[డా. శ్రీదేవీ శ్రీకాంత్ గారు రచించిన ‘పండిన కల’ అనే కథని అందిస్తున్నాము.]
వాన చినుకులు పడుతున్నాయి. తడిచిన మట్టి సువాసనతో, ఆ సంచారజాతి బండి నెమ్మదిగా మునిపల్లె వైపు కదులుతోంది. ఆ పల్లె వారికి ఆసరా ఇస్తుంది అనే భరోసా వారి మనసుల్లో. ప్రతి మనసులో ఎన్నో ఊహలు.
ఇంద్రధనస్సులో కూడా లేని కొత్తరంగులు వారి కళ్లల్లో. చుట్టూ ఆహ్లాదంగా పలకరిస్తున్న ప్రకృతి. ప్రతి మబ్బు వారితో మాట్లాడుతున్న భావన. గాలి మబ్బులని తాకి చేసే చిలిపి అల్లరికి మనసు కరిగిన మేఘాలు. వాన ముందువచ్చే ఆ మట్టివాసన మనసులను అల్లరి పెడుతోంది.
ఆకాశం కరిగినప్పుడు నేలను తాకే ప్రతి చినుకు ఎంత అబ్బురమైంది. భూదేవి నవ్వుతోంది. ఎపుడు పైకే చూసే పుడమితల్లి చూపుకు అర్థం ఈవాన అన్నట్టు ఉంది. నిదానంగా చినుకులు అవనిని ముద్దాడుతున్నాయి.
“ఓ రన్నో ఓ హొ రన్నో” అంటూ.. ఆలాపన ఎత్తుకుని “అందరూ గొంతు కలపండి రా” అన్నారు మల్లేసు, దుర్గమ్మ.
“ఈ ఊరు మనదేను అన్నా..
మనసులో చింత వలదురన్నా
చితికిన బ్రతుకులను పలకరించే..
వాన చినుకు కాలి గురుతులు
మనసులో చేసెలే సందడి..”
అందరూ గొంతులు కలిపి ఒక్కటిగా పాడుతున్నారు.
వాన జోరు అందుకుంది.. వానకు చిత్తడి అయిన నేల. ఎర్రమట్టిలో బండిచక్రాలు వేస్తున్న చారలు. అవి మామూలు గీతలు కావు. బ్రతుకు దారి గమ్యాన్ని సూచించే విధిరాతలు. బండి చక్రాల గరగరలు కూడా జీవితంలో చిన్న చిన్న సంకిష్టతలను గుర్తుతెస్తున్నాయా అన్నట్లు వింత తాళాన్ని పలికిస్తున్నాయి. ఇరుసు కీచు కీచు మంటూ శబ్దాన్ని చేయసాగింది. చక్రానికి ఇరుసు ఎంత ప్రాముఖ్యమో కదా? ఇరుసు సరిగ్గా ఉంటేనే బండి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. ‘బండి చక్రానికి, ఇరుసుకీ, జీవితానికి ఎంతో పోలిక’ ఉంది అనుకోసాగాడు ఆది అనే ఆ సంచార జాతి యువకుడు.
క్రమంగా చినుకు పరిమాణం పెరిగింది. వాన లయలో మరో కొత్త రాగం చోటు చేసుకుంది. అన్నీ అవలోకిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడు ఆది.
“బతుకు చిత్రం మాయ మార్గం
నేటి కేదో రేపు ఎవరో..
ఈ సంసార కూపాన
చిత్రాలు ఎన్నెన్నో శివా!
పిండితో చేసినా గణపతి
రూపమే మార్చావు శివా
పాపాలు శాపాలు
బంధ విమోచనలో..
నీ వెన్ని వింతలో శివా..
పొట్ట చేతన బట్టి..
ఊరూర తిరిగేటి…
బతుకులో స్థిరమేది శివా
బ్రహ్మ చేసిన మనిషి
విఘ్న రాజును చేయు
మట్టికే ఇచ్చావు శక్తి
బండరాయిని కాను
మనసున్న మడిసిని
నా బ్రతుకు పండించు శివా..
వాన దెంతటి నిర్ధయో
దారంత ముంచెలే
క్షేత్రాన్నిచూపించు శివా”
పాడుకుంటూ మనసులో శరవేగంతో వచ్చిపోయే ఆలోచనలతో కదులుతున్నాడు ఆది. ఆ బండి చేర్చే గమ్యం మీదే అతని కలలు – తనవారి ఆశలు. మట్టితో తను చేయబోయే వినాయక విగ్రహాల వివిధ ఆకృతులు అతని మనసులో మెదులుతున్నాయి.. మట్టిని తాకి ఆ మట్టికి రూపాన్ని ఇచ్చే నైపుణ్యం అతని చేతులలో ఉంది. క్షణాల్లోనే మట్టికి ప్రాణం పోసి, వినాయకుని రూపాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రతి విగ్రహం కళ్ళలో అతని స్వప్నాల వెలుగు ఉంటుంది.
ఆ సంచార జీవితమే వారి జీవనం, వారి పండుగ, వారి దుఃఖగీతం. ప్రతి పల్లె కొత్త ఆశలు తెచ్చినా, ఏదో తెలియని అనిశ్చితిని కూడా మోసుకొస్తుంది. అయినా, ఆ జాతికి చెందిన ఆది చక్కని కళా నైపుణ్యం కలిగినవాడు. అతని హృదయం మాట్లాడుతుంది – ‘గణపయ్యా! నా చేతుల గీతల్లో నాకే కాదు నా లాంటివారికి ఒక వెలుగుబాట దయచేయి.’ అతని మనసంతా చెప్పలేని ఆశలు.
అతని పక్కనే కిలకిలా నవ్వే ఆ అమ్మాయి – వేణి. ఆమె గళంలో విన్నపమే, ఆమె కన్నుల్లో కవిత్వమే. వారు చేసే విగ్రహాలు పల్లెపల్లెకు వెళ్ళినా, వారి కలలు మాత్రం ఎక్కడికి చేరతాయో ఎవరికీ తెలియదు. వేణి తల్లి దుర్గమ్మ, తండ్రి మల్లేసులా.. తత్వాలతో పాటు ఎన్నో పాటలు పాడుతుంది.
