Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పారమార్థిక ఉమ్రా పర్యటన

[ఇటీవల తాము జరిపిన ఉమ్రా యాత్ర అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]

స్లాం మతంలో హజ్ మరియు ఉమ్రా అనేవి అత్యంత పవిత్రమైన పారమార్థిక యాత్రలు.

గ్రూప్ టూర్ అయితే అనువుగా ఉంటుందని ఒక టూర్ ఏజెన్సీ ద్వారా 15 రోజుల ఉమ్రా యాత్రకు సంకల్పించాను. ప్రయాణ ఖర్చుల నిమిత్తం వీసా, విమాన టికెట్లు, వసతి, భోజనం, సౌదీ అరేబియాలో స్థానిక రవాణాలకు కలిపి 91,000 తీసుకున్నారు. మా ప్రయాణ అనుభవాలు చెప్పేముందు ఉమ్రా గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి.

సర్వేశ్వరుడైన ‘అల్లా’కు దగ్గర కావడానికి, పాపక్షమాపణ పొందడానికి, ఆధ్యాత్మిక శాంతికి చేసే ఒక ప్రత్యేక ఆరాధనా కార్యక్రమమే ఉమ్రా. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి.

  1. శుచిగా స్నానం చేసి మగవారు ఇహరామ్ (తెల్లటి వస్త్రం పంచలా కట్టుకోవాలి, మరో తెల్లటి వస్త్రం అంగ వస్త్రంలా ఎడమ భుజాన్ని కప్పుతూ ఎదపై చుట్టుకోవాలి) ధరించాలి. స్త్రీలు బురఖా కప్పుకొని తల వెంట్రుకలు కనిపించకుండా హిజాబ్ ధరించాలి.
  2. దేవుడి పేరిట ఉమ్రా సంకల్పాన్ని చేసుకొని మక్కా చేరుకోవాలి.
  3. మక్కాలో అల్లా నిలయమైన ‘మస్జిద్ అల్ హరం’ ప్రాంగణంలో ఉన్న ‘కాబా’ చుట్టూ భగవంతుని స్తుతిస్తూ ఏడు మార్లు ప్రదక్షిణ చేయాలి. తదుపరి ‘సఫా’, ‘మర్వ’ పర్వతాల మధ్య దూరాన్ని 7 సార్లు వేగంగా నడవాలి.
  4. ఆఖరుగా మగవాళ్లు తల వెంట్రుకలు తీసివేసి గుండు గీయించుకోవాలి. స్త్రీలైతే మూడుసార్లు వెంట్రుకలు కత్తిరించుకోవాలి. దీనితో ఉమ్రా పూర్తౌతుంది. భక్తులు వారి వారి శక్తిని బట్టి ఎన్ని మార్లైనా ఉమ్రా చేయవచ్చు.

స్త్రీలు పురుషులు కలిసి 30 మందితో మా జట్టు నవంబరు 29 ఉదయం ఐదు గంటలకు హైదరాబాదులో విమానం ఎక్కి ఆరు గంటలు ప్రయాణించి సౌదీ అరేబియా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు జిద్దా చేరుకున్నాము. జిద్దా విమానాశ్రయం నుంచి బస్సులో గంటసేపు ప్రయాణించి మక్కా నగరం చేరుకున్నాము.

మక్కా నగరంలో అడుగు పెట్టిన క్షణం ఓ విధమైన అలౌకిక ఆనందానికి లోనైనాను. మస్జిద్ అల్ హరం లోకి ప్రవేశించి కాబాను దర్శించినప్పుడు నాలో చెలరేగిన  మిశ్రమ భావాలు మాటల్లో చెప్పలేనివి. బాల్యం నుంచి కేవలం పుస్తకాల్లో క్యాలెండర్లలో బొమ్మలుగా చూసిన కాబాకు అత్యంత సమీపంలో ఉన్నాను, అనే నిజం నన్ను ఉద్వేగానికి గురిచేసింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వేలాదిమంది యాత్రికులతో కలిసి ఒకే స్వరంతో ‘లబైక్ అల్లాహుమ్మ లబైక్’ అని జపిస్తూ కాబా చుట్టూ ప్రదక్షిణం చేస్తూ దగ్గరగా వెళ్లి  కాబాను తాకినంతనే మనసు వినమ్రతతో నిండిపోయింది.

