Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాపమ్మ ముల్లె

[శ్రీ వేంపల్లి సికిందర్ రచించిన ‘పాపమ్మ ముల్లె’ అనే కథని అందిస్తున్నాము.]

నేను టి.టి.డి. విశ్రాంత ఉద్యోగిని, ముప్పై ఐదు సంవత్సరాలు వేంకటేశ్వర స్వామివారి సేవ చేస్తూ తరించాను. దేవస్థానం సర్వీసు ఇప్పట్లాగాక భిన్నంగా వుండేది. కంప్యూటర్ల వినియోగం ఇప్పట్లా అప్పట్లో లేదు.

ప్రతిదీ మ్యాన్యుయల్. ప్రతి పనిలో చేతివ్రాత డ్రాఫ్టింగ్ తర్వాతే టైపింగు, టైపైన తరువాతే, స్టేట్‌మెంట్లు వగైరాలు. ఎక్కువ కాపీలు చేసి, సైక్లోస్టెయిలు కాపీలను బట్వాడా చేయడం జరుగుతుండేది. అప్పట్లో ప్రతిదీ మ్యాన్యుయల్, రికార్డులు రిజిష్టర్ల వినియోగం ఆఫీసుల్లో విరివిగా ఉండేది.

నేను ఎనభైవ దశకంలో క్లర్కుగా దేవస్థానం సర్వీసులో చేరినాను. క్లర్కు నుంచి అంచెలంచెలుగా ప్రమోషను పొంది రిటైరయ్యే నాటికి అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అయ్యాను. నా ముప్పై ఐదేళ్ల సర్వీసులో తిరుమల తిరుపతిలోని వివిధ శాఖల్లో పనిచేశాను. కడప కళ్యాణ మండపం, హైదరాబాదు కళ్యాణ మండపం, బ్రాంచి ఇంజినీరింగ్ ఆఫీసులాంటి బయటి ప్రాంతాల్లో కూడా పనిచేశాను.

అప్పట్లో ప్రతి ఉద్యోగి విధిగా నెలరోజులపాటు డెప్యుటేషను మీద పరకామణి డ్యూటీలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయఁలో పరకామణి డ్యూటీ నెలలో వారం రోజులు విధిగా చేయవలసి వచ్చేది. కొండమీద యేర్పాటు చేసిన విడిదిలో వుండి, మకాం పెట్టి డ్యూటీ చేయవలసి వచ్చేది.

ఆఫీసుల్లో చేసిన సేవలకంటే, దేవుని గుళ్లో స్వామి సన్నిధిలో, చేసిన పరకామణి డ్యూటీ అనగా, దేవుని హుండీలో కానుకల్ని లెక్కించే సేవ నా జీవితంలో మరపురానిది. అక్కడి అనుభవాలు, అప్పటి స్మృతులు, నా జీవితంలో మరపురాని మధుర స్మృతులుగా ఇప్పటికీ నాలో సజీవంగా మిగిలి వున్నాయి. ప్రతి రోజూ తనివి తీరా దేవుణ్ణి దర్శించుకొని తరించిన అనుభూతులు, గుర్తుకు వచ్చినప్పుడల్లా నా గుండెల్లో ఏదో అనిర్వచనీయమయిన ఆధ్యాత్మిక అనుభూతి చోటు చేసుకొంటూ ఉంటుంది.

పరకామణి డ్యూటీలో ఒకరోజు కానుకల బ్యాగు ఓపన్ చేసినపుడు కోటి రూపాయల నోట్లకట్ట ఒకటి వెలికి వచ్చింది. ఇంకోమారు ఐదు కేజీల బంగారు ముద్దలు లక్ష్మి అమ్మవారి ముద్రలో వున్నది కనిపించింది. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు నిత్యం వెలుగు చూసేవి. అదలా ఉంచితే, డ్యూటీలో నాకెపుడూ మా సూపరింటెండెంటు సుందరరాజులుగారు ప్రతిసారీ ముల్లెలు విప్పే డ్యూటీ వేసేవారు. ముల్లెలంటే పైన చెప్పుకున్నట్లు కోట్ల మూటలు కాదు, పదిపైసలు, పావలా, అర్ధరూపాయి బిళ్ళలు ఒక్కో బిళ్లను విడి విడిగా ముల్లెగా కట్టి దానిపైన పది పన్నెండు ముళ్లు బిగించి దాని మీద పసుపునీళ్ళు జల్లి హుండీలో వేసేవారు. అవే ముల్లెలు. ముడులు విప్పి కాయిన్స్ వేరుచేసి చిల్లరలో వేయాలి. రోజుకు వందలకు వందలు అలాంటివి విప్పాలి. విప్పి విప్పి వేళ్ళు నొప్పి పుట్టేది. విసుగొచ్చేది. నా బాధను సూపరింటెండెంటు దగ్గర వాపోయేవాడిని. దానికి ఆయన నవ్వి ఊరుకునేవాడు, పెద్దగా స్పందించేవారు కాదు.

