[డా. శ్రీమతి కోఠారి వాణీచలపతిరావు రచించిన ‘పతి పాదాలు’ అనే హాస్య, వ్యంగ్య కథని అందిస్తున్నాము.]
పతి పాదాలకు ఒకప్పుడు డిమాండ్ బాగా వుండేది. పురాణ పతివ్రతల కథల్లో అయితే గిరాకీ మరీ ఎక్కువ. పత్నులు పాదపూజల కోసమని పతుల వెంటబడి “ప్రాణనాథా మీ పాదాలను ఇటు ఇండు. పన్నీటితో ప్రక్షాళన చేసుకొని, పసుపుకుంకాలు, పూలతో బూజించుకొని సేవ చేసుకుని జన్మధన్యతను గాంచెదను” అని వేడుకునేవాళ్ళు.
అసలు దీనికంతటికీ మొట్టమొదటి కారణం ఆ శ్రీమహాలక్ష్మి! ఆమెననాలి అసలు. పాలకడలిలో శేషతల్పం మీద తలకింద చెయ్యి పెట్టుకొని దర్జాగా పడుకొని ఉన్న ఆ శ్రీమహావిష్ణువుకు కాళ్ళవైపు కూర్చొని పాదాలు వత్తుతూ ఉంటుంది. అది చూసే ఈ పురాణ పతివ్రతలంతా భార్త పాదాలు వత్తే పనికి క్యూ కట్టారు.
పెళ్ళాం కాళ్ళు వత్తుతానంటే ‘వద్దు’ అని నిరాకరించే పురుష పుంగవులు ఎవరుంటారు చెప్పండి – కాళ్ళ నొప్పులు ఉన్నా లేకున్నా పాదాలను తీసుకెళ్ళి ఆమె ఒళ్ళో పెడతారు “సేవ చేసుకో” అంటూ. అలా మొదలైన ఈ పతి పాదసేవ అనే అంటురోగం అలా అలా పాకి ఈ భూలోకంలోకి దిగబడటమే గాక సినిమాల్లోకి కూడా ఎక్కేసింది. అందులో ఆ కాలం సినీతార అంజలికి ఫస్టు మార్కులు. సావిత్రికి సెకండ్ మార్కులు పడిపోతాయి. కొంచెం వెనక్కిపోతే ఇంకొకావిడ శ్రీరంజని అని ఉండేది. వీళ్ళు ముగ్గురూ కలిసి ఆ కాలం సినిమాల్లో మొగుళ్ళ పాదాలు పాచిపట్టే దాకా ఎన్నిసార్లు కడిగి వుండారో, అది లెక్కల కందని విషయం. దానికి తోడు “నాథా! ప్రాణనాథా, మీ పాద సేవ తప్ప నేను మరొకటి ఎరుగును. అలాంటి నన్ను ఇల్లు విడిచి వెళ్ళిపోమ్మందురా. మీ సేవకు దూరమగుట అన్న ఆలోచననే నేను సహించలేను. మీ పాదలముల చెంత నాకింత తోటు ఇవ్వండి స్వామీ!” అంటూ అరిగిపోయిన పాతరికార్డు లాంటి డైలాగులు చెబుతూ కంటికీ మింటికీ ఏకధారగా విలపించారు ఈ పతివ్రతలు. పెళ్ళయినప్పుటి నుంచీ ప్రతి రోజూ పతి పాదాలను తప్ప ఆయన మొహాన్ని ఎప్పుడూ చూసిన దాఖలాలు ఏ పురాణంలోనూ, ఏ సినిమాలలోనూ కనిపించవు. ఆడవాళ్ళకు ఆ ‘పని’ తప్ప మరో పని లేదన్నట్టు చెంబులకు చెంబులు నీళ్ళు పెట్టి ఓ కడిగేస్తూ ఉంటారు. వాటర్ స్కేర్సిటీ ఆ రోజుల్లో ఉండేది కాదు గనుక సరిపోయింది. అదే ఈ రోజుల్లో అయితే?! అయినా ఈ మగవాళ్ళకు ఏం తీపరం – పెళ్ళాం ‘పాద సేవ’, ‘పాద సేవ’ అంటూ ఎంత వెంటబడితే మాత్రం “వద్దు – నీ ఆత్మాభిమాన్ని కించపరుచుకోవద్దు” అని చెప్పకుండా ఛాన్స్ దొరికిందింతే చాలన్నట్టు కాళ్ళు జాపెయ్యడమేనా?
