Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పనిలేని గోపాలం

[వెంకట బంధకవి గారు రచించిన ‘పనిలేని గోపాలం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“ఇంకా నిద్రపోలేదా? తొమ్మిది కావస్తోంది, డాక్టర్ గారు లేట్‌గా పడుకోకూడదన్నారా!” కొడుకు గదిలో లైట్ వెలిగి ఉండటంతో లోపలికొచ్చి పదేళ్ళ పార్దుని సున్నితంగా మందలించింది వైదేహి.

“పర్లేదులే, నేనేమీ స్కూల్‌కి వెళ్ళడంలేదు కదా? చాలా ఇంటరెస్టింగ్ వీడియో చూస్తున్నాను. అది ఫినిష్ చేసి పడుకుంటాలే!” సమాధానమిచ్చేడు పార్దు.

“ఏంటీ, నీ ఫేవరెట్ టాపిక్స్ మీదేనా?” అడిగింది వైదేహి.

“నీకు తెలుసా? ఈ ఆంత్రొపోలజీ (మానవశాస్త్రం) ప్రొఫెసర్ స్టూడెంట్స్‌ని అడుగుతోంది మీ ఉద్దేశంలో సివిలైజేషన్, ఆర్గనైజ్డ్ సొసైటీస్ ఎప్పుడు మొదలయ్యాయి? అని. వీల్ కనుక్కున్నప్పుడనీ, ఫైర్ పుట్టించడం తెలిసినప్పుడనీ, జంతువులని వేటాడే టూల్స్ మొదటిసారి తయారుచేసినప్పుడనీ, ప్లాన్డ్ సిటీస్ కట్టడం మొదలుపెట్టినప్పడినుండనీ ఆ స్టూడెంట్స్ అన్సర్స్ ఇస్తుంటే, అవన్నీ తప్పే అంటోంది.”

“మరి కరెక్ట్ సమాధానం ఏంటిట?” అడిగింది వైదేహి.

“ఆ మ్యామ్ ఇంకా చెప్పలేదు. చూసిన తరువాత చెబుతాను. రేప్పొద్దున్న దాకా ఆగు!” అని తల్లిని పంపించేసే ప్రయత్నం చేసేడు పార్దు.

వెడుతున్నది ఆగి, “అన్నట్టు చెప్పడం మరిచేను. ఎల్లుండి పొద్దున్న నేనూ, డాడీ ఒక పెళ్ళికి వెళ్లి రావాలి. ఒక రెండు గంటలంతే! నీకు తోడుగా డాడీకి తెలిసిన అంకుల్ ఒకాయన వచ్చి, నీకు కంపెనీ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం టైముకి మేము వచ్చేస్తాము. సరేనా?” అంది వైదేహి.

“మళ్ళీ ఇంకో బేబీ సిట్టరా? ఎవరా అంకుల్? పేరేంటి?” అయిష్టంగా మొహం పెట్టి అడిగేడు పార్దు.

“రేప్పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అప్పుడు డాడీ చెబుతారు, అప్పడి దాక ఆగు!” టిట్ ఫర్ టాట్ లాగా సమాధానమిచ్చి, గుడ్ నైట్ చెప్పి, ఆ గదినుండి నిష్క్రమించింది వైదేహి.

పార్దు, అతని తల్లి వైదేహి, తండ్రి ఆనంద్ జీవితాలని అల్లకల్లోలం చేసే విషయమొకటి ఒక సంవత్సరం క్రితం బయటపడింది. మొదట్లో చిన్న అనారోగ్యమే అనుకున్నా డాక్టర్స్ చివరికి పార్దు ‘అక్యూట్ మయిలోయిడ్ లుకేమియా’ అనే అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడని తేల్చేసారు. ఇమ్యూనిటీ బాగా దెబ్బతినడంతో, స్కూల్‌కి వెడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయనీ, ఆటల్లో దెబ్బలు తగిలితే తగ్గవనీ, స్కూలు, ఆటలూ రెండూ మాన్పించాల్సివచ్చింది. సహజంగా చాలా తెలివైనవాడు కావడంతో ఇంట్లోనే పుస్తకాలతోటి, ఫోన్లో వివిధ యాప్స్ తోటీ విపరీతమైన విజ్ఞానాన్ని తనతో తీసుకుపోవడానికి మూట కట్టుకట్టుకుంటున్నాడు. రకరకాల వైద్యాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, బతికే అవకాశం చాలా తక్కువనీ, ఇక అంతా అతని విల్ పవరూ, పైవాడి దయమీద ఆధారపడి ఉంటుందని డాక్టర్సు కూడా పార్దు తల్లిదండ్రులకు చెప్పేశారు.

***

అదే వూళ్ళో కొన్ని కిలోమీటర్ల దూరంలో డెబ్బయ్యవపడిలో వున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ మారుతీరావు తన ఇంట్లో ముందు గదిలో కుర్చీలో జారగిలపడి, అనాసక్తితో టీవీ చూస్తున్నాడు. కొంచెంసేపు భక్తి చానల్సు, అక్కడ అడ్వటైజ్మెంట్స్ వస్తుంటే న్యూస్ చానల్సు తిరగేస్తున్నాడు. వంటింట్లోంచి డబాడబామని గిన్నెల చప్పుడు వినిపిస్తోంది.

“కొంచెం గిన్నెల శబ్దం తగ్గిస్తావా? ఇక్కడ నేను టీవీ చూస్తున్నాను. వాల్యూం మరీ పెంచితే పక్కవాళ్ళు గొడవకొస్తారు.” గట్టిగా అరిచేడు.

“గిన్నెల శబ్దం లేకుండా పనులు ఎలా అవుతాయి? మీరొచ్చి చేసి చూపించండి!” టక్కున సమాధానం వచ్చింది వంటింట్లోంచి.

సన్నగా నవ్వి, కుర్చీ టీవీకి దగ్గరగా జరుపుకుని, మళ్ళీ చూడటం మొదలెట్టేడు మారుతీరావు. కొంచెంసేపటికి కాలింగ్ బెల్ మోగింది.

“మీరు తీస్తారా? నన్ను తీయమంటారా తలుపు?” వంటింట్లోంచి కేక వినవచ్చింది.

“నే తీస్తాలే, ఒంట్లో ఇంకా సత్తువ ఉందిగా! అది కూడా పోయిన తర్వాత చూద్దాంలే!” అని బదులు పలికి, మారుతీరావు కుర్చీలోంచి నింపాదిగా లేచి, ముందు తలుపు తీసేడు.

“ఏం బాబు? ఇవ్వాళ ఇంత లేటు అయ్యిందే? మరీ తొమ్మిది దాటిపోయింది. నాలాంటి ముసలివాళ్ళకు నీరసం రాదూ?” గడియారంకేసి చూసుకుంటూ అడిగేడు మారుతీరావు ఆ వచ్చిన వ్యక్తిని.

“సారీ అండీ, దారిలో బండి పాడయ్యింది, ఆటోలు కూడా దొరకలేదు. వేరే బండి ఎరేంజ్ చేసుకునేసరికి బాగా లేటు అయ్యింది. మళ్ళీ ఇలా అవ్వదులెండి.” అని చెప్పి, మారుతీరావు చేతికొక క్యారేజీ అందించి వెళ్ళిపోయాడా వ్యక్తి.

“అమ్మయ్య! మీ డిన్నర్ క్యారియరు వచ్చేసిందిగా? ఇక నేను బయలుదేరచ్చా?” వంటింట్లోంచొస్తూ అడిగేడు గోపాలం.

“నా వల్ల నీ భోజనం కూడా లేట్ అయ్యింది కదా? కావాలంటే, ఈ క్యారేజి ఇద్దరం సర్దుకుని తినచ్చు. ఒకళ్ళకి అని చెప్పినా ఇద్దరికొస్తుంది. నువ్వూ ఇంకొంచెం సేపు వున్నట్టవుతుంది.” ఇంచుమించు బ్రతిమిలాడుతూ అడిగేడు మారుతీరావు.

