[డా. బి.వి.ఎన్. స్వామి గారి ‘పల్లేరుకాయలు’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రసిద్ధ రచయిత డా. బి.వి.ఎన్. స్వామి గారి స్వీయకథకి నవలా రూపం ‘పల్లేరుకాయలు’. కథానాయకుడు విద్యార్థిగా బడికి వెళ్ళడంతో మొదలైన ఈ కథ, అధ్యాపకుడిగా ఎన్నో ఏళ్ళు బోధించి, పదవీ విరమణ చేసేంత వరకూ సాగుతుంది.
“పలు బాధలు, పలు ఎదురీతలు, పలు స్వాంతనలు ప్రతిబింబించిన ఆత్మకథ ఇది. ఆత్మకథనం మాత్రమే కాదు, స్వామి అంతర్మథనం. పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు మనల్ని వెంబడిస్తాయి. కనుక ఇది నవల, బి.వి.ఎన్.స్వామి జీవన ప్రయాణాన్ని చిత్రించింది గనుక ‘ఆత్మకథాత్మక నవల’. పల్లేరుకాయల మీంచి సాగే బాధిత బాటసారులెందరికో ఈ నవల కొత్త బలాన్నిస్తుంది. చేవనూ, చైతన్యాన్ని, గెలుపు సంకల్పాన్ని చేకూరుస్తుంది. సేద తీరుస్తుంది.” అని వ్యాఖ్యానించారు డా. నందిని సిధారెడ్డి తమ ముందుమాటలో.
ముఖ్యంగా రచయిత దృష్టి అధ్యయనం, అధ్యాపనలపై నిలిపి, వాటి చుట్టూ జరిగిన సంఘటనలకు అక్షరరూపం కల్పించడం వల్లనూ, విద్యా వ్యవస్థ, బోధనరంగాల గురించి విస్తృతంగా చర్చించడం వల్లనూ ఈ పుస్తకం సాధారణ ఆత్మకథలకు, మామూలు నవలలకు భిన్నంగా, నూత్నమార్గంలో సాగుతుంది.
ఈ నవలలోని ప్రధాన పాత్రకి పేరు లేదు. ‘నేను’ అంటూ కథనంతా చెప్పుకొస్తాడు. ఐదవ ఏట బడికి వెళ్ళడంతో ప్రారంభమైన కథ 61వ ఏట గెజిటెడ్ హెడ్‌మాస్టర్‌గా రిటైరవడంతో నవల పూర్తవుతుంది.
కథానాయకుడికి పరిశీలనా శక్తి ఎక్కువ. పసివయసులోనే సమాజంలో జరుగుతున్న ఉద్యమాన్ని, కుల వివక్షని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక్కో అధ్యాపకుడు పాఠం చెప్పే తీరుతెన్నులలోని తేడాలను గుర్తిస్తాడు. ఒకప్పటి గురువులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేవారు. “ఆయన బోధన వల్లనే కరీంనగర్‌పట్టణం గురించి తెలిసింది. సినిమాలంటే ఏమిటో తెలిసింది. రైతుల కష్టాలు, వ్యవసాయంలోని ఆటుపోట్లు ఆయన వల్లే విన్నాను. ఈ బోధనలన్నింటికన్నా ఆయన సాయంత్రం పొలం పనికి పోయి రావడం ఆకర్షించేది” అంటూ రామయ్య సార్ గురించి చెప్తారు రచయిత.
స్వయంగా ఉపాధ్యాయుడైన తండ్రి – కుటుంబ సభ్యుల పట్ల ఎంత కఠినంగా ఉండేవాడో చెప్తున్నప్పుడు, ఆ స్వరంలో బాధా వీచిక గోచరిస్తుంది. “బడిలో పిల్లలకు, ఇంట్లో పిల్లలకు, బడిలోని ఉద్యోగులకు, ఇంట్లోని వారికి తేడా చూపలేదు. వ్యక్తులుగా కాక, యంత్ర భూతములుగా పనిచేయాల్సిందే.” అంటారు. తండ్రికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు దక్కితే, తల్లి మాత్రం సేవకురాలైందని అనడంలో ఆనాటి దాంపత్యాలలో అవ్యక్తంగా ఉండే ఆధిపత్య భావన కళ్ళకు కడుతుంది.