ఒకరోజు భోజన సమయంలో మా సూపరింటెండెంటు నా ప్రక్కనే కూర్చుని భోంచేస్తూ నా వంక చూశాడు. నా ముఖ కవళికలను చూసి, పరకామణి డ్యూటీలో ముల్లెలు విప్పే పనికి నా అయిష్టతను, నా అసహనాన్ని ఆయన మారే నా ముఖ కవళికల్ని పట్టి పసికట్టాడు.

భోజనాలయిన తర్వాత నన్ను రెస్ట్ రూముకి పిలిపించుకొని ఇలా చెప్పుకు పోయాడు. “అయ్యా సికిందరూ.. మన పూర్వజన్మ సుకృతం చేత మనకీ పరకామణి డ్యూటీ చేసే అవకాశం స్వామి సన్నిధిలో లభించింది. కోట్లు వేసేవారు స్వామిని దర్శించుకొని కోర్కెలు నివేదించి తృప్తిగా వెనుదిరుగుతారు. ఐదు పైసలు, అర్ధరూపాయ, పావలా మూటా ముళ్ళు వేసినవారూ స్వామిని దర్శించి మొక్క దీర్చుకొని వెనుదిరుగుతారు. ఉన్నవారికి, లేనివారికి స్వామి దర్శనం దొరుకుతుంది కానీ.. స్వామి కళ్ళు తెరిచి, వారిపై తమ కరుణార్థ దృక్కులు సారించిన నాడు వాళ్ళ జన్మ తరిస్తుంది. దేవుడు ఆశ్రిత పక్షపాతి. ఎవ్వరికీ, ఏమేర, ఎప్పుడు ప్రసాదించాలో ఆయనకు బాగా తెలుసు. ఉన్నవారికంటే, లేని వారిపట్ల వారికి మక్కువ. వారు సమర్పించుకొన్న చిల్లర నాణేలకు వేలరెట్లు అధికంగా ప్రతిఫలం వారికి దక్కుతుంది. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాంటి ఆపన్నుల ముల్లెలను నీవు విప్పి స్వామికి సమర్పిస్తున్నావు. నీకు మేలు జరుగుతుంది” అని దీవించాడు.

అది మొదలు నేనెపుడు పరకామణిలో ముల్లెలిప్పే డ్యూటీకి వెనుకాడలేదు. అభ్యంతరం చెప్పేలేదు. దేవుడి సేవలో ఆశ్రిత పక్షపాతి అయిన శ్రీవారి కరుణ నాకు అనుభవైక వేద్యమే. పాప ఫలంగా ఆపన్నులకు, ముక్తిని ప్రసాదించే దొడ్డ దేవుడాయన. ఆ మేరకు జరిగిన ఒక ఉదంతాన్ని కథరూపంలో మీ ముందుంచ సాహసిస్తున్నాను.

చితల్ బస్తి చిత్రమైన ఊరు. ఒకపుడు ముప్పై ఇండ్లయినా లేని చిన్న పల్లెటూరు. క్రమేపీ మండల కేంద్రంగా ఎదిగి, ప్రస్తుతం ఎంతో సందడితో వెలుగొందుతూ ఉంది. చుట్టుప్రక్కల అనేక గ్రామాల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చి, ఉపాధి పొంది ఇక్కడ స్థిరపడుతూ వున్నారు.

సారవంతమైన భూమి చుట్టూ కొండగుట్టలు, చెఱువులు, బోరు బావి సేద్యాలతో పంటలెక్కడ కళకళలాడుతూ ఉంటాయి. ఏళ్ళబట్టి ఏపుగా ఎదిగిన చింతతోపులు, గుళ్ళు గోపురాలు, కార్పొరేట్ చదువులిచ్చే స్కూళ్ళు, కాలేజీలు ఒకటేమిటి వైద్య సౌకర్యాల వంటివి కూడా అక్కడ అన్నీ చక్కగా అమరాయి.