సంచార జాతి ప్రయాణం తరతరాల తలరాత. ఇంకా ఒడ్డుకు చేరని జీవితం వారిది. నిత్య ప్రయాణం వారిది. ప్రకృతి ఒడిలో అన్ని ఋతువుల దరహాసం వారి సొంతం. సూర్యుడు, చంద్రుడు మనసును తాకే వరవీణా నాదం వారిది.
***
తన పక్కనే వస్తున్న తన వారి బండ్లవైపు ఆప్యాయంగా చూశాడు ఆది.
ఆ సాయం సంధ్య మబ్బులు తమ బరువు తీర్చుకొనేసరికి, మునిపల్లె పెద్ద చెరువు దగ్గర ఆశల కొమ్మలతో విస్తరించిన వేపచెట్టు క్రింద సంచారజాతి బండి ఆగింది. బండిలోనుండి పిల్లలు దిగి పరుగు పరుగున వేపచెట్టుకు ఆనుకుని ఉన్న రావి చెట్టు కింద ఉన్న గట్టు దగ్గరకు వెళ్ళి ఆగారు. ఇది నా స్థలం, ఇది నా స్థలం అనుకుంటూ… చేతిలో ఉన్న సుద్దముక్కతో రాసుకున్నారు.
పక్కనే ఉన్న చిన్న చెరువులో నెలరాజు కిరణాల సోయగం తాకగానే విచ్చుకుంటున్న ముకుళిత కలువ మొగ్గలు ఆ ప్రాంతానికి మరింత అందాన్ని తెచ్చాయి. పొద్దుగుంక సాగింది అన్నట్టు సూర్యుడు ఒక్క సారి జాబిలి ఒడిలో సేదతీరి మేఘాల మాటునుండి కనుమరుగయ్యాడు.
బండి దిగగానే పిల్లలంతా చెఱువు వైపు పరిగెత్తారు.
“ఈ యాలప్పుడు వాగు లో దిగకండిరా!” అని అరిచింది వేణి తల్లి దుర్గమ్మ చెరువు వైపు వెళుతున్న పిల్లల్ని చూసి.
చూడగానే పరిసరాలు మర్చిపోయి దృష్టంతా వాగువైపే పెట్టి తమ చిరిగిన బట్టలు విప్పి వాగులో కేరింతలు కొట్టసాగారు పిల్లలు. కొందరు పిల్లలు నీటిలో రాళ్లు విసురుతూ ఆటలాడుతుంటే, కొందరు చాపలు పట్టసాగారు. ఆడవాళ్లు బట్టలు ఆరబెట్టుకుంటూ ఉన్నారు. వేణి మాత్రం వాళ్ల ఆకలి తీర్చడంలో తనకు ఎంతో బాధ్యత ఉన్నదానిలా రాళ్ళు పేర్చి, తెచ్చుకున్న కట్టెలతో పొయ్యి వెలిగించింది.
ఆది తండ్రి మంగయ్య, తల్లి వరమ్మ, బాబాయి శీనయ్య, ప్లాస్టీకు టార్ఫాలిన్ తో చిన్న గుడారాలు వేయసాగారు. ఆది అత్త దుర్గమ్మ, మేనమామ మల్లేసు దూరంగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నారు.
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వారితో తెచ్చుకున్న బండమీద నూరసాగింది వేణి.
“వేణీ! చాపల కూరలో కాస్త కారం ఎక్కువెయ్యవే. ఈ ముసురు తో పట్టిన గుబులు తీరిపోవాలి!” అన్నాడు ఆది చెరువులో పట్టిన చాపలు శుభ్రం చేసి వేణికి ఇస్తూ.
***
“బావా! మట్టి బొమ్మలకంటే రంగులు వేసిన బొమ్మలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది కదూ!”
“అవును వేణీ! హానికర రంగులు కాకుండా మంచి రంగులు మన వినాయకుడి బొమ్మలకు వేస్తున్నాము” అన్నాడు ఆది.
“అందాన్ని ఆస్వాదించడం కాదు, మనసు లోతుల్లోని ఏదో సున్నితమైన అలజడిని తాకే అనుభూతి ఉండాలి. అందం అనేది కేవలం కళ్లకే కనబడేది కాదు, హృదయం తాకేది. ఒక పువ్వు వికసించడంలో, వాన చినుకుల రాగాలలో, చిన్నారి చిరునవ్వులో, వృద్ధుడి జ్ఞానంలో – అందం ప్రతిచోటా ఉంది. సౌందర్యానుభూతి మనిషి మనసుకు ఒక శాంతి, స్ఫూర్తి, ఆనందం ఇస్తుంది. అది మన లోపలి గాయాలను నయం చేస్తుంది, మనసు గట్టిపడిన చోట మృదుత్వం నింపుతుంది. అందుకే కవులు కవిత్వంలో, చిత్రకారులు రంగుల్లో, సంగీతకారులు రాగాల్లో ఈ సౌందర్యాన్ని వెతుకుతారు” అన్నాడు ఆ బొమ్మలు చూడడానికి వచ్చిన ఒక పెద్దాయన.
“భలే చెప్పారు బాబూ మీరు అంది వేణి అతనివైపు కృతజ్ఞతగా చూస్తూ.
ఆది నవ్వి.. “బాగా చెప్పారు అయ్యగారు” అన్నాడు.
“నేను దేవుడిని మట్టితో మలుస్తాను, కానీ మాకు మనుషుల గుండెల్లో చోటు లేదు.. నా చేతులే ఆయన రూపాన్ని తీర్చిదిద్దుతాయి, కానీ నా గుండె ఆకలి తీర్చుకోలేవు” అన్నాడు వేదాంత ధోరణిలో ఆది.