అలా చకచకా పరుగులు తీస్తోంది ప్రఖ్యాత ఫెమినిస్ట్ రచయిత్రి ఆయిన పంకజం చేతిలోని పెన్ను. “ఎంత సేపే ఆ రాత? లేచి కాస్త ఇంట్లో పని చెయ్యాటం అనేది లేదా – మీ నాన్నగారికి ఆఫీసుకు లేటవుతోంది. తమ్ముడు స్కూలుకు వెళ్ళాలి” అంటూ చదవటం మొదలు పెట్టింది వెనక నుంచి పంకజం తల్లి పార్వతమ్మ. దాంతో ఛయ్యిన లేచింది కోపంలో పంకజం. “అమ్మా, ఈ ఇంట్లో ఎప్పుడూ నీకంటికి మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు కనబడరా? నేనూ కాలేజీకి వెళ్ళాలి. నాకూ టైమవుతోంది. అలాంటప్పుడు ‘నీకూ కాలేజీకి లేట్ అవుతోంది’ అనాలి కదా. అలా అనకుండా ‘పని చెయ్యాలి’ అంటావేంటి. నాన్నా, తమ్ముడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరా? మగవాళ్ళయితే ఇంటి పనులు చేయకూడదని రూల్ ఎక్కడైనా వుందా?” అంటూ తల్లి మీద గయ్యన లేచింది పంకజం.
ఇంతలో బెడ్ రూమ్‌లో నుంచి షర్టు బటన్ పెట్టుకుంటూ బయటకి వచ్చిన తండ్రి సుదర్శనం సీదా వంటింట్లోకి వెళుతూ -“పార్వతీ నా కాళ్ళ నొప్పులు గాయబ్. నీ చేతుల్లో ఏ మహత్యం ఉందోగానీ ఇలా పది నిముషాలు వత్తావో లేదో అలా గాయబయిపోయ్యాయి” అన్నాడు.
దాంతో తెగ ఖంగారు పడిపోయి “ఉష్ – ఉష్” అంటూ నోటితో శబ్దాలు చేస్తూ చూపుడువేలుతో ‘నీ వెనుక నీ కూతురుంది’ అన్నట్టు సైగ చేసింది.
వెనక్కు తిరిగి చూసిన సుదర్శనం పంకజాన్ని చూసి గతుక్కుమన్నాడు. అయినా ఏం లాభం? సుదర్శనం మాటలు ఆమె చెవిలో పడనే పడ్డాయి.
“నాన్నా, అమ్మతో కాళ్ళు పట్టించుకుంటున్నావా? ఛ! ఛ! సిగ్గనిపించలేదూ నీకు? అమ్మంటే ఎలాగూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని మనిషి. ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న విషయం కనీసం నీకు కూడా తట్టలేదా? ఇట్ ఈజ్ టూ బ్యాడ్ నాన్నా” అంది పంకజం గుడ్డురిమి చూస్తూ.
దాంతో ఏం చెప్పాలో అర్ధం కాలేదు సుదర్శనానికి. “అదీ.. అదీ.. నిన్న బయట బాగా తిరిగానమ్మా పనులమీద అందువల్ల కాళ్ళు బాగా నొప్పులు పుట్టాయి.” అంటూ నసిగాడు.
