[‘పరమ వీర చక్ర’ అనే పుస్తకానికి ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారు వ్రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]
భారత జాతీయ రక్షణ చరిత్రలో అతి ప్రభావశీలమైన అధ్యాయం పరమ వీర చక్ర విజేతలది. శత్రువుల ముందు నిలిచే ధైర్యం, దేశం కోసం తన ప్రాణం అర్పించే తపన, యుద్ధభూమిలో చివరి శ్వాస వరకూ పోరాడే దృఢ సంకల్పం – ఇవి సాధారణ మనుషుల్లో అరుదుగా కనిపించే లక్షణాలు. కిలపర్తి త్రినాథరావు, కమొడోర్ దర్భముళ్ళ చంద్రశేఖర్, నాగుల శ్రీనివాస్, మేడా మస్తాన్ రెడ్డి ఈ పుస్తకంలో పరిచయం చేసిన 21 మందిలో ప్రతి ‘పరమ వీర చక్ర వీరుడు’ అలాంటి అసాధారణ మహనీయులే. ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా ఒకసారి మిలటరీ యూనిఫారం వంటి పైకి చేరగానే – అచంచలమైన, అకుంఠితమైన కఠోరమైన దీక్ష నిలువెల్లా ఆవరించుకుంటుంది.
పరమ వీర చక్ర అనే పతకం కేవలం ఒక పురస్కారమే కాదు – అది ఒక జవాన్ ప్రాణం ఇచ్చి, రుధిరంతో రాసిన దేశభక్తి ప్రతిజ్ఞ. ఈ వీరులు ఎదుర్కొన్న కఠోర పరిస్థితులు, భయంకరమైన యుద్ధ రగడ, శత్రువుల దాడులు.. ఇవన్నీ చదివితే మనకు వారి గుండెల్లో ఉన్న ఉక్కు సంకల్పం, అసాధారణమైన ధైర్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
ఏ దిల్ మాంగే మోర్
విజయానంతరం కేప్టెన్ విక్రమ్ బాత్రా నోట వెలువడిన “ఏ దిల్ మాంగే మోర్” కేక సైనికులకు అద్భుతమైన నినాదంగా మారింది. భారత సైనికులే కాక, పాక్ సైనికులు సైతం ఆయన శౌర్యప్రతాపాలకు అచ్చెరువొంది ‘షేర్ షా’ అని కొనియాడారు. శత్రు సేనలను మట్టి కరిపించి, విజయోత్సవంతో తిరిగి రాబోతున్న తరుణంలో, గాయపడిన సాటి సైనికుడిని రక్షించే క్రమంలో అనూహ్యంగా శత్రువు పేల్చిన తుపాకీ గుళ్ళ ధాటికి నేలకొరిగిన వీరుడు, త్యాగశీలి, కర్తవ్య పరాయణుడు. శిక్షణలో చేరిన కొత్త సైనికులకు విక్రమ్ బాత్రా ఒక ఆదర్శం. ఒక ప్రేరణ.
[డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమి (IMA) లో ఆయన పేరును ఉంచిన క్యాడెట్స్ నివాసాన్ని, అక్కడ ఉన్న ఆయన స్మృతి చిహ్నాన్ని దర్శించే భాగ్యం నాకు కలిగింది.]
చుట్టూ తెల్లని మంచు, పైన నల్లని ఆకాశం, మినుణుమంటున్న తారలే తోడుగా, గడ్డ కట్టించే చలిలో ఎన్నో రాత్రులు కాళరాత్రులుగా మారినా తొణకక బెదరక ‘దేశరక్షణకే ఈ ప్రాణాలు అంకితం’ అనే దీక్షతో మన సైనికులు పహరా కాస్తున్నారు కనుకనే మనం కంటి నిండా నిశ్చింతగా నిద్ర పోగలుగుతున్నాం.
ఎవరికైనా సంపూర్ణంగా, నిశ్చింతగా జీవించాలన్న వాంఛే ఉంటుంది. కుటుంబం, తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, బంధాలు – నిరంతరం ఇవన్నీ గుర్తొస్తాయి. అయినా దేశం పిలిస్తే, తిరిగి రాకపోయే అవకాశాలున్నా, జీవితం ఒక్క క్షణంలో మారిపోతుందన్న అనిశ్చితి ఉన్నా.. యుద్ధభూమిలో అడుగుపెడతారు. అదే వీరత్వం. అదే పరమ త్యాగం.
ఆ క్రమంలో – కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్ షెకావత్ 30 ఏళ్ళకు, గురుబచన్ సింగ్ సలారియా 26 ఏళ్ళకు, సెకండ్ లెఫ్టినెంట్ ఖేతర్ పాల్ 21 ఏళ్లకే వీర మరణం పొందడం హృదయ విదారకం.