“అయ్యగారూ! మేము చేసిన విగ్రహం ముందు వందలాది కొబ్బరికాయలు పగలగొడతారు.. కానీ మా ఇంట్లో బువ్వ కోసం ఎంత కష్టపడాలో!” అంది వేణి
***
“బావా! ఈ యేడు బొమ్మలు ఎక్కువ అమ్ముడై డబ్బులు వద్దే వత్తే నన్ను లగ్గమాడుతావా!?” అంది.. ఎత్తైన వినాయక విగ్రహం పైకి ఎక్కి రంగులు వేస్తున్న ఆదితో.
మట్టి విగ్రహానికి చివరి మెరుగులు ఇస్తూ వేణి వైపు చూసాడు ఆది.
“జవాబు సెప్పవా? బావా” అంది.
ఆది నవ్వాడు. ఆమె పాడుతోంది.
“మనసున మోగింది సన్నాయి మేళం
త్వరలో మనకు లగ్గమని సెపుతోంది
నా బావ గుండె లో నా పేరే మోగుతోంది…
ఈ సక్కటి ఎన్నెల్లో.. మల్లె పూల గుసగుసలు..”
వేణి స్వరంలో ఉన్న అమాయకత్వం ఆదికి బలం.
“వేణి.. ఎంత బాగా పాడుతున్నావే” అన్నాడు. ఆది మెచ్చుకునేసరికి వేణి కళ్లల్లో ఒకమెరుపు మెరిసింది. “ఈసారి మన బొమ్మలు ఎక్కువ అమ్ముడైతే, ఈ వలసజీవితం వదిలి ఒక చోట గుడిసె కట్టి స్థిరపడితే ఎంత బాగుంటుందో! అప్పుడే నిన్ను లగ్గమాడుతా” అన్నాడు.
“ఇనాయకుడు మనల్ని సల్లంగ సూత్తాడు. నువ్వు ఎక్కువ ఆలోచించమాకు బావా” అంది.
“కలిసింది మనసు.. కలిపింది కాలం.. నిన్ను ఈడి పోనంటుంది పరువం..” అంటూ పాడుతూ ఉంది వేణి.
“ఇన్ని పాటలు ఎక్కడ నేర్చావు. భక్తి పాటలు పాడవే.”
“నీ మీద భక్తితో పాడుతుండా బావా” అంది గలగలా నవ్వుతూ.
“అబ్బో! పిల్ల మంచి హుషారుగా ఉందే?”
“నేను ఎపుడూ హుషారుగానే ఉంటా. ఆది బావా నువ్వు పనిచేసేప్పుడు నాతో సరదాగా మాటాడవే! ఉత్తప్పుడు నువ్వు మాతడితే నీ మాటలతో నే ఒళ్ళంతా ఏదోగా అయిపోతాది” అంది వేణి.
“దేవుడి బొమ్మలు చేత్తున్నప్పుడు భక్తి శ్రద్దా ఉండాలే. నేను ఏడవతరగతి సదువుతున్నప్పుడు మా సాంఘిక శాస్త్రం మాష్టారు చెప్పారు.. చాలా రాజ్యాలు ఆడవాళ్ళ మీద, మొగవాళ్లకు ఉన్న ఇది వల్ల కూలిపోయాయి అంట. పృధ్వీరాజ్ చౌహాన్ అనే రాజు శత్రువులపై దృష్టి పెట్టకుండా, రాణి సంయోగిత పై ఉన్న ప్రేమలో మునిగి పోయాడంట. దీని వల్ల అతని రాజకీయ శక్తి బలహీనమై చివరికి మొహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు” అని మాష్టారు చెప్పారు.
“కథ చానా బాగుంది బావా.”
“కథ కాదే నిజంగా జరిగినది. పనిచేసేప్పుడు మనస్సుకు నిగ్రహం ఉండాలే. అప్పుడు చేసే పని అందంగా వచ్చుద్ది. నువ్వు కాసేపు నన్ను పనిచేసుకోనీ!”
“మా బాగా చెప్పావు. నీ పనికి భంగం కలిగించనులే! కితకితలు మాటలుకాక మామూలు మాటలు మాట్టాడు పర్వాలేదు” అంది పెద్దగా నవ్వుతూ.
“అది సరే ఇందాకా మాట్లాడతా ఇది అన్నావు అంటే ఏమిటి బావా?”
“ఇది అంటే ఇది అంటే మోహమే..,”
“అట్టాగా?”
“ఆది బావా నువ్వు ఇంకా సదవాల్సింది!”
“అప్పుడు పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి సదివాను. పిన్నమ్మ పెద్దబాబాయి బ్రతికి ఉంటే అలాగే సదువుకునేటోడ్ని. సరేలే కానివన్నీ అనుకోకూడదు.”
“అట్టాగేలే బావా! సూడు ఈ పల్లెలో ఈ ప్రకృతి, ఈ ప్రజలు, ఈ సెలయేరు ఇక్కడ ఎంత బాగుంది. పల్లెటూరిలో మనసు పచ్చకోక కడతది బావా!”
ఆది ఏకాగ్రతతో బొమ్మలు చేస్తున్నాడు.
“ఈ వినాయకుడు పార్వతమ్మ ఒడిలో కూర్చున్నట్టు ఈ బొమ్మ ఎంత బాగుందో. పార్వతమ్మ కళ్ళు ఎంత అందంగా ఏశావు బావా!”
“అవును వేణి.. అమ్మ కళ్ళల్లో ఆనందం బిడ్డ ఎదుగుదల కోరుతుంది.”
“నిజమేగానీ బావా! వినాయకుణ్ణి పూజ చేసి, చివరికి నిమజ్జనం సేత్తుంటే.. మన బ్రతుకులు చివరికి అంతం అయ్యే సంఘటన గుర్తుకు వత్తిది. నాకు పూజలు సేయడం వరకు బాగుంటుంది. ఆ నిమజ్జనం చూస్తుంటే.. బాధగా ఉంటది బావా!”
“అవునే వేణి.. నువ్వు చెప్పిన దానిలోనే మన జీవితం ఉంది.. ఆ పూజలు మన బ్రతుకు ఆశల ఇన్నపాలు.. ఆ నిమజ్జనం.. చివరికి ప్రతి బ్రతుకు అంతమే.”
