Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరిష్కృతి

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సింగీతం విజయలక్ష్మి గారి ‘పరిష్కృతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ఊరి వారందరికీ పరమానందయ్య అన్నా ఆయన పలుకులన్నా ఆయన పాటించే పద్ధతులన్నా చాలా ఇష్టం. ఆయనే కాదు. ఆయన సహధర్మచారిణి పద్మావతమ్మ గారన్నా కూడా ఎంతో భక్తిప్రపత్తులతో మసలుకొంటుంటారు. ఆ ఇద్దరినీ ఆది దంపతులుగా భావిస్తూ వుంటారు అందరూ. అందరికీ తలలో నాలుకలా ఉంటారు ఆ దంపతులు. ఎటువంటి భేషజాలకు పోరు. ఆయన పేరుకు తగ్గట్టు ఆ ఇంటిలో ఎప్పుడూ ఆనందం తాండవిస్తూ ఉంటుంది. ‘పరోపకారార్థ మిదం శరీరం’ అన్నట్టుగా ఉంటారు. వారి లాంటి మహనీయులు తమ మధ్య ఉండటం వల్లనే తమ కష్టాలన్నీ గట్టెక్కుతున్నాయని ఆనుకొంటారు ఆ ఊరి జనాలు. శ్రేయస్సును కాంక్షిస్తూ అందరూ బంధుజనాలై సఖ్యతతో ఉండటం వల్లే అందరికీ మంచి జరుగుతుందటుంటారు పరమానందయ్య గారు.

ఆరోజు ఉద్యానవనంలో ఉసిరి చెట్టుపై ఉడుతల ఆటలు గమనిస్తున్నారు పరమానందయ్య గారు. వెనుక ఎవరిదో నీడ కదిలినట్లయితే వెనుదిరిగి చూసారు.

“నమస్కారం మాస్టారూ” అంటూ దండం పెట్టింది ఊర్మిళ.

“ఆ.. ఏంటమ్మా, స్వామి అర్చనకు పూలు కోయడానికి వచ్ఛావా?” అడిగారు.

“అవునండీ.. అలాగే నాలో నేనే సతమతమవుతున్న సమస్యకు సమాధానం మీ దగ్గర సంగ్రహించడానికి వచ్చాను మాస్టారూ” అన్నది.

“రామ్మా.. అలా కూర్చోని మాట్లాడుదాం” అంటూ అక్కడే ఉన్న సిమెంటు బెంచీ మీద కూర్చొన్నారు.

మాట్లాడకుండా మౌనంగా కూర్చొన్న ఊర్మిళ వంక చూస్తూ “చెప్పు తల్లీ” అన్నారు.

“నాన్నగారు నాకు సంబంధం చూసారు. ముఖ పరిచయమే లేని ఒక మనిషిని ఎలా నమ్మడం అనేది అర్థం కావడం లేదు. అతని గుణగణాలు ఎటువంటివో తెలియదు. చాలామంది పైన ఒకవిధంగా లోన ఒకవిధంగా ఉంటారు. అమ్మానాన్నలు అన్నీ విచారించి చేస్తారు. నిజమే. కానీ ఎంతవరకూ సరి అన్నది తెలియడం లేదు. మేక వన్నె పులులు ఎంతమంది ఉంటారు లోకంలో. కల్యాణం తర్వాత కొంతవరకూ కొత్తదనం మోజులో బాగా వుండి తర్వాత అసలు రంగు బయట పెడితే ఏం చేసేది?”

కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డారు పరమానందయ్య గారు.

తరువాత “ఇందుకు ఒక మంచి మార్గం ఉందమ్మా. ఆచార్య చాణుక్యులవారి నీతి శాస్త్రంలో సంతోషకరమైన జీవితానికి సంబంధించి ఎన్నో జీవిత రహస్యాలను పొందుపరిచారు. ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా పరీక్షించాలని, అలా చేయడం ద్వారా వారి స్వభావం, లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని, దీని ద్వారా తాము మోసపోకుండా ఉండొచ్చని వివరించారు.”

చేయవలసిన పరీక్షలూ వాటి వివరాలు పరమానందయ్య ద్వారా తెలుసుకొన్న ఊర్మిళ మదిలో ఉవ్వెత్తున సంతోషం ఎగిసిపడి కొన్ని ఊహలు తళుక్కున మెరిశాయి.

“మాస్టారూ.. మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు విన్న నాకు మనసులో భారం దిగిపోయి తేలిక పడింది. ధన్యవాదాలు మాస్టారూ” అని చెప్పి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొంది.

తల్లిదండ్రుల తరువాత పూజ్యనీయులు గురుతుల్యులు ఐన పరమానందయ్య గారి మాటల మీద గురి పెరిగింది.