“లేదండి, వెళ్ళాలి, మీరు తాపీగా భోంచేసి మందులు వేసుకుని పడుకోండి. నేను రేపు మళ్ళీ వస్తానుగా? అన్నట్టు, రేపు సాయంత్రం కొంచెం లేటు అవుతుంది. ఒకాయన ముంబైకి ట్రాన్స్‌ఫర్ మీద వెడుతున్నాడు, ఐదు గంటల ట్రైన్ కి. స్టేషన్ కి వెళ్లి సెండాఫ్ ఇవ్వాలి.” చెప్పేడు గోపాలం.

“నాలాంటి కేసేనా?” కొంచెం ఆసక్తిగా అడిగేడు మారుతీరావు.

“అలానే అనుకోండి.” నవ్వుతూ, సమాధానమిచ్చేడు గోపాలం.

“అన్నట్టు, వారమయ్యింది కదా నువ్వు రావడం మొదలెట్టి? ఇంద తీసుకో!” అంటూ గోపాలం చేతిలో నాలుగు డబ్బులు పెట్టేడు మారుతీరావు. ఆయన ఎంత ఇచ్చాడో చూసుకోకుండా బయలుదేరేడు గోపాలం.

***

గోపాలం ఏకాకి. చిన్నప్పడినుండి ఒక ధ్యేయంలేని జీవితం గడపడటమే ధ్యేయంగా పెట్టుకున్నవాడిలా ఉంటాడు. చదువుల మీద శ్రద్ధలేక పదవ తరగతి తరువాత చేతులెత్తేసాడు. మొదట తల్లి, ఆ తరువాత తండ్రి అతన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయేరు. తండ్రి బతికున్న రోజుల్లో తన పరపతి ఉపయోగించి, గోపాలాన్ని ఏదైనా ఉద్యోగంలో కుదిర్చినా కొద్ది రోజుల్లోనే ఆ ఉద్యోగానికి తిలోదకాలు వదిలేవాడు. అప్రయోజకుడైన కొడుకుని కన్నందుకు బాధ పడటం తప్ప వారు చెయ్యగలిగిందేమీ లేదు. పోతూ, పోతూ అతనికోసం ఒక నాలుగొందల గజాల స్థలం, అందులో మధ్యలో వారికి వంశపారంపర్యంగా వచ్చిన ఒక చిన్న ఇల్లు వదిలి వెళ్ళేరు. కొందరు బాగా ఎరిగినవారికి తప్ప మిగిలిన వారందరికీ అతనంటే చిన్న చూపే. అతని గురించి మాట్లాడేటప్పుడు ‘పనిలేని గోపాలం’ అనో, ‘పనికిమాలిన గోపాలం’ అనో విశేషణాలు కలిపి సంబోధిస్తారు. ఇంతా చేసి, గోపాలం బద్ధకస్తుడేమీ కాదు. సమాజం మీద భారం కాడు. ఎవరినీ ఏమీ అభ్యర్దించడు. ఒక పెద్ద స్థితప్రజ్ఞుడిలాగా ఉంటాడు. తనకున్న దానితోటే తృప్తిగా బతుకుతుంటాడు. పైపెచ్చు ఎవరేమి సహాయం అడిగినా తనకి వీలున్నంతలో చేస్తాడు. బదులుగా వారేమైనా ఇస్తే అది తీసుకుంటాడే తప్ప, ఇంత ఇవ్వండని ఎప్పుడూ అడగడు. స్కూలు చదువులు లేవన్నమాటే కానీ లోకజ్ఞానం బాగా వున్నవాడు. సమయం దొరికినప్పుడల్లా ఇంటిదగ్గర వున్న స్థానిక లైబ్రరీలో దొరికిన పుస్తకాలన్నీ శ్రద్ధగా చదువుతాడు.

ఎలా మొదలయ్యిందో కానీ, గోపాలం గురించి తెలిసున్న వారిలో అతనికో పేరు వుంది. అతి కష్టకాలంలో వున్నవాళ్ళు తమ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి అతన్ని ఒక పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంటారు. తమ సమస్యలు చెప్పుకుని, మానసిక ధైర్యాన్ని కలుగచేసుకోవడానికి అతని సహాయం తీసుకుంటుంటారు.

ప్రస్తుతం అతని సహాయం పొందేవాళ్ళల్లో మారుతీరావు ఒకడు. కొద్దిరోజుల క్రితమే ఆయన భార్య పోయింది. పిల్లలు లేరు. ఏభయ్ ఏళ్ళు తోడుగా వున్న భార్య పోయేసరికి ఒక్కసారిగా ఒంటరి అయిపోయి, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పిచ్చెత్తినట్టయ్యింది. మానసిక వైద్యులు, గ్రీఫ్ కౌన్సెలర్ల మీద సమయం, డబ్బు ఖర్చు పెట్టడం దండగ అనిపించింది. తాను ఇంకా బతికివుండటంలో అర్ధం కనిపించక తన జీవితాన్ని అంతం చేసుకొని భార్య దగ్గరకి వెళ్ళిపోదామన్న ఆలోచన కూడా కలిగింది. చివరికి ఎవరో చెప్పగా గోపాలంతో మాట్లాడి తనకి మానసిక సంతులనం వచ్చేదాకా రోజుకి ఒకటి రెండు గంటలు తోడు ఉండమన్నాడు. గోపాలం పనల్లా సాయంత్రం పూట మారుతీరావు ఇంటికి వెళ్ళి, నాలుగు కబుర్లు చెప్పాలి. భార్య వంటింట్లో వంట చేస్తూ చేసే చప్పుళ్ళని బాగా మిస్ అవుతున్న మారుతీరావు గోపాలానికి వంటిట్లోంచి గిన్నెల చప్పుళ్ళు చేసే పని అప్పగించేడు. గోపాలం తూచ తప్పకుండా ఆ పని చేసిపెడతాడు. అతనికి వంట చెయ్యడం రాదు. ఆ అవసరం లేదు కూడా. ఆ చప్పుళ్ళు వింటుంటే మారుతీరావుకి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆయన క్యారియర్ రాగానే గోపాలం సెలవు తీసుకుంటాడు. దారిలో ఏ బండిలో అమ్మే టిఫినో, భోజనమో తిని, తన రోజు ముగిస్తాడు. గోపాలం సహాయం తీసుకోవడానికి వేళా, పాళా ఉండక్కర్లేదు. ఎవరు, ఎప్పుడు పిలిచినా తనకి వీలయ్యే పనైతే అక్కడ ప్రత్యక్షమవుతాడు.

