[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వెంపరాల దుర్గాప్రసాద్ గారి ‘పరివర్తన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“శ్రీనివాస్! రా, అలా చాయ్ తాగి వద్దాం” అని గణేష్ రాథోడ్ పిలవడంతో తలెత్తి చూసేను.
నవ్వి, “సరే పద!”, అంటూ కాంటీన్ వైపు అడుగులేసాను. ఇద్దరం కాంటీన్‌లో ఓ మూల టేబుల్ దగ్గర కూర్చున్నాము.
నేను ఓ ప్రముఖ ఐ.టి. కంపెనీలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. మా ఆఫీస్ హైదరాబాద్‌లో ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లో వుంది.
మా ఆఫీస్‌కి పక్కగా, అదే ఫ్లోర్‌లో చాయ్ బిస్కట్ హోటల్ ఉంటుంది. అది పూర్తిగా ఆ ఫ్లోర్, మరియు కింద ఫ్లోర్‍లలో వుండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.
రాథోడ్ నాకంటే సీనియర్. నాలుగు సంవత్సరాలుగా అక్కడ పని చేస్తున్నాడు. రాథోడ్ వాళ్ళ పూర్వీకులు మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం నుండి వలస వచ్చిన వాళ్ళు. వాళ్ళ తండ్రి ట్రాక్టర్ విడి భాగాల బిజినెస్ చేస్తూ విజయవాడలో ఎప్పటినుంచో సెటిల్ అయిపోవడంతో చిన్నప్పటి నుంచి రాథోడ్ విజయవాడ లోనే చదువుకున్నాడు.
అందుకే తెలుగు బాగా మాట్లాడుతాడు. రాథోడ్ గురించి చెప్పాలంటే అతను పనిలో చాల నేర్పరి, చాలా చురుకైనవాడు. అతను టీమ్‌లో లేకపోతే మా మేనేజర్ ఉక్కపోసినట్లు ఫీల్ అవుతాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే ముప్పై ఏళ్ళ వయసు వచ్చినా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అతనికి వున్న దురలవాటు, రాత్రుళ్ళు అతను రెడ్ లైట్ ఏరియాలకి వెళ్లి వస్తూ ఉంటాడు. అక్కడ ఎదురైన అనుభవాలు నాతో చెపుతూ ఉంటాడు. అది అతని బలహీనత. నా భావాల సంగతి తెలుసు కాబట్టి, నన్ను ఎప్పుడూ తనతో రమ్మని పిలవడు. నాకు వినడం ఆసక్తి లేక పోయినా, నా పని విషయంలో గణేష్ రాథోడ్ అవసరం చాలా ఉంటుంది. అందుకే కాదనలేక వింటూ వుంటాను. బహుశా నిన్న ఏదో ఘనకార్యం చేసి ఉంటాడు, నా చెవులు కొరకాలి అనుకున్నట్లు వున్నాడు.
ఇద్దరికీ టీ తీసుకుని వచ్చి ఎదురుగా కుర్చీలో కూలబడ్డాడు.
“నిన్న ఏదో ఘన కార్యం చేసేవా?” అన్నాను.. నేను ఊహించేసాను అన్నట్లు.
“నిన్న కాదు, ఒక వారం నుండీ విషయాలు నీతో చెప్పాలి” అన్నాడు.
నిజమే.. ఒక వారం రోజులుగా అతను, నేను ఆఫీస్‌లో ఎక్కువ బాతాఖానీ వెయ్యలేదు. కారణం ఒక క్లయింట్‍కి ప్రాజెక్ట్ డెలివరీ చేసే క్రమంలో చాలా బిజీగా వున్నాడు.
“సరే చెప్పు” అన్నాను.
“నీకు మొదటి నుంచీ చెప్పాలి..” అంటూ మొదలు పెట్టాడు.