***

ఆలయం నుండి వచ్చిన ఊర్మిళ ఇంటి లోపల అడుగు పెడుతుండగా ఎదురు వచ్చిన రాజారావు గారు సంతోషంగా “తల్లీ.. పెళ్ళివాళ్ళు ఉత్తరం వ్రాశారు. మన సంబంధం వాళ్లకు బాగా నచ్చిందిట. మనమూ సరేనంటే నిశ్చితార్థానికి తారీఖు పెట్టుకొందామన్నారు” అన్నారు ఆనందంగా.

నాన్నగారి సంతోషం చూస్తూ ఊర్మిళ ఏమీ మాట్లాడలేకపోయింది.

“మన సమ్మతి తెలుపుతూ ఉత్తరం వ్రాయనా తల్లీ”

“సరే నాన్నా.. అయినా ఇంకా ఉత్తరాలు ఏమిటి నాన్నా.. ఫోన్ చేయొచ్చుగా”

“మా కాలపు అలవాట్లు కదమ్మా. మాకదో తృప్తి”

“రండి త్వరగా. టిఫిన్ చల్లారి పోతుంది” అంటూ పిలిచింది పద్మిని.

“అమ్మా, ఏమిటి ఈ రోజు ఉపాహారం?” అడిగింది ఊర్మిళ.

“నీకిష్టమైన పొంగల్ పాపూ”

“హబ్భా. వాసన ఘుమఘుమలాడుతోంది” అంటూ వచ్చి కూర్చొంది ఊర్మిళ.

“పద్మా. పోపులో పసందైన జీడిపప్పు వేయించి వేశావా?”

“ఆ.. ఆ.. వేశాను రండి త్వరగా”

కమ్మగా చేసిన పొంగల్ తిని లేచారందరూ. సోఫా మీద ఆసీనులయ్యారు. ఊర్మిళ వంటగదికి వెళ్లి చాయ్ చేసి తీసుకొని వచ్చింది.

“ఆ అన్నట్టు చెప్పడం మరిచాను అమ్మాయ్. అబ్బాయ్ ఫోన్ చేస్తాడట నీకు. నెంబర్ నీకు పంపాను. స్టోర్ చేసుకో” అన్నారు.

మూడు గంటలకు ఫోన్ వచ్చింది. “హలో” అన్నది.

అటువైపునుండి నవ్వు వినిపించింది.

“ఈ హలో అన్నది ఎలా వాడుకలో వచ్చిందో తెలుసా అండీ?”

“ఆ తెలుసండీ. ఫోన్ డిజైన్ చేసిన గ్రాహంబెల్ గారు తన మొదటి కాల్ భార్యకు చేసి ‘హాలో’ అన్నారు. అది పలకరింపు కాదట. హలో అనేది గ్రాహంబెల్ భార్య పేరట. ‘మార్గరెట్ హలో’ అనేది అతని భార్య పూర్తి పేరట”

“ఓహ్. గుడ్ నచ్చానా మీకు” అన్నాడు.

“ఊ” అన్నది ఊర్మిళ ఏమనాలో తెలియక.

“మనం అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చని మీ నాన్నను అడిగి మీ ఫోన్ నెంబర్ తీసుకున్నా” అన్నాడు కార్తీక్.

“కరెక్ట్ అండి. నాకూ అలాగే అనిపించింది”

“అయినా మనం ఒకే ఆఫీసులో పనిచేస్తూ కూడా ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడనే లేదండీ. అదెలాగ?”

“డిపార్ట్‌మెంట్ వేరు కదండీ అందుకే”

“రేపు ఈవెనింగ్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ G5 బ్లాక్ క్యాంటీన్ దగ్గర కలుసుకొందాం. మీకు ఓకేనా” అన్న కార్తీక్‌తో,

“ఓకే” అంది ఊర్మిళ.

***

ఆరోజు ఆఫీసు ముగిశాక కార్తిక్ చెప్పిన G5 క్యాంటీన్ కు వెళ్ళింది. అప్పటికే అక్కడ కార్తిక్ వచ్చి ఉన్నాడు. వెళ్లి అతని ఎదురుగా కూర్చొంది. కార్తిక్ వైపు చూసింది. అతని కళ్లలో ఏదో మెరుపు కనబడింది.

“మీకు సెల్వార్ కమీజ్ బాగా సూట్ అయింది. అప్పుడు చీరలో చూసిన దాని కంటే ఇప్పుడే చాలా బాగున్నారు యంగ్ లుక్స్ తో” అన్నాడు.

