Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లె పిలిచింది-4

[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]

[విమానంలో ఇండియాకి వస్తూ గతం తలచుకుంటూంటాడు రమణ. పెద్దక్క పెళ్ళి తర్వాత మూడేళ్ళ తేడాలో మిగతా ఇద్దరికి అక్కలకి పెళ్ళిళ్ళవుతాయి. వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. పెద్దక్కకి తొలిసంతానంగా పుట్టిన సుశీల రమణకంటే ఎనిమిదేళ్ళు చిన్నది. వాళ్ళందరి పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ చూసింది నానమ్మ. ఇంజనీరింగ్‌లో సీటు తెచ్చుకున్న రమణకి తండ్రిని ఎలా ఒప్పించాలో అర్థం కాదు. తనని సమర్థించే నానమ్మ చనిపోవడం అతనికి మరో ఇబ్బంది అవుతుంది. ఇంజనీరింగ్ విషయం తండ్రికి చెప్పడం, ఆయన వద్దనడం, పెద్ద బావ జోక్యం చేసుకుని ఒప్పించడం జరుగుతుంది. నాలుగేళ్ళు గడిచిపోతాయి. మంచి మార్కులు తెచ్చుకుని చదువు పూర్తి చేస్తాడు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతాడు. మధ్యలో ఒకటిరెండు సార్లు ఇంటికి వెళ్ళొస్తాడు. తన ఎదురుపడినప్పుడల్లా సుశీల సిగ్గుతో తప్పుకోడం అతనికి నచ్చదు. కొన్నాళ్ళు పోయాకా, వాళ్ళ ప్రాజెక్టులోకి కొత్తగా వచ్చిన గీత అనే అమ్మాయితో చనువు పెరుగుతుంది. ఆమెను పెళ్ళిచేసుకుందామని నిర్ణయించుకుంటాడు. వినాయక చవితి పండుగకి కలిసొచ్చేలా వారం రోజులు సెలవు పెట్టి ఊరెళ్తాడు. పండుగ రోజున, గీతని పెళ్ళి చేసుకుందామన్న తన ఆలోచన చెప్తాడు. ఇంట్లో పెద్ద గొడవవుతుంది.. ఇక చదవండి.]

7.

“ఒరేయ్! నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు. ఎప్పుడైతే నా మాట మీరి నువ్వా విదేశీ చదువుల దారి పట్టావో, అప్పుడే నీమీద నా ఆశలన్నింటికి తిలోదకాలిచ్చేశాను. అప్పుడే నిన్నొదిలేశాన్రా. ఇప్పుడస్సలు నువ్వు నాకు పుట్టనేలేదనుకుంటాను. అన్నీ నీ ఇష్టమే అనుకున్నప్పుడు ఇంకా ఇప్పుడు మాకు చెప్పి ఏడవడం దేనికట? ఏకంగా పెళ్ళే చేసుకుని తగలడకపోయావా మేవెలాగూ నీ జాబితాలో లేం. ఇంకా ఏదో మాకు పెద్దరికం అంటగడుతున్నట్టు ఆ వెధవ్వేషాలు దేనికి? మన కులం, గోత్రం, సంస్కారం అన్నీ మంట గలిపి ఏం ఉద్ధరిద్దామని ఇక్కడికి దయచేసినట్లు? ఫో! ఏ ఏట్టోకి పోతావో, ఏ గంగలో కలుస్తావో కలు, ఇహ నీ మొహం నాకు చూపించకు ఫో!” గట్టిగా ఇల్లదిరిపోయేలా కేకలేశారు నాన్న.

“అదేవిటండీ అలా అంటారు. ఒక్కగానొక్క కొడుకు. ఇంటికి వారసుడు. ఇలా భ్రష్టు పట్టిపోతుంటే ఆపక, వాడ్ని ఇంట్లోంచి పొమ్మంటారేం?” ఏడుస్తూ అడిగింది అమ్మ.

“ఏం చేయమంటావే, అలాంటి పుత్ర రత్నాన్ని కన్నావు మరి. మన ఇంటి పరువుని, మర్యాదను, వంశాన్ని, కుల గౌరవాన్ని మంటకలిపి ఎవరినో పెళ్ళి చేసుకుంటానని చెప్పడానికొచ్చాడు. వాడు వధువులో చూసిన లక్షణాలు ఏకరువు పెట్టాడు విన్నావుగా! తల్లి తండ్రులు తోబుట్టువులు లేరుట, అందుకని మనల్ని బాగా చూసుకుంటుందిట, మన బిడ్డల్ని తోబుట్టువుల్లా చూసుకుంటుందిట. ఖర్మ కాలి మనమావిడ కనుసన్నల్లో బ్రతకాలి కాబోసు, ఎలాంటి వంశం మనది, ఎలాంటి సంస్కారం! ఇంత పుటక పుట్టి, ఇంత విద్య, హోదా సంపాదించి, నేను వాడ్ని కట్టడి చెయ్యగలిగానా? వాడి బుద్ధి మార్చగలిగానా? ఎందుకు పనికొచ్చాయి నాకివన్నీ? ఆఖరుకి ఇలా వర్ణసంకరం చెయ్యడానికి తయారయ్యాడు. అన్నీ వాడే నిర్ణయించేసుకుని వచ్చాడు. అది కూడా ఆ పిల్ల ‘పెద్దవాళ్ళ అనుమతి కావాలని’ అడగబట్టి వచ్చాడు కానీ లేకపోతే ఈ ప్రబుద్ధుడు ఏకంగా పెళ్ళి చేసుకునే వచ్చేవాడేమో, వాడు మన అభీష్టం తెలుసుకోడానికి రాలేదు. మన అంగీకారాన్ని పొంది వెళ్ళడానికి వచ్చాట్ట. విన్నావుగా, అంటే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా వాడన్న దానికి డూడూబసవన్న లా తలూపి సరేననాలన్నమాట. దరిద్రం.. దరిద్రవాని.. పోనీ, వాడి ఖర్మ ఎలా వుంటే అలా తయారవుతాడు. మన చేతుల్లో ఏముంది కనుక! పిల్లల్ని కంటాం కానీ, వాళ్ళ రాతల్ని కాదు కదా!” అన్నారాయన బాధ పడుతూ. గట్టిగా అరుస్తూ చెప్తున్నా, ఆ గొంతు వెనక బాధ, గద్గదమయిన ఆ స్వరంలోనూ, ఆయన కన్నుల నుండి వెలువడే కన్నీటిధారలోనూ తెలుస్తూనే ఉంది ఆయన బాధ.

తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఏవిషయమైనా చాలా గంభీరంగా, శాసించి చెప్పే తండ్రినే చూసాడు కానీ, ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకొంటూ బాధపడే తండ్రిని చూడలేదు తను. తనకూ బాధ అనిపించింది. పోనీ అనుకుంటే గీతకిచ్చిన మాట ఏం కాను? ఆ పిల్ల జీవితం ఏం కాను? మరోసారి వాళ్లకు నచ్చజెబ్దాం అనిపించి, మళ్ళీ ఏదో చెప్పబోయాడు తను.

శారదక్క కల్పించుకుని, “ఒక్కగానొక్క నలుసువని గారాబం చేసినందుకు మా అందరికీ చాలా మంచి బహుమతినిచ్చావురా, నాన్నమ్మ చచ్చిపోయి బతికి పోయింది కానీ, ఇప్పుడుండుంటే, ఇప్పుడు, ఈ క్షణం ఉరేసుకుని పోయుండేది. నీ దయవల్ల సరస్వతీ పుత్రుడు, శత, సహస్రావధాని, ఘనాపాటి అని అనిపించుకున్నాయన కన్నీళ్ళు చూసే దౌర్భాగ్యం కలిగింది మాకు. అమ్మ కంటే ఎక్కువగా నిన్నుఅన్ని విధాలా కనురెప్పలా కాపాడిన పెద్దక్కకు, నీకోసమని నాన్నతో మాట్లాడి ఒప్పించి నీ పై చదువులకి తోడ్పడిన పెద్ద బావకూ, మంచి గుణపాఠం చెప్పావు. నీవల్ల మా అందరి జన్మ ధన్యం అయ్యింది నాయనా! మా అందరికీ మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టావు. ఇకనుంచి మేం బయట మొహం చూపించుకోలేని పరిస్థితి తెచ్చిపెట్టావు. ఇంకా మా అందరి ఆక్రోశాలు, అగ్ని జ్వాలలై నిన్ను దహించక మునుపే ఈ ఇల్లు వదిలి ఫో! మళ్ళీ నీ మొహం మాకు చూపించకు.” అన్నది రెండు చేతులూ గట్టిగా చప్పుడు చేసుకుంటూ దణ్ణం పెట్టి మరీ.

తను పెద్దక్క దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పబోయే లోపలే, బావ కల్పించుకుని, “ఒరేయ్, నిన్ను బయట చదువులు చదివించడానికి మామయ్యను ఒప్పించి, నేను చేసిన తప్పుకు బాగా శిక్ష వేశాడురా దేవుడు. ఇంతటి కృతఘ్నుడవనుకోలేదురా. నీకెంత సాయం చేశాం, నేనెంత వెనకేసుకొచ్చాం, అలాంటిది నా కూతుర్ని చేసుకోను పొమ్మంటావా, బయట ఎవర్తినో తగుల్కొని, నా పిల్లను చిన్న పిల్లనీ, చెల్లెలితో సమానమనీ సిండ కబుర్లు చెప్తావా, నాశనమైపోతావురా, నా కూతురు ఉసురు తగలకపోదు నీకు. నువ్వు చేసుకోకపోతే నా పిల్లకు పెళ్ళి కాదనుకుంటున్నావా? సంవత్సరం తిరిగేలోగా రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్ళి చెయ్యకపోతే నా పేరుతో పిలవద్దు నన్ను.” తర్జనీ చూపిస్తూ కేకలేసి, “పదవే పోదాం, ఇంకా ఏం మొహం పెట్టుక్కూర్చున్నావిక్కడ? అయిన సత్కారం చాల్లేదా ఇంకా బయటకు తరిమేదాకా కూర్చుంటావా? పద!” అన్నాడక్కతో.

పెద్దక్క చెంగు నోట్లో కుక్కుకొని ఏడుస్తూ గదిలోకి వెళ్ళి సామాను సంచి తెచ్చింది. అందరూ ఎంత బ్రతిమిలాడినా, ఏమాత్రం రాజీ పడక, తనను ఒక్క తోపు తోసి, పిల్లల్ని, అక్కని తీసుకుని, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అందరూ తనని ఇష్టం వచ్చినట్టు తలో మాటా అని, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయారు. ఇహ మిగిలింది తనూ, తల్లి, తండ్రి.

తల్లి ఏడ్చి ఏడ్చి, చివరకు మెల్లిగా తనదగ్గరకి వచ్చి “నాయనా! ఎన్నో మొక్కులు మొక్కుకుంటే కానీ నువ్వు మాకు పుట్టలేదురా, చివరికి వేంకటేశ్వర స్వామి పుణ్యమా అని పుట్టావు అందుకే ‘వేంకట రమణ’ అని పేరు పెట్టుకున్నారు మీ నాన్న. నడుచుకుంటూ కొండెక్కి నీలాలు అర్పించుకుని మొక్కు తీర్చుకున్నారాయన. ఒక్కగానొక్కడివి, తన తర్వాత, తన వంశాన్ని, పేరును ఉద్ధరిస్తావనుకుంటే, ఇలా చెయ్యడం ఏం బాగుందిరా అబ్బీ! నా మాట విను నాయనా! సుశీల వద్దంటే సరే, వేరెవరినైనా చూసి మీ నాన్న ఘనంగా నీ పెళ్ళి చేస్తారు. మాట వినరా!” అంది.

