[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[గీతని పెళ్ళి చేసుకుంటానని అన్నందుకు తండ్రి రమణని ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటాడు. తల్లి అడ్డొస్తే, ఆమెనీ తిడతాడు. శారదక్కా, లక్ష్మక్కా రమణని తిట్టిపోస్తారు. పండగ పూట ఎవరూ భోజనం చేయకుండా వాళ్ళ వాళ్ళ భర్తలతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ రాత్రి పడుకుందామని వెళ్ళబోతుంటే, మర్నాడు ఉదయానికి కల్లా రమణ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని తండ్రి, తల్లికి చెప్తుంటే వింటాడు రమణ. ఆ రాత్రే ఇంట్లోంచి బయటకు వచ్చేసి, రాత్రికి బస్‌స్టాండులో ఉండి, ఉదయం మొదటి బస్సు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. గీత మేనమామకి జరిగినదంతా చెప్పి, గీతని పెళ్ళి చేసుకుంటాడు. గీత – రమణ వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ తెలుసుకుని పాటిస్తుంది. రెండేళ్ళు గడుస్తాయి. పెద్దబావ పంతం పట్టి సుశీల పెళ్ళి చేస్తాడు. కుటుంబంలో ఎవరూ రమణని క్షమించరు. అనుకోకుండా అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో ముందు రమణ, ఆ తర్వాత గీత వెళ్ళిపోతారు. అక్కడే వాళ్ళకి కృష్ణ, జానకి జన్మిస్తారు. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత పెద్దక్క నుంచి మెసేజ్ రావడంతో ఇండియా బయల్దేరి వస్తాడు. విమానం విజయవాడ చేరుతుంది. టాక్సీలో తమ ఊరికి చేరతాడు రమణ, భార్యా పిల్లలతో. ఇంటికి వెళ్ళగానే పెద్దక్క స్వాగతిస్తుంది. మిగతా అక్కలు పట్టించుకోరు. గీత కొడుకునీ కూతురిని పెద్ద వదినకి పరిచయం చేస్తుంది. స్నానాలు చేసి వచ్చి, విష్ణుసహస్రనామాలు చదువుతూ, పిల్లాడితో శ్లోకాలు చెప్పిస్తున్న గీత కేసి శాదర లక్ష్మిలు అనుమానంగానూ, అన్నపూర్ణ అపురూపంగానూ చూస్తారు. రమణ తల్లి గురించి ఆరా తీస్తాడు. పెద్దక్క అన్నపూర్ణ మాట దాటవేస్తుంటే, శారద ఆమెని ఆపి, తల్లికి పక్షవాతం వచ్చిందని, పక్క గదిలో ఉందని కటువుగా చెప్తుంది. మరి వైద్యం చేయించకపోయారా అని రమణ లేవబోతుంటే, శారద, లక్ష్మి నిష్ఠురంగా మాట్లాడుతారు. అవి విని గీత బాధపడుతుంది. శుష్కించిపోయి, జీవచ్ఛవంలా ఉన్న తల్లిని చూస్తే దుఃఖం ఆగదు రమణకు. పక్కన కూర్చుని మెల్లిగా అమ్మా అని పిలుస్తాడు. కృష్ణవేణమ్మ కొడుకుని గుర్తు పడుతుంది. కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. రమణ తన కొడుకూ, కూతుర్ని చూపిస్తాడు. ఫలహారానికి రమ్మంటే, తనకేమీ వద్దని అమ్మ దగ్గరే కూర్చుంటాడు రమణ. ఇక చదవండి.]
9.
బలవంతంగా అందరూ ఏదో తిన్నామనిపించి లేచారు. ఇంతలోకి ఫిజియోథెరఫిస్టు వచ్చాడు. అతను చిన్నవాడు, నిండా పాతికేళ్ళు కూడా లేవు. వస్తూనే కాళ్ళూ కడుక్కుని, పెద్దావిడ ఉన్న గదిలోకి వెళ్లాడు.
“మామ్మగారూ, ఎలా వున్నారు?” అని పలకరించి, అన్నపూర్ణతో, “మామ్మగారు ఏమైనా తిన్నారా?” అనడిగాడు.
“లేదు బాబూ! పొద్దున్నే కాసిని పాలు ఇచ్చాను. ఇదిగో, ఇప్పుడే జావ కాచాను ఇద్దామని.” అన్నది అన్నపూర్ణ.
“అయితే ఏకంగా నా ఎక్సర్సైజెస్ అయిపోయాక ఇద్దురుగానీ, ఇప్పుడొద్దులెండి”, అని కృష్ణవేణమ్మ చేత అన్ని ఎక్సర్సైజెస్ చేయించాడు. ఏదో నూనె రాచి మర్దన చేశాడు. అన్ని అవయవాలు కదిలేట్టుగా చేతులూ కాళ్ళూ తిప్పాడు.
“ఈరోజు మామ్మగారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారే, ఇవ్వాళ్ళ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎక్సర్సైజెస్ అన్నీ చెయ్యడానికి సహకరించారు. రోజూ నొప్పితో మూలిగే వాళ్ళు. ఇలాగే ఉంటే తొందర్లోనే కోలుకుంటారు. అలాగే తిండి కూడా సరిగ్గా తింటే బాగుణ్ణు” అన్నాడు.
“ఇప్పుడు ఆవిడ తొందరగానే కోలుకుంటారులే బాబూ! ఆవిడకు కావాల్సిన వాళ్ళు వచ్చారుగా” వెటకారంగా అన్నది శారద.
