[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[ఫిజియోథెరపిస్ట్ వచ్చి, కృష్ణవేణమ్మ గదిలోకి వెళ్ళి ఆవిడని పలకరిస్తాడు. ఏమైనా తిన్నారా అని అడిగితే, ఏమీ పెట్టలేదనీ, పొద్దున్నే కాసిని పాలు ఇచ్చానని చెప్తుంది అన్నపూర్ణ. ఆమె చేత ఎక్సర్‍సైజులు చేయిస్తూ, ఇవాళెదుకో మామ్మగారు హుషారుగా ఉన్నారే, రోజూ నొప్పితే మూలిగేవారు, ఇలాగే ఉంటే తొందరగా కోలుకుంటారని అంటాడు. రావల్సిన వాళ్ళు వచ్చారుగా అని శారద, లక్ష్మి వెటకారం చేస్తారు. గీత వంటావిడకి సాయం చెయ్యనా అని అన్నపూర్ణని అడిగితే, లక్ష్మి దురుసుగా మాట్లాడుతుంది. గీత కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, అన్నపూర్ణ చెల్లెల్ని మందలించి, అక్కడ్నించి పంపేస్తుంది. గీతని ఓదార్చబోతుంటే, తాను, భర్త అక్కడ అన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తామనీ, మాంసాహరం తినమని, పిల్లలకి కూడా మీ ఆహారపు అలవాట్లే నేర్పానని చెప్తుంది గీత. మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రమణ సంధ్యవారుస్తూ కనబడతాడు. అది పట్టించుకోనట్టే ఆయన కూడా సంధ్యావందనం చేస్తాడు. మూడో రోజున శారద, లక్ష్మి ఇక బయల్దేరుదామని అంటే, మృత్యుంజయ హోమం తలపెట్టాననీ, అది అయ్యాక వెళ్ళమని చెప్తారు దశరథ రామయ్య. ఓ రోజు రమణ కొడుకు రామకృష్ణ పెరట్లోకి వెళ్ళి తాతయ్యని పలకరిస్తాడు. ముందు బెట్టు చేసినా, ఆయన వాడితో ఇంగ్లీషులో మాట్లాడుతారు. రమణ ఎక్కువగా తల్లితో గడిపి, ఆమె మానసికంగా ఉత్సాహంగా ఉండేటట్టు చూస్తాడు. హోమం రోజున వేదపండితులతో పాటు కొడుకూ, మనవడూ కూడా మంత్రాలు చదవడం చూసి ఆశ్చర్యపోతారు దశరథ రామయ్య. హోమం పూర్తయ్యాకా, అందరూ వెళ్ళిపోబోతుంటే, అన్నపూర్ణని బతిమాలి కొన్ని రోజులు ఉండమంటుంది గీత. సరేనంటుంది పూర్ణ. రామకృష్ణ తాతగారి వెంటే తిరుగుతూ, ఆయన వెంబడి వేదపాఠశాలకి వెళ్ళి వేదం నేర్చుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆయన దగ్గర తెలుగు నేర్చుకుని, మాట్లాడుతాడు. రామకృష్ణని చూస్తే ఆయనలో కొత్త ఆశ పుట్టుకొస్తుంది. కానీ బయటపడరు. కానీ రామకృష్ణే స్వయంగా తాను ఇక్కడే ఉండి వేదం నేర్చుకుంటానని అనడంతో మురిసిపోతారు. రమణ వాళ్ళొచి నెల రోజులు గడుస్తాయి. ఊర్లోకి వెళ్ళి స్నేహితులని కలిసి వస్తానని వెళ్ళి మోహన్‌ని కలుస్తాడు. ఊరి పరిస్థితులు అర్థం చేసుకుంటాడు రమణ. అంతా గ్రహించాకా, అమెరికా తిరిగి వెళ్ళకుండా, ఇక్కడే ఉండిపోవాలన్న నిశ్చయానికి వస్తాడు. ఊర్లో సామూహిక ఉపనయనాలకి ఏర్పాట్లు చేస్తారు దశరథ రామయ్య. దానికోసం శంకరమఠం నుంచి స్వాములవారు వస్తున్నారు. ఆయనకి కావల్సిన సౌకర్యాలన్నీ దశరథ రామయ్య చూసుకుంటారు. ఇక చదవండి.]