“అమ్మ ఇంట్లో అస్తమానం అటూ ఇటూ తిరుగుతూ బోలెడు పనులు చేస్తుంది. నీకు నిన్న ఒక్కరోజు కాళ్ళు నొప్పులు పుట్టాయోమో గానీ ఆమెకు రోజూ పుడుతుంటాయి. మీ పెళ్ళయిన ముప్పయ్యేళ్ళ కాలంలో ఒక్క రోజుయినా నువ్వు ఆమె పాదాలు వత్తావా?” అని తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది పంకజం.
తీక్షణమైన ఆ చూపులను తట్టుకోలేక రెప్పలు కిందికు వాలుస్తూ – “సారీ అమ్మా, భార్యతో కాళ్ళు పట్టించుకోవడం ఆమె ప్రెస్టీజీకి భంగమన్న ఆలోచన నాకు రాలేదు. అంతే కాదు – నా ఇంట్లో ఓ స్త్రీవాద రచయిత్రి ఉందన్న ఆలోచన కూడా అప్పుడు రాలేదు నాకు. మరోసారి అలా జరగదులే” అన్నాడు సుదర్శనం కూతురికి భరోసా ఇస్తూ.
“ఇలాంటివి ఎవరికీ ఎవరూ చెప్పాల్సిన విషయాలు కాదు నాన్నా. భార్య అంటే బానిస కాదు. సేవకురాలు అస్సలు కాదు. తనూ నాతో సమానం అన్న స్వంత ఆలోచనలు ప్రతి మగవాడిలోనూ వాటంతట అవి కలగాలి. అంటే వంటబట్టాలి.” అని అంటుంటే ఆ సమయంలో భర్త ముఖం చూసిన పార్వతికి బోలెడు జాలేసింది.
“మీకు ఆఫీసుకు టైమ్ అవుతుంటే ఇప్పుడు ఇలా కబుర్లులో పడిపోయారేంటి? వెళ్ళండి. వెళ్ళండి ” అంటూ ఆయన్ని తొందర పెట్టంది. అది చూసి “అమ్మా నీ పతి భక్తికి నా జోహార్లు. మీ ఆయన్ని నేనేమీ అనటం లేదు. నిన్ను గౌరవించమని చెబుతున్నాను.” అన్న పంకజం మాటలు వినీవనట్లు నటించారు ఇద్దరూ.
***
మరీ వెనకటి కాలం నుంచి, కాస్తంత మధ్యకాలానికి వచ్చేసరికి పతి పాదాలకు కొద్దిగా డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ‘నా పతి పాదాలంటే, నా పతి పాదాల’ని ఆడవాళ్ళు ఆ పాదాల కోసం ఎగబడి పోవటం లేదు. ఏ మగాడికయినా ఇద్దరు పెళ్ళాలున్నప్పటికీ కూడా పాదసేవకు ‘నువ్వంటే నువ్వ’ని వాదులాడుకుంటున్నారు తప్ప పోట్లాటలు పడటం లేదు. అంటే రుక్మిణి స్థాయి నుంచి సత్యభామ స్థాయికి కొంచం కిందికి దిగారు అన్నమాట.
ఒకప్పటి పాచిపట్టే పతి పాదాల డైలీ సేవలు పోయి ఇప్పుడు శ్రావణ శుక్రవారాలకు పరిమితమైపోయాయి. అంటే ‘స్పెషల్ డే సర్వీస్’ మాత్రమేనన్న మాట. మోడరన్ భావాల, ఫెమినిస్ట్ సిద్ధాంతాల పంకజానికి అది కూడా చిరాకుగా ఉంది.
కొత్తగా పెళ్ళయిన కూతురికి అంటే తనకు శ్రాణ శుక్రవారం నోము పట్టిస్తానన్న తల్లి మీద గయ్యిన లేచింది.. “ఎందుకే నోము నోచటం?” అని.
