[పి. బి. షెల్లీ ప్రఖ్యాత కవిత To a Skylark లోని ఒక ఖండిక స్వేచ్ఛానువాదం అందిస్తున్నారు శ్రీ నాగరాజు రామస్వామి.]
జయహో ఓ స్కైలార్క్!
స్వేచ్ఛా పక్షాల చలాకీ చైతన్యమా!
ఎవరన్నారు నీవు పక్షివని?
ఎవరన్నారు నీవు ఇచట ఉన్నావని?
ఏ ఆకాశ దివ్య సీమల నుండో కదా
నీవు అలవోకగా నీ ఎదను పిండి
సుకళాసుస్వరాలను వర్షిస్తుంటావు!
ఓ పాటల పక్షీ!
నీవు
మేఘజ్వాలలా
అశరీర ఆనంద ఖేలలా
పసిడి సంజ కెంజాయలు తళుకొత్తే మేఘాల మీద తేలాడతూ,
నీలి లోతుల్లోకి రెక్క విప్పుతూ
పాడుతూ పాడుతూ పరుగిడుతుంటావు,
పైపైకి ఎగురుతుంటావు.
నీవు
కవి ప్రతిభను మించిన కవన కౌశల్యానివి,
ఊహల కాంతి మాటున దాగిన కవివి,
నిరంతరం పాటలు పాడుకుంటూ నింగికెగిరే నిత్య సంతోషివి;
పంచు నాకు సగమైనా నీ సంతోష నైజాన్ని
నా పెదాలు గుండా
నీ ఉన్మత్త ఉద్గమ గీతాలు ప్రవహించేలా,
నీ మధుర గీతానికి నేను మైమరచినట్టు
ప్రపంచం నీ పాటలకు పరవశించేలా.
