Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పండుగ

[శ్రీ బుద్ధవరపు రామకృష్ణ రచించిన ‘పండుగ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రాధాకృష్ణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమించుకుని పదిహేనేళ్లయింది.‌ పింఛన్ వస్తుంది.‌ నిజాయితీగా ఉద్యోగం చేసిన తృప్తి ఉంది. ఉద్యోగంలో ఉండగా హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంట్లో రాధాకృష్ణ, అతని భార్య సీతాలక్ష్మి ఉంటారు. ‌కాకపోతే, ఏడాదిలో దాదాపు ఆరు నెలలు విజయవాడలోనే గడుస్తుంది.‌ కొన్నాళ్ళు కొడుకు దగ్గరా. కొన్నాళ్ళు కూతురు దగ్గరా. దానికితోడు ఏడాదికోసారి తనలాగే పదవీవిరమణ చేసిన కొందరు సహోద్యోగులు, వారి, వారి శ్రీమతులతో సహా ఏదో విహార స్థలంలోనో, పుణ్యక్షేత్రంలోనో కలుసుకొని రెండు, మూడు రోజులు గడుపుతారు. ఇవాళ ఉదయం పూరీ జగన్నాథ స్వామివారి దర్శనం, సాయంకాలం సముద్రతీర విహారం ముగిసాయి. రాత్రి భోజనం ముగించుకుని బస చేస్తున్న ‘యాత్రానివాస్’ ఆవరణలో కూర్చుని ఒకరి తర్వాత ఒకరు బాల్యంలో తమపైన చెరగిని ముద్ర వేసిన సందర్భాలు గురించి మాట్లాడుకుంటున్నారు.

“ఇప్పుడు మీ వంతు” అన్నాడు మిత్రుడు భాస్కరం రాధాకృష్ణతో.

“ఐతే వినండి.” అన్నకాసేపటికి కూడతీసుకుని మొదలెట్టాడు.

***

అప్పుడు నాకు పదేళ్లు. ఐదో తరగతి చదువుతున్నాను. ‌‌ఆ రోజు పాఠాలు మనసుపెట్టి వినలేకపోతున్నాను. కడుపులో ఆకలి. ఇంతలో లంచ్ బెల్ మ్రోగింది. భారంగా లేచి పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకున్నాను.‌

ఇంటికి వెళ్ళాలి. ప్రొద్దున్న ఆకలి కడుపుతోనే బడికి బయలుదేరాను. ఇప్పుడైనా తినడానికేమైనా ఉందో, లేదో. లేకపోతే మళ్ళీ చింతబొట్టలు తినాల్సి వస్తుందేమో. ఆ చింత చెట్టు ప్రక్కవాళ్ళ యింట్లోది. కొన్ని కొమ్మలు మా ఇంట్లోకి వచ్చాయి. గ్రుడ్డిలో మెల్ల. ఆ బొట్టలు తినటానికి తియ్యగా ఉంటాయి.

ఆలోచనలకు బ్రేక్ పడింది. ఇంటి గుమ్మం దగ్గరకి చేరాను. గుప్పుమని చుట్ట వాసన ముక్కుపుటాలని తాకింది. ఒక్క నిముషం అన్నయ్య క్లయింట్ సుబ్బమ్మ వచ్చిందేమో, వేరుశెనగకాయలు, బెల్లం తెచ్చిందేమోనన్న ఆశ కలిగింది. తీరా చూస్తే అది మా ఇంటి ప్రక్కనే ఉన్న బ్యాంకు కాపలాదారు తవిటయ్య నోట్లోంచి గుప్పుమని వ‌స్తున్న చుట్ట పొగ. సుబ్బమ్మ కాదని తేలగానే నిస్పృహ ఆవహించింది.

మెల్లగా యింటి తలుపు దగ్గరవుతుంటే లోపలి నుంచి పంతులుగారి మాటలు వినిపించాయి. అప్పుడు తట్టింది. ఈ నెల సెప్టెంబరనీ, నాన్నగారి తద్దినం ఉందనీ. “ఇద్దరు భోక్తలు చాలా, ముగ్గురిని పిలవాలా” అని పంతులుగారు అడుగుతున్నారు. నేను కనబడగానే “బావున్నావా కృష్ణా!” అని పంతులుగారు పలకరించారు.‌ అమ్మ నన్ను చూసి చిన్నగా నవ్వింది. “ఇద్దరు భోక్తలు చాల్లెండి” అని అమ్మ పంతులుగారితో అంది. “మీరు‌ తిథి చెప్పనే లేదు”అని పంతులుగారు అనడంతోటే, “అయ్యో! నా మతిమండా! చెప్పనేలేదు కదా! వచ్చే ఏకాదశి నాడే తద్దినం.”