“శారదా! ఏవిటే ఆ మాటలు? ఊరుకో” అన్నది పెద్దక్క. అతను తన పని పూర్తి చేసుకుని, అన్నపూర్ణ బలవంతాన పెట్టిన టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు. వంటావిడ వంట చేస్తున్నది. మెల్లిగా గీత అన్నపూర్ణ దగ్గరకు వచ్చి, “వది.. ఏమండీ! నేను రోజూ మడిగట్టుకునే వంట చేస్తాను. మీరొప్పుకుంటే వెళ్లి వంటావిడకు సాయం చేస్తాను” అన్నది.
“ఫర్వాలేదమ్మా! నన్ను వదిన అని పిలవొచ్చు. వంట, ఆవిడ చేస్తోంది కదా! ఇబ్బంది లేదు. పిల్లలకు విడిగా ఏమైనా చెయ్యాలంటే చెప్పు చేయిస్తాను. పిల్లలు మా వంటలు తింటారుగా” అనుమానంగా అడిగింది. గీతకు అర్థం అయ్యింది. తను మాంసాహారం పెడుతుందేమో పిల్లలకు అని ఆవిడ అనుమానం అని.
అంతలోకే లక్ష్మి అటొచ్చి, “మా వంటిల్లు కూడా పావనం కావొద్దూ! ఈవిడ మడిగట్టుకుని మాంసం వండుతుంది కాబోలు. కానీ అక్కా! అమ్మ కోసం అది కూడా కానీ” అన్నది.
“ఏవిటిది లక్ష్మీ! మాట్లాడకుండా వెళ్ళు. నాకు తెలుసు ఏం చెయ్యాలో, ఏం చేయించాలో, అనవసరంగా మాటలు తూలకు, ఫో!” అన్నది పూర్ణ.
గీత కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అన్నపూర్ణ దగ్గరకు వచ్చి, “ఛీ పిచ్చిపిల్లా! ప్రతిదానికీ ఏడుస్తారా ఇలా? కళ్ళు తుడుచుకో చెప్పు, పిల్లలకు ఏం చేయించమంటావో?” అనడిగింది.
“వదినా! మా ఇంట్లో మొదట్నుంచీ మాంసాహారం తినేవాళ్ళం కాదు. మాకు ఆ అలవాట్లు ఏమీ లేవు. మా పిల్లల మీద ఒట్టు. మీ తమ్ముడ్ని చేసుకున్నాక ఆయన ద్వారా తెలుసుకుని, యూట్యూబ్లో చూసి మీ వంటలన్నీ నేర్చుకున్నాను. ఆయన రెండు పూటలా సంధ్యావందనం చేసుకుంటారు. వీలైతే ఇంట్లో ఉన్న రోజున మధ్యాహ్నం కూడా చేసుకుంటారు. పొద్దున్నే పంచాయతనం చేస్తారు. అందుకు నైవేద్యం నేనే మడి కట్టుకుని చేస్తాను. నా పుటుక ఒక్కటీ నేను మార్చుకోలేనిది. మిగతా అంతా నా చేతుల్లో ఉన్నంతమటుకు మార్చుకున్నాను. పిల్లలకూ మీ ఆహారపుటలవాట్లే నేర్పాను” అన్నది గీత కళ్ళు తుడుచుకుంటూ.
ఆమెకు, భర్త మీద బేషరతుగా ఉన్న ప్రేమకు ఆవిడ హృదయం పొంగింది. ఆనందబాష్పాలు రాల్చింది. గీతను దగ్గరకు తీసుకుని, “గీతా! మావాడికి నీవంటి భార్య దొరకడం అదృష్టం. ఈ మాట అందరికీ అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది. బాధపడకు. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. అక్కడ్నుంచి వచ్చినవాళ్ళకు కొన్నాళ్ళు, పగలు నిద్ర, రాత్రిళ్ళు మెలకువ వస్తాయట. వెళ్లి పిల్లలు, మీరు కాస్సేపు పడుకోండి. వాడు వెళ్ళి అమ్మ దగ్గర కూర్చున్నట్టున్నాడు. వాడికీ చెప్తాను. ఆ చిన్న గది మీకోసం సిద్ధం చేయించాను. వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి” అన్నది. గీత తలూపి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది.
మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి పన్నెండయ్యింది. ఆయన వస్తూనే స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి సంధ్య వార్చుకుందుకు కూర్చోగా, మరో పక్క రమణ సంధ్యావందనం చెయ్యడం గమనించాడు. కానీ, గమనించనట్లే, తన సంధ్యావందన కార్యక్రమం ముగించాడు.
అన్నపూర్ణ తండ్రికి ముందుగా భోజనం పెట్టింది. ఆయన వచ్చి కూర్చుని అవపోశన చేశాక నెయ్యి వేసి, “నాన్నా! ఈరోజు అమ్మ కొంచెం మెరుగ్గా ఉందని ఆ ఫిజియోథెరఫిస్ట్ చెప్పాడు. ఆవిడలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇలాగే కొనసాగితే ఆవిడ తొందర్లోనే కోలుకుంటుందని చెప్పారు నాన్నా” అన్నది. ఆయన విని ఊ కొట్టి ఊరుకున్నాడు.
