[శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘పర్వం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
శ్రావణ మాసం
పర్వత శ్రేణి పంక్తుల
అధిరోహణ ఉత్సాహాల
ఉత్సవాలను తెచ్చింది.
పట్టు విడుపు లేని స్నేహ బంధాలకు
పూనిక హృదయానురాగాల
సేతువును కట్టింది.
గగన మేఘం జలదరించింది.
మంగళ గౌరీ పూజకు
కాటుక పట్టిన గరిటె
కంటికి చలువనిచ్చింది.
శుక్రవారం వ్రతానికి
పచ్చి శెనగల వాయనం
వానజల్లు తడికి మోపెడయింది.
చంద్రుడు విరిసిన పున్నమి రోజున
సోదరి అనుబంధాలకు
నూలు పోగుల దారాల
మిలమిలల రాఖీ
అన్న దమ్ముల మణికట్టున మెరిసింది
గాయత్రీ మంత్ర మహిమల
కొత్త జందెపు తాడు
బ్రహ్మ వర్చస్సుకు ఎడమనుంచి కుడికి
నవ జన్మమిచ్చింది.
సిందూర్ సౌభాగ్యానికి
పడతుల వీరోత్సాహం
మెట్టున నిలిచిన
పొడుగు గడల జెండాను
ఎగురవేసింది
స్వాతంత్ర్యోత్సవ సంబరానికి
వనితా సైనిక దళం
విజయానికి
అండగా ముందడుగు వేసింది.
కృష్ణుని పుట్టిన రోజు వేడుకకు
ప్రతి ఇంట లాలి పాటల ఊయల
యశోదమ్మ తల్లి మనసును
పసివాని చిలిపి నవ్వుకు
అంకితం చేసింది.
ఆది జానపద కళల సంపద మెరిసింది
బ్రతుకు తెరువు దు:ఖాలను
తొలగ త్రోసుకున్న జనత
జీవన సౌందర్య క్రాంతికి
సాస్కృతిక పర్వ ఆచరణాల కు
తరగని ఫోటో లను తీసింది
భావి తరాల సామరస్యానికి
మానవతాదర్శాల విలువలను
నిలిపింది.
ఎడతెగని ఆశల తీరాలను
అలలుగ పొంగి చేరింది.
వివాదాలు లేని విశ్వైక్య తీరాలకు
కలసి కట్టుగ నడచింది.
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