***

మరుసటి రోజు సాయంత్రం గోపాలం రైల్వే స్టేషన్‌కి వెళ్ళేది కూడా మారుతీరావు లాంటి వ్యక్తికి సహాయం చెయ్యడానికే. ఆ ఊళ్లోనే ముప్ఫై ఏళ్ళపాటు ఒక బ్యాంకులో పనిచేసిన ప్రభాకరం ఒంటరి, పెళ్లి కాలేదు. అందరితోనూ ముక్కుసూటిగానూ, అంటీముట్టనట్టుగానూ ఉంటాడని పేరు. ఆయన అంటే సహఉద్యోగులకి అయిష్టత. ఆఫీసులో పార్టీలేమైనా జరిగినా పెద్దగా వెళ్ళడు, వెళ్ళినా, ఎవరూ ఆయన చుట్టూ చేరరు. ఇన్నేళ్ళు ఒకేచోట పనిచేసినా ఒక్క స్నేహితుడు కానీ, ఆప్తుడు కానీ లేడు. కొద్దిరోజుల క్రితం ఆయనకి ముంబై హెడ్ ఆఫీస్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ వార్త తెలిసి, ఆఫీసులో సంతోషించినవారే కానీ, బాధపడిన వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. మొక్కుబడిగా ఒక ఫేర్వెల్ పార్టీ ఇచ్చి వూర్కొన్నారు. ఆయన ముంబై వెళ్ళేది ఆ రోజే. తనని మిస్ అయ్యేవాళ్ళుకానీ, కనీసం స్టేషన్‌కి వచ్చి సెండ్ఆఫ్ ఇచ్చేవాళ్ళు కానీ ఉండరని తెలుసుకున్న ఆయన ప్రపంచం ఒక్కసారిగా బద్దలయ్యింది. తానేమీ తప్పు చెయ్యలేదే? ఎవరి గురించీ చెడ్డగా మాట్లాడలేదే? ముభావంగా వుండటం తన నైజం అంతే. ఈ మాత్రం దానికే ఇన్నేళ్ళు తన సేవలందుకున్న బ్రాంచిలో తనకి వీడ్కోలు పలికేవాళ్ళే లేరా? అన్న ఆలోచన ఆయన్ని మానసిక వ్యథకి గురిచేసింది. తనకోసం స్టేషన్ కొచ్చి, రైలు కదిలి వెళ్లిపోతుంటే తనకి చెయ్యి ఊపే వ్యక్తి ఒక్కడన్నా ఉంటే బావుండుననిపించిది. ఆయన అదృష్టం బాగుండి, ఆయనలాంటి వాళ్ళ ద్వారానే గోపాలం గురించి తెలిసింది. అతనికి పరిస్థితి వివరించి సహాయం కోరేడు. గోపాలం పనల్లా స్టేషన్‌కి వెళ్ళి, ఆయన్ను కలుసుకుని, చుట్టుపక్కల వాళ్ళు చూస్తుండగా ఆయన సామానులు లెక్కించి, అన్నీ ఎక్కాయో లేదో చూసి, కొంత హడావుడి చెయ్యాలి. ఆయన పక్కన కూర్చుని, ఆయన ఫోనులోనే తమ ఇద్దరికీ ఫోటోలు తియ్యాలి. రైలు కదులుతుంటే, దానితో పాటే కొంచెం సేపు నడిచి, ఆయనకి చేతులూపుతూ వీడ్కోలు పలకాలి. ఇదీ ఆ రోజు గోపాలం పని. ఎంతో నిబద్ధతతో ఆ పని చేసేడు. అది చూసి, ప్రభాకరం కళ్ళు చెమ్మగిల్లాయి. తోటి ప్రయాణికులు తనతో గోపాలానికి వున్న అనుబంధం ఎంతో గాఢమైనదిగా భావిస్తున్నట్లనిపించి, లోలోపలే సంతోషించేడు.

***

తన తల్లిదండ్రులతో పాటు తన గదిలోకి ప్రవేశించిన అపరిచితుడిని ఎగాదిగా చూసేడు పార్దు.

“ఒరేయ్, డుంబూ! నేను చెప్పిన గోపాలం అంకుల్ ఈయనే, గుడ్ మార్నింగ్ చెప్పు. మేము రెండు, మూడు గంటల్లో రిటర్న్ వచ్చేస్తాము, పక్కా! అప్పడిదాకా ఈ అంకుల్ ఇక్కడే వుండి, నీకు కంపెనీ ఇస్తారు. ఎప్పుడూ వచ్చేవాళ్ళతో నీకు బోర్ అన్నావు కదా? ఈ అంకుల్ మన మహేష్ అంకుల్ ఫ్రెండ్, సరేనా?” అన్నాడు ఆనంద్. నిన్న బ్రేక్‌ఫాస్ట్ దగ్గర పార్దుకి చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పేడు ఇద్దరి మధ్య ఐస్ బ్రేక్ చెయ్యడం కోసం, పైగా గోపాలానికి తన ఎక్స్‌పెక్టేషన్లు సెట్ చెయ్యడం కోసం.

నిజానికి ఆనంద్‌కి గోపాలం గురించి తెలిసింది కొద్ది రోజుల క్రితమే. మామూలుగా ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఆ ఊళ్లోనే వుండే తన తమ్ముడు, మరదలు తోడుగా వచ్చి వుంటారు. అయితే వాళ్ళు చెప్పే కబుర్లు పార్దుకి బోర్. వచ్చిన దగ్గరనుండీ వెళ్ళేవరకు వాళ్ళు వాడిమీద విపరీతమైన సానుభూతి చూపిస్తూ, ముద్దుముద్దు మాటలతో నవ్వించడానికి ప్రయత్నిస్తుంటారు. అది పార్దుకి నచ్చదు. వాళ్ళు ఎప్పుడూ “నీకు ఆరోగ్యం బాగయ్యిపోయిన తరువాత అమెరికాలో డిస్నీ వరల్డ్ తీసుకెడతాం, ఆగ్రాలో తాజ్ మహల్ చూపిస్తాం..” లాంటి తీపి కబుర్లు చెబుతుంటారు. తాము చెప్పేదాంట్లో నిజం లేదని తెలిసి కూడా వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటూ, తనని కూడా వెర్రి వెధవని చేసి మాట్లాడటం పార్దు సహించలేడు. అందుకని ఖరాఖండిగా అమ్మానాన్నకి చెప్పేడు, వాళ్ళతో తనని ఎప్పుడూ వదిలి వెళ్ళద్దని. గత్యంతరం లేని ఆనంద్ కి, అనుకోకుండా ఒక కొలీగ్ ద్వారా గోపాలం గురించి తెలిసింది. చాలా విముఖతతోనే అతని బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరాలు తీసేడు. ఏ మాత్రం భయపడక్కర్లేదు అని తన కొలీగ్ నచ్చచెప్పిన తరువాతే, ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని గోపాలాన్ని పిలిచేడు.

అనుమానాస్పదంగా గోపాలాన్ని చూస్తూ, పార్దు ‘గుడ్ మార్నింగ్’ చెప్పేడు. గోపాలం కూర్చోడానికి పార్దుకి కొంచెం దూరంగా కుర్చీ ఒకటి ఏర్పాటు చేసేడు ఆనంద్. పార్దు మాట్లాడిస్తేనే మాట్లాడమని, వాడి మానాన వాడు ఫోన్లో ఏ వీడియోలో చూసుకుంటుంటే డిస్టర్బ్ చెయ్యద్దనీ, ఏదైనా అవసరమైతే తమకి వెంటనే ఫోన్ చెయ్యమని అతనికి వైదేహి, ఆనంద్ ముందరే చెప్పేరు. అన్ని జాగ్రత్తలూ మళ్ళీ చెప్పి, బయలుదేరేరు.

***

గోపాలం కుర్చీలో కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకమేదో చదువుకుంటున్నాడు. మధ్యమధ్యలో పార్దు వైపొక చూపు విసురుతూ, ‘ఆల్ ఈజ్ వెల్’ అని నిర్దారించుకుంటున్నాడు. పార్దు తన ఫోనులో ఒక పక్క ఏదో చూస్తున్నాడే కానీ, ఇంకో పక్క ఈ కొత్త అంకుల్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ప్రత్యేకించి, ఈ అంకుల్ తనతో మాట్లాడటానికి పెద్ద ప్రయత్నాలేవీ చెయ్యకపోవడం అతనిలో ఒక రకమైన ఆసక్తిని కలుగచేసింది.

“అంకుల్! డాడీ నా గురించి మీకేమీ చెప్పలేదా?” అడిగేడు పార్దు.

“వివరంగా ఏమీ చెప్పలేదు. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వెళ్ళవలసివచ్చి, నన్ను రమ్మనమన్నారని మాత్రం తెలుసు.” సమాధానమిచ్చి, కొన్ని క్షణాలు పార్దుని పరికించి, తిరిగి తన పుస్తకం చదువుకోవడంలో నిమగ్నమయ్యాడు గోపాలం. అది పార్దు కుతూహలాన్ని మరింత పెంచింది.

“మీకు తెలుసా? నాకు ‘అక్యూట్ మయిలోయిడ్ లుకేమియా’ అనే డిసీస్ వుంది. అది చాలా సీరియస్.” చెప్పాడు పార్దు, గోపాలం రియాక్షన్ ఎలా వుంటుందో చూద్దామని. దాని అర్ధం ఏమిటో, పర్యవసానాలు ఏమిటో వివరించేడు. విన్న గోపాలానికి వాడి మీద జాలి వేసింది. కానీ ఏమనాలో తెలియక మొదట నిశ్శబ్దంగా ఉండిపోయాడు, తరువాత మెల్లిగా చెప్పేడు. చిన్న పిల్లలతో, ప్రత్యేకించి అలాంటి పరిస్థితిలో వున్నవారితో ఎలా మాట్లాడాలో తనకి తెలియదనీ, పార్దు తల్లిదండ్రులు కేవలం పార్దుని కనిపెట్టుకుని కుర్చోమన్నారనీ, అత్యవసర పరిస్థితి వస్తే ఫోను చెయ్యమని రెండు, మూడు నంబర్స్ ఇచ్చారనీ, పార్దుకి ఆకలేస్తే వారు ముందే తయారుచేసిపెట్టిన తినుభండారాలేవో ఇమ్మన్నారని తెలిపాడు.