రెండు రోజులు అలాగే సాగింది. మూడోరోజు సాయంత్రం, “నాన్నా, ఇక అందరం ఎవరిళ్లకు వాళ్ళం వెళ్ళిపోతాం. అమ్మకి మరీ బాలేదంటే వచ్చాను. మా ఇంట్లో పిల్లలకు, ఆయనకు ఇబ్బంది అవుతుంది. అంతా అత్తగారి మీద వదిలి వచ్చాను. పెద్దక్క ఉండనే ఉంది, పైగా రావలసిన వాళ్ళు రానే వచ్చారాయే. ఇంకా ఇక్కడ నేనెందుకు?” అన్నది లక్ష్మి. శారదా అదే అంది.
“మేం మాత్రం దేనికి? అక్కడ ఇల్లు వదిలి వచ్చాం. మేంకూడ వెళ్ళడమే మంచిది” అన్నాడు పెద్దల్లుడు.
“అదేంటి బావా! మేం రావడంతోటే, మీరంతా వెళ్ళిపోవడం దేనికి? కాస్త అమ్మకి నిమ్మళించేదాకా ఉండండి” అన్నాడు రమణ.
“మీ అత్తగారికి ఓ మాదిరిగా ఉంటే, నేను మృత్యుంజయ హోమం చేయిద్దామని అనుకున్నానయ్యా ప్రసాదం, మీరిద్దరూ పీటలమీద కూర్చుని చేయిస్తే బాగుంటుంది. ఇన్నాళ్ళున్నారు. నా మాట విని ఇంకో వారం ఉండండి చాలు. ఆ తర్వాత ఆపను. లక్ష్మీ, శారదా! మీ వాళ్ళని కూడా రమ్మనండి. హోమం అయిన తర్వాత వెడుదురు గాని” అన్నారు దశరథ రామయ్య గారు. ఇహ ఇంకెవ్వరూ మాట్లాడలేదు. ఆయన మాట శాసనమే, అందరూ పాటించి తీరుతారు. తండ్రి తీరు చూసి ఆయన ఏమీ మారలేదని అర్థం చేసుకున్నాడు రమణ. వచ్చిన దగ్గర్నుంచి తనతో మాట్లాడనే లేదు. పిల్లల్ని దగ్గరకు తీసుకోలేదు. రమణకు కొంచెం బాధగానే ఉంది. కృష్ణ కూడా అడుగుతున్నాడు ‘తాతయ్య ఎప్పుడూ ఎందుకు సీరియస్ గా ఉంటాడు నాన్నా? మాతో మాట్లాడడం లేదెందుకని?’ అని. ఏం చెప్తాడు తను? ‘లేదు నాన్నా, తాతయ్య తీరే అంత. నువ్వే వెళ్లి మాట్లాడిస్తూ ఉండాలి. ఆయన పెద్దవాడు కదా, చిన్న వాళ్ళు మాట్లాడిస్తే తప్పు లేదు’ అని చెప్పాడు.
ఒకరోజు సాయంత్రం దశరథ రామయ్య ఇంటి తోటలో పొట్ల పాదుకు పందిరి వేస్తుంటే, కృష్ణ అక్కడికొచ్చి నుంచుని, “తాతయ్యా!” అని పిలిచాడు. నిన్నటి దాకా ఆయనెదుట పడడానికి జంకినా, తండ్రి తనను మాట్లాడమనిచెప్పడంతో ధైర్యం చేశాడు. ఆ పిలుపుకి మనస్సు పులకరించి, పిల్లాడివంక చూసి చిరునవ్వు నవ్వాడు. దాంతో ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. వచ్చీ రాని తెలుగులో ఆయన చేస్తున్న పనేమిటనడిగాడు. ఆయన పిల్లాడికి ఇంగ్లీషులో సమాధానం చెప్పాడు. తండ్రిని దాక్కుని గమనిస్తున్న రమణ, తండ్రి ఇంగ్లీష్లో మాట్లాడ్డం చూసి, సంభ్రమాశ్చర్యాలతో వెంటనే వెళ్ళి పెద్దక్కను పిలుచుకొచ్చాడు. రహస్యంగా, “అక్కా చూడు నాన్న నాకొడుకుతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నాన్నలో ఎంత మార్పు వచ్చిందో !” అన్నాడు ఆశ్చర్యపోతూ.
“అవున్రా, నాన్న నేర్చుకోవడం నేను చూసాను. పైకి కనిపించరు కానీ, నీ మీద ఆయనకు వల్లమాలిన ప్రేమాభిమానం, మీ పిల్లలొస్తే మాట్లాడొచ్చని కొద్దిగా నేర్చుకున్నారు” అన్నది. రమణ కంట ఆనందబాష్పాలు రాలాయి. ఆయన కడుపున పుట్టిన తను ఎంతటి భాగ్యవంతుడో అనుకున్నాడు. ఆ తాతామనవలు మాట్లాడుకోవడం కనులారా చూసి లోపలికి వెళ్ళాడు రమణ. అన్నపూర్ణ తండ్రి దగ్గరకు వెళ్ళి కృష్ణతో మాట కలిపింది.
రమణ ఎక్కువగా తల్లితో గడుపుతున్నాడు. తల్లి దగ్గర కూర్చుని, తన చిన్నప్పుడు విషయాలు, తన పిల్లల విషయాలు అన్నీ చెప్తూ ఉంటాడు. ఈరోజు కూడా కృష్ణ తండ్రితో మాట్లాడడం గురించి చెప్పాడు. మధ్యమధ్యలో అమెరికా నుంచి ఫోన్ కాల్స్ అటెండ్ అవుతూ, విలాస్‌తో కంపెనీ వ్యవహారాలు మాట్లాడుతూ రోజులు గడుపుతున్నాడు. ఖాళీ దొరికినప్పుడు కాస్సేపు తండ్రిని గమనించడమూ, పెద్దక్కతో కబుర్లు చెప్పడము, చిన్నక్కలతో మాట కలపడానికి ప్రయత్నించడం చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం వెటకారం తగ్గించుకోవడం లేదు. అదను దొరికినప్పుడల్లా తాను చేసిన పనికి చురకలు వేస్తూనే ఉన్నారు.