తనకు ఆవిడకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా కూర్చున్నాడు. రాత్రి భోజనాల సమయంలో అమ్మ అన్నానికి రమ్మని పిలిచింది. తనకు తినబుద్ది కాలేదు. ఈపాటికి అందరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చెయ్యవలసింది. అందరూ ఇంకా రెండు మూడు రోజులు ఉండి సంతోషంగా గడపవలసింది. కానీ, ఇప్పుడు అందరూ కోపంగా వెళ్ళి పోయారు. అంతా తన వల్లనే, తనూ భోజనం వద్దన్నాడు. తండ్రి తల్లి కూడా మెతుకు ముట్టుకునుండరు.

తను పడుకుందామని వెళ్లబోతుంటే గదిలోంచి తండ్రి మాటలు వినబడ్డాయి. “వాణ్ణి రేప్పొద్దున్నే పొమ్మను. మళ్ళీ నా కళ్ళ బడడానికి వీలులేదు. వాడి కంటే ముందు పుట్టినముగ్గురు పిల్లలున్నారు నాకు. ఎవళ్ళని పండగ పూట భోజనం కూడా చెయ్యనివ్వలేదు వాడు. ఇప్పుడే చెప్పు వాడికి. తెల్లారిలేవగానే వాడు నాకంటికి కనిపించడానికి వీల్లేదు” అన్నారు. అమ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, “నువ్వు మరోమాట మాట్లాడావంటే నువ్వు కూడా కొంపలోంచి బయటకు పోవాల్సివస్తుంది జాగ్రత్త! వాడికి వత్తాసు పలకొచ్చావా, సిగ్గులేకుండా” అన్నారు నాన్న. అమ్మ మూగగా రోదించడం తెలుస్తూనే ఉంది తనకు.

తనకూ బాధేసింది. అకారణంగా అందరూ తనని శత్రువును చూసినట్లు చూడడం నచ్చలేదు తనకు. ఏం తప్పు చేశాడని? ఒక మనిషిని ప్రేమించి మోసం చేస్తే తప్పు. కానీ, ప్రేమించి పెళ్ళాడడంలో తప్పేముంది? రోజులు మారుతున్నా ఇంకా ఈ చాదస్తాలేమిటి? ‘పిల్ల మంచిది, ఒక్కసారి చూడండి మొర్రో!’ అంటే వినిపించుకోరేం? కనీసం చూడకుండా ఆమెను తిరస్కరించడం ఏమంత గొప్ప విషయం? పైగా అందరూ తనపై మండి పడుతున్నారు. ఆ రాత్రికే చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు తను. బస్ స్టేషన్‌కి వెళ్ళేసరికి హైద్రాబాద్‌కు వెళ్లే ఆఖరు బస్సు కూడా వెళ్ళిపోయింది. అక్కడే పొద్దున్న వరకు ఉండి, మర్నాటి మొదటి బస్సు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళాక రెండు రోజుల వరకు బాధపడుతూనే ఉన్నాడు. తిండి తినబుద్ధి కానీ, ఆఫీస్‌కి వెళ్ళ బుద్ధి కానీ కాలేదు. నాలుగు రోజులు పోయాక పెద్దక్క వాళ్ళింటికి వెళ్ళాడు తను. ఇంట్లో అక్కా బావా లేరు. సుశీల ఉంది.

“మామయ్యా, ఇప్పుడెందుకొచ్చావ్? నాన్న చూస్తే గొడవౌతుంది. అమ్మ అస్సలే రోజూ ఏడుస్తోంది. మళ్ళీ నువ్వు కనబడితే బాగుండదు. వెళ్ళిపో మామయ్యా మళ్ళీ రాకు ప్లీజ్!” అంది. సుశీల కూడా అయిదారు రోజులకే బాగా చిక్కినట్టు అనిపించింది. ‘పిల్లలు పుట్టిన వెంటనే ముందూ వెనకా ఆలోచించకుండా ఇలాంటి సంబంధాలు కలిపి, వాళ్ళల్లో లేనిపోని ఆశలు కల్పించి, వాళ్ళను ఇబ్బంది పెడతారీ పెద్దవాళ్ళు’ అనిపించింది. చేసేది లేక అక్కడ్నించి తిరిగి వచ్చేశాడు తను. మరో వారం తర్వాత గీతను కలిసి విషయమంతా చెప్పి, ఆమెను, వాళ్ళ వాళ్ళను పెళ్ళికి ఒప్పించాడు. తర్వాత పెళ్ళి శుభలేఖ పుచ్చుకుని పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. అక్కకి బావకు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొందాలనే ఆశతో. అది బహుశా దురాశే కావొచ్చు.

అక్క బాధపడింది, బావ నానా మాటలూ అన్నాడు. చెప్పే మాట వినకుండా, అక్కా సుశీలా అడ్డుపడుతున్నా, వాళ్ళను తోసేసి, తనను బయటకు వెళ్ళగొట్టాడు. ఇంకేం చెయ్యలేక వెనుదిరిగి వచ్చేశాడు తను.

అనుకున్న ప్రకారం గీతను వాళ్ళ మామయ్య ఆధ్వర్యంలో పెళ్ళి చేసుకున్నాడు తను. ప్రస్తుతం తను ఉంటున్న రూంలోనే కాపురం పెట్టారు. గీత నిజంగా ఎంతో మంచిది. తన ఆలోచనలకు అనుగుణంగా, తన జీవితనావకు చుక్కానిగా ఉంటుంది. తను పక్కనుంటే ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. తన బలం, బలగం కూడా గీతే!

తమ ఆచారవ్యవహారాలు తెలుసుకుని మరీ పాటిస్తుంది. తన సంధ్యావందనానికి కానీ, పూజా కార్యక్రమాలకు కానీ ఎటువంటి ఇబ్బందీ చూపక సహకరిస్తుంది. తనను అడుగడుగునా అర్థం చేసుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఇటు ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ తనకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.

