధాలే వచ్చాయి. ఆ బావలు కూడా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవాళ్లే. రెండో బావ ప్రకాశం, గుడివాడ తాలూకా ఆఫీసులో పని చేస్తున్నారు. మూడో బావ రామలింగం మంగళగిరిలో హై స్కూల్లో హెడ్మాస్టర్‌గా పని చేస్తున్నారు.

ఆ తర్వాత అక్కలకు పిల్లలు కూడా పుట్టారు. పెద్దక్కకు మొదట ఆడపిల్ల సుశీల, తనకంటే ఎనిమిదేళ్లు చిన్నది, తర్వాత అబ్బాయి నరసింహం. రెండవ అక్క లక్ష్మికి ఇద్దరూ మగపిల్లలే. ఒకడి పేరు సత్యం రెండోవాడు పరబ్రహ్మం. శారదక్కకు మాత్రం ఇంకా పిల్లలు లేరు.

అందరి పెళ్ళిళ్ళు పురుళ్ళు నాన్నమ్మ చూసింది కూడా, ఎన్ని మార్పులు జరిగినా తండ్రి తీరులో మార్పు రాలేదు సరి కదా, ఎక్కువ కాలం తన వేద పాఠశాలను విస్తృతం చెయ్యడంలో నిమగ్నమయ్యారు. అలాగే ఎప్పటికైనా తన కొడుకు తిరిగొవస్తాడన్న ఆశా విడిచిపెట్టలేదు. ఆ మాట కుటుంబంలో అందరికీ తెలుసు. అందుకే తన జీవితానికి సంబంధించిన ప్రతి మలుపు కష్టసాధ్యం అవుతోంది.

ముందుగా పెద్దక్కతో మాట్లాడి, ఒక మార్గం చూద్దాం అనుకున్నాడు. భోజనాల సమయంలో అయితే బావ కూడా తనకు వత్తాసుగా ఉంటాడని ఆశ. తమ ఇంట్లో అయితే భోజనసమయంలో అందరూ మౌనమే పాటించాలి. కానీ అక్కావాళ్ళింట్లో బావ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలూ అంతే.

విస్తరిలో తను అన్నం కెలుకుతూంటే అక్కే అడిగింది, “ఏవిట్రా ఆ కెలకడం? అన్నం తినరా సన్నాసి. ఏవిటా దీర్ఘాలోచన?” అని.

“కాదక్కా, ఇప్పుడు నాకు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది కదా, నాన్న పంపిస్తారంటావా?” అన్నాడు తను.

“సమస్యే లేదు. పంపరు. ఊరెళ్ళి బుద్ధిగా నాన్న చెప్పినట్టు విను. అదే మీ ఉభయులకు మేలు” అన్నది.

“నీకు మరీ వేళాకోళమే! ‘పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం’ అని వాడసలే బెదురుగొడ్డల్లె ఉంటే, నువ్వు మరీ భయపెడతావేం?” అన్నాడు బావ. పిల్లలు నవ్వడం మొదలెట్టారు.

వాళ్ళను నోరుమూసుకుని తినమని కసిరి, “నీకు ఏం చెయ్యాలనిపిస్తే అదే చెయ్యరా! మామయ్యది మరీ చాదస్తం. సరస్వతీ దేవి కటాక్షం నీ మీద అలా కురుస్తుంటే మామయ్య చేతులు చాపి మరీ అడ్డుకుంటున్నాడు” అన్నాడు బావ.

“లేదండీ, నాన్నను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఎంత గొప్ప పండితులో మీకు అర్థం కాకుండా ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ అవపోశన పట్టారాయన. మీకు గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు రాయలసీమలో నీటి ఎద్దడి వస్తే నాన్నను పిలిపించుకెళ్ళి, వారి ఆధ్వర్యంలో అక్కడ వరుణ యాగం చేయించుకుని వర్షాలను రప్పించుకున్నారు. అంతటి పటిమ గలవారాయన. ఆ వేద శాస్త్ర విజ్ఞానము తన తరువాత నిలబడాలన్నదే నాన్న కోరిక అందుకే వీడ్ని ఇంతగా పట్టుబట్టి అటువైపు మరల్చడానికి ప్రయత్నం చేసేది. అది అర్థం చేసుకోకుండా ఊరికే నాన్నను ఆడిపోసుకుంటారు” అన్నది పెద్దక్క.