ఏడవ తరగతికి వచ్చేసరికి – పిల్లలలో స్థానికులు, స్థానికేతరులు అన్న భావన కలగడం, గుంపు కట్టడం జరిగింది. ఆ విభజన చదువుల్లో కంటే ఆటల్లో బహిర్గతమయ్యేదని చెప్తారు. దసరా సెలవల్లో బతుకమ్మ గురించి చెప్తూ, అప్పటి సంస్కృతి పాఠకుల మనోయవనికపై ప్రదర్శిస్తారు. ఇదే సమయంలో కథానాయకుడికి తల్లికి తీవ్రమైన అనారోగ్యం కలగడం, అది కేన్సర్‍గా పరిణమించడం, వైద్యం కోసం కరీంనగర్‍కి వెళ్ళాల్సి రావడంతో – తల్లితో పాటు కరీంనగర్ వెళ్ళి అక్కడ తన సంరక్షణ చూసుకోడం వల్ల కథానాయకుడి చదువులకు గండిపడి, బాధ్యత మోయాల్సి వస్తుంది. ఈ సందర్భంలోనే, వ్యవసాయక వాతావరణంలో తొణికిసలాడే పల్లెకు, అత్యంత భిన్నమైన వేగంతో కూడిన వాతావరణం గల పట్టణానికి మధ్య తేడాని మొదటిసారి గమనిస్తాడు. ఇదే కాలంలో మనుషులంతా ఒక్కటిగా లేరు అనే విషయం అర్థం చేసుకుంటాడు, వేర్వేరు రాజకీయ పార్టీల మధ్య తగవులెలా ఉంటాయో గ్రహిస్తాడు. తల్లి చనిపోతుంది. చదువు కోసం కరీంనగర్ చేరుతాడు.
బాల్యం నుంచి కౌమారంలోకి ప్రవేశించిన కథానాయకుడు పట్టణం చేరేసరికి స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చినట్టు భావిస్తాడు. పట్టణ పాఠశాల, పల్లెబడి కంటె భిన్నంగా ఎలా ఉందో వివరిస్తూ, ఆడపిల్లలు, మగపిల్లల మధ్య తేడాలు, భాషలో తేడాలు, ఆహార్యంలో తేడాలని వివరిస్తారు. ఈ దశలో కథానాయకుడికి కొత్త అవగాహనలు కలుగుతాయి. 1) డ్రెస్సింగ్ అనేది మనిషికి ఆకర్షణను కలిగిస్తుందని తెలిసింది 2) హాజరుతో పాస్‌కావచ్చనే ఎరుక 3) జీవించడానికి ఇతరేతర మార్గాలు. ఈ అవగాహనలు అతనిలోని పరిశీలనాశక్తిని పెంచుతాయి. పాఠశాల చదువు వెనకబడుతుంది, సమాజాన్ని అధ్యయనం చేయడం ముందుకొస్తుంది. అలిశెట్టి ప్రభాకర్ గారి స్టూడియో గురించి, ఆయన గురించి స్వామి మాటల్లో చదవడం బాగుంటుంది. బడిపాఠాల కన్నా జీవిత పాఠాలు బలీయంగా మారిన రోజులవి. “మనిషిని చూస్తే భయం కలగడం, భయం నీడలో బ్రతకడం, కండబలం, గుంపుబలాన్ని ఉపయోగించడం ఆనాటి పట్టణబ్రతుకు చిత్రం” అనడంలో రచయిత ఎంత లోతుగా సమాజాన్ని అధ్యయనం చేశారో అర్థమవుతుంది. ఇక్కడే కథానాయకుడి విద్యార్థుల సామూహిక శక్తి తెలుస్తుంది, విద్యార్థి నేతలు పరిచయమవుతారు. విద్యార్థుల ఐక్యత కన్నా, మార్కులే ముఖ్యమనుకునే ‘అతడు’ కలుస్తాడు. టెంత్ క్లాస్, ఇంటర్మీడియట్ చదువు పూర్తవుతుంది. ‘తెలుగు సాహిత్యం’ కోర్సుగా కలిగిన డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్న కథానాయకుడు హన్మకొండలోని కళాశాల చేరుతాడు.
అక్కడ పెద్దబాపు ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్ళివస్తుంటాడు. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ, గార్డెన్, చౌరస్తా, ఒకరిద్దరు స్నేహితులు అనే ఈ ఆరు అంశాలకే పరిమితమవుతాడు. లైబ్రరీలో పుస్తకాలు విపరీతంగా చదువుతాడు. ఖర్చుల కోసం ట్యూషన్స్ చెప్తాడు. చిన్న పిల్లలకు బోధన అనే అనుభవం అలా సంపాదిస్తాడు. ఈ దశలో సాహిత్యంపై ఇష్టం మరింత గాఢమవుతుంది. కాలేజీ ఎన్నికల రాజకీయాలు వెర్రితలలు వేయడాన్ని చెప్పుకొస్తాడు కథానాయకుడు. డిగ్రీ పూర్తి చేసి, తెలుగు ఆప్షనల్‌తో ‘తెలుగు పండిట్ ట్రైనింగ్’ చేస్తాడు. పిజి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తాడు. కానీ సీటు రాదు. గుంటూరు లోని నాగార్జున యూనివర్సిటీ వారు డిగ్రీ మార్కుల తోనే పిజి సీటు ఇస్తున్నారని తెలుసుకుని, అక్కడికి వెళ్ళి చేరుతాడు. ఇక్కడి కుల వివక్షనీ, విద్యార్థుల్లో స్పష్టంగా కనబడే పేద, ధనిక తేడాని ప్రస్తావిస్తాడు. తెలంగాణ, ఆంధ్రలలో జరుగుతున్న పోరాట స్వభావాలని పోల్చి చూస్తాడు కథానాయకుడు. నాయనమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికాగా, చదువు పూర్తయిన వెంటనే, ఆమె కోరిక మేరకు వివాహం చేసుకుంటాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో ప్రైవేటు టీచరుగా చేర్తాడు.