ఆర్మీ నేపథ్యం ఉన్న మేజర్ సోమనాథ్ శర్మ వంటి వారే కాక, సుబేదార్ జోగిందర్ సింగ్ వంటి మధ్య తరగతి, సాధారణ సిక్కు రైతు మధ్య తరగతి కుటుంబం నుండి బాణా సింగ్, గిరిజన (ఆదివాసి) గ్రామం నుండి ఆల్బర్ట్ ఎక్కా వంటివారు కూడ ఒకే లక్ష్యంతో, పట్టుబట్టి, కష్టపడి పరీక్షలు పాసయి ఆర్మీలో చేరిన సాహస యువకులు ఎందరికో స్ఫూర్తి దాయకం.
పాక్ ముష్కరులు ముప్పిరిగొన్నా చెక్కు చెదరని ధైర్య సాహసాలతో చెలరేగిపోయి, వారిని పారద్రోలిన సుబేదార్ కరమ్ సింగ్ స్వాతంత్ర్యం వచ్చాక భారత పతాకాన్ని ఎర్రకోటపై ఎగరవేసే అవకాశం వచ్చిన అయిదుగురు సైనికుల్లో ఒకరుగా ఎంపిక కాబడడం ఎంత గర్వకారణం!
సుబేదార్ జోగిందర్ సింగ్ ఉత్తుంగ తరంగంలా ఎగిసి, సహ సైనికులను ఉత్సాహపరుస్తూ, చైనా మూకలను చెల్లాచెదురు చేస్తూ, తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బందీగా పట్టుకెళ్ళిన చైనీయుల ఖైదు లోనే మరణించారు. భారత ప్రభుత్వం ఆయనకు ‘పరమ వీర చక్ర’ ప్రకటించిందని తెలిసి, ఆయన అస్థికలను పంపగా, వాటిని అందుకున్న కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడవడం ఊహించలేనంత విషాదం.
స్వాతంత్ర్య ఇండియన్ ఆర్మీ ఏర్పడక పూర్వం ‘బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ’లో తండ్రి మున్షీరామ్, హవల్దార్‌ని అబ్బురంగా చూస్తూ పెరిగిన గురుబచన్ సింగ్ సలారియా ఆర్మీలో చేరి, గొప్ప యుద్ధవ్యూహ రచనా చతురుడుగా, నాయకత్వ పటిమ కలవాడిగా పేరుగాంచి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్‌లో అపూర్వమైన తెగింపు ప్రదర్శించి అమరుడైనాడు.
మేజర్ షైతాన్ సింగ్ 1962 ఇండో చైనా యుద్ధంలో అద్భుతమైన పోరాటం జరిపి, చివరి క్షణం వరకు ధీరుడిగా నిలిచి, ధైర్యానికి, దేశం పట్ల అంకితభావానికి కలకాలం తార్కాణంగా భారత సైనికుల గుండెల్లో శాశ్వత స్థానం పొందాడు.
చైనా యుద్ధంలో మొక్కవోని ధైర్య సాహసాలతో పోరాటం సాగిస్తున్న మేజర్ ధన్ సింగ్ థాపా చివరిక్షణంలో చైనీయులు యుద్ధ ఖైదీగా పట్టుకుపోయారు. అక్కడ ఎన్ని చిత్రహింసల పాలైనా తన ఆత్మస్ధైర్యం కోల్పోలేదు. ఆయన వీర మరణం చెందాడని భావించిన భారత ప్రభుత్వం ‘పరమ వీర చక్ర’ ప్రకటించింది. విషయం తెలిసి, భారత ప్రభుత్వం చొరవతో మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. కానీ శత్రు శిబిరంలో ఎన్ని చిత్రహింసలు భరించాడో ఎవరం ఊహించలేం.
కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ అసామాన్య ధైర్యంతో 1965 రెండవ కాశ్మీర్ యుద్ధంలో దేశం కోసం అనితర త్యాగంతో తృణప్రాయంగా ప్రాణాలర్పించిన మహావీరుడు.
వాయుసేనలో
ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ భారత వాయుసేనలో పరమ వీర చక్ర పొందిన ఏకైక వీరుడు. తన పేరున్న శ్రీనగర్ వాయుసేన స్టేషన్ ఆడిటోరియంలో ఇప్పటికీ అతడి విగ్రహం అక్కడి సైనికుల్లో వీరత్వాన్ని రగిలిస్తోంది.
ఎందరు.. ఎందరు వీరులు! దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరులు, త్యాగధనులు!
ఇసుక తుఫాన్ల కిందనో, మంచు గడ్డల మరుగునో కప్పబడి ప్రాణాలు కోల్పోవడం కంటే – చివరి శ్వాస ఆగిపోయే లోపు ఒక్క శత్రువు నైనా పడగొట్టాలనేదే మన వీరుల ధ్యేయం.
పురస్కారాలు, అవార్డులు, గౌరవాలు, స్మృతి చిహ్నాలు.. సరే – తండ్రినో, అన్ననో, భర్తనో, కొడుకునో కోల్పోయిన ఆ యింటి ఆడబడుచుల అనంతమైన ఆవేదన తీరేదెలా! వారి దుఃఖానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటుందా!