నెమ్మదిగా పార్దు గోపాలంతో మరిన్ని మాటలు కలిపేడు. అతనిని కదిలించి, సమాధానాలు పొందటం అతనికొక ఇంటరెస్టింగ్ చాలెంజ్ లాగా అనిపిస్తోంది. గోపాలం దైనందిన జీవితం గురించి తెలుసుకున్నాడు. గోపాలానికి కూడా తనలాగే విజ్ఞానం రాబట్టడం ఇష్టమని, కాకపోతే ఫోన్లు, కంప్యూటర్లు వాడకుండా, ఇంటి దగ్గరున్న లైబ్రరీలో పుస్తకాలు బాగా చదువుతాడని తెలుసుకున్నాడు. అలాగే గోపాలానికి తన ఇష్టాయిష్టాలు చెప్పేడు. తానే స్కూల్లో చదివేవాడో చెప్పాడు. గోపాలం ఎక్కడుంటాడో అడిగేడు.

“ఇక్కడకి దగ్గిరే! మీ ఇంటి నుండి నీ స్కూల్‌కి వెళ్ళేదారిలో వచ్చే మలుపులో ఒక మాదిరి స్థలంలో వుండే ఇల్లే మాది!” చెప్పేడు గోపాలం.

ఆ విషయం తెలుసుకున్న పార్దు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే సర్దుకుని “ఓహ్! అది మీ ఇల్లేనా? నేను రోజూ సైకిల్ మీద స్కూల్‌కి ఆ ఇంటి ముందు నుండే వెళ్ళేవాడిని.” చెప్పేడు.

కొన్ని నిముషాల నిశ్శబ్దం తరువాత గోపాలాన్ని మరింతగా విశ్లేషించే ప్రయత్నంలో ఒక జటిల ప్రశ్న విసేరేడు పార్దు.

“అంకుల్! దేవుడు మనందరినీ మొదట చిన్న బొమ్మల్లాగా చేసి, ప్రాణం పోస్తాడు, మనం మరీ ముసలివాళ్ళమయ్యాకా తీసుకుపోతాడు! అని విన్నాను. మరి నాలాంటి వాళ్ళని అంత తొందరగా ఎందుకు తీసుకువెళ్ళిపోతాడు?”

ఏ విధమైన సమాధానం చెప్పాలా అని గోపాలం తర్జనభర్జన పడ్డాడు. “నిన్ను తొందరగా తీసుకెడతాడని ఎందుకనుకుంటున్నావు? నువ్వే చెప్పు, ఎందుకో?” తిరిగి, వాడినే అడిగేడు.

“నేను ఎన్నో ఆర్టికల్స్ చదివేను, వీడియోలు చూసేను, సమాధానం ఇంకా దొరకలేదు. కానీ మా బాబాయ్ ఏం చెబుతాడో తెలుసా? దేవుడికి తాను చేసిన బొమ్మల్లో కొన్ని బాగా నచ్చేసి, వాటిని తొందరగా తన వద్దకు తెప్పించుకోవాలని చూస్తాడుట. నేనయితే నమ్మలేదనుకోండి.” నవ్వుతూ చెప్పేడు పార్దు. అలానే తనకి వ్యాధి నయం కాగానే డిస్నీ వరల్డ్, తాజ్ మహల్ లాంటివి చూపిస్తానని తన బాబాయ్ ప్రామిస్ చేసిన విషయం కూడా చెప్పేడు.

“మీ బాబాయి చాలా మంచి వాడిలా వున్నాడు, నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా, కాకపోతే సినిమాలు బాగా చూస్తాడనిపిస్తోంది?” సన్నగా నవ్వుతూ అన్నాడు గోపాలం.

నర్మగర్భంగా గోపాలం వేసిన జోకుకి పార్దు గట్టిగా నవ్వేసి, “అవును, నిజమే!” అన్నాడు.

గోపాలానికి కూడా మెల్లిమెల్లిగా పార్దు ఆలోచనాపరంగా చిన్నపిల్లవాడు కాదని, బాగా విజ్ఞానాన్ని పొందడం వల్ల పరిణతి చెందినవాడని అర్థం అయ్యింది. వాడిని అమాయకుడిగా జమకట్టకుండా ఎలా మాట్లాడాలో ఆలోచించేడు. ఇంతలో అతనికి గోడ మీద పాకుతున్న చీమల బారు కనిపించింది. అవి చూపించి, చెప్పేడు.

“చూడు, అవన్నీ చక్కగా ఒక పద్దతిలో ఎలా వెడుతున్నాయో! అవీ మనలాగే రోజూ ఏదో పని చేసుకుంటూ, తిండి వెతుక్కుంటూ బతుకుతాయి; రోజూ ఇలా కిటికీ బయటనుండి వచ్చి, ఇక్కడ నీ టానిక్ బాటిల్ సైడుకి అంటిన తీపి మందు కోసమో, లేకపోతే మీ అమ్మ నీ కోసం పెట్టిన స్వీటు కోసమో వస్తాయి; ఏ రాణీ చీమో చెబితే పుట్టలు కడతాయి; అందులో సుఖంగా బతుకుతాయి; కానీ, ఏదో ఒక రోజు నీ చెయ్యి తగిలి నాలుగైదు చీమలు నలిగిపోయాయనుకో! ఆ పోయిన చీమలు చిన్నవా లేక వయస్సయిపోయినవా, అవి ఆ రోజే ఎందుకు పోయాయి అని నువ్వు ఆలోచిస్తావా? లేక అవి తమలో తాము డిస్కస్ చేసుకుంటాయా? లేదు కదా? చీమలు, ఇతర జంతువులు ఇవన్నీ ఆలోచించలేవని మనకు తెలుసు. కానీ మనుష్యులు అలా కాదు. అన్నీ అనవసరంగా ఆలోచిస్తారు, ప్రతిదానికీ కారణాలు వెతుకుతారు. ఎందుకంటే అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో మనుష్యులకి తెలివి, అంటే బ్రెయిన్, బాగా డెవలప్ అవ్వడం వల్ల. కాబట్టి, మనం కూడా అనవసరంగా మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఆ చీమల్లాగా బతికేస్తే మంచిదని నా ఉద్దేశ్యం. రేపటి గురించి అలోచించద్దు. ఏ రోజు కారోజు బతికేద్దాం.”

అతని సమాధానం పార్డుకి బాగా నచ్చేసింది. ఇలా రకరకాలుగా అనేక విషయాలు గోపాలంతో చర్చించేడు. కొన్ని విషయాలలో వాదప్రతివాదనలు కూడా చేసేడు. ఇంతలో పార్దు తల్లిదండ్రులు తిరిగి రానే వచ్చేరు. వెళ్ళిపోతున్న గోపాలానికి ఆనంద్ థాంక్స్ చెబుతూ, కొంత డబ్బు అప్పచేప్పేడు.

***

“డాడీ, గోపాలం అంకుల్‌కి వేరే జాబ్ ఏదీ లేదుట. వీలయితే అయన రేపు కూడా రావచ్చా?” డిన్నర్ తింటున్న తండ్రిని అభ్యర్ధించేడు, పార్దు. వాడి మాటలకి ఆనంద్, వైదేహి ఇద్దరికీ ఆశ్చర్యం కలిగింది. “అదేంటీ? నీకు ఎవరూ బేబీ సిట్టింగ్ చెయ్యకూదదంటావు? వాళ్ళతో మాట్లాడటం ఇష్టం వుండదంటావు? అంత బాగా మాట్లాడుతాడా అతను?” అడిగేడు ఆనంద్.