ఒకరోజు సాయంత్రం తాము ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటిదగ్గర వాకిట్లో పెద్దక్క వచ్చుంది.

“ఏంటక్కా ఇలా వచ్చావు?” అన్నాడు తను.

అక్క తనని చూసి కావలించుకుని భోరున ఏడ్చి, “ఎంతపని చేసావురా?” అన్నది.

తనేమీ మాట్లాడలేకపోయాడు. గీత అక్కను లోపలికి పిలిచింది. కానీ రాలేదు. గీత చేతిలో పాకెట్ పెట్టి, “వస్తానమ్మా, వాడు జాగ్రత్త!” అని చెప్పి, అలాగే కళ్ళనీళ్ళు పెట్టుకొంటూ వెళ్ళిపోయింది. అంతే.

ఆ పాకెట్లో తనకు గీతకు బట్టలు, ఒక చిన్న గొలుసు ఉంగరం ఉన్నాయి. ఒక కవర్ కూడా ఉంది. అందులో ఒక చిన్న ఉత్తరం ఉంది.

“ప్రియమైన రమణకు, అక్క ఆశీర్వదించి వ్రాయునది.

సుశీల పుట్టినప్పుడే నీకోసం పుట్టిందనుకున్నాము. అదీ కాక ఉన్న ఒక్క ఆడపిల్లను బయట ఇచ్చేకంటే నీకిచ్చి చేస్తే, పిల్ల కళ్ళెదురుగా ఉంటుందని, నువ్వు కూడా నా కళ్లముందు పుట్టిన వాడివని నాకళ్ళెదురుగా నువ్వూ పిల్లా కూడా ఉంటారు, మీ చేతుల్లో మా చివరి దశలు వెళ్ళబుచ్చవచ్చని కోటి ఆశలు పెట్టుకున్నాం. మేం పెట్టుకోవడమే కాక సుశీలకు కూడా ఆశలు కల్పించాం.

ఈ పెళ్ళి చెడడం వల్ల దానికే ఎక్కువ దుఃఖం కలిగిందంటే అతిశయోక్తి లేదు. కానీ, ఏం చేస్తాం? మా కోరిక నెరవేరలేదు. ఈ బట్టలు పెళ్ళికని మీకోసం కొన్నవే, అవి చూసినప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతుంది. అదీ కాక, ఎంత కాదనుకున్నా రక్తసంబంధం ఎక్కడికి పోతుంది? అందుకే నీకోసం సుశీల కోసం కొన్న బంగారం, బట్టలు ఇచ్చిపోదామని వచ్చాను. నువ్వు చేసుకున్న ఏ పిల్లైనా, నా పిల్లే అనుకుంటాను. ఆ బట్టలు గొలుసు మీ ఆవిడకివ్వు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు. మాకంతకంటే ఇంకేం కావాలి. ఉంటాను. ఇట్లు మీ అక్క” అని వ్రాసుంది. అది చదువుకుని కుమిలిపోయాడు తను. గీత ఎంతో ఓదార్చింది తనను.

చాలారోజులు ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక ఆరు నెల్లు చూసాడు తను. ఎప్పుడన్నా పెద్దక్కే ఆఫీసుకి ఫోన్ చేసి తన క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉంటుంది. అప్పుడే తను తల్లి తండ్రుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవాడు. మొదట్లో అక్క చెప్పడం, తల్లి కొన్నాళ్ళు బాధ పడిందట. తండ్రి గుడి, బడి తప్ప వేరే ఎక్కడికి వెళ్ళలేదుట. సమాజానికి ముఖం చాటేశాడట. అది కూడా చిన్నక్కవల్ల తెలిసిందట. ఎందుకంటే బావ అక్కడికి రాకపోకలు మాన్పించాడట. తర్వాత్తర్వాత కూడా అక్కడి విషయాలు ఎప్పుడన్నా అక్కే చెప్తూ ఉండేది.

బావ మళ్ళీ సంవత్సరానికి సుశీల పెళ్ళి చేశాడట. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుట. అయిష్టంగానైనా సుశీల తండ్రి చెప్పిన సంబంధం చేసుకుందట. అప్పుడే మళ్ళీ బావ తమ పుట్టింటికి అక్కను పంపడానికి ఒప్పుకున్నాడట. ఎందుకంటే ఇప్పుడు బావకు తను సుశీలను చేసుకోనందుకే సంతోషం అనిపించిందట. తను కనక సుశీలను చేసుకునుంటే ఇంత గొప్పవారితో సంబంధం తప్పిపోయేదిట. ఏది జరిగినా మన మంచికే అంటుంటాడట బావ ఇప్పుడు.

తను ఎన్ని ప్రయత్నాలు చేసినా, పెద్దక్క తప్ప ఎవ్వరూ తనను క్షమించి ఇంట్లో కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. తనకూ అక్కడ ఉండడానికి ఇబ్బంది అనిపిస్తోంది. అప్పుడే డల్లాస్‌లో ఒక ప్రాజెక్టు వచ్చింది. ఒక మూడేళ్ళ పాటు వెళ్ళాల్సి ఉంటుంది. వెంటనే గీతతో సంప్రదించి ఆ ప్రాజెక్టుకి ఒప్పుకున్నాడు. వెంటనే గీత రాలేదు కానీ, ముందు తను వెళ్ళి, డిపెండింగ్ వీసా తీసుకుని గీతను కూడా తీసుకెళ్దామని ఆలోచన. అమెరికా వెళ్ళడం గురించి పెద్దక్కకు చెప్పాడు.