“మనం బొమ్మకు వేసే రంగులు.. చూసే వారి కళ్ళల్లో ఆకర్షణలు.. రంగు లేకపోతే అందం ఉండదే.”
“నిజమే బావా! సృష్టిలో అందానికి ఎంత ఆదరణ. ఆ అందం రంగు రంగుల పూవుల్లో, పక్షుల్లో ఉండి ఈ సృష్టి మనకు ఒక స్వర్గం బావా!”
“ఒరేయ్! ఆదీ! బువ్వ తిన్దువు గానీ రారా!”
“అత్త పిలుస్తుంది. బొమ్మ పై నుండి దిగు బావా!”
దణ్ణం పెట్టుకుని, గుంజీలు తీసి “క్షమించు గణపతి..” అంటూ పది అడుగుల బొమ్మపై నుండి దిగుతూ.. “నీ మీదకి ఎక్కి రంగులు వేస్తున్నా. నీ మీదకి ఎక్కడం తప్పదు. నన్ను క్షమించాలి. నిన్ను తయారు చేస్తున్నప్పుడు నేను నీకు తండ్రిని అనుకో” అని నవ్వుతూ.. “నీకు చాలా మంది భక్తులు పూజలు చేస్తారు. అందుకే నిన్ను చాలా శ్రద్దతో చేయాలిగా. ఇంత ఎత్తున ఉన్న నీ పైన ఎక్కుతున్నా” అన్నాడు వినాయకుడి కళ్లల్లోకి చూస్తూ.
“బావా! చూడు వినాయకుడు నీమాటలు విని తొండం ఊపుతున్నాడు” అంది ఇంకా పూర్తికాని తొండం లో ఉన్న తీగల్ని ఊపుతూ వేణి.
“నా వినాయకుడు నాతో మాట్లాడుతాడే” అన్నాడు నవ్వుతూ ఆది.
***
ఆది మనసులో ఉన్న రంగుల ఆలోచనలను వేణి ముందు విప్పాడు.
వేణి క్షణం ఆగి, అతని ముఖాన్ని చూసింది. “బావా! నువ్వు రంగులు ఏవి ఏవి కలిపివేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు.”
“సృష్టిలో పువ్వులని చూసి నేర్చుకున్నాను. సీతాకోక చిలుకల్ని చూసి నేర్చుకున్నాను. రంగురంగుల పక్షుల్ని చూసి నేర్చుకున్నాను. కళ్లు వేయడం మాత్రం పద్మ రేకుల్ని చూసి నేర్చుకున్నాను. నా ఊహలు అల్లిన కదంబ మాలలు” అన్నాడు వేణి కళ్లల్లోకి చూస్తూ.
“నిజమే బావా! పురివిప్పిన నెమలిని చూస్తే ఈ ప్రకృతికి దేవుడు ఇచ్చిన వరం అనిపిస్తుంది”.
నవ్వుతూ.. “వేణీ! నువ్వు పాటలు పాడుతున్నప్పుడు మాత్రం నాకు కోకిల నీకు పాట నేర్పిందా? అనిపిస్తుంది” అన్నాడు.
“ఈ మునిపల్లె ఎంత బాగుందో కదా!? ఇక్కడే ఉండిపోతే!?”
“మన కలలు బొమ్మల్లాంటివి. అవి ఎంతో కాలం నిలవవు. ఈ బొమ్మలు పూజలు అందుకుని నీళ్లలో కరిగిపోయినట్టు, మనలో కలలు పుట్టి కాసేపు మనకు చక్కలిగింతలు పెట్టి కాలంలో కలిసిపోతాయి బావా.”
“నువ్వు అనుకున్నట్టు ఉండదులే. మనకు వినాయకుడిపై భక్తి ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది. ఈ బొమ్మలు కేవలం మట్టివి కావు.. మన శ్రమ అనే గాలి, మన ఆశ అనే నీరు తగలగానే జీవం పోసుకుంటాయి. గణపయ్య మనతో ఉంటే మన ఆశ నెరవేరుతుంది” అన్నాడు గట్టి నమ్మకంతో
అంతలో కొందరు పిల్లలు అటువైపు వచ్చారు. “అన్నా.. ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో! మేము దారిలో వచ్చిపోయే వారి దగ్గర చందాలు వసూలు చేసి డబ్బుతెచ్చాము. మేము గణపతిని చిన్నతాటాకు పందిరిలో పెట్టి పూజ చేస్తాము” అని ఉత్సాహంగా చెప్పసాగారు.. వారి మాటల్లోని స్వచ్ఛత, మాధుర్యం ఆది హృదయాన్ని కదిలించింది.
అదే సమయంలో పల్లె పెద్ద కాటయ్య, వస్తూనే పెద్ద గొంతుతో అరవసాగాడు.
“మీ సంచార జాతివాళ్ళు మా ఊర్లో బతికేది ఈ ఒక్క రోజే. ఇక్కడ గుడారాలు కట్టి కూర్చోకండి. మీరు వేసే చెత్త, మీ గుడారాలతో ఈ ప్రాంతం వికారం అవుతుంది” అన్నాడు.
ఆ మాటలతో వేణి ముఖం వాడిపోయింది. ఆది గుండెలోని ఆశలు ఒక్కసారిగా భారమైనట్టయినా, అభయం ఇస్తున్న విగ్రహ చేతికి రంగులు వేస్తున్న ఆదిలో తన దేవుడిపై నమ్మకం ఉంది. ఊరి పెద్ద అరుపులకు గాయమైన బాధను మనసులోపల అదిమి సమాధానమిచ్చాడు.