ఈ ప్రాణం దేశ రక్షణకే అంకితం
ఈ పుస్తకం ఆ మహావీరుల జీవితగాథలను కేవలం వివరించడమే కాదు – వారిని ఆ స్థాయికి చేర్చిన ఆలోచనలు, వారి మనసులోని దేశభక్తి జ్వాల, “నాకు వచ్చిన ప్రాణం దేశానిదే” అనే భావనను కూడా నిశితంగా వెలికితీస్తుంది. వారు ఎక్కడ జన్మించారు అనేది ముఖ్యమేమీ కాదు; వారు ఏ విధంగా మన దేశం కోసం మరణించడానికి సిద్ధపడ్డారు అనేది ముఖ్యమైనది. యుద్ధానికి వెళ్లే ముందు తమ కుటుంబాన్ని చివరిసారి చూసి బయలుదేరిన ఆ క్షణం.. శత్రువుల చుట్టుముట్టే ప్రమాదాన్ని తెలిసినా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు సాగిన ఆ సంకల్పం.. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనసు కలవరపడుతుంది, అదే సమయంలో అప్రయత్నంగా ఇందరు వీరులను కన్న భరతమాత గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.
ఈ గ్రంథం లక్ష్యం – భవిష్యత్ తరాలకు వీరి కథలను చేరవేయడం. దేశభక్తి అంటే కేవలం మాటలు కావని, అది కార్యాలలో ప్రతిఫలించాలి అనే స్ఫూర్తిని నింపడం. ఒక సాధారణ మనిషి ఎలా అసాధారణుడవుతాడో, ఒక సాధారణ జవాన్ ఎలా అమరవీరుడవుతాడో చూపించడం.
21 మందిలో ‘సెకండ్ లెఫ్టనెంట్ రామ రఘోబా ఠాణే, సుబేదార్ కరమ్ సింగ్, రైఫిల్ మేన్ సంజయ్ కుమార్, గ్రనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్’ – నలుగురు జీవించివుండగానే ‘పరమ వీర చక్ర’ పొందడం అనిర్వచనీయమైన ఆనందం.
‘పరమ వీర చక్ర’ విజేతలు మనకు నేర్పేది ఒక్కటే – దేశం కోసం జీవించడం గొప్పది, కానీ దేశం కోసం మరణించడం అమరత్వం.
ఈ పుస్తకం ఆ అమరులకు సమర్పించే పాదసేవ వలె భావిస్తూ, వారి కథల ద్వారా ప్రతి పాఠకుడిలోనూ దేశభక్తి అనే వెలుగు మరింత ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వీరుల ధీరత్వం, త్యాగం, దేశభక్తి గురించి తరతరాలు కథలు కథలుగా గానం చేసుకోవడం, ఙప్తి చేసుకోవడమే మనం వారికిచ్చే నివాళి.
పాఠ్యాంశాల్లో
ఆకాశవాణి రేడియో కేంద్రం లోను, ఇప్పుడు పుస్తక రూపంలోను వచ్చిన భారత వీరులైన ‘పరమ వీర చక్ర’ గ్రహీతల గాథలు రాబోయే తరాలకు తెలియాలన్నా, లేత వయసు లోనే దేశభక్తి పెంపొందాలన్నా ఆచరించవలసిన కర్తవ్యం ఏమిటంటే – హైస్కూల్ స్థాయిలో ‘నాన్ డీటెల్డ్ బుక్’గా సిలబస్‌లో చేర్చాలి. ఇంత శ్రమపడిన ఈ రచయితలు మరింత శ్రద్ధ, శ్రమ తీసుకుని ‘రేపటి పౌరులు’ మనస్సుల్లో నాటుకునేలా ప్రభుత్వాన్ని, విద్యాశాఖని ఒప్పించాలి. ఇతర దేశాల పట్ల ఆకర్షణతో మాతృదేశం, మాతృమూర్తులను వదిలి వెళ్ళేవారికి ఎన్ని బోధనలు చేసినా మారతారన్న నమ్మకం లేదు. ఈ అమరజీవుల దేశభక్తి, త్యాగనిరతి పాఠ్యాంశంగా ఉంచితే బాల్యం నుండి బాధ్యత కలిగిన భారత పౌరులవుతారన్నది నా ఆకాంక్ష.
ఈ పవిత్రమైన యజ్ఞాన్ని ప్రత్యేకమైన నిబద్ధతతో నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. చివరిలో కొంచెమైనా ఆ యాగ ఫలాన్ని అందుకునే అవకాశం నాకూ కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
జై భారత్.
🙏🙏🙏
***
(ఇరవై ఒక్క భారత యోధుల సంక్షిప్త సమాచారం)
రచన: దర్భముళ్ళ చంద్రశేఖర్, మేడా మస్తాన్ రెడ్డి, నాగుల శ్రీనివాస్, కిలపర్తి త్రినాథరావు
పేజీలు: 134
వెల: అమూల్యం
ప్రతులకు:
దర్భముళ్ళ చంద్రశేఖర్,
ఫోన్: 94918 50718
