Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రసన్న కవితాధార – పంచవటి

[ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారి పద్యకృతి ‘పంచవటి’ పై సమీక్ష అందిస్తున్నారు శ్రీ చీర్ల చంద్రశేఖర్.]

శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారు అమెరికాలో పలు విశ్వవిద్యాలయాల సాంకేతిక శాఖలో ఆచార్య పదవిని అధిష్ఠించి ఉన్నారని, ప్రతి ఏటా కవి పండితులకు, కళాకారులకు సన్మానం చేస్తున్న అజో-విభొ-కందాళం ఫౌండేషన్ ముఖ్య వ్యవస్థాపకులని మాత్రమే సామాన్య ప్రజకు తెలుసును. సాహిత్యంలో వారి విశేషకృషిని గురించి తెలిసినది శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాసావళిలో వారి గురించి చదివిన తర్వాతనే.

ఈ మధ్యనే వెలువడిన శ్రీ సత్యనారాయణ గారి ‘పంచవటి’ కృతి నన్ను ఆశ్చర్యపరవశుణ్ణి చేసింది. పంచభూత తారావళులుగా కూర్చబడిన యీ ‘పంచవటి’ పంచభూతముల యొక్క స్తుతి. నాకు తెలిసినంతవరకు మన సాహిత్యంలో ప్రాచీన అర్వాచీన కవులు ఋతువర్ణనలు చేసినారే కానీ ప్రత్యేకంగా పంచభూతములను స్తుతించినట్లు కనిపించదు. ‘పంచవటి’లోని పద్యములు వేదసూక్తముల వలె పంచభూతములను ప్రస్తుతించటమే కాక ప్రాచీన విజ్ఞానమును, నవీన శాస్త్రవిజ్ఞానమును సాహిత్యసౌరభముతో సంమిశ్రితము చేసినవి. ఇది అనిదంపూర్వమైన కృషి.

వేదోపనిషత్తులలోని సృష్టిక్రమము, జ్యోతిషవిజ్ఞానము ఏ విధంగా పంచవటిలో ఇమిడిపోయినాయో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు తమ పరిచయ వాక్యాలలో విస్తృతంగా చర్చించారు. ఈ కృతిలోని ఔచిత్యాన్ని, కావ్యగంధాన్ని శ్రీమతి వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు కూడా చర్చించారు. వీలైనంతవరకు పునరుక్తి దోషాన్ని నివారిస్తూ నాకు తోచిన కొన్ని విశేషాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

ఈ ‘పంచవటి’ పంచభూత తారావళిలో ఒక్కొక తారావళిలో 27 నక్షత్రముల పరంగా 27 పద్యములున్నవి. శ్రవణా నక్షత్రపు ఛాయగా చెప్పబడుతున్న అభిజిత్ నక్షత్రానికి గుర్తుగా ప్రతి తారావళి చివరన భరతవాక్యం వలె ఒక తేటగీతిని కూర్చారు.

పావక వృత్త తారావళి

‘అగ్ని మీళే పురోహితం..’ అన్న మంత్రంతోనే ఋగ్వేదం ప్రారంభమయ్యింది (1.1.1). ఔచితీమంతంగా సత్యనారాయణ గారు ‘పావక వృత్త తారావళి’తో పంచవటిని ప్రారంభించారు. అగ్ని చైతన్యానికి, జ్ఞానానికి ప్రతీక. అగ్నికి, సూర్యునికి అభేదము. ఈ స్తుతిలో సత్యనారాయణ గారు అగ్ని యొక్క ప్రభావాన్ని, విజ్ఞానశాస్త్రవిశేషాలను వెల్లడించారు.

ఋగ్వేద ప్రథమోక్త సూక్త మహితున్
పృథ్వీ జగద్బాంధవున్
దిగ్వాసో నిటలస్థ వైభవు హృదా
దిత్య ప్రభారాశి వి
శ్వగ్వాయూజ్జ్వల మూర్తితస్సకల జీ
వక్షేత్ర చిచ్ఛక్తి ఋ
త్విగ్వర్యార్చితు సన్నుతింతు నెడదన్
త్రేతాగ్నిరూపాన్వితున్.

ఇది అగ్ని యొక్క వైభవము. అర్థము సులభమే. దిగ్వాసో నిటలస్థ వైభవు – శివుని యొక్క మూడవ కన్నుగా అలరుచున్నది, విశ్వగ్వాయూజ్జ్వల మూర్తితః – విశ్వవ్యాపి అయిన వాయువు చేత ఉజ్జ్వలమై – జీవక్షేత్ర చిచ్ఛక్తి – జీవులందరి యందు చైతన్యస్వరూపముగా నున్నది. ఇక్కడ శ్వాసకు పంచాగ్నిమయమైన ప్రాణమునకు ఉన్న సంబంధం గుర్తించదగ్గది. అగ్నితోపాటు పృథ్వి వాయువులు పేర్కొనబడినవి.