“భర్తకు దీర్ఘాయుషునిమ్మనీ, తన పసుపు కుంకాలను పది కాలాలా పాటు చల్లగా చూడమనీ ఆ పార్వతీ దేవిని వేడుకోవటానికి” అని సమాధానం ఇచ్చింది తల్లి.
“ఆయన కోసం నేనెందుకు చెయ్యాలి నోము. ఆయన దీర్ఘాయుషు కోసం నేనెందుకు చెయ్యాలి.. నా కోసం ఆయనేమన్నా పూజలూ, వ్రతాలూ చేస్తున్నాడా. ఆయన కోసం ఆయన్ని నోము నోచుకోమను కావాలంటే! నా క్షేమం కోసం ఏదయినా నోముంటే చెప్పు నేను నోచుకుంటాను” అని తల్లితో వాదించింది పంకజం.
ఆ మాటల్ని ఎవరయినా విన్నారేమోనని భయపడుతూ అటూ ఇటూ తల తిప్పి చూసి “అలా మాట్లాడకే ఎవరన్నా వింటే ఈ తల్లి పెంపకం ఇలా ఏడ్చిందేమిటి అని నన్ను ఆడిపోసుకుంటారు. ఇది తరతరాలుగా మన ఆడవాళ్ళు నోచుకుంటున్న నోము. కాదంటే మగవాళ్ళు ఏమీ అనుకోరేమో గానీ మన ఆడవాళ్ళే ఆక్షేపిస్తారు. అయినా నీ స్త్రీవాద చర్చలు, ఉద్యమాలు, స్లోగాన్లు బయట చేసుకుంటే చేసుకోగానీ ఇంట్లోకి తేకే!” అంది పార్వతమ్మ.
“అదేంటి? ఇంట్లో ఒక తీరుగా, బయట మరొక తీరుగా ఉండనా? మనస్సాక్షి అంటూ ఒకటి వుంటుందని నీకు తెలియదా? అయినా దీనికంతటికీ కారణం ఆడవాళ్ళు ఈ పసుపుకుంకాల సెంటిమెంట్. పుట్టినప్పటి నుంచీ బొట్టు పెట్టుకుంటున్నాం.. అయినా అప్పడు లేని సెంటిమెంట్ ఈ పెళ్ళయి మొగుడు రాగానే ఎందుకు మొదలవుతుంది” అంటూ వాదించింది పంకజం.
“నీతో వాదించలేను గానీ నీ మొగుడి కోసం కాకపోయినా పోనీ నా కోసం నేను అడిగినందుకు చేసుకుంటున్నానని చేసుకో” అంటూ బ్రాహ్మడిని పిలిచి బలవంతాన కూతురితో వరలక్ష్మీ వ్రతం నోము నోమించింది ఆమె.
అత్తగారూ వాళ్ళూ ‘శ్రావణపట్టి’ తీసుకొని వచ్చారు. పెళ్ళాం నోముకుంటుంటే చూద్దామని పంకజం భర్త సుందరం కూడా వచ్చాడు. పెళ్ళయిన సంవత్సరం నుంచీ “మగ, ఆడ” అంటూ లెక్చరిస్తూ “మీకన్నా మేమేం తక్కువ?” అంటూ వంతుకు వస్తున్న పెళ్ళాన్ని చూస్తున్నాడు. “సగం ఇంటి పని నీదీ, సగం ఇంటి పని నాదీ” అంటూ ఆమె ఊడ్చి, తనతో మాపింగ్ స్టిక్‌తో ఇల్లంతా తుడిపించి, ఆమె బట్టలుతికి తనతో ఆరేయించే ఇల్లాలు, పూజ ఎలా చేసుకుంటుందో చూద్దామని వచ్చాడు. అందులోనూ ‘తన’ కోసం ‘ఆమె’ చేసే ఆ వ్రతం ఎంత ముచ్చటగా ఉంటుందో చూద్దామని అనుకున్నాడు. నోము ముగిసి, నెత్తి మీద కథాక్షింతలు వేసుకున్న తర్వాత “మీ భర్తగారి పాదాలకు నమస్కరించండమ్మా!” అన్నాడు పురోహితుడు. ఆయన అలా అనగానే అంత వరకూ కుర్చీలో కూర్చుని ఉన్న సుందరం ఠక్కున లేచి వచ్చి తన పాదాలు పెళ్ళాం ముందు పెట్టి నిల్చున్నాడు.