ఎటొచ్చీ గీతకే అక్కడ తోచడం లేదు. ఏ పనులు చెయ్యచ్చో, ఏం చేయకూడదో తెలీదు. పొద్దున్నే స్నానం చేసి, తను మాత్రం రోజూ చదువుకునే సహస్రనామాలు చదువుకుంటుంది. తనింట్లో కొంచెం గట్టిగా చదవడమే అలవాటు తనకు, అలాగే చదువుకుంటుంది. చిన్నాడపడుచులిద్దరూ చోద్యం చూసినట్లు చూస్తారు తనవైపు.
ఒకసారి అలా పూజ గది ముందు కూర్చుని చదువుతుంటే మావగారు వచ్చారు. అప్పుడు గొంతు తగ్గించుకుని చదువుకుంది. ఆయన ఒక్కసారి తన వంక తేరిపార చూసి, తల పంకించి, వెళ్ళిపోయారు. దాని భావమేవిటో తనకు తెలియలేదు. ఇంట్లో వాళ్ళను బుట్టలో వెయ్యడానికి తను ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందని చిన్నాడపడుచులు అనుకుంటుండగా తన చెవులబడింది. మనస్సు చివుక్కుమంది. కానీ తను బయలుదేరే ముందే రమణ చెప్పాడు. తనకు అంత సులభంగా ఆ ఇంట్లో చోటు దొరకదని, సమయం పడుతుందనీను. గీత మాత్రం అమ్మవారి మీద భారం వేసి తన కర్తవ్యం తను చేసుకుంటూ పోతోంది.
నాలుగు రోజుల పోయాక తండ్రి మృత్యుంజయ హోమానికి ముహూర్తం పెట్టాడు. కుటుంబసభ్యులందరూ, వేదపండితులూ వచ్చారు. హోమం మొదలయ్యింది. పీటలమీద అన్నపూర్ణను, ప్రసాదును కూర్చోమని అన్నారు దశరథ రామయ్య గారు.
అన్నపూర్ణ మాత్రం రమణ భార్యా కూర్చుంటే బాగుంటుందని తండ్రికి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. తండ్రి మొండి పట్టుపట్టాడు. దాంతో తనూ, భర్తే కూర్చోవాల్సి వచ్చింది. రమణ చిన్నబుచ్చుకుని, యజ్ఞ వేదికకు దూరంగా ఒక పక్కగా కూర్చుని కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ పట్టుబట్టలు కట్టుకున్నారు.
అలాగే గీత చక్కగా పట్టుచీర కాశీపోసి కట్టుకుంది. మెళ్ళో పసుపు పచ్చని నాన్తాడు, నల్లపూసల గొలుసు వేసుకుంది. తల దువ్వుకుని సిగ వేసుకుని, సిగనిండా పూలు పెట్టుకుని, చేతికి గాజులు వేసుకుని, నుదుట తిలకం దిద్ది, దానికింద కొద్దిగా కుంకుమపెట్టుకుంది. అచ్చమైన పదారణాల తెలుగు ఆడపడుచులా ఉంది. చూసిన వారంతా అచ్చం మహాలక్ష్మిలా వుందని అన్నారు. పిల్లకు కూడా పట్టు పరికిణీ కట్టి, కాలికి చిరుమువ్వల గజ్జెలు పెట్టింది. బుట్టబొమ్మలా గజ్జెలు ఘల్లు ఘల్లు మనుకుంటూ నడుస్తుంటే, లక్ష్మి, శారదలక్కూడా ముచ్చటేసింది.
వేదపండితులతో సమానంగా మహా సంకల్పం చెప్పాడు రమణ.
గణపతి హోమం చేసినప్పుడు, వాళ్ళతో పాటు, “ఓం గణానాం త్వా గణపతిం హవామహే.. కవిం కవీనాముపవశ్రవస్తమమ్.. జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నూతిభిస్సీదసాదనం.. ఓం మహా గణపతయే నమః..” అని కంచు కంఠంతో చదవడం చూసాడు దశరథ రామయ్య. తన కొడుకు తను చెప్పిన చదువు ఏమాత్రం మర్చిపోలేదని సంతోషించాడు. “ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం.. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో ర్ముక్షీయ మామృతాత్ స్వాహా..” అని వేదపండితులు చదువుతుండగా, రమణతో పాటు కృష్ణ కూడా వాళ్ళతో వంత పాటలా శ్లోకం చదవడం చూసిన దశరథ రామయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు, అలాగే ఎంతో తృప్తిని సంతోషాన్ని పొందాడు. రమణ కుటుంబం కట్టుబొట్టు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి. తన కూతుళ్ళు కూడా ఉండనంత తీరుగా గీత ఉండడం చూసి ఆనందపడ్డాడాయన.