“వారం క్రితం నేను ఒక ఆంధ్రా పిల్లని కలిసాను. 20 ఏళ్ళ కంటే వుండవు, చాలా ఫ్రెష్‌గా అందంగా వుంది.. వెన్నెల్లో జలపాతం చూసినంత మత్తుగా వుంది. గదిలోకి వచ్చిన దగ్గరనుంచీ ఏడుస్తోంది. నాకు సహకరించడం లేదు. వాళ్ళది గోదావరి జిల్లా అని చెప్పింది. తల్లి ముందు చనిపోయిందిట, తర్వాత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. 18 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి కూడా చనిపోయాడు. సవతి తల్లి దగ్గరే ఉండేది. సవతి తల్లి పెట్టే హింసలు భరించలేక, ఇంట్లోంచి పారిపోయిందిట.
హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒంటరి గా వున్న ఈ అమ్మాయిని కనకం కంపెనీ వాళ్ళు మాయ మాటలతో ట్రాప్ చేసి, తీసుకొచ్చేసారుట. తెచ్చి రెండు రోజులయిందట. తనని బయటకి తీసుకొచ్చెయ్యమని ప్రాధేయపడింది. నాకు జాలి వేసింది. ఎందుకో ఆమెని ముట్టుకోవాలని అనిపించలేదు. ఇంతలో నాకు ఫోన్ వచ్చింది.. నేను బయటకి వచ్చేసాను.” అన్నాడు.
నాకు అర్థం కాలేదు. ‘అసలు అక్కడికి వెళ్లడమే తప్పు.. వెళ్లి మళ్ళీ జాలి అంటాడేమిటి’ అనిపించింది.
అతని మాటలకి అడ్డు వస్తూ ఇలా అడిగేను.
“నిన్ను ఎప్పటినుంచో అడుగుదామని అనుకుంటున్నాను.. ఇంత అందగాడివి, మంచివాడివి, నీకు ఇదేమి అలవాటు.. వ్యాధులు వస్తాయని తెలియదా, పైగా పోలీస్ వాళ్ళ రైడ్స్ ఉంటాయి, అరెస్ట్ అయితే సంఘంలో నీ పరువేమి కావాలి” అనేశాను.
నవ్వేస్తూ.. “చూడు శ్రీనివాస్, వ్యాధులు రాకుండా నా జాగ్రత్తలు నేను పాటిస్తాను. నా ఫ్రెండ్స్ కొందరు డాక్టర్స్ వున్నారు, వాళ్ళ సలహాలు పాటిస్తాను. ఇక పోలీస్ లంటావా, నా ఫ్రెండ్ ఎసిపి. వాడికి ఏ ఏరియాలో రైడ్స్ అయ్యేది, ముందే తెలుస్తుంది. అలాంటి సమయాల్లో నాకు ఫోన్ వస్తుంది. నేను అక్కడ నుండి తప్పుకుంటాను. ఇకపోతే ఇది నా బలహీనత, వాళ్ళకీ తెలుసు” అన్నాడు.
“అసలు నువ్వు లక్షణమయిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ వాళ్ళు సంబంధాలు చూడట్లేదా?” అని అడిగేను.
పగలబడి నవ్వేడు. “మా అమ్మ, బాబూ ఇలాగే పోరుతున్నారు. కానీ..” అంటూ ఓ క్షణం ఆగి,
“పెళ్లి చేసుకుని, ఇంక బందిఖానా జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. జీవితం అంటే జల్సాగా అనుభవించలేకపోతే యెట్లా.. మా వాళ్ళకి ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాను..” అన్నాడు.
“నేను చెప్పేటప్పుడు ఆపేసావేమిటి, ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ ఎసిపి దగ్గర నుంచే.. అందుకే, వెంటనే బయటకి వచ్చేసాను.” అన్నాడు రాథోడ్.
“సరే ఇంతకీ ఏమైంది?” అని అడిగేను ఆసక్తిగా.
“ఆ రోజు నేను బయటకి వచ్చిన అరగంటకి రైడ్ అయింది. నేను పోలీసుల సహకారంతో, ఆ అమ్మాయిని విడిపించి కేసు కాకుండా, తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఒక ఉమెన్స్ హాస్టల్‌లో ఉంచి, నా ఫ్రెండ్ ఆపీసులో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్‌లో చేర్పించేను. ఇప్పుడిప్పుడే హాస్టల్‌కి, జాబ్‌కి అలవాటు పడుతోంది” అన్నాడు రాథోడ్.
“ఇంత సంఘ ఉద్ధరణ ఎందుకో..” అన్నాను ఆపుకోలేక.
“ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే మొదటిసారిగా చాలా జాలి వేసింది. నేను ఇప్పటి దాకా ఎంతో మంది ఆడవాళ్ళని కలిసేను.. కానీ, వాళ్లంతా ప్రొఫెషనల్స్. ఈ అమ్మాయి జీవిత పరిస్థితి విన్నాక, ఆమెని ముట్టుకోవాలని అనిపించలేదు. పైగా ఏదయినా సహాయం చేయాలని అనిపించింది. మా ఫ్రెండ్ రైడ్ గురించి చెప్పడంతో ఆ అమ్మాయిని బయటకి తీసుకు రావడం మరింత సులువు అయింది.”
నాకు అర్ధం అయింది రాథోడ్‌కి పోలీసుల్లో, మరియు సంఘంలో యెంత పలుకుబడి వుందో.
“సరే.. ఇంతకీ ఆ అమ్మాయిని ఏమి చేయాలని అక్కడ ఉంచావు? వాళ్ళ వాళ్లకి అప్పజెప్పచ్చు కదా..” అన్నాను.
“నీకు ముందే చెప్పాను కదా.. ఆమె వెనక్కి వెళ్లినా ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. ప్రస్తుతానికి ఉపాధి, నీడ ఏర్పాటు చేసెను. తర్వాతి సంగతి తర్వాత..” అన్నాడు.
ఇంతలో అతని ఫోన్ మోగింది.
ఫోన్ అటెండ్ అయ్యేడు.. ఫోన్ వింటూనే అతని మొహం ఆందోళనకరంగా మారిపోయింది.
“సరే ఇన్‌స్పెక్టర్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను” అంటూ కుర్చీలోంచి లేచేడు.
నేను కూడా లేచి “ఏమయ్యింది రాథోడ్” అన్నాను ఒకింత కీడు శంకిస్తూ.
“విజయవాడ వరదలలో మా కుటుంబం చిక్కుకు పోయిందిట.. మా నాన్న అమ్మ, చెల్లి వెళ్తున్న కారు కొట్టుకు పోయిందిట. అతి కష్టం మీద అమ్మ, చెల్లిని కాపాడగలిగేరు కానీ నాన్న షాక్‌కి గురి అయ్యి, కోమాలోకి వెళ్లిపోయేరు. ఇండస్ హాస్పిటల్‌లో జాయిన్ చేసేరుట.. నేను వెంటనే విజయవాడ వెళ్ళాలి” అన్నాడు, చాలా ఆదుర్దాగా.
అతని మొహం పాలిపోయింది. నాకు చాలా జాలేసింది.
“జాగ్రత్త.. డాడీని చూసుకుని రా.. నేను ఇక్కడి విషయాలు చూసుకుంటాను”.. అన్నాను.
దాదాపు రోజూ ఫోన్‌లో మాట్లాడుతూనే వున్నాను రాథోడ్‌తో.
“నాన్నగారికి ఒక వారం రోజులకి స్పృహ వచ్చింది, కానీ గుండె బలహీనమైపోయింది, అందువల్ల మరో వారం హాస్పిటల్ లోనే ఉండాలి” అని చెప్పేడు.
మళ్ళీ వారంలో, ‘స్నేహకి.. అదే తాను హాస్టల్‌లో ఉంచిన అమ్మాయికి కొంత డబ్బు అందించమ’ని చెప్పేడు.
సోమవారం నేను హాస్టల్‍కి వెళ్ళేను.
వెయిటింగ్ హాల్ లో కూర్చున్న కాసేపటికి మల్లెతీగ లాంటి అమ్మాయి వచ్చింది.
“నమస్కారం అండీ” అంది.
జరిగిన విషయాలు స్నేహకి చెప్పి, 15000 రూపాయలు ఇచ్చేను.
రాథోడ్ చెప్పింది నిజమే.. ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా వుంది.
“సర్‌కి ఎలా వుంది, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎలా వున్నారు?” అని ప్రశ్నల వర్షం కురిపించింది.
“బాగానే వున్నారు” అని చెప్పి, తిరిగి వచ్చేసాను.