ఆ చర్యతో పంకజం మనసు పొయ్యి మీద అన్నంలా కుతకుతా ఉడికిపోయింది.
పార్వతమ్మ గుండె పీచుపీచుమంది, ‘ఇప్పుడు కూతురు నోరెక్కడ విప్పుతుందో’ అని.
పీట మీద కూర్చున్న పంకజానికి చూపులు నేల వాల్చి మొగుడి పాదాల వంక చూస్తూంటే అప్పుడు అవి చాలా క్లోజప్‌లో కనిపించి ఆమె మనసు మంటను మరింత హై ఫ్లేమ్‌లో పెట్టేసాయి.
“మహానుభావుడు, పొద్దునెప్పుడో స్నానం చేసి ఆ తర్వాత ఈ ఊరి మట్టి వీధుల్లో ఎక్కడెక్కడో తిరిగి వచ్చినట్టున్నాడు. కాళ్ళన్నా కడుక్కున్నాడో లేక ‘పెళ్ళాం కడుగుతుందిలే’ అని డైరెక్టుగా అలాగే వచ్చాడో, ‘పాద సేవ’ ప్రోగ్రాం వంటిదేదయినా ఉండకుండా వుంటుందా అని” మనసులో అనుకుంది పంకజం.
పంకజం మనసులోని ఆలోచనలు తెలియని బ్రాహ్మడు “పెట్టమ్మా, పతియే ప్రత్యక్షదైవం అని అన్నారు” అని అన్నాడు. దాంతో వెంటనే అందుకుంటూ “ఎవరన్నారు శాస్త్రిగారూ?” అని అడిగింది పంకజం.
ఆ సౌండ్‌కి అదిరిపడ్డ శాస్త్రిగారు “మన పురాణాలూ, శాస్త్రాలూ ఘోషిస్తున్నాయమ్మా” అని అన్నాడు.
“మీ ముందు అవి అలా ఘోషించాయా? పతి పత్నికి పాదాభివందనం చేయాలని ఘోషించలేదా మరి?” అంటూ గర్జించింది పంకజం.
దాంతో ఊడిపోతున్న గోచీని, జారిపోతున్న ఉత్తరీయాన్ని సవరించుకుంటూ ‘నాకెందుకొచ్చిన గోల అసలే ఆడాళ్ళతో వ్యవహారం’ అనుకుంటూ సంచీ పట్టుకొని “మన సంస్కృతీ, సంప్రదాయాలు గోవిందా” అని గోవింద కొట్టుకుంటూ పరుగులంకించుకున్నాడు ఆయన.
***
ఇప్పుడు, ఇది మోడ్రన్ యుగం. స్త్రీవాదం మరింత బలంగా బల్లలన్నీ గుద్ది గుద్దీ బద్దలైపోతున్నంత తీవ్రస్థాయిలో వినిపిస్తున్న కాలం. కనుక ఈ కాలంలో పుట్టి ఆ భావాలను వింటూ, మెదడుతో తింటూ పెరిగిన పంకజం కూతురు ప్రమీల తల్లి కన్నా నాలుగు ఆకులేంటి నలభై ఆకులు ఎక్కువ చదువుకుంది.