పావక వృత్తంలోని మరొకచోట –

“కలడంబోధి, గలండు గాలి, గలడా
కాశంబునన్, గుంభినిన్
గల” డంచున్ భగవంతునున్కి, బహుళా
ఖ్యానానుసంధాతమై
వెలుగొందున్, మరి నీవు లేని స్థల మీ
విశ్వాన నెందైన సం
కలితంబౌనొకొ చిత్తగింపగ మహా
కాలాగ్నిభట్టారకా!

ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ఉత్పన్నమైన క్రమం మన వేదవాఙ్మయంలో ప్రసిద్ధమైన విషయమే. ఈ పంచభూతములు పరస్పరసమాశ్రయములన్న విశేషం పై పద్యంలో వలెనే, పంచవటిలోని ప్రతిఖండంలోనూ వాచ్యంగానో, ధ్వనిగానో స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియను ఒక శిల్పంగా పరిగణించవచ్చు.

అగ్ని గురించిన ఒక వైజ్ఞానిక విశేషము –

జ్యోతిర్లోక వివృద్ధ విస్పురిత వి
ద్యుద్వహ్ని విస్ఫోటనో
ద్యోతంబయ్యెడు సౌరమండలుల కా
ద్యోపాంత కర్తృత్వ వి
జ్ఞాతున్ భూత భవిష్యదద్యతను నే
కాగ్ని ప్రతీతున్ మహో
త్పాతోత్పన్న సమాపన ప్రతిభునిన్
ధ్యాతవ్యు నూహించెదన్.

ఇక్కడ అగ్ని యొక్క విశ్వకాలీనత సూచింపబడుతున్పది. సృష్ట్యాదిన మహా విస్ఫోటన సమయంలో జరిగిన అణుసంశ్లేషణ (nuclei synthesis) – దానినే విద్యుద్వహ్ని అంటున్నారు – వలన ఏర్పడినవే నక్షత్రరాశులు. ప్రతి నక్షత్రమూ ఒక సూర్యుని వంటిదే కనుక‌ సౌరమండలాలన్నారు. ఈ సౌరమండలాలన్నీ అగ్నితోనే మొదలైనవి, అగ్నితోనే ప్రకాశిస్తున్నవి. ఈ సృష్టి అంతం – సమాపకక్రియ కూడా – అగ్ని వలననే జరగవచ్చును (heat death). మనకు కాలప్రమాణమున్నూ సూర్యుని వలననే కలుగుతున్నది కనుక భూత భవిష్యద్వర్తమానములు ఈ కాంతి చక్రమునందే నిక్షిప్తమై ఉన్నవని చెప్పడం సమంజసము.

ఈ మధ్యనే చదివిన విషయం – Quantum physics లో గతము, వర్తమానము, భవిష్యత్తు కలిసిపోవడం (quantum symmetry) తెలుస్తున్నది. ఇది గాఢమైన తాత్త్విక చింతనకు దారి తీస్తుంది.

ఆద్యంతములను సంకలిస్తున్న ఈ అగ్ని కార్యాన్ని ఇంత సంక్షిప్తంగా చెప్పడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక నవీన వేద సూక్తము.

అగ్ని యొక్క గుణములను, విభూతులను ప్రస్తుతించిన తర్వాత, సత్యనారాయణ గారు అగ్నిలోని గుణత్రయమును సంభావిస్తున్నారు.

జగదుత్పాదన వేళ రాజిత రజ
స్సంప్రేరిత వ్యూహమై
జగతీ సంస్థితి వేళ సాత్త్విక సదా
సంచార శీతోష్ణమై
జగదున్మూలన వేళ తామస మహా
సంహార సాయుజ్యమై
త్రిగుణోపేత బుధాను నెంచెద మదిన్
దివ్యాగ్నిభట్టారకున్.

సృష్ట్యాదిన రజస్సు, సృష్టి సాగుచున్నప్పుడు సత్త్వము, సృష్ట్యంతంలో తమస్సు – ఈ విధంగా అగ్ని త్రిమూర్త్యాత్మకుడైనాడు.

సుజల వృత్త తారావళి

శాకుంతలంలోని ప్రథమశ్లోకములో ‘యా సృష్టి స్స్రష్టురాద్యా..’ అని జలమే ప్రథమంగా చెప్పబడింది. కారణం, పంచభూతములలో మొట్టమొదట భౌతిక పదార్థంగా కనుపించేది జలమే. అట్టి జలాన్ని సత్యనారాయణ గారు ‘బహుళోదార వదాన్యముల్ వసుధ సర్వప్రాణి సౌహిత్యముల్, సహజ స్వచ్ఛ సుషీమ పేయములు, సస్య శ్రీకరంబుల్’ అని ప్రశంసిస్తున్నారు.