“నిజమే కావచ్చక్కా, కానీ నాకు బొత్తిగా ఇష్టం లేదే, నన్ను నా మానాన వదిలేయొచ్చు కదా, ఎందుకంత బలవంతం చెయ్యడం? పోనీ నేను ఏ చదువు సంధ్యా లేకుండా జులాయి తిరుగుళ్ళు తిరుగుతుంటే బాధ పడాలి. కానీ, నేను బానే చదువుతున్నాను కదా! నా స్నేహితులు ఎంతో కష్టపడి కోచింగ్‌కి వెళ్లి కూడా తెచ్చుకోలేని సీట్ నాకొచ్చింది. దానికి సంతోషించాల్సింది పోయి వద్దంటారు. అడుగడుక్కి నేనిలా సంఘర్షణ పడడం ఏమంత బాగుంది? కొంచెం నాన్నకు నువ్వైనా చెప్పక్కా, నీకు పుణ్యం వుంటుంది” బ్రతిమాలాడు తను.

“సరే చూద్దాంలే, ముందు నువ్వు అన్నంతిను. ప్రస్తుతం సెలవులే కదా, ఊరెళ్ళు, నాన్నమ్మ నీ కోసం బెంగెట్టుకుంది. ఆవిడ ఆరోగ్యం కూడా బాగుండడంలేదు” అన్నదక్క. ‘హమ్మయ్య’ అనుకున్నాడు తను.

ఆ రోజే బయలుదేరి ఊరెళ్ళాడు. నాన్నమ్మ తనను చూడగానే భోరున ఏడ్చేసింది. “పెద్ద పెద్ద చదువులని, నువ్వూళ్ళట్టుకుని తిరుగుతుంటే బాధగా ఉందిరా అబ్బాయ్, ఇంక ఇక్కడే ఉండి, నాన్నకు చేదోడుగా ఉండు. నేనెప్పుడు దాటిపోతానో తెలీదు. నేను పోయినప్పుడు నా కళ్ళెదురుగా ఉందువుగాని” అన్నది నాన్నమ్మ.

అప్పటికి ఏమీ మాట్లాడలేదు. కానీ, నాన్నకు చెప్పి ఒప్పించాలని గట్టిగా అనుకున్నాడు. ఒక నెలపాటు సెలవులు. ఆగస్టులో బహుశా క్లాసులు మొదలౌతాయి. అప్పుడు చూద్దామని నిర్ణయించుకున్నాడు. పైగా నాన్నమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, మంచం పట్టేసింది. ఈ వయస్సులో ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం దేనికని ఊరుకున్నాడు.

పదిహేను రోజులు చాలా బాధపడి నాన్నమ్మ కాలం చేసింది. పెద్దగా రోగం అంటూ ఏమీ లేకపోయినా, వయస్సు మీద వచ్చే జబ్బులతో తట్టుకోలేక వెళ్ళిపోయింది. తనెంతో బాధపడ్డాడు. చిన్నప్పటినుంచీ తనను వెనకేసుకొచ్చి నాన్నతో ఎన్నో సార్లు యుద్ధమే చేసేది. తనను ఎంతో గారాబంగా పెంచింది. తనకు అయిదారేళ్ళు వచ్చినా ఎత్తుకుని తిరిగేది. తనకు ఒంట్లో బాగుండక పోతే ఇహ చెప్పక్కర్లా, భూమ్యాకాశం ఏకం చేసేసేది. అలాంటి నాన్నమ్మ ఇంక లేదని తలచుకుంటేనే గుండె చెఱువౌతోంది.

నాన్నమ్మ కార్యక్రమాలు అన్నీ అయ్యాక, పెద్దక్కావాళ్ళు తిరిగి వెళ్ళిపోబోతుంటే, తను వెళ్లి, అక్కనూ బావనూ తన సంగతి అడగమని అడిగాడు. అపుడు బావ చెప్పాడు నాన్నతో. యథా ప్రకారం నాన్న వద్దనడం, తను కలుగజేసుకొని పట్టు పట్టడం జరిగాయి.