మహాభారతంలోని ప్రమీల ఆడ సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు ఈమె కూడా ఓ ఆడ గ్యాంగ్‌ను ఉగ్రస్త్రీవాదం అన్నంత హై లెవల్లో తయారు చేసి మీటింగులు పెట్టి మరీ స్పీచ్‌లు దంచుతోంది. ఇక ఇంట్లో అయితే ఆ ఆడవాళ్ళిద్దరికీ మగ వాసన గిట్టదు. అడవుల్లో ఉండే బ్రహ్మరాక్షసి మనిషి పొడ తగలగానే “నరవాసన నరవాసన” అంటూ ముక్కుపుటాలు ఎగరేసుకుంటూ తిరిగినట్టు, పురుష వాసన తగిలితే చాలు రెచ్చిపోతారు తల్లి కూతుళ్ళిద్దరూ, వాళ్ళ మీద పడి తినేసేతింతలా ఊగిపోతూ. అప్పుడెప్పుడో అనుకోకుండా ప్రమాదవశాత్తు తల్లి ప్రోద్బలంతో పెళ్ళయిపోవటంతో ఆయన తప్పేమీ లేకున్నా ఎలానయినా వదిలించుకోవాలన్న పంతంతో మొగుడి నుంచి డైవర్స్ తీసుకోని “సోలో బతుకే సో బెటరూ” అని పాట పాడుకుంటూ హాయిగా తిరుగుతోంది పంకజం. ఆ అమ్మ కూతురు అయిన ప్రమీల తెలివిగా “నేనసలు పెళ్ళే చేసుకోను.. అంతగా అవసరమయితే ఎవడో ఒకడితో ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’ పెట్టుకుంటాను” అని, ఆ ప్రయత్నంలో వుంది.
దాంతో ఈ పతి పాదాల న్యూసెన్సే లేకుండా పోయింది వాళ్ళకు. తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరయినా తను ఎంత చెప్పినా వినకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం వాళ్ళకు సలహా ఇస్తోంది.
“పతి పాదాల కాలం ఏనాడో పోయింది. అది పాత చింతకాయ పచ్చడి. పతివ్రతల కథల్లో ఒకప్పుడు ఉండి చచ్చేది. ఇప్పుడు అదంతా జాన్తా నై” అని.
అదనంగా ఏం ఎడ్వయిజ్ ఇస్తోందంటే “ఎవడన్నా ‘పా.. ద.. సే.. వ’ అన్నమాట ఎత్తితే అస్సలు సహించకండి. అయినా వినకుంటే ముందు ‘పత్నీపాద సేవ’ అని మీరూ మీ కాళ్ళు జాపి కూర్చోండి. అలా టిట్ ఫర్ టాట్ అన్నట్టు సమాధానం చెప్పకుంటే ఈ మగవారు మన మీద మరింత జులుం చెలాయిస్తారు. ఎంత కాలమని వీళ్ళ అధిక్యభావాల్ని భరించాలి మనం..? డిమాండ్ ఉన్న దానికి కొంత కాలం తర్వాత డిమాండ్ తగ్గిపోయి అంతగా డిమాండ్ లేదు అనుకున్న దానికి డిమాండ్ పెరిగి పోవడం అన్నది అదొక సామాజిక సూత్రం. ‘ఓడులు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత అన్ని విషయాలలోనూ నిజం కావడం లేదూ. ఇదీ అంతే. కొన్నాళ్ళు మొగుళ్ళ కాలం. మరి కొన్నాళ్ళు పెళ్ళాల కాలం. ఇప్పుడు బాల్ మన కోర్టులో వుంది.. ఆడుకుందాం.. ఆడిద్దాం” అంటూ మోడ్రన్ లేడీస్ థియరీని వాళ్ళకు బోధిస్తోంది.
ఈమె మాటల్ని వాళ్ళు వింటారో వినరో, వింటే ఎంత వరకు వింటారో గానీ ఈ పైత్యం వాళ్ళలోనూ చేరిందంటే అప్పుడు ఇక పతి పాదాల మాట దేవుడెరుగు పత్ని పాదాలు సింహాసనం ఎక్కి కూర్చొని పాదపూజలు, పాద సేవలు అందుకోవటం ఖాయం!
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 1500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448