“ఇంట్లో అందరి మనసులకు దూరమయ్యావు ఇప్పుడు కళ్ళకు దూరమవుతూ మేం అందుకోలేనంత దూరం వెడుతున్నావుట్రా, మళ్ళీ నిన్నెప్పుడు చూస్తామో?” అని బాధ పడింది. ఒకసారి బావ ఊళ్ళో లేనప్పుడు నాకు ఆఫీసుకి ఫోన్ చేసి, ఇంటికి రమ్మంది.

బహుశా ఇంట్లో ఎవ్వరూ లేరల్లే ఉంది. వెళ్తే తనకు భోజనం పెట్టి, అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉండమని జాగ్రత్తలు చెప్పి తనకిష్టమైన స్వీట్ చేసి తినిపించి పంపింది.

ఆ తరువాత పనులన్నీ చక చకా జరిగిపోయాయి. తను వెళ్ళి అమెరికాలో చేరాడు. ఆ తరువాత గీత కూడా వచ్చింది. మొదట్లో తను కూడా ఉద్యోగం చేసింది. మూడేళ్ళ తర్వాత ఇంకా మూడేళ్ళు పొడిగించారు వాళ్ళు. ఆ తరువాత బాబు పుట్టాడు. వాడికి అమ్మా నాన్నా పేర్లు కలిసొచ్చేలా ‘రామకృష్ణ’ అని పేరెట్టుకున్నాడు. ఆ మరు సంవత్సరం ఇంకో కంపెనీకి మారాడు తను. అదక్కడి కంపెనీనే, దాంట్లో పని చేసుకుంటూనే తన ఫ్రెండ్ విలాస్‌తో కలిసి చిన్న స్టార్టప్ మొదలు పెట్టాడు. ఆ తరువాత సంవత్సరం మళ్ళీ పాప పుట్టింది. గీత వాళ్ళమ్మ పేరు ‘జానకి’ అని పెట్టుకుంది.

పిల్ల పుట్టిన ఏడాదికే రమణ తన జాబ్ పూర్తిగా వదిలేసి తన కంపెనీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి, అక్కడే విజయాలు సాధించసాగాడు. గీత ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ మధ్యమధ్యలో రమణకు సాయం చేస్తూ కాలక్షేపం చేస్తోంది.

ఇలా ఉండగానే అక్క మేసేజ్ వచ్చింది. తండ్రి పిలుపు మేరకు ఒక్కసారి కుటుంబంతో సహా వచ్చి వెళ్ళమని, దాంతో సకుటుంబంగా ప్రయాణమైనాడు.

8.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ లగేజ్ తీసుకుని టాక్సీలో ఇంటికి ప్రయాణం అయ్యారందరూ.

అది తెలతెల్లవారుతున్న వేళ. ప్రకృతి, ప్రభాకరుని కరుణారుణ కాంతితో నిద్ర మేల్కొంటున్నవేళ. పొలాలు పచ్చదనాన్ని ధరించి, బంగారుకాంతులలదుకుంటున్న వేళ. ఆ చల్లటి గాలి, ఆ వెచ్చటి కాంతి, ఆ ప్రకృతి అందం ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు రమణ కుటుంబం.

రమణకు అది చిన్నప్పటినుంచీ తెలిసిన వాతావరణమే అయినా, కొత్త సొబగులతో ఆహ్వానం పలుకుతున్న ఆ పల్లెలు, తన బాల్యాన్ని మరింత గుర్తుచేసాయి. ఆ వాతావరణం, ఆ పల్లెటూరి దృశ్యాలు, ఎప్పుడూ ఎరుగని గీత, పిల్లలు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.

ఆ పచ్చటి పొలాలు, ఆ పిల్ల కాలువలు, పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణానది, ఆ నదిలోంచి తొంగిచూస్తూ, పైపైకి పెరుగుతున్న సూర్యుడు, ఆ సూర్యుని బంగారు లేతకిరణాలను ప్రతిబింబిస్తున్న నదీజలాలు, లేత పచ్చికబయళ్లలో మేతకై వస్తున్న గోసమూహాలు, ఆ గోవుల వెనుక వస్తున్న గోపబాలులు, పొలాల్లో పన్లకై నాగలి పట్టి బయలుదేరే రైతులు, ఉదయభానుడి పిలుపుమేరకు మెలకువతెచ్చుకుని దినచర్య మొదలెట్టిన పల్లె.. ఓహ్! ఆపల్లె వాతావరణం అంతా ఒక అనూహ్యమైన సుందర ప్రపంచాన్ని చూపిస్తోంది.

కృష్ణకు దారిపొడుగునా బోలెడు ప్రశ్నలు, ప్రతిదీ తెలుసుకోవాలనే జిజ్ఞాస. ‘అదేమిటి? ఇదేమిటి? ఇదెందుకిలా? అదెందుకలా?’ అని, అన్నిటిగురించీ అడుగుతాడు. వాడికి అన్నీ సావధానంగా, అంతే ఉత్సాహంతో చెప్పుకొస్తున్నాడు రమణ. ఆ ఇద్దర్నీ చూసి, రమణ తనను చేసుకుని ఏం కోల్పోయాడో అర్థం చేసుకుంది గీత. అప్పటికీ అతని ఆచారవ్యవహారాలలో ఎక్కడా రాజీ పడకుండా, అతని పూజా పునస్కారాలకు, లోపం రాకుండా, శుద్ధ బ్రాహ్మణ్యం, మడి పాటించి అతనికి అన్నీ అమర్చి పెట్టేది. అయినా ఎందుకో తనకు అపరాధభావం వెంటాడుతూనే ఉంది.

ఇల్లు చేరేసరికి పూర్తిగా తెల్లవారిపోయింది. ఇంట్లో అక్కలందరూ ఉన్నారు. తండ్రి ప్రొద్దున్నే సంధ్యావందనం ముగించి, వేదపాఠశాలకు వెళ్ళినట్టున్నారు. కనబడలేదు.