“మా బొమ్మలు దేవుని రూపం. మీ పల్లెకు వెలుగు. మీకు దేవుడు ఇచ్చే ఆశీస్సులు అయ్యగారు. ఈ కొన్ని రోజులు మేము చేసే ఈ వినాయకుని బొమ్మలు మనభక్తికి, మనకు ఎన్నో తరాలుగా వస్తున్న మన పండుగలకు, సంస్కృతికి, నమ్మకానికి నిదర్శనం అయ్యా!. స్థిరమైన జీవితం లేక ఇలా పాట్లు పడుతున్నాము మేము. మా జీవనాధారం ఈ బొమ్మలు. మాకు పండగ ఎల్లేవరకూ చోటివ్వండి అయ్యగారు , ఈ ఊరి ఇళ్లన్నింటికీ గణపయ్యని అందిస్తాము.”
“కబుర్లు చెప్పడం బాగానే నేర్చావు. మేము పట్నం నుండి వినాయకుడిని తెచ్చుకుంటాము. మీరు ఈ ప్రాంతం ఖాళీ చెయ్యండి. రేపటికల్లా మీరు ఇక్కడ ఉండడానికి వీలులేదు” అన్నాడు కళ్ళు ఎర్రజేసి అడుగులు గట్టిగా వేస్తూ కాటయ్య.
“బాబ్బాబు! పండగ అవ్వగానే వెళ్లిపోతాము అలా కటువుగా మాట్లాడకండయ్యా” అన్నాడు మల్లేసు కాటయ్య కాళ్ళమీద పడి.
మల్లేసును ఈసడించుకుంటూ.. . కాస్త దూరంగా జరిగి, “కుదరదని చెబుతున్నాగా!” అన్నాడు మరింత గొంతుపెంచి.
“దయగల వాడివి, మాకు ఇప్పుడు వచ్చే సంపాదన ఒక సంవత్సరానికి గ్రాసం బాబయ్యా!మీ మనసు మెత్తగా చెయ్యాలి” అన్నాడు మంగయ్య.
“సరేలే ఇంకో రెండు రోజుల్లో ఇక్కడినుండి పొండి” అంటూ విసురుగా అక్కడినుండి వెళ్ళిపోయాడు కాటయ్య.
“ఈ భూమంతా కొనేసినట్టు మనల్ని గదువుతున్నాడు” అన్నాడు వెళ్ళిపోతున్న కాటయ్య వైపు గుర్రున చూస్తూ శీనయ్య.
***
“బుగ్గలపై కన్నీటి చారికలు ఏంటే వేణీ!.”
“బావా నా గుండెలో కూడా చారికలు ఉన్నాయి”
“ఆశ రాలి పడిపోతున్నప్పుడు మనలో ఉన్న నమ్మకం మనల్ని నిలపాలి.. భయం పంజా విప్పినప్పుడు ధైర్యం రెక్కలు కట్టుకోవాలి వేణి అధైర్య పడకు” అన్నాడు ఆది వేణిని దగ్గరగా తెసుకుంటూ
“ఒక ముద్ద తిను. దిగులుగా ఉండమాకు” అన్నాడు అన్నం గిన్ని వేణి చేతికి ఇస్తూ.. “గుండెల్లో ఏదో తెలియని భయం. ఊరి పెద్ద మనల్ని ఎల్లిపోమన్నాడు. బువ్వ సహించదు. వద్దు” అంది దీర్ఘంగా ఆలోచిస్తూ.
‘గణపయ్యా! నువ్వు విఘ్ననాశకుడివి కదా.. మాకు ఒక మార్గం చూపించు’ అంటూ తన చేతిలో తయారైన వినాయకుడి రూపాన్ని చూస్తూ మనసులో మాటలాడుకున్నాడు ఆది.
ఆ క్షణంలోనే ఊరి పిల్లలు మళ్ళీ వచ్చారు.
“అన్నా! మీరు చేసిన బొమ్మలో నిజంగా గణపయ్య ఉన్నట్టు అనిపిస్తోంది. మీ వద్దనుండే వినాయకుడిని కొంటాము.. ఈ ఇనాయకుడు బొమ్మ ఎంత అవ్వుద్ది?” అన్నాడు ఒక కుర్రవాడు. “నీకు తక్కువకే ఇత్తాడు మా బావ. మీకు చందాలు వచ్చిన డబ్బుతో కొంటున్న పసిపిల్లలు మీరు” అంది.
పిల్లలు గెంతుకుంటూ.. వెళ్లబోయి.. ఆగి.. “శివుడు, వినాయకుడు తలనిమిరే ఈ బొమ్మ మాకు ఇయ్యండి. ఆ శివుడు అందర్నీ కాపాడినట్టు ఉంటుంది” అన్నాడు మరో పిల్లాడు.
“ఆ బొమ్మ కాదురా! వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరుగుతున్నట్లు ఉన్న ఈ బొమ్మ బాగుంది. అమ్మానాన్నల చుట్టూ చేసే ప్రదక్షిణం గొప్పదంట” అన్నాడు మరో కుర్రాడు.
“తన చేతుల్లో భారతదేశం మోస్తున్నట్టు ఉన్న ఈ వినాయకుడు బాగున్నాడు” అంది ఒక పిల్ల.
“మీకు నచ్చిన బొమ్మ ఊరికే ఇస్తాను” అన్నాడు ఆది పిల్లలతో.
“వినాయకుడు మీకు బాగా చదువునిస్తాడు. మనం ఏ పనైనా శ్రద్ధగా చేయాలి. మీరు దేవుడి పూజ భక్తితో చేయండి. మంచి దేవుడి పాటలు పాడండి దేవుణ్ణి పెట్టి” అన్నాడు ఆది.
పిల్లలవైపు తిరిగి.. “పిల్లలూ.. చెత్త పాటలు వినాయకుడి పందిరిలో ఎట్టకండి. భక్తి అంటే దీక్ష ఉండాలి మనసు శుభ్రం ఉండాలి” అంది వేణి పిల్లలవైపు ఆప్యాయంగా చూస్తూ .
***
ఆదిత్య చేస్తున్న మట్టివిగ్రహంపై చిన్న తుంపరలు పడి.. ఆ చినుకులు మెరిసి, ‘అది గణపయ్యే ఇచ్చిన సంకేతమా?’ అని అనిపించాయి.