11.
రమణ అమెరికాలో ఉన్న విలాస్ తోనూ, ఇక్కడి తన ఫ్రెండ్ మోహన్ తోనూ, ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ తెగ చేసేస్తున్నాడు. అలాగే మాష్టారు గారి కొడుకుతో కూడా మాట్లాడుతున్నాడు. అన్నీ కుదిరితే తండ్రితో మాట్లాడి, ఆయన ఆశీర్వాదం తీసుకుని, ఇక్కడే పల్లెలో ఒక ఇండస్ట్రీ మొదలెడదామని చూస్తున్నాడు. విలాస్ అక్కడ ఉన్న కంపెనీని చూసుకునేట్లు, దాని బ్రాంచ్ ఇక్కడ ఒకటి మొదలెట్టి, తానే దగ్గరుండి చూసుకునేట్లు ఆలోచన చేస్తున్నాడు. ఊళ్ళో చదువుకుని, ఇక్కడ ఉపాధిలేక వలస వెళ్ళిపోయే చాలా మంది కుర్రాళ్ళకి దీని మూలంగా మంచి ఉపాధినివ్వాలని అతని ఆశ.
అందువల్ల ఊరినుండి వలసలు అరికట్టడమే కాకుండా పట్నాల్లో ఉండే యువతను పల్లెకు మళ్ళించాలని అనుకుంటున్నాడు. దానికి గీత, అది మంచి ఆలోచన అని చెప్పింది.
ఇంకో రెండు రోజులు పోయాక తల్లితో మాట్లాడుతూ కూర్చున్నాడు రమణ. అన్నపూర్ణ ఆవిడకు అన్నం మెత్తగా చేసి, ఆధరవు కలిపి నోట్లో పెడుతున్నది. తల్లి భోజనం అయ్యాక, ఆవిడ మూతి శుభ్రం చేసి వెళ్ళబోతుండగా ఆవిడ అన్నపూర్ణను కాస్సేపు తన దగ్గర కూర్చోమని అడిగింది. అన్నపూర్ణ చెయ్యి కడుక్కుని వచ్చి కూర్చుంది.
కృష్ణవేణమ్మ మెల్లిగా మాటలు కూడ దీసుకుని, “ఒరేయ్ రమణా, నాదో చిన్న కోరికరా, నేనీమాత్రంగా ఉండగానే కృష్ణకు వడుగు చేసెయ్యారా, మళ్ళీ నువ్వు అమెరికా వెళ్ళిపోతే ఎప్పుడు వస్తావో ఏమోనూ” అన్నది. రమణ తన ప్రణాళికల గురించి ఏమీ చెప్పలేదు.
రమణ తల్లితో, “నాకు చెయ్యడానికి అభ్యంతరం ఏమీ లేదమ్మా, కానీ నాన్నగారు ఏమంటారో తెలీదు. ఆయన ఒప్పుకుంటే చెయ్యడానికి నేను సిద్ధమే”, అన్నాడు.
ఆ రాత్రికి తండ్రితో మాట్లాడతానని అన్నపూర్ణ అన్నది.
ఆ రాత్రికి భోజనం చేస్తుండగా అన్నపూర్ణ తండ్రితో తల్లి కోరికగా కృష్ణ వడుగు గురించి, ఆ తరువాత రమణ చెప్పిన దాని గురించి చెప్పింది. అప్పుడు ఆయన, “వాడు చేసిన వర్ణసంకరానికి పిల్లాడికి ఇంకా వడుగు కూడా చేస్తాడా, శాస్త్రం ఎలా ఒప్పుకుంటుంది? రేపు స్వాములవారు వస్తారు. ఆయనకే నాకు ముఖం ఎలా చూపించడమా అని అనిపిస్తోంది. అలాంటిది ఇదెలా కుదురుతుంది? స్వామివారు కూడా దానికి సమ్మతించరు” అన్నారు.