పెద్దక్క ఎదురొచ్చి, “రారా నాన్నా! ఇదేనా రావడం! పద! అలా వెళ్ళి సావిట్టో కాళ్ళు కడుక్కు రండి అందరూ” అన్నది ఉత్సాహంగా.

రమణ ఆనందానికి అంతులేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు తన ఇంటికి వచ్చాడు. గబగబా అలవాటు ప్రకారం వెళ్ళినట్టుగానే వెళ్ళి, కాళ్ళు కడుక్కుని వచ్చేశాడు. గీత పిల్లలు మాత్రం ఏం చెయ్యాలో తెలీక అలా నుంచుండిపోయారు. రామకృష్ణ, జానకి మాత్రం తల్లికి చెరోవైపు చేరి ఆవిడ కొంగుచాటున తల్లిని పట్టుకుని దాక్కున్నారు. అన్నపూర్ణ, “పదమ్మా!” అని, “నీ పేరూ..” అన్నది నసుగుతూ గుర్తులేనట్టు. “గీతండి. వీడు మీ మేనల్లుడు రామకృష్ణ, ఇది జానకి.” అన్నది గీత వాళ్ళిద్దర్నీ తన కొంగు చాటునుంచి బయటకు లాగి.

“ఓరి ఓరి! నువ్వు రామకృష్ణవుట్రా! రా! ఇలా రా! రామ్మా బుజ్జితల్లీ! “ అని ఇద్దర్నీ దగ్గరకు తీసుకుంది.

అంతవరకూ వాళ్ళందరూ ఎవరో, తాము ఎక్కడికొచ్చామో, అని బెదురుగా చూస్తున్న పిల్లలు, ఆవిడ చెయ్యి పట్టి లాగి దగ్గరకు తీసుకునే సరికి అప్రయత్నంగానే ఆవిడ కౌగిట్లోకి చేరిపోయారు.

అన్నపూర్ణ జానకిని ఎత్తుకుని, గీతను పిల్లాడ్ని సావిట్లోకి తీసుకెళ్ళింది. పిల్లలు కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చారు. అప్పటికే రమణ వేపపుల్ల నోట్లో వేసుకుని వచ్చాడు. కృష్ణ, “నాన్నా, వాట్స్ దట్ ఇన్ యువర్ మౌత్?” అనడిగాడు. రమణ నవ్వి, “దిస్ ఈజ్ అవర్ టూత్ బ్రష్” అన్నాడు. కృష్ణ, “వాట్” అని తనూ ఒకటి తీసుకుని, నోట్లోపెట్టుకొని కొరికాడు, “యాక్! ఇట్స్ బిటర్” అన్నాడు.

“యా! బట్ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ టీత్. ట్రై ఇట్.” అన్నాడు రమణ. అక్కడ వాళ్ళను చూస్తున్నవాళ్ళంతా నవ్వారు. లోపలికి వచ్చిన గీతకు రమణకు కాఫీ ఇవ్వబోయింది అన్నపూర్ణ.

“లేదక్కా పొద్దున్నే ఎవ్వరం తాగం. నేను స్నానం చేసి సంధ్యావందనం, పంచాయతనం చేస్తాను. తను మడిగట్టుకుని వంట చేసి నైవేద్యం తయారు చేస్తుంది. ఆ తర్వాతే ఏదైనా.” అన్నాడు రమణ.

“హేవిటీ! నిజమే! అక్కడవన్నీ చేస్తావుటోయ్!” పెద్ద బావ అడిగాడు విస్మయంగా, రమణ తలూపాడు.

పెద్దబావ, లక్ష్మక్క శారదక్క, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ‘అబ్బో’ అనుకున్నట్టు చూసుకున్నారు. అన్నపూర్ణ గర్వంగా, తృప్తిగా చూసింది రమణ వంక.

“అయితే స్నానాలు కానీండి, మళ్ళీ తినడానికి ఆలస్యం అవుతుంది” అన్నది అన్నపూర్ణ.

“ఫర్వాలేదక్కా, తొందరేం లేదు.. ఏదీ, అమ్మ కనబడలేదు, నాన్న పాఠశాలకు వెళ్ళారా?” అడిగాడు రమణ.

ఇద్దరక్కలు దూరంగా నుంచున్నారు. వాళ్ళ కళ్ళల్లో తను వచ్చినందుకు ఆనందం కనబడలేదు. శారదక్క ముందుకొచ్చి ఏదో చెప్పబోయింది. పెద్దక్క తనను చేత్తో వారించి, “ముందు నువ్వు స్నానం చేసిరారా, అందర్నీ చూద్దువు గానీ. పిల్లలూ పదండర్రా! గీతా పదమ్మా! నేను స్నానాల గది చూపిస్తాను. స్నానం చేసి రండి. రమణా! ఈ పూటకి సంధ్య వార్చుకో చాలు. పదండి” అని అందర్నీ స్నానానికి తొందర పెట్టింది.

గీతకు ఏదో అనుమానంగా ఉంది. ఇన్నాళ్ళ తర్వాత కలిసిన తమ్ముడిని సాదరంగా ఆహ్వానించలేదు మిగతా ఆడపిల్లలు. బహుశా ఈ కలయిక వాళ్ళకు అయిష్టంగా జరిగిందా? పెద్దావిడ అత్తగారు, మావగారు కనబడ్డం లేదు. అడిగితే ఏదో చెప్పి మాట తప్పించింది పెద్దాడపడుచు.

‘భగవంతుడా! ఏ చెడు వార్తా విననీయకు స్వామీ’ అని మనస్సులోనే దేవుడికి మొక్కుకుంది గీత.

స్నానం చేసి, చక్కటి చీర కట్టుకుని, ముఖాన ఇంత కుంకుమ పెట్టుకుని, తల తువ్వాలుతో పిడప వేసుకుని, దేవుని స్తోత్రాలు, విష్ణు సహస్రనామం చెప్పుకుంటూ, పిల్లలకు స్నానం చేయిస్తున్న గీతను చూసి సంతోషపడింది అన్నపూర్ణ.