నవ్వి ఊరుకొంది ఊర్మిళ. ఊర్మిళ తన హ్యాండ్ బాగ్ నుండి ఒక పార్సెల్ లాంటిది తీసి అతని చేతిలో పెట్టి “కార్తిక్ గారూ, మీరుండే ఏరియాలోనే రామా ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఉంది. మీకు తెలుసా?” అన్నది.

“చూసినట్టే ఉంది. కానీ ఎక్కడ అనేదే గుర్తుకు రావడం లేదు”

“అదేనండీ.. చర్చ్ వెనుకాల స్ట్రీట్”

“ఆ.. ఆ.. తెలిసింది. అయినా మీ కెలా తెలుసు మా ఏరియా?”

“మా ఫ్రెండ్ చెప్పింది. తనే నాకు చూపించి పరిచయం చేసింది. అప్పటి నుండీ నాకు వీలైనపుడు వచ్చి వాళ్ళను పలకరించి యాజమాన్యానికి నాకు తోచినంత అమౌంట్ డొనేషన్ లాగా ఇస్తుంటాను. ఈ మధ్య ఆరు నెలలుగా వెళ్లడం కుదరక వెళ్ళలేదు. తీసి దాచి పెట్టిన డబ్బు మొత్తం రెండు లక్షలు అయ్యాయి. తీసుకెళ్లి అక్కడ ఇచ్చేయండి ప్లీజ్” అంటూ డబ్బు అంతా అతని చేతిలో పెట్టింది.

“మీరు చేస్తున్న ఈ సేవకు ప్రేరణ ఏమిటి ఊర్మిళా దేవి గారూ” అన్నాడు కార్తిక్.

“ప్రత్యేకించి ఏమీ లేదు. వృద్ధాప్యంలో కన్నబిడ్డలు చేరదియ్యక నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఆ దిక్కులేని వారికి చేయూతనిస్తూ ఆశ్రమం స్థాపించిన వారి ఆశయాలకు చేదోడుగా ఉండాలన్న ఉద్దేశ్యంతో వీలున్నప్పుడల్లా ఇలా ఇస్తుంటాను”

“గుడ్” అంటూ తల పంకించి, “చాలా థాంక్స్ అండీ. మీ చర్య తో అనుకోకుండా నాలో ఉదయించే ఎన్నో ప్రశ్నలకు నేను అడగకుండానే సమాధానాలు దొరికాయి” అన్నాడు ఆమెలో ప్రతిబింబిస్తున్న విజ్ఞతకు ప్రభావితుడై.

“ఎలా?” అడిగింది ఊర్మిళ.

“క్రొత్తగా ఎన్నో ఆశలతో మా ఇంటికి వచ్చే అమ్మాయి మా అమ్మానాన్నలను తన సొంత అమ్మానాన్నలలా చూసుకొంటుందా.. అని అనిపించేది. ఎవరో ముక్కూ మొహం తెలియని వృద్ధుల గురించే అంతగా ఆలోచించే మీరు తప్పకుండా మా అమ్మా నాన్నలను బాగా చూసుకొంటారనిపించింది. మీ మీద ఇష్టం మరింత పెరిగింది. మీ వ్యక్తిత్వం మీద గౌరవం పెరిగింది. మీ వంటి వారి సమక్షంలో సంసారం హాయిగా గడిచి పోతుందని నమ్మకం కలిగింది”

ఆశ్చర్యంతో భృకుటి ముడివేసిందామె. తానెలాగైతే అతని గురించి తెలుసుకోవాలని అనుకుంటూందో అతను కూడా అదే ఉద్దేశ్యంతో ఉన్నాడన్నమాట. తనకు తెలియకుండానే అతని మనసులోని ఆలోచనలకు పరిష్కారంగా తను నిలిచింది. తనకన్నా ముందు అతనే తన పట్ల తృప్తిని వెలిబుచ్చాడు. కార్తీక్‌ను కాస్సేపు అలాగే దీక్షగా గమనిస్తూ తృప్తి పడింది. తాను చేస్తున్న సేవను ఖండించకుండా మద్దతు ఇచ్చేలా ఉన్న అతని ముఖకవళవికలు చూస్తూ, అతని మాటలు వింటుంటే ఆచార్య చాణుక్యుల వారి నీతిశాస్త్రం ప్రకారం తాను పెట్టిన పరీక్షలో అతను నెగ్గినట్టనిపించింది.

***

ఆరోజు శుక్రవారం కావడం వల్ల తెల్లారి లేచి అమ్మకు అన్ని పనులలో సాయం చేసి ఇంటి ప్రవేశ ద్వారం అలంకరించి గడపకు పసుపు కుంకుమ పెడుతున్న ఊర్మిళను చూస్తూ అలానే నిలబడి పోయింది పద్మిని.