“నాన్నా, అక్కడ వేద పఠనానికి వచ్చిన ఎంతోమంది పేద విద్యార్థులకు మీరు సామూహిక ఉపనయనాలు చేస్తున్నారు కదా, అలా అయినా పిల్లాడికి ఉపనయనం చేయించవచ్చు కదా, ఆమ్మ కోరిక కూడా కదా నాన్నా, ఒక్కసారి ఆలోచించండి. చూడండి, వాడి రాకతోటి అమ్మ ఎలా, ఎంత తొందరగా కోలుకుందో” అన్నది అన్నపూర్ణ.
“కేవలం ఆ ఒక్క కారణానికే వాడ్ని నేను ఇన్నాళ్ళూ ఉపేక్షించాను. లేకపోతే వాడి ముఖం కూడా చూడదల్చుకోలేదు” అన్నారాయన.
గదికవతల ఉన్న రమణ ఇవన్నీ వింటూ బాధ పడుతున్నాడు. గీత కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
“ఇదంతా నన్ను మీరు చేసుకోవడం వల్లే కదా” అని భోరుమంది.
రమణ, ఫర్వాలేదు ఊరుకొమ్మని ఆమెను ఓదార్చి గదిలోకి తీసుకువెళ్ళాడు.
“గీతా, ఇవన్నీ మనస్సులో పెట్టుకోకు. ఇది అనుకున్నదే కదా, చూద్దాం” అని, “నేనూ నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాను. మోహన్‌తో మాట్లాడడం అయ్యింది. తన ఏడెకరాల పొలం మనకు అమ్ముతానన్నాడు. నేను రేపు విజయవాడ వెళ్లి, రిజిస్ట్రేషన్ పనులు చూసుకుని, ఫ్యాక్టరీ ప్లాన్ వెయ్యడానికి, నాకు తెలిసిన ఒక ఆర్కిటెక్ట్ దగ్గరకు వెళ్ళి ప్లాన్ వేయించుకుని అతన్నే మిగతా పనులు ప్రొసీడ్ చెయ్యమని చెప్తాను. వీలైతే ఈ పది రోజుల్లోనే, స్వాములవారి చేతే శంఖుస్థాపన చేయించేద్దాం” అన్నాడు.
“అందుకు మీ నాన్నగారు ఒప్పుకోవద్దా, పిల్లాడి వడుగుకే ఒప్పుకోలేదు ఆయన. మీరిక్కడే ఉంటానంటే ఒప్పుకుంటారా?” అన్నది గీత.
“ఆయన ఒప్పుకోకపోతే నేను ఇదే ఊళ్ళో వేరే ఇంట్లో అద్దెకుండైనా నా లక్ష్యం సాధిస్తాను. నేను చిన్నప్పటినుంచి అంతే, అనుకున్నది సాధించేదాకా నిద్రపోను” అన్నాడు రమణ.
అటుగా వస్తున్న అన్నపూర్ణ వీళ్ళ గదిలో మాటలు విని, “అనుకోకుండా ఇటు వస్తుంటే మీ మాటలు వినబడ్డాయిరా, ఏమీ అనుకోకు. నే వింటున్నది నిజమేనా రమణా, నువ్వు ఇక్కడే ఉండబోతున్నావా? ఎంతటి శుభవార్త రా, అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది” అన్నది.