“మామయ్యా! అందరూ ఎంతో కష్టపడి సాధించే సీటు వాడికి చాలా తేలిగ్గా వచ్చేసింది. వాడు బాగా చదువుతున్నాడు. మంచి భవిష్యత్తు ఉంది. అలా అని వాడు మీ సంస్కృతిని సాంప్రదాయాలను వదిలేయ్యలేదు కదా, చక్కగా త్రిసంధ్యలు చేస్తాడు. వాడి కనీసపు ధర్మం వాడు పాటిస్తున్నాడు. వాడి మార్గాన వాడ్ని పోనీండి. అమ్మమ్మ ఉండుంటే తప్పకుండా వాడ్ని ప్రోత్సహించేది. ఎన్నిసార్లు వాడికి వత్తాసు పలకలేదావిడ!” అన్నాడు బావ. చివరి మాట నాన్నకు, నాన్నమ్మ లేని లోటుతో మరింతగా బాధగా అనిపించింది.

ఏ ఆలోచనలో ఉన్నాడో నాన్న సరేనన్నాడు. హైదరాబాద్లో ఉండేందుకు తను ఏర్పాటు చేస్తానని చెప్పి ఒప్పించాడు బావ. మరో నెల్లో తను హైదరాబాదులో యూనివర్సిటీలో చేరాడు. అక్కడే దగ్గరలో చిన్న రూం తీసుకుని, తను పెద్దక్కసాయంతో వంట చేసుకుంటున్నాడు.

ఎలాగైతేనేం వంట కొద్దిగా అలవాటు పడింది. ఏమీ లేకపోతే అన్నం ఒక్కటి వండుకుని అక్కిచ్చిన పచ్చళ్ళు, సున్నిపొడి, పెరుగుతో కాలక్షేపం చేస్తున్నాడు తను. చదువుగూడా బాగానే సాగుతోంది.

నాలుగేళ్లు ఇట్టే గడిచిపోయాయి. చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం, కొన్ని సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. అందరూ సంతోషించారు. తను పట్టా పుచ్చుకున్నరోజున అక్కా బావా వచ్చి, చూసి, సంతోషించి, ఏదో అందలం ఎక్కినంత సంబరపడిపోయారు.

ఇహ ఆ తరువాత ఉద్యోగంలో చేరడానికి తను తండ్రిని అనుమతి అడగనూ లేదు, ఆయన తన్ను అడగలేదని ప్రశ్నించనూ లేదు. బహుశా ఆ పాటికే తమ మార్గాలు వేరని ఆయనకు పూర్తిగా అర్థమయ్యుంటుంది. ఇంకేమీ మాట్లాడలేదాయన.

అలా ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు తను. రెండేళ్లలోనే కంపెనీకి చాలా ముఖ్యుడైపోయాడు. ప్రతి పనిని నిబద్ధతతో చెయ్యడం, క్రమశిక్షణ, ఆడపిల్లల పట్ల సత్ప్రవర్తన అతనిని అందరికీ దగ్గర చేశాయి. ఆడపిల్లలు కొంతమంది ‘దద్దోజనం’ అనీ, ‘పనిరాక్షసుడు’ అనీ, పేర్లు పెట్టినా, చాలా మంది గౌరవంగా చూసేవాళ్ళు.

ఈ రెండేళ్ళలో ఊరికి ఓ నాలుగైదు సార్లు వెళ్ళుంటాడు అంతే! నాన్నమ్మ లేకుండా ఆ ఇంట్లో తోచడం కూడా లేదు తనకి. ఒకసారి శారదక్కకు పిల్ల పుడితే చూడ్డానికి వెళ్ళాడు. పేరు ‘అపర్ణ’ అని పెట్టారు. ఓ రెండ్రోజులుండి, వేడుక అయ్యాక వచ్చేశాడు.

ఆ తర్వాతేడాది సుశీల పెద్దమనిషయ్యిందని, మేనమామ ఓణీలు ఇవ్వాలని రమ్మంటే వెళ్ళాడు. అప్పుడు పెద్ద ఎత్తున ఊరంతా పిలిచి, వేడుక చేశారు. సుశీల కూడా తేడాగా ఉంది. తనను తప్పించుకు తిరుగుతోంది. అమ్మ, అక్కలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. వాటిని పట్టించుకోక రెండ్రోజులుండి వచ్చేశాడు.