“పద్మా.. ఏంటలా చూస్తూ నిలబడి పోయావు?” వెనకనుంచి పలకరించాడు భర్త.

“అది కాదండీ.. పాపకు పెళ్లిచేసి పంపించేస్తే ఈ ఇంట్లో తన సవ్వడి లేకుండా మనం ఎలాగండీ ఉంటాం” అన్నది బేలగా.

“పిచ్చి మొద్దూ.. పద్దూ. ఆదా నీ ఆరాటం. కొన్ని రోజులు అలా ఉంటుంది. రానురాను అన్నీ తానుగా అలవాటు పడితుంది. త్వరగా రెడీ అయి రా. గుడికెళ్లి వద్దాం”

“సరే” అంటూ లోపలకు వెళ్ళింది.

అది సాయంత్రం సమయం. చెట్లు, మొక్కలకు పైప్‌తో నీళ్లు పెడుతోంది ఊర్మిళ.

మొబైల్‌లో వాట్సాప్ మెసేజ్ వస్తే తీసి చూసింది.

కార్తీక్ పంపిన మెసేజ్ అది. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్ రసీదు అది. అసలు చెప్పాలంటే డబ్బు వృద్ధాశ్రమంలో కట్టినా కట్టక పోయినా అడిగేవారు లేరు. ఒకవేళ భవిష్యత్తులో తనకుతానుగా అక్కడికి వెళ్ళి ఎవరైనా డబ్బులిచ్చారా అని అడిగితే తప్ప ఆశ్రమం వాళ్ళు కూడా తమకై తాము చెప్పరు. ఎందుకంటే ఇలా దానం చేసేవాళ్ళు అక్కడికి ఎంతోమంది వస్తుంటారు. అందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు. పైగా అతన్ని తానేమీ రసీదు ఇవ్వమని కూడా అడగలేదు. కానీ ఎంతో బాధ్యతగా రసీదు పంపి సంస్కారవంతుడని నిరూపించుకున్నాడు.

ఆచార్య చాణుక్యుని నీతి సూత్రాల ప్రకారం వృద్ధాశ్రమంలో డబ్బులు కట్టమంటూ తాను పరోక్షంగా పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కార్తీక్ మంచి సంస్కారం కల వ్యక్తి అన్న నమ్మకం కలిగింది. ఐనా ఈ ఒక్క పరీక్ష సరిపోతుందా? కడివెడు అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు చూస్తే చాలదా? మనిషిలో స్వార్థపూరిత ఆలోచనలు లేవని తేలింది. డబ్బు మీద వ్యామోహం లేనివాడని తెలిసింది. భవిష్యత్తులో తాను చేయబోయే మంచి సేవా కార్యక్రమాలకు అడ్డు చెప్పడనీ, డబ్బుకంటే బంధాలు ముఖ్యమన్న భావన గల మంచి మనిషని అర్థమైంది.

ఊర్మిళ మనసుకు హాయిగా అనిపిస్తోంది. ఇప్పుడు పెళ్లి గురించి మనసులో ఎటువంటి సందేహాలూ భయాలూ లేవు.

ఓ మంచి ముహూర్తంలో నిశ్చయతాంబూలాలు పుచ్చుకున్నారు. కల్యాణ ముహూర్తం నిర్ణయించారు. కాలం ఆనందంగా పరుగులు పెడుతున్నట్టనిపిస్తోంది.

కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెళ్లి సందడి ఆరంభమైంది. బాజా భజంత్రీలు మ్రోగాయి. సూత్రధారణ జరిగింది. పెద్దలందరూ వధూవరులను ఆశీర్వదించారు. పరమానందయ్య గారిని కార్తీక్‌కు పరిచయం చేసింది ఊర్మిళ.

దీవిస్తూ “మీ భార్యాభర్తలు ఆలోచనా సమన్వయంతో ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకొంటూ విషయ అవగాహనతో కొన్ని కొన్ని త్యాగాలు చేస్తూ అపార్థాలకు తావివ్వక నిజాయితీతో ఒకరిపై ఒకరు నమ్మకంతో అనుబంధాన్ని పెంపొందించుకొంటూ కట్టుబాట్లకు కట్టుబడి పరస్పరం సఖ్యతగా ఉంటే సంసారం జీవితం సజావుగా సాగుతుందని చాణుక్య నీతి సూచిస్తున్నది” అంటూ మంచిమాటలు చెప్పారు.

“దీర్ఘ సుమంగళీ భవ. పిల్లాపాపలతో చక్కగా వర్ధిల్లండి” అని ఆశీర్వదించారు.

వధూవరులిద్దరూ మదిలో కోటి ఆశల ఊసులతో ముందుకు సాగారు.

Exit mobile version