“సరేనమ్మా!” అని పంతులుగారు సెలవు తీసుకోబోతుండగా వీధి తలుపు చప్పుడయింది. అన్నయ్య లోపలికి వచ్చి, పంతులుగారిని చూసి, “మీరెందుకు వచ్చేరు?” అన్నాడు కొంచెం కోపంగా.

దానికి అమ్మ “నేనే పిలిపించాను చిన్నా! ఎల్లుండి మీ నాన్నగారి తద్దినం. ఆ విషయం మాట్లాడదామని” అంది బోధపరిచే ధోరణిలో.

అన్నయ్య రుసరుసలు. “మరేమి పనిలేక మందిని కనేసి మా నెత్తిని రుద్ది, ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. తల్చుకుంటే మండుతుంది.‌ తద్దినం, గిద్దినం పెట్టడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. పంతులుగారు మీరు దయచేయండి.‌ ఈ తద్దినం గొడవ మర్చిపోండి”.

 ”అదేమిట్రా అలా అంటావు! అమ్మనంటూ నేను బ్రతికున్నంత కాలం, ఎలాగో ఒకలాగ తద్దినం పెట్టవలసిందే.” అంది అమ్మ కొంత‌ పంతంగా, కొంత వేడుకోలుగా.

“అవునన్నయ్యా! సంవత్సరానికి ఒకసారే కదా” అన్నాను. దానికి అన్నయ్య విసుగ్గా “నీకెందుకురా పెద్ద మాటలు, వెళ్ళి చదువుకో! పో!” అన్నాడు.

నేను పెరట్లోకి వెళ్ళి చూస్తే వంట ప్రయత్నం ఏమీ చేసినట్లు కనబడలేదు, ఉసూరుమంటూ రెండు రాళ్లు పట్టుకొని, చింత బుట్టలు కొట్టి, తిని, నూతిలోంచి నీళ్ళు తోడుకొని కడుపునిండా తాగి ఇంట్లోకి వచ్చి గోడ గడియారం చూస్తే స్కూలు వేళయింది. బయలుదేరాను.

మధ్యాహ్నం మొదటి పీరియడ్ తర్వాత స్కూలు బంట్రోతు వచ్చి ఏదో కాగితం మాస్టారికి అందించి అక్కడే నిలబడ్డాడు. టీచర్ అతను తెచ్చిన సర్కులర్ ఇలా చదివారు “ఈ తరగతిలో ఇంకా ఫీజు కట్టని వాళ్ళ పేర్లు: బి.‌ రాథాకృష్ణ, కె. వెంకట్రావు. కట్టవలసిన సొమ్ము రాధాకృష్ణ రెండు నెలల ఫీజుకు గాను 11, వెంకట్రావు 6 రూపాయలు. మరో వారం రోజులలోగా ఫీజు కట్టకపోతే వీళ్ళ పేర్లు రిజిష్టర్ లోంచి తీసివేయబడును.”  అని చదివి, ఆ తర్వాత “ఇద్దరూ లేచి నిలబడండి” అన్నారు‌.

తప్పు చేసినట్టు తల దించుకుని నేనూ, వెంకట్రావు నిలబడ్డాము. ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయంది. అన్నయ్యకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

స్కూలు వదిలిన తర్వాత ఆకలి బాధతో మెల్లగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంతలో పెద్దన్నయ్య సంచితో ఏవో తేవడం కనబడింది.

“ఒరేయ్! ఈ సంచి అమ్మకిచ్చి వంట చెయ్యమను” అని చెప్పేసరికి కొంచెం ఉత్సాహం వచ్చింది. పరుగెట్టుకు వెళ్ళి ఒత్తులు చేసుకుంటున్న అమ్మతో “అమ్మా! పెద్దన్నయ్య బియ్యం, కూరలు తెచ్చాడు, వంట మొదలెట్టమ్మా” అని, వగరుస్తూ పెరట్లోని బత్తాయి చెట్టెక్కి ఒక బత్తాయి పండు కోసుకొని తిని, ఆకలి కొంత ఉపశమించిన తర్వాత క్రిందకు దిగి ఇంట్లోకి వచ్చేను.