“ఆ అంకుల్‌కి చిన్నపిల్లలతో మాట్లాడటం సరిగ్గా రాదు. నన్నే ఎక్కువ మాట్లాడనిస్తాడు. అందుకే ఆ అంకుల్ నాకు నచ్చాడు.” అసలు విషయం చెప్పేడు పార్దు. వాడి లాజిక్ విన్న ఇద్దరికీ నవ్వొచ్చింది.

“నిజానికి ఆ అంకుల్ చాలా నాలెడ్జియబుల్, తెలుసా?” రెట్టించాడు పార్దు.

“అవునా? అదెలా పాసిబుల్? నాకు తెలిసి, అతనేమీ చదువుకోలేదు, ఉద్యోగం కూడా చెయ్యడు?” అనుమానం వెలిబుచ్చేడు ఆనంద్.

“ఐతే? నేను కూడా స్కూల్‌కి వెళ్ళడం లేదు కదా? నేను ఫోను, కంప్యుటర్ వాడి నేర్చుకుంటున్నట్టు, అతను ఓల్డ్ స్టైల్లో లైబ్రరీ నుండి బుక్స్ బారో చేసి, తెచ్చి చదువుకుంటాడు.”

“ఓహ్! అలానా? వెరీ గుడ్! అయినా, మేము బయటకి వెళ్లాలని చెప్పి, రెండు గంటలకోసం పిలిచేము. మేమున్నప్పుడు కూడా అతనెందుకు?” ప్రశ్నించింది వైదేహి.

“అదంతా నాకు తెలియదు, ట్యూషన్ చెప్పడానికి ఇంటికి ట్యూషన్ మాస్టర్స్ వస్తారు కదా? అలానే అనుకుని జస్ట్ కొన్ని రోజులు రమ్మనండి, ప్లీజ్.. ప్లీజ్..!” ప్రాధేయపడ్డాడు, పార్దు.

వాడి మొహం చూసి వద్దనలేకపోయారు ఆనంద్, వైదేహి. “సరే, అతనికి ఇలాంటి బేరాలు చాలా వుంటాయిట. వీలుంటుందో లేదో అడుగుతాను.” కొడుక్కి మాటిచ్చేడు ఆనంద్.

***

మరుసటి రోజు తిరిగి తన గదిలో ప్రత్యక్షమైన గోపాలాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ అడిగేడు, పార్దు “అంకుల్, మీకు తెలుసా? ఈ యూనివర్స్ (విశ్వం) ఏర్పడి 14 బిలియన్ (1400 కోట్ల) సంవత్సరాలయ్యిందని?”

“తెలుసు, కానీ మన భూమి ఏర్పడి 400 కోట్లు (4 బిలియన్) సంవత్సరాలు మాత్రమే అయ్యిందని నీకు తెలుసా?” ఎదురు ప్రశ్న వేసేడు గోపాలం.

“మరి హోమోసేపియన్స్ (మనుగడలో వున్న ప్రస్తుత మనుష్య జాతి) ఎప్పుడు మొదలయ్యిందో తెలుసా మీకు?” రెట్టించేడు, పార్దు.

“చాలా ఈజీ ప్రశ్న, మహా అయితే 3 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే! ఇప్పడి దాకా భూమిమీద పుట్టిన మనుష్యులందరికీ రోల్ నంబర్స్ ఇస్తే నీ నెంబర్ 12 వేల కోట్ల (120 బిలియన్) దగ్గర వుంటుంది. నీ కంప్యుటర్లో ఆ నెంబర్ పట్టుతుందా?” అడిగేడు గోపాలం.

“ఓహ్! చక్కగా పట్టుతుంది. మరి మీ రోల్ నెంబర్ ఎంత వుంటుంది?” కుతూహలంగా అడిగేడు పార్దు.

“నాది, నీ పేరెంట్స్‌ది నీ కన్నా బహుశా ఒక 500 కోట్లు (5 బిలియన్లు) ముందర వుంటాయి.” చెప్పేడు గోపాలం.

గోపాలం పార్దుకి లక్షలు, కోట్లు అంటే ఏమిటో, అలాగే పార్దు గోపాలానికి మిలియన్లు, బిలియన్లు అంటే ఏమిటో, కామాలు పెట్టడంలో తేడాలేంటి లాంటివి వివరించుకోవడంతో సమయం ఇట్టే గడిచిపోయింది.

టైమయ్యి, వెళ్ళిపోతున్న గోపాలంతో పార్దు “అంకుల్, మీరేమీ అనుకోనంటే మీకొక విషయం చెప్పాలి. లాస్ట్ ఇయర్ సుమ్మర్ హాలిడేస్‌లో మీ ఇంట్లో ఉన్న మామిడి చెట్టు నుండి కాయలు దొంగిలించడానికి నేను, నా ఫ్రెండ్స్ రాళ్ళు విసిరితే మీ కిటికీకి తగిలి దాని అద్దం పగిలింది. దానికి ఐ యాం వెరీ వెరీ సారీ!” గిల్టీగా మొహం పెట్టి, భయపడుతూ చెప్పేడు.

“ఓర్నీ, మీరేనా ఆ పని చేసింది. నన్నడిగితే నేనే కోసి ఇచ్చేవాడిని కదా?” నవ్వుతూ అన్నాడు గోపాలం.

“మా డాడీకి నిజం చెప్పి, విండో రిపేర్‌కి అయ్యింది మీకిమ్మని అడుగుతా ఇవ్వాళ!” చెప్పాడు పార్దు. నెత్తి మీదనుండి పెద్ద బరువు తీసేసినట్టనిపించిది. పర్లేదులే అన్నట్టు చెయ్యి విదిలించి, వెళ్ళిపోయాడు గోపాలం.

***

“గుడ్ మార్నింగ్ చిల్డ్రెన్! అటెండెన్స్ చెప్పండి, రోల్ నెంబర్ 120 బిలియన్!”, తన చేతిలో వున్న పుస్తకంలో వేలితో రాస్తూ గోపాలం తన రాకని తెలియపరిచేడు.

వెలిగిపోతున్న మొహంతో “ప్రెజెంట్ సార్!” అని తిరిగి పలకరించేడు పార్దు.

తలుపు పక్కనే నుంచుని, ఈ తతంగాన్ని వింటున్న వైదేహి ఒక పక్క ఆనందంతో, ఇంకో పక్క బాధతో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. పార్దు కోరికపై అతని తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనను కాదనలేకపోయిన గోపాలం గత కొద్దిరోజులుగా వాళ్ళింటికి ఇంచుమించు ప్రతిరోజూ వస్తూ వెడుతున్నాడు. అతడు వచ్చిన రోజు పార్దు తమతో కూడా సంతోషంగా మాట్లాడటం, అలానే ఏదైనా ఒకరోజు అతనికి రావడం కుదరకపోతే ఆ రోజు పార్దుని ఏదో నిరుత్సాహం ఆవరించడం వాడి తల్లిదండ్రులు గమనించకపోలేదు.

ప్రపంచజ్ఞానానికి సంబంధించిన విషయాలతో పార్దుని ఉల్లాసపరచడానికి గోపాలం ఎంత ప్రయత్నించినా అడపాతడపా వారి సంభాషణలు వాడి పరిస్థితి మీదకీ, వాడిని వేదిస్తున్న అంతుచిక్కని జీవన్మరణ సమస్యల మీదకీ మళ్ళడం తప్పట్లేదు. వాడు అడగపోయే ప్రశ్నలకి సమాధానాలు ఒక క్లాసు టీచర్ లాగా వచ్చే ముందే ఆలోచించడం కూడా గోపాలానికి దైనందిన చర్య అయిపోయింది.