ఆదితో సహా అందరూ మౌనంగా కూర్చున్నారు.. పిల్లలలో ఆకలి శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. వేణి గుడిసె మూలలో కూర్చుని ఉన్న ఆది దగ్గరకు వచ్చి కళ్లలో నీళ్లు పెట్టుకుంది.
“ఆది.. మనం ఎందుకు ఇలా జన్మించాం? ప్రతి ఊరు మనల్ని తోసేస్తుంది. మనలో ఉన్న కళను చూడకుండా, మన ఆకలి కన్నీళ్లను చూడకుండా.. ఈ లోకంలో దేవుడు ఉన్నాడా నిజంగా?” అన్నాడు కొడుకు కళ్లల్లోకి చూస్తూ మంగయ్య.
ఆది తండ్రి భుజం మీద చేయి వేసి, తనలోని తపనను దాచుకున్నాడు.
“అయ్యా!.. మట్టిని తాకి దేవుడి రూపం చేస్తాం మనం. ఆయన మన దగ్గరే ఉన్నాడు. కాస్త సహనంగా ఉండు. దేవుడ్నే మనం చేస్తాము. ఎందరో గొప్పా బీదా, కులం – మతం తేడా లేకుండా దేవుడ్ని కొనుక్కుని పూజిస్తారు. దేవుడు మనల్ని కాపాడతాడు” అన్నాడు. పైకి మాట్లాడుతున్నా గుండెలో చెలరేగే మంటలు ఆది ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించసాగాయి.
ఆది మనసులోపల ఆందోళనగానే ఉంది. ‘పల్లె పెద్ద రేపు ఉదయం నెట్టేస్తాడు. బీద జీవితాలు అతనికి అలుసు’ అనుకున్నాడు.
ఆ సమయంలో అకస్మాత్తుగా వాగు వైపు కేకలు వినిపించాయి. “అయ్యో! అయ్యో! పిల్లోడు వాగు లో పడి పోయాడు!” అని అరుస్తున్నారు. సంచారజాతి వాళ్ళు అందరూ అక్కడికి వెళ్లారు.
“గోపీ! గోపీ!” అనుకుంటూ గోపీ స్నేహితులు అరుస్తున్నారు. భయంతో తికమక పడుతుండగా, ఆది ఒక్కసారిగా వాగు లోకి దూకాడు.
కొంత సేపటి తరువాత నీటి తాకిడిని తట్టుకుని గోపిని తన చేతుల్లోకి తీసుకుని పైకి లేపాడు. ఆ క్షణం అతని చేతిలో మట్టివిగ్రహాలు ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది. గోపీ శరీరంలో ఉన్న నీటిని వత్తి తీసేశాడు ఆది. గోపీ దగ్గుతూ ఊపిరి పీల్చగానే అందరూ ఆనందంతో చూశారు.
గోపిని తన ఒళ్ళోకి తీసుకున్న గోపి తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
“బాబూ… ఆ గణపయ్యే నీ రూపంలో మా అబ్బాయిని కాపాడాడు” అని ఆది చేయి పట్టుకుని ఆప్యాయంగా చూసింది. “మా కొడుకును కాపాడావు. మీరు ఈ ఊర్లోనే ఉండాలి. మీరు చేసిన వినాయకుడు మా ఊరి గుండెల్లో ఉండాలి.”
ఆ మాట విన్న వెంటనే వేణి కళ్ళలో ఆనంద జలపాతం నిండింది. ఆమె గుండెల్లోని వేదన కరిగిపోతున్నట్టనిపించింది.
***
భూపాల రాగం వినబడుతోంది గుడిలో నుండి.. ఆకాశం రంగులు మార్చుకుంటూ వెలుగుతున్న వెలుగు అక్కడున్న వాగు నీటిలో పడింది.
గోపీని కాపాడిన సంఘటన తర్వాత ఊరి ప్రజలు సంచార జాతి వారిని వేరే కళ్ళతో చూడటం మొదలుపెట్టారు. పిల్లలు గోపి ప్రాణం కాపాడిన ఆది దగ్గరే గుంపులుగా చేరారు.
“అన్నా.. నువ్వు చేసిన వినాయకుడికి మేము పూజలు చేయకుండానే మా గోపీని కాపాడాడు. పూజలు చేస్తే ఇంకా బాగా మమ్మల్ని రక్షిస్తాడు కదా?” అని అమాయకంగా అడిగారు పిల్లలు .
వేణి వారికి తలమీద చేయి వేసి నెమ్మదిగా చెప్పింది:
“అవును పిల్లలూ.. గణపయ్య మనందరి మనసులోనే ఉంటాడు. ఆయన మట్టితో చేసిన రూపం మనం పూజిస్తాం, కానీ నిజమైన పూజ మనమనస్సులో ఉన్న ఆయనకు చేస్తాం. ఆ దేవుడి దీవెనలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి” అంది.
గోపీ తండ్రి ఆది దగ్గరకు వచ్చాడు. క్షణం ఆగి, ఆదిని చూసి –
“బాబూ.. నువ్వు చేసిన సహాయానికి నా మనస్సు కదిలింది. మీరు ఈ ఊరికి పరాయి వాళ్ళు కారు. నా వంశాన్ని నిలబెట్టావు. ఊరి పెద్ద మనసు మారాలి. కాటయ్య మనసు మాత్రం అంత తొందరగా కరిగేది కాదు” అన్నాడు.
ఆ మాట వేణి హృదయాన్ని బరువెక్కించింది.
“ఈ ఊరి ఆచారాలు, మన పెద్దల నియమాలు మిమ్మల్ని ఇక్కడ నిలువనివ్వవు. మీరు ఇక్కడ శాశ్వతంగా ఉండలేరు. నా మనస్సులో మీరు చేసిన ఉపకారం నిలుస్తుంది , కానీ మీరు ఇక్కడ ఉండలేరు. కాటయ్య అంత కఠినమైనవాడు” అన్నాడు గోపీ తండ్రి.
ఆది గుండెలో ఒక కత్తితో పొడిచినట్టైంది. వేణి కన్నీరు కారుస్తూ, గణపయ్య విగ్రహం పాదాలు పట్టుకుంది.