సత్యనారాయణ గారు జల ప్రశంసలో, గంగానదిని గురించి, నదీతీరాలలో వెలసిన నాగరకతల గురించి, జలకశ్మలం గురించి, జలము యొక్క ప్రాముఖ్యము గురించి నానావిశేషములను రమ్యంగా చిత్రించారు.

ఉరుసౌరగ్రహరాజి ప్రాణకలనా
నూన క్రియాశక్తి యు
ర్వరకున్ మాత్రము సాధ్యమయ్యె జల స
ర్వాంగీణ సంజీవనీ
భరితోదంచిత భూతధారుణిగ స
ప్త ద్వీపగాన్ గంగ! నీ
వర పాథో విమల ప్రభావమును సం
భావింప సామాన్యమే?

మనము సాధారణంగా గుర్తుకు తెచ్చుకొనని విషయము – ఈ సౌర మండలంలోని గ్రహాలన్నిటిలో ఒక్క భూమిపై మాత్రమే నీరున్నదని, అదే ప్రాణాధారమని. “ఉర్వి” అని కాక “ఉర్వర” అన్నారు, అంటే సస్యసంభృతమైన భూమి అని. ఈ విధంగా శబ్దార్థాలను సంయోజించడంలో సత్యనారాయణ గారు సిద్ధహస్తులు.

ప్రతి దేహంబును మూడు వంతులు జల
ప్రాయంబు, కాయశ్రమా
గత ఘర్మోదక బిందువుల్ జలము, హృత్
కంపార్ద్రనేత్రాంబు సం
గతియున్ జూడ జలంబులై యడరు, నా
కాశోద్భవానర్ఘ సృ
ష్టితలంపన్ జలరాశి యా భువన సం
క్షేమాస్పదన్ పాడెదన్.

ఈ భూమిపై నాలుగింట మూడు వంతులు జలరాశి ఉన్నట్లుగానే మన దేహంలోనూ నీరు ఇంచుమించుగా అదే ప్రమాణంలో ఉన్నది. ఈ పద్యంలోని విశిష్టత ఆ నీరు ఎన్ని విధాలుగా దృశ్యమానమవుతున్నదీ చెప్పడంలో. ఆకాశం నుండి కురిసిన వర్షం, శ్రామికుని దేహంలోని స్వేదం, సహృదయుని హృదయం – దయతోనో, విషాదంతోనో, ఆనందంతోనో – చలించినపుడు కళ్ళలోని తడి, బాష్పకణములు. జలరూపంలో దైవీప్రసాదాన్ని శరీరశ్రమను, అనుభూతి సార్థకతను సంధించడం కవి క్రాంతదర్శనమనాలి.

తలకున్ మించిన వెర్రులెత్తి మనుజుల్
తాపత్రయావిష్టులై
విలువల్ కోల్పడి నిన్ను కల్మష దశా
పీడాస్థితన్ జేయు భ్ర
ష్టుల, పీనుంగుల కూర్ధ్వలోకగతు లం
చున్ నీకు నర్పించి గా
సిలగాన్ వర్తిలు మందభాగ్యుల కటా
క్షింపం గదే జాహ్నవీ!

ఇది సత్యనారాయణ గారి విషాదం. మూర్ఖులు నదీజలాలను దుర్వినియోగం చేయడమే కాక తమ అంధవిశ్వాసాలతో శవాలను గంగానదిలో కలపడం వంటి దుశ్చర్యలతో జలకాలుష్యానికి బాధ్యులవుతున్నారు. అట్టివారిని కూడా కాపాడమని, సంస్కరించమని ప్రార్థన.

ఋగ్వేదంలోని ఆపః సూక్తంలో కూడా ఈ దృశమైన ప్రార్థన ఉన్నది:

ఇదమాపః ప్రవహత యత్కిం చ దురితం మయి
యద్వాహ మభిదుద్రోహ యద్వా శేప ఉతానృతమ్.

“నేను చేసిన (లేదా నా లోని) దుశ్చర్యలు, అకృత్యములు, అసత్యములు ఏవైనా, వానిని ఈ జలము కడిగివేయును గాక”

అని. అంతఃశౌచానికి, బహిఃశౌచనానికి జలమే ప్రధానంగా ఎంచబడుతున్నది.

మరొక దగ్గర సత్యనారాయణ గారు ‘పారిశ్రామికమైన వ్యర్థములతోన్ భస్మాసురప్రాయులై’ రసాయన విసర్జనతో నదులను కల్మషం చేస్తున్నారని అంటారు. భస్మాసురుని వలె మన వినాశాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామన్న అర్థంలో.