ఆ తరువాత ఒకటి రెండు సార్లు, పండక్కని, అమ్మ రమ్మని బలవంతం చేస్తే వెళ్ళాడు. అంతే..

ఇంకో ఏడాది పోయాక, పెద్ద బావగారికి ఉద్యోగంలో ప్రమోషన్ మీద హైదరాబాదుకు బదిలీ అయ్యిందని తెలిసి చాలా సంతోషించాడు తను. వాళ్ళు ఉండడానికి, బావ ఆఫీసుకి దగ్గర్లో ఇల్లు, సుశీలకు కాలేజీలో, నరసింహానికి స్కూల్లో సీట్లు చూసిపెట్టాడు. అక్కా వాళ్ళు వచ్చాక ఆదివారాలు అక్కడికి వెడుతూ, కాలక్షేపం చేస్తున్నాడు.

కొన్నాళ్ళు పోయాక, కంపెనీ వాళ్ళు కొత్తగా అప్పజెప్పిన ఒక ప్రాజెక్టుకు, తన టీంలోకి వచ్చింది గీత. చలాకీ మనిషి. తెల్లగా పాలరాతి విగ్రహంలా, ముఖం కళగా, సింపుల్‌గా ఉంటుంది. తను స్వతహాగా తెలివైనది. పనిమంతురాలు. అందర్నీ కలుపుకుపోతూ, అందరితో గలగలా మాట్లాడుతూఉండే మనిషి. ఎంత కష్టమైన పనైనా సులువుగా చేసేస్తుంది. ఎంత రాత్రైనా పూర్తి చేసి మరీ వెడుతుంది. వాళ్ళ ఇల్లు కూడా తనుండే రూముకి దగ్గర్లోనే ఉండడం మూలంగా, ఎప్పుడైనా ఆఫీసులో ఆలస్యం అయితే తను దింపుతుండేవాడు.

అప్పుడే ఆమె గురించి తెలుసుకున్నాడు. తల్లితండ్రులు లేరని, మేనమామ దగ్గరుండి చదువుకుని ఈ స్థితికి వచ్చిందని తెలిసి, ఎంతో మెచ్చుకున్నాడు. స్వతహాగా ఎక్కువగా ఆడపిల్లలతో మాట్లాడని తనకు, గీతతో ఎంతసేపు మాట్లాడినా ఇబ్బంది అనిపించేది కాదు. అలా ఆ ప్రాజెక్టు అయ్యేవరకు ఆమెతో సాగించిన ప్రయాణంలో ఎప్పుడు ఆమె తనకు ఆప్తురాలు అనిపించిందో తనకే తెలియలేదు.

ఓ రోజు గీత తనకు సంబంధాలు చూస్తున్నారని చెప్పగానే తన గుండెలో రాయి పడింది. తనకు ఆమెపై మనస్సుందని అప్పుడే తనకూ అనిపించింది. తన ఇంట్లో కూడా తన పెళ్ళిగురించి తొందర ఎక్కువైంది.

అలాంటప్పుడు ‘గీతను చేసుకుంటే తప్పేమిటి?’ అనుకున్నాడు. ఆ మర్నాడే వెళ్లి, గీతకు తన మనస్సులో మాట చెప్పి, ఆమె అభిప్రాయం అడిగాడు. ఆమె ‘తన మేనమామను అడగాలని, ఆయనొప్పుకుంటే తనకు అభ్యంతరం లేద’ని అన్నది.

అలాగేనని, ఆ ఆదివారం తానే వారింటికి వెళ్ళి, ఆయన్ను అడిగాడు. ఆయన చాలా అభ్యుదయ భావాలు కలవాడు. చాలా మర్యాదగా మాట్లాడాడు. తన వివరాలు అడిగి తెలుసుకుని, అలాగే వాళ్ళ వివరాలు కూడా చెప్పుకొచ్చాడు. ఆయనకి అభ్యంతరం లేదనీ, కానీ, కులాలు వేరు కాబట్టి, తన తల్లితండ్రుల అనుమతి తీసుకొంటే బాగుంటుందని చెప్తే సరేనని వెనుదిరిగాడు.