అనంతరం సఫా – మర్వ దూరాన్ని 7 మార్లు నడిచి  పవిత్ర జమ్జమ్ నీరు తాగాము.

జమ్జమ్ నీరు ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇది మక్కా నగరంలోని మస్జిద్ అల్-హరామ్‌లో, కాబా సమీపంలో ఉన్న బావి నుండి వస్తుంది. ఈ బావి సుమారు 4,000 సంవత్సరాలుగా ఎప్పటికీ ఎండిపోకుండా నిరంతరం ప్రవహిస్తోంది.

చారిత్రక నేపథ్యం ప్రకారము

జమ్జమ్ నీరు ఏ ఉద్దేశంతో త్రాగితే, ఆ ఉద్దేశం నెరవేరుతుంది అని నమ్ముతారు. ఈ నీటిపై ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు జరిపి ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన నీరుగా ప్రకటించారు.

అనంతరం మేము బసచేసిన హోటల్ కెళ్ళి అక్కడే ఉన్న సెలూన్‌లో గుండు గీయించుకుని ఉమ్రా విధి విధానాలు పూర్తి చేశాను.

మక్కాలో మేము బస చేసిన ఏడు రోజులలో మూడుసార్లు ఉమ్రా చేసే అవకాశం కలిగింది.

మక్కా (మక్కా నగరం) ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నగరంమే కాకుండా, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. మక్కా నగరంలో, పరిసరాల్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చూసాము. వాటి గురించి క్లుప్తంగా రాస్తున్నాను.

అబ్రాజ్ అల్ బైత్ టవర్ (క్లాక్ టవర్):

ప్రపంచంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటి. ఇందులో షాపింగ్ మాల్స్, హోటల్స్, మ్యూజియం ఉన్నాయి.

జబల్ అల్ నూర్ (ప్రకాశ పర్వతం):

ప్రవక్త ముహమ్మద్ గారు మొదటి వహీ (దివ్య సందేశం) పొందిన హిరా గుహ ఇక్కడ ఉంది.

మక్కా మ్యూజియం:

ఇస్లాం చరిత్ర, కళలు, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మంచి ప్రదేశం.

మినా నగరం:

హజ్ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడ గుడారాల్లో నివసిస్తారు.

జమరాత్ బ్రిడ్జ్:

హజ్‌లో భాగంగా ‘సైతాన్ పై రాళ్లు వేయడం’ అనే ఆచారం ఇక్కడ జరుగుతుంది.

మస్జిద్ ఐషా (తనీమ్ మస్జిద్):

ఉమ్రా యాత్రకు ముందు మికాత్ (ప్రారంభ స్థలం) గా ప్రసిద్ధి.

తైఫ్ నగరం:

మక్కాకు 60 కిలోమీటర్ల దూరంలో సరోవత్ పర్వతప్రాంతంలో సముద్ర మట్టానికి 19 మీటర్ ఎత్తులో ఉన్న నగరం ఇది. దీనిని ‘రోజాల నగరం’ (City of Roses) అని పిలుస్తారు. ఇది సౌదీ అరేబియాకు వేసవి రాజధానిగా ప్రసిద్ధి చెందింది.

తైఫ్లోని అల్ హదా పర్వతాలు మరియు షఫా ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. రోజా తోటలు మరియు వాటి నుండి తయారయ్యే రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి.

పచ్చటి పార్కులు, పాత మార్కెట్లు, సాంప్రదాయ వంటకాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మక్కా నుండి తైఫ్‌కు రహదారి ప్రయాణం ఓ వింత అనుభవాన్ని ఇస్తుంది. పర్వతాల గుండా మెలికలు తిరుగుతూ విశాలమైన రోడ్లు వేశారు. పర్వత పంక్తుల అందాలను చూడాలంటే కేబుల్ కార్ లో వెళ్లవచ్చు.

ఏడు రోజుల మక్కా పర్యటన తరువాత శాంతికి, కరుణకు నిలయమని ప్రసిద్ధి చెందిన మరో పవిత్ర స్థలమైన  మదీనాకు బయలుదేరాము. ఎడారి, పర్వత ప్రాంతాల గుండా ఆరు గంటలు ప్రయాణించి మదీనా చేరుకున్నాము.