మృత్యుంజయ హోమం విజయవంతంగా ముగిసింది. చివర్లో పూర్ణాహుతికి ముందు రమణ వెళ్లి తల్లిని మెల్లిగా హోమగుండం దగ్గరకు ఎత్తుకుని తీసుకొచ్చి ఆవిడకు పండితుల చేత ఆశీర్వాదం చేయించాడు. ఆవిడను ఒక కుర్చీలో కూర్చోబెట్టి రెండు చేతులూ మెల్లిగా దగ్గరకు తీసుకొచ్చి దణ్ణం పెట్టించాడు. ఆ తరువాత పూర్ణాహుతి ముగిసింది. వచ్చిన పండితులందరూ రమణను తెగ మెచ్చుకున్నారు. శ్రవణకుమారునికి మల్లె తల్లితండ్రుల సేవ చేస్తున్నాడని అన్నారు. దాంతో లక్ష్మీశారదలకు కోపం వచ్చింది. ‘అస్సలు రోగం వచ్చిందే వాడి వల్ల. ఇవ్వాళ్ళేదో ఆవిడను హోమగుండం దాకా ఎత్తుకు తెచ్చినందుకే మహా పొగిడేస్తున్నారే వాడ్ని’ అన్నది శారద. లక్ష్మీ దానికి వత్తాసు పలికింది.
ఎవరి మెప్పులు, ప్రశంసలకోసం ఆ పని చెయ్యలేదని రమణకు తెలుసు కాబట్టి ఎక్కువ పట్టించుకోలేదు. కానీ గీత మనస్సు చివుక్కుమంది. హోమం అయిన మర్నాడు అక్కలందరూ వెళ్ళిపోవడానికి సిద్ధం అయ్యారు. గీత పెద్ద ఆడపడుచు దగ్గరకు వచ్చి, “వదినా, నాదో చిన్న కోరిక, మేమున్నంత వరకు దయచేసి మీరూ ఉండరూ! మీరూ చూస్తూనే ఉన్నారు కదా ఈ తండ్రి కొడుకుల వ్యవహారం, ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. నేనా వంట, వడ్డనలకు పనికిరానాయే. మరి మావగారి సంగతి ఎలా చెప్పండి? పిన్నిగారు వంట చేసినా, వడ్డన చెయ్యాలన్నా ఎవరన్నా ఒకరు ఉండాలి కదా” అన్నది.
నిజమేననిపించింది అన్నపూర్ణకు. భర్తతో కొన్ని రోజులుండి వస్తానని చెప్పింది. అన్నపూర్ణను పక్కకు పిలిచి, రహస్యంగా “ఏమిటి పూర్ణా ఇది? పాపం వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా మామయ్య వాళ్ళను దూరం పెడుతున్నాడు. మావయ్య వరస నాకేం నచ్చలేదు. మనం లేకుండా ఉంటే చచ్చినట్లు వాళ్ళను ఒప్పుకోవాల్సి వస్తుంది. అలా జరగనీకుండా మధ్యలో నువ్వెందుకు చెప్పు?” అన్నాడు ప్రసాదు.
“మీరు చెప్పింది నిజమేననుకోండి. కానీ మా నాన్న సంగతి మీకు తెలుసుగా, విశ్వామిత్రుడికెక్కువ, దుర్వాసుడికి తక్కువానూ, కోపం, పట్టుదల రెండూ ఎక్కువే, గీత వడ్డించాల్సొస్తుందని అన్నం తినడం మానేసినా మానేస్తారు. పోనీలేండి. కొన్నాళ్ళు, కనీసం వాళ్ళు తిరిగి వెళ్ళేదాకానైనా ఉండొస్తాను. అప్పటికి అమ్మకు కూడా కాస్త నిమ్మళించొచ్చు” అన్నది అన్నపూర్ణ. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసాదు తానొక్కడే వెళ్ళిపోయాడు.
10.
రామకృష్ణ ఎక్కువగా తాతగారితో తిరుగుతున్నాడు. పొద్దున్న ఆయన లేచేసరికి తన పనులు కానిచ్చి, తయారై కూర్చుంటాడు. తాతగారితో పాటు వేద పాఠశాలకు వెడతాడు. అక్కడ పిల్లలతో పాటు తనూ వల్లె వేస్తూ, వేదం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయన దగ్గర తెలుగు నేర్చుకుని, మాట్లాడుతున్నాడు ఈ మధ్య.
కృష్ణ చూపించే ఆసక్తిని చూసి మళ్ళీ కొత్త ఆశ పుట్టుకొచ్చిందాయనకి. కానీ, తన స్వంత కొడుకు విషయంలో దెబ్బతిన్న విషయం గుర్తుకొచ్చి, మళ్ళీ నిర్లిప్త భావన చోటు చేసుకుంది. మనవడిని దగ్గరకు తీయడానికి కూడా, మళ్ళీ కొన్నాళ్ళకు తిరిగి వెళ్ళిపోతారుకదానని సంకోచంగా ఉంటుంది.
ఒకరోజు ఇలాగే వేదపాఠశాలలో అందరి పిల్లలతో పాటు కృష్ణకు కూడా నేర్పుతూ అంతా అయ్యాక ఏవో ఆలోచనలతో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు దశరథ రామయ్య. కృష్ణ ఆయన దగ్గరకు వచ్చి, “తాతయ్యా, ఏం చేస్తున్నారు? నిద్రొస్తొందా?” అని అడిగాడు.
“లేదు నాన్నా, ఏదో ఆలోచిస్తున్నాను” అన్నాడు పెద్దాయన.
“ఏమాలోచిస్తున్నారు?” అడిగాడు కృష్ణ.