మరో పది రోజుల్లో రాథోడ్ తిరిగి హైదరాబాద్ వచ్చేడు. ఆఫీస్‍లో జాయిన్ అయిన రోజు – చాలా పీక్కుపోయి, గడ్డం మాసిపోయి కనపడ్డాడు. సాయంత్రం వరకూ నేను అతనితో మాట్లాడలేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు రెస్టారెంట్‌కి ఇద్దరమూ వెళ్ళేము.
టిఫిన్ చేస్తూ రాథోడ్ కేసి పరిశీలనగా చూస్తూ అడిగేను, “ఏమిటి విశేషాలు..” అని.
“నాలో చాలా మార్పు వచ్చింది శ్రీనివాస్. నాన్న పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతోంది. జీవితం అంటే బాగా అర్ధం అవుతోంది. నాన్న ఇంక పని చేసే స్థితిలో లేరు. ఇంక ఈ వయసులో ఆయనకి రెస్ట్ అవసరం” అన్నాడు.
మళ్ళీ ఇలా చెప్పేడు – “నాన్నని హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చేము గానీ, అమ్మ ఆయన్ని కనిపెట్టుకుని ఉండాలి. అందుకే, ఓ వారం రోజుల్లో ఇక్కడ ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని, అమ్మని, నాన్నని, చెల్లిని తెచ్చేస్తున్నాను. చెల్లి చదువు ఇక్కడే చేయిద్దామనుకుంటున్నాను.. నేను ఇదివరకటిలా తిరగడం మానేసాను శ్రీనివాస్. నాకు ఇప్పుడు జీవితం విలువ తెలుస్తోంది.”
ఒకింత ఆగి, “అమ్మ విజయవాడలో అన్న మాట నన్ను పిండేస్తోంది..” అన్నాడు.
అతని మోహంలో అపరాధ భావం.
“ఏమన్నారు అమ్మగారు?” అని ప్రశ్నించేను.
“అమ్మ ఇలా అంది..” అని దిగులుగా చెప్పేడు రాథోడ్, “ఎవరికీ హాని తలపెట్టని నాన్నకి ఇలా అవ్వకూడదు. ఆయన నిజాయితీ మంచితనం ఆయన్ని కాపాడాలి. కానీ కుటుంబంలో ఎవరు తప్పు చేసినా, కుటుంబ పెద్దకి దెబ్బ తగులుతుంది.. బాబూ నువ్వు ఎవరికీ అన్యాయం చేయకు, మన కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు.. అంది.”
మళ్ళీ ఇలా అన్నాడు.. “ఇప్పటినుంచీ కొత్త గణేష్ రాథోడ్‍ని చూడబోతున్నావ్ శ్రీనివాస్.”
నేను తృప్తిగా ఫీల్ అయ్యేను. స్నేహితుడి జీవితం చక్కబడుతుంది అంటే ఆనందంగా వుంది. కాలం ఒక్కోసారి పరిష్కారం చూపిస్తుంది అంటే ఇదేనేమో అనిపించింది.
అనుకున్నట్లే పది రోజుల్లో వాళ్ళ ఫామిలీని హైదరాబాద్ తీసుకుని వచ్చేసేడు. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేను.
ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే నెమ్మదిగా వాకర్‌తో నడుస్తున్నారు. డాక్టర్లు కూడా ఆయన పరిస్థితి మెరుగవుతోంది అని చెప్పేరుట.
రెండు నెలలు చూస్తూనే గడిచి పోయాయి. ఆ రోజు రాథోడ్ ఆఫీస్‌కి రాలేదు.
ఏమయిందో అని, అతనికి ఫోన్ చేసెను.. ఫోన్ అటెండ్ అవుతూనే.. “హలో శ్రీనివాస్ నీకు శుభవార్త చెప్పాలి, ఇప్పుడే అమ్మ నాన్న అంగీకారంతో స్నేహని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం అయింది. పంతులు గారి దగ్గరకి వచ్చేము.. త్వరలో ముహూర్తం పెట్టిస్తున్నాము” అన్నాడు.
మనసు తేలిక పడింది నాకు.
శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ A.P.E.P.D.C.L లో పర్సన్నల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ చేశారు. వారిని 9440602019 అనే నెంబరులో సంప్రదించవచ్చు.