6.

ముందుగా అక్కయ్యకు చెబ్దామా అనిపించింది. కానీ ఎందుకో చెప్పలేదు. ఎలాగూ వినాయకచవితికి పల్లెకు వెళ్ళాలి కదా, ఏకంగా అమ్మతోనే మాట్లాడదాం అనుకున్నాడు. పెద్దక్కవాళ్ళూ ఇంకోరోజు ఆగి వస్తాం అన్నారు. బావకు సెలవులు తక్కువ వున్నాయట. మిగతా వాళ్ళు ముందే వచ్చేస్తారు.

తను వారం రోజులు సెలవు పెట్టాడు ఇంటికి వెళ్ళడానికి. వారం సెలవు పెడుతున్నందుకు ఆఫీసులో అందరికీ ఏవేవో ప్రశ్నలు, గుసగుసలు. చివరికి తన టీంలో పనిచేస్తున్న శేఖర్ అడిగేసాడు కూడా. “ఏం రమణా, తొందర్లో నువ్వూ, గీతా మాకు పెళ్ళి భోజనం పెట్టబోతున్నట్టున్నారే. అందుకేనా ఈ వారం సెలవు? అహ! ఎప్పుడూ సెలవు పెట్టని నువ్వు ఏకంగా వారం సెలవుపెడితే అనుమానం వచ్చిందిలే” అంటూ. తను నవ్వి ఊరుకున్నాడు.

ఆ మర్నాడే బయలుదేరి ఊరుచేరాడు. ఇంకా పండగ రెండు రోజులుంది. బస్సు దిగి తనొచ్చేసరికి పొద్దున్నే తండ్రి సంధ్యావందనం, పంచాయతనం చేసి వేదపారాయణం మొదలెట్టారు. తను కూడా లోపలికి వెళ్ళి, తల్లిని చూసి, నదిలో స్నానం ముగించుకొచ్చి, సంధ్యవార్చుకుని, కాస్సేపు చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకాలు, వేదమంత్రాలు వల్లె వేశాడు. తండ్రి అది చూసి సంతోషించిన సంగతి తనకు తెలుస్తూనే ఉంది.

ఆ మధ్యాహ్నం కూడా వీలైనంత సేపు తల్లితో గడిపాడు. ఇదివరకులా ముళ్ల మీదున్నట్టు కాకుండా, సంతోషంగా ఉన్నందుకు తల్లి కూడా చాలా సంతోషించింది. ఈ సంతోషం శాశ్వతం కావాలని కోరుకుంది.

భోజనాలు అయ్యాక విశ్రాంతి తీసుకోబోతూ, “ఏరా! ఎంచక్కా నువ్వూ పెళ్ళి చేసుకోకూడదూ ఎన్నాళ్ళిలా చేతులు కాల్చుకుంటావు? నీ తోటి పిల్లలందరూ పెళ్ళిళ్ళై పిల్లల్నికూడా కంటున్నారు!” అన్నది.

వెతకబోయిన తీగ కాలికడ్డం పడ్డట్టు, తనే ఆ విషయం ఎలా మాట్లాడడమా అని చూస్తుంటే తల్లే తానుగా మాట్లాడడం భలే బాగుంది అతనికి. “నేనెప్పుడు కాదన్నానమ్మా!” అన్నాడు తను చిరునవ్వు నవ్వుతూ.

ఆమె ఆశ్చర్యంగా తన వంక చూసి, చాలా సంతోషపడి, “అవునా! మరి చెప్పవేం, అయితే అన్నపూర్ణకు చెప్పేస్తాను. సుశీలకు నీకు ముడి పెట్టేయ్యమని. నాన్నగారితో ఈ శ్రావణంలోనే ముహూర్తం పెట్టించమంటే సరిపోతుంది” అన్నది.