“ఏం లేదు. రోజూ నాతోపాటు వచ్చి ఇవన్నీ నేర్చుకుంటున్నావు. మరి ఇవన్నీ పూర్తిగా నేర్చుకోకుండానే, మళ్ళీ మీ అమ్మా నాన్నతో వెళ్ళిపోతావు కదా, అని” అన్నాడాయన.
“ఏం వెళ్ళను. అంతగా కావాలంటే నాన్న, అమ్మా, జాను వెడతారు. నేను మాత్రం ఇక్కడే మీ దగ్గరే ఉండి అన్నీ నేర్చుకుని మీకు మల్లేనే పెద్ద వేదపండితుడ్ని అవుతా” అన్నాడు.
పిల్లాడు ముద్దు ముద్దుగా అంటుంటే, ఆ మాట ఎంతో మధురంగా తోచింది దశరథరామయ్యకు. వెంటనే మనవడిని అక్కున చేర్చుకుని, “మా నాయనే, ఎంత మాటన్నావురా, నీ మాటలతోనే కడుపు నిండేట్లుంది నాకు” అన్నాడాయన. పిల్లాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అలాగే తీసుకుని ఇంటికి బయలుదేరాడు. పిల్లాడిని ఎత్తుకుని తీసుకువస్తున్న తండ్రిని దూరం నుంచే చూసి సంతోషించాడు. గీతను, పెద్దక్కను పిలిచి చూపించాడు.
“నాన్న వాడిని కరుణించారు. నన్నేక్షమించడం లేదు” అని వాపోయాడు రమణ.
“లేదులేరా, నాన్న సంగతి తెలిసిందే కదా, ఓపిక పట్టు. నీ మీద కోపం కూడా ఎప్పటికోప్పటికి తగ్గక పోదు” అన్నది అన్నపూర్ణ.
తండ్రి ఇంటికొచ్చి, పిల్లాడిని దింపి, వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని, మధ్యాహ్నం సంధ్య వార్చుకుని, గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఫిసియోథెరపిస్ట్ కృష్ణవేణమ్మ చేత వ్యాయామం చేయిస్తున్నాడు.
“ఏమయ్యా, ఎలావుందావిడకు?” అనడిగాడు దశరథ రామయ్య.
“మామ్మగారు కోలుకుంటున్నారండి. చెయ్యి కొద్దిగా స్వాధీనంలోకి వస్తోంది. కొంచెంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రేపటినుంచి, ఆవిడ చేత మాటలు చెప్పించడానికి కూడా ఒకాయన వస్తారు. ఇప్పటికే మెల్లి మెల్లిగా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు కూర్చుని మాట్లాడించే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు ఇంకా బాగా మాట్లాడతారు. ఇవ్వాళ్టికి అయ్యింది. వస్తానండి” అని చెప్పి వెళ్లబోతుంటే, అన్నపూర్ణ లోపలికి వచ్చి, “ఆ పని మా తమ్ముడు చేస్తున్నాడయ్యా, అమ్మ దగ్గరే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు. మీ చలవ వల్ల ఆవిడ మళ్ళీ మనిషయితే ఇంకేం కావాలి?” అన్నది.
“ఇందులో నా చలవేముంది పిన్నిగారూ, అంతా వాళ్ళబ్బాయి కుటుంబం మహిమే, ఆరోగ్యం మెరుగు పడడానికి మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి కదండీ, అది మీ తమ్ముడుగారు తీసుకొచ్చారు మరి, ఏదైనా మామ్మగారు ఆరోగ్యం మెరుగు పరచుకుని, కొడుకుతో మనవడు మనవరాలితో మాట్లాడాలని, కాలక్షేపం చెయ్యాలని ఉబలాట పడబట్టే, ఇంత తొందరగా ఇంప్రూవ్‌మెంట్ కనబడుతోంది” అన్నాడతను.
దశరథరామయ్య విని ఊరుకున్నాడు. అన్నపూర్ణ తల్లికి జావ పట్టుకొచ్చి తాగించి ఆ చేత్తోనే ఫీసియోథెరపిస్ట్ అబ్బాయికి కూడా కాస్త ఫలహారం పట్టుకొచ్చింది. “పిన్నిగారూ, రోజూ మీ ఇంట్లో ఇలా ఫలహారం చేస్తుంటే నాకు అదే అలవాటైపోతుంది. మామ్మగారికి నయం అయ్యాక మళ్ళీ మీ ఇంటికి రావడానికి, ఇలా తినడానికి ఉండదు. అప్పుడేం చెయ్యాలో మరి” అన్నాడు నవ్వుతూ.
“చాల్లే ఊరుకోవయ్యా, అమ్మకు నయం అవ్వాలేకానీ, నీ ఫలహారానికి లోటేమొచ్చే, కావాలంటే రోజూ మీ ఇంటికే పంపిస్తానులే” అన్నది అన్నపూర్ణ. ఇద్దరూ నవ్వారు.
రమణ వాళ్లొచ్చి అప్పుడే నెల రోజులు దాటింది. రమణ రిటర్న్ టికెట్ తీసుకోలేదు. ఇక్కడినుంచే పని చేస్తుండడం వల్ల తన ఆఫీస్ పనికి పెద్ద సమస్యేమీ కాలేదు. తల్లి కనీసం తనతో ఒక్క మాటన్నా మాట్లాడితే అప్పుడు వెడదాం అని చూస్తున్నాడు రమణ.