అప్పుడే స్నానం ముగించి ఏవో చిన్న చిన్న శ్లోకాలు చెప్తున్నాడు కృష్ణ. వాడ్ని చూస్తే ముచ్చటేసింది అన్నపూర్ణకు.

‘అబ్బో,’ అనుకున్నారు ఇద్దరక్కలు. వాళ్ళకు ఇదంతా పెద్ద ప్రదర్శన అనిపించింది.

రమణ పంచకట్టుకుని సంధ్య వార్చుకున్నాడు.

ఆ తరువాత రమణకు, గీతకు వంటింట్లో నుంచి కాఫీ తెచ్చి ఇచ్చింది అన్నపూర్ణ. రమణ వంటింట్లోకి తొంగి చూసాడు. వంటింట్లో అమ్మ లేదు “అమ్మా గీతా! పిల్లలు పాలు తాగుతారా? లేకపోతే ఉప్మా అవ్వొస్తోంది కాస్సేపట్లో, అందరం తినొచ్చు, అప్పటిదాకా ఉంటారా?” అంది పెద్దక్క.

“ఫర్లేదండి. వాడు ఉండగలడు, పాపకే కాసిని పాలు ఇవ్వండి. రాత్రి కూడా సరిగ్గా తినలేదది” అంది గీత.

మళ్ళీ అన్నపూర్ణ వంటింట్లోకెళ్ళి పాలు తెచ్చి పిల్ల చేతికిచ్చింది. గీత తనూ పట్టుకుని పాలు తాగించింది జానకికి.

“అక్కా, అప్పట్నుంచి అడుగుతున్నాను. అమ్మేది? కనబడటం లేదు. అమ్మా నాన్నా కలిసిఎక్కడికైనా వెళ్ళారా?” అనడిగాడు రమణ.

“ఎక్కడికెడతారురా! ముందు కాఫీ తాగు చూద్దువుగానీ, అమ్మ ఆ చిన్న గదిలో పడుకుంది”, అన్నది.

“అదేమిటి? ఇంత పొద్దెక్కినా ఇంకా అమ్మ లేవకపోవడం ఏమిటి? ఒంట్లో బాలేదా? జ్వరం ఏమైనా వచ్చిందా?” ఆదుర్దాగా లేవబోయాడు రమణ.

“ఒరేయ్, కూర్చోరా, ముందు కాఫీ ముగించు. అమ్మకి కొంచెం నలతగా ఉంది. అందుకే పడుకుంది. చూద్దువుగానీలే” అని భుజం మీద చెయ్యేసి కూర్చోపెట్టేసింది పెద్దక్క. రమణ అయోమయంగా చూస్తూ మళ్ళీ కూర్చున్నచోటే కూలబడ్డాడు.

“ఏవిటక్కా! ఊరికే ఈ ముసుగులో గుద్దులాట, ఉన్న విషయం చెప్పడానికి బాధేవిటీ? ఒరేయ్! అమ్మకు పక్షవాతం వచ్చిందిరా. రెండు నెల్లనుంచీ మంచం మీద తీసుకుంటోంది. మందులు, మర్దనలు, ఫిజియోథెరపీలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఏమీ ప్రయోజనం కలగట్లేదు.” అన్నది లక్ష్మక్క కొంచెం చిరాగ్గా.

“అయ్యో!” అన్నాడు రమణ.

“మరి పట్నం తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించక పోయారా? అక్కడైతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది కదా! ఈ పల్లెటూరిలో ఏం జరుగుతుంది?” అన్నాడు రమణ.

“ఆ, అన్నీ చేశాం. బోలెడు ఖర్చుపెట్టి నాన్న నెలరోజులపాటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మామూలుగా అయితే తగ్గాల్సిన మాటే, కానీ ఆవిడ మనోవ్యాధి తెచ్చుకుంది. దానికి మందేం ఉంటుంది. ప్రాణాలన్ని నీ మీద పెట్టుక్కూర్చుంటే ఎలా తగ్గుతుంది? ముగ్గురం ఎదురుకుండా ఉన్నా, ఆవిడకు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన నువ్వే కావాల్సొచ్చావు మరి, ఏం చేస్తాం?” అన్నది శారదక్క నిష్టూరంగా.

“మరి ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఊరుకున్నారేం అక్కా?” అన్నాడు పెద్దక్కతో బాధపడుతూ రమణ.

“వద్దని వదులుకుపోయింది నువ్వు, మేం పిలవలేదని గొడవ చేస్తావేం? నువ్వేగా పెంట పెంట చేసుకుని, పరాయివాళ్ళకోసం ఇంట్లోవాళ్ళను వదులుకుని పోయింది?” లక్ష్మక్క నిరసిస్తూ అంది.

వెంటనే గీత తలదించుకుంది. తనకోసమే కదా తన వాళ్ళను వదులుకున్నాడు అతను అని. రమణ కూడా అది సమయం కాదని తలొంచుకుని నుంచున్నాడు.

“ఇప్పుడు తలొంచుకోవడం కాదు. ఆ బుద్ధి, ఆ పని చెయ్యకమునుపే ఉండుండాల్సింది.” శారదక్క కేకలేసింది.

“ఉండండే! వాడసలే బాధ పడుతుంటే ఇంకా తూటాల్లాంటి మాటలతో వాడినింకా ఛిద్రం చెయ్యకండి. అమ్మకు ఇలా అవుతుందని వాడేమైనా కలగన్నాడా? పోనీలే నాన్నా! అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు నిన్ను చూస్తేనన్నా కాస్త ఆరోగ్యం మెరుగు పడుతుందేమోనని నాన్నను ఒప్పించి మిమ్మల్ని పిలిపించాము. చూద్దాం, దేవుడు దయ. పదండి, ముందు అందరం ఫలహారం చేసేద్దాం. రాత్రి ఎప్పుడనగా తిన్నారో ఏమో” అన్నది నిట్టూరుస్తూ పెద్దక్క.