అన్నిటినీ మించి ఆవూరు చింతపండు వ్యాపారానికి ఆంధ్రదేశంలో అగ్రగామిగా నిలిచిందనటంలో అతిశయోక్తి కాదు. ఇందుకు తార్కాణంగా చింతపండు ప్రోసెసింగ్ యూనిట్లు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడి నుండి లారీలకు లారీలు చింతపండు కోస్తా జిల్లాలకు ఎగుమతి అవుతూ వుంటుంది. ఈ కారణంగా ఇక్కడి జనాలకు సంవత్సరం పొడవునా, చింతకాయలు కొట్టి, ఈనెలు, పిక్కలు వేరుచేసి చింతపండును శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం, మార్కెటింగ్ ప్యాకింగ్, రవాణా పనులు దొరుకుతాయి. చక్కటి ఉపాధి లభిస్తూ వుంది.

దీంతో ఇక్కడి ప్రజలు చీకూ చింతా లేకుండా జీవిస్తున్నారు. కానీ వాళ్లను నిత్యం వేటాడి వెంటాడే సమస్య ఒకటుంది. అదేమిటంటే పాపమ్మ చింత.. నిత్యం విసుగు తెప్పించే పీడ!?..

ఇంతకూ పాపమ్మ ఎవరంటే.. ఏ వి.ఐ.పి.నో.. వీధి రౌడీనో అనుకొంటే పప్పులో కాలేసినట్లే!.. ఆవిడ కేవలం ఒక భిక్షగత్తె! అరే భిక్షగత్తెకు ఇంత బిల్డప్ ఎందుకు?! అని తేలిగ్గా తీసుకొంటే సరిపోదు. ఆవిడ్ని గురించి కాస్త వివరణ ఇచ్చాకగానీ అసలు విషయం బోధపడదు.

ఎవరయినా, ఎంతటి వారయినా, సరే చేయి చాచి అడిగాక భిక్ష ఇచ్చేదాక వదలని మొండిఘటం పాపమ్మ. నెత్తిన చేతులెత్తుకొని, అసాది పదాలు పాడుతూ దీనంగా మొహం పెట్టి రోధిస్తూ అడుక్కుంటూ వుంటుంది.

బొచ్చెలో భిక్ష పడేదాకా తిట్టినా, కొట్టినా, కోసినా, ఈసడించుకున్నా వెనక్కి తగ్గదు.

ప్రతిరోజూ ఉదయాన్నే ఊరులోకొచ్చి ఈ చివరనుంచి ఆ చివర దాకా తిరిగి, తిరిగి, అరచి, అరచి, సాయంత్రానికి గాని నిష్క్రమించదు. ఇదీ ఆ వూరి వారికి తీరని చింత.

యేళ్లు గడిచాయి. ఊర్లో ఉపాధి పెరిగి జనసమ్మర్థం ఎక్కువయ్యిందని. గ్లోబలీకరణ పుణ్యమా అని వేగవంతమైన మార్పులు చోటు చేసుకొని పట్టణీకరణవైపు ఊరు పరుగులెడుతూ వుంది.

పాపమ్మతో పాటు పాపమ్మ భిక్షాటనకు కూడ ముసలితనం వచ్చేసింది. అదిప్పుడు ముక్కుతూ మూల్గుతూ, కుంటుతూ.. కూలుతూ, సొక్కుతూ సోలుతూ ముందుకెల్తూ వుంది.

నెరసిన జుట్టు, కేశ సంస్కారానికి నోచుకోక ముగ్గుబుట్టలా తెల్లటి చింపిరి తల, పళ్లూడిన బోసినోరు, మురికిపట్టి ముడతలుబడ్డ శరీరం, చిరిగిన బట్టల కంపు అంతా.. ఎందుకో జనం పట్టించుకోవడం లేదు.

పైపెచ్చు ఆవిడ మీద అసహ్యించుకునే వారికంటే జాలిజూపే వారే ఎక్కువ పడుతూ ఉన్నారు.

“ముసలి ముండ చచ్చే పొద్దున దానికింత కబళం వేయండి. నాలుక్కాసులు దాని బొచ్చెలో వేయండి” అంటున్నాయి జనాల అంతరంగాలు.

ఇప్పుడు పాపమ్మకు భిక్షాటనలో కష్టం లేదు. కాలం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతూ వుంది.

ఆ రోజు భిక్షాటన ముగించుకొని యథావిధిగా గుడిసెకు తిరుగు ముఖం పట్టింది పాపమ్మ. ఊరి చివర ఒక ఇంటి ముందు బాగా దుమ్ముపట్టిన, ఫ్రేముకట్టిన వేంకటేశ్వర స్వామి పటం పడవేసి ఉండటం చూసి చప్పున వెళ్ళి దాన్ని దొరక బుచ్చుకొని జోలెలో వేసుకొని ముందుకు సాగింది.

