[‘పరుగు పరుగున పోదువెటకో’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీమతి పారనంది శోభాదేవి.]
పరుగు పరుగున పోదువెటకో;
సంద్రకెరటము లంబరమ్ములు
మీదుగమనము నాపజాలవు
అయ్యు, జాగ్రత! మూటముల్లెలు!
మూటలెన్నో వదలి వేయుచు
పాటలెన్నో గళము పెగులక
తేటపలుకుల తేనెలన్నీ
దేని కొరకై వదలుటోయీ?
నాల్గు పదముల లోనె యనుభవ
సారమంతయు నిమిడి యుండిన
సామెతల్, మాట పొదుపుకు
సూటిబోధకు కావె యొజ్జలు?
తరతరమ్ములు సాకుచుండిన
పైడి సూక్తులు, తెలివి పరిమళ
కెరటముల్ నిను దీనముగ బ్రతి
మాలుచున్నవి వదలవలదని..
అమ్మ ఆడిన భాషయందే
ప్రకటితమ్మగు భావనోద్వే
గములు హౄదయము తనియు నట్లుగ
లోన నరయుము గుర్తెరుంగుము.
పదుగురొకయెడ కూడినప్పుడు
పదము, పద్యము లన్న, విన్నను
అమ్మ నుడువుల నోటపల్కిన
నపుడు చూడుము నెడదహృష్టిన్!
దశదిశాంతర్భాగములలో
నిముడజాలని పాండితీప్రభ
చెరగు లాగుచు నడ్డువడు నీ యప
మార్గగమనము నాపుమనుచున్..
అరసి చూడు కవిత్వమధుపా
త్రములు, సూక్తుల మౌక్తికాహా
ర్యములు నియతీ బద్ధసౌల
భ్యమ్ము లివి నీకే సొంతముల్!
ఇవియ లుప్తము లైనచో నీ
భవ్యసంతతి కేమొసంగుదు
వోయి వారల కాత్మప్రత్యయ
స్థైర్య స్థేమాపైత్రుకములన్?