చిన్నన్నయ్య తన గదిలో పట్టె మంచం మీద పడుకొని, కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని, కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో ఉన్నాడు. అంటే జేబులు ఖాళీ అన్నమాట.

మళ్ళీ వంటింట్లోకి వచ్చి చూస్తే, అమ్మ పెద్దన్నయ్యతో నాన్నగారి తద్దినం విషయం కదుపుతోంది. “పెద్దోడా! ఎల్లుండే మీ నాన్నగారి తద్దినం, తప్పకుండా పెట్టాలి” అంటూ. బదులుగా “చూద్దాంలే అమ్మా!” అన్నాడు పెద్దన్నయ్య నెమ్మదిగానే.

“సరే నాయనా! చిన్నాడయితే తద్దినమే పెట్టనన్ననాడు, మీ యిష్టం” అంటుంటే అమ్మకు ఏడుపొచ్చినంత పనయింది. “చూస్తానమ్మా” అన్నాడు పెద్దన్నయ్య ఓదార్పుగా. ఆ మాట విని ఏ మూలో నాకు కూడా చిన్న ఆశ కలిగింది.

రాత్రి భోంచేసి పడుకుని మర్నాడు ఉదయం రాత్రి తినగా మిగిలిన చల్దన్నం తిని స్కూలుకి బయలుదేరేను. మధ్యాహ్నం యింటికి వచ్చేసరికి చిన్నన్నయ్య కూడా కోర్టు నుండి యింటికి వచ్చేసేడు. రాగానే నన్ను పిలిచి “నీ స్కూలు ఫీజు ఎంత కట్టాలిరా?” అని అడిగేడు. లేటు ఫీజుతో కలిపి రెండు నెలల ఫీజు 11 రూపాయలు కట్టాలన్నయ్యా” అన్నాను. అన్నయ్య జేబులోంచి పదిహేను రూపాయలు తీసి నాకిచ్చి, “మిగతా డబ్బులతో అమ్మనడిగి ఇంట్లోకి సరుకులు పట్టుకురా” అని చెప్పేడు. ఎల్లుండే తద్దినం. “ఆ మాట గుర్తు చేద్దామా” అనుకున్నాను గాని, నిన్న అన్నయ్య అన్న మాటలు గుర్తొచ్చి నోరు మెదపకుండా బయటకి వచ్చేసాను.

మా నాన్నగారు పోయిన తర్వాత పెద్దన్నయ్య కోర్టులో గుమస్తాగా, చిన్నన్నయ్య ప్లీడర్‌గా కుదురుకుని, మా సంసారాన్ని ఈదుకొస్తున్నారు. ఒడదుడుకులు మామూలైపోయాయి. ‌రేపు తద్దినం ఉంటుందో, లేదో అన్న ఆలోచనతోనే మర్నాడు స్కూలుకి వెళ్ళాను. ఫీజు మొత్తం ఖర్చుపెట్టి తద్దినం సామాన్లు తెస్తే బావుంటుందేమో అనిపించినా, అన్నయ్య తోలు తీస్తాడని భయమేసి ఆ ఆలోచన విరమించుకున్నాను.

బుద్ధిగా స్కూలు ఆఫీసులో ఫీజు కట్టి, నా తరగతి గదిలోకి వెళ్ళి ఠీవిగా కూర్చున్నాను. మళ్ళీ సర్క్యులర్ రానే వచ్చింది. అది ‌అందుకున్న టీచర్

“ ఫీజుకట్టని వాళ్ళ పేర్లు వెంకట్రావు”‌ అన్నారు. నా పేరు లేకపోవడం చాలా ఆనందంగా అనిపించి, గట్టిగా ఊపిరి పీల్చుకొని, నా స్నేహితుల వంక కొంచెం గర్వంగా చూసినా, వెంకట్రావు‌లేచి తల దించుకుని నిలబడడం చూస్తే బాధేసింది.