జలమున్ గాలియు నగ్ని భూమి యనినన్
సామాన్య సంపత్తిగా
తలపన్ రా దవి జీవ మంత్రమయ వి
ద్యాచుంచు లీ నేల ను
జ్జ్వల సృష్టిస్థితినష్టి కారక విశేష
వ్యూఢదీప్తుల్ వియ
త్తల సంపూరిత పంచతత్త్వములు స్ప
ర్ధాతీత సత్త్వంబులున్.

పంచభూతములను భౌతికమైన వనరులుగా గణించరాదు. అవి సజీవమైనవి, సృష్టిస్థితికి ఆధారమైనవి. మంత్రమయ విద్యాచుంచులు – శ్రేష్ఠమైనవి, మంత్రపూతములైనవి, మన భావనలకు స్పందించునవి. ఇది వైదికమైన దివ్యభావన. ‘పరస్పరం భావయంతః శ్రేయః వరమవాప్స్యథ’ అన్నట్టుగా. ఈ ప్రకృతి శక్తులను పావనంగా భావించినప్పుడు వానిని మనము కలుషితం చేయలేము.

వసుంధరా వృత్త తారావళి

సత్యనారాయణ గారు ‘స్థిరమై తొల్లి యథర్వవేదమున పృథ్వీసూక్తసంప్రోక్తమై ధరణీప్రస్తుతి సాగె’ నంటూ భూమి యొక్క వైభవాన్ని, వైవిధ్యాన్ని, ప్రత్యేకతను కీర్తించుతారు.

జీవాధార సమగ్రమైన వసుధా
సీమంతినిన్ బోలు సు
శ్రీ వాతావరణమ్ము సాటి గ్రహరా
జిన్ లేదు రూఢంబుగాన్
ప్రావాసాంబర లోకమం దునికి చె
ప్పన్ జాల రీ నాటికిన్
యావద్విశ్వమునందు సార్థకము భ
వ్య ప్రాణిసౌభాగ్యముల్.

ఒక్క సౌర మండలంలోనే కాదు, ఇప్పటివరకు భూమి వలె జీవోత్పత్తికి అనుకూలమైన వాతావరణం విశ్వంలో ఎక్కడా కనిపించలేదు. ‘ప్రావాసాంబర’ అనడంలో ఇతర గ్రహాలను వాసయోగ్యంగా చేయాలనుకున్న కొన్ని ప్రయత్నాలను ధ్వనిస్తున్నారు కానీ అవేవీ సఫలమయ్యే సూచనలు లేవు.

సకల ప్రాణి పరంపరాశ్రయ మహా
సత్త్రస్థలిన్ పుత్ర మి
త్ర కళత్రాదుల ‌షడ్వికారముల కా
ర్య క్షేత్రమున్ విశ్వతః
ప్రకటానేక జలాశయన్ వివిధ జీ
వవ్యాప్తి సంధాన వే
దికయౌ నేల నుపాశ్రయించెదన భూ
దేవిన్ త్రిమూర్త్యాత్మికన్.

సకల ప్రాణి పరంపర – పుట్టుతూ గిట్టుతూ మార్పులకు లోనవుతున్న వివిధ ప్రాణులకు ఆధారభూతమై స్థిరంగా ఉన్నది భూమి. మానవ సంబంధములన్నీ షడ్వికారములకు లోనగుచున్నవి. షడ్వికారములు – జన్మము, ఉనికి, వృద్ధి, మార్పు, రూపాంతరము, క్షీణదశ, నాశము అన్నవి (life cycle). ఇలా అన్ని ప్రాణులకు జన్మనిస్తూ, పోషిస్తూ, చివరన బలిగొంటున్న భూమిని మహా సత్త్రస్థలి – యజ్జభూమి అంటున్నారు సత్యనారాయణ గారు.

సత్యనారాయణ గారు ఒకచో ‘లవణాంభోనిది ధారణీతలవిశాలంబై శతాంశంబులం దవలోకింపగ నేకసప్తతి నభివ్యాపించి’ అన్నారు. మరొకచో ‘భువిలో తొంబది యేడు శాతమగు నంబుల్ వార్ధ సంస్థాయు ల య్యవశేషంబులు మూడు శాతములు సూర్యాంశుప్రభాజన్యమై …’ అన్నారు.

ఇది సత్యనారాయణ గారి శాస్త్రజ్ఞత. భూమిపై 71% జలమయంగా ఉన్నది. అయితే ఈ జలరాశిలో 97 శాతము సముద్రములోనున్నది. ఒక మూడు శాతం మాత్రమే మంచినీటి రూపంలో ఉంది. అందులోనూ ఎక్కువ భాగం హిమానీనదాల్లోనూ గాలితేమలలోనూ ఉండి ఒక శాతం మాత్రమే మనకు నదులలో సరస్సులలో అందుబాటులో ఉన్నది.

ఇంత అమూల్యమైన భూమి కూడా మన విధ్వంసానికి గురి అవుతున్నది.