చిరుద్యోగం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికావసరాల్ని లెక్కలోకి తీసుకోకుండా సంసార బరువును పెంచుకోవడంలోని అసంబద్ధత తెలిసొస్తుంది కథానాయకుడికి. జీవితం ‘బండి ఇరుసు’గా మారుతుంది. నలుగుతూ, ఉన్నచోటనే ఉండిపోతూ కాలం గడపాల్సి వస్తుంది. విద్య ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్లి, ఇంగ్లీష్ మీడియం విస్తరించడం మొదలవుతుంది. తెలుగు మీడియం విద్యార్థులంటే పల్లెటూరు వారని, ఇంగ్లీషు మీడియం విద్యార్థులంటే పట్నం వారనే విభజన ఏర్పడడాన్ని కథానాయకుడు గమనిస్తాడు. ప్రైవేటు స్కూళ్ళల్లో స్టడీ అవర్స్ ఎక్కువడం, విద్యార్థులు ఆటలకి దూరం అవడం జరిగిపోతుంది. ఈ దశలో అధ్యాపకులలోని తేడాలు, ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం వాళ్ళను ట్రీట్ చేసే విధానం ప్రస్తావిస్తాడు. ఇలాంటి స్థితిలో తనలాంటి వారికి పిల్లల చదువులు గుదిబండలయ్యాయంటాడు కథానాయకుడు. అతని పిల్లలు అతనితోనే బడికి వెళ్ళడం వల్ల వారికి తెలుగు మీడియమే గతి అవుతుంది. ఈ అధ్యాయంలో విద్యారంగంలో చోటు చేసుకున్న పలు పెడధోరణలను ప్రస్తావిస్తాడు కథానాయకుడు. ఈ దశలో ఎలాగొలా ప్రభుత్వోద్యోగం దక్కించుకుని కొత్త బడిలో చేర్తాడు. రోజూ బస్‌లో వెళ్ళి రావడం, అక్కడి తోటి టీచర్ల స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు అనుకోకుండా పాత స్నేహితుడు ‘అతడు’ కలుస్తాడు. ఈ స్కూల్లో యుడిసి టీచర్ల జీతం నుండి కొంత డబ్బు నొక్కేస్తుంటాడు. మొదట్లో కథానాయకుడు ఆవేశపడ్డా, తోటి అధ్యాపకులు ఇవన్నీ పట్టించుకోవద్దని హెచ్చరిస్తారు. అవినీతి జాడ్యం అన్ని రంగాలకు పాకిపోవడాన్ని గమనిస్తూ నిట్టూరుస్తాడు కథానాయకుడు. తెలివిగా యుడిసి ఆటకట్టిస్తాడు. కొత్తగా పరిచయమైన నవీన్ సార్ సూచనలో పొదుపు నేర్చుకుంటాడు. పిల్లల అవసరాలు పెరగడం వల్ల, ఇష్టం వచ్చినట్లు తిరగడం తగ్గుతుంది.
