[శ్రీమతి కాళ్ళకూరి శైలజ రచించిన ‘పరాయి’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
పరాయూళ్ళో
ఉదయం, రాత్రి ఒకేలా ఉంటాయి.
అలసి మొరాయించే జోడు గుర్రాల్లా.
కళ్ళెదుటే నాట్యం చేస్తూ
వాన కూడా కవ్విస్తుంది.
నన్ను దాటి నడు చూద్దాం అంటూ.
ఊరికే పలకరించినా
కత్తిలా తెగ్గొట్టే జవాబు చెప్పే ఆగంతకుడిలా,
అలవాటు లేని చోట
దారుల కొత్తదనం పాదాలకు గుచ్చుకుంటుంది.
మనది కాని భాషలో వ్యంగ్యాస్త్రం విసిరే పక్కవాడి మాట,
చెవిలో జోరీగలా అపస్వరం పాడుతుంది.
దిక్కుల్ని బట్టి విడిపోయిన భూభాగం,
శీతోష్ణాల చేతుల్తో కవాతు చేస్తుంది.
సమయం దగ్గర పడ్డాక తెలుస్తుంది,
అందరం బాటసారులమేనని.
ఎవరి మూట వారే
భుజానికి ఎత్తుకొని బయలుదేరాలి.
ఎన్ని పరుష వాక్యాల గాయాలున్నాయి ఆ మూటలో?
ఎన్ని అకారణ సంతోషాలు జమ అయ్యాయి మదిలో!
అనుకుంటాం గానీ స్వంతమేదీ, పరాయి ఏది?
అంతా ఒకటే!
లిపి నేర్చిన అక్షరాస్యుడైనా, ప్రేమ పంచే మూగజీవైనా!
జీవ చైతన్యం పలు రకాలు.
ఏ క్షణం బాధని ఆ క్షణం మరిచిపోమంటూ,
గుసగుసలు పోతున్నట్టు ఇట్టే కరిగి, మళ్లీ తడిపి
నవ్విపోతాయి
పిల్ల మేఘాలు.