గోపి తల్లి ముందుకు వచ్చి, చిన్న వినాయక విగ్రహము ముందు గౌరవం, భక్తి పూర్వకంగా తన తల పెట్టుకుంది.
“మీ బొమ్మలో దేవుడు మాత్రమే కాదు, మీ వేదన కూడా ఉంది. ఈ ఊరు మిమ్మల్ని నిలువనివ్వకపోయినా, మీ హృదయం మాత్రం మా మంచి కోరే వినాయక ప్రతిమలకు రూపాన్నిఇచ్చింది. దేవుడే మీ మంచి మనసులకు పరిష్కారాన్ని చూపుతాడు. ధైర్యంగా ఉండండి” అని అందరికీ ఆహారం ఇచ్చింది గోపీ తల్లి.
కాటయ్యకు మాత్రం ఊరివాళ్ళు ఆదికి మద్దతు ఇవ్వడం నచ్చలేదు. ‘బీదవాళ్ళ గుడారాలు పల్లె అందాన్ని పోగొడతాయ’ని అతని నమ్మకం.
***
సూర్యుడు అస్తమించసాగాడు. ఆదివాళ్ళ బండ్లు ముందుకు కదిలసాగాయి.. ఊరిని వదిలి వెళ్ళబోతున్న వేణి కళ్ళల్లో తడిమడిగా కన్నీరు. ఆది మాత్రం మౌనంగా గాడిదల పగ్గాలు పట్టుకున్నాడు.
ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుపోయింది. గాలి విపరీతంగా వీచసాగింది. కొంత సేపటికి గాలి తగ్గి ఉరుములు మెరుపులతో ఆకాశం వికటాట్టహాసం చేయసాగింది. చుట్టూ ఎవరూ ఊహించని రీతిలో పల్లె చెరువు గట్టుపై పెద్ద పిడుగు పడి, నీటిలో అలజడి మొదలైంది.
వాగు గట్టు పగిలిపోసాగింది. నీరు ఉప్పొంగి ఊరిపై దూసుకొస్తోంది. పల్లె ప్రజల్లో భయం మొదలైంది.. ఆది బండి ముందుకు కదలడం లేదు. బండిని ఆపేసి వాగువైపు చూశారు.
‘మనం వదిలి వెళ్ళిపోతే ఈ ఊరు మునిగిపోతుంది. ఏం చెయ్యాలి?’ ఆది కళ్లల్లో ఏదో తళుక్కుమన్న ఆలోచన.
“వేణీ! మట్టితో గణపయ్యను చేయడానికి ఎంతో మట్టి పొగుచేసాము. ఆ మట్టిని మనం వాగు నీరు ఊరిలోకి రాకుండా అడ్డు వేద్దాము. అవసరమైతే మనం ఇక్కడ వదిలి వెళ్లిపోతున్న ఈ పెద్ద వినాయక విగ్రహాలను వాగుకు అడ్డు వేద్దాము” అన్నాడు ఆది.
మల్లేసు, శీనయ్య, మంగయ్య, దుర్గమ్మ , వీరమ్మ, పిల్లలు అందరూ ఆది ఆలోచనలకు మద్దతుగా నిలిచారు. వాళ్ళు వినాయకుడి బొమ్మలు చేయడానికి తెచ్చిన గుట్టల బండిని, పెద్ద వినాయకుడి విగ్రహాల్ని ఆ వాగు తెగిన చోట కట్టగా వేయసాగారు.
ఊరిలో ప్రజలు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కానీ గోపి “అన్నా! నేనూ సహాయం చేస్తాను” అని పరిగెత్తి వచ్చిన వెంటనే పిల్లలు, కుర్రాళ్ళు, ఆ తర్వాత మహిళలు, చివరికి పురుషులు కూడా చేతులు కలిపారు.
ఒక క్షణం.. మొత్తం ఊరు సంచారజాతి వాళ్లతో కలసి, మట్టిని గోడలా కట్టి చెరువుని ఆపింది. వాగు నీరు పల్లెను ముంచకుండా నిలిచిపోయింది.
ఊరు మొత్తం ఊపిరి పీల్చుకుంది. పల్లె పెద్ద, తడిసిన బట్టలతో , గట్టుపై కూర్చున్న ఆదిని చూసి నిశ్శబ్దంగా చేతులు కలిపాడు.
“మీరందరూ నన్ను క్షమించాలి. మిమ్మల్ని మా ఊరు ఖాళీ చేయమని ఎంతగానో తూలనాడాను. ఎక్కడైనా, మనం నడిచే దారిలో మనం వేసే ప్రతి అడుగు, ఆ అనుభవాల నుండి లభించే శాంతి మన హృదయానికి ఆనందం ఇస్తుంది. అందుకే వినాయకుడు ఆగ్రహం చెందాడు. మీరు మా ఊరిని రక్షించారు. ఈ ఊరు మీద మీకు హక్కు ఉంది. మీరు ఇకపై ఇక్కడే ఉండాలి” అన్నాడు.
ఆ క్షణం వేణి కళ్ళల్లో కన్నీటి ముత్యాలు మెరిశాయి. ఆమె ఒక్కసారి మనసు కుదుట పడినట్లు అయ్యింది. “మనది జన్మల కర్మ కాదు. మన వేదన, మన కళ, మన రక్తం – ఇవన్నీ దేవుడి రూపంలో నిలుస్తాయి. మనం నిస్వార్ధంగా పరోపకారం చేయడం దేవుడు గుర్తించాడు.. ఈ ఊరు ఇప్పుడు మన శాశ్వత గూడెం.”
వేదనతో పాటు విజయం
మానవత్వంతో పాటు భక్తి
సంచారజాతి కష్టాలతో పాటు ఆశ
రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. వాగు గట్టు పక్కన దీపాల వెలుగులు వెలిగాయి. ఊరి ప్రజలు ఒకే గళంలో నినదించారు: “వినాయకా! వినాయకా!” అంటూ.