గౌతమబుద్ధుడిలాగా ఎవరికీ చెప్పకుండా తాను కూడా ఇంటిలోంచి వెడిపోతే ప్రయోజనమేమన్నా ఉంటుందా అని అడిగేడొకరోజు పార్దు. ఆ రోజులు వేరనీ, మానవజన్మ మీద ఆ రోజుల్లో వున్న దానికన్నా ఈ రోజుల్లో అవగాహన బాగా పెరిగిందనీ, ఈ రోజుల్లో అలా చెయ్యడంవల్ల తనకి ఇబ్బందులు కలగడమే కాక, మరీ చిన్నపిల్లవాడవడంవల్ల అతని తల్లిదండ్రులకి కలిగించే మానసికక్షోభ సబబు కాదనీ, మొత్తం మీద ప్రయోజనాల కన్నా, నష్టమే ఎక్కువ అనీ, దరిమిలాను అటువంటి ఆలోచనలేవీ చెయ్యద్దనీ అతనికి నచ్చచెప్పేడు గోపాలం.

***

క్యాలెండర్లో రోజులు వేగంగా దొర్లిపోయాయి. ఆ రోజు గడచిన కొద్ది రోజులకన్నా భిన్నమైనది.

“అంకుల్! ఒక ఇంపార్టెంట్ న్యూస్. మేము రేపు ఢిల్లీ వెడుతున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. అక్కడ నన్నొక పెద్ద డాక్టరుకి చూపిస్తారుట. మరి, రేపటి నుండి మిమ్మల్ని కలవడం కుదరదు”. బాధగా చెప్పేడు పార్దు.

“ఓహ్! అలానా, పోన్లే మంచిదేగా? అక్కడ నీకు మంచి ట్రీట్మెంట్ దొరికి, అంతా నయం అయిపోతే చక్కగా తాజ్ మహల్ చూడచ్చు, మీ బాబాయి చెప్పినట్లు,” లేని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు గోపాలం.

అతని మాటలకి పార్దు పకపక నవ్వడం పక్కగదిలో పనిచేసుకుంటున్న వైదేహికి వినిపించింది. ఈ మధ్యకాలంలో పార్దు అంత గట్టిగా నవ్వడం తనకి గుర్తు కూడా లేదు.

ఉన్నట్టుండి అడిగేడు పార్దు, “అంకుల్, మరి మీరు ఒంటరిగా వుంటారు కదా? మీకే రేపు ఇలాంటి సీరియస్ ప్రాబ్లెం వస్తే ఏం చేస్తారు? మీకెవరున్నారు”.

చిన్నపిల్లవాడికి తాను చెప్పేది అర్ధం అవుతుందా, అవ్వదా అని చూడలేదు గోపాలం. తన మదిలో ఎప్పడినుండో నిబిడీకృతమైన జీవనసారం ఒక్కసారిగా అతని ప్రమేయం లేకుండానే తన్నుకొచ్చినట్లయ్యింది..

“నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ భూమి పుట్టి 400 కోట్లు అయ్యిందనీ.., మనుష్య జాతి పుట్టి కేవలం 3 లక్షల సంవత్సరాలు మాత్రమే అయ్యిందనీ.. ఉదాహరణకి ఈ భూమి వయస్సు 24 గంటలు అనుకుంటే, మానవజాతి చరిత్ర 23 గంటల 59 నిముషాల 30 సెకండ్లకి మొదలయ్యినట్లు లెక్క. ఈ 30 సెకండ్లలో ఇప్పడిదాక ఈ భూమిమీద మనలాటి వాళ్ళు 12 వేల కోట్ల మంది పుట్టిపోయారని మనకు తెలుసు. అంటే, ఈ భూమి దృష్టిలో మన జీవితకాలం ఒక రెప్పపాటులో లక్షోవంతు కన్నా తక్కువ. అలాంటి ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది, ఎవరు ముందు పోతున్నారు, ఎవరు తరువాత పోతున్నారు అనేదాని గురించి ఆలోచించడం ఒక వృథా ప్రయాస. మనం దీపావళికి ‘థౌసండ్ వాలా’ అని టపాకాయ జడలు కాలుస్తాము కదా? ఈ 12 వేల కోట్ల మందిమి అలాంటి జడలో టపాకాయలు లాంటి వాళ్ళం. ఒక చివర నుండి పేలుకుంటూ పోతున్నాము. అప్పుడప్పుడూ నిప్పురవ్వలు ఎగిరి పడి, వరుసక్రమం తప్పి, కొంచెం తరువాత వున్నవి కూడా ముందర పేలుతుంటాయి కదా? ఇక్కడా అంతే! 1400 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన ఈ విశ్వంలో ఈ భూమి, ఇతర గ్రహాలూ 500 నుండి 400 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టడం యాదృచ్చికమవచ్చు. అందులో ఒక గ్రహం అనుకోకుండా జీవరాసులకి అనువుగా వుండటం, ఆ గ్రహం పుట్టిన కొన్ని వందల కోట్ల సంవత్సరాల తరువాత మాత్రమే మన ముత్తాతలు పరిణామ క్రమంలో పుట్టడం కూడా అంతే యాదృచ్చికమవచ్చు. పుట్టిన వాళ్ళు రకరకాల కారణాల వల్ల, రకరకాల పరిస్థితుల్లో పోవడానికి పెద్ద కారణాలు వెతకక్కర్లేదు. కాదు.., లేదు.., ఇదంతా ఎవరో ఒక పైవాడి కథా, కథనం ప్రకారమే జరుగుతోంది అనుకునేవాళ్లు కూడా ఈ లోకంలో కోకొల్లలు. అలా అనుకుంటే తప్పేమీ కాదు. అది వారి ఇష్టం. కానీ, జరిగేదానిలో మన ప్రమేయం ఏమీ పెద్ద ఉండదనేది మాత్రం నిజం. కాబట్టి, బతికున్న ఈ కొద్ది ‘క్షణాలు’ నీకు నచ్చిన విధంగా, ఇతర ప్రాణులకి హాని తలపకుండా, వీలయితే వారికి చేతనైన సహాయం చేసి ‘పో’! మిగతావి ఆలోచించకు.”

కొద్ది సేపు ఇద్దరూ ఇంకేమీ మాట్లాడుకోకుండా మౌనంగా వుండిపోయారు.

భోజనం టైం అయ్యిందని వైదేహి పిలవడంతో, గోపాలం “ఇక, నేను బయలు దేరుతాను. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో తెలియదు. బెస్ట్ అఫ్ లక్!” అని చెప్పి లేచేడు.

“అంకుల్, ఇంకొక్క లాస్ట్ క్వశ్చన్, నేను పోయిన తరువాత మా అమ్మా, నాన్న ఎక్కువ రోజులు నా జ్ఞాపకాలతో బాధపడకుండా ఉండాలంటే ఏం చెయ్యచ్చు? మీరేమన్నా ఐడియాస్ ఇవ్వండంకుల్.” అడిగేడు పార్దు.

“వాళ్ళు నిన్ను మరవడం అనేది జరిగే పని కాదు కానీ, నీ జ్ఞాపకాలేవీ వారికి గుండెల్లో బాధ కలిగించేవి కాకుండా, వారి మొహం మీద చిరునవ్వు తెప్పించే విధంగా ఉండేలా మిగిల్చి పో! చివరి వీడ్కోలు పలికి, పార్దు తల అప్రయత్నంగా నిమిరి, బయలుదేరేడు గోపాలం.

గది బయట నిలుచుని వున్న వైదేహి “మొదట్లో ఒకరోజుకే అనుకున్నా, మీరిలా పద్దెనిమిది రోజులు వచ్చి పార్దుకీ, మాకూ చేసిన మేలు ఎప్పటికీ మరువలేము. మీకెంత ఇచ్చినా తక్కువే. ఇది తీసుకోండి.” అని అతని చేతిలో ఒక పెద్ద నోట్ల కట్ట పెట్టింది. మామూలుగా ఎదురుచెప్పకుండా ఇచ్చింది తీసుకునే గోపాలానికి ఆ రోజు ఎందుకో అది తీసుకోబుద్ధి కాలేదు.

“అబ్బే! అవసరంలేదులెండి, నా వల్ల మీకు జరిగిన మేలు కన్నా మీ వాడివల్ల నా గురించి నేను తెలుసుకున్నదే ఎక్కువ. మీకు అన్నీ సవ్యంగా జరగాలని ఆశిస్తున్నాను” అని చెప్పి, వెళ్ళిపోయాడు.

