Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లె ప్రకృతి వనం – మన ఊరు నందనవనం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన 17 ఏళ్ళ యువ రచయిత డి. వివేకానంద రాసిన ‘పల్లె ప్రకృతి వనం – మన ఊరు నందనవనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రాము, హరి అనే ఇద్దరు స్నేహితులు తమ ఊరి గురించి మాట్లాడుకుంటున్నారు.

“హరీ, ఒకప్పుడు మన ఊరు ఎలా ఉండేది? పచ్చని చెట్లతో పచ్చని పంటలతో చాలా అందంగా ఉండేది కదారా?”

“అవును రా రామూ, కానీ ఇప్పుడు మన ఊరిలో చెట్ల సంఖ్య తగ్గిపోయింది. ఎవ్వరు కూడా అప్పటిలా మొక్కలు నాటడం లేదు.”

“అవును హరీ, అప్పట్లా మన ఊరి ప్రజలు కలిసి మెలిసి ఉండడం లేదు. ఆ చెట్టు నాది, ఈ చెట్టు నీది అని గొడవపడుతున్నారు.”

“రామూ, మన ఊరిలో సగం మంది చదువులేని వారున్నారు. వాళ్ళకి చెట్ల గురించి తెలియదు. చెట్లు లేకుంటే మనమూ బ్రతకలేమని తెలియదు రా.”

“అవును రా మనం ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలి. అందరి కలిసి మెలిసి ఉండేలా, చెట్లని కాపాడుకునేలా చేయాలి రా” రాము అన్నాడు.

 అలా ఇద్దరు కలిసి, తమ ఊరి బాగు కోసం పాటుపడాలని అనుకుంటారు.

***

వాళ్ల ఊరిలో యాదయ్య అనే ఒక ముసలాయన అనారోగ్యంతో ఉంటాడు. అతనికి వెన్నుపూస విరిగింది. డాక్టర్ అతన్ని మంచం మీదే పడుకోవాలి అని చెప్పాడు. కానీ వాళ్ళ ఇంట్లో మంచం లేదు. యాదయ్య బాధ పడుతుంటాడు.

ఇది గమనించిన రాము, హరి – యాదయ్యకి ఎలాగైనా మంచం కొనాలి అని అనుకున్నారు. డబ్బు సమకూర్చుకుని, మంచం కొని యాదయ్యకి ఇస్తారు. అతను చాలా సంతోషిస్తాడు.

అప్పుడు హరి – “తాతా మనకి మంచం కావాలన్నా, గాలి పీల్చుకోవలన్నా, మంటకి కట్టెలు కావాలన్నా, కూర్చోడానికి కుర్చీ కావాలన్నా, కాటికి ఎత్తుకుని పోవాలన్నా, మనను కాలపెట్టనీకి కట్టెలు కావాలన్నా – ఇవన్నీ ఒక చెట్టు నుండి మాత్రమే వస్తాయి కదా. అలాంటి చెట్టు మనం పెంచాలి” అని, “ఈ రోజు నుండి మనం మొక్కలను ఇంటింటా నాటేలా చేయాలి” అని చెప్తాడు.

“ఒక యాదయ్య తాతకి ఇలా ఐతే? ఊరిలో ఇలా చాలా మంది అనారోగ్యంతో ఉండవచ్చు. వాళ్ళకి కూడా సహాయం చేయాలి. చెట్ల గురించి ప్రతి ఇంటింటికి వెళ్లి వివారిద్దాం. పైగా కరోనా లాంటి రోగాలకు చెట్టు కూడా ఒక నివారణ అని నిరూపిద్దాం” అన్నాడు రాము.

యాదయ్య తనను పలకరించడానికి వచ్చిన వారందరికీ, హరి రాముల ప్రయత్నం గురించి చెప్పి, వాళ్ళని ప్రోత్సహించమని, మొక్కలు నాటమని చెప్పాడు.

రాము హరి ఇద్దరు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చెట్ల గురించి వివరించి, వాళ్ళకి అవసరమైన సహాయం చేసి, ఊరిని అభివృద్ధిలో భాగమయ్యేలా చేశారు. కొంతకాలాని వాళ్ళ ఊరు మొత్తం పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడింది. చాలా అందంగా తయారైంది. చిన్న చిన్న అనారోగ్యాలు దూరమై ఆ ఊరి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.

ఆ ఊరి మీదుగా పోయేవారు ఆ ఊరిని చూసి మురిసిపోయి, ఆ ఊరిని ఆదర్శంగా తీసుకొని తమ ఊర్లని కూడా అభివృద్ధి చేసుకోవడం మొదలు పెట్టారు.

అలా ఆ ఇద్దరూ స్నేహితుల వల్ల చాలా ఊళ్ళల్లో మార్పు వచ్చింది.

***

కొంతమంది పిల్లల్ని పోగేసి, రాము, హరి వాళ్ళకి మొక్కల పెంపకం గురించి వివరించసాగారు.

రాము “చల్లని గాలితో చక్కని నీడతో అలరిస్తాయి చెట్లు, మనల్ని కనికరిస్తాయి” అన్నాడు.

“నిరంతరం నిలబడి ఉండి సహనాన్ని ప్రదర్శిస్తాయి” చెప్పాడు హరి.

“పల్లె ప్రకృతి వనం – మన ఊరు నందనవనం” అన్నాడు రాము.

“మన పల్లెలో మొక్కలు నాటుదాం. మన ఊరిని అందంగా మార్చుదాం. చెట్టు లేకుంటే మనం లేము. అందరం ఐక్యమత్యంగా ఉందాం. అందరమూ కలిసి చెట్లన్ని కాపాడుదాం. మొక్కలు నాటొచ్చు, చెరువులు తవ్వొచ్చు.

కాలుష్యపు కోరలు నుండి, వ్యాధుల నుండి సులువుగా తప్పించుకోవచ్చు” అన్నారు రామూ, హరి.

“వృక్షో రక్షతి రక్షితః” అన్నారు అక్కడ చేరిన పిల్లలు.

(మనతో మంచి స్నేహితుడు ఉంటే, మంచి ఆలోచనలు ఉంటే మనం దేనినైనా సాధించగలం అని చెప్తుందీ కథ)

Exit mobile version