సూర్యాస్తమయమయ్యింది. ఆకాశంలో ఇంకా ఎరుపు తగ్గలేదు. ఆమె నడుస్తూ వుంటే ఆ రోజు కాస్త అలసటగా అనిపించి కాస్సేపాగింది. ఎదురుగా బస్తీ నుంచి పొలాలకు మురుగు నీరు మల్లించే పెద్ద కాలువ వెళ్లే దిన్నె మీద కూచుని, తెపరాయించుకొని, పారే మురుగు కాలువ వైపు చూసింది.

చల్లటి నీరు మురికి పులుముకొని చెత్త ఆకులు, పుల్లలు నెత్తికెత్తుకొని నడచినట్లుగా, సాగుతూ వుంది అంతరంగంలో ఆలోచనలు..

తమ బతుకు తెలిసి బతకలేదు. చావు చింత లేదు. ఏడ్చి ఎరుగదు. నవ్విన పాపాన పోలేదు. భయమూ బాధ లేదు. దేవుణ్ణి ఏదీ ఇందాక కోరని ఏకో నారాయణి తను. దొరికింది ఏమయినా వుంటే దాన్నింకా లెబపెట్టలేదు.

దట్టంగా ముసురుకుంటున్న చీకట్లను చూసి ఆలోచనలాపి తిన్నె నుంచి దిగి అడుగు ముందుకేసింది. వెనక్కు తలతిప్పి చూస్తే దూరంగా పనిపాటలు ముగించుకు వెళ్ళే జనం మెయిన్ రోడ్డుకు సమీపంలో వెలుతూ కనుమరుగవుతున్నారు. తలతిప్పి గుడిసె వేపుకు సాగింది.

అక్కడ అంతా నిశ్శబ్దం, నిర్మానుష్యంగా వుంది. పంట చేలల్లో గాలికి పైర్లు, ఆకులల్లాడుతున్నాయి. ఈ సమయంలో కావలివాళ్లు ఉండరన్న విషయం తెలిసి చేలల్లో ఒకచోట, రెండు సద్ద కంకులు ఇంకో చోట నాలుగు రాగెన్నులు, మరోచోట కొన్ని మొక్కజొన్న పొత్తులు తెంపుకొని జోలెలో వేసుకొని, చీకటికి భయపడి శక్తినంతా కూడదీసుకొని వడివడిగా వచ్చి గుడిసె చేరింది.

కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళి బుడ్డిదీపం వెలిగించింది. జోలెను జాజి చెక్కపెట్టి ప్రక్కన జనపనార సంచిమీద పెట్టి, పెట్టె మీద కూచుని స్థిమితపడబోతున్నప్పుడు ఎందుకో గతం గుర్తుకొచ్చింది.

తల్లిదండ్రులు చనిపోయి కోర్కెలంటే ఏమిటో తెలియని పసి వయసులో అనాథగా మిగిలిన తన్ను ఎవరూ చేరదీసిన పాపాన పోలేదు. వయసుపైబడినా, ఢక్కామొక్కీలు తింటూ.. ఎక్కడెక్కడో తెగిన గాలిపటంలా తిరుగుతూ, మధ్యవయస్కురాలైంది. ఆశ్రయం కోసం ఎంత అలమటించినా కుదురుగా ఎక్కడా ఇమడలేక విసిగి వేసారి పందులవారి గుడెసెల దగ్గర ఒక గుడెసెలో ఉంటూ యాచకవృత్తిలో స్థిరపడింది. దాంతోనే కాలం గడిచిపోతూ వుంది.

ఏకాకిగా మిగిల్చిన, వ్యథ, సమాజం మీద కసి పెరిగి నోటి దురుసుతనం.. పిచ్చి ముదిరి ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు అటుంచి మాటలు కూడ అంతంత మాత్రంగానే వున్నాయి. ఆలోచనలాపి నిట్టూరుస్తూ లేచింది.

జోలె అందుకొని జోలెలోంచి సజ్జకంకులు, రాగెన్నులు, మొక్కజొన్న పొత్తులు తీసి బయట పెట్టి వేంకటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని వెలికి తీసి, పొడి బట్టతో శుభ్రంగా తుడిచి పెట్టె మీదబెట్టింది.

దేవమూల గోడ దగ్గరగా వెళ్లింది. అక్కడ తను రోజూ దండం బెట్టుకొనే స్వామివారి క్యాలెండరును మేకు నుంచి విడదీసి మడిచి ప్రక్కన బెట్టింది. తరువాత పెట్టె మీద పెట్టి ఫ్రేము కట్టిన పటాన్ని గోడకు తగిలించి బుడ్డీదీపం వెలుగులో నమస్కరించి, స్వామివారి కాళ్ళను కళ్ళకద్దుకొంది.