రమణ వచ్చిన దగ్గర్నుంచి తల్లిని కనిపెట్టుకుని కూర్చోవడం, ఆవిడతో మాట్లాడడం, లేదా ఆఫీస్ పని చూసుకోవడం సరిపోతోంది అక్కడ తన స్నేహితుల్నిఅందర్నీ ఒకసారి చూసి వాళ్ల గురించి కనుక్కురావాలి అనుకున్నాడు. ఆరోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక, తండ్రి పడుకున్నాక, కృష్ణను వెంటబెట్టుకుని బయటకు వెళ్లాడు రమణ. ముందుగా కృష్ణకు తను చదువుకున్న స్కూల్ చూపించాడు. అప్పటి విషయాలు చెప్తుంటే కృష్ణ ఎంతో సంబరంగా వింటున్నాడు. ఆ తరువాత మాష్టారుగారి గురించి వాకబు చేస్తే, వాళ్ళూరొదిలి పట్నంలో స్థిరపడ్డారని తెలిసి వారబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుని, అక్కడ్నుంచి జమీందారుగారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ లోపల ప్రాకారంలో అడుగుబెట్టగానే చాలా బాధ అనిపించింది. తన చిన్నతనంలో పచ్చదనంతో కళకళలాడుతూఉండే తోట లేదు. ఇల్లంతా పాడుపడినట్టుంది. లోపలివైపుకి వెళ్లి అక్కడ సింహద్వారానికి ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరో చిన్న పిల్లవాడు వచ్చి తలుపు తీశాడు.
“మోహన్ ఉన్నారా?” అనడిగాడు రమణ.
“ఉన్నారండి. కూర్చోండి, పిలుస్తాను. మీరు?” అడిగాడతను.
“నా పేరు రమణ ఆయన చిన్ననాటి స్నేహితుణ్ణని చెప్పు బాబూ” అన్నాడు రమణ తనూ కృష్ణా కూర్చుంటూ..
కాస్సేపటికి మోహన్ వచ్చాడు. “ఎన్నాళ్ళయింది రమణా నిన్ను చూసి, ఎప్పుడొచ్చావ్? ఏమిటీ కథ” అంటూ రమణతో చెయ్యి కలిపాడు మోహన్.
“ఈ మధ్యే వచ్చానురా, అమ్మకు బాలేదని నాన్నగారు కబురు పెడితే వచ్చాను” అన్నాడు రమణ.
“ఏమైంది?” అడిగాడు మోహన్.
“పక్షవాతం. అంతకంటే ఎక్కువగా మనోవ్యాధి. నీకు తెలియందేముంది? నేను గీతా పెళ్ళి చేసుకున్నాక నా కుటుంబానికే కాకుండా పోయాను కదా, అందువల్లే అమ్మ బాధపడుతోంది. ఇప్పుడు కాస్త కోలుకుంటోంది. ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. డాక్టర్లు నేను పక్కనుంటే తొందరగా కోలుకుంటుందనే అంటున్నారు” అన్నాడు రమణ.
“ఈ పెద్దవాళ్ళతో అదేరా బాబూ యాతన. మా అమ్మా అంతే, నాన్న పోయాక ఇక్కడనుంచి కదలనంటుంది. ఆవిడకూ షుగరూ, బీపీ ఉన్నాయి ఒక్కత్తీ ఉండలేదు. నాకా హైదరాబాద్‌లో పని, ఇక్కడ పొలాలంటే ఏదో కౌలికిచ్చాకానీ ఇంటిని అక్కడ్నుంచి మెయింటెయిన్ చెయ్యలేను కదా, అమ్మ ఒక్కదాని వల్లా కావడం లేదు. పోనీ ఇంట్లో ఓ భాగం అద్దెకిద్దామనంటే, ఈ ఊళ్ళో వచ్చి ఎవరైనా ఏం బావుకుంటారు? ఓ పరిశ్రమలా పాడా, ఇళ్ళు అద్దెకు ఎవరికిస్తాను? పోనీ అమ్ముదాం అంటే కొనుక్కునే నాథుడేడి? అలా ఉంది నా పరిస్థితి” అన్నాడు మోహన్.
పుట్టి పెరిగిన ఊళ్ళో ఉపాధి లేకపోవడమా, ఎంత బాధాకరమైన విషయం అనుకున్నాడు రమణ.
“మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయినా జమీందారువి, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని నువ్వు తలుచుకుంటే పరిశ్రమలు పెట్టడం ఎంత పని?” అన్నాడు రమణ.
“ఏ పరిశ్రమలు పెడతాంరా ఇక్కడ? ఏముందని? స్కిల్స్ తెలిసిన వాళ్ళు గానీ, స్కిల్ డెవలప్మెంటుకి ఆస్కారం గానీ ఉందా ఇక్కడ? హైదరాబాద్‌లో నేను ఆల్రెడీ చిన్న కంపెనీ పెట్టాను. అక్కడ నడిపించడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇక్కడ ఏ విధంగా కంపెనీ పెట్టమంటావు? ఇదిగో ఈ సారైనా అమ్మను ఒప్పించి నాకూడా అమ్మను అక్కడికి తీసుకువెడితే ఇక్కడ ఆస్తులు మెల్లిగా బేరం పెట్టుకోవచ్చు అని చూస్తున్నాను” అనన్నాడు మోహన్.
రమణకు ఏం మాట్లాడాలో తెలీలేదు. అతనితో కాస్సేపు మాట్లాడి అతని ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు రమణ. తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు కృష్ణ.