మనుజుల్ మూర్ఖులు భూగ్రహంబు తమ సా
మ్రాజ్యంబుగా నెంచుచున్
వనరుల్ సర్వము స్వార్థలబ్ధికయి వి
ధ్వంసంబు గావించి జీ
వ నిరాధారగ భూమి కెగ్గొసగు న
వ్వారిన్ నిరోధింప దు
ర్జన శిక్షాస్మృతి నేర్పరించవలె స
ర్వప్రాణి సంరక్షకై.

స్వార్థపరులైన కొందరు ఖనిజముల కొరకు, కలప కొరకు, పారిశ్రామికాభిలబ్ధి కొరకు, భూమిని పీడించి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. వారికై ఒక శిక్షాస్మృతి ఉండవలసిందే.

ఇదే భావాన్ని పృథ్వీ సూక్తం మరొక విధంగా వ్యక్తపరిచింది:

యత్తే భూమే విఖనామి క్షిప్రం తదపి రోహతు
మా తే మర్మ విమృగ్వరి మా తే హృదయమర్పిపమ్.

“ఓ భూమీ, నేను (నా ప్రయోజనం కొరకు) నిన్ను త్రవ్వినప్పుడు అది తొందరగా పూడ్చుకొందువు గాక; నేను నీ మర్మస్థానములకు, నీ హృదయమునకు హాని కలిగించకుందును గాక!”

భూమి వనరులను పరిమితంగా ఉపయోగించుకోవాలి కాని, భూమికి శాశ్వతనష్టం కలిగేట్లుగా ప్రవర్తించకూడదు. మన ప్రాచీనులకున్న పర్యావరణ స్పృహ మనకు లేదనుకోవాలి.

ఇట్టి దివ్యమైన వసుంధరను – అన్ని సంపద లను గర్భములో నుంచు కొన్న భూమిని, మరొకసారి స్తుతిస్తున్నారు.

ఘన సూర్య గ్రహమండలంబున నన
ర్ఘం, బేకమున్, సత్త్వ జీ
వన సంభావ్యము, సర్వతోముఖ సర
స్వంతంబు, సస్యాశ్రయం
బును, శీతోష్ణ సమిశ్రమస్థితి సమా
పూర్ణ స్వతస్స్వాదువున్
జననిన్, దివ్యవసుంధరన్ తలచెదన్
సద్భక్తి విశ్వంభరన్.

సౌరమండలంలో విశిష్టంగా జీవనాధారమై జలసమృద్ధి కలిగి సస్యశ్యామలమై, శీతోష్ణమిశ్రమమైన వాతావరణంలో ఉన్న ఈ భూమి దివ్యమైనది. స్వతస్స్వాదువు – భూమి ఎల్లప్పుడూ మనకు అనుకూలంగానే ఉన్నది, మనమై మనము భూమి వనరులను దుర్వినియోగం చేయనంతవరకు.

అంతరిక్ష వృత్త తారావళి

అంతరిక్షమే మనకు ఆకాశంగా కనిపిస్తున్నది. ఈ అంతరిక్ష స్తుతిలో సత్యనారాయణ గారు గ్రహగతులు, చాంద్రమానము, సౌరమానము, గ్రహణములు ఇత్యాది జ్యోతిషశాస్త్ర విశేషములతోపాటు భూభ్రమణము, సూర్యభ్రమణము, నక్షత్ర వీథులు మొదలైన ఆధునిక విజ్ఞానశాస్త్రవిశేషములను కూడా ప్రస్తావించినారు. ప్రాచ్య, పాశ్చాత్య జ్ఞానధారలను తమ కవితాస్రవంతితో మేళవించడం ఒక నూతన ప్రక్రియగా భావించవచ్చు.

తన గర్భస్థమునై మెలంగెడు సమ
స్తంబైన ఈ సృష్టియున్
తనలోన్ లేనిది బాహిరంబైన దే
దైనన్ మరిన్ లేదు ప్రా
క్తనమున్ తానయి నిత్య నూతనమునున్
తానై విరాజిల్లు ని
ర్గుణ నైసర్గిక విశ్వసంభృత మహ
ద్రూపంబు జింతించెదన్.

ప్రాచీనదృక్పథంలో భూమ్యాకాశముల మధ్యన ఉన్నది ‘అంతరిక్షము’ అనేవారము. నవీనవిజ్ఞానంతో అసంఖ్యాకమైన నక్షత్ర మండలములు, గ్రహ మండలములు, వాని అంతరాళము అన్నీ కలుపుకొని అంతరిక్షమని అంటున్నాము. సర్వమూ ఈ అంతరిక్షంలోనివే, ఈ అంతరిక్షానికి బయట అని ఏమీ లేదు. ఈ అంతరిక్షం సృష్ట్యాదిన ఉన్నదే, కానీ నిత్యనూతనమైనది కూడా – నక్షత్రములు నశించడం, నక్షత్ర ధూళి నుండి మరొక నక్షత్రం ఉదయించడం నిరంతరమూ కొనసాగుతున్న ప్రక్రియ. ఇంతక్లిష్టమైన భావం పై నాలుగు చరణాలలో సంక్షిప్తంగా కావ్యరీతిన చెప్పబడింది.