పాఠాలు వింటున్నానే గాని ‘రేపు తద్దినం పెడతారా, లేదా? నువ్వులుండలు, పాయసం తినే భాగ్యం కలుగుతుందో లేదో’ అని మథన పడుతూనే ఉన్నాను.‌ తద్దినం పెట్టడం దేనికో వివరంగా తెలియకపోయినా, నువ్వులుండలు తినే భాగ్యం ఉందో, లేదో అన్న చింత మాత్రం వెంటాడుతునే ఉంది. లాంగ్ బెల్ కొట్టారు. ఇంటికి బయలుదేరేను.‌

ఇల్లు దగ్గరవుతుంటే మళ్ళీ చుట్ట వాసన గుప్పుమంటోంది. ఈసారి తవిటయ్య మీద చాలా కోపం వచ్చింది. ‘చుట్ట కాల్చకపోతే కొంప మునుగుతుందా?’ అని మనసులో అనుకొని, ఇంటిలోపలికి అనాసక్తంగా వెళ్తుంటే.. తవిటయ్య కాదు. సుబ్బమ్మ! మా అన్నయ్య క్లయింట్.

బయటకు వస్తూ కనబడింది. ఒక్కసారిగా ఉబుకుతున్న సంతోషం. ఎందుకంటే, వేరుశెనక్కాయలు, బెల్లం తెచ్చి ఉంటుందనే నమ్మకం. ఆపుకోలేక సుబ్బమ్మని అడిగితే ”అడగాలా బావూ! బెల్లం పాకమే తెచ్చాను.” అంది  విశాలంగా నవ్వుతూ. ఫీజు తెచ్చినా, తేలేకపోయినా కొండల్లో పండినవి ఇంటికి తెస్తుంది. ఏవో భూమి విషయమై తగాదాలు. మా చిన్నన్నయ్య తనవైపు లాయర్. నోటిదాక వచ్చింది “ఫీజు తెచ్చావా?” అని అడుగుదామని. కానీ, చిన్నన్నయ్య కోపం మొహం గుర్తుకువచ్చి ఆగిపోయాను. ఆ రాత్రికి శెనక్కాయలు, బెల్లం పాకం లొట్టలేసుకుని తింటుంటే తద్దినం విషయం కొంత మరుగునపడింది. ఇంట్లో వాసు, రావు మరో ఇద్దరు అన్నయ్యలున్నారు. ఇంతవరకు తద్దినం సామాన్లు తెచ్చే ప్రస్తావన రాలేదు.

మర్నాడు యథావిధిగా ప్రొద్దున్న స్కూలుకి వెళ్ళిపోయాను.

లంచ్ బెల్ కొట్టగానే యింటికి బయలుదేరాను. గుమ్మం దగ్గిరే మళ్ళీ సుబ్బమ్మ కన్పించింది. అప్పుడే కోర్టు నుండి వచ్చినట్లుంది. “ఏం సుబ్బమ్మా! యిక్కడే కూర్చున్నావు? లోపలికి వెళ్ళలేదేమి” అని అడిగాను.‌ “లోపల ఏవో పూజలు జరుగుతున్నాయి బావూ!‌ నేను లోపలికి..” సుబ్బమ్మ ఇంకా ఏదో అనబోతుంటే, గబగబా లోపలికి వెళ్ళాను.‌ఏవో మంత్రాలు వినబడుతున్నాయి. కిటికి లోంచి చూసాను.

భోక్తలు భోజనం చేస్తున్నారు, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అక్కడే ఉన్నారు. వెంటనే పెరటిలోంచి వెళ్ళి “అమ్మా! ఓ రెండు నువ్వులుండలు ఇయ్యి” అన్నాను. అమ్మ “ఇంకా భోక్తల భోజనం కాలేదు” అంటూనే, చాటుగా రెండుండలు నా చేతిలో పెట్టింది. అవి తింటూ నూరువరహాల చెట్టు మీద కూర్చుని మనస్సులోనే ‘సుబ్బమ్మ తెచ్చిన పండగ’ అనుకున్నాను.

***

కథ పేరిట అరవయ్యేళ్ళు దాటిన గతంలో విహరిస్తున్న రాధాకృష్ణ వర్తమానంలోకి వచ్చి చూస్తే, అందరూ గంభీరంగా ఉన్నారు. అతని చెయ్యి నొక్కుతూ “కృష్ణా!” అని మాత్రం అనగలిగిన శివరావు, అందర్నీ ఉద్దేశించి “పదండి పడుకుందాం” అనడంతో, ఎవరి గది దారి వారు పట్టారు.

Exit mobile version