Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరిచయమొకటి

[డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి గారు రచించిన ‘పరిచయమొకటి’ అనే కథని అందిస్తున్నాము.]

మస్య తీరిపోయిందనుకున్నాడుసత్తిబాబు. రెండు నెలలయినా పూర్తవందే మళ్ళీ శివయ్యకి ప్రాణం మీదకొచ్చింది.

పదహేను రోజులుగా ఆసుపత్రికి ఇంటికి ఇంటికి ఆసుపత్రికి మళ్ళీ షటిల్ సర్వీస్ తప్పలేదు. ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రమే. ఇంట్లో వంటావార్పులకు శక్తి సరిపోతుంది కానీ మాటిమాటికీ ఎక్కడికీ కాలు కదపలేని పరిస్థితి. దగ్గరలో లేని పిల్లల కొలువులు చూస్తే పగలెంతో రాత్రులూ అంతే వాళ్ళకి. ఏ వారాంతమో మిగిలే సమయం వాళ్ళ పనులకే సరిపోదు. రాలేరు, ఉండలేరు. ఇక మిగిలింది నేనే. అయినా నేను విసిగిపోను.. దేవుడు ఎంత పనైనా చేసే సహనం ఇచ్చాడు.రెండ్రోజుల నుంచి కొంచెం మెరుగయినట్టు డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే ఆయనకి మాట వినని మొండితనం పోలేదు. వయస్సు డెబ్భైకి చేరువౌతున్నా కూడా కొన్ని ఆలోచనలకు దూరం కాలేదు.. ఎవరి మాటా పొసగదు. వృద్ధాశ్రమంలో పడేయమంటూ ఒకటే పోరు. నా మనసు అంగీకరించదు. సమాజగత ప్రాణిని. ఎవరేమన్నా పడలేను. తనకు ముదిరిన ఉబ్బస రోగానికి, మంచి వైద్యం చేయించి యింటిదగ్గరే ఉంచాలన్నది నా ఉద్దేశ్యం. స్వేచ్ఛ గా వదిలేస్తే మళ్ళీ తాగుడు, తిరుగుడు ఆపడు.

పెద్దలు చెబితే,పిల్లలు వినే ఆ కాలం నాటి రోజులకు ఈయన వ్యవహారం పూర్తిగా విరుద్ధంగా ఉంది. పిల్లలం మేం ఏం చెప్పగలమన్న దుస్థితి ఇప్పటిది.

పేరుకే శివయ్య . ఓ దానం ధర్మం పుణ్యం పాపం ఆధ్యాత్మిక చింతన ఏమీ లేవు. అమ్మ ఉన్న రోజుల్లో లేని వింత ఇప్పుడిలా చూస్తాననుకోలేదు. వచ్చే పోయే బంధువర్గమో, మంచి చెప్పే స్నేహితులో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆయనే అందర్నీ వదులుకున్నాడో, అందరూ ఆయన్నే వదిలేశారో తెలియదు. ఇప్పుడనుకొని ఏం లాభం?

ఎంత వాళ్ళయినా కర్మఫలం అనుభవించక తప్పదు అని సరిపెట్టుకోవటం తప్ప చేసేందేం లేదు. ఇలా ఆలోచనల్లో కొట్టుమిట్టాడుకొనే లోగా ఆసుపత్రి వచ్చిందని ఆటో అబ్బాయి చెప్తేనే కాని గమనించలేకపోయాను.

భోజనం కారేజి తీసుకుని వార్డు లోకి వెళ్ళి చూస్తే బెడ్ ఖాళీగా కనిపించింది. గుండెల్లో రాయి పడింది.. ఏమైందోనని.ఆ పక్క బెడ్ కూడా ఖాళీగానే కనిపించింది. ఈ లోగా అటువచ్చిన సిస్టర్ ని అడిగితే ఆ పక్క బెడ్ అతను రాత్రి పోయాడని చెప్పింది. దిగులు ఎక్కువైంది. నా బెంగ తీర్చటానికి అన్నట్టు నాన్న అటు రావటం కనిపించింది. మొహంలో ఏదో కొత్త కాంతి కనిపించింది. భోంచేస్తూ నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు.

“మనింటికి వెళ్ళిపోదాం, వృద్ధాశ్రమంలో చేర్చమంటూ ఇన్నాళ్ళూ అనవసరంగా వేధించాను. చివరి ఘడియలు ఆనందంగా మీతో పంచుకోవాలి, ప్రశాంతంగా దైవ సన్నిధిలోకూడా ఎక్కువ గడపాలి అని నిర్ణయించుకున్నాను. నిన్న రాత్రి నా పక్క బెడ్ ఆయన చనిపోయాడు. ఆయనతో గడిపిన వారం రోజులు నా జీవితం లో ప్రత్యేకం. జీవితం అంటే ఏంటో, బంధాల తీపి ఎలా ఉంటుందో అర్ధంచేసుకోవటానికే ఆయన పరిచయం కలిగినట్టుంది. అంతేకాదు హఠాత్తుగా కన్నుమూస్తాడనుకోలేదు. విలవిలాడిపోయిన వాళ్ళవాళ్ళను చూడగానే నా మనసు కలచివేయటంతో పాటు నా ఆలోచనలలో మార్పు తెచ్చింది. ఇటువంటి పరిచయమొకటి నాలో కొత్తశక్తి నింపింది. నన్ను ఈ రోగాలు ఇంకేమీ చెయ్యవు.” అంటున్న ఆయన్నే విచిత్రంగా చూస్తూ ఉండిపోయాను.

Exit mobile version