“లేదక్కా, ముందర అమ్మతో మాట్లాడి వస్తాను. తర్వాత తిందాం” అన్నాడు రమణ.

“సరే పద, శారదా, అందరికీ ఫలహారం వడ్డించమని పిన్నిగారికి చెప్పు. నేను వాళ్ళను అమ్మకు చూపించి తీసుకువస్తాను” అని చెప్పి, చిన్న గదిలోకి దారి తీసింది.

రమణ, భార్యాపిల్లలను రమ్మని, చిన్న గదిలోకి వెళ్ళాడు.

వెళ్లిన వాడు తల్లిని చూసి అల్లాగే కొయ్యబారిపోయాడు. పచ్చటి పసిమిఛాయతో మెరిసిపోతూ, ముఖాన రూపాయ కాసంత కుంకుమ దిద్దుకుని, తలనిండా కొప్పులో పూలు పెట్టుకుని, చేతులనిండా గాజుల గలగలలతో, కాళ్ళకు కడియాలు, అందెల సవ్వడితో, మహాలక్ష్మిలా ఇంట్లో నడయాడే తన తల్లేనా ఆవిడ అనిపించింది. నిమీలితనేత్రాలతో, శుష్కించిన మేనుతో, జీవచ్ఛవంలా కదలిక లేకుండా, మంచానికి బల్లిలా అతుక్కుపోయి పడున్న, తల్లిని చూస్తే దుఃఖం ఆగలేదు రమణకు. మంచం దగ్గరకు వెళ్ళి, ఆవిడ ముఖం దగ్గరగా ముఖం పెట్టి, “అమ్మా!” అని పిలిచాడు. ఆ పిలుపులో ఆర్ద్రత, పొంగుకొచ్చే దుఃఖం స్పష్టంగా వినిపిస్తోంది.

అర్ధనిమీలిత నేత్రాలతో కొడుకుని చూసింది కృష్ణవేణమ్మ. ఆ తెరుచుకున్న కళ్ళు, కన్న ప్రేమ, వెంటనే కొడుకుని గుర్తుపట్టాయి. కానీ నోటినుంచి మాట రావడం లేదు. కళ్ళు ప్రకాశవంతమైనాయి. కన్నీటిని ఒలికించి తనను గుర్తుపట్టినట్లు తెలియజేసిందావిడ. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే ఆవిడ ముఖం చేతులోకి తీసుకున్నాడు రమణ.

ఆవిడ అలాగే కొడుకుని కళ్ళారా చూసుకుంది.

“రెణ్ణెల్ల క్రితం హఠాత్తుగా ఓ మధ్యాహ్నం ఒళ్ళు విరుచుకు పడిపోయింది. వెంటనే మన ఊరి డాక్టరుకి చూపించారు నాన్న. ఆయన, ‘పక్షవాతం అనిపిస్తోంది. విజయవాడలో పెద్దాసుపత్రికి తీసుకెళ్ళమ’ని చెప్పాడు. అలాగే తీసుకెళ్ళి అడ్మిట్ చేశాం. అక్కడ నయం కాలేదని హైదరాబాద్లో కూడా చూపించాం. అక్కడ నాన్నగారి అభిమానే డాక్టర్. ఆయన దగ్గరుండి చాలా శ్రద్ధగా వైద్యం చేశారు. అక్కడా అవే మందులు వాడారు. కానీ ఫలితం కనిపించలేదు. ఎడం కాలూ చెయ్యి చచ్చుపడ్డాయి. మాట కూడా రావడం లేదు. ఫిజియోథెరఫి కొనసాగించమని చెప్పారు. అమ్మ మనోవ్యాధి ఏదో పెట్టుకున్నారల్లే ఉందని, అందుకే మందులు సరిగ్గా పనిజెయ్యడం లేదని ఆ డాక్టర్ అన్నారు. అందుకే నాన్నకు మనస్కరించక పోయినా మా బలవంతాన మీరిక్కడికి రావడానికి ఒప్పుకున్నారు.” అన్నది అన్నపూర్ణ కళ్ళు తుడుచుకుంటూ.

తల్లి అలాగే కళ్ళు తెరిచి కొడుకుని తేరిపార చూస్తోంది. కుడి చెయ్యి కొంచెంగా ఎత్తి అతని తల నిమిరింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కుదరలేదు. కళ్ళు పక్కకు తిప్పి పిల్లలవైపు చూసింది. వెంటనే రమణ స్పందించి, వాళ్ళను దగ్గరకు పిలిచి, “అమ్మా, వీడు రామకృష్ణ, ఇది జానకి.” అన్నాడు గద్గదమైన గొంతుతో.

ఆవిడ కళ్ళు మెరిసాయి. పిల్లాడిని కుడిచేత్తో దగ్గరకు తీసుకుంది. కృష్ణకు ఏమీ అర్థం కాలేదు. యాంత్రికంగానే ఆవిడ గుండెకు హత్తుకోబడ్డాడు. తర్వాత పిల్లను కోడలిని దగ్గరకు తీసుకుంది. అన్నపూర్ణ కల్పించుకుని, “అమ్మా! పిల్లలు ఇంకా ఫలహారం చెయ్యలేదు. వాళ్ళు తినేసొస్తారు. నువ్వు కాస్సేపు పడుకో, నీక్కూడా జావ పట్టుకొస్తాను.” అన్నది. ఆవిడ కళ్ళార్పి తన సమ్మతిని తెలియజేసింది.

రమణ తనకేం వద్దని అమ్మ దగ్గరే కూర్చుంటానని మిగితావాళ్లను వెళ్ళమని చెప్పాడు. కానీ అన్నపూర్ణ బలవంతం చేసి వాళ్ళను అక్కడ్నుంచి తీసుకెళ్ళింది.

(ఇంకా ఉంది)

Exit mobile version