మహద్రూపము – ఇది విశ్వము యొక్క విరాట్ స్వరూపము.

ధరణిన్ విశ్వపు కేంద్రబిందువుగ మే
ధావుల్ సహస్రాది వ
త్సరముల్ నమ్మిరి కాని, మధ్యయుగ త
త్త్వజ్ఞుండు కోపర్నికస్
పరమాశ్చర్యకరంబుగా పృథివియే
భాస్వంతు తా చుట్టుచున్.
తిరుగున్ నిక్కమటంచు తేల్చె, నటుపై
దీపించె నవ్యద్యుతుల్.

ఐదవ శతాబ్దంలో ఆర్యభట్టు భూమి గోళాకారంలో ఉన్నదని, తన కక్ష్య చుట్టూ తానే తిరుగుతున్నదని, నక్షత్రాలు స్థిరంగా ఉంటాయని నిరూపించాడు. అయితే సూర్యసిద్ధాంతపరంగా / రోమక సిద్ధాంతపరంగా, భూమి సౌరమండలంలో కేంద్రస్థానమని, సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతున్నారన్న ప్రాచీనవిశ్వాసం కొనసాగుతూనే ఉండింది. 16-వ శతాబ్దంలోని కోపర్నికస్ సౌరమండలంలో సూర్యుడే కేంద్రమని, భూభ్రమణంతో పాటు భూపరిభ్రమణం కూడా సోపపత్తికంగా ప్రతిపాదించి, ఆధునిక ఖగోళశాస్త్రానికి ఆద్యుడైనాడు.

స్థిమితుండైనటు తోచు దృక్కులకు నా
దిత్యుండు కానీ, యతం
డమితోత్సాహి సహోదర ప్రతతి గే
హం బైన నక్షత్ర బృం
దముతో భాసిలు ‘పాలపుంత’ నడుమన్
నాభిప్రదేశంబు ల
క్ష్యముగా పూన్చి ప్రదక్షిణించెడును వే
గావేశ విద్యుద్గతిన్.

సత్యనారాయణ గారు అంతరిక్ష స్తవంలో ఆధునిక శాస్త్ర పరిచయాన్ని కొనసాగిస్తున్నారు.

సూర్యుడి చుట్టూ గ్రహములు, గ్రహముల చుట్టూ ఉపగ్రహములు పరిభ్రమిస్తున్నాయి. అయితే ఆ సూర్యుడున్నూ స్థిరంగా లేడు. మన నక్షత్రశాల పాలపుంత (milky galaxy) లో ఒక నక్షత్రమైన సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. సూర్యుని పరిభ్రమణ వేగం గంటకు 828000 మైళ్ళు – సూర్యుడు పాలపుంత చుట్టూ ఒక పరిభ్రమణ పూర్తి చేయడానికి 23 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చునట!

సహోదరప్రతతి – సూర్యుడు కూడా ఒక నక్షత్రమేనని చెప్పడం.

తనరన్ నల్బదివేలకోట్ల దిననా
థప్రజ్ఞమౌ పాలపుం
త నభోమండల వీధులం దొకటియే –
తాదృక్ష నక్షత్ర పుం
జ నికుంజంబులు వేలకోట్లకును పె
చ్చై యంతరిక్షంబు నం
దనువై యుంటయు భూనివాసులకు ని
త్యాశ్చర్యమై పొల్చెడున్.

దిననాథ ప్రజ్ఞమౌ – సూర్యునితో పోల్చగలిగినవి. ఈ‌ పాలపుంతలో సూర్యుని వంటివి ఇంచుమించు 40 కోట్ల నక్షత్రములు ఉన్నవని చెబుతున్నారు. ఈ పాలపుంత వంటి నక్షత్రపుంజములు (galaxies) అంతరిక్షంలో అంటే విశ్వంలో వేలకోట్లపై (ఇంచుమించు 2 లక్షల కోట్లని ఒక అంచనా) ఉన్నాయంటున్నారు. ఇది మన ఊహకందని విషయం.

ఈ ఊహకందని విశ్వంలో సత్యనారాయణ గారి కవితాత్మ వికసిస్తున్నది.

మహనీయంబగు రోదసీ గరిమ సం
భావింపగా నెంతు, నీ
యిహలోకస్ఫురణంబు కోల్పడుదు నెం
దెందో విహాయస్సునన్
విహగంబై విహరింతు, క్రింద పడుదున్,
విభ్రాంతిలో మున్గుదున్
బహుళామ్రేడితమైన యూహలు సమా
శ్వాసింప దుస్సాధ్యమై.