ఆ మాట విని ఉలిక్కి పడ్డాడు తను. ‘తనకు సుశీలకా! ఛీ! అలా ఎలా తోచింది వీళ్ళకు? అది తన అక్క కూతురు. తనకూ కూతురంటిదే, చిన్నప్పటినుంచీ తన చేతిలో పెరిగిన పిల్ల. అలాంటిది తనకూ ఆమెకూ పెళ్ళి చేయాలనుకోవడం ఏమిటి?’ అని ఆశ్చర్యం కలిగింది. కల్లో కూడా అనుకోలేదు తను. ఆ మాటే చెప్పాడు తల్లితో.

“అదేమిట్రా! అది పుట్టినప్పుడే నీ పెళ్ళాం అనుకున్నాంగా! ఇప్పుడిలా అనడం ఏం బాగుంటుంది? సుశీల కూడా నీ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. అక్క, బావ కూడా ఎప్పుడో మీ నాన్నతో మాట్లాడి నిశ్చయించేశారు. ఇప్పుడు కాదంటే ఎట్టా?” అంది తల్లి.

“అది కాదమ్మా! చిన్న పిల్ల అది, ఇంకా చదువుకుంటోంది. అదీ కాక నా చేతిలో పెరిగిన పిల్ల. దాన్నెలా చేసుకుంటానని అనుకున్నారు? అక్కకి , బావకు నేను చెప్తానులే కావాలంటే!” అన్నాడు తను.

పక్కన వసారాలో పడుకున్న తండ్రికి ఇదంతా వినబడింది. లోపలికొచ్చి, “ఏవిట్రా గొడవ? నీకు పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదా లేక సుశీలను చేసుకోవడం ఇష్టం లేదా?” అన్నారు.

“అది కాదు నాన్నా, నాకు సుశీలను చేసుకోవడం ఇష్టం లేదు, అన్నాడు తను.

“కానీ.. రేపక్కావాళ్ళు వస్తారుకదా, అందరం కూర్చుని మాట్లాడుకుందాం. ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు నిర్ణయించుకోవడం కాదు. ఇప్పుడు దాని మనస్సులో ఏముందో కూడా తెలుసుకోవాలి కదా, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. దానికి కూడా అలాగే అనిపిస్తే ఇంకేం చేస్తాం. మా రోజులు కావు కదా, పెద్దవాళ్ళు చెప్పడం చిన్నవాళ్ళు వినడం అనుకోవడానికి” అన్నారు తండ్రి. ఆ చెప్పడంలో ఉన్న వ్యంగ్యం అర్థం కాకపోలేదు తనకు.

మర్నాడు అక్కలందరూ వాళ్ళ పిల్లలు, భర్తలతో వచ్చారు. ఉభయకుశలోపరులు, అవీ అయ్యాక స్నానాలు, భోజనాలు ముగించి మర్నాటి పండుగకు సన్నాహాలు చేస్తున్నారు అక్కలు. అందరూ పనుల్లో నిమగ్నమై ఉండటంవల్ల తన పెళ్ళిమాటలు రాలేదు.

మర్నాడు పొద్దున్నే గణపతి హోమంతో పాటు గణపతి పూజ బ్రహ్మాండంగా సాగింది. ఇంట్లో వేగంగా పూజ ముగించి తండ్రి గుడికి, పాఠశాలకు వెళ్ళి, అక్కడ పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ రోజంతా అందరూ పండగ సంబరాల్లో మునిగి పోయారు. మర్నాడు పొద్దున్నే మళ్ళీ యథావిధిగా పునః పూజ చేసి గణపతి నిమజ్జనం చేశారు. ఆరోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నాన్న అందరినీ సమావేశ పరచి తన పెళ్ళి గురించి ప్రస్తావించారు.

“వాడి చదువు నా ఇష్టప్రకారం సాగలేదు, వాడి జీవితం నేననుకున్నట్లు నడవడం లేదు. నేనే ఆశలు పెట్టుకుకన్నానో వాటిల్లో ఏ ఒక్కటీ వీడివల్ల నెరవేరలేదు. కానీ, ఏం చేస్తాను? నేనంతే పెట్టి పుట్టానని సరిపెట్టుకున్నాను కానీ, ఇప్పుడు వాడి పెళ్ళి కూడా వాడిష్టం అంటున్నాడు. సుశీల పుట్టినప్పుడే వాడికోసం పుట్టిందనుకున్నాం, ఇప్పుడు వాడు కాదంటున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులందరి ముందు మాట్లాడి తీర్మానిద్దామని మిమ్మల్ని పిలిచాను” అన్నారాయన. అందరూ తన వంకే గుచ్చి గుచ్చి చూస్తుంటే తానేదో తప్పు చేసినవాడిని చూస్తున్నట్లనిపించింది.

