Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పర్వత స్తవం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘పర్వత స్తవం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

బ్బులతో సల్లాపిస్తూ
వీక్షకులను ఆకర్షిస్తూ
విస్మయాన్ని కలిగిస్తూ
పర్వతాల ఎత్తులు ప్రశంసింపబడుతుంటాయి!
“మమ్మధిరోహించగలిగే
మేరు నగ ధీరులెవ్వరు?” అంటూ
ఎవరెస్ట్ వంటి ఎత్తైన పర్వతాలు
ఎదుటివారిని ప్రశ్నిస్తుంటాయి!

పచ్చని పర్వతాల లోయల హొయలును,
సానువుల సౌందర్య లహరులను,
జాలువారే ఝరుల సోయగాలనూ
ఆనందంగా అవలోకిస్తూ
సృష్టిని స్తుతించని దృష్టి ఉండదు!

మధుర ఫల ప్రదాతలుగా
శీతల ఛాయా ఛత్రాలుగా
ప్రాణ వాయువును పంచే
వదాన్యులుగా
ప్రవర్తిల్లే పాదప పరివారాలకు,
ప్రశస్త వనమూలిక సంపదలకు,
వివిధ విహంగ సంతతులకూ
ఆశ్రయాలుగా,
తాపసులకు ధ్యానాశ్రమాలుగా
విలసిల్లే శైలరాజములను
సన్నుతించని స్వాంతముండదు!

దేశాలకు సహజ రక్షణ కుడ్యాలుగా,
జీవ జలాలకు జన్మ స్థానాలుగా
వినుతికెక్కిన గిరులు
అనేక కాల కథనాలకు సాక్షులు!

ద్యుమణి ద్యుతి స్పర్శతో
పసిడి కాంతి పుంజాల్లా ప్రకాశిస్తూ
పూర్ణ సోముని కాంతి సోకగానే
శోభాయమాన రజత వర్ణాన్ని
రంగరించుకునే
శిఖరాల శిరస్సులను దర్శిస్తూ
అబ్బురపడుతూ కొనియాడని
అంతరంగముండదు!

తరతరాల కాల పరీక్షలనోర్చుకుంటూ.
నిశ్చలంగా, నిటారుగా నిలిచివుండే
భూధరముల బలమైన పునాదిని,
భవ్యమైన వృద్ధినీ
జనులు కీర్తించవలసిందే!

నిశ్చల ధ్యాన మగ్న మహర్షుల్లా
విరాజిల్లుతూ
దేవతలు వేడుకతో వెలసేందుకు
పవిత్ర వేదికలైన
పావన పర్వత పాదాలకు
నత మస్తకులై నమస్కరించే
నరులు ధన్యులు!

భానుని దర్శన భాగ్యాన్ని కలిగించే
ఉదయాద్రికి,
వియన్మణికి విశ్రాంతి మందిరమయ్యే
పశ్చిమాద్రికీ
భక్తితో ప్రణమిల్లడం యుక్తం!
కైవల్య పురి అయిన కైలాసగిరికి
గౌరవంతో కైమోడ్పులర్పించడం ఔచిత్యం!

క్షీర సాగర మథనానికి సహకరించిన
మందరాచల మహిమను,
లంకకు లంఘించేందుకు
పవన సుతునికి తోడ్పడిన
మహేంద్రగిరి గరిమను,
లక్ష్మణ స్వామి ప్రాణాన్ని పరిరక్షించేందుకు సాయపడిన
సంజీవనీ పర్వత మహత్వాన్నీ
దండిగా కీర్తించడం ధర్మం!

శిల్పాచార్యుల
నిరుపమాన నైపుణ్యానికి
నిదర్శనలుగా నిగిడే
అజంతా, ఎల్లోరా గుహలతో,
సృష్టికర్త
అనన్య సామాన్య చాతుర్యానికి
నిరూపణలుగా నిలిచే
బెలుం, బొర్రా వంటి కందరాలతో
అలరారుతూ
గణనీయ చరితను,
స్మరణీయ ఘనతనూ చాటే
శైల రాజములకు
జేజేలు అందించడం సబబు!

తునాతునుకలు కావింపబడ్డ
కొండలు సైతం
వివిధ నిర్మాణాలకు వినియోగబడడం
వాటి ఔన్నత్యం!
ఆ పరివర్తన
ఆ పరోపకారం ప్రశస్తం!

జగజ్జనని
శైల సుత కావడం,
శివ పార్వతుల నివాసం
రజతాద్రి కావడం
ఆ పర్వతాలు చేసుకున్న
పుణ్యానికి పరాకాష్ఠ!
వాటి సుకృతానికి దక్కిన ప్రతిష్ఠ!

Exit mobile version