బహుళామ్రేడితమైన ఊహలు – పదేపదే తరుముకొని వస్తున్న ఆలోచనలు. ఇటువంటి పదాలు సత్యనారాయణ గారికి అంతరిక్షం నుండే లభించి ఉండాలి!

సమీర వృత్త తారావళి

సత్యనారాయణ గారు సమీర వృత్త తారావళిలో సకల జీవులకు ప్రాణాధారమై, భూమికి రక్షగా ఉన్న పవనుని స్తుతిస్తున్నారు.

అరయన్ పొంకముగా పొరల్ పొరలునై
వ్యాపించి నీరంధ్ర వి
స్తరమై కప్పుచు యంగరక్షకత వా
త శ్రేణి రూపంబునన్
ధర వస్త్రాభముగన్ ఖరాంశు కిరణా
ధ్వ వ్యక్త దీపోగ్ర దు
ర్భరతన్ లోగొని తేర్చు జీవుల న
విశ్రాంతమ్ముగా గాడుపుల్.

వాతావరణంలో ఈ వాయువు పొరలు పొరలుగా వ్యాపించి ఉన్నది. క్రింది నుండి పై వరకు, వాతశ్రేణి – క్షోభ మండలం (troposphere), సమ మండలం (stratosphere), మధ్య మండలం (mesosphere), ఉష్ణ మండలం (thermosphere), విసర్గ మండలం (exosphere). పై పొరలు సూర్యుని నుండి వెలువడే హానికరమైన UV కిరణములు, Gamma కిరణములు, X-Ray వంటి వానిని, కొన్నిటిని పూర్తిగా, కొన్నిటిని చాలావలకు ఆపి భూమికి కవచము వలె కాపాడుతాయి. ధర వస్త్రాభముగా – భూమి ధరించిన వస్త్రము వలె. దీప్తోగ్ర దుర్బరతన్ – మనము భరించలేని ఉగ్ర కిరణములను. అవిశ్రాంతమ్ముగా – ప్రత్యేక మైన విశే‌షణము – పృథివ్యప్తేజోవాయువులలో, వాయువు మాత్రమే అంతటా అన్ని వేళలా ఆవరించుకొని ఉన్నది.

ఈ భావమంతా పై పద్యములో ‘పొంకము’గా అమర్చబడి ఉంది!

మన చుట్టున్ గల గాలి భూభ్రమణ భ
వ్యాకర్షణా వేగియై
యనిశంబున్ నలుదిక్కులన్ వడి నభి
వ్యాపించుచున్ భూతధా
త్రిని శీతోష్ణ సమిశ్ర వార్షుకల ప్రే
రేపించు జీవాంశు వ
ర్ధన సంధాయకునిన్ ప్రభంజనుని సం
శ్లాఘింతు వాతప్రభున్.

భూమ్యాకర్షణ చేత భూమిని అంటిపెట్టుకుని ఉన్న వాయువు భూభ్రమణం వల్ల నలుదిక్కులా ప్రసరిస్తూ ఋతువుల మార్పిడికి కారణమవుతున్నది. ఈ ఋతుగతి చేతనే జీవం వర్ధిల్లుతున్నది.

కమనీయంబగు ప్రాణవాయు వది హృ
త్కక్ష్యాగతం బై విచి
త్రముగా రక్త విశుద్ధి కార్యమున కం
తర్యామియై చొప్పడన్
తమి నశ్రాంతము సాగు శ్వాసగతి హృ
చ్చైతన్య జీవాంశువై
ప్రమిదన్ వెల్గులు జిమ్ము దివ్వియ వలెన్
భాసించు భూప్రాణికిన్.

ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత వాయువు‌‌ శరీరంలో రక్తప్రసారానికి కారణమవుతుంది. ఈ శ్వాస వలననే జీవం నిలుస్తున్నది. ‘ప్రమిదన్ వెల్గులు జిమ్ము దివ్వియ’ – సరియైన ఉపమానము. వాయువే వెలుగవుతున్నది. ప్రమిద శరీరము, శ్వాస ఆగిపోగానే దీపం శాంతిస్తుంది.

ఉదజని వాయువద్ది విమ
లోదయమై ధరణిన్ సమృద్ధిగా
నుదకము రూపు దాల్చెడును,
వ్యోమమునందు ఖరాంశుమండలా
భ్యుదయ విశేషదీధితికి
మూలము తా నయి ప్రజ్వరిల్లెడున్
పదముల నెట్లు సాధ్యమగు
ప్రస్తుతి సేయ నపారశక్తులన్.

