Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగుల హేల 22: పరమ సత్యం

“సత్యం అందరికీ ఒకేలా కనపడదు. చూచిన వారి దృష్టిని బట్టి, హృదయగత సంస్కారాన్ని బట్టి అది దర్శనమిస్తుంది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో.

ప్రపంచంలో సత్యమంత క్లిష్టమైన సంగతి మరొకటి లేదు. అది ఒక బ్రహ్మ పదార్ధం. నాకైతే శివ మరియు విష్ణు పదార్థం కూడా నేమో! అనిపిస్తుంది ఎందుకంటే అది అందరికీ ఒకేలా కనపడదు. చూచిన వారి దృష్టిని బట్టి, హృదయగత సంస్కారాన్ని బట్టి అది దర్శనమిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతుంది.

సత్యాన్ని గురించి ఓ ముగ్గురు చర్చకు కూర్చుంటే ముగ్గురి అభిప్రాయాల్లో తేడా స్పష్టంగా ఉంటుంది. వారు కొట్టుకోదలచుకుంటే కొట్టుకోవచ్చు. అర్థం చేసుకోవాలి అనుకుంటే అర్థం అయినట్టు కనబడుతుంది కానీ నిజానికి కాదు.

పరమ సత్యం చుట్టూ కొన్ని పై పై సత్యాలు ఉంటాయి. వాటి కొసలు పట్టుకొని లోపలి వెళితే పరమ సత్యం దర్శనమిస్తుంది. పై పై సత్యాలు మనల్ని తప్పు దారి పట్టిస్తాయి.అవి పైకి ఒకలా కనపడి లోపల రంగూ, రుచీ వేరుగా ఉంటాయి. కొందరు మనుషులు మనకి బైటి సత్యాలు చూపెట్టి భయపెడతారు. దాంతో మనం వెనుతిరిగి పోతాం. లోపలున్న పరమ సత్యానికీ బైటి సత్యానికీ పొంతనుండదు.

అందుకే సత్యంతో చెలగాటం ఆడకూడదు. నువ్వు దానిని గుర్తుపట్టి ఇంకొకరిని పిలిచి దానిని చూపించేలోగా అది మారిపోతుంది. నువ్వు చెప్పబోయిన లేదా నిరూపించబోయిన సత్యం మరొక రూపంలో ప్రత్యక్షం అవుతుంది. అపుడు నువ్వు అవాక్కవ్వాల్సిందే!

నువ్వు శోధించిన పరమ సత్యాన్ని నువ్వు మాత్రమే అరిగించుకోవాలి, భరించుకోవాలి. ఎందుకంటే ఎవరికి నువ్వు నిరూపించబోయినా ఫెయిల్ అవుతావు. అందుకే నువ్వు దానిని మౌన వీక్షణం చేయడం మంచిది తప్ప నిరూపణలకు దిగితే ఓడిపోక తప్పదు.

ఒక్కోసారి పై పై సత్యాలు పరమసత్యాన్ని తోసిరాజని అక్కడ కూర్చోబోతాయి కానీ కుదరదు. పరమసత్యాన్ని చూసిన వారు పై పై సత్యాలు తెలిసిన వారితో వాదనకు కూర్చోకూడదు. వారిని అసలు దారి వరకు తీసుకువచ్చి వదిలివేస్తే వీలయితే వారికీ పరమసత్యం సాక్షాత్కరిస్తుంది. లేదంటే వారు చాలా మంది లాగే ఆ చుట్టుపక్కలే ఆగిపోతారు.

పరమ సత్యాన్ని ఎవరికి వారు వెళ్లి చూసి తెలుసుకోవాలి కానీ మరొకరి బలవంతం మీద వెళితే పని జరగదు. ఈ అన్వేషణ ఎప్పుడో ఓసారి ప్రమాదంలో కూడా పడేస్తుంది. నిరూపణ కాని సత్యాలు ఆరోపణలుగా, అభాండాలుగా నిలిచిపోతాయి. ఒకోసారి సంధించిన వారినే కాల్చేస్తాయి. కొన్ని సార్లు మనకి తెల్సిపోయిన కొన్ని పరమ సత్యాల్ని ఎవరికైనా చెప్పామనుకోండి. మనకి మతి భ్రమించిందని వాళ్ళు భావించే ప్రమాదం కూడా ఉంది.