ఆది, చేసిన వినాయక విగ్రహం ఊరి మధ్యలో ప్రతిష్ఠించారు. పిల్లలు గులాబీ పూలు చల్లుతూ ఉంటే, మహిళలు హారతులు పట్టారు. గోపి తల్లి ఆ విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని, కన్నీటితో నమస్కరించింది.
ఆది మాత్రం వెనకగా ఒక మూలన నిలబడ్డాడు.
“ఆది బావా, మట్టికి మనసుంటుంది. దానిని ప్రేమగా మలచినవాడికి అది ఎప్పుడో ఒక రోజు వేర్లు వేస్తుంది. నువ్వు ఆ వేర్లు వేసినవాడివి.”
అంతలో పల్లె పెద్ద ముందుకు వచ్చాడు.
“బాబూ.. నిన్ను చూసి నేర్చుకున్నాం. మనిషిని మానవత్వంలో చూడాలి. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. మీరు ఇకపై ఈ ఊరికి పరాయి కాదు. ఈ ఊరే మీ ఊరు. మీ పిల్లలు మా పిల్లలే. మీ వినాయక బొమ్మలు మాకు దీవెనలు” అన్నాడు.
ఆ మాట విన్న వెంటనే ఊరివాళ్లు కరచాలనం చేశారు. చిన్నారులు ఆదిని చుట్టుముట్టి, అతని చేతులు పట్టుకుని నాట్యం చేశారు.
ఆది గుండెలో గాఢమైన వేదన కరిగిపోయింది. అతను వినాయక విగ్రహం ముందు నిలబడి, చేతులు జోడించాడు.
“గణపయ్యా.. ఇంతకాలం మట్టిలో మిమ్మల్ని మలచాను. ఈరోజు నువ్వే నా జీవితాన్ని మలిచావు.” జీవితంలోని బాధలు, తోటల మధ్య గాలి లాగా, మన మనసును మెల్లగా తాకుతూ, స్థిరత్వానికి నూతన గమ్యాన్ని చూపిస్తాయి.
వేణి ఆది పక్కన నిలబడి, ఆకాశాన్ని చూసింది. నక్షత్రాలు మెరుస్తున్నాయి, కానీ ఆమె కళ్లలో మెరుస్తున్న వెలుగు వేరే. అది కొత్తల ఆశ వెలుగు. వారి పండిన కలల రూపం.
ఆ క్షణం నుంచి వారు సంచారజీవులు కాదు. వారు ఆ ఊరి వారి గుండెల్లో చోటు సంపాదించిన కళాకారులు, భక్తులు, మనుషులు.
“మనం అంతా పూర్వం సంచార జీవులమే. ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న సంచారజీవులను అంగీకరించినప్పుడే సమాజం సంపూర్ణం అవుతుంది. కళ, మానవత్వం, భక్తి – ఇవే మనల్ని కలిపే వంతెనలు. ప్రతి దూరం మనసును కరిగించే ఓ ప్రయాణం; దూరమైన మనుష్య హృదయాలూ తిరిగి చేరడానికి ఎదురు చూస్తాయి. ఆ దూరాలు మాయమయ్యాయి ఈ సంచార జాతికి.
మట్టి వినాయకుడు.. ఆశ, భక్తి, మానవత్వాలకు ప్రతీక. సంచారజాతి స్థిర జీవితం.. విజయం, సంతోషాలకు చిహ్నాలు. ఊరి ప్రజల అంగీకారం.. సామాజిక సందేశం.. మానవ వికాసానికి ప్రతీక” అని చెప్పాడు గోపీ తండ్రి.
(సమాప్తం)
డా. శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం హైదరాబాద్. వీరి నాన్న గారు రవీంద్రనాథ్. ఇంజనీర్. తల్లి సుశీలాదేవి విద్యావంతురాలు.
డా. శ్రీదేవి శ్రీకాంత్ ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో ఉంటున్నారు. రెండు పీహెచ్ డీలు – క్లినికల్ సైకాలజీ, ట్రాన్స్ లేషన్ స్టడీస్ లో, ఎంబీఏ, ఎంఫిల్, ఐదు పీజీలు చేశారు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 175కిపైగా కథలు, 1750 తెలుగులో గజల్స్ తో పాటుకొన్ని ఆంగ్ల, హిందీ భాషలలో గజల్స్ రాశారు.
రెండు వందలకుపైగా తెలుగు కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జాన పద పాటలు రాశారు. ఆంగ్ల కవితలు,ఆంగ్ల పాటలు, సైకాలజీలో నాలుగు పుస్తకాలు (ఆంగ్లంలో) వ్రాశారు .The Solaris Bloom ఆంగ్ల కవితా పుస్తకాన్ని, భారత మాతాకు జై కథల పుస్తకం, తప్త తరణి నాటిక, దరహాస చంద్రికలు గజల్ సంపుటి మొదలైనవెన్నో పేర్కొన తగినవి. విశ్వ విలాపం గేయ కావ్యం తానా వారి పోటీలో విశిష్ట బహుమతిని అందుకొంది. నాలుగు నవలలు వ్రాశారు. ఉత్తమ సమీక్షకురాలుగా ప్రశంసలు అందుకున్నారు. చిత్రలేఖనం, కార్టూన్స్ లో ఎన్నో బహుమతులు అందుకున్నారు.
మరికొన్ని కథల పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. కథలపై లోతైన సమీక్షలు చేస్తుంటారు. సాహిత్యంతోపాటు చిత్ర లేఖనంలోనూ అనేక బహుమతులు, సన్మానాలు అందుకొన్నారు. అనేక సెమినార్స్ లో పత్ర సమర్పణ చేశారు. కార్టూన్స్, rock paint మొదలైన కళలలో ఉన్నారు.
కూచిపూడి, భరతనాట్యం, వీణ వాద్యంలో ప్రావీణ్యం సాధించారు. ఎన్నో బహుమతులు, సన్మానాలు పొందారు.
డా. డి. శ్రీకాంత్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సూపరింటెండెంట్. సబ్రాన మానసిక రోగ చికిత్సాలయం. బోట్స్వానా