***

సుమారు రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. దేశ రాజధానిలో నెలకొని ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ అండ్ ఆంత్రోపాలజీలో డిగ్రీ మొదటి సెమిస్టర్ విద్యార్ధులకి టర్మ్ పేపర్‌కి ఇవ్వబోయే టాపిక్ గురించి మాట్లాడటం మొదలెట్టాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్న డాక్టర్ పార్ధసారధి.

“నేను ప్రతి సంవత్సరం ఇచ్చే టాపిక్ కాకుండా ఈ సారి కొంచెం వేరేగా ఇద్దామనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ లైఫ్‌కి బాగా కనెక్ట్ అయ్యేది కూడా. మొదటగా మన సబ్జెక్ట్‌కి సంబంధించి వాడుకలో వున్న కథ ఒకటి చెబుతాను. మార్గరెట్ మీడ్ అనబడే ఒక ప్రముఖ అమెరికన్ ఆంత్రొపోలజిస్ట్ తన స్టూడెంట్స్ ని ‘నాగరికత అంటే ఏమిటి? మానవ సమాజాలు ఎప్పుడు మొదలయ్యాయి?’ అని అడిగింది. ఆవిడ ఊహించినట్లే విద్యార్ధులు కొందరు పనిముట్లు కనుగొన్నప్పుడనీ.., మొదటి సిటీస్ నిర్మించినప్పుడనీ.., వ్యాపార లావాదేవీలు మొదలెట్టినప్పుడనీ.., రకరకాలుగా చెప్పేరు.”

ఆసక్తిగా వింటున్న పిల్లలని అడిగేడు పార్థసారధి, “మరి మీ సమాధానం ఏమిటి?”

ఇంచుమించుగా అలాంటి సమాధానాలే చెప్పేరు విద్యార్ధులు. కొంచెం సేపు ఆగి, పార్థసారథి కొనసాగించేడు. “ఒకానొక చోట ఆర్కియాలజీ (పురావస్తు) శాఖ వారి తవ్వకాలలో విరిగి అతుకున్న ఫీమర్ (తోడ ఎముక) దొరికింది. ఆ ఎముక ఏనాటిదో సుమారుగా అప్పుడు మానవ నాగరికత మొదలయ్యిందని ఆంత్రొపోలజిస్ట్‌గా ఆవిడ అభిప్రాయం.” అని చెప్పి, చుట్టూ కలియచూసేడు విద్యార్ధుల ప్రతిక్రియ కోసం.

అతని సమాధానం విని విస్తుపోయి చూస్తున్న విద్యార్ధులకి వివరించేడు పార్థసారధి. “ఆదిమానవుల కాలంలో ఒక జంతువుకి కానీ, మానవుడికి కానీ తీవ్ర గాయాలు అయినప్పుడు తోటి మనుష్యులు, లేదా జంతువులు వారిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారు. ఒకరిని కాపాడుతూ కూర్చుంటే వారి మనుగడకే ముప్పు. అలా దెబ్బతిని పడివున్న ప్రాణులు త్వరలోనే ఏ క్రూరమృగం బారినో పడి చచ్చిపోయేవి. ఒకరి తొడ ఎముక విరిగి, తిరిగి అతుక్కోవడం దేనికి సంకేతమో తెలుసా? గాయపడిన మనిషిని ఎవరో ఏదో గుహలోకి చేర్చి, వారికి ఆ రోజుల్లో తెలిసిన ప్రాథమిక చికిత్స అందించినట్లు. అంటే తోటి మనిషి పట్ల సహృదయత ప్రదర్శించినట్లు. అంటే, ప్రొఫెసర్ మార్గరెట్ మీడ్ ప్రకారం ఆ గుణం మనుష్యులలో మొదలయ్యిన రోజే మానవ సమాజాలు, సంస్కృతి మొదలయ్యిన రోజు.”

మొదట ఆశ్చర్యపోయినా మెల్లిగా అర్థం అయ్యింది విద్యార్ధులకి.

“ఇక నా విషయానికి వస్తే..” అంటూ కొనసాగించేడు పార్థసారథి. “నా తొమ్మిదవ ఏట ఒక ప్రత్యేకమైన క్యాన్సర్ బారిన పడి ఎక్కువ రోజులు బతకను అనుకున్న నా జీవితంలో గోపాలం అనే ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతనేమీ డాక్టరు కాదు, సైకాలజిస్ట్ అంతకన్నా కాదు. నిజం చెప్పాలంటే ఏ వుద్యోగం చెయ్యకుండా ఈ సమాజంలో నిససించిన ఒక సాధారణ పౌరుడు. సమాజానికి అతని వల్ల ఏ ఉపయోగం లేదని కొందరిచేత మాటపడినా, ఎదుటివారికి తోచిన సహాయం చెయ్యడమే అతని నైజం. దానితో విరిగిన ఎముకలనే కాదు, ఛిద్రమైన మనస్సులని కూడా అతికించగలిగిన ఒక సామాన్య మానవుడు. సరిగ్గా లెక్కెడితే నా కష్టకాలంలో ఒక పద్దెనిమిది రోజులు మా ఇంటికి వచ్చి, కొంత సమయం వెచ్చించి, నాతో మాట్లాడి, నాకు మనోబలాన్నిచ్చిన ఒక తోటి నాగరికుడు. అర్ధాంతరంగా అంతమవ్వబోతున్న నా జీవితం మీద నాకు అనవసరమైన ఆశ, తీపి కలుగ చెయ్యకుండా, నా చావుని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం నూరిపోసిన సహోదరుడు. నేను మరణిస్తే నావాళ్లకి కలగబోయే క్షోభని తలచుకుని, అనుక్షణం మరణిస్తున్న నన్ను పదింట తొమ్మిది వంతులు ఓడిపోయే యుద్ధానికి సన్నద్ధుడిని చేసిన సహచర సైనికుడు. నా అదృష్టం బాగుండి, ఆరోజుల్లో నా రోగానికి కొత్త ట్రీట్మెంట్ రావడం జరిగింది. అది కూడా ఈ ఊళ్లోనే మొదటగా రావడం వల్ల నా పేరెంట్స్ నన్ను ఇక్కడకు తీసుకొచ్చేరు. ఆ ట్రీట్మెంట్ మంచి ఫలితాలివ్వడంతో మేము ఇక్కడకి పెర్మనెంట్‌గా మకాం మార్చేము. నేనీనాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి వైద్యరంగంలో మన మానవ సమాజం సాధించిన ప్రగతి ఎంత కారణమో, ఆనాడు గోపాలం నాలో నూరిపోసిన ధైర్యం కూడా అంతే కారణం. సమాజం దృషిలో గోపాలం ఒక అదానీనో, అంబానీనో కాకపోచ్చు, ఐన్‌స్టీనో, ఎడిసనో కాకపోవచ్చు, బిల్ గేట్సో, ఎలాన్ మస్కో కాకపోవచ్చు. కానీ అతను ప్రొఫెసర్ మీడ్స్ ఆశించిన సభ్య నాగరికత ప్రగతికి, పరిణామ పరిణితికి ఒక గీటురాయి అని నా అభిప్రాయం.” చెప్పేడు పార్థసారథి.

“ఆయన ఇప్పుడు ఎక్కడ వున్నాడు సార్?” అడిగేడో విద్యార్థి కుతూహలంగా.

పార్థసారథి అతని వైపు ఇబ్బందిగా చూసేడు. “నా ఆరోగ్యం బాగుపడటంతో మా కుటుంబం ఇక్కడ స్థిరపడటం, నేను స్కూల్లో చేరడం వేగంగా జరిగిపోయాయి. గత ఇరవై ఏళ్లుగా నేను ఆ వూరు వెళ్ళవలసిన అవసరం కూడా రాలేదు. కాలక్రమేణా, నేను గోపాలాన్ని, ఆ ఊరినీ పూర్తిగా మరిచిపోయేను. ఐతే, కొన్ని వారాల క్రితం ఆ ఊర్లో ఒక ఆంత్రొపోలజి కాన్ఫెరెన్స్ అటెండ్ అవ్వడానికి నాకొక అవకాశం వచ్చింది. వెళ్ళినప్పుడు గోపాలం అంకుల్‌ని తప్పక కలవాలనుకున్నాను.”