మదీనా యాత్ర మాటల్లో చెప్పలేని ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవం.

మదీనా నగరం ఇస్లాం చరిత్రలో అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ప్రవక్త మహమ్మద్ హిజ్రత్ చేసిన తర్వాత ఆయన నివాసం, ఇస్లాం వ్యాప్తి కేంద్రం, మరియు ముస్లింలకు శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

మాకు ఏర్పాటు చేసిన హోటల్ రూముకు వెళ్లి స్నానాధుల అనంతరం మస్జిద్ -ఎ- నబవి దర్శించాము. ఎలక్ట్రానిక్ గొడుగులతో, ఖరీదైన  షాడ్లియర్లతో, అలంకరించిన అత్యంత అందమైన ప్రదేశము.

ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉన్న పవిత్రమైన మస్జిద్ ఇది. ఇక్కడ ప్రార్థన చేయడం అత్యంత పుణ్యకార్యం.  ఈ ప్రాంగణంలోనే ఉన్న ‘రౌదా’,  ‘స్వర్గపు తోటలలో ఒక తోట’ అని ప్రవక్త పేర్కొన్న స్థలం. ఈ ప్రదేశానికి వెళ్లి ప్రార్థన చేయటానికి ఆన్లైన్లో అనుమతి పొందాలి. మదీనాలో ఉన్న ఏడు రోజుల్లో ప్రతిరోజు సాయంకాలము ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకున్నాము. ఈ నగరంలో మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాము. అవి-

ఉహుద్ పర్వతం:

ఇస్లాం చరిత్రలో పవిత్ర ఉహుద్ మత యుద్ధం జరిగిన ప్రదేశం.

బాకీ సమాధి స్థలం:

ప్రవక్త కుటుంబ సభ్యులు, సహాబీలు సమాధి అయిన స్థలం.

కుభా మసీదు:

ఇస్లాం చరిత్రలో ఇది మొట్టమొదటి మసీదు.

మదీనా రైల్వే మ్యూజియం:

సౌదీ అరేబియా రైలు చరిత్రను తెలిపే మ్యూజియం

ఖర్జూరవనం:

ఇక్కడ దాదాపు 20 రకాల ఖర్జూరాలను చూడవచ్చు. ఇక్కడి స్థానికుల్లో స్నేహశీలత, ఆత్మీయత, సౌజన్యము కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన మధ్యస్థ వాతావరణం ఎంత తిరిగినా అలుపు ఉండదు. మదీనా యాత్ర మనకు వినయం, ప్రేమ, మరియు సహనాన్ని నేర్పుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, మన ఆత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక పథం.

మదీనా పర్యటన అనంతరం బస్సులో జిద్దా చేరాము. రోజంతా జిద్దా నగర పర్యటన. జిద్దా చాలా అందమైన నగరము. విశాలమైన రోడ్లు, ఖర్జూరపు చెట్ల వరసలు, అందమైన భవంతులు, రకరకాల ఆధునిక వాహనాలు, పెద్ద పెద్ద అంగళ్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ద్విచక్ర వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఇక్కడ ఎర్ర సముద్రం తీరాన 5 అందమైన బీచులు ఉన్నాయి. అందులో స్త్రీలకు ప్రత్యేకమైన బీచ్ కూడా ఉంది.

సరళమైన జీవనశైలి, సామాజిక స్పృహ, సౌమ్యత నగరవాసుల స్వభావం అనిపిస్తుంది.

ఉమ్రా యాత్రలో మక్కా నాకు వినమ్రత, సహభావం, సౌశీల్యత నేర్పింది. మదీనా నాకు శాంతి, కరుణను, సహనం అందించింది. ఈ రెండు నగరాలు కలిపి విశ్వాసానికి సంపూర్ణతను ఇచ్చాయి.

ఈ యాత్రలో నేను మరువలేని జ్ఞాపకాలతోపాటు కృతజ్ఞతతో, ఆత్మవిశ్వాసంతో నిండిన  ఒక కొత్త హృదయాన్ని తీసుకొని వచ్చాను.

Exit mobile version