“మా అమ్మాయి తన అత్తగారిని దగ్గరుంచుకొని జాగ్రత్తగా చూసుకుంటోంది” అని ఓ ఆంటీ గారు ఇరుగమ్మకీ, పొరుగమ్మకీ పదే పదే చెబుతుంటారు. ఆవిడ దృష్టిలో అది సత్యమే కానీ పరమసత్యం ఏమిటంటే ఆవిడ కూతురు ఉద్యోగిని కాబట్టి స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఎవరో ఒకరు ఇంట్లో ఉండి తలుపు తీసి, టిఫిన్లు పెట్టి, బట్టలు మార్చి వాళ్ళని ట్యూషన్లకి పంపాలి. ఇంకా భార్యాభర్తలు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లడానికి ఇంట్లో అత్త ఉంటే హాయి. ఈ సంగతి తల్లీకూతుళ్ల మాటల్లో ఎక్కడా, ఎప్పుడూ ఉండదు.

ఇంకో అల్లుడుగారు “మా అత్త గారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను” అంటాడు దేశోద్ధారక పంతులు గారి లెవెల్లో. పరమసత్యం అత్త గారికి బాగా ఆస్తి ఉండడం కావచ్చు లేదా అత్తను ఆ రేంజ్‌లో చూడకపొతే ఇంట్లో అతనికే ఫుడ్ ఉండని పరిస్థితి కావచ్చు. అంతే తప్ప అత్తగారి మీద భక్తీ, భోషాణం ఎంత మాత్రమూ కాదు.

గౌరవనీయ రాజకీయ నాయకులు పార్టీ మారడానికి చెప్పే సత్య కారణాలు వేరు. పరమ సత్య కారణాలు (డీల్) వేరు. పార్టీ సిద్ధాంతాలూ చింతకాయ చట్నీ, ఆశయాలూ ఆవకాయ పచ్చడీ అన్నీ ఉత్తుత్తి మాటలే! దేశసేవా, సమాజ సేవా లాంటి స్లోగన్లూ నేతి బీరకాయలో నెయ్యి చందమే!

ఒక సినిమాలో ఒక హీరో నటించడం వెనక అనేక వాణిజ్య ఒప్పందాలుంటాయి. పైకి మాత్రం అతని నటనా వైదుష్యాన్ని చూసి అతన్ని ఎంచుకున్నామని బోల్డన్నిహస్క్ మాటలు చెబుతారు. అనేకానేక సమీకరణాల తర్వాత ఆ యా పాత్రల కోసం నటుల ఎంపిక జరుగుతుంది. హీరోయిన్ల సెలక్షన్ కూడా ఇంతే! రికమెండేషన్లూ, మొహమాటాలూ, రెమ్యూనరేషన్‌లో కన్సెషన్లూ లాంటివి ఎన్నో పని చేస్తాయి.

పరమ సత్యం, జలతారు పరదాల వెనకుండే అసూర్యంపశ్య లాంటిది. అది బైటికి రాదు. తెలుసుకుని తరిద్దామంటే మనల్ని లోపలి పోనీయరు. అది లీలగా కనబడుతున్నట్లే ఉంటుంది. స్పష్టంగా కనబడదు. కనబడని మేర ఊహించుకున్న వారికి ఊహించుకున్నంతగా ఉంటుందా పరమ సత్యం.

‘ఏమిట్రా! ఎప్పుడూ నీ పెళ్ళాం అడుగులకి మడుగులొత్తుతావు?’ అని ఏ తల్లీ కొడుకుని తెగించి అడక్కూడదు. అప్పుడా కొడుకు ‘అలా ఒత్తకపోతే నా మెడ ఒత్తుకుపోయి నీకు కొడుకు మిగలడు’ అన్న పరమ సత్యాన్ని తల్లికి చెప్పేస్తే కొడుక్కి తల్లీ మిగలదు. అంచేత పరమ సత్యం ప్రమాదకారి కూడా. గుర్తుంచుకోండి.దాన్ని కంఠంలో శివుడు విషం దాచినట్టు దాచి నవ్వడం ఉత్తమం మనకీ ఇతర్లకీ కూడా!

Exit mobile version