స్టూడెంట్స్ శ్రద్ధగా వింటున్నారు.

***

పార్థసారధి తాను చిన్నప్పుడు పెరిగిన వూరు పూర్తిగా మారిపోవడం గమనించేడు. వూరికి ఎయిర్పోర్ట్ వచ్చింది. కొత్త భవంతులు, పెద్ద పెద్ద రోడ్లు దర్శనమిచ్చేయి. ఏదో ఒక 4-స్టార్ హోటల్లో బస చేసి, రోజంతా కాన్ఫరెన్స్‌లో గడిపి, సాయంత్రం గోపాలం ఇంటివైపు వెళ్ళేడు. తను చదివిన స్కూలు రోడ్డు, తాము వున్న ఇంటి రోడ్డు కూడలి చేరుకున్నాడు. ఏదో తేడా అనిపించింది. ‘ఇదేంటీ? ఇక్కడ గోపాలం అంకుల్ ఇల్లు ఉండాలే!’ అనుకున్నాడు. అది లేదు. తనకి తెలిసిన మామిడి చెట్టు లేదు. ఆ ఇంటి కాంపౌండ్ కూడా లేదు. దాని స్థానంలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దర్శనమిచ్చింది. కింద ఫ్లోర్లో అంతర్జాతీయ ఫుడ్ జాయింట్స్, పై అంతస్తులో పెద్ద ఫ్యాన్సీ బట్టల దుకాణం కనిపించేయి. ‘మరి గోపాలం అంకుల్ ఏమయ్యినట్లో? మహా అయితే అతనికిప్పుడు 55 ఏళ్ళు ఉండచ్చు. అతను ఈ వూరు వదిలి ఎక్కడకీ వెళ్ళే రకం కాదే!’ అనుకున్నాడు. ఆ దారంతా దుకాణాలే. రంగు రంగు దీపాలతో, అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పక్కనున్న ఒకటి, రెండు షాపుల్లో అడిగి చూసేడు, గోపాలం గురించి. తమకు తెలియదన్నారు. నిరాశగా గోపాలం ఇంటిస్థలంలో నెలకొన్న షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్లేసుకున్న పిట్ట గోడమీద చతికిలపడ్డాడు. పక్కనే ఎవరో పెద్ద మనిషి కూర్చుని, ఫోనులో ఏదో చూసుకుంటున్నాడు. సుమారు అరవై ఏళ్ళు ఉండచ్చు.

కొంచెంసేపు తరువాత ఆయన పార్థసారధి వైపు చూసి, నవ్వుతూ అడిగేడు. “ఏమిటీ మీ లేడీస్ కూడా బట్టలు కొనే యజ్ఞంలో వున్నారా?”.

బహుశా ఆయనకి భార్యతో షాపింగ్ చేసే ఓపిక లేక బయట కాలక్షేపం చేస్తున్నట్లున్నాడు.

పార్థసారధి నిస్పృహతో చెప్పేడు. “అబ్బే, లేదండి, నేను ఢిల్లీ నుండి పని మీద వచ్చేను. మేము నా చిన్నప్పుడు ఈ పక్క సందులో వుండేవాళ్ళం. ఈ షాపు వున్న చోట ఒకిల్లు వుండేది. అందులో నాకు తెలిసిన ఒకాయన ఉండేవాడు. ఆయన్ను కలవడానికి వచ్చేను. కానీ, ఆ ఇల్లూ లేదు, ఆయనా లేడు.”

ఆయన పార్థసారధి వైపు చూసి. “బహుశా, మీరు మాట్లాడేది గోపాలం గురించి అయ్యింటుంది?” అన్నాడు.

ఒక్కసారిగా వులిక్కిపడి, గోడ మీద నుండి దిగి, లేచి నించున్నాడు పార్థసారధి. “మీకాయన తెలుసా?” అని ఆత్రుతగా అడిగేడు.

“నేనీ వూళ్ళో నలభై ఏళ్లుగా ఉంటున్నాను. అతను నాకు పెర్సనల్ గా తెలియదు, కానీ, లోకల్ న్యూస్ చానల్స్ ద్వారా, వార్తా పత్రికల ద్వారా విన్నాను.” చెప్పాడాయన.

పార్థసారధికి ఆయన ద్వారా తెలిసినదేమిటంటే గోపాలం చివర రోజుల్లో ఎవరి సహాయం లేక ఒంటరిగానే పోయాడుట. పాతరోజుల్లో అతని సహాయం పొంది, అతనికి అంతో ఇంతో ముట్టచెప్పే మనుష్యులు వుండేవారు. కాలక్రమేణా దేశం, ప్రపంచం ఆర్ధికంగా ఉరకలు పెట్టడం వల్లనూ, సమాజం కొత్త పుంతలు తొక్కడం వల్లనూ, అతని సహాయం ఇక ఎవరికీ అక్కర్లేకపోయింది. ప్రొఫెషనల్ సైకియాట్రిస్టులు, మోటివేషన్ స్పీకర్స్ వెలిసే రోజులు రావడంతో ఊరికి అతని ఉనికి అవసరం లేకుండా పోయింది. పోతూపోతూ తన ఇంటిని ఒక గ్రంథాలయంగా మార్చమని కార్పోరేషన్ వారికి చెప్పి పోయాడుట. నోటి మాటలు చెల్లే కాలం చెల్లిపోవడం వల్ల అతను పోగానే అతని స్థలాన్ని కబ్జా చేసేందుకు చాలా మంది రియాల్టర్స్ ప్రయత్నించేరుట. చివరికి కార్పోరేషన్ వారే రంగంలోకి దిగి, ఆ స్థలాన్ని ఆధీనం చేసుకుని, వేలం వేయగా, ఎవరో బిల్డర్ కొనుక్కుని, షాపింగ్ కాంప్లెక్స్ కట్టేడుట. పార్థసారధి అచేతనంగా వింటూ ఉండిపోయేడు.

ఆయన చెబుతూ పోతున్నాడు. “మీరు చిన్నప్పుడు చూసిన వూరికీ, ఇప్పటి వూరికీ ఏ పోలిక వుండి వుండదు. ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మాల్స్, ఫ్లై ఓవర్స్ వచ్చేసాయి. కనీవినీ ఎరుగని రాపిడ్ డెవలప్‌మెంట్స్ మరి.” గర్వంగా చెప్పుకుపోతున్నాడాయన.

“అవును, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన ప్రగతికి గీటురాయి లాంటిది” వ్యంగ్యంగా అని అక్కడ నుండి బయట పడ్డాడు పార్థసారధి.

***

“ఇప్పుడు చెప్పండి, ప్రొఫెసర్ మీడ్ ఊహించిన నాగరిక సమాజం గోపాలం లాంటి వ్యక్తుల వల్ల సంభవిస్తుందా, లేక ఆయన లాంటి వారిని మరిచిపోయి పెద్ద చదువులు చదివేసి గొప్ప ఉద్యోగాలు చేసే నాలాంటి మనలాంటి వారి ద్వారానా? మనం ఈ భూమి మీద వుండే కొన్ని ‘క్షణాల్లో’ మనం పెంచి పోషించుకునే మన నాగరికత మరిన్ని సమాజాలకి ఆదర్శంగా ఎదగాలంటే దానికి నిర్వచనం మనం కట్టుకునే అద్భుత కట్టడాలా, లేక ఆ కట్టడాలలో నివసించే మనుష్యులలో మానవత్వమా? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలు, అన్వయాలు తెలియచెయ్యండి. ప్రత్యేకించి, సోషియాలజీ (సామజిక శాస్త్రం), ఆంత్రొపోలజీ (మానవశాస్త్రం) దృక్పథాలతో ఆలోచించి, మీ పేపర్స్ తయ్యారుచేసుకోండి.” అని చెప్పి క్లాసు ముగించేడు డాక్టర్ పార్థసారధి.

Exit mobile version