[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పరమపద సోపానం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 15వ అధ్యాయం, 6వ శ్లోకం:
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః।
యద్గత్వా న నివర్తన్తే తద్ధాం పరమం మమ॥
ఈ శ్లోకంలో భగవంతుడు తన దివ్య ధామం గురించి వివరిస్తున్నాడు. సూర్యుడు గానీ, చంద్రుడు గానీ, అగ్ని గానీ నా ఆ పరమ ధామాన్ని ప్రకాశింపజేయలేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు అని ఆయన స్పష్టం చేస్తున్నాడు అంటే భగవంతుని దివ్యధామానికి చేరినవారికి ఇక పునర్జన్మ వుండదు. అట్టివారికి ఆ భగవంతుని దివ్య సన్నిధిలో శాశ్వత స్థానం లభిస్తుంది. అంధకారమయమైన ఈ భౌతిక ప్రపంచంలో వున్నంతకాలం మానవుడు అనుక్షణం అరిషడ్వర్గాలలో పడి కొట్టుమిట్టాడుతుంతాడు. ఒక క్షణం సుఖం, మరొక క్షణం దుఖం, ఒక క్షణంలో ఆరోగ్యం, మరొక క్షణంలో పీడనం ఈ విధమైన ద్వంద్వాల మధ్య జీవితం నలిగిపోతూ వుంటుంది. ముక్తి లేదా మోక్షం (వాడుక భాషలో ముక్తి అని కూడా ఉపయోగించడం జరుగుతుంది) అంటే ఈ ద్వంద్వాల నుండి శాశ్వతంగా విడిపడిపోవడమే అని అంటుంది శాస్త్రం.
శ్రీమద్భాగవతం (2.10.6) లో, ముక్తి అంటే ముక్తిర్ హిత్వాన్యథా – రూపం స్వరూపేణ వ్యవస్థితిః అని నిర్వచించబడింది. ముక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క కలుషితమైన చైతన్యం మరియు స్వచ్ఛమైన చైతన్యం యొక్క స్థితి నుండి విముక్తి అని అర్ధం. మన పుట్టుక పరమ పరమాత్మ నుండి వచ్చింది. తరువాత విముక్తి తర్వాత, మనం పరమాత్మ ఉనికిలో విలీనం అవుతాము. ఆ దివ్య సన్నిధిలో అనుక్షణం అనుపలభ్యమైన శాశ్వతానందాన్ని అనుభవిస్తాము. ముక్తి అనేది ఈ జీవితం అనే చట్రం నుండి తప్పించుకుందామనుకునే వారికి కాదు. ముక్తి పరిపూర్ణతతో తొణికిసలాడే వారి కోసం. భగవంతుని ఉనికిని అనుక్షనం అనుభవించాలనుకునే వారి కోసం. మోక్షం లేదా విముక్తి అంటే శాశ్వతమైన ఆనందం; అన్ని కష్టాల నుండి అంతిమ స్వేచ్ఛ.డబ్బు, ఆస్తులు, సంబంధాలు, హోదా వంటి భౌతిక విషయాలలోనే మనిషి ఆనందాన్ని వెతుకుతాడు. దురదృష్టవశాత్తు, వీటిలో దేనిలోనూ శాశ్వతమైన ఆనందం లభించదు. ఎందుకంటే, అన్ని ఆస్తులు, అనుబంధాలు ఏదో ఒక రోజు మనల్ని వీడిపోతాయి, లేదా మనం వాటిని వదిలి వెళ్లవలసి వస్తుంది. అవి మన నుండి దూరమైనప్పుడు, వాటితో మనం అనుభవించిన ఆనందం ఎంత గొప్పదో, అదే స్థాయిలో మనకు దుఃఖాన్ని కూడా మిగుల్చుతాయి.
అందువలన, ఈ ప్రపంచం అంతా శాశ్వత ఆనందం కోసం పరుగులు తీస్తుంది, కానీ చివరకు దుఃఖానికి దారితీసే తాత్కాలిక సంతృప్తిని మాత్రమే పొందుతుంది. మోక్షం యొక్క నిజమైన అర్థం శాశ్వతమైన, పరిపూర్ణమైన ఆనందం లేదా నిత్యానందం తప్ప మరొకటి కాదు. నిజమైన ఆనందం అంటే, దానిని ఒకసారి అనుభవించిన తర్వాత, ఇక ఎప్పటికీ దుఃఖం లేని స్థితి. ప్రతి ఒక్కరూ కోరుకునేదీ, అన్వేషించేదీ ఈ రకమైన శాశ్వత ఆనందమే.
మానవ జన్మలో ఈ దుఃఖరహిత ఆనందాన్ని అనుభవించే తొలి అనుభూతినే జీవన్ముక్తి లేదా మోక్షం యొక్క తొలి దశ ఇది అన్ని రకాల బాధల నుండి విముక్తిని సూచిస్తుంది.
ఆ తర్వాత, ఒక వ్యక్తి యొక్క కర్మలు పూర్తిగా ముగిసినప్పుడు, అంతిమ మోక్షం (విదేహ మోక్షం) సిద్ధిస్తుంది. అప్పుడు జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంతో అన్ని భవబంధాలను తెంచుకొని శాస్వతమైన ఆ భగవంతునిలో ఐక్యం కోసం ప్రయాణం సాగిస్తుంది. కాబట్టి శాశ్వతమైన ముక్తి కోసం యత్నిస్తే ఏదో ఒక జన్మకు మన ఆద్యాత్మిక సాధన సఫలమై మనం శాశ్వతంగా ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాము. అదియే మనందరి కర్తవ్యం అని భగవంతుడు అర్జునిడిని నిమిత్తం చేసుకొని మోక్షమార్గాన్ని వివరించాడు.