“నాన్నా, మనం అమెరికా తిరిగి వెళ్ళిపోతామా?” అనడిగాడు.
“వెళ్ళాలి కద నాన్నా, అక్కడ అమ్మకు నాకు ఆఫీస్ ఉంది కదా, నీకు జానూకు స్కూల్స్ ఉన్నాయి. నీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే కదా నడవాల్సింది” అన్నాడు రమణ.
“ఎడ్యుకేషన్ అంటే అక్కడ చదువుకునేదేనా నాన్నా, ఇక్కడ తాతయ్య చెప్పేది ఎడ్యుకేషన్ అనరా? అప్పుడు మీరు అమెరికా వెళ్ళారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇలా అందరూ విలేజస్ వదిలి వెళ్ళిపోతుంటే ఇంకా ఇక్కడ ఏముంటుంది? పైగా ఇక్కడ ఏమీ లేదని వెళ్ళిపోతున్నాం అంటున్నారు మీ ఫ్రెండ్. ఏదన్నా లేకపోతే మనం దాన్ని తెచ్చుకోవాలి కానీ, ఇక్కడ లేదని వెళ్ళిపోతారా ఎవరైనా?” అన్నాడు కృష్ణ.
కృష్ణ మాటలకు విస్తుపోయాడు రమణ. అంత చిన్న పిల్లవాడి పాటి ఆలోచించలేకపోయాం కదా అనిపించింది రమణకు. రమణ, ఇంటికొస్తూనే గీతతో, “ఒకసారి నీతో మాట్లాడాలి ఇలా వస్తావా?” అన్నాడు తన గదిలోకి వెడుతూ. గీత అతని వెంటే వెళ్ళి, “ఏంటండీ?” అంది.
“ఒక విషయంలో నీ సలహా కావాలి నాకు. ఇలా రా కూర్చో” అన్నాడు..
రెండవ రోజు సాయంత్రం ఇంటికి అమెజాన్ నుంచి ఏదో పార్సెల్ వచ్చింది. రమణ తల్లి కోసం కొని తెప్పించిన చక్రాల కుర్చీ అది. రమణ ఆ చక్రాల కుర్చీని చక్కగా అమర్చి, తల్లి గదికి తీసుకెళ్ళి, దాన్ని చూపించి, దాంట్లో ఆవిడను కూర్చోబెట్టుకుని, బయట పెరట్లోకి తీసుకెళ్ళాడు. ఆవిడ అలా బయటకు వచ్చి ఎన్నాళ్ళయిందో, ఈ పాడు రోగం వచ్చాక అస్సలు పెరడు ముఖమే చూడలేదావిడ. ఎన్నాళ్ళు అదే గదిలో మగ్గిపోయిందో ఆవిడకే ఎరుక. ఆవిడ చాలా సంతోషించింది. ఆ సంతోషాన్ని మాటల్లో తెలియపరచడానికి ప్రయత్నించింది. అమ్మ కొద్ది కొద్దిగా మాట్లాడడం, రమణకు సంతోషాన్ని కలిగించింది. ఫిజియోథెరఫిస్ట్ తొందర్లోనే నడక ప్రాక్టీస్ చేయించుదామని చెప్పారు. కృష్ణవేణమ్మతో సహా అందరూ సంతోషించారు.
ఇంకో పది రోజుల్లో వేదపాఠశాలలో చేరే కొత్త, పేద బాలక విద్యార్థుల ఉపనయన కార్యక్రమం జరుగనున్నది. దానికోసం విజయవాడ శంకరమఠం నుండి స్వాములవారు వేంచేయనున్నారు, అందుకోసం ఊళ్ళో పెద్ద ఎత్తున సన్నాహాలు నడుస్తున్నాయి. దశరథరామయ్య గారే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.
(ఇంకా ఉంది)
శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుత నివాసం బెంగళూరు. వీరు 2019 నుంచి కథలు వ్రాస్తున్నారు. మొదటి కథ ‘నకిలీ మనిషి’. 2020లో వ్రాసిన మొదటి ధారావాహిక 45 భాగాల ‘విధి’ చాలా మందిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి కథలు, ధారావాహికలు వ్రాస్తున్నారు. 2023లో ‘ఆనందమయి’, 2025లో ‘అందం’ అనే ధారావాహికలు రచించారు. 2021లో భావుక సమూహం నిర్వహించిన ఆరు వారాల కథల పోటీలో వీరు రాసిన ‘దత్తత’ అనే ధారావాహికకు బహుమతి లభించింది. 2025లో అదే సమూహం నిర్వహించిన గొలుసు నవలా ప్రక్రియలో పాలు పంచుకుని, 25 మంది రచయితలతో కలిసి వీరూ ఒక భాగం వ్రాశారు.
ఇప్పటివరకు 15 దాకా కథలు, 7 ధారావాహికలు వ్రాశారు. వీరి కథలు రవళి అంతర్జాల మాసపత్రిలోనూ, తెలుగుతల్లి కెనడా అంతర్జాల పత్రికలోనూ, లీడర్ పత్రికలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. వీరు వ్రాసిన కొన్ని కథలు, ధారావాహికలు వివిధ చానల్స్ ద్వారా ఆడియో కథలుగా వచ్చాయి. ప్రమదాక్షరి, శ్రీమతి మంథా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన మినీ నవల పోటీలో తన మినీ నవల ‘పల్లె పిలిచింది’కి ప్రోత్సాహక బహుమతి లభించడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నారు.
