Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పంచుకోవడమే పెంచుకోవడం – పాండవుల ప్రస్థానంలో సమష్టి విజయం

[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘పంచుకోవడమే పెంచుకోవడం – పాండవుల ప్రస్థానంలో సమష్టి విజయం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

విజయసాధనలో దృఢ సంకల్పం మొదటిదశ. ఉద్యమస్ఫూర్తి సంకల్పాన్ని లక్ష్య సాధన దిశలో నడిపిస్తుంది. కార్యాచరణ ప్రణాళికలలో స్పష్టత ఉత్సాహాన్ని నింఫుతుంది. ముందుకు సాగిన ప్రతిసారి ఒక సమస్య పలకరిస్తుంది. సమస్యను ఎదుర్కొనే సన్నద్ధత దాని వెనుక ప్రచ్ఛనంగా ఉన్న అవకాశాన్ని చూపిస్తుంది. ఆశయం బలపడితే ధైర్యం సహకరిస్తుంది. సూర్యునికి ఛాయలా ధైర్యాన్ని సాహసం అనుసరిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడం.. అంతర్గత శ్రేష్ఠతను ఆదరిస్తుంది. సమష్టి తత్వం మార్గదర్శనను సహకారాన్ని అందిస్తుంది. బలహీనమైన నూలుపోగులన్నీ కలిస్తే బలమైన వస్త్రంగా తయారవుతుంది. భాగస్వామ్యంలో సృజనశీలత వెల్లివిరుస్తుంది. నమ్మకం కలిగిన భాగస్వామ్యం నీటి చెలిమ వంటిది. పంచుకోవడంలోనే పెంచుకోవడం సాధ్యపడుతుంది. బిందువు అనంతంగా వ్యాప్తమవడమే అభ్యుదయం.. అదే ఆనందానికి మూలమవుతుంది. ఆనందం ఆర్ణవమైతే విజయం విభవాన్ని ఇస్తుంది. ఆ విజయం సమాజానికి అంకితమైతే నూతన ఆధ్యయనాలు, నూతన సామర్థ్యాలు ఆవిష్కృతమౌతాయి. అనుక్షణం వినూతనంగా ఉండగలగడమే జీవితం.. దానిని ఆస్వాదించ గలిగితేనే జీవన సాఫల్యం. సమష్టి విజయాన్ని సమాజానికి అంకితం చేయడం వల్ల జీవన తత్వం సమగ్రతను సాధిస్తుంది.

మహాభారతంలో పాండవులు అడవిలో జన్మించి.. ధర్మరాజుకు దాదాపు పదునారు సంవత్సరాల వయసులో మునుల ద్వారా హస్తినాపురానికి చేరుకున్నారు. వారిదైన రాజ్యం అప్పటికే పెదతండ్రియైన ధృతరాష్ట్రుని అధీనంలో ఉన్నది. అతని కుమారుడైన దుర్యోధనుడు అప్పటివరకు భావి చక్రవర్తిని తానేననే భావనతో ఉన్నాడు. పాండవుల రాక అశనిపాతమై ఆతని ఆశలను నీరుకార్చింది. కుట్రలు, కుతంత్రాలతో పాండవులను హతమార్చాలని పలు ప్రయత్నాలు చేసారు, కౌరవులు. ఆ క్రమంలో పాండవులు అన్యాయంగా రాజ్యాన్ని కోల్పోయి, అవమానాల పాలయి, అరణ్యవాస, అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది. తదుపరి వారు చేసిన సంధి ప్రయత్నాలు కూడా ఫలించని సమయంలో యుద్ధం అనివార్యమయింది. కృష్ణుని మార్గదర్శన, మిత్రుల సహకారం వల్ల యుద్ధంలో విజయాన్ని సాధించ గలిగారు.

దీనిని సంక్షిప్తంగా విశ్లేషణ చేసుకుంటే..

పాండవులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొని ధర్మాన్ని స్థాపించాలనే సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. దీనిని ‘విజయసాధనలో దృఢ సంకల్పం మొదటిదశ’ అనుకోవచ్చు.