‘తానేం తప్పు చేశాడని? చదువుకోవడం తప్పా? ఉద్యోగం చెయ్యడం తప్పా? బావలందరూ అదే పన్లు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలూ అదే చదువులు చదువుతున్నారు. ఇవ్వాళేమిటో తన వంక ఒక ముద్దాయిని చూసినట్లు చూస్తున్నారు అందరూ!’ తనకూ కోపం వచ్చింది.

“ఏరా, నువ్వేం మాట్లాడవేం? నాన్న అంటున్నదానికి నీ సమాధానం ఏమిటి? ఇప్పుడు సుశీలను చేసుకోవడానికి నీ అభ్యంతరం ఏమిటి?” అడిగింది శారదక్క.

“బావమరిదిగారికి కట్నం కావాలి కాబోలును. దానికి తక్కువేం చెయ్యమని చెప్పమ్మా” అన్నారు పెద్ద బావగారు నవ్వుతూ.

“మీరిచ్చినా మేం పుచ్చుకుంటావటయ్యా, వాడి బాధ అది కాదు. అది వాడెదట పుట్టిన పిల్లట. అందువల్ల దానిమీద నాకట్లాంటి అభిప్రాయం లేదంటున్నాడు వాడు.” అన్నది అమ్మ. అది వినగానే పెద్దక్క, సుశీల, బావగార్ల మొహాలు చాలా గంభీరంగా మారిపోయాయి.

“ఏవిట్రా ఈ గొడవ? ఎప్పట్నుంచో అనుకున్న సంబంధం కాదనడానికి ఏం దొబ్బిడాయి నీకు?” లక్ష్మక్క కాస్త దబాయించి అడిగింది. తను తల్లికి చెప్పిందే మళ్ళీ చెప్పాడు. “చూస్తుంటే వీడి వరస వేరే విధంగా తోస్తోందమ్మా! కొంపదీసి హైదరాబాద్లో ఎవర్నో తగుల్కోలేదు కదా!” కాస్త దురుసుగానే అంది లక్ష్మక్క.

“ఛ ఛ! ఏం మాటలే అవి?” అన్నది పెద్దక్క.

“లేకపోతే మనం ఎప్పట్నుంచో అనుకుంటుంటే ఇవ్వాళ్ళ కళ్ళు తెరిచాడా వీడు? ఇప్పుడు చేసుకోను పొమ్మంటాడు. దాన్ని చేసుకోవడం ఇష్టం లేకపోతే వేరెవర్ని చేసుకుంటాడు? ఆమాట ఏదీ ఏడవడేం? అక్కడ ఎవ్వరూ లేకపోతే చెప్పొచ్చుగా!” అన్నది శారదక్క.

“అక్కడ మేం కూడా ఉంటున్నాం కదే, అలాంటిదేమైనా ఉంటే ముందు నాకే చెప్తాడు వాడు.” అన్నది పెద్దక్క.

అప్పుడనిపించింది ‘అక్కకు ముందే చెప్పకుండా ఎంత పెద్ద తప్పు చేసానా!’ అని తనకు. పాపం అక్క ఎంత నమ్మకం పెట్టుకుంది తనమీద, దాన్నినిలుపుకోలేకపోయానని బాధ వేసింది. ‘కనీసం అక్కతో చెప్పి ముందుగా గీతను కూడా అక్కకు చూపిస్తే బాగుండేది.’ అనిపించింది.

“ఏరా, అలా ముంగల్లె కూర్చోకపోతే అస్సలు విషయం ఏంటో చెప్పి ఏడు!” అన్నది లక్ష్మక్క.

‘ఎందుకో వీళ్ళిద్దరికీ నా మీద అంత కోపం, మొదట్నుంచీ అంతే, కాస్తో కూస్తో పెద్దక్కే తనను ఎప్పుడూ ఓ కాపు కాచేది. ఇప్పుడు ఆ ఆసరా కూడా కోల్పోయాడు తను. ఇహ తప్పదు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం, తప్పని సరి పరిస్థితి’ అనుకున్నాడు తను.