తెలంగాణ ఉద్యమం ఊపందుకోడంతో, కథానాయకుడు కూడా దానిలో పాల్గొంటాడు. విద్యారంగంలో వస్తున్న మార్పులను అవగతం చేసుకుంటాడు. ఉద్యోగం వచ్చి ఐదు సంవత్సరాలవడంతో, ఆర్థిక స్థితి మెరుగవుతుంది. తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు, రచయిత కూడా అయ్యుండాలన్న హెడ్ మాస్టర్ సూచనని పాటించి రచనా వ్యాసంగంలోకి దిగుతాడు. తోటి లేడీ టీచర్ ప్రోద్బలంతో కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్తాడు. తెలుగులో పి.జి. చేస్తాడు. యం.ఇడి పూర్తి చేస్తాడు. మూడేళ్ళు డిప్యూటేషన్‌పై వెళ్ళి కాలేజిలో పాఠాలు చెప్తాడు. రేషనలైజేషన్ విధానం వల్ల కొత్త బడికి బదిలీ అవుతుంది. అక్కడి వసతులని, పరిస్థితులను చూసి బాధపడతాడు. స్కూలు మ్యాపింగ్ విధానం వల్ల విద్యార్థుల సంఖ్య తగినంతగా లేని బడులను మూసేసి, స్టాఫ్‌ను ఇతర పాఠశాలలకు తరలించడం మొదలైంది. ఉన్నత పాఠశాలలు కొన్ని మూతబడతాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దవుతాయి. ఆ విధంగా కథానాయకుడు హుజురాబాద్ లోని మరొక పాఠశాలకు బదిలీ అవుతాడు. అక్కడ ఎన్నో అవస్థలు ఎదుర్కుంటాడు. కొన్నాళ్ళయ్యాక, డైట్‌కళాశాల (జిల్లా విద్యాశిక్షణాసంస్థ) లో పనిచేయడానికి అర్హులైన టీచర్స్‌కావాలని ప్రకటన వెలువడుతుంది. కథానాయకుడు అప్లయి చేసి సెలెక్టయి, కరీంనగర్ డైట్ కాలేజీలో చేరతాడు.
తరువాత కాలంలో విద్యావ్యవస్థలో విలువలు పతనమవడం గురించి వివరిస్తాడు కథానాయకుడు. తల్లిదండ్రులు, విద్యార్థుల దృక్పథాలలో వస్తున్న మార్పులు, కొందరు ఉపాధ్యాయులు బోధన కన్నా ఇతర వ్యాపకాలకే ప్రాధాన్యతనివ్వడం వంటి వాట వల్ల మొత్తం అధ్యాపక వ్యవస్థకే చెడ్డ పేరు రావడం గురించి చెప్తాడు. కోవిడ్ కాలంలో విద్యాబోధన నష్టపోయిన విధానం వివరిస్తాడు. Full Additional Charge Head Master గా అవకాశం వస్తుంది కథానాయకుడికి. అప్పటిదాక విద్యార్థులతో సమస్యలెదుర్కున్న అతను, అధికారుల నుండి కూడా ఎదుర్కుంటాడు. బడిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల మధ్య జరిగిన గొడవల మూలంగా ప్రశాంతత కరువవుతుంది. ఎట్టకేలకు ఆ బాధ్యతల నుండి విముక్తుడవుతాడు. తరువాతి రోజుల్లో పదోన్నతి లభించి గెజిటెడ్ హెడ్‌మాస్టర్‌గా రిటైరవుతాడు.
ఇప్పటి వరకూ అంటే.. పదోన్నతి అనే అధ్యాయం వరకూ ‘నేను’ అని చెప్పుకొచ్చిన పాత్ర కాస్తా, ‘సాహిత్యం’ అనే అధ్యాయం లోకి వచ్చేసరికి బివిఎన్ స్వామిగా మారుతుంది. ఆయన రచనా వ్యాసంగాన్ని వివరంగా చెప్తారు. కథాసాహిత్యంలోనూ, కశప రూపకల్పనలోనూ చేసిన కృషిని వివరిస్తారు.
(ప్రధాన పాత్రకి పేరు ఎందుకు పెట్టలేదో డా. బివిఎన్ స్వామి తమ ఇంటర్వ్యూలో వివరించారు. చదవండి)
~
ఇది స్వామి గారి ఆత్మకథే అయినా, జీవితంలోని అన్ని పార్శ్వాలను సమగ్రంగా ప్రదర్శించలేదేమోనన్న భావం కొందరు పాఠకులకు కలిగే అవకాశం ఉంది. కాని అది పూర్తి నిజం కాదు. విద్య, బోధన అనేవి ప్రస్ఫుటంగా వ్యక్తమైనా, కుటుంబం గురించి తల్లిదండ్రుల గురించి, భార్యా బిడ్డల గురించి, పిల్లల చదువుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి సంక్షిప్తంగా చెప్పుకొచ్చారు స్వామి. కుటుంబానికి, సమాజానికి దూరంగా మనిషి మనలేడు. సమాజంలో ఉంటూనే, జీవితాన్ని వీలైనంత ఫలప్రదం చేసుకుంటూ ముందుకు సాగారు స్వామి.
***
రచన: డా. బి.వి.ఎన్. స్వామి
పేజీలు: 126
వెల: ₹ 120/-
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్
16-11-20/6/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీమ్ నగర్, మలక్ పేట,
హైదరాబాద్ – 500036
ఫోన్: 98487 87284
~
డా॥ బి.వి.ఎన్.స్వామి
9247817732
~
డా. బి.వి.ఎన్. స్వామి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-bvn-swamy-2/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