రాగెన్నులు సజ్జకంకులు చేతుల్లో పులిమి పొట్టు గింజల్ని వేరుచేసింది. మొక్కజొన్న గింజలను వలిచి అన్నీ ఒకచోట చేర్చి కలగలిపి రూట్లో దొగ్గడగా దంచి పొడి, మిశ్రమాన్ని సత్తుగిన్నెలో వంపుకొని నెమ్మదిగా చప్పరిస్తూ మ్రింగేసింది. లోటా నీళ్ళు తాగగానే నిద్ర ముంచుకొస్తున్నట్లయింది.

గోనెపట్ట పరచుకొని, బూరగ దూది తలగడ మీద తలపెట్టి పడుకుని, దేవుడి పటంకేసి చూస్తుండగా అలసిన శరీరం నిద్రలోకి జారుకొంది.

రాత్రి తెల్లవారింది. పెందరాలే లేచి జోలె సంకకు తగిలించుకొని బస్తీకెళ్ళే పాపమ్మ గుడిసెలో మాత్రం మధ్యాహ్నమైనా ఎలాంటి అలికిడీ లేదు. ఇరుగు పొరుగులకు అనుమానమొచ్చి లోనకెళ్లి చూశారు. నిబ్బరంగా నిద్రపోతున్న చందాన కనిపిస్తోంది పాపమ్మ. నిద్రలోనే చనిపోయినట్లుంది.

పాపమ్మకు తమతో చనువు లేదన్న మాటేగాని, తన మానాన తను బతికింది. ఆటపట్టించేవాళ్ళ పట్ల దురుసే గాని, ఏనాడూ ఎవ్వర్నీ ఏ సాయమూ కోరలేదు. విషయం తెలిసి గుడిసెల వాళ్లంతా గుమిగూడారు. ఏమైనా మిగుల్చుకొందేమో అని గుడిసెంతా వెదికారు. ఏమీ మిగిలిలేదు. ఇక చేసేదేమీ లేక చందాలు వేసుకొని ఆవిడ కర్మకాడ పరువుగానే నిర్వర్తించారు. ఆ రాత్రి దీపం వెలిగించి, ఆ ప్రొద్దుటే ఆవిడ స్వస్థలానికి మనిషిని పంపి ఆవిడ వేలు విడిచిన మేనమామ మనవడికి విషయం చెప్పి వెంట తీసుక వచ్చారు. అతని పేరు రాములయ్య.

రాములయ్య వచ్చి గుడిసెను శుభ్రం చేయించాడు. బొంత, బొచ్చె, గోన సంచులు.. పుచ్చిపోయిన జాజిచెక్కపెట్టె.. పనికిరాని పాత వస్తువులన్నింటినీ పారవేయించాడు. శుభ్రం చేసి గుడిసెకు వెల్లవేసే పనిని ఆరంభించాడు.

వెల్ల వేస్తున్నప్పుడు దేవమూల వేంకటేశ్వరస్వామి వారి చిత్రపటం వెనుక గోడ ఉబ్బెత్తుగా ఉండటం గమనించాక ఎందుకో అనుమానం వచ్చింది.

పటం వెనుక మేకు క్రింద చిన్న కంత కనిపించింది. దానికి అడ్డంగా చిన్న కొయ్య ముక్క వుంది. అది అటు ఇటు కదిపి, మూయడానికి తెరవడానికి వీలుగా వుంది.

చెక్క జరిపి చూడగా కంతలోంచి కాసులు స్పష్టంగా కనిపించాయి. రాములయ్య వచ్చి గోడమీద మట్టిపెళ్ళలు పెకలించి చూడగా, గోడలో కాసుల కుండ బయట పడింది. ఆశ్చర్యంతో కుండను జాగ్రత్తగా వెలికి తీసి కాసులు లెక్కపెడితే పదిహేనువేలకు పైగానే ఉన్నట్టు తేలింది.

దేవుడి చిత్రపటం వెనకాల లభించిన కాసుల్ని వడ్డికాసులుగా భావించిన రాములయ్య భక్తిభావంతో పసుపు బట్టలో కాసుల్న ముల్లెగా కట్టి, తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ముల్లెను స్వామివారి హుండీలో వేసి పాపమ్మ బదులు తానే మ్రొక్కు తీర్చుకొని వచ్చాడు.

ఈ ఉదంతం తెలిసి ఊరంతా అనుకుంటున్నారు!

‘పాపం! పాపమ్మ వెళ్లిపోయింది.’

Exit mobile version