విచిత్రంగా మన వాతావరణంలో ఉదజని అత్యల్పంగా ఉంది (0.55 parts per million), కాని నీటిలో అధికభాగం, సూర్యునిలో అధిక భాగం (70% పైన) ఉదజనియే ఉంది. సూర్యునిలో ఉదజని యొక్క అణుసంయోగం వలననే మనము వేడి, వెలుతురు పొందుతున్నాము. ఈ అణుసంయోగంలో సెకనుకు 60 కోట్ల టన్నుల ఉదజని హీలియంగామారుతుంది; సూర్యుని లోని ఉదజని అంతా హీలియం గా మారేందుకు 500 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చుననుకొంటున్నారు. అందువలననే ఈ వాయువు ‘అపారశక్తి’మంతమైనది.

చివరన సత్యనారాయణ గారు వాయువు విభవాన్నంతా ఒకే పద్యంలో అమర్చినారు.

శ్రీ విద్యుత్కణ విచ్ఛితిన్ సవితృ న
ర్చిష్మంతు గావించుచున్
ప్రావారంబయి చండదీప్తు లిలపై
రానీక వారించుచున్
ప్రావృట్కాలము గూర్చుచున్ వసుధ సౌ
భాగ్యప్రదాతృండునౌ
జీవశ్రీకరు సంస్తుతింతు జగతీ
క్షేమంకరున్ వాయువున్.

అంతరిక్షం లోని అగ్ని, వాయువు, జలము, భూమి అన్నిటిని ఒకచో చేర్చి సత్యనారాయణ గారు పంచభూతముల పరస్పరాశ్రితత్వమును తెలియజేస్తున్నారు.

వేదవాఙ్మయము లో తత్త్వప్రధానంగా ఉన్న పంచభూత స్తవములను అధునాతన విజ్ఞానశాస్త్రప్రభావంతో మనోహరమైన కావ్యరీతిలో పునఃస్తుతించి ఒక విశేషప్రక్రియను సాధించినారు సత్యనారాయణ గారు. పంచభూతముల ప్రాధాన్యతను వివరిస్తూనే, ఈ వనరులను మనం దుర్వినియోగం చేయకూడదని కూడా పలుచోట్ల వారు వారించారు.

ఈ తారావళి లో అన్నీ శార్దూల, మత్తేభ విక్రీడితాలు కావడం గమనార్హం. ఈ వృత్తప్రయోగం విషయగాంభీర్యానికి తగినట్లుగా ఉంది. శైలి ఒక్కొకచో సరళంగా, ఒక్కొకచో ప్రౌఢంగా విషయానుసారంగా ఉంటుంది. నన్నయ గారి ప్రసాదగుణం సర్వత్రా వ్యాపించి ఉంది. పద్యం ఎత్తుగడలోనే –

‘నవమంత్ర ప్రథమాత్త సూక్త ఘనసంజ్ఞానైక ఋగ్వేదు..’

‘ఈ మార్తాండ కుటుంబమండలమునం దీ ధాత్రికిన్ ..’

‘తుహినాచ్ఛాదిత శైలరాజములు నస్తోకాంబురాశుల్ మహామహిమోదార …’

వారి అనర్గళమైన ప్రసన్న కవితాధార కనుపిస్తుంది. ద్విత్వాక్షరములతోనున్న దుష్కరప్రాసలను వీరు విశ్వనాథ వారి వలెనే సులభంగా సాధించగలరు.

“విశ్వగ్వాయూజ్జ్వల”, “శివశిఖావ్యాలోలపర్యస్తికా ప్రాకామ్యహ్రదము”, “వైద్యుతాగ్ని”, “బహుళోహానివహంబు”, “సస్యస్నిగ్ధ హేరాళము”, “శ్రీవిద్యుత్కణవిచ్ఛితి” వంటి పదబంధాలు, సమాసగ్రథనము కూడా విశ్వనాథ వారి ప్రభావాన్ని తెలుపుతున్నాయి.

పద్యము వ్రాసేవారే కరువైన రోజులలో, ప్రౌఢమంజులమైన శైలిలో భావబంధురంగా విజ్ఞానమయమైన కృతిని అందజేసినందులకు శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారికి తెలుగువారందరూ కృతజ్ఞులై ఉండాలి.

వారీ కృతికి ‘పంచవటి’ అని నామకరణం చేశారు కనుక‌ వాల్మీకి నొకసారి స్మరించుకోవాలి.

“ఇదం పుణ్య మిదం మేధ్య మిదం బహుమృగద్విజమ్, ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా.”

***

పంచవటి (పంచభూతాల తారావళులు)
రచన: ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
పేజీలు: 291
వెల: ₹ 400.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
~
అజో-విభొ-కందాళం ఫౌండేషన్
3-3-24/1ఎ, మొదటి అంతస్తు
ఎక్‌బొటె హౌస్, వైశ్య హాస్టల్ ఎదురుగా,
కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ – 500027
ఫోన్ : 040-40179673

~
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/anchavatipanchabhutha-tharavalulu?

Exit mobile version