రాజ్యాన్ని కోల్పోయి, అవమానాల పాలయి, అనివార్యంగా అరణ్యవాసం చేయవలసి వచ్చింది. నిజానికది వారికి పరీక్షాకాలమే. ఆ కష్టకాలంలో వారు విధిని తిడుతూ కూర్చోలేదు.. దానిని సాధనాపర్వంగా మార్చుకున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు జ్ఞానాన్ని, శక్తి సామర్ధ్యాలను పెంచుకున్నారు. మిత్రబలాన్నీ సంపాదించుకున్నారు. పదమూడవ ఏడు కౌరవులు రాజ్యాన్ని అప్పగించకపోతే జరగబోయే యుద్ధానికి అవసరమైన అస్త్రశస్త్రాలను సమకూర్చుకున్నారు. అర్జునుడు దివ్యాస్త్రాలు పొందాడు. భీముడు తన బలాన్ని మరింత పెంచుకున్నాడు. అరణ్య అజ్ఞాత వాసాలు వారికి సమస్యయే.. అయినా ఆ సమస్యల వెనుక దాగి ఉన్న అవకాశాన్ని వారు గుర్తించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

వారు నియమానుగుణంగా అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొని సంధి ప్రయత్నాలు చేసారు. అవి విఫలమయ్యాయి. యుద్ధం అనివార్యమయింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు మోహానికి, మమకారానికి గురై నిరుత్సాహంతో యుద్ధ విముఖుడైన సమయంలో శ్రీకృష్ణుని గీతోపదేశం మార్గదర్శన చేసింది, కర్తవ్యాన్ని ఉపదేశించింది. కర్తవ్య నిష్ఠ ధైర్యాన్ని నింపింది. ఆ ధైర్యమే సాహసంగా మారి యుద్ధరంగంలో విజయానికి దారి తీసింది.

పాండవుల విజయానికి ప్రధాన కారణం వారిలోని సమైక్యతా భావన.  ఐదుగురు సోదరులు ఒక్క త్రాటిపై నడిచి శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో ముందుకు సాగారు. వారి సంకల్పానికి ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి వంటి మిత్రులు సహకరించారు. వీటన్నింటి సమష్టి తత్వం ఉదాత్తమైన విజయాన్ని ప్రసాదించింది. బలహీనమైన నూలుపోగులు బలమైన వస్త్రంగా మారినట్లుగా ఒక మహాశక్తిగా రూపుదిద్దుకున్నాయి. బలమైన పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని, అల్పమైన ఏడు అక్షౌహిణుల సైన్యంతో ఎదిర్చగలిగారు.

పాండవులు తమ విజయాలను వ్యక్తిగత అధికార విస్తరణకు కాకుండా మైత్రి, భాగస్వామ్య భావనలను పెంపొందించడానికి తమతో పాటుగా ఇతరులను బలోపేతం చేయడంలోనే వినియోగించారు. దానితో పాండవులకు ఓడిన రాజ్యాల పాలకుల సంపూర్ణ విశ్వాసం, సహకారం సహజంగానే లభించింది. సాధించిన విజయాన్ని ఇతరులతో పంచుకోవడం, సమాజానికి అంకితం చేయడం ద్వారా ధార్మికులుగా గుర్తింపు పొందారు.

యుద్ధ విజయం తర్వాత యుధిష్ఠిరుడు స్వప్రయోజనం కోసం కాక, ప్రజల సంక్షేమం కోసం రాజ్యాన్ని పాలించాడు. సంక్షేమం అభివృద్ధి సమతూకంగా పాలించడం వల్ల అది ధర్మరాజ్యంగా పేర్కొనబడింది. తద్వారా సమాజ శ్రేయస్సు సాధ్యపడింది. ‘పంచుకోవడమే పెంచుకోవడం’గా మారినప్పుడు సాధించిన విజయం వ్యక్తిగత స్థాయిని దాటి సమాజ శ్రేయస్సుగా పరిణామం చెందుతుంది. దానితో పాండవుల విజయం తదుపరి, అధికార మార్పిడి సజావుగా జరిగిపోయింది. పాలనలో ప్రజల సహకారం  పూర్తిగా లభించింది.

Exit mobile version