“అవునక్కా, ఇక్కడే ఉండబోతున్నాను. ఇక్కడే ఒక సంస్థ మొదలు పెట్టి, ఇక్కడి వాళ్లకు ఉపాధి కల్పించాలని చూస్తున్నాను. ఎక్కువమంది ఊరు వదిలి పెట్టి వెళ్లకుండా చూడాలని నా ఆలోచన. నిజంగా చూస్తే, కృష్ణే ఈ ఆలోచన చేశాడు. వాడే చెప్పాడు నాకు ఈ ఐడియా తెలుసాక్కా?” అన్నాడు.
“సంతోషం రా నాన్నా, చాలా బాగుంది. అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది?” అన్నది అన్నపూర్ణ.
ఆ మర్నాడు రమణ పొద్దున్నే బయలుదేరి మోహన్‌ను తీసుకుని విజయవాడ బయలుదేరి వెళ్లి అనుకున్న పనులు అన్నీ ముగించుకుని రాత్రికి కానీ ఇంటికి తిరిగి రాలేదు.
రెండు రోజులు పోయాక స్వాములవారు ఊళ్ళోకి వచ్చారు. పూర్ణ కలశంతో దశరథరామయ్య గారు, ఆ ఊరి మునసబు, ఇంకా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి, ఎదురువెళ్ళి ఆయనకు ఘన స్వాగతం చెప్పారు. ఆయనను ఆలయం పక్కన సిద్ధం చేసిన విడిదికి తీసుకెళ్ళి, ఆయనకు తగిన ఉపచారాలు చేశారు. స్వామివారి స్వాగతం కోసం జనం తండోప తండాలుగా గుడికి వచ్చి వేచి యున్నారు.
స్వామివారు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకి దర్శనం ఇస్తారని చెప్పి వారిని తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించి వేశారు. ఆ కార్యక్రమాలు అన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. అప్పుడు వచ్చి దశరథ రామయ్య భోజనం చేసారు.
రమణ వచ్చి తండ్రితో, “నాన్నా, నేను స్వాములవారితో మాట్లాడాలి. కొంచెం నాకు అవకాశం ఇప్పించండి”, అనడిగాడు. “దానికి నేను ఇప్పించేదేముంది? సాయంత్రం అందరికీ దర్శనం ఇస్తారుగా అప్పుడొచ్చి మాట్లాడు”, అన్నారు. “కాదండీ ఆయనతో నేను కొంచెం సేపు విడిగా మాట్లాడాలి అందుకోసం అడుగుతున్నాను” అన్నాడు.
ఆయన సరేలే అని చెప్పి భోంచేసి కొంచెం సేపు పడుకుని మళ్ళీ మూడున్నర కల్లా బయలుదేరి గుడి దగ్గర విడిదికి వెళ్లారు. ఆయనతో పాటే రమణ కూడా వెళ్లి ఏర్పాట్లలో పాల్గొన్నాడు.
ముందుగా స్వామివారికి పానకం పళ్ళు తీసుకుని, అన్నపూర్ణ గీతావెళ్ళారు. గీత చక్కటి ఎర్ర జరీ అంచులున్న, తెల్లటి కంచి పట్టు చీర కాశీ పోసి కట్టుకుని, నెత్తిన ముచ్చల ముడి వేసుకుని, నుదుట కాసంత బొట్టు పెట్టుకుని కాళ్ళకు గజ్జెలు పెట్టి, సిగలో పూలు పెట్టుకుని, చేతికి గాజులు వేసుకుని, అచ్చం మహాలక్ష్మిలా తయారయి అన్నపూర్ణతో బయలుదేరి వెళ్లింది. రమణ కూడా ఇంటికి వచ్చి, పట్టు పంచ కట్టుకుని, ఉత్తరీయం నడుముకి చుట్టుకుని గీత పక్కగా నడుస్తూ స్వామివారి దర్శనం కోసం వెళ్ళాడు.
అన్నపూర్ణ స్వామికి గీతా రమణుల గురించి చెప్పింది. స్వాముల వారు ఆ దంపతులను ఆశీర్వదించారు. ఆ తరువాత రమణ స్వామివారితో తన పరిశ్రమ గురించి చెప్పి, దానికి ఆయన చేతుల మీదుగా శంఖుస్థాపన జరగాలని తన కోరిక అని అభ్యర్థించాడు. ఆయన శుభం అని, ఆయన ఆమోదాన్ని తెలిపి ఆశీర్వదించారు.
స్వామివారు అక్కడున్నన్ని రోజులు వారి భిక్ష తమ ఇంటినుంచే వస్తుందని దశరథ రామయ్యగారు చెప్పారు.
స్వామివారు మొదటి రోజున అక్కడ దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయము జీర్ణోద్ధారణ కార్యక్రమం, రెండవ రోజు, వేద పాఠశాలలో చదువుతున్న పిల్లల వేదాధ్యయన కార్యక్రమాన్ని తిలకించడం, అదే రోజు సాయంత్రం రమణ ఫ్యాక్టరీ శంఖుస్థాపన కార్యక్రమం, చివరిగా పేద విద్యార్థులకు ఉచితంగా ఉపనయన కార్యక్రమం అని అక్కడ నిర్వహించే కార్యక్రమాల పట్టికను మఠం వారు వెల్లడి చేశారు. ఇవే కాక రోజూ భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు, ఇంకా స్వామివారి దివ్యభాషణం ప్రతి రోజూ ఉంటుంది.
ఆ రాత్రికే దశరథరామయ్య గారింటికి ఆడపిల్లలు వాళ్ళ భర్తా పిల్లలతో సహా స్వామి దర్శనానికి, అక్కడ జరగబోయే ఉపనయన కార్యక్రమాలను చూడడానికి వచ్చేసారు.
గీత పొందికగా సాంప్రదాయ దుస్తులతో, స్వామివారి సేవలు చేస్తోంది.
స్వామివారు దశరథ రామయ్యతో తన కోడలు మహాలక్ష్మిలా ఉందని మెచ్చుకున్నారు.
దశరథ రామయ్య పెదవి విరిచి, స్వామివారితో జరిగిన విషయం చెప్పారు.
(ముగింపు వచ్చే వారం)
శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుత నివాసం బెంగళూరు. వీరు 2019 నుంచి కథలు వ్రాస్తున్నారు. మొదటి కథ ‘నకిలీ మనిషి’. 2020లో వ్రాసిన మొదటి ధారావాహిక 45 భాగాల ‘విధి’ చాలా మందిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి కథలు, ధారావాహికలు వ్రాస్తున్నారు. 2023లో ‘ఆనందమయి’, 2025లో ‘అందం’ అనే ధారావాహికలు రచించారు. 2021లో భావుక సమూహం నిర్వహించిన ఆరు వారాల కథల పోటీలో వీరు రాసిన ‘దత్తత’ అనే ధారావాహికకు బహుమతి లభించింది. 2025లో అదే సమూహం నిర్వహించిన గొలుసు నవలా ప్రక్రియలో పాలు పంచుకుని, 25 మంది రచయితలతో కలిసి వీరూ ఒక భాగం వ్రాశారు.
ఇప్పటివరకు 15 దాకా కథలు, 7 ధారావాహికలు వ్రాశారు. వీరి కథలు రవళి అంతర్జాల మాసపత్రిలోనూ, తెలుగుతల్లి కెనడా అంతర్జాల పత్రికలోనూ, లీడర్ పత్రికలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. వీరు వ్రాసిన కొన్ని కథలు, ధారావాహికలు వివిధ చానల్స్ ద్వారా ఆడియో కథలుగా వచ్చాయి. ప్రమదాక్షరి, శ్రీమతి మంథా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన మినీ నవల పోటీలో తన మినీ నవల ‘పల్లె పిలిచింది’కి ప్రోత్సాహక బహుమతి లభించడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నారు.