ఒక్కసారి గొంతు సవరించుకుని, “నేను మా ఆఫీసులో పని చేసే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనను తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాను. మీతో చెప్పి మీ అంగీకారం కూడా పొంది, మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను”, పాఠం అప్పజెప్పినట్లు చెప్పేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తను. అందరికీ ఒకేసారి పెద్ద ఆఘాతమే కలిగింది. అమ్మ లబోదిబోమంటూ మొదలెట్టింది. పెద్దక్క, సుశీల కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మిగిలిన ఇద్దరక్కలు, బావలు తన వంక కొరకొరా చూసారు. తండ్రి ఇంకేమీ మాట్లాడలేదు. శూన్యంలోకి చూస్తున్నారు. లక్ష్మక్క, “ఆ పిల్ల మన వాళ్ళేనా, ఏ గోత్రం? ఏ శాఖ? ఎటువైపు వాళ్ళు?” అని ఆరాతీసింది.

“లేదక్కా, మన వాళ్ళు కారు. మహారాష్ట్రకు చెందినవారు. మన కులం కాదు. కానీ, ఇష్టపడ్డప్పుడు ఇవన్నీ చూసి ఇష్టపడరు కదా, ఆ పిల్ల మంచిది. పెద్దలంటే గౌరవం ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన పిల్ల. తనకు తల్లీ తండ్రి లేరు. హైదరాబాద్లో మేనమామ దగ్గర పెరిగింది. తల్లీ తండ్రి లేరు కాబట్టి అమ్మనూ నాన్ననూ జాగ్రత్తగా చూసుకుంటుంది. తనకు తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, కాబట్టి మిమ్మల్నందర్ని తన తోబుట్టువులుగానే చూస్తుంది. కుటుంబం విలువలు, కుటుంబసభ్యుల మధ్య మమకారాల విలువ తెలిసిన పిల్ల, చదువుకుంది, తెలివితేటలు గల పిల్ల, ధైర్యస్థురాలు. ఇంకేం కావాలి?” అన్నాడు తను. జీవితానికి అందునా తన జీవితానికి అవి సరిపోతాయేమో కానీ, ఇంట్లో వాళ్ళకు కావల్సింది అది కాదని అప్పుడు తెలుసుకోలేక పోయాడు.

తల్లి ఇంకా పెద్ద ఎత్తున పెడబొబ్బలు పెట్టింది. సుశీల ఇంకా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే ఉంది. పెద్దక్క తప్ప మిగిలిన అక్కలు, బావలు తనను దుమ్మెత్తి పోశారు.

‘ఇంతటి దరిద్రం ఎక్కడన్నా ఉందా? ఆ టక్కులాడి చూసి చూసి, కావాలనే నిన్ను బుట్టలో వేసింది. లేకపోతే ప్రపంచంలో ఇంత మంది ఉంటే, అది నీ వెనుకే ఎందుకు పడింది? పైగా దాన్ని ఇంతటిది అంతటిది అని పొగుడుతున్నావు కూడానా సిగ్గులేకుండా’ అని అందరూ గీత గురించి ఏమేమో అసహ్యంగా మాట్లాడుతుంటే తను సహించలేకపోయాడు.

“ఏదైనా అంటే నన్ననండి. అంతే కానీ మధ్యన ఆ పిల్లేం చేసింది? అస్సలు నేనే ముందు పెళ్ళి గురించి ప్రస్తావించాను ఆ అమ్మాయితో. అంతేకానీ ఆ పిల్లకు ఏమీ తెలీదు. అప్పటికీ, పెద్దవాళ్ళకు ఇష్టం లేకుండా మనం పెళ్ళి చేసుకోకూడదని కూడా చెప్పింది. అందుకనే మిమ్మల్ని అడిగి, ఒప్పించి చేసుకుంటానని మాట ఇచ్చి, మరీ వచ్చాను. తెలుసా!” అన్నాడు తను. అంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడని తండ్రి అప్పుడు